29, జనవరి 2023, ఆదివారం

12. భూమిక Notes || 10th Class Telugu || Bhumika Notes ||

12. భూమిక 

                                         - గూడూరి సీతారాం 

I) పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు :

  • పుస్తక పరిచయం (పీఠిక) గురించి తెలుసుకొని, ఏదైనా ఒక కథల పుస్తకానికి పీఠిక రాయగలగాలి  

  • నెల్లూరి కేశవస్వామి కథల గురించి తెలుసుకోగలగాలి    

  • కథలకూ, కవిత్వానికీ గల భేదం చెప్పగలగాలి

  • శ్లేషాలంకారాన్ని గుర్తించగలగాలి  

II) ముఖ్య పదాలు – అర్థాలు :

      మాసపత్రిక            =  నెలకు ఒకసారి వచ్చే పత్రిక 

      అంతర్యుద్ధం           =  అంతర్గత పోరాటం 

      పట్టభద్రుడు            =  డిగ్రీ తీసుకున్నవాడు

      ఉద్యమాలు            =   పోరాటాలు

      సార్థకత                =   అర్థవంతం

      అంతర్భాగం           =   లోపలి భాగం  

       పరదాలు             =   తెరలు   

       జీవభాష              =  వాడుకలోని భాష 

       అచ్చం                =  సరిగ్గా

       వాత్సల్యం            =   ప్రేమ   


III) చర్చనీయ అంశాలు :

 1. కథకు, కవిత్వానికి గల భేదం..... ఇష్టమైన ప్రక్రియ :

కథ వచన రచన. కవిత్వం పద్యరచన. కథలో కథనం ఉంటుంది. కవిత్వంలో గూడార్థం ఉంటుంది. కథలో మనోరంజకత్వం ప్రధానం. కవిత్వంలో శబ్డ్డప్రయోగం అందం. కథ సంఘటనల మధ్య సంబంధాన్ని చిత్రిస్తుంది. కవిత్వం ఆలోచనలకు ఆశ్రయం ఇస్తుంది. దేనికది గొప్పదే. దేని ప్రత్యేకత దానిదే.

  • కథను ఇష్టపడితే.....

కథలో వేగం నచ్చుతుంది. సహజమైన పాత్ర చిత్రణ ఆకట్టుకుంటుంది. సంభాషణలు ఉత్సాహాన్ని నింపుతాయి. కథనం ముగింపుపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముగింపు హృదయాన్ని కదిలిస్తుంది. సందేశం మార్గనిర్దేశనం చేస్తుంది.

  • కవిత ఇష్టమైతే.....

పద ప్రయోగం ఆకట్టుకుంటుంది. క్లుప్తత నచ్చుతుంది. కవితలోని లయ ముగ్ధులను చేస్తుంది. అంశ విశ్లేషణ ఆలోచింపచేస్తుంది. వ్యంగ్యం/ ధ్వని/శ్లేష /చమత్కారం పదేపదే చదివిస్తుంది. సొంతంగా రాయాలన్న ప్రేరణనిస్తుంది.


2. నాటి హైదరాబాద్ రాజ్యంలో ప్రజల ఉద్యమం ఎందుకు సాగి ఉండవచ్చు?

  20వ శతాబ్దం ప్రారంభం హైదరాబాద్ రాష్ట్రానికి చేదు అనుభవాలను మిగిల్చింది. మతం ప్రాతిపదికగా హిందువులను నీచంగా చూడటమే కాక రజాకార్ల పేరుతో చెప్పుకోలేనన్ని దౌర్జన్యాలు సాగించారు. అవి సహించలేక తిరగబడ్డ ఈ రాష్ట్ర ప్రజలు హక్కులకోసం, స్వాతంత్ర్యంకోసం ఉద్యమించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 13నెలల దాకా ఇక్కడి ప్రజలు నిరంకుశ పాలనలోనే నలిగిపోయారంటే, పరిస్థితులెంత దయనీయంగా ఉండేవో ఊహించుకోవచ్చు. 

3. జీవభాష – కథల్లో చిత్రించడం :

జీవభాష అంటే బతికున్న భాష. భాష బతికి ఉండటం అంటే వ్యవహారంలో ఉండటం. అంటే మాట్లాడుతున్న భాష జీవభాష. కథ అంటే దృశ్యాలు కళ్ళ ముందు కదలాడుతున్న అనుభూతి. ఆ అనుభూతికి సహజత్వాన్నిచ్చేది భాష. ఆ భాష వ్యవహారంలో ఉండే పాత్రోచితమైoదిగా ఉండాలి. సన్నివేశాలను, నేపథ్యాలను సహజంగా ఆవిష్కరించాలి. జీవభాషను కథల్లో చిత్రించడమంటేఇదే. 

4. చార్మినార్ కథలను ఎందుకు చదువాలి ?

 చార్మినార్ కథలు నెల్లూరి కేశవస్వామి అనుభవాల్లో నుంచి జీవం పోసుకున్న కథలు. 11వ శతాబ్దం నుంచి వేయి సంవత్సరాల్లో హైదరాబాద్ లో ఊపిరి పోసుకున్న  సంస్కృతి, చరిత్ర కేశవస్వామి కథల్లో సాక్షాత్కరిస్తుంది. నవాబులు, దేవిడీలు, మహబూబ్ కి మెహందీలు, కోఠీలు, దివాన్ఖానాలు, జనాభాఖానాలు, బేగంసాహేబులు, పాన్దాన్లు, పరాటాకీమాలు, దాల్చాలు, నమాజులు, పరదాల వెనుక సంఘటనలు..... ఈ విధంగా హైదరాబాద్ నగర జీవితాన్ని, చరిత్రను, సంస్కృతిని అర్థం చేసుకునేందుకు, హైదరాబాదీ జీవితాన్ని అధ్యయనం చేసేందుకు చార్మినార్ కథలు చదువాలి.

5. నెల్లూరి కేశవస్వామి హృదయం చార్మినార్ కథల్లో ప్రతిబింబిస్తుంది

హైదరాబాద్ లో పుట్టి, పెరిగి, ఈ వాతావరణాన్ని, సంస్కృతిని గుండెలనిండా నింపుకున్న కేశవస్వామికి ఈ మట్టిలోని ప్రతిరేణువుతో సంబంధముంది. ఆ బంధం మతాలకు అతీతమైన మైత్రి బంధం. అందుకే తాను జీవించిన, అనుభవించిన స్నేహం, ఆత్మీయత, కులాతీత, మతాతీత మమతలు, ఓల్డ్ సిటీ జీవితం చార్మినార్ కథల్లో ఆవిష్కరించాడు. అందుకే చార్మినార్ కథల్లో నెల్లూరి కేశవస్వామి హృదయం ప్రతిబింబిస్తుంది. ఇవి కేవలం కథలు కావు. వాస్తవ జీవితాల సామాజిక పరిణామాల చరిత్రను తమలో నిక్షిప్తం చేసుకున్న చారిత్రక కథలు. నిజాం యుగాంత పరిణామాలను ఇవి కళ్లకు కడతాయి.   

6. హృదయ సంస్కారం అంటే.....

సంస్కారమైన హృదయం. అంటే హృదయ పూర్వకంగా సంస్కారవంతoగా ప్రవర్తించడం. మనుషులు అవకాశాన్ని బట్టి మంచివాళ్ళుగా, చెడ్డవాళ్లుగా మారిపోతుంటారు. హృదయంలో సంస్కారమున్న వాళ్లు ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ మంచితనాన్ని విడనాడారు. మంచితనాన్ని అవకాశవాదానికి బలిచేయరు. నెల్లూరి కేశవస్వామి ‘రూహిఆపా’ కథలోని ‘నవాబు’ పాత్రలో అతని కుమారుడు సలీం పాత్రలోనూ ఈ హృదయసంస్కారం కనిపిస్తుంది. ఆవు - పులి కథలో పులి హృదయ సంస్కారం అలాంటిదే. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు లేని పాండవులు చిక్కినా అపకారం తలపెట్టని కర్ణుని ఔదార్యం కూడా హృదయ సంస్కారానికి ప్రతీక.



7. కేశవస్వామి కథల ఆధారంగా కథల స్వరూప స్వభావాలు.......

నెల్లూరి కేశవస్వామి కథలు అసాధారణమైనవి. కిషన్ చంద్ ల వంటి జాతీయస్థాయి రచయితలతో సమానమైన ప్రతిభతో చార్మినార్ కథలు రచించాడు కేశవస్వామి. ఈ కథలను పరిశీలించినప్పుడు కథలంటే ఎలా ఉండాలో ఒక అభిప్రాయo కలుగుతుంది.

  • వాస్తవ సంఘటనల ఆధారంగా కథలుండాలి.

  • పాత్రచిత్రణ, సంభాషణలు సహజంగా ఉండాలి.

  • సంఘటనల మధ్య సంబంధాలను కళాత్మకంగా చిత్రించాలి.

  • కథలు పాఠకుల్ని కదిలించాలి, ఆలోచింపచేయాలి.

  • చక్కని సందేశాన్నివ్వాలి.

IV) పాఠ్య పుస్తకంలోని ప్రశ్న - జవాబులు

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలల్లో జవాబులు రాయండి.

అ) “ ఒక భాషలోని సాహిత్యం చదవడం ద్వారా నాటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు” దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. రాయండి.

జ: సామాన్యంగా ఉత్తమ కవులు, రచయితలు తమ రచనలలో నాటి సామాజిక పరిస్థితులకు చోటు కల్పిస్తారు. ఉద్దేశించకపోయినా, నాటి సామాజిక పరిస్థితులకు కవుల రచనలు అద్దం పడతాయి. అయితే సామాన్య కవుల రచనలు అలాగే ఉంటాయని చెప్పలేము.

కాని నెల్లూరి కేశవస్వామి రాసిన కథలలో, ఆనాటి హైదరాబాద్ రాజ్యం, ఇండియన్ యూనియన్ లో కలిసిన నాటి పరిస్థితులు స్పష్టంగా చిత్రింపబడ్డాయి. అలాగే కేశవస్వామి గారి చార్మినార్ కథలూ, యుగాంతం కథ కూడా, ఆనాటి హైదరాబాద్ లోని హిందూముస్లీంల కలహాలనూ, ఆనాటి మరణకాండనూ వెల్లడిస్తాయి.

కాబట్టి ఒక భాషలోని సాహిత్యం, ప్రధానంగా నవలలు, కథలు చదివితే, నాటి పరిస్థితులు అర్థం చేసికోవచ్చు అన్నమాట నిజం.


ఆ) తెలంగాణ పలుకుబడులంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు రాయండి.

 జ:  తెలంగాణ పలుకుబడులంటే తెలంగాణాలోని పల్లెజనం మాట్లాడుకొనే అసలైన స్వచ్ఛమైన తెలుగు నుడికారం గల భాష.

  • కాదక్కా! మనూరికో కొత్త బాటేసినం, నీవు చూసి మెచ్చిందాక గాదు.

  • “ అదో ! అక్కడి దిక్కు జెర నాచెవు వారిచ్చి ఇను”.

  • బండి సాగిపోతనే ఉండది.

  • ఎన్నాళ్లకెన్నాళ్లకు ? ఏరుతార్లు ఎచ్చుతచ్చులు మాని, తోటి మనిషికి సమానంగ తావును పంచి ఇచ్చే బుద్ధి మీకు దక్కింది.

  • ఇంతకంటే మంచిబాట ఇంగెట్లుంటది ?

ఇ) “తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది” అనే వాక్యం ద్వారా మీకేమి అర్థమయిందో వివరించండి.

జ: తెలంగాణ కథ 1902లో ప్రారంభమైంది. ఆనాటి నుండి తెలంగాణా కథ సామాజిక పరిణామాలను చిత్రిస్తూ వస్తోంది. బండారు అచ్చమాంబగారు, తెలంగాణా తొలి కథకురాలని చరిత్ర స్పష్టం చేసింది.

 నాటి తెలంగాణా కథ పుట్టిన నాటి నుండి సామాజిక చైతన్యంతోనే అది కొనసాగుతూ వచ్చింది. తెలంగాణ కథలలో సమాజ పరిశీలన, విశ్లేషణ, మానసిక చిత్రణ, సామాజిక పరిణామాలు, ఫ్యూడల్ సమాజం, ప్రజాస్వామిక స్వేచ్ఛా వాయువులు, తెలంగాణ పలుకుబడులు, గ్రామీణ కులవృత్తులు, సంస్కృతి, గ్రామీణజీవితం, ఉర్దూ మీడియం పోయి తెలుగు మీడియం రావడం, ప్రజాస్వామిక ఉద్యమాలు మొదలైన విశేషాలు పలుకోణాల్లో చిత్రించబడ్డాయి. అందువల్ల తెలంగాణ కథలన్నీ పుట్టిన నాటి నుండి నేటి వరకూ సాంఘిక చైతన్యంతోనే వస్తున్నాయని నాకు అర్థమయ్యింది.

ఈ) నెల్లూరి కేశవస్వామి ఒక ప్రజాస్వామికవాది. చైతన్యశీలి. ‘దీన్ని సమర్థించడానికి కొన్ని ఉదాహరణలు తెలుపండి. 

జ: నెల్లూరి కేశవస్వామి లోహియా సోషలిస్టు. ఈయన హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో హిందూముస్లీం సంఘర్షణలు చూసి చలించిపోయాడు. అశాంతిగా నిద్రలేకుండా ఎన్నో రాత్రులు గడిపాడు. హిందూముస్లీం సఖ్యత కోసం, తాను ఏమీ చేయలేనా ? అని ఆలోచించాడు.

      మతాతీత స్నేహాలు, ఆత్మీయతలు బలి కాకుడదనుకున్నాడు. తాను జీవించిన, తాను అనుభవించిన స్నేహం, ఆత్మీయత, కులాతీత, మతాతీత మమతలు గల  ఓల్డ్ సిటీ జీవితాన్ని ‘చార్మినార్ కథలు’గా రాశాడు. ఈ విధంగా ఒక సామాజిక శాస్త్రవేత్తగా, చైతన్యశీలిగా కేశవస్వామి తన వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తూ చార్మినార్ కథలు రాశాడు. ఇవి వాస్తవ జీవితాల, సామాజిక పరిణామాల సామాజిక చరిత్రను నిక్షిప్తం చేసిన కథలు. దీనిని బట్టి కేశవస్వామి “చైతన్యశీలి” అని చెప్పవచ్చును.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ)  అన్నం మెతుకును చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చును. అట్లే, పుస్తక పరిచయ వ్యాసాన్ని లేదా సమీక్షను చదివితే కూడా ఆ పుస్తకం గురించి ఆమూలాగ్రంగా అర్థం చేసుకోవచ్చు. ఎట్లాగో రాయండి.

 జ: ఒక పుస్తకం ఆశయాన్ని, అంతస్సారాన్నీ, తత్వమునూ, రచయిత దృక్పథాన్నీ, ప్రచురణ కర్త వ్యయ ప్రయాసలనూ పుస్తక పరిచయ వ్యాసం పాఠకులకు తెలియపరుస్తుంది. ఆ గ్రంథము యొక్క నేపథ్యాన్నీ, లక్ష్యాలనూ పుస్తక పరిచయ కర్త మనకు పరిచయం చేస్తాడు. ఆ పుస్తకంలో రచయిత వివరించిన విషయం, వివరించిన తీరు, దానిలోని మంచి చెడ్డలు, పుస్తక పరిచయకర్త సమీక్షిస్తాడు.

    పుస్తక రచయిత రచనా విధానంలో తీసుకొన్న మెళకువలనూ, చూపించిన అందాలనూ పుస్తక పరిచయకర్త మనకు తెలుపుతాడు. ఆ పుస్తకంలో ఉన్న ముఖ్య విషయాలను, రేఖా మాత్రంగా సమీక్షకుడు తెలియపరుస్తాడు.  ఆ పుస్తకం ద్వారా మనం ఏవిషయాలు తెలుసుకోగలమో, ఇంకా ఏయే విషయాలు ఆ గ్రంథంలో తెలియజేస్తే బాగుండేదో పుస్తక పరిచయంలో రాయబడుతుంది. కాబట్టి పుస్తక పరిచయ వ్యాసం, ఆ గ్రంథాన్ని మనకు చక్కగా పరిచయం చేస్తుంది. 

ఆ) కేశవస్వామి కథలను గురించి గూడూరి సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా, కేశవస్వామి రచనలను గురించి రాయండి.

జ: నెల్లూరి కేశవస్వామి సుప్రసిద్ధ కథా రచయిత. ఆయన రాసిన కొన్ని కథలు నేడు దొరకట్లేదు. ఈయన తన కథలను కొన్ని సంపుటాలుగా వెలువరించాడు. ఈయన తొలికథల సంపుటి “పసిడి బొమ్మ”. ఇది 1969లో వెలువడింది. ఇది భాస్కరభట్ల కృష్ణారావుగారికి అంకితం ఇవ్వబడింది. ఈయన రెండవ కథా సంకలనం “చార్మినార్” కథలు. ఇవి ఊహించి రాసిన కథలు కావు. ఇది సమాజంలోని మార్పులను కథలుగా రాసిన సామాజిక చరిత్ర రచన అని చెప్పాలి. చార్మినార్ కథలు హైదరాబాద్ సంస్కృతినీ, మానవ సంబంధాలనూ, అక్కడి ముస్లీంల జీవితాలనూ అపూర్వంగా చిత్రించాయి. ఇవి మొత్తం 11 కథలు. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ నగరంగా ఎదిగింది. ఆ నేపథ్యాలనూ ఆ జీవితాలనూ కేశవస్వామి చార్మినార్ కథల్లో చిత్రించాడు.  

ఈయన “యుగాంతం” కథ సార్థకమైనది. దీనిలో హైదరాబాద్ రాజ్యంలో పరిణామాలను ఒక చారిత్రక డాక్యుమెంటుగా రాశాడు. ఈ ఒక్క కథే రాసినా, కేశవస్వామి భారతదేశం గర్వించదగ్గ గొప్ప కథకుల్లో ఒక్కడు

అయ్యేవాడు.

చార్మినార్ కథల్లో కేశవస్వామి హృదయం ఉంది. ఇవి నిజాం రాజ్యయుగం అంతరించిన పరిణామాలను చిత్రించిన కథలు. కేశవస్వామి రాసిన రుహీ అపా” కథ, గొప్ప మానవీయ సంబంధాలనూ, కులమతాలకు అతీతంగా స్పందించిన మనిషినీ చిత్రించిన కథ. ఈ కథలో ముస్లీం నవాబుల్లో ఉన్న హృదయ సంస్కారాన్ని రచయిత చక్కగా చూపించాడు.

ఈయన “వంశాంకురం” కథలో ముస్లిం పెళ్లిసంబంధాలు ఎలా ఉంటాయో చెప్పాడు. నమ్మిన పేదల నమ్మకాలను ఎలా భగ్నం చేస్తారో ‘భరోసా’ కథలో చెప్పాడు. కేశవస్వామి వాసిలో, వస్తు నైపుణ్యంలో వాసికెక్కిన కథలు రాశాడు. ఈయన హిందీ కథా రచయితలు ప్రేమ్ చంద్ కిషన్ చందర్ లతో పోల్చదగిన గొప్ప కథా రచయిత.

V) తరగతి గదిలో రాయవలసిన అంశాలు :

1) ఏదైనా ఒక కథల పుస్తకం తీసుకొని చదువండి. దీనికి పుస్తక పరిచయం (పీఠిక) రాయండి.

2) కింది పదాల గురించి వివరించి రాయండి.

      అ) హృదయ సంస్కారం            ఆ) సామాజిక పరిణామం 

      ఇ) భారతీయ సంస్కృతి            ఈ) ఉన్నత శిఖరాలు 

VI) గైహికం (ఇంటిపని)

1. పాఠం ఆధారంగా పుట సంఖ్య 127లోని పట్టికను పూరించండి.

2. ప్రశ్నజవాబులు చదువండి. రాయండి.


VII) పదజాలం 

1. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.

అ) రాజు ధ్యాస అంతా క్రికెట్ ఆటపైనే ఉన్నది.

       ధ్యాస    =  దృష్టి

ఆ) ప్రజ్ఞ, మనోజ్ఞ, ఇద్దరూ సఖ్యతతో మెలుగుతారు. 

       సఖ్యత    =   స్నేహం 

ఇ) ఫల్గుణ్ హస్తవాసి చాలా మంచిది.

       హస్తవాసి   =    చేతి చలువ 

ఈ) తెలంగాణలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ప్రఖ్యాతి చెందింది.

        ప్రఖ్యాతి  =  ప్రసిద్ధి

ఉ) పూర్వ జమీందారుల దేవిడీలలో చర్చా గోష్ఠులు జరిగేవి.

        దేవిడీ  =  పెద్ద భవంతి

VIII) వ్యాకరణాంశాలు :

1. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాలు గుర్తించండి.

 సమాసపదం                            విగ్రహవాక్యo                                     సమాసం పేరు

అ) దశకoఠుడు       -              దశ సంఖ్య గల కంఠములు కలవాడు            బహువ్రీహి సమాసం 

ఆ) పీతాంబరుడు     -              పసుపు పచ్చని అంబరము కలవాడు            బహువ్రీహి సమాసం

ఇ) అరవిందానన     -              అరవిందము వంటి ఆననము కలది              బహువ్రీహి సమాసం

ఈ) మృగనేత్ర         -               మృగము వంటి నేత్రములు కలది                 బహువ్రీహి సమాసం

ఉ) చంచలాక్షి         -               చంచలములైన అక్షులు కలది                      బహువ్రీహి సమాసం

ఊ) మానధనులు    -               అభిమానమే ధనముగా కలవారు                  బహువ్రీహి సమాసం

ఋ) రాజవదన       -               రాజు (చంద్రుని) వంటి వదనము కలది           బహువ్రీహి సమాసం

ౠ) నీరజభవుడు   -              నీరజము (పద్మము) పుట్టుక గలవాడు           బహువ్రీహి సమాసం

2. కింది ప్రత్యక్ష వాక్యాలను పరోక్ష వాక్యాలుగా మార్చండి.

  అ) “ హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్ లో విలీనమైంది” అని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించాడు.                                                                                       (ప్రత్యక్ష వాక్యం)

    జ:   హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్ లో విలీనమైందని సర్దార్ వల్లభాయ్ పటేల్    ప్రకటించాడు.                                                                                       (పరోక్ష వాక్యం)

  ఆ) “తెలుగు కథాసాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కవి నెల్లూరి కేశవస్వామి” అని గూడూరి సీతారాం అన్నాడు.                                                                     (ప్రత్యక్ష వాక్యం)

  జ: తెలుగు కథాసాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కవి నెల్లూరి కేశవస్వామియని   గూడూరి సీతారాం అన్నాడు.                                                                     (పరోక్ష వాక్యం)

 ఇ) “చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుంది” అని డి. రామలింగం పేర్కొన్నాడు.  

                                                                                                      (ప్రత్యక్ష వాక్యం)

   జ: చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుందని డి. రామలింగం పేర్కొన్నాడు.     

                                                                                                       (పరోక్ష వాక్యం)

3. కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చండి.

  అ) పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మసహాని ‘తమస్’ నవలలో చిత్రించాడు. (కర్తరి వాక్యం)

  జ:  పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితులు భీష్మసహానిచే ‘తమస్’ నవలలో చిత్రించబడ్డాయి. (కర్మణి వాక్యం)

  ఆ) హైదరాబాద్ రాష్ట్ర చరిత్రను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేశారు.  (కర్తరి వాక్యం)

  జ:  హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేయబడింది. (కర్మణి వాక్యం)

  ఇ) నెల్లూరి కేశవస్వామిని భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించారు. (కర్తరి వాక్యం)

  జ: నెల్లూరి కేశవస్వామి,భారతదేశం గర్వించదగిన గొప్ప కథకులలో ఒకడిగాకీర్తింపబడ్డాడు (కర్మణి వాక్యం)

 IX) ప్రశ్నలనిధి :

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలల్లో జవాబులు రాయండి.

అ) “ ఒక భాషలోని సాహిత్యం చదవడం ద్వారా నాటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు” దీనిపై మీ అభిప్రాయం రాయండి.

ఆ) తెలంగాణ పలుకుబడులంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు రాయండి.

ఇ) “తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది” అనే వాక్యం ద్వారా మీకేమి అర్థమయిందో వివరించండి.

ఈ) నెల్లూరి కేశవస్వామి ఒక ప్రజాస్వామికవాది. చైతన్యశీలి. ‘దీన్ని సమర్థించడానికి కొన్ని ఉదాహరణలు తెలుపండి. 

ఉ)  హృదయ సంస్కారం అంటే ఏమిటి ?

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) అన్నం మెతుకును చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చును. అట్లే, పుస్తక పరిచయ వ్యాసాన్ని లేదా సమీక్షను చదివితే కూడా ఆ పుస్తకం గురించి ఆమూలాగ్రంగా అర్థం చేసుకోవచ్చు. ఎట్లాగో రాయండి.

ఆ) కేశవస్వామి కథలను గురించి గూడూరి సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా, కేశవస్వామి రచనలను గురించి రాయండి.

X) నికష :

1. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.                                            4మా

ఆ) కేశవస్వామి కథలను గురించి గూడూరి సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా, కేశవస్వామి రచనలను గురించి రాయండి.

2. కింది పదాలకు అర్థాలు రాయండి.                                                                 2మా

     అ) హస్తవాసి                                  ఆ) దేవిడీ  

 3. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాలు గుర్తించండి.                           2మా 

     అ) దశకoఠుడు                               ఆ) పీతాంబరుడు     

4. కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చండి.                                       2మా 

  అ) హైదరాబాద్ రాష్ట్ర చరిత్రను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేశారు.  

  ఆ)  నెల్లూరి కేశవస్వామిని భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu