29, జనవరి 2023, ఆదివారం

3. వీర తెలంగాణ || 10th Class Telugu || Notes || Study material ||

3. వీర తెలంగాణ

పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు 

  • తెలంగాణ రాష్ట్రం గురించి సొంతమాటల్లో చెప్పగలగాలి. రాయగలగాలి

  • చుక్కపద్యాలు కంఠస్థo చేసి ప్రతిపదార్థాలు రాయగలగాలి.

  • అపరిచిత కవితను చదివి జవాబులు రాయగలగాలి.

  • పదజాలం, వ్యాకరణాంశాలపై చర్చించగలగాలి.

ముఖ్య పదాలు – అర్థాలు 

మహా రవమ్ములు = గొప్పవైన ధ్వనులు 

కృపాణము = కత్తి 

జలధి = సముద్రం 

తెలుగు జెండాలు = తెలుగు వీరుల జయ పతాకాలు 

పథం =మార్గం 

శ్రావణాభ్రము =శ్రావణ మాసంలోని మేఘం 

అట్టహాసము = పెద్దనవ్వు 

లంఘించి =దాటి

చర్చనీయ అంశాలు 

1. బతుకు తోవ చూపే కాలం రావడం :

  బతకడానికి ఆధారాన్ని, బతుకుకు ఆధారమైన మార్గాన్ని బతుకుబాట లేదా బతుకు తోవ అంటారు. తెలంగాణలో సామాన్యులు తమ దారిలో తాము సంపాదించుకునే అవకాశాల్లేవు. అలాంటి పరిస్థితుల్లో నిజాంరాష్ట్ర  (తెలంగాణ) విముక్తి పోరాటం సాగింది. రాష్ట్రం స్వతంత్రమై ప్రజలు ఎవరి బతుకు వాళ్ళు బతకగలిగే పరిస్థితులేర్పడ్డాయి. ఈ కాలం/ పరిస్థితుల గురించి చెబుతూ బతుకు తోవ చూపే కాలం వచ్చింది అని అన్నారు కవి.మరొక అర్థంలో చచ్చే కాలం పోయి బతికే కాలం వచ్చిందని భావం. 

2. గడ్డిపోచ కత్తిగా మారడం :

  సాధారణంగా ‘గడ్డిపోచ’ అనే మాట తేలికైనది, పనికిరానిది, అల్పమైనది అనే అర్థంలో వాడుతారు. తెలంగాణలోని గడ్డిపోచలు కూడా ఖడ్గాలు ధరించి  యుద్ధరంగంలోకి దిగాయని దాశరథి పేర్కొనడంలో ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ నివసించే అల్పులు అంటే స్త్రీలు, బాలురు, వృద్ధులు, బలహీనులు కూడా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. వాళ్లు కత్తులుగా మారి యుద్ధంలోకి దూకారని చెప్పడమే.

3. తెలంగాణ నేలలో కాంతి :

  ‘తెలుగు రేగడిలో జిగిమెండు’ అన్నది దాశరథి ప్రయోగం. అంటే తెలంగాణ నేలలో కాంతి అధికం. అంటే ఇక్కడ నివసించే వాళ్లలో తేజస్సు, ఉత్సాహం, బుద్ధి మొదలైనవి ఎక్కువ అని అర్థం. అయితే రేగడిలో ‘జిగి’ అనే ప్రయోగం చేయడం వల్ల ఈ ‘జిగి’ కాంతికి పర్యాయపదంగా కాక పట్టుదలకు ప్రతీకగా భావించవలసి ఉంటుంది. రేగడినేల సహజంగా ‘జిగి’ అంటే పట్టుగలిగి ఉంటుంది. అంటే ఇక్కడి వాళ్లలో పట్టుదల ఎక్కువ అని చెప్పడం కవి ఉద్దేశం. 

4. నవోదయం రావడమంటే : 

   కొత్త ఉదయం అనేది ప్రతినిత్యం ఉండేదే. అయితే ప్రతిరోజు చీకటి వస్తుంది. ఆ చీకటిని చీలుస్తూ కొత్త వెలుగు ప్రతిరోజూ వస్తూనే ఉంటుంది.ఇక్కడ చీకటి ఒక్క నాటిది కాదు. తరతరాలుగా పట్టిపీడించిన దుష్పరిపాలన అనే చీకటి తొలిగిపోయి కొత్త ఉదయం వచ్చిందని చెప్పడo కవి గారి ఉద్దేశం.  

5. తెలంగాణ వీరుల ప్రత్యేకత :

  తెలంగాణ వీరులు ఆగని తమ పోరాట పటిమతో స్వాతంత్ర్యమనే సూర్యుడిని పిలిచి, ఈ నేల అంతటా కాంతి సముద్రాలు ఉప్పొంగేటట్లు చేశారు. కాంతి సర్వత్రా నిండేది. అది సముద్రమైనప్పుడు అణువణువునూ తడుపుతుంది. ఈ ప్రయోగం చేయడం వల్ల దాశరథి స్వాతంత్ర్యo గొప్పతనాన్ని, తెలంగాణ దాన్ని అనుభవించిన విధానాన్ని చాలా నిండుగా వర్ణించాడు. ఇది సాధించిన వీరుల గొప్పతనం చెప్పకనే చెప్పాడు. అంతేకాదు ఇక్కడి వీరులు సామాన్యులు కారు. మత పిశాచం కోరలు సాచి భయంకరంగా  విజృంభిస్తున్న సమయంలో, అది భయంకరంగా గొంతులు కోస్తున్నా, దిక్కుతోచని పరిస్థితులు దాపురించినా, బతకడమే కష్టమైనా తమ తెలుగుదనాన్ని కాపాడుకుంటూ విజయం సాధించిన వీరపుత్రులు వీళ్లు. 

1. “ తెలంగాణ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాలవరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకొన్నాయి” అన్న కవి మాటలను మీరెట్లా సమర్థిస్తారు?

జ: తెలంగాణ ప్రాంతాన్ని చాలా కాలం నిజాం నవాబులు పరిపాలించారు. కులీకుతుబ్ షా వంశస్థులు గోలకొండ కోటను కేంద్రంగా చేసుకొని తెలంగాణను పరిపాలించారు. క్రీ.శ.1687లో ఢిల్లీ చక్రవర్తి ఔరంగజేబు, గోలకొండ కోటను సర్వనాశనం చేసి, తెలంగాణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

   నవాబులు ఇక్కడి ప్రజలను పీడించి పన్నులు వసులు చేసి గోలకొండ పట్టణాభివృద్ధికి, వారి విలాసాలకూ, వైబోగాలకూ ఖర్చు చేశారు. ఔరంగజేబుకు ప్రతినిధులుగా ఈ ప్రాంతాన్ని పాలించినవారు కూడా, దుర్మార్గులై ప్రజల్ని పీడించారు. ప్రజలకు దేనికి స్వాతంత్ర్యం లేకపోయింది. అధికారులకు కాల్మొక్కుతూ, బానిసల్ల ప్రజలు ఉండిపోయారు. ప్రజలకు వ్యవసాయానికి సాగునీరు, తాగడానికి మంచినీరు కూడా లేదు. ప్రజలకు విద్యా వైద్య రవాణా సదుపాయాలు సమకూర్చబడలేదు.

  కాబట్టి కాకతీయ చక్రవర్తులు వంటి తెలంగాణ ప్రభువులు చేసిన సత్కార్యాలు కూడా, సుల్తానుల పాలనలో దుర్మార్గుల చేతుల్లో చిక్కుకున్నాయనే మాట నిజం.

2. ‘తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము’ అని దాశరథి ఎందుకన్నాడు?

 జ: తెలంగాణలో ప్రజలు నైజాంపాలనలో రజాకార్ల చేతిలో ఎన్నో కష్టాలు పడ్డారు. దానితో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి తెలంగాణ పౌరుడు, తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్నారు. చెరసాలలో బందింపబడ్డారు. కొందరు ప్రాణాలు వదిలారు. తెలంగాణ విముక్తి పోరాటంలో గడ్డిపోచవంటి అల్పులు సైతం, ప్రాణాలకు తెగించి నైజాం చక్రవర్తికి వ్యతిరేకంగా పోరాడారు. 

    అందుకే దాశరథి “గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము” అని అన్నాడు.    

3.తెలంగాణలో సంధ్యాభానువు మొదటిసారి ఉదయించిండని కవి ఎందుకన్నాడు ?

జ: సంధ్యా భానువు అంటే తొలిసంధ్య వేళ ఉదయించే సూర్యుడు.  తెలంగాణలో కాకతీయుల పాలన అంతరించిన తరువాత దుర్మార్గులైన నవాబుల పాలనలో ఉండిపోయింది. దానితో తెలంగాణ గొప్పతనం, విశేషాలు చాలా కాలం ఆ తురుష్కుల చేతుల్లో చిక్కుకున్నాయి. తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగు రేఖలు లేకుండా పోయాయి.

   1948లో నైజాం ప్రభుత్వం పోయి, తెలంగాణ రాష్ట్రం స్వతంత్రమైంది. తెలంగాణ రాజ్యం, భారత యూనియన్ లో కలిసింది. ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. విచ్చుకున్న మెరుపు తీగల కాంతి రేఖలు ప్రజలకు బతికే దారిని చూపెట్టాయి. అందుకే కవి స్వచ్ఛమైన కాంతివంతమైన సంధ్యా సూర్యుడు మొదటగా ఉదయించాడని చెప్పాడు. తెలంగాణ ప్రజల జీవితాల్లో ఉదయభానుని కాంతి, మొదటిసారిగా వెలుగులను తెచ్చిందని భావం. 

4.  ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి రచనా శైలిని అభినందిస్తూ రాయండి.

 జ: ‘వీర తెలంగాణ’ అనే పద్య ఖండికను, దాశరథి కృష్ణమాచార్య రచించారు. దాశరథిగారు మహాకవి. ఈయన ప్రత్యక్షంగా తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్నవాడు. సాటి వీరుల సాహసాలను, ఈ పద్యాలలో అద్భుతంగా ప్రశంసించారు. తెలంగాణను ‘వీరమాత’ అని పొగిడాడు.  

     దాశరథి,తెలంగాణ వీరుల త్యాగాలను, చరిత్ర పుటల్లోకి ఎక్కించి, భావి తరాలకు మంచి స్ఫూర్తిని నింపాడు. దాశరథి అక్షరానికి ఆవేశాన్ని తొడిగి, అభ్యుదయ మార్గంలో తన కవిత్వాన్ని నడిపాడు. సున్నితమైన భావుకతతో ప్రాచీనపద్యశైలితో, ప్రజల హృదయాలను ఆకట్టుకున్నాడు. ఈయన సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి.

    తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరునూ, వారి మహోన్నత త్యాగాల తీరునూ, దాశరథి ఈ పద్యాల్లో ప్రదర్శించాడు. దాశరథి పద్యాలు వరద గోదావరిలా, ఆవేశంతో, వీర రసోద్రేకంతో, తెలంగాణ మాతృ సంకీర్తనతో, రసవంతంగా సాగాయి. 

ఆ) ఈ కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

  1. వీర తెలంగాణ పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.

  జ: తెలంగాణ ఊదిన శంఖ ధ్వనులు, భూమండలం అంతా ప్రతిధ్వనించాయి. ఉదయ భానుడి కిరణాలచే ప్రీతిపొందిన పద్మాలు, ఆకాశగంగా తరంగాలు, అన్ని దిక్కులను తెల్లవారేటట్లు చేశాయి. తెలంగాణ గొప్పతనం విశేషాలు, చాలా కాలం పాటు దుర్మార్గుల చేతుల్లో చిక్కుకొన్నాయి. ఇప్పుడు ఆ అడ్డంకులు పోయి, సంధ్యా సూర్యుడు మొదటిసారిగా, ఉదయించాడు.  

   తెలుగు నేల ఎంతో జిగి కలది. తెలంగాణ తల్లి, కోటిమంది పిల్లల్ని పెంచి, వారి చేతికి కత్తులిచ్చి, నైజాం నవాబుతో పోరాడమంది. నాడు తెలంగాణాలో గడ్డిపోచ కూడా, కత్తిపట్టి ఎదిరించింది. రాజు గర్వం అణచేలా యుద్ధం సాగించింది. దిగంతాలలో ఇంద్రధనుస్సులు సయ్యాటలాడాయి. 

  తెలంగాణ స్వాతంత్ర్యపోరాటం సముద్రంలా ఉప్పొంగింది. నేడు తెలంగాణ నేలను, స్వాతంత్య్రం నీటితో వీరులు తడుపుతున్నారు. నవాబు ఆజ్ఞలకు కాలం చెల్లింది. తెలంగాణ పిల్లలలోని విప్లవ చైతన్యం, భూమండలాన్ని అంతా సవరించింది. తెలుగు వీరులు, యోధులు, పరోపకారులు.

   మతపిశాచి తన కోరలతో తెలంగాణ ప్రజల గొంతులు కోస్తున్నప్పుడూ, వారికి దిక్కు తోచనప్పుడూ, బతుకు భారమైనప్పుడు కూడా, తెలంగాణ ప్రజలు తెలుగుదనాన్ని కోల్పోలేదు. యుద్ధంలో రుద్రాదులు మెచ్చుకొనేటట్లు వారు విజయం సాధించారు.  

కాకతీయుల కంచు గంట మ్రోగినపుడు, శత్రువులు కలవరపడ్డారు. రుద్రమదేవి కాలంలో, తెలుగు జెండాలు ఆకాశంలో రెపరెపలాడాయి. కాపయ్య నాయకుని విజృంభణకు, శత్రువుల గుండెలు ఆగిపోయాయి. చాళుక్య రాజుల కాలంలో కళ్యాణ ఘంటలు మ్రోగాయి. నాటి నుండి నేటి వరకు తెలంగాణ శత్రువుల దొంగ దెబ్బకు ఓడిపోలేదు. శ్రావణ మేఘంలా గర్జిస్తూ ముందుకు సాగుతోంది.

కంఠస్థ పద్యాలు  :

1. తల్లీ! నీ ప్రతిభా విశేషములు భూతప్రేత హస్తమ్ములన్

   డుల్లెన్ కొన్ని తరాలదాక ! ఇప్పుడడ్డుల్ వోయె ; సౌదామినీ 

    వల్లీ ఫుల్లవిభావళుల్ బ్రతుకు త్రోవల్ జూపు కాలమ్మునన్

    మళ్ళేన్! స్వచ్ఛతరోజ్జ్వల ప్రథమ సంధ్యాభానువేతెంచెడిన్

  ప్రతిపదార్థం :

 తల్లీ                        =      ఓ తెలంగాణ తల్లీ

 నీ ప్రతిభా విశేషములు  ;

 నీ                           =   నీ యొక్క 

ప్రతిభా విశేషములు       =  ప్రజ్ఞా విశేషాలు 

కొన్ని తరాలదాక          = కొన్నితరముల వరకు 

భూతప్రేత హస్తమ్ములన్  

భూతప్రేత                  =  దెయ్యాలు పిశాచాలు వంటి (చెడు శక్తుల) 

హస్తమ్ములన్             =  చేతులలో

డుల్లెన్                     =  నాశనమై పోయినవి ( చిక్కుకున్నవి )

 ఇప్పుడు                 =  ఇప్పుడు

అడ్డుల్                     =  ఆటంకాలు 

పోయెన్                   = తొలిగిపోయాయి

 

సౌదామినీ వల్లీ ఫుల్లవిభావళుల్ ;

సౌదామినీ వల్లీ            =  తీగల వంటి మెరుపుల యొక్క

 విభావళుల్               =  కాంతుల వరుసలు 

  బ్రతుకు త్రోవల్           =  బ్రతుకు దారులను 

 చూపు                      =  చూపించే 

కాలమ్మునన్                =  సమయములునూ 

    మళ్ళేన్                  =  తిరిగి వచ్చాయి

2. నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్

    ప్రాయము వచ్చినంతనె కృపాణములిచ్చితి, యుద్ధ మాడి వా 

    జ్రేయ భుజాబలమ్ము దరిసింప జగమ్ము, నవాబుతో సవాల్ 

    చేయుమంటి; వీ తెలుగు రేగడిలో జిగి మెండు మాతరో!

  ప్రతిపదార్థం :

 మాతరో           =    ఓ తెలంగాణ తల్లీ!

 నీ యొడిలోనన్ 

నీ                   =   నీ యొక్క 

ఒడిలోనన్         =  ఒడిలో 

కోటి తెలుంగు కుర్రలన్ 

కోటి                =  కోటి సంఖ్య గల 

తెలుంగు కుర్రలన్  = తెలుగు పిల్లలను 

నిండుగన్           =   సంపూర్ణంగా ( సంతోషిoచేటట్లుగా )

పెంచితివి            =  పెంచావు  ( పోషించావు)

ప్రాయము           = యౌవనం 

వచ్చినంతనే         =  రాగానే 

కృపాణములు       = కత్తులు 

ఇచ్చితి               = ఇచ్చావు

యుద్ధమాడి

యుద్ధము +  ఆడి  =  యుద్ధం చేసి 

జగమ్ము              =  లోకం  

వాజ్రేయ              = వజ్రమువలె కఠినమైన 

భుజాబలమ్ము       = వారి భుజ, బల పరాక్రమాలను 

 దరిసింపన్           చూచేటట్లు 

నవాబుతో               =   నైజాం నవాబుతో

 సవాల్ చేయుమంటివి   

 సవాల్ చేయుము     =  ప్రశ్నించుము ( ఎదిరించుము)

అంటివి                   = అని అన్నావు 

ఈ తెలుగు రేగడిలో      = ఈ తెలంగాణ బంకమన్నులో ( ఈ తెలుగు నేలలో)

జిగి                         =   వన్నె (బలము)  (కాంతి)

మెండు                    =  అధికం

3. తెలగాణమ్మున గడ్డిపోచయును సంధిoచెన్ కృపాణమ్ము ! రా 

   జలలాముం  డనువాని పీచమడచన్ సాగించె యుద్ధమ్ము ! భీ

    తిలిపోయెన్ జగమెల్ల యేమియగునో తెల్యంగరాకన్ ! దిశాం 

    చలమున్ శక్రధనుఃపరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్ 

  ప్రతిపదార్థం :

  తెలగాణమ్మున             =      ఈ తెలంగాణలో 

  గడ్డిపోచయును             = గడ్డిపోచకూడా ! ( గడ్డి పరక వంటి అల్పుడు కూడా) 

  కృపాణమ్మున్               =  కత్తిని 

  సంధిoచెన్                    =  చేత పట్టింది ; ( కత్తిపట్టి ఎదిరించిది )

  రాజలలాముండు           = రాజ శ్రేష్టుడు  

అనువాని                        = అని పేరు పొందిన నిజాం నవాబు యొక్క 

పీచము                         =  గర్వము 

అడచన్                        =  అణచడానికి

 యుద్ధమ్మున్                 =యుద్ధాన్ని ( పోరాటమును)

 సాగించెన్                       =  సాగించింది 

  యేమియగునో

ఏమి + అగునో                    =  ఏమి అవుతుందో 

 తెల్యంగరాకన్                    =    తెలియకపోవడం వల్ల 

జగమెల్ల

జగము + ఎల్లా                   =    లోకం అంతా 

 భీతిలిపోయెన్                    =  భయపడిపోయింది

 దిశాంచలమున్                   

 దిశా  +  అంచలముల్              = దిక్కుల చివరలు 

శక్రధనుఃపరంపరలతోన్ ;

శక్రధనుః                             =    ఇంద్రధనుస్సు యొక్క

 పరంపరలతోన్                     =  ఎడతెగని వరుసలతో

సయ్యాటలాడెన్                     =  కూడియాడాయి

 

4.  తెలగాణా ! భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సం

      చలనమ్మూరక పోవలేదు! వసుధా చక్రమ్ము సారించి ఉ 

      జ్జ్వల వైభాతిక భానునిన్ పిలిచి దేశంబoతటన్ కాంతి వా  

      ర్ధులు నిండిoచిరి, వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్ బళా!

  ప్రతిపదార్థం :

   తెలగాణా                 =      ఓ తెలంగాణమా !

భవదీయ పుత్రకులలో; 

భవదీయ                   = నీ యొక్క 

 పుత్రకులలో              =  పిల్లలలో

తీండ్రించు                  = ప్రకాశించే  ( ప్రజ్వలించే ) 

వైప్లవ్యసంచలనమ్మూరక

వైప్లవ్య                      = విప్లవాత్మకమైన

సంచలనమ్ము             = కదలిక 

ఊరక                       = ఊరికే ( వ్యర్థముగా) 

  పోవలేదు                 =  పోలేదు

తెల్గుజోదుల్              =  తెలుగు యోధులు 

వసుధా చక్రమ్ము         = భూమండలాన్ని అంతా 

సారించి                    =  సవరించి (సరిచేసి)

ఉజ్జ్వల వైభాతిక భానునిన్

ఉజ్జ్వల                    =  ప్రకాశించునట్టి 

వైభాతిక                   = ప్రభాతకాలమునకు సంబంధించిన  (ఉదయ కాలపు)

భానునిన్                 =  సూర్యుని 

పిలిచి                     = పిలిచి (ఆహ్వానించి) 

దేశంబoతటన్

దేశంబు + అంతటన్        =  దేశమంతా

కాంతి వార్ధులు             =  కాంతి సముద్రాలు 

నిండిoచిరి                   = నింపారు

బళా                         =  ఆహా!

వీరు                          =  నీ పుత్రులైన వీరు 

వీరులు                      = శూరులు 

పరార్థుల్

పర + అర్థుల్                =   పరోపకారులు

 పదజాలం 

1. ఈ కింది వాక్యాలు చదువండి. గీతగీసిన పదాల అర్థాలనుపయోగించి సొంతవాక్యాలు రాయండి.

  అ) గాలికి ఊగుతున్న పువ్వులు చిగురుటాకులతో సయ్యాటలాడుచున్నాయి.

    జ: సయ్యాటలాడు    =  సహక్రీడించు

    వాక్య ప్రయోగం : బాలల దినోత్సవం నాడు, పాఠశాలలో బాలబాలికలు కూడి ఆడుతున్నారు.

ఆ) స్వాతంత్ర్యోద్యమం బ్రిటిష్ వారి గుండెల్లో కల్లోలం రేపింది.

  జ: కల్లోలం   =  పెద్దతరంగం

 వాక్య ప్రయోగం :  తెలంగాణ పోరాటం, కేంద్రప్రభుత్వం గుండెల్లో పెద్ద తరంగాలను రేపింది.

ఇ) వీరులెప్పుడూ ప్రాణాలను అర్పించడానికి వెనుకాడరు.

     వెనుకాడరు      =  జంకరు, వెనుకంజ వేయరు 

    వాక్య ప్రయోగం :  వీర తెలంగాణ పోరాటంలో యువత ముందుకు దూకడానికి,  వెనుకంజ వేయరు.

ఈ) దిక్కు తోచనప్పుడు అయోమయంలో పడుతాం.

     దిక్కు తోచనప్పుడు        =  దారి తెలియనప్పుడు 

     వాక్య ప్రయోగం : పిల్లలు ఏమి చేయడానికి దారి దొరకనప్పుడు, పెద్దల వైపు చూస్తారు.

2. కింది పదాలకు నానార్థాలురాయండి.

  అ)  ఉదయము   :   ఉదయించడం,  తూర్పు కొండ,  పుట్టుక,  సృష్టి 

  ఆ)ఆశ             :   కోరిక,      దిక్కు 

  ఇ) అభ్రము       :  మేఘం,     ఆకాశo,   స్వర్గం,    కర్పూరం 

3. పర్యాయపదాలు

  అ) రవము        :  ధ్వని,    రొద,   చప్పుడు 

  ఆ) కృపాణము    : ఖడ్గం,  కత్తి,    అసి,    కరవాలం 

  ఇ) జలధి          :  సముద్రం,   సాగరం,  పయోధి,   అబ్ధి

  ఈ) జెండా         :  పతాకం,  కేతనం 

  ఉ) లంఘించు    :  దాటు,       దుముకు

వ్యాకరణాంశాలు

1. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

   అ)  జగమెల్ల             =  జగము    +    ఎల్ల         -  ఉకారసంధి 

   ఆ)  సయ్యాటలాడెన్     =  సయ్యాటలు  +   ఆడెన్   -  ఉకారసంధి

   ఇ) దారినిచ్చిరి           =   దారిని   +  ఇచ్చిరి        -  ఇకారసంధి

   ఈ) ధరాతలమెల్ల        =  ధరాతలము + ఎల్ల         -  ఉకారసంధి

   ఉ) దిశాంచలము        =  దిశా    +  అంచలము     -  సవర్ణదీర్ఘ సంధి

   ఊ) శ్రావణాభ్రము        = శ్రావణ  +  అభ్రము          -  సవర్ణదీర్ఘ సంధి

   ఋ) మేనత్త              =  మేన   +   అత్త             -  అకారసంధి

2. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి.

    అ)  కాకతీయుల కంచు గంట  =    కాకతీయుల యొక్క కంచు గంట - షష్టీ తత్పురుష సమాసం 

    ఆ)  కళ్యాణ ఘంటలు         = కళ్యాణము కొరకు ఘంటలు    -      చతుర్థీ తత్పురుష సమాసం

    ఇ) బ్రతుకు త్రోవ              = బ్రతుకునకు త్రోవ             -       షష్టీ తత్పురుష సమాసం

    ఈ) మహారవము            =  గొప్పదైన రవము            -  విశేషణ పూర్వపద కర్మధారయసమాసం

    ఉ) వికారదంష్ట్రలు           = వికారమైనదంష్ట్రలు           -  విశేషణ పూర్వపద కర్మధారయసమాసం

    ఊ) కాంతివార్ధులు          = కాంతులు అనే వార్ధులు      -  రూపకం సమాసం

    ఋ) తెలంగాణరాష్ట్రం        = తెలంగాణ అనే పేరుగల రాష్ట్రం  -  సంభావనా పూర్వపద కర్మధారయసమాసం

    ౠ) మతపిశాచి               = మత అనే పిశాచి               -   రూపకం సమాసం 


తరగతి గదిలో రాయవలసిన అంశాలు

1.  ‘తెలంగాణ తల్లి’ తన గొప్పదనాన్ని వివరిస్తున్నట్లుగా ఏకపాత్రాభినయం రాయండి.

2. ‘తెలంగాణ తల్లి’ ఆత్మకథ రాయండి.

గైహికము (ఇంటిపని)

1. పుటసంఖ్య 31లో గల కవితను చదువండి. జవాబులు రాయండి.

2. ఛేకానుప్రాసాలంకారము నిర్వచనం  చదువండి. రాయండి. 

3. ఈ పాఠంలోని లఘుసమాధాన ప్రశ్నలు చదువండి. రాయండి.

అదనపు సమాచారం :

 1. పాఠ్యభాగ కవిపరిచయo, నేపథ్యం చదువండి.

 2. చుక్కపద్యాలు కంఠస్థo చేసి, భావాలు సొంతమాటల్లో రాయండి. 

 3. పాఠంలోని అదనపు వ్యాకరణాంశాలు గుర్తించండి.

ప్రశ్నల నిధి 

1. నవోదయం రావడమంటే  ఏమిటి? 

2. ‘తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము’ అని దాశరథి ఎందుకన్నాడు?

3. ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి రచనా శైలిని అభినందిస్తూ రాయండి.

 4. తెలంగాణలో సంధ్యాభానువు మొదటిసారి ఉదయించిండని కవి ఎందుకన్నాడు ?

 5. “ తెలంగాణ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాలవరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకొన్నాయి” అన్న కవి   మాటలను మీరెట్లా సమర్థిస్తారు?

6. బతుకు తోవ చూపే కాలం రావడమంటే ఏమిటి? 

నికష

1. ఈ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.                    4 మా 

  అ) ‘తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము’ అని దాశరథి ఎందుకన్నాడు?

  ఆ)  నవోదయం రావడమంటే  ఏమిటి?

2. ఈ కింది పద్యానికి ప్రతిపదార్థం రాయండి.                     4 మా 

    నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్ 

    ప్రాయము వచ్చినంతనె కృపాణములిచ్చితి, యుద్ధ మాడి వా 

    జ్రేయ భుజాబలమ్ము దరిసింప జగమ్ము, నవాబుతో సవాల్ 

    చేయుమంటి; వీ తెలుగు రేగడిలో జిగి మెండు మాతరో!

3. ఈ కింది పదాలు విడదీసి సంధిపేరు రాయండి.                2 మా  

   అ)  సయ్యాటలాడెన్                         ఆ) దారినిచ్చిరి              

      



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu