29, జనవరి 2023, ఆదివారం

2. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు| CBSE 10th Class || 2nd lesson ||

2. ఎవరి భాష వాళ్లకు వినసొంపు 

 I) పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు

  • ఏదైనా ఒక సంఘటనను సంభాషణగా రాయగలగాలి.

  • విద్యార్థులు తమ అనుభవాలను, జ్ఞాపకాలను చక్కగా వివరించడం అలవరచుకోవాలి.

  •  భాషలోని పలుకుబళ్ళు, నుడికారాలు, జాతీయాలు గుర్తించగలగాలి.

  • పసందైన ప్రాంతీయ భాష గురించి మాట్లాడగలగాలి.

  • రచయిత గురించి సొంతమాటల్లో రాయగలగాలి.


II) ముఖ్యపదాలు - అర్థాలు 

  1. ఇగపటు  =   ఇదిగోనండి

  2. పలుకుబడి = మాట తీరు

  3. నుడికారము = మాట సొగసు

  4. వాగ్ధాటి = మాటల జోరు

  5. యాదికి  = గుర్తుకు

  6. ప్రాంతీయ భాష = ప్రాంతములో మాట్లాడు భాష

  7. ఉద్దండ పండితులు= గొప్ప పండితులు

  8. జర్దా, డబ్బీ= తాంబూలంలో వేసుకొనే నల్లపొగాకు ఉన్న చిన్న డబ్బా

  9. గ్రాంథిక భాష = గ్రంథములందలి భాష

10.  మాండలిక భాష = ఆయా మండలాల్లోని వాడుక భాష

11.వ్యవహారికభాష =  వ్యవహారంలోని భాష  (మాట్లాడే భాష)

12.ఉస్తాద్ = గురువు, బోధకుడు

  III) చర్చనీయ అంశాలు :

 1. ఏ ప్రాంతం వాళ్ళ తెలుగు ఆ ప్రాంతం వాళ్లకు ఇంకా మంచిగా ఉంటుంది.

 పాతనీరు పోయి కొత్తనీరు వస్తున్నట్టుగా భాష నిరంతరం మారుతూ ఉంటుంది. అది సహజ లక్షణం. అదే సజీవ లక్షణం. అలాగే ప్రాంతాన్ని బట్టి భాష, యాస మారుతూ ఉంటుంది. ఇది క్రియా రూపాల్లోనే గాక నామవాచాకాల్లో, సంబోధనల్లో, మర్యాదల్లోనూ వైవిధ్యభరితంగా ఉంటుంది. ఒక ప్రాంతంలోని మనుషుల జీవన విధానం, వ్యవహార శైలి, పాలకుల విధానం పరిసర భాష ప్రభావం, అక్కడ ఉత్పత్తులు, వనరుల వినియోగం తదితర అంశాలు భాష స్వరూప స్వభావాలను నిర్ణయిస్తాయి. అదే విధంగా ప్రతి పది మైళ్ళకు భాషలో భేదం ఉంటుంది. భాష పరమార్థం భావ వినిమయమే కాబట్టి ఎక్కడి ప్రాంతం వాళ్ళు అక్కడ మాట్లాడే భాషకు బాగా అలవాటు పడతారు. చెవులకు ఇంపుగా, హృదయాన్ని తాకేటట్లుగా ఉండే ఆ భాష వాళ్ళ రక్తంలో రక్తమై విడదీయరాని గాఢానుబంధాన్ని ఏర్పరుస్తుంది. అందుకే భాష తల్లి వంటిదని గౌరవిస్తూ ఆత్మీయానందాన్ని అనుభవిస్తుంటాం. మనదైన భాష మనకు ఇంపూ, సొంపు. అలవాటులో లేని భాష విన్నప్పుడు అసౌకర్యంగానే కాక విచిత్రంగా అనిపిస్తుంది. అందుకే ఎవరి భాష వాళ్లకు గొప్పదనిపిస్తుంది.  

2. గురుస్థాననీయులు :

  అంటే గురువు స్థానానికి తగినవారు. భారతీయ సంస్కృతిలో  గురువుకు అత్యున్నత స్థానాన్ని ఇచ్చారు. దేవుని కంటె గురువే గొప్పవాడంటాడు కబీరుదాసు. ఎందుకంటే ఆ దేవుడి గురించి చెప్పినవాడు గురువే. మనలోని సృజనకు బీజాలు వేసి, ఉత్తమ గుణాలను పోషించి, చెడును జయింపజేసి జీవితాన్ని జ్ఞానభరితంచేయగల స్వరూపం గురువు. అలాంటి జ్ఞానం, ప్రేరణ, మార్గదర్శనం ఇచ్చే ప్రతి ఒక్కరినీ గురువుతో సమానంగా భావించడం ఉత్తమ సంస్కారం.అలాంటి వారందరూ గురుస్థానీయులే.

౩. గురువులలో ఆశించదగిన ప్రత్యేకతలు :

 గురువంటే సర్వశ్రేష్టుడు. వక్తృత్వం, ధృతి, స్మృతి, కృతి, నమ్రత, ఉత్సాహం, జిజ్ఞాస కలిగిన వాళ్ళు ఉత్తమ గురువులుగా భాసిoచగలరంటారు పెద్దలు. అంటే బయట, మనసులో స్వచ్చంగా ఉండే వాళ్ళు, మంచి జ్ఞానవంతులు, చక్కగా మాట్లాడడంతో పాటు పట్టుదల, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, వినయo, ఉత్సహం, కొత్తవిషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహంతో నిరంతరం కృషి చేసేవాళ్ళు, వాళ్ళ విధులను ఏలోపం లేకుండా నిర్వర్తిస్తే చాలు. పిల్లలంతా ప్రభావితులవుతారు. అంటే 

 అ) ఎప్పుడూ స్వచ్ఛంగా కనిపిస్తుండాలి.

 ఆ) ఏది అడిగినా చక్కగా అర్థమయ్యేటట్లు వివరించాలి.

 ఇ) ప్రేమతో, మంచి మాటలు మాట్లాడాలి.

 ఈ) పట్టుదలతో పనిచేస్తూ విద్యార్థుల్లో ప్రేరణ నింపాలి.

 ఉ) మంచి జ్ఞాపకశక్తి కలిగి విషయాన్ని బోధించాలి. చర్చించాలి.

 ఊ) ఎప్పటికప్పుడు కొత్తదనం ఉట్టిపడేటట్టుగా బోధన నిర్వహించాలి.

 ఋ) ఎప్పుడూ ఉత్సాహంతో ఉండాలి.

 ౠ) కొత్త విషయాలను నేర్చుకునేందుకు తపించాలి.

4. పసందైన ప్రాంతీయ భాష :

  పసందు అంటే బాగా ఇష్టం అని అర్థం. ఏప్రాంతం వాళ్లకు ఆ ప్రాంతంలో మాట్లాడే భాష బాగా నచ్చుతుంది. అలా నచ్చడంలో భాషకు మూలాలైన స్థానిక పదాలు, అన్యభాషా ప్రయోగాలు, పలుకుబడులు, నుడికారాలు, సామెతలు, జాతీయాలు ..... ఇవన్నీ ఎక్కడి వాళ్ళకక్కడ అప్రయత్నంగా తాము మాట్లాడేటప్పుడు భాషలో ప్రయోగించడం వల్ల అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇస్తాయి. అందుకే ప్రాంతీయ భాష ఆయా ప్రాంతాల వారికి పసందుగా ఉంటుంది. 

5. ఏకలవ్య శిష్యుడు : 

 అంటే ఏకలవ్యుని వంటి శిష్యుడు. ద్రోణాచార్యుడు ప్రత్యక్షంగా విద్య నేర్పించకున్నా, అతనినే గురువుగా భావించి, ధనుర్విద్యలోని మెళకువలన్నీ నేర్చుకున్నాడు ఏకలవ్యుడు. అదే విధంగా తమకు అందుబాటులో లేకున్నా కొందరి గొప్ప లక్షణాల గురించి ప్రేరణ పొంది, ఆయా రంగాల్లో కృషిచేసి పేరు సంపాదించుకునేవారు ఏకలవ్య శిష్యుడినని చెప్పుకున్నారు. 

6. పలుకుబడి, నుడికారం, జాతీయాలు భాషకు అలంకారం వంటివి :

 పలుకుబడి అంటే ఒక ప్రాంతంలోని యాసలో ఉపయోగించే పదం. నుడికారం అంటే ఒకప్రాంత ప్రజల అనుభవం నుంచి పుట్టిన మాటచమత్కారం/విశేషపదo. జాతీయం అంటే ఒక మాట ప్రత్యేకమైన అర్థంలో ఉపయోగించడం అన్నమాట.

 భాష కేవలం భావ వినిమయం చేస్తే, అది నిత్య వ్యవహారానికి ఉపయోగపడుతుంది. అదే భాషను మనోరంజకంగా మలచినప్పుడు అది కళగా భాసిస్తుంది. కళాత్మకంగా మాట్లాడడం, రచనలు చేయడం భాషను కళగా నిలబెడుతున్న అంశాలు. ఆ విధంగా భాష కళాత్మకంగా మారాలంటే అది సాధరాణార్థంలో కాకుండా చమత్కారంగా, విశేషార్థం వచ్చేటట్లు, నిగూడార్థం స్ఫురించేటట్లు రచించటం, మాట్లాడటం జరగాలి. అలా జరగడానికి  దోహదం చేసే  అంశాలే పలుకుబళ్ళు, నుడికారాలు, జాతీయాలు. అందుకే అవి భాషకు అలంకారం వంటివి.  

 IV) పాఠ్యపుస్తకములోని ప్రశ్నలు - జవాబులు

 1. మనుమరాలు మాట విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు?

 జ: రచయిత సామల సదాశివ గారి మనుమరాలు  లావణ్యకి అప్పుడు నాలుగేళ్లు. ఆమెకు తెలుగు రాదు. తెలుగు మాటలను హిందీలోకి అనువదించుకొని మాట్లాడుతుంది. ఆమెకు తెలుగు పలుకుబడి, నుడికారం తెలియదు.

  అలా నాలుగేళ్లు పూర్తిగా నిండని రచయిత మనుమరాలు లావణ్య “ తాతా ! ఇగపటు నీ పాను, జర్దా డబ్బీ” అని, సదాశివ గారికి వాటిని తెచ్చి ఇచ్చింది. లావణ్య “ ఇగపటు” అనగా, ఇదిగోనండీ అని అర్థం వచ్చేలా, ఆ ప్రాంతపు తెలుగులో మాట్లాడింది. తీయని ఆ ప్రాంతం తెలుగు, తన మనుమరాలికి పట్టువడినందుకు సదాశివ గారు అబ్బురపడ్డారు.

2. కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారిని రచయిత గురుస్థానీయులుగా ఎందుకు భావించారో వివరించండి. 

జ: కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందిన మహాపండితులు. ఈయన సంస్కృతాంధ్ర భాషల్లో, కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు. సామల సదాశివ గారు, లక్ష్మణశాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేయకున్నా, వారి సన్నిధానంలో కూర్చుండి, తరచుగా జాబులు రాస్తూ, వారి దగ్గర అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నారు. అందుకే సదాశివ గారు లక్ష్మణశాస్త్రి గారిని గురుస్థానీయులుగా భావించారు.

3. అందరు యునివర్సిటీ ఆచార్యులుండగా “ ఒక రిటైర్డ్ రెవెనన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడమేమిటి ?” అని రచయిత అనుకోవడంలో ఉద్దేశమేమై ఉంటుంది? 

జ: ఒకసారి సామల సదాశివగారు, కాళోజి వర్ధంతి సభలో పాల్గొన్నారు. ఆ సాహిత్య సభకు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ సభలో ఎందరో తెలుగు విద్వాంసులున్నారు. ఎందరో యూనివర్సిటీ ఆచార్యులున్నారు. అంతమంది తెలుగు సాహిత్య పండితులున్న సభకు, ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడానికి కారణం ఏమై ఉంటుందా అని సదాశివగారు ఆలోచించారు. బహుశః కాళోజీలకు ఆ రెవెన్యూ ఆఫీసర్ స్నేహితుడేమో అని సదాశివగారు మొదట భావించారు. కాని ఆ అధ్యక్షుడైన రెవెన్యూ ఆఫీసర్ వరంగల్లు ప్రాంతీయ తెలుగులో సంస్కృత పదాలు ఎక్కువగా వాడకుండా, ఇంగ్లీషు, ఉర్దూ పదాల జోలికి వెళ్ళకుండా చక్కగా మాట్లాడాడు. అప్పుడు సదాశివగారికి ఆయనను ఎందుకు అధ్యక్షుణిగా ఎన్నుకున్నారో తెలిసింది.  యూనివర్సిటీ ఆచార్యులు, రెవెన్యూ ఆఫీసర్ కన్నా బాగా తెలుగు మాట్లాడతారని సదాశివగారి ఉద్దేశం.

4. రచయిత రచన శైలిని ప్రశంసిస్తూ రాయండి.

 సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లాకు చెందినవారు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, మరాఠీ భాషల్లో పండితుడు. సహృదయ విమర్శకుడు. ఈయన రచన సరళంగా, మనసుకు హత్తుకు పోయేటట్లు ఉంటుంది.

  సదాశివగారి వ్యాసశైలి సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఈ వ్యాసంలో ఆయన స్వీయ అనుభూతులను గుర్తుచేసుకుంటూ, తెలంగాణమాండలికంలోని తీయని తెలుగును గురించి చక్కగా వివరించారు. వీరి రచన చదువుతూ ఉంటే ఒక పుస్తకం చదువుతున్నట్టు కాక, ఆత్మీయుడైన మిత్రునితో మాట్లాడుతున్నంత హాయిగా ఉంటుంది. 

వ్యాసరూప సమాధాన ప్రశ్న :

1. ఈ పాఠం ఆధారంగా సామల సదాశివ గురించి మీకేమి అర్థమయిందో రాయండి.

జ:  సామల సదాశివ తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ సాహితీవేత్త.

     తెలుగు, సంస్కృతo, హిందీ, ఉర్దూ, మరాఠీ భాషల్లో పండితుడు.

ఉర్దూ సాహిత్య చరిత్ర , అమ్జద్ రుబాయిలు, మలయమారుతాలు, సంగీత శిఖరాలు, స్వరలయలు మొదలైన రచనలు వీరికి సంగీత సాహిత్యాలలో గల పట్టును తెలియజేస్తున్నాయి. వీరి ‘యాది’ గ్రంథం ఎంతో జనాదరణ పొందింది. సదాశివ గారికి కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు గురుస్థానీయులు. సదాశివగారు శాస్త్రిగారి వద్ద కూర్చుండి, తరచుగా జాబులు రాసేవారు. ఆయన నుండి ఎన్నో సాహిత్య విషయాలు వీరు తెలుసుకున్నారు. సదాశివగారు వేలూరి వారికి ఏకలవ్య శిష్యులు. అన్ని ప్రాంతాల తెలుగు పలుకుబళ్ళనూ, ఇప్పుడు తెలుగు అనుకుంటున్న భాషలో కలుపుకోవాలని సదాశివగారి అభిప్రాయం. ఆడవాళ్ళ నోటనే అసలైన భాష వినిపిస్తుందని సదాశివగారి తలంపు. సదాశివగారు ఉర్దూలో కూడా మాట్లాడగలరు.  సదాశివగారి తెలుగు వ్యాసాలను ఆంధ్రాప్రాంతం వారు కూడా మెచ్చుకునేవారు. 

V) పదజాలం 

1. కింది పదాలను సొంతవాక్యాలలో ప్రయోగించండి.

 అ)  పసందు = మా అమ్మ చేసిన ఉగాది పచ్చడి పసందుగా ఉంది.

 ఆ) రమ్యం = మా బడిలో పూలతోటలు రమ్యంగా ఉన్నాయి.   

 ఇ) క్షేత్రం = దక్షిణాది పుణ్యక్షేత్రాలలో యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రo విశిష్టమైనది.

2. నిఘంటువు సహాయంతో కింది పదాలకు నానార్థాలు రాయండి.

  అ) కవి :       కావ్యమురాసినవాడు,   శుక్రుడు,    నీటికాకి

  ఆ) క్షేత్రం :   పుణ్యస్థలం,     భార్య,     వరిమడి 

3. కింది పర్యయపదాలకు పాఠం ఆధారంగా సరియైన పదాన్ని రాయండి.

  అ) ఇల్లు,  గృహం  =  సదనం 

  ఆ) పొగడ్త, స్తోత్రం  =  ప్రశంస 


4. ప్రకృతి – వికృతులు

అ)  భాష -  బాస

ఆ) కవిత - కైత

ఇ) కథ -  కత

ఈ) స్త్రీ – ఇంతి

5. కింది వ్యుత్పత్త్యర్థాలకు పదాలను రాయండి.

 అ) అజ్ఞానమనెడు అంధకారాన్ని తొలగించువాడు : గురువు 

 ఆ) భాషించునది : భాష 

VI) వ్యాకరణాంశాలు 

1. కింది వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చండి.

  అ) తిరుమల రామచంద్రగారు సంస్కృత, ఆంధ్రభాషలలో పండితుడు.

   జ: తిరుమల రామచంద్రగారు సంస్కృత భాషలో పండితుడు.

       తిరుమల రామచంద్రగారు ఆంధ్రభాషలో పండితుడు.

 ఆ) నేనొకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.

     జ:  నేనొకప్పుడు పుస్తకాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.

     జ:  నేనొకప్పుడు వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.

2. కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి. 

  అ) తెలుగువాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి. వాటిని మనం భద్రపరుచుకోవడం    లేదు.

జ: తెలుగువాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి కాని వాటిని మనం భద్రపరుచుకోవడం    లేదు.

 ఆ) నల్గొండ జిల్లాలో ఎందరో కవులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో కథకులూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో పత్రికా విలేఖరులు ఉన్నారు.

  జ: నల్గొండ జిల్లాలో ఎందరో కవులు, కథకులూ పత్రికా విలేఖరులు ఉన్నారు.

ఇ) నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. నమాజు చదివి ఎందరో పోతుంటారు.

  జ: నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. పోతుంటారు.

3. కింది వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి.

 అ) అంబటి వెంకటరత్నం కావ్యం రాశాడు. అంబటి వెంకటరత్నం అచ్చు వేయించాడు.

 జ:  అంబటి వెంకటరత్నం కావ్యం రాసి,అచ్చు వేయించాడు.

 ఆ) గడియారం రామకృష్ణశర్మ మంచి పాండిత్యం సంపాదించాడు. గడియారం రామకృష్ణశర్మ అనేక సన్మానాలు     పొందాడు.

 జ: గడియారం రామకృష్ణశర్మ మంచి పాండిత్యం సంపాదించి, అనేక సన్మానాలు పొందాడు.

ఇ) కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు. కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించాడు.

 జ: కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించి, ప్రచురించాడు.


 VII) తరగతి పుస్తకములో రాయవలసిన అంశాలు

 1. మీ ప్రాథమిక విద్యాభ్యాస జీవితంలో మీరు మరచిపోలేని జ్ఞాపకాలను ఒక వ్యాసంగా రాయండి

 2. మీ పరిసరాల్లో జరిగిన ఏదైనా సంఘటనను వాడుకభాషలో సంభాషణగా రాయండి.

 VIII) గైహికము (ఇంటిపని)

1. పుటసంఖ్య 20, 21 లోని గద్యాంశాలను చదివి, జవాబులను రాయండి.

2. ఈ పాఠంలోని  ప్రశ్న జవాబులు చదివి రాయండి.

IX) అదనపుసమాచారం

1. పాఠము  చదువండి. ముఖ్యాంశాలను గుర్తించి రాయండి.

2. పాఠ్యభాగ ముఖ్యాంశాలను గురించి చర్చించండి.

3. పాఠంలోని వ్యాకరణాంశాలు గుర్తించి రాయండి.

X) ప్రశ్నాపత్రం 

1. ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.                                       5మా 

  అ) మనుమరాలు మాట విని తాతయ్య ఎందుకు అబ్బుర పడ్డాడు?

  ఆ) రచయిత రచన శైలిని ప్రశంసిస్తూ రాయండి.

2. ఈ కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి.                                       2 మా 

   అ) పసందు                            ఆ) క్షేత్రం

3. రుగాగమ సంధి సూత్రం రాసి, ఉదాహరణ రాయండి                              2మా 

 4. కింది వాక్యాన్ని సామాన్య వాక్యoగా మార్చoడి.                                   1మా 

  అ) తిరుమల రామచంద్రగారు సంస్కృత, ఆంధ్రభాషలలో పండితుడు.






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu