2019-20
TELUGU STUDY MATERIAL
CLASS: 10
ఉపవాచకం : రామాయణం |
Name: Section:
…………………………………………………………………………………………………………………………………………………………………………………………………..
(10వ తరగతి ఉపవాచకం)
రామాయణం
పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు :
విస్తార పఠనం అలవరచుకోవడం
మన ఇతిహాసాల గురించి తెలుసుకోవడం
నైతిక విలువలు పెంపొందించుకోవడం
కథను సొంతమాటల్లో చెప్పగలగడం
1. రామాయణాన్ని ఎందుకు చదవాలి ?
జ: రామాయణం మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం. ఈ కథ మానవహృదయాల నుoడి ఎప్పటికీ చెరగదు. రామాయణం జీవిత పార్శ్వాలను ఎన్నింటినో కనబరుస్తుంది. రామాయణంలో అమ్మానాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యాను రక్తి, స్నేహఫలం ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన వంటి జీవిత పార్శ్వాలు ఎన్నో దీనిలో కనబడతాయి.
రామాయణాన్ని చదవదంటే, జీవితాన్ని చదవడమే. రామాయణం ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమమైన ధర్మాలను ఆచరిస్తే, మనిషి మనీషిగా ఎలా ఎదగగలడో, రామాయణం నేర్పుతుంది. చిన్నచిన్న పాత్రల ద్వారా రామాయణం గొప్ప సందేశాన్ని అందిస్తుంది. రామాయణంలో వాల్మీకీ మహర్షి మారీచుని వంటి రాక్షసుని నోటినుండి, “రామో విగ్రహవాన్ ధర్మః, సత్యధర్మ పరాక్రమః” అనే గొప్ప మాటను పలికించాడు. రాముడి వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శకావ్యం ‘నభూతో నభవిష్యతి’ అంటే “పూర్వమందు లేదు, ముందు కాలంలో రాబోదు” మనిషి ఉన్నంతవరకు రామాయణం ఉంటుంది.
రామాయణం ప్రపంచ సాహిత్యంలోనే ‘ఆదికావ్యం’. వాల్మీకీ సంస్కృతంలో దీనిని 24 వేల శ్లోకాలతో రాశాడు. రామాయణం ముందు తరాలవారికి స్ఫూర్తిని ఇస్తుంది. అందువల్లనే మనం రామాయణాన్ని తప్పక చదవాలి.
2. ‘రామాయణం’ ఏవిధంగా విశ్వరూపాన్ని చూపిందో రాయండి.
జ: ‘రామాయణం’ మానవ జీవిత మూల్యాలను చూపింపచేసే అక్షరమణుల అద్దం.అందుకే రామాయణం కొండలు, సముద్రాలు ఉన్నంతవరకూ ఉంటుందని బ్రహ్మ వాల్మీకి మహర్షికి చెప్పాడు. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. దీని తరువాత దేశవిదేశాలలో అనేక ప్రక్రియల్లో ఎన్నో రామాయణాలు వచ్చాయి. వీటన్నింటికీ మూలం “వాల్మీకి రామాయణం”. తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. రచయితలు కొందరు వాల్మీకి రామాయణ మూలాన్ని అనుసరించారు. కొందరు స్వతంత్ర పోకడలు పోయారు.
సంస్కృత సాహిత్యం - రామకథ : రామకథ వివిధ రూపాల్లో కనబడుతుంది. 1) ఆధ్యాత్మ రామాయణం 2)కాళిదాసు రచించిన ‘రఘువంశం’- దీనిలో రామకథతో పాటు అతని పూర్వుల చరిత్ర కూడా రాయబడింది. 3) చంపూ రామాయణం - భోజుడు దీనిని గద్యపద్యాలతో రచించాడు. 4) “రావణవధ” దీనిని భట్టికవి రాశాడు. 5) ’ప్రతిమానాటకం’ పేరుతో రామకథను భాసుడు రాశాడు. 6) ఉత్తర రామచరితం : భవభూతి నాటకంగా దీనిని రాశాడు. 7) రాఘవ పాండవీయం : రెండర్థాల కావ్యంగా భారత రామకథలు మేళవించి, ధనుంజయుడు దీనిని రాశాడు.
కాశ్మీరీ భాషలో దివాకర ప్రకాశభట్టు “రామావలోకచరిత”, “లవకుశ యుద్ధ చరిత” ను రచించాడు. మరాఠీలో సమర్థరామదాసు ‘రామాయణం’, మోరోపంతు రాసిన “లవకుశాఖ్యానమ్”, ‘మంత్రరామాయణమ్’ పేరు పొందాయి. వంగభాషలో కృత్తివాస ఓఝా “రామాయణానికి మంచి పేరుంది.తమిళభాషలో ‘కంబరామాయణం’ మలయాళంలో ఎళుత్తచ్చన్ “ఆధ్యాత్మ రామాయణం”, కన్నడంలో నాగచంద్రుడు రాసిన “రామచంద్ర చరిత పురాణం” చంపూ మార్గంలో సాగింది. ఒరియాలో సిద్ధేంద్రయోగి “విచిత్రరామాయణం” రాశాడు.
3. తెలుగులో వచ్చిన రామాయణాలను గురించి రాయండి.
జ: తెలుగు భాషలో రామాయణాలు : గోనబుద్ధారెడ్డి “రంగనాథ రామాయణం” తెలుగులో మొదటి రామాయణం. ఇందులో వాల్మీకి రాయని ఎన్నో కల్పనలు ఉన్నాయి. ఇది ద్విపద రామాయణం. తాళ్ళపాక అన్నమాచార్యుల రామాయణం, కట్టా వరదరాజు రామాయణం, ఏకోజీ రామాయణం ద్విపదలోనే సాగాయి. తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ తెలుగుజాతిపై ముద్రవేసింది. హుళక్కిభాస్కరుడు, అతని కుమారుడు మల్లికార్జున భట్టు, శిష్యుడు రుద్రదేవుడు, మిత్రుడు అయ్యలార్యుడు, “భాస్కరరామాయణం” రాశాడు. ఇక మొల్ల సంక్షిప్తంగా సుందరంగా రామాయణాన్ని తీర్చిదిద్దింది. అయ్యలరాజు రామభద్రుడు ‘రామాభ్యుదయం’ మంచి ప్రబంధం. తంజావూరు రఘునాథ నాయకుడు ‘రఘునాథ రామాయణం’ వాల్మీకిని అనుసరించి రాశాడు. గోపీనాథ వేంకట కవి ‘గోపీనాథరామాయణం’ రాశాడు. కంకంటి పాపరాజు ‘ఉత్తర రామాయణం’ రాశాడు.
కాణాదం పెద్దన “ఆధ్యాత్మ రామాయణం” రాశాడు. గద్వాల సంస్థానాధీశులు, ఆరుగురు కవులచే రామాయణాన్ని ఆంధ్రీకరింపజేశారు. వావిలికొలను సుబ్బారావు గారు “ఆంధ్రవాల్మీకి రామాయణం, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారి శ్రీకృష్ణ రామాయణం” పేరు పొందాయి. విశ్వనాథ సత్యనారాయణ గారి “శ్రీమద్రామాయణ కల్పవృక్షం” జ్ఞానపీఠ పురస్కారాన్ని సంపాదించింది. పింగళి సూరన ‘రాఘవ పాండవీయం’ ద్వ్యర్థి కావ్యాన్ని రాశాడు. నెల్లూరి రాఘవ కవి యాదవ రాఘవ పాండవీయం’ అనే త్ర్యర్థి కావ్యం రాశాడు. ఇవికాక తెలుగులో రామాయణం పాటలు, నాటకాలు, హరికథలు, స్త్రీల రామాయణం పాటలు, వచన కావ్యాలు వచ్చాయి.
1. బాలకాండం
1. వాల్మీకి మహర్షి రామాయణ రచనకు శ్రీకారం చుట్టిన విధానం గురించి తెలపండి.
జ: నారద మహర్షి ఒకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. “మంచిగుణాలు కలవాడూ, మాటతప్పనివాడూ, ధర్మం తెలిసినవాడూ మొదలైన శుభలక్షణాలు గలవాడు” ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా ? అని, వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్నించాడు “సాధారణంగా ఇన్ని విశిష్ట గుణాలు కలవాడు ఉండడు. కాని శ్రీరాముడిలో నీవు అడిగిన గుణాలన్నీ ఉన్నాయనీ, నారదుడు వాల్మీకికి రామకథను చెప్పాడు. నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు.
వాల్మీకి రామకథను గురించి ఆలోచిస్తూ, శిష్యులతో తమసానదీ స్నానానికి వెళ్ళాడు. అక్కడ ఒక వేటగాడు బాణంతో ఒక మగ క్రౌంచపక్షిని కొట్టి చంపాడు. వాల్మీకి హృదయంలో కరుణ రసం పొంగింది. “మానిషాద” అనే శ్లోకం ఆయన నోట వెలువడింది. వాల్మీకి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.
సృష్టికర్త అయిన బ్రహ్మ, వాల్మీకిని చూడడానికి ఆయన ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి బ్రహ్మకు ఉపచారాలు చేశాడు. బ్రహ్మ, వాల్మీకిని కూర్చోమన్నాడు. వాల్మీకి హృదయంలో ‘మానీషాద’ శ్లోకం, మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనించింది. బ్రహ్మ చిరునవ్వు నవ్వి వాల్మీకితో “నీవు పలికింది శ్లోకమే. ఈ ఛందస్సులోనే నీవు రామాయణం రాయి. ఈ భూమండలంలో పర్వతాలూ, నదులూ ఉన్నంతకాలం, ప్రజలు రామాయణగాథను కీర్తిస్తూనే ఉంటారు” అని చెప్పాడు. ఈ విధంగా బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం, వాల్మీకి మహర్షి రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు.
2. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం గురించి రాయండి.
జ: సరయూనదీ తీరంలో “కోసల” దేశం ఉంది. దాని ముఖ్యనగరం అయోధ్య. దాన్ని దశరథ మహారాజు పాలిస్తున్నాడు. దశరథుడు ధర్మపరాయణుడు. ఇతని పాలనలో దేశం, భోగభాగ్యాలతో విలసిల్లేది. ప్రజలు సుఖంగా ఉండేవారు. దశరథునకు సంతానం లేదు. సంతానం కోసం అశ్వమేథయాగం చేద్దామనుకున్నాడు. దశరథుని మంత్రి సుమంత్రుడు
అందుకు ఋష్యశృంగమహర్షిని పిలవమన్నాడు. ఋష్యశృంగుడు ఉన్నచోట వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఋష్యశృంగుడు మూడురోజులు అశ్వమేథయాగం చేయించాడు. పుత్రులకోసం యజ్ఞం చేయించమని దశరథుడు ఋష్యశృంగుని కోరాడు. ఇంతలో దేవతలు రావణాసురుడు తమను చిత్రహింస పెడుతున్నాడని బ్రహ్మకు చెప్పారు. రావణాసురుని బాధ తప్పే ఉపాయం చెప్పమని, దేవతలు బ్రహ్మను కోరారు.
బ్రహ్మ, దేవతలతో రావణాసురునికి మానవులవల్లనే మరణం ఉందని చెప్పాడు. ఇంతలో శ్రీమహావిష్ణువు వచ్చాడు. దేవతలు విష్ణుమూర్తిని మానవుడిగా పుట్టి రావణాసురుని సంహరించమని కోరారు. దశరథ మహారాజు ముగ్గురు భార్యలకూ నాలుగురూపాలలో పుత్రుడిగా పుట్టమని దేవతలు విష్ణువును కోరారు. విష్ణువు వారికి అభయమిచ్చాడు.
దశరథుడి పుత్రకామేష్ఠి యజ్ఞకుండం నుండి, బ్రహ్మ పంపించగా ఒక దివ్యపురుషుడు బంగారు పాత్రతో దివ్యపాయసం తీసుకొని వచ్చాడు. ఆ పాయసపాత్రను అతడు దశరథునికి ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచాడు.కౌసల్యకు రాముడు, కైకకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు.
3. రామలక్ష్మణులు విశ్వామిత్ర యాగాన్ని రక్షించిన వృత్తాంతాన్ని తెలపండి.
జ: రామలక్ష్మణులు దశరథుని పుత్రులు. ధనుర్విద్య నేర్చారు. విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చి, రాక్షసులు యజ్ఞానికి విఘ్నం కలుగజేస్తున్నారనీ, యజ్ఞ రక్షణకు రాముణ్ణి తనతో 10రోజులు పంపమనీ కోరాడు. రాముడికి ఇంకా 16 ఏళ్ళు నిండలేదని యజ్ఞరక్షణకు తానే వస్తానని దశరథుడన్నాడు. తన యజ్ఞానికి మారీచ సుబాహులు విఘ్నాలు కలుగజేస్తున్నారని విశ్వామిత్రుడు చెప్పాడు. రాక్షసుల మీదికి రాముణ్ణి పంపలేనన్నాడు దశరథుడు. విశ్వామిత్రునికి కోపం వచ్చింది. వశిష్ఠ మహర్షి దశరథునికి నచ్చచెప్పి, రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుని వెంట పంపాడు.
విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ అనే విద్యలు ఉపదేశం చేశాడు. ఆ విద్యల మహిమవల్ల రామలక్ష్మణులకు ఆకలిదప్పులు ఉండవు. మార్గమధ్యంలో తాటకి అనే రాక్షసి రాగా విశ్వామిత్రుని ఆజ్ఞతో రాముడు తాటక బాహువులను ఖండించాడు. లక్ష్మణుడు దాని ముక్కు, చెవులు కోశాడు. శబ్దభేరి బాణంతో రాముడు తాటకను చంపాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సిద్ధాశ్రమం చేరి, యజ్ఞదీక్ష చేపట్టాడు. మారీచ సుబాహులు యజ్ఞకుండంలో రక్తం కురిపించారు. మారీచుడిపై రాముడు ‘శీతేషువు’ అనే మానవాస్త్రాన్ని ప్రయోగించాడు. మారీచుడు సముద్రంలో పడ్డాడు. ఆగ్నేయాస్త్రంతో రాముడు సుబాహుణ్ణి చంపాడు. మిగిలిన రాక్షసులను, ‘వాయవ్యాస్త్రం’తో తరిమారు. మహర్షి యజ్ఞం చక్కగా పూర్తయింది.
4. సీతారాముల వివాహ వృత్తాంతాన్ని రాయండి.
జ: విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో “జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ ఒక మహాధనుస్సు ఉంది. అక్కడకు వెడదాo” అన్నాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట మిథిలకు బయలుదేరారు. దారిలో మహర్షి రామలక్ష్మణులకు తన వంశాన్ని గురించి, గంగ వృత్తాంతాన్ని గురించి చెప్పాడు. భగీరథుని వృత్తాంతo చెప్పాడు. మిథిలానగరం సమీపంలో వారు గౌతమమహర్షి ఆశ్రమం చూశారు. ఆ ఆశ్రమంలో అహల్యాగౌతములు ఉండేవారు. అహల్య తప్పుచేసిందని గౌతముడు అహల్యను వేల సంవత్సరాల పాటు అన్నపానాలు లేకుండా బూడిదలో పడిఉండమని శపించాడు. రాముని రాకతో ఆమెకు శాపవిముక్తి కలుగుతుందని చెప్పాడు. రాముడు మహర్షి ఆదేశంపై
గౌతమాశ్రమంలో కాలుమోపి, అహల్యకు శాపవిముక్తి కల్పించాడు.
మిథిలలో జనకమహారాజు వీరిని ఆదరించాడు. అహల్యా గౌతముల కుమారుడు శతానందుడు, రాముడికి కృతఙ్ఞతలు చెప్పాడు. జనకుడు రామలక్ష్మణులను ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు జనకునితో “వీరు దశరథ పుత్రులు రామలక్ష్మణులు. నీ ధనుస్సును చూద్దామని వచ్చారు. కాబట్టి ఆ ధనుస్సు చూపించు శుభం కలుగుతుంది” అని చెప్పాడు. జనకుడు శివధనుస్సు చరిత్రను వివరించి తన కూతురు సీత నాగటి చాలులో దొరికిందనీ, ఆ సీతను శివధనుస్సు ఎక్కుపెట్టగల వీరునికి ఇచ్చి పెండ్లి చేస్తాననీ చెప్పాడు. చాలామంది రాజులు శివధనస్సును ఎక్కుపెట్టలేకపోయారని కూడా చెప్పాడు. విశ్వామిత్రుడు శివధనుస్సును తెప్పించమన్నాడు. ఐదువేల మంది కలిసి శివధనుస్సు ఉన్న పెట్టెను సభలోకి తెచ్చారు. రాముడు పట్టుకోగానే శివధనుస్సు వంగింది. నారి ఎక్కుపెట్టగా ఆ ధనుస్సు ధ్వనిచేస్తూ విరిగింది.
జనకుడు సీతారాములకు పెండ్లి చేయడానికి సిద్ధం అయ్యాడు. దశరథునికి కబురు పెట్టారు. అయోధ్యనుండి అందరూ వచ్చారు. జనకుడు తన కుమార్తెలు సీతా, ఊర్మిళలను రామలక్ష్మణులకు, తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు మాండవిని, శ్రుతకీర్తిని భరతశత్రుఘ్నులకు ఇచ్చి పెండ్లి చేశాడు.
5. శ్రీరాముడు శివధనుస్సును విరిచిన విధానాన్ని తెల్పండి.
జ: జనకమహారాజు, విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు జనకమహారాజునకు రామలక్ష్మణులను చూపించి, ”వీరు దశరథ మహారాజు కుమారులు, వీరులు. మీ దగ్గర ఉన్న శివధనుస్సును చూడా లనుకుoటున్నారు” అని చెప్పాడు. జనకుడు శివధనుస్సు చరిత్రను చెప్పాడు. యాగం కోసం తాను భూమిని దున్నుతుండగా ‘సీత’ దొరికిందనీ, శివధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడే సీతకు తగిన భర్త అనీ అన్నాడు. పూర్వంలో రాజులెవ్వరూ శివధనస్సు ఎక్కుపెట్టలేకపోయారని జనకుడు చెప్పాడు. విశ్వామిత్రుడు జనకమహారాజు మాటలు విని శివధనుస్సును తెప్పించమన్నాడు. ఐదువేల మంది బలవంతులు శివధనుస్సు ఉన్న పెట్టెను తెచ్చారు. విశ్వామిత్రుని అనుమతితో రాముడు ధనుస్సు మధ్యభాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు. ధనుర్విద్యలో ఆరితేరిన రాముని చేయి తగలగానే శివధనుస్సు వంగింది. రాముడు వింటికి నారి సంధించాడు. అల్లెత్రాడును ఆకర్ణాoతంగా లాగాడు. పిడుగుపడ్డట్టుగా భయంకర శబ్దాన్ని చేస్తూ శివధనుస్సు ఫెళ్ళున విరిగింది. జనక విశ్వామిత్రులు, రామలక్ష్మణులు తప్ప, మిగిలినవారంతా మూర్చపోయారు.
6. “జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తమై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణం” సమర్థిస్తూ రాయండి.
జ: విశ్వామిత్రుడు యజ్ఞ రక్షణకై రాముని తన వెంట పంపించమని దశరథుని కోరాడు. వశిష్ఠుని హితవచనాలు విని, దశరథుడు రామలక్ష్మణులను విశ్వామిత్రునికి అప్పగించాడు. విశ్వామిత్రున్ని రామలక్ష్మణులు అనుసరించారు. వారు చాలా దూరం, సరయూనదీ తీరం వెంట ప్రయాణించారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ అనే విద్యలను బోధించాడు. ఆ విద్యల ప్రభావం వల్ల వారికి ఆకలిదప్పులు ఉండవు. రూపకాంతులు తగ్గిపోవు. నిద్రలో ఉన్న అజాగ్రత్తలో ఉన్న రాక్షసులు వారినీ ఏమీ చేయలేరు. మూడులోకాల్లో రామలక్ష్మణులను ఎదిరించి పోరాడేవారు ఉండరు. రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు. విశ్వామిత్రుని పాదాలు ఒత్తాడు. గురుసేవ విశేషఫలితాన్ని ఇస్తుంది. ఈ విధంగా జ్ఞానాన్ని పొందడంలో శిష్యులు నిరంతరం అప్రమత్తమై ఉండాలి. అదే ఉత్తమ విద్యార్థుల లక్షణం.
ఉత్తమ విద్యార్థులైన రామలక్ష్మణులు, గురువుగారు చెప్పినట్లు ‘తాటకి’ అనే రాక్షసిని సంహరించారు. అందుకు సంతోషించి విశ్వామిత్ర మహర్షి, రామలక్ష్మణులకు ఎన్నో దివ్యాస్త్రాలను ప్రసాదించాడు. గురువు అనుగ్రహిస్తే శిష్యునకు ఇవ్వలేనిది ఏమీ ఉండదు. జ్ఞానాన్ని పొందడంలో ఎప్పుడూ అప్రమత్తమై ఉండడం, ఉత్తమ విద్యార్థుల లక్షణం అని దీనిని బట్టి గ్రహించాలి. రాముడు అప్రమత్తమై ఉన్నందువల్లే, విశ్వామిత్రుడి నుండి అనేక విద్యలూ, శస్త్రాస్త్రములూ సంపాదించాడు.
7. దశరథుడు సంతానం కోసం చేసిన యాగాలు ఏమిటి ? యాగనిర్వహణ భారం ఎవరు వహించారు ?
జ: దశరథుడు సంతాన ప్రాప్తికోసం “అశ్వమేధయాగం”, పుత్రసంతానం కోసం “పుత్రకామేష్టి” యాగం చేశాడు. అశ్వమేధయాగం చేయాలి అనుకొన్నప్పుడు మంత్రీ, సారథీ అయిన సుమంత్రుని సలహా మేరకు ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించాడు. ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు. మూడురోజులపాటు అశ్వమేధయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించాడు. తర్వాత దశరథుని కోరిక మేరకు ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యాగభారాన్ని కూడా వహించాడు. ఈ యాగానికి బ్రహ్మాదిదేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు హాజరై దశరథుని కోరిక తీరాలని దీవించారు.
8. ‘భగీరధ ప్రయత్నం’ అనే జాతీయానికి సంబంధించిన కథను తెలపండి.
జ: భగీరధుడు పాతాళంలో బూడిదకుప్పలై పడిఉన్న సగరపుత్రులకు ఉత్తమగతులు కల్పించాలనుకున్నాడు. అందుకు ఆకాశంలో ఉన్న సురగంగను పాతాళానికి రప్పించాలి. దృఢసంకల్పానికి అసాధ్యమేమున్నది. బ్రహ్మకోసం తపస్సు చేసి అతని సలహా మేరకు గంగను ఒప్పించి, ఆకాశం నుండి దూకే గoగను భరించడానికి శివుణ్ణి మెప్పించి, గంగను నేలకు తెచ్చి జహ్నుడు అడ్డురాగా అతనిని ప్రార్థించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడక గంగను పాతాళం దాకా తీసుకువెళ్ళి పని పూర్తి చేయగలిగాడు. అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టువదలని సందర్భంలో భగీరధ ప్రయత్నం అనే జాతీయo ఏర్పడింది.
2. అయోధ్య కాండం
1. సీతారామలక్ష్మణులు వనవాసానికి వెళ్ళిన వృత్తాంతాన్ని తెలపండి.
జ: శ్రీరాముడు అంటే ప్రజలకు ఇష్టం. ప్రజల కోరిక మేరకు దశరథుడు రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామనుకుంటాడు. రాజాజ్ఞాతో మంత్రులూ, అధికారులూ రాముని పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దశరథుడు రామున్ని పిలిచి, పట్టాభిషేకం గురించి చెప్పి, రాజధర్మాలను బోధించాడు. సీతారాములు పట్టాభిషేకానికి ఉపవాసదీక్ష చేపట్టారు. రాముడి పట్టాభిషేకం వార్త, కైక దాసి మoథరకు తెలిసింది. వెంటనే వెళ్లి కైకకు చెప్పింది. కైక సంతోషించింది. కాని మంథర దుర్భోధతో, కైక మనస్సు మారింది. భరతుడికి పట్టాభిషేకం జరగడానికి, దశరథుడు వెనుక కైకకు ఇచ్చిన రెండు వరాలనూ ఉపయోగించుకొమ్మని, మంథర కైకకు సలహా ఇచ్చింది. కైక కోపగృహానికి చేరింది. దశరథుడు రాగానే కైక అతడిని రెండువరాలు కోరింది. అవి: 1) భరతుని పట్టాభిషేకం 2) రాముని వనవాసం. దశరథుడు రామున్ని అడవులకు పంపవద్దని కైకను బతిమాలాడు. కాని కైక మనస్సు మారలేదు.
కైక రామునికి కబురంపింది. రాముడు వచ్చి తండ్రిగారి విచారానికి కారణం ఏమిటని కైకను అడిగాడు. కైక రాముడికి తాను కోరిన వరాలను గురించి చెప్పింది. తండ్రిమాటను పాటిస్తానని రాముడు చెప్పాడు. కైక మాటపై రాముడు దండకారణ్యానికి బయలుదేరుతానన్నాడు. దశరథుడు దుఃఖించాడు. రాముడు తండ్రికీ, కైకకూ నమస్కరించాడు. తల్లి కౌసల్యను దర్శించాడు. రాముని వనవాసం గురించి విని కౌసల్య దుఃఖించింది. రాముడిని అడవికి వెళ్ళవద్దని తల్లి, లక్ష్మణుడు కూడా చెప్పారు. కాని రాముడు తండ్రి మాటనే గౌరవిస్తానన్నాడు.
కౌసల్య రాముని వెంట వనవాసానికి వస్తానంది. అది ధర్మం కాదు, తండ్రిగారి సేవ చేయాలని రాముడు తల్లికి నచ్చచెప్పాడు. సీత కూడా వనవాసానికి వస్తానంది. లక్ష్మణుడు కూడా రాముని వెంట వనవాసానికి వస్తానన్నాడు. సీతారామలక్ష్మణులు దశరథుని వద్దకు వెళ్ళారు. కైకేయి వారికి నారచీరలు ఇచ్చింది. వారు నారచీరలు ధరించారు. సుమిత్ర లకష్మణుడితో సీతారాములను తల్లిదండ్రులవలె సేవింపుమని ఉపదేశించింది. సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామలక్ష్మణులు రథం ఎక్కారు. పౌరులు వెంట బయలుదేరారు. ఈ విధంగా రాముడు భార్యాసోదరులతో అడవికి వెళ్ళాడు.
2. సీతారామలక్ష్మణులు అయోధ్యను వీడి, చిత్రకూటం చేరిన వృత్తాంతాన్ని తెలపండి.
జ: సీతారామలక్ష్మణులు సుమంత్రుడు తెచ్చిన రథాన్ని ఎక్కారు. శ్రీరాముడిని విడిచిపెట్టలేక, కొందరు పౌరులు రథానికి ప్రక్కలనూ, వెనుక భాగంలోనూ వేలాడారు. అయోధ్య ఆర్తనాదాలతో నిండింది. కౌసల్యను సుమిత్ర ఓదార్చింది. రాముని రథాన్ని ప్రజలు నీడలా అనుసరిస్తున్నారు. అయోధ్యకు వెళ్ళిపొండని రాముడు వారికి ఎంతగానో నచ్చచెప్పాడు. రాముడిని అయోధ్యకు తిరిగి రమ్మనీ లేక తమను అడవికి వెంటరానిమ్మనీ ప్రజలు రాముణ్ణి వేడుకున్నారు. రథం తమసానది దగ్గరకు చేరింది. ఆ రాత్రి ప్రజలు నిద్రిస్తుండగా రాముడు రథంపై బయలుదేరాడు. ప్రజలు లేచి చూశారు. తాము నిద్రపోయినందుకు తమను తామే నిందించుకొని అయోధ్యకు తిరిగి వెళ్ళారు.
రాముని రథం కోసలదేశo పొలిమేరకు చేరింది. రాముడు అయోధ్యవైపు తిరిగి నమస్కరించాడు. క్రమంగా వారు గంగాతీరానికి చేరారు. ఆ తీరంలో ‘శృంగిబేరపురం’ ఉంది. గుహుడు ఆ దేశానికి రాజు. అతడు శ్రీరాముని భక్తుడు. అతడు రాముని వద్దకు వచ్చాడు. రాముడు గుహుడికి ఎదురేగివెళ్ళి గుహుని ఆతిథ్యం తీసుకున్నాడు. గుహుడు గంగను దాటడానికి రామునికోసం నావను ఏర్పాటు చేశాడు. శ్రీరాముడు మర్రిపాలు తెప్పించి తనకూ, తమ్మునికీ జడలను సిద్ధం చేశాడు. అడవిలో ముందు లక్ష్మణుడు, వెనుక సీత, ఆ వెనుక రాముడు నడిచారు. వారు సాయంత్రానికి భరద్వాజాశ్రమానికి చేరారు. మహర్షి సీతారామలక్ష్మణులకు అతిథి సత్కార్యాలు చేశాడు. వనవాస కాలాన్ని తన ఆశ్రమంలో గడపమని భరద్వాజ మహర్షి వారిని కోరాడు.
జనులకు అందుబాటులో ఉండని, ఆశ్రమవాసానికి తగిన ప్రదేశాన్ని సూచించండని రాముడు భరద్వాజ మహర్షిని కోరాడు. పది కోసుల దూరంలో ఉన్న ‘చిత్రకూటం’ పవిత్రమైనదననీ, అది మహర్షుల నివాసస్థానం అనీ, భరద్వాజుడు వారికి చెప్పాడు. రామలక్ష్మణులు యమునను దాటి ‘చిత్రకూటం’ చేరుకున్నారు. లక్ష్మణుడు అన్న ఆదేశం ప్రకారం, అక్కడ కుటీరం నిర్మించాడు. సీతారామలక్ష్మణులు చిత్రకూటంలో వనవాసం చేశారు.
3. “భరతుని పాదుకా పట్టాభిషేకం” గురించి రాయండి.
జ: దశరథుడు శ్రీరాముని ఎడబాటును సహింపలేక ప్రాణాలు విడిచాడు. రామలక్ష్మణులు అడవికి వెళ్ళారు. భరతశత్రుఘ్నులు మేనమామ ఇంటిలో ఉన్నారు. వశిష్ఠుడి ఆజ్ఞ మేరకు, దశరథుని శరీరాన్ని తైలద్రోణిలో జాగ్రత్త చేశారు. దూతలు వెళ్లి ఎనిమిదవ రోజున భరతశత్రుఘ్నులను అయోధ్యకు తీసుకువచ్చారు. భరతుడు తండ్రికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. భరతుడు కైకను తప్పుపట్టాడు. శత్రుఘ్నుడు మంథరను చంపడానికి సిద్ధమయ్యాడు. మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం స్వీకరించుమన్నారు. పెద్దవాడైన రాముడే రాజు కావాలని భరతుడు పట్టుబట్టాడు. తాను వెళ్ళి రాముణ్ణి తిరిగి అయోధ్యకు తీసుకువస్తానని, భరతుడు అయోధ్యాపురవాసులతో కలిసి అడవికి బయలుదేరాడు. భరతుడు శృంగిబేరపురం చేరాడు. గుహుడు భరతుడి మనస్సు తెలియక తికమకపడ్డాడు. విషయం తెలిసి గుహుడు భరతుణ్ణి ఆహ్వానించాడు. భరతుడు గుహుడితో కలిసి, భరద్వాజాశ్రమం చేరి విందు స్వీకరించాడు. తరువాత చిత్రకూటం బయలుదేరాడు. భరతుడు సేనలతో వస్తూ ఉండటం చూసి, లక్ష్మణుడు పొరపాటుపడ్డాడు. భరతుడు రాముని మీదికి యుద్ధానికి వస్తున్నాడని, లక్ష్మణుడు రాముడికి చెప్పాడు. భరతుడు అటువంటివాడు కాదని రాముడు లక్ష్మణునకు చెప్పాడు.
భరత శత్రుఘ్నులు వెళ్లి రాముని పాదాలపై పడ్డారు. రాముడు కన్నీళ్ళు పెట్టాడు. రాముడు భరతునికి రాజనీతులు బోధించాడు. రాముణ్ణి అయోధ్యకు తిరిగి రమ్మని భరతుడు కోరాడు. రాముడు తండ్రిమాటే తనకు శిరోధార్యం అన్నాడు. చివరకు భరతుని కోరికపై శ్రీరాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు. ఆ పాదుకల మీదనే రాజ్యభారం ఉంచి, తాను నారచీరలు ధరించి, నగరం వెలుపల ఉంటాననీ, పదునాల్గవ సంవత్సరం పూర్తికాగానే, రామదర్శనం కాకపొతే తాను అగ్ని ప్రవేశం చేస్తానని భరతుడు రామునితో చెప్పాడు. భరతుడు నందిగ్రామం చేరి, రామపాదుకలకు పట్టాభిషేకం చేశాడు.
4. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి ఎందుకు వెళ్ళాల్సివచ్చింది?
జ: ప్రజల కోరిక మేరకు దశరథుడు రాముడికి యువరాజు పట్టాభిషేకం చేద్దామనుకుంటాడు. రామునికి దశరథుడు పట్టాభిషేకం గురించి చెప్పాడు. సీతారాములు ఉపవాస దీక్ష చేపట్టారు. రాముని పట్టాభిషేక వార్త కైక దాసి మంథరకు తెలిసింది. మంథర కైకకు దుర్భోధచేసి, ఆమె మనస్సును మార్చింది. కైకకు దశరథుడు వెనుక రెండు వరాలు ఇచ్చాడు. వాటిని అప్పుడు ఉపయోగించుకొమ్మని కైకకు మంథర చెప్పింది. కైక కోపగృహానికి చేరింది. దశరథుడు రాగానే కైక అతడిని రెండువరాలు కోరింది. అవి: 1) భరతుని పట్టాభిషేకం 2) రాముని వనవాసం. దశరథుడు రామున్ని అడవులకు పంపవద్దని కైకను బతిమాలాడు. కాని కైక మనస్సు మారలేదు. కైక దశరథుని అనుమతితో రామునికి కబురంపింది.
రాముడు వచ్చి తండ్రి విచారానికి కారణం ఏమిటని, కైకను అడిగాడు. కైక తాను కోరిన వరాలను గురించి చెప్పింది. రాముడు తండ్రిమాటను పాటిస్తానన్నాడు. రాముడు దండకారణ్యానికి వెడతానన్నాడు. అక్కడి నుండి తల్లి కౌసల్య వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు. రాముడిని అడవికి వెళ్ళవద్దని తల్లీ, లక్ష్మణుడు చెప్పారు. కాని రాముడు తండ్రి మాటనే గౌరవిస్తానన్నాడు. రాముని వెంట సీతాలక్ష్మణులు కూడా వనవాసానికి వస్తానన్నారు. సీతారామలక్ష్మణులు దశరథుని వద్దకు వెళ్ళారు. కైక వారికి నారచీరలు ఇచ్చింది. సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామలక్ష్మణులు రథాన్ని ఎక్కారు. ఈ విధంగా సీతారామలక్ష్మణులు వనవాసానికి వెళ్ళారు.
5. దశరథునికి “శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ” వివరించండి.
జ: దశరథునికి కొడుకుల మీద ప్రేమ ఎక్కువ. నలుగురు కొడుకులను నాలుగు చేతులలాగా భావించాడు. భరత శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండడం వల్ల వారంటే బెంగ. శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ. అందుకు కారణం శ్రీరాముడు సద్గుణరాశి. రూపంలో గుణంలో శ్రేష్ఠుడు, మహావీరుడు. మృదువుగా మాట్లాడుతాడు. కోపం, గర్వం లేనివాడు, సత్యం పలికేవాడు. పరుల సంపదను ఆశించడు. శరణుకోరేవారిని కాపాడేవాడు. దీనులను ఆదుకునేవాడు. కాలాన్ని వృథా చేయక సజ్జనులతో వివిధ విషయాలు చర్చించేవాడు. వినయశీలి. తల్లిదండ్రులు, గురువులపట్ల భక్తి కలవాడు. సోమరితనం, ఏమరిపాటు, అసూయ, మాశ్చర్యం లేనివాడు. ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు. కళలలో ఆరితేరినవాడు.
3. అరణ్యకాండo
1. సీతారాముల దండకారణ్యవాస వృత్తాంతాన్ని తెలపండి. (సీతారాములు పంచవటిని చేరిన వృత్తాంతం)
జ: సీతారామలక్ష్మణులు దండకారణ్యoలో ప్రవేశించారు. అక్కడ మునుల ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. మునులు వీరికి స్వాగతం పలికారు. వీరు దండకవనం మధ్యకు చేరారు. ‘విరాధుడు’ అనే రాక్షసుడు సీతారామలక్ష్మణులపై పడ్డాడు. రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకొని తీసుకుపోతున్నాడు. సీత ఏడ్చింది. రామలక్ష్మణులు విరాధుని భుజాలు నరికివేశారు. విరాధుడు కుప్పకూలాడు. విరాధున్ని గోతిలో పాతిపెడదామని వారు అనుకున్నారు. విరాధుడు తాను తుంబురుడిననీ, శాపం వల్ల తాను రాక్షసుడుగా అయ్యాననీ చెప్పి, వారిని శరభంగమహర్షిని దర్శించమనీ, తనను గోతిలో పూడ్చమనీ రామలక్ష్మణులకు చెప్పాడు.
రామలక్ష్మణులు విరాధున్ని గోతిలో పూడ్చి, శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. శరభంగ మహర్షి రామదర్శనం కోసం వేచి చూస్తున్నాడు. ఆయన తన తపః ఫలాన్ని రాముడికి ధారపోశాడు. సుతీక్ష్ణ మహర్షిని దర్శించమని వారికి ఆయన చెప్పాడు. మునులు రాముణ్ణి కలిసి, రాక్షసుల బాధల నుండి తమను రక్షించమని కోరారు. రాముడు సరే అన్నాడు. సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణ మహర్షిని దర్శించారు. ఆయన రామదర్శనం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ మహర్షి తన తపస్సును రామునికి ధారపోశాడు. ఈ విధంగా దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను దర్శిస్తూ, సీతారామలక్ష్మణులు పదిసంవత్సరాలు వనవాసం చేశారు. వారు తిరిగి సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన అగస్త్యుని సోదరునీ, అగస్త్య మహర్షినీ దర్శనం చేసుకోమని రామలక్ష్మణులకు చెప్పాడు. సీతారామలక్ష్మణులు అగస్త్యభ్రాత (సోదరుడు) ఆశ్రమాన్ని దర్శించారు. తరువాత అగస్త్యుని దర్శించారు. అగస్త్యమహర్షి శిష్యులతో రామునికి స్వాగతం పలికాడు. ఆయన రామునికి దివ్య ధనుస్సు, అక్షయ తూణీరాలు, ఖడ్గమును ఇచ్చాడు. రామునకు జయం కల్గుతుందని ఆశీర్వదించాడు.
రాముడు తాము నివసించడానికి తగిన ప్రదేశాన్ని సూచించమని అగస్త్యుణ్ణి కోరాడు. ఆ మహర్షి గోదావరీ తీరంలో ఉన్న ‘పంచవటి’లో ఉండమని వారికి సూచించాడు. రామలక్ష్మణులకు మార్గమధ్యంలో ‘జటాయువు’ కనబడింది. దానికి సీత రక్షణ బాధ్యతను వారు అప్పగించారు. పంచవటిలో ఆశ్రమం నిర్మించుకొని వారు అక్కడ నివసించారు.
2. రావణుడు మారీచుని సాయంతో సీతాదేవిని అపహరించిన వృత్తాంతాన్ని రాయండి.
జ: సీతారాములు పంచవటిలో సుఖంగా జీవిస్తున్నారు. రావణుని చెల్లెలు శూర్పణఖ అక్కడకు వచ్చి రాముడి అందానికి మోహపడి తన్ను భార్యగా స్వీకరించమని రాముణ్ణి కోరింది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడు. శూర్పణఖ దండకారణ్యoలో ఉన్న సోదరుడు ఖరుడికి ఈ విషయం చెప్పింది. ఖరుడు పంపిన యోధులనూ, ఖరదూషణులనూ మొత్తం 14 వేల మంది రాక్షసులను రాముడు గడియలో చంపాడు. ‘అకంపనుడు’ అనే గూఢాచారి దండకలో రాక్షససంహారం జరిగిందని రావణునకు వార్త చేర్చాడు. రావణుడు రాముణ్ణి చంపుతానన్నాడు. రాముణ్ణి చంపడం దేవాసురులకు కూడా అసాధ్యం అని అకంపనుడు చెప్పాడు. సీతను అపహరించమని సూచించాడు. రావణుడు మారీచుని సాయం అడిగాడు. మారీచుడు రాముణ్ణి కవ్వించవద్దని రావణునికి సలహా చెప్పాడు. శూర్పణఖ, తన అన్న రావణుడికి, సీతను అపహరించమని చెప్పింది.
రావణుడు తిరిగి మారీచుడి దగ్గరకు వెళ్లి, సీతాపహరణకు బంగారు లేడిగా మారి తనకు సాయం చేయమని అడిగాడు. మారీచుడు హితం చెప్పినా, రావణుడు వినలేదు. తనకు సాయపడకపోతే చంపుతానన్నాడు రావణుడు. దానితో మారీచుడు చేసేదిలేక బంగారు లేడిగా మారి, రాముని ఆశ్రమ ప్రాంతంలో తిరిగాడు. సీత బంగారు లేడిని చూసి ముచ్చటపడింది. ఆ బంగారు లేడిని పట్టి తెమ్మని, సీత రామున్ని కోరింది. అది మాయలేడి అని లక్ష్మణుడు చెప్పాడు. రాముడు, సీత మాట కాదనలేక లక్ష్మణున్ని సీతకు కాపలాగా ఉంచి, తాను లేడి కోసం వెళ్ళాడు. మాయలేడి రామునికి దొరకలేదు. రాముడు దానిపై బాణం వేశాడు. మాయలేడి చస్తూ “హా సీతా! హా లక్ష్మణా!” అని అరిచింది. ఆధ్వని విని సీత రాముడు ఆపదలో చిక్కుకున్నాడనీ, లక్ష్మణుడిని రామునికి సాయంగా వెళ్ళమని చెప్పింది. లక్ష్మణుడు కాదంటే, అతడిని నిందించింది. చివరకు లక్ష్మణుడు సీతను విడిచి వెళ్ళాడు. ఇదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో సీత ఉన్న ఆశ్రమానికి వచ్చి, తాను రావణుడిని అని చెప్పి సీతను బలవంతంగా తన లంకా నగరానికి తీసుకుపోయాడు.
3. రామలక్ష్మణులు సీతను అన్వేషిస్తూ పంపా సరస్సు తీరానికి చేరిన వృత్తాంతాన్ని రాయండి.
జ: మారీచుణ్ణి చంపి, శ్రీరాముడు వెనుకకు ఆశ్రమానికి బయలుదేరాడు. దారిలో లక్ష్మణుడు కనబడ్డాడు. సీతను ఒంటరిగా విడిచి వచ్చావేమిటని రాముడు అడిగాడు. లక్ష్మణుడు జరిగిన విషయం చెప్పాడు. రామలక్ష్మణులు ఆశ్రమానికి వెళ్ళి, సీతను వెతికారు. వనమంతా గాలించారు. సీతజాడ కనబడలేదు. సీత జాడ చెప్పమని రాముడు ప్రకృతిని ప్రార్థించాడు. శ్రీరాముడు సీతా వియోగాన్ని భరించలేక ఏడ్చాడు. లక్ష్మణుడు రాముడిని ఓదార్చాడు. రామలక్ష్మణులకు రక్తంతో తడిసిన జటాయువు కనిపించాడు. అతడిని చూసి గద్ద రూపంలో ఉన్న రాక్షసుడనీ, అతడే సీతను తిని ఉంటాడనీ వారు భ్రాంతి పడ్డారు. జటాయువు జరిగినది చెప్పాడు. రావణుడు సీతను అపహరించాడనీ, రావణుడే తనను దెబ్బ తీశాడనీ, జటాయువు వారికి చెప్పి, మరణించాడు. రాముడు జటాయువుకు అంత్యక్రియలు చేశాడు.
రామలక్ష్మణులు “క్రౌoచారణ్యం” చేరుకున్నారు. అక్కడ వారికి ఒక రాక్షసుడు కనబడ్డాడు. వాడికి తల, మెడ, లేదు. వాడి ముఖం వాడి కడుపులో ఉంది. రొమ్ముమీద ఒకే కన్ను ఉంది. వాడి చేతులు యోజనం పొడుగున్నాయి. ఆ చేతులతో వాడు పక్షులనూ, మృగాలను పట్టి తింటాడు. అతడి పేరు కబంధుడు. ‘కబంధుడు’ రామలక్ష్మణులను చేతులతో పట్టుకున్నాడు. వాడి చేతుల్లో చిక్కితే, ఎవడూ తప్పించుకోలేడు. వాడు రామలక్ష్మణులను తినడానికి నోరు తెరిచాడు. వారు కబంధుని భుజాలు నరికిపారేశారు. కబంధుడు కుప్పకూలాడు. శాపం వల్ల తనకు వికృత రూపం వచ్చిందని కబంధుడు వారికి చెప్పాడు. రామలక్ష్మణులు రావణుని గురించి కబంధున్ని అడిగారు. కబంధుడు తన శరీరాన్ని దహిస్తే తనకు దివ్యజ్ఞానం వస్తుందనీ, అప్పుడు రావణుని గురించి చెప్పగలననీ చెప్పాడు. రామలక్ష్మణులు కబంధుడి శరీరానికీ అగ్ని సంస్కారం చేశారు. కబంధుడు దివ్యదేహంతో వచ్చి, సీతాదేవి దొరికే ఉపాయాన్ని వారికి చెప్పాడు. సుగ్రీవుడితో స్నేహం చేయమన్నాడు. కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు.
రామలక్ష్మణులు శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరి రాముడికి పoడ్లు పెట్టింది. తరువాత శబరి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి ఊర్థ్వలోకాలకు వెళ్ళింది. రామలక్ష్మణులు ఈ విధంగా పంపా సరస్సుకు చేరుకున్నారు.
4. ‘అరణ్యకాండo’ ఆధారంగా దండకారణ్యాన్ని వివరించండి.
జ: దండకారణ్యం దట్టమైన పెద్దపెద్ద వృక్షాలతో చాలా విశాలపరిధిలో వ్యాపించి ఉన్నది. ప్రశాంతమైన ప్రదేశం. అనేక మునుల ఆశ్రమాలతో ఎందరికో వనవాసానికి అనుకూలంగా ఉండేది. పక్షులు, మృగాలు, సకల ప్రాణులకు సురక్షితమైన ప్రదేశం. అక్కడ లోక క్షేమం కొరకు యాగాలు జరుగబడేవి. అక్కడ వినయానికి తప్ప వీరత్వానికి అవకాశం లేదు. ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో తెలిసిన రాముడు దండకారణ్యంలో ప్రవేశించగానే వింటి నుండి అల్లెత్రాడును వేరుచేశాడు. రామలక్ష్మణులు సీత మునుల కోరిక మేరకు వారి ఆశ్రమాలను దర్శిస్తూ, ఆతిధ్యాన్ని స్వీకరిస్తూ ప్రయాణం కొనసాగిస్తే పదిసంవత్సరాల సమయం గడిచింది. అంటే దండకారణ్యం ఎంత విశాలంగా విస్తరించిందో అర్థమవుతున్నది.
4. కిష్కింధా కాండo
1. వాలి సుగ్రీవుల విరోధం గురించి రాయండి.
జ: వాలి, సుగ్రీవులు వానరులు. వీరు అన్నదమ్ములు. అందులో వాలి పెద్దవాడు. గొప్ప బలశాలి. తండ్రి తరువాత వాలి కిష్కింధకు రాజు అయ్యాడు. మాయావి అనే రాక్షసుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి సుగ్రీవులు మాయావి వెంటపడ్డారు. మాయావి గుహలో ప్రవేశించాడు. వాలి సుగ్రీవుడిని గుహద్వారం వద్ద ఉండమని చెప్పి తాను గుహలోకి వెళ్లి మాయావితో యుద్ధం చేశాడు. సంవత్సరం తరువాత గుహలోంచి రక్తం బయటకు వచ్చింది. మాయావి అరుపులు వినిపించాయి. దానితో వాలి చనిపోయాడని భావించి, సుగ్రీవుడు బిల ద్వారం మూసి, కిష్కింధకు వచ్చాడు. మంత్రులు సుగ్రీవుని రాజును చేశారు. తరువాత వాలి వచ్చి, సుగ్రీవునిపై కోపించి, రాజ్యం నుండి తరిమి, అతని భార్య రుమను అపహరించాడు.
సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై ఉండేవాడు. మతంగమహర్షి శాపం వల్ల వాలి అక్కడకు రాలేడు. హనుమంతుడు రామసుగ్రీవుల మైత్రి కూర్చాడు. రాముడు వాలిని చంపి, సుగ్రీవుని కిష్కింధకు రాజును చేస్తానన్నాడు. రాముడి సహాయంతో సుగ్రీవుడు వాలిపై యుద్ధానికి వెళ్ళాడు. వాలి సుగ్రీవులు ఒకే పోలిక. అందువల్ల రాముడు వాలిపై బాణం వేయలేదు. సుగ్రీవుడు యుద్ధంలో ఓడిపోయాడు. రాముడు సుగ్రీవుని మెడలో గుర్తుగా నాగకేసరపు లతను వేయించి తిరిగి వాలిపై యుద్ధానికి సుగ్రీవుని పంపాడు. వాలి సుగ్రీవులు యుద్ధం చేస్తుండగా రాముడు వాలిని బాణంతో కొట్టి చంపాడు. వాలి తన మెడలోని సువర్ణమాలను సుగ్రీవునికి ఇచ్చాడు. వాలి తారా అoగదులను సుగ్రీవునకు అప్పగించాడు.
2. రామసుగ్రీవుల మైత్రిని గురించి రాయండి.
జ: వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. రామలక్ష్మణులు సుగ్రీవునితో మైత్రి చేయాలని సుగ్రీవుడు ఉంటున్న ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి, వాలి తన్ను చంపడానికి పంపిన వీరులని భయపడ్డాడు. రామలక్ష్మణుల గురించి తెలుసుకోమని తనమంత్రి హనుమంతుని సుగ్రీవుడు పంపాడు. హనుమ సన్యాసి రూపంలో రామలక్ష్మణుల దగ్గరికి వచ్చాడు. హనుమంతుడు సుగ్రీవుని గురించి రామలక్ష్మణులకు చెప్పి, తాను సుగ్రీవుని మంత్రిననీ, తన పేరు హనుమంతుడనీ చెప్పాడు. హనుమ మాటల్లోని నేర్పును రాముడు మెచ్చుకున్నాడు. హనుమతో లక్ష్మణుడు తమకు సుగ్రీవుని సాయం కావాలని చెప్పాడు.హనుమ రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కిoచుకొని, సుగ్రీవుని వద్దకు తీసుకువచ్చాడు. శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు.
సుగ్రీవుడు రామునితో “ప్రాణమిత్రులుగా ఉందాం” అని చెప్పి, తనకు వాలి భయం లేకుండా అభయం కావాలి అన్నాడు. వాలిని చంపుతానని రాముడు మాట ఇచ్చాడు. సుగ్రీవుడు రామునితో “ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం తాను చూశాననీ, ఆమె “రామా! లక్ష్మణా!” అని గట్టిగా అరుస్తుండగా తాను విన్నాననీ చెప్పి ఆమె జారవిడిచిన నగలమూటను తెప్పించి రాముడికి చూపించాడు. రాముడు ఆ నగలు చూసి ఏడ్చాడు. లక్ష్మణుడు ఆ నగలలోని కాలి అందెలు తన వదిన సీతమ్మవే అన్నాడు. సుగ్రీవుడు సీతను వెదికించడానికీ, రావణుని చంపడానికీ, రాముడికి సాయం చేస్తానన్నాడు. రామసుగ్రీవులు ప్రాణమిత్రులు అయ్యారు. శ్రీరాముడు కాలి బొటన వ్రేలుతో దుందుభి శరీరాన్ని 10యోజనాల దూరం చిమ్మివేశాడు. ఒక్క బాణంతో ఏడు తాడిచెట్లను కూల్చి రాముడు సుగ్రీవుడికి తన బలంపై నమ్మకం కల్గించాడు.సుగ్రీవుడు రామలక్ష్మణులతో కలిసి కిష్కింధకు వెళ్లి వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి సుగ్రీవులు ఒకే పోలికగా ఉన్నారు. అందువల్ల రాముడు వారిని గుర్తించలేక, బాణం వేయలేదు. సుగ్రీవుడు ఓడిపోయాడు.
రాముడు సుగ్రీవుడి మెడలో “నాగకేసరపులత” ను గుర్తుగా వేయించాడు. సుగ్రీవుడు తిరిగి వాలిని యుద్ధానికి రమ్మని కవ్వించాడు. రాముని సాయంతో సుగ్రీవుడు వచ్చాడనీ, యుద్ధానికి వెళ్ళవద్దనీ, వాలికి అతడి భార్య తార చెప్పింది. వాలి సుగ్రీవులకు భయంకర యుద్ధం జరిగింది. రాముడు విషసర్పం వంటి బాణం వేసి, వాలిని సంహరించాడు. సుగ్రీవుడు కిష్కింధకు రాజయ్యాడు. సుగ్రీవుడు సీతను వెదికించడానికి వానరవీరులను పిలిచాడు. అన్ని దిక్కులకూ వానరులను సీతాన్వేషణకోసం పంపాడు. దక్షిణ దిశకు అంగదుని నాయకత్వoలో హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన వానరులను పంపాడు. దక్షిణ దిశకు వెళ్ళిన వానరులకు ‘సంపాతి’ పక్షి కనబడింది. సంపాతి పక్షి, దివ్యజ్ఞానంతో రావణుని వృత్తాంతాన్ని వానరులకు చెప్పింది. జాంబవంతుడు హనుమంతునికి ఉత్సాహం కలిగించాడు. హనుమ తాను సముద్రాన్ని దాటి వెళ్లి లంకలోని సీతజాడను తెలుసుకుంటానని మహేంద్రగిరి పైకి చేరాడు.
3. హనుమంతుడు సీతాన్వేషణకై బయలుదేరిన విధమెట్టిది ?
జ: సుగ్రీవుడు సీతాన్వేషణకై వానరులను అన్ని దిశలకు పంపాడు. అంగదుని నాయకత్వoలో హనుమ, జాంబవంతుడు మొదలయిన వీరులను దక్షిణ దిక్కుకు పంపాడు. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు వెళ్ళిన వానరులు, వట్టి చేతులతో తిరిగివచ్చారు. అంగదుని నాయకత్వoలో దక్షిణ దిశకు బయలుదేరివచ్చిన వానర వీరులు అణువణువునూ వెదుకుతున్నారు. సుగ్రీవుడు ఇచ్చిన గడువు నెల పూర్తైంది. అంగదుడు ఉత్సాహంతో ముందుకు కదులుదాము అన్నాడు. వారు ‘ఋక్షబిలము’ అనే గుహ దగ్గరకు వచ్చారు. వానరులకు ఆకలి, దాహము పట్టుకొంది. అక్కడ ‘స్వయంప్రభ’ అనే యోగిని దయతో, వానరులు ఆకలిదప్పులు తీర్చుకొన్నారు. ఆమె ప్రభావంతో వారు సముద్రతీరానికి చేరారు. వానరులు సీతజాడ తెలిశాకే సుగ్రీవుని కలుద్దాం అనుకున్నారు.
వానరుల మాటలో ‘జటాయువు’ మాట వచ్చింది. ఈ జటాయువు సోదరుడు ‘సంపాతి’. సంపాతి తన దివ్యదృష్టితో లంకను గురించి వానరులకు చెప్పాడు. లంకకు వెళ్ళాలంటే సముద్రం దాటాలి. అది ఎవరివల్ల అవుతుందో వానరులు చర్చించుకున్నారు. హనుమంతుడు ఒక్కడే సముద్రాన్ని దాటగలడని చివరకు వారు నిశ్చయించారు. జాంబవంతుడు హనుమంతుడికి, అతని శక్తియుక్తులను గురించి తెలిపాడు. హనుమ బలాన్ని పుంజుకున్నాడు. దానితో హనుమ వానరులతో “నేను వేయి పర్యాయాలు మేరు పర్వతాన్ని చుట్టి రాగలను. సముద్రాలను దాటగలను” అని చెప్పాడు. హనుమ మాటలకు జాంబవంతుడు ఆనందించాడు. “నీ ధైర్యోత్సాహాలకు తగు విధంగా మాట్లాడావు. నీవు ఋషులు, గురువుల అనుగ్రహంతో సముద్రాన్ని దాటు. నీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాం. మన వానరుల ప్రాణాలన్ని నీపై ఆధారపడి ఉన్నాయి” అని జాంబవంతుడు హనుమకు చెప్పాడు.
హనుమ, తాను ఎగరడానికి ‘మహేంద్రగిరి’ తగినదని, నిశ్చయించి అక్కడకు చేరాడు.
5. సుందర కాండం
1. హనుమంతుడు శ్రీరాముని గుణగణాలను సీతాదేవికి నివేదించిన విధం చెప్పండి.
జ: శ్రీరాముడు పద్మముల వంటి కన్నులు కలవాడు. చక్కని దేహ సౌందర్యము, గుణసంపద కలవాడు. తేజస్సులో రాముడు సూర్యుడి వంటివాడు. ఓర్పులో భూదేవి వంటివాడు. బుద్ధిలో బృహస్పతి. కీర్తిలో దేవేంద్రుని వంటివాడు. రాముడు శరణు అన్నవారిని రక్షిస్తాడు. శత్రువులను సంహరిస్తాడు. రాజవిద్యాకుశలుడు. సర్వ విద్యా పండితుడు. వినయము గలవాడు. యజుర్వేదమందు, ధనుర్వేదమందు పండితుడు. విశాలమైన భుజములు, శంఖం వంటి కంఠము, శుభప్రదమైన ముఖము కలవాడు. దుందుభి వంటి కంఠస్వరము కలవాడు.శ్రీరాముడు సకల ఐశ్వర్య సంపన్నుడు. శ్రీరాముడు సత్యము మాట్లాడుటయందు, ధర్మాచరణము నందు ఆసక్తి కలవాడు. పాత్రులకు దానము చేస్తాడు. అందరితో ప్రియముగా మాట్లాడుతాడు. శ్రీరాముడు మేఘమువలె శ్యామల వర్ణము గలవాడు.
శ్రీరాముడు దశరథుని పెద్ద కుమారుడు. శ్రీరామచంద్రుడు చంద్రుడివలె చక్కని ముఖము కలవాడు. ధనుర్ధారులలో శ్రేష్ఠుడు. ధర్మ రక్షకుడు. అరివీరభయంకరుడు అని హనుమంతుడు శ్రీరాముని గుణగణాలను సీతకు చెప్పాడు.
2. హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతను చూసి మాట్లాడిన వృత్తాంతాన్ని తెలపండి.
జ: హనుమంతుడు దేవతలకు నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు. పెద్ద ధ్వని చేస్తూ, చేతులను నడుం మీద ఉంచి, తోకను విదల్చాడు. సీతను చూసి వస్తానని, అంతరిక్షంలోకి ఎగిరాడు. హనుమ సముద్రంపై వెడుతుండగా, సముద్రుడు హనుమకు సాయం చేద్దామని తనలో దాగిన మైనాకున్ని పైకి రమ్మన్నాడు. హనుమ ఆ గిరి శిఖరాలపై విశ్రాంతి తీసుకుంటాడని సాగరుడు అనుకున్నాడు. పైకి లేచిన మైనాకున్ని చూసి తనకు అడ్డంగా ఉన్నాడని, హనుమ తన వక్షఃస్థలంతో నెట్టి వేశాడు. మైనాకుడు మనిషి రూపంలో గిరి శిఖరంపై నిలిచి, సముద్రుడి కోరికను హనుమకు చెప్పాడు. హనుమ తనకు మధ్యలో ఆగడం కుదరదని, మైనాకున్ని చేతితో తాకి ముందుకు సాగాడు. హనుమను పరీక్షించాలని ‘సురస’ అనే నాగమాత యత్నించి హనుమ సూక్ష్మబుద్ధిని మెచ్చుకుంది. ‘సింహిక’ అనే రాక్షసి హనుమను మింగాలని చూసి, తానే హనుమ చేతిలో మరణించింది. హనుమ లంకను చూశాడు. రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలో తన శరీరాన్ని తగ్గించుకొని, లంకలో ప్రవేశించాడు. లంకాధిదేవత (లంకిణి) లంకలోకి వెళ్ళడానికి హనుమంతుడిని అడ్డగించింది. హనుమ లంకను చూసివస్తానన్నాడు. లంకిణి హనుమను అరచేతితో కొట్టింది. హనుమ లంకిణిని ఒక్కదెబ్బ వేశాడు. లంకిణి కూలిపోయింది. వానరుడు వచ్చి లంకిణిని జయించినపుడు రాక్షసులకు కీడు కల్గుతుందని బ్రహ్మ చెప్పాడని హనుమకు లంకిణి చెప్పింది. హనుమను లంకలోకి వెళ్లమంది.
హనుమ ప్రాకారం నుండి లంకలోకి దూకాడు. లంకలో ఎదమపాదం పెట్టాడు. హనుమ లంకలో రాక్షస భవనాలన్నీ వెదికాడు. రావణుని భార్య మండోదరిని చూసి సీత అని భ్రమపడ్డాడు. తరువాత ఆమె సీత కాదని నిశ్చయించాడు. చివరకు సీత చనిపోయి ఉంటుందని అనుకున్నాడు. హనుమ తాను కూడా మరణిద్దాం అనుకున్నాడు. చివరకు బతికి ఉంటే శుభాలు పొందవచ్చుననుకున్నాడు. హనుమ అశోకవనంలోకి వెళ్ళాడు. సీతారాములకు నమస్కరించాడు. హనుమ ఆ వనంలో శింశుపావృక్షం ఎక్కాడు. దానికింద మలిన వస్త్రాలు ధరించిన ఒక స్త్రీని చూశాడు. ఆమె సీత అయి ఉంటుందని నిశ్చయించాడు. హనుమ చెట్టు మీదే ఉన్నాడు. తెల్లవారుతోంది. రావణుడు వచ్చి, సీత మనసును మార్చబోయాడు. సీత లొంగలేదు. రావణుడు సీతకు రెండునెలల గడువు ఇచ్చి, సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలకు చెప్పాడు. రావణుడు వెళ్ళిపోయాక, రాక్షస స్త్రీలు, సీత మనస్సును మార్చడానికి యత్నించారు. సీత రాముడిని విడిచి ఉండలేక చనిపోదామనుకుంది.
విభీషణుడి కూతురు త్రిజట నిద్ర నుండి లేచింది. త్రిజట తనకు కలవచ్చిందనీ, ఆ కలలో వేయి హంసల పల్లకిలో రాముడూ, తెల్లని పర్వతంపై సీత కనబడ్డారని, రావణుడు నూనె పూసిన శరీరంతో నేలపై పడి ఉన్నాడని, లంక ఛిన్నాభిన్నం అయ్యిందనీ, రాముడికి జయం కల్గుతుందనీ చెప్పింది. సీతకు శుభశకునాలు కనబడ్డాయి. హనుమంతుడు రామకథను గానం చేశాడు. సీత చెట్టు మీద హనుమను చూసి ఆశ్చర్యపడింది. హనుమ చెట్టుదిగి, ఆ స్త్రీని “నీవెవరవు ? నీవు సీతవైతే నీకు శుభం కలుగుతుంది” అన్నాడు. తన పేరు సీతఅని, ఆ స్త్రీ చెప్పింది. హనుమ తాను శ్రీరామ దూతనని చెప్పాడు. హనుమను చూసి సీత మొదట రాక్షసుడని అనుకుంది. రామదూతవైతే రాముని గురించి చెప్పు అన్నది. హనుమ రాముని రూపాన్ని వర్ణించాడు. రాముడిచ్చిన అంగుళీయకాన్ని సీతకు గుర్తుగా ఇచ్చాడు.
రాముణ్ణి త్వరగా లంకకు తీసుకురమ్మని హనుమకు సీతమ్మ చెప్పింది. వెంటనే సీతను రాముని వద్దకు తీసుకువెడతాననీ, తన వీపుపై కూర్చోమనీ, హనుమ ఆమెకు చెప్పాడు. అందుకు సీత నిరాకరించింది. తాను పరపురుషుడిని తాకననీ, రాముడు రావణుని చంపి తనను తీసుకువెళ్ళడం ధర్మమని చెప్పింది. హనుమంతుడు రాముడు గుర్తించే ఆనవాలును ఇమ్మని సీతను అడిగాడు. సీత కాకాసురిని కథ చెప్పింది. ఆమె తన దివ్య చూడామణిని హనుమకు ఇచ్చింది. ఈ విధంగా హనుమ లంకలో సీతను కలిసి వెళ్ళాడు.
3.హనుమ లంకను కాల్చివచ్చి, సీత జాడను రామునికి నివేదించిన వృత్తాంతాన్ని వివరించండి. (లేదా) సీతాన్వేషణ వృత్తాంతాన్ని తెలపండి.
జ: సీతాదేవిని దర్శించడంతో హనుమకు ఒక ముఖ్య కార్యం పూర్తైంది. రావణుడి శక్తిసామర్థ్యాలు హనుమ తెలుసుకుందామనుకున్నాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. అశోకవన ధ్వంసం గురించి రాక్షస స్త్రీలు, రావణునకు చెప్పారు. రావణుడు ఎనభైవేలమంది రాక్షసులను పంపాడు. హనుమ వాళ్లను చంపాడు. రావణుడు పంపిన జంబుమాలిని, ఏడుగురు మంత్రిపుత్రులను, ఐదుగురు సేనాపతులను, అక్షకుమారున్ని కూడా హనుమ చంపాడు. చివరకు రావణుడు తన కుమారుడైన ఇంద్రజిత్తును పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమను బంధించాడు. అది హనుమపై స్వల్పకాలమే పనిచేసింది.
రాక్షసులు హనుమను రావణుని ముందు ప్రవేశపెట్టారు. హనుమ తాను రామదూతనని రావణుడికి చెప్పి, రాముని పరాక్రమాన్ని చాటాడు. దూతను చంపడం తగదని రావణుడి తమ్ముడు విభీషణుడు చెప్పడంతో, రావణుడు హనుమంతుని తోకకు నిప్పంటించి లంకలో తిప్పమన్నాడు. రాక్షసులు హనుమ తోకకు బట్టలు చుట్టి, నూనెతో తడిపి, నిప్పు ముట్టించి లంకానగరంలో ఊరేగించారు. హనుమ ఆకాశంలోకి ఎగిరి, విభీషణుని భవనం తప్పించి, మిగిలిన లంకంతా తగులబెట్టాడు. తరువాత హనుమ లంకను అంటించి తాను తప్పు చేశానని, సీత ఆ మంటలలో కాలిపోయిందేమోనని సందేహించాడు. తన తోకను కాల్చని అగ్ని, సీతను దహింపదని చివరకు ధైర్యం తెచ్చుకున్నాడు. సీత క్షేమంగా ఉందని చారణుల ద్వారా తెలుసుకొని సంతోషించాడు. హనుమ సీతవద్దకు తిరిగి వెళ్లి ఆమెకు నమస్కరించి తిరుగు ప్రయాణం అయ్యాడు.
హనుమ ‘అరిష్టం’ అనే పర్వతాన్నుండి ఆకాశంలోకి ఎగిరాడు. మహేంద్రగిరికి చేరుతూ మహానాదం చేశాడు. జాంబవంతుడు ఆ ధ్వని విని హనుమ విజయం సాధించి వస్తున్నాడని వానరులకు చెప్పాడు. హనుమ మహేంద్రగిరి చేరాడు. పెద్దలకు నమస్కరించాడు. ‘చూశాను సీతమ్మను’ అని చెప్పాడు. ప్రయాణ విషయాలు వారికి చెప్పాడు. అంగదుడు లంకకు వెళ్ళి, రావణుని చంపి సీతను తీసుకొనివచ్చి రాముని వద్దకు వెడదాం అన్నాడు. జాంబవంతుడు అది సరికాదన్నాడు. రామసుగ్రీవులు సీతమ్మను చూసి రమ్మన్నారు. రాముడు రావణుని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. రామునికి ముందు విషయం తెలుపుదాం అన్నాడు. దారిలో మధువనాన్ని వానరులు ధ్వంసం చేశారు. మధువనాన్ని రక్షిస్తున్న దధిముఖుడు, వానరుల చేతిలో దెబ్బతిని, ఆ విషయం సుగ్రీవుడికి చెప్పాడు. సుగ్రీవుడు అదంతా శుభసూచకంగా భావించాడు. అంగద హనుమదాదులు సుగ్రీవుల దగ్గరకు వెళ్ళారు. హనుమ, రాముడికి నమస్కరించి ‘చూశాను సీతమ్మను’ అని చెప్పి, సీత ఇచ్చిన చూడామణిని రాముడికి గుర్తుగా ఇచ్చి సీతాన్వేషణ వృత్తాంతాన్ని రామునకు వివరించాడు.
4. అశోకవనంలో హనుమ – సీతల (సీతాహనుమల) సంభాషణను విశ్లేషిస్తూ, వారి స్వభావాలను రాయండి.
జ: సీత కోరికపై హనుమంతుడు శ్రీరాముని రూపగుణాలను వివరించాడు. రామ ముద్రికను అతడు సీతకు సమర్పించాడు. రామ ముద్రికను చూసి పతివ్రతయైన సీత పరమానందభరితురురాలు అయ్యింది. సీత తన దీనావస్థను హనుమకు వివరించింది. రాముణ్ణి త్వరగా లంకకు తీసుకువచ్చి, తనను రాక్షసుల చెరనుండి విడిపించుమని సీత హనుమంతునికి చెప్పింది. తన వీపుమీద కూర్చుంటే వెంటనే సీతను రాముని వద్దకు తీసుకొని వెళ్ళగలనని హనుమంతుడు సీతకు చెప్పాడు. కానీ సీత హనుమంతునితో వెళ్ళడానికి నిరాకరించింది. తాను పరపురుషుని తాకనని సీత చెప్పింది. రాముడు గుర్తించే ఆనవాలును ఇమ్మని హనుమ అడిగితే, సీత తన చూడామణినిహనుమకు ఇచ్చింది.
సీతాహనుమల సంభాషణను బట్టి, సీతమ్మను వెంటనే తీసుకొని వెళ్లి, సీతారాములకు ఆనందం కలిగించాలని హనుమ తలంచాడనీ, అతడు స్వామికార్య ధురంధరుడనీ తెలుస్తుంది. సీతహనుమల సంభాషణను బట్టి, సీత తనకు వెంటనే చెరనుండి విముక్తి కలగడం ప్రధానం కాదని భావించింది. పాతివ్రత్యం కాపాడుకోవడం ఆమెకు ముఖ్యమని తెలుస్తుంది. దొంగతనంగా హనుమంతుడు సీతను తీసుకువెడితే అది రాముడికి అపకీర్తి అని భావించింది. రావణుని యుద్ధంలో చంపి తనను రాముడు తీసుకొని వెడితే అది రాముడికి కీర్తిని కలిగిస్తుందని సీత అభిప్రాయపడింది.
6. యుద్ధ కాండం
1. శ్రీరాముడు సైన్యంతో లంకానగరాన్ని చేరిన వృత్తాంతాన్ని తెలపండి.
జ: సీతాదేవిని చూసివచ్చి కుశల వార్తను అందించిన హనుమను శ్రీరాముడు ఆలింగనం చేసుకొన్నాడు. మహోపకారం చేసిన హనుమకు తాను ఇయ్యగల సత్కారం అదే అన్నాడు. రాముడికి దుఃఖం వచ్చింది. సుగ్రీవుడు రాముడిని ఓదార్చాడు. క్రోధం చూపించాలి అని రామునికి సుగ్రీవుడు సలహా ఇచ్చాడు. సముద్రానికి సేతువు కడితేగాని, లంకను జయించలేము అన్నాడు. హనుమ లంకానగర రక్షణ వ్యవస్థను గురించి తెలిపాడు. విజయ ముహూర్తంలో లంకకు బయలుదేరాలని రాముడు అన్నాడు. నీలుడు సైన్యానికి మార్గం చూపించాలని,రాముడు హనుమంతుని భుజం మీద, లక్ష్మణుడు అంగదుని భుజం మీద కూర్చొని వెళ్ళాలని, సుగ్రీవుడు పల్లకిపై రావాలని, రాముడు నిర్ణయించాడు. అందరూ సముద్రతీరాన్ని చేరుకున్నారు.
విభీషణుడు ధర్మం విడిచిన రావణుని విడిచిపెట్టి, తన నలుగురు అనుచరులతో రామలక్ష్మణులు ఉన్న చోటుకు చేరాడు. విభీషణుడు రాముని శరణుకోరగా, రాముడు అంగీకరించాడు. రాముడు రావణుని చంపి విభీషణుణ్ణి రాజును చేస్తానని ప్రమాణం చేశాడు. ఆ పనిలో రామునికి తాను సహాయం చేస్తానని విభీషణుడన్నాడు. రాముడు విభీషణుణ్ణి లంకకు పట్టాభిషిక్తుణ్ణి చేయమని లక్ష్మణుడికి చెప్పాడు. లక్ష్మణుడు వెంటనే ఆ పని చేశాడు. సముద్రుణ్ణి ప్రార్థిస్తే సముద్రాన్ని దాటగలవని విభీషణుడు రామునకు సలహా చెప్పాడు. శ్రీరాముడు సముద్రుణ్ణి ఉపాసించాడు. మూడు రోజులు అయినా, సముద్రుడు ప్రసన్నుడు కాలేదు. రాముడు బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. సముద్రుడు పరుగుపెట్టాడు. లంకకు వెళ్ళడానికి దారి ఇస్తానని సముద్రుడు చెప్పాడు. రాముడు తాను ఎక్కుపెట్టిన అస్త్రం వ్యర్థం కాకుండా, పాపాత్ములు ఉండే “ద్రుమకుల్యం” పై ప్రయోగించాడు. నలుడు సేతువు నిర్మించడానికి తగినవాడని సముద్రుడు చెప్పాడు. సేతువును భరిస్తానని సముద్రుడు మాట ఇచ్చాడు.
రాముడు సేతువు నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. వానరులు వృక్షాలు తెచ్చి సముద్రంలో పడవేశారు. 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు గల సేతువు 5 రోజుల్లో కట్టబడింది. రామలక్ష్మణసుగ్రీవులు ముందు నడుస్తున్నారు. సైన్యం వారి వెంట నడిచింది. వానరులు కొందరు సముద్రంలో దూకి ఈదుతూ వచ్చారు. ఈ విధంగా శ్రీరాముడు, సుగ్రీవుడు మొదలయిన వానర నాయకులతో లంకా నగరానికి చేరాడు.
2. వానరసైన్యానికి, రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధం వివరాలను తెలపండి.
జ: రాముడు సైన్యాన్ని విభజించి, ఎవరి బాధ్యతలు వారికి అప్పగించాడు. రావణుని మంత్రులైన శుకసారణులు రాముని బలం తెలుసుకోవడానికి గూఢచారులుగా వచ్చి వానరులలో చేరారు. విభీషణుడు వారిని గుర్తించి, రాముని ముందు నిలబెట్టాడు. రాముడు వారిని క్షమించి, సీతను అప్పగించకపోతే రావణుడి మరణం తప్పదని హెచ్చరించి పంపాడు. శుకసారణులు రావణునికి ఆ విషయం తెలిపారు. రావణుడు అశోకవనం వెళ్ళి రాముడు తన చేతిలో మరణించాడని అబద్ధం చెప్పాడు. విద్యుజ్జిహ్వుడిచే రామునివి అనిపించే మాయాశిరస్సునూ, ధనుర్భాణాలనూ తెప్పించి, సీతకు చూపించాడు. సీతను తన్ను ఆశ్రయించమని కోరాడు. సీత విచారించింది. విభీషణుడి భార్య “సరమ” సీతను ఊరడించి రాముడు క్షేమంగా ఉన్నాడనీ, అదంతా రాక్షసమాయ అనీ సీతకు తెలిపింది.
శ్రీరామచంద్రాదులు సువేల పర్వతానికి చేరారు. లంకానగర శోభను చూశారు. రావణుడు ఠీవిగా మేడపై ఉన్నాడు. సుగ్రీవుడు రావణునిపై కోపంతో ఎగిరి రావణ భవనంపై వాలాడు. తన నుండి రావణుడు తప్పించుకోలేడని, రావణుడి కిరీటాన్ని తీసి నేలపై కొట్టాడు. రావణుడు రెచ్చిపోయాడు. ఇద్దరికీ బాహాబాహీ యుద్ధం జరిగింది. సుగ్రీవుడు రావణుడిని ముప్పుతిప్పలు పెట్టి, తిరిగి సువేల పర్వతం చేరాడు. శ్రీరాముడు సుగ్రీవుణ్ణి మందలించాడు. అంగదుడిని రాముడు రావణుడి దగ్గరకు రాయబారిగా పంపాడు. రాముడి చేతిలో రావణుడు మరణిస్తాడని, విభీషణుడు రాజు అవుతాడని రాముని వాక్యంగా, అంగదుడు రావణునికి తెలిపాడు. అంగదుడిని నలుగురు రాక్షసులు చంపబోయారు. అంగదుడు వారిని చంపివచ్చాడు. రాముడు యుద్ధానికి సిద్ధమయ్యాడు.
లంకపై దండయాత్ర : వానరసైన్యం లంకను నాల్గువైపుల నుండి ముట్టడించింది. ఆంజనేయుడి చేతిలో జంబుమాలి, సుషేణుడి చేతిలో విద్యున్మాలి మరణించారు. అంగదుడి చేతిలో ఇంద్రజిత్తు ఓడిపోయాడు. దానితో ఇంద్రజిత్తు కపటయుద్ధానికి దిగాడు. ఇంద్రజిత్తు నాగాస్త్రంతో రామలక్ష్మణులను బంధించాడు. రామలక్ష్మణులు మరణించారని ఇంద్రజిత్తు రావణుడితో చెప్పాడు. రావణుడు ఆజ్ఞాపించగా “త్రిజట మొదలయినరాక్షస స్త్రీలు సీతను పుష్పకవిమానంలో యుద్ధభూమికి తీసుకువచ్చి, నేలపై ఉన్న రామలక్ష్మణులను చూపించారు. సీత ఏడ్చింది. త్రిజట సీతను ఓదార్చింది. రామలక్ష్మణులు బతికి ఉన్నారని ఆమె సీతకు ఆధారాలు చూపింది. సీత మనస్సు కుదుటపడింది. గరుత్మంతుడి రాకతో నాగాస్త్ర ప్రభావం నుండి రామలక్ష్మణులు విముక్తి పొందారు. హనుమంతుడు అకంపనుణ్ణి, ధూమ్రాక్షుణ్ణి చంపాడు. అంగదుడు వజ్రదంష్ట్రుడిని, నీలుడు ప్రహస్తుడిని చంపాడు. రావణుడి చేతిలో సుగ్రీవుడు మూర్ఛపోయాడు. లక్ష్మణుడు రావణుని ఎదిరించాడు. రావణుడు బాణవర్షం కురిపించాడు. హనుమ అడ్డుకున్నాడు. రావణుడి అరచేతి దెబ్బకు హనుమ చలించి, తిరిగి తేరుకొని, రావణుడిని అరచేతితో కొట్టాడు.దశగ్రీవుడు కంపించిపోయి ‘భళా! వానరా’ అని హనుమశక్తిని మెచ్చుకున్నాడు.
రావణుడు ‘శక్తి’ అనే ఆయుధాన్ని వేశాడు. లక్ష్మణుడు స్పృహ కోల్పోయాడు. రావణుడు లక్ష్మణుడిని ఎత్తుకొని పోవడానికి విఫలయత్నం చేశాడు. ఆంజనేయుడు పిడికిలితో పొడిచి రావణుడిని కూలగొట్టి, లక్ష్మణుడిని రాముని దగ్గరకు చేర్చాడు. శ్రీరాముడు హనుమంతుని భుజాలపై కూర్చుండి రావణునితో యుద్ధం చేశాడు.రావణుని కిరీటం, ధనుస్సు నేలపై పడ్డాయి. రాముడు కరుణించి, అలసిపోయిన రావణుడిని విశ్రాంతి తీసుకొని తిరిగి యుద్ధానికి రమ్మని పంపాడు.
3. రామరావణ యుద్ధాన్ని గురించి రాయండి.
జ: రావణుడు ప్రయోగించిన శక్తి ఆయుధం లకష్మణుడి గుండెపై నాటుకుంది. లక్ష్మణుడు స్పృహ తప్పాడు. హనుమంతుడు రావణుడి వక్షస్థలంపై గుద్ధి కిందపడేట్లు చేశాడు. రాముడు హనుమ భుజాలపై కూర్చొని, రావణుడితో యుద్ధం చేసి, రావణుని ధనుస్సును విరిచాడు. రావణుని కిరీటం నేలపై పడింది. రాముడు రావణునితో “యుద్ధంలో అలసిపోయావు విశ్రాంతి తీసుకొని రా. నా బలం చూపిస్తా” అన్నాడు. రాముడు కుంభకర్ణుని చంపాడు. లక్ష్మణుడు ఐoద్రాస్త్రంతో ఇంద్రజిత్తును చంపాడు. రావణుడు శక్తిని ప్రయోగించాడు. రాముడు దాన్ని ప్రార్థించాడు. లక్ష్మణుడు పడిపోయాడు. రాముని విలువిద్య ముందు రావణుడు నిలువలేక పరుగు తీశాడు. హనుమంతుడు ఓషధీ పర్వతాన్ని తెచ్చి, లక్ష్మణుడిని బతికించాడు. ఇంద్రుడు రామునకు దివ్యరథాన్ని పంపాడు. రాముడు ఆ రథం ఎక్కి రావణుడితో యుద్ధం చేశాడు. క్రమంగా రాముని ముందు రావణుడు నిలువలేక పోయాడు.రావణుని రథసారథి రథాన్ని ప్రక్కకు మళ్ళించాడు. అగస్త్య మహర్షి రామునికి, ఆదిత్యహృదయo ఉపదేశించాడు. రాముడి బాణాలు తగిలి రావణుని తలలు తెగిపడ్డాయి. కాని తిరిగి మొలుస్తున్నాయి.
రామరావణ యుద్ధానికి సాటి రామ, రావణ యుద్ధమే. మాతలి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని రామునికి సూచించాడు. రాముని బ్రహ్మాస్త్రంతో రావణుడు మరణించాడు.
4. రావణుని చంపి శ్రీరాముడు పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పాలించిన విధానాన్ని తెలపండి.
జ: మాతలి సూచనతో శ్రీరాముడు రావణునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రావణ సంహారం జరిగింది. రాముడి ఆదేశం మేరకు విభీషణుడు తన అన్న రావణునికి ఉత్తరక్రియలను నిర్వహించాడు. రాముని ఆజ్ఞ ప్రకారం, లక్ష్మణుడు విభీషణుడిని లంకారాజుగా పట్టాభిషేకం చేశాడు. హనుమ సీతమ్మకు రావణసంహారం గురించి చెప్పాడు. సీతను బాధించిన స్త్రీలను చంపుతానన్న హనుమను, సీతమ్మ వారించింది. విభీషణుడు సీతను పల్లకిలో రాముని వద్దకు తీసుకువచ్చాడు. సీత భర్తను చేరుకుంది. రాముడు సీతతో తన వంశ ప్రతిష్ఠను నిలుపుకోవడానికి రావణుడి చెరనుండి సీతను విడిపించాననీ, సీత పరుల పంచాన ఉన్నందున తనకు ఆమెపై సందేహం ఉందనీ, ఆమె ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళవచ్చుననీ, అన్నాడు. శ్రీరాముడి మాటలు సీతకు బాణాల్లా గుచ్చుకున్నాయి. రాముడికి తనపై విశ్వాసం కల్గించడానికి ‘అగ్నిప్రవేశం’ ఒక్కటే దిక్కని సీత భావించింది. లక్ష్మణుడు చితిని సిద్ధం చేశాడు. సీత అగ్నిప్రవేశం చేసింది. అగ్నిదేవుడు సీతను స్వయంగా తీసుకువచ్చి ఆమెను స్వీకరించమని రాముని కోరాడు.
సీత శీలాన్ని ముల్లోకాలకు చాటడానికే, సీత అగ్నిప్రవేశం చేస్తున్నప్పటికీ, తాను ఊరుకున్నానని చెప్పి, సీతను రాముడు స్వీకరించాడు. శివుడు రాముని ప్రశంసించాడు. ఇంద్రుడు చనిపోయిన వానరులను బతికించాడు. విభీషణుడు రాముడిని మరికొంతకాలం లంకలో ఉండమన్నాడు. కాని భరతుడి కోసం రాముడు పుష్పకవిమానంలో అయోధ్యకు బయలుదేరాడు. రాముడు తాను తిరిగి వస్తున్నవిషయాన్ని భరతుడికి హనుమ ద్వారా కబురు పంపాడు. పుష్పకవిమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామలక్ష్మణులకు, భరతాదులు స్వాగతం చెప్పారు. సీతారాములు తల్లులకూ, వశిష్ఠుడికి నమస్కరించారు. భరతుణ్ణి రాముడు దగ్గరకు తీసుకున్నాడు. శ్రీరామ పట్టాభిషేకం మహా వైభవంగా జరిగింది. రాముడు లక్ష్మణుడిని యువరాజుగా ఉండమన్నాడు. లక్ష్మణుడు అంగీకరించలేదు. భరతుణ్ణి యువరాజుగా చేశాడు. రాముడు ప్రజలను కన్నబిడ్డల వలె చూశాడు. ప్రజలు ధర్మబద్ధంగా నడుచుకున్నారు. రాముడు 11వేల సంవత్సరాలు పాలించాడు. ప్రజలకు ఈతిబాధలు లేవు. అందుకే ‘రామరాజ్యం’ అనే మాట ప్రసిద్ధం అయ్యింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి