27, జనవరి 2023, శుక్రవారం

1. దానశీలము|పోతన|10th Class Telugu | CBSE Telugu Tealangana |

10 వ తరగతి తెలుగు

1. దానశీలము

ముఖ్య పదాలు: 

నీరజభవుడు

జీవధనములు

త్రివిక్రముడు

వింధ్యావళి

బ్రహ్మ

మానధనులు

విష్ణువు

                    వదాన్యోత్తముడు

క్షేత్రం

                      బలిచక్రవర్తి

 

పాఠ్యభాగ ముఖ్యాంశాలు:

  • దాతలలో గొప్పవాడు బలిచక్రవర్తి.

  • పొట్టివాడు విష్ణువు.

  • మూడు అడుగులతో మూడు లోకాలను ఆక్రమించుకుంటాడని కులగురువైన                             శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి హితబోధ చేస్తాడు.

  • దానికి బలిచక్రవర్తి మహాత్మా! అర్థం, కామం, కీర్తి, జీవనాధారం – వీటిలో ఏది అడిగినా ఇస్తానని               చెప్పాను. ఇప్పుడు మాట తప్పలేనని అంటాడు.

  • పూర్వం రాజులు ఉన్నారు. వారు ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదు. శిబిచక్రవర్తిని లోకం మరువలేదు కదా! అని శుక్రాచార్యునితో బలి అంటాడు.

  • వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే ! నా నాలుక వెనుదిరుగదు అని చెబుతాడు.

  • ఓ ఉత్తమ బ్రహ్మచారీ! నీ పాదాలు కడగనివ్వు. ఇంకా ఆలస్యం దేనికి? అని వామనుని పాదాలను కడుగుతాడు బలిచక్రవర్తి.

  • ‘బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైన వ్రతము కలవాడవు, నీకు మూడడుగులు దానం చేస్తున్నానని’  పలికి నీటిని ధారపోశాడు.

  • వామనునికి బలిచక్రవర్తి దానమియ్యగానే నలుదిక్కులూ, పంచభూతాలు ‘బళి బళి’ అని పొగిడాయి.


 I) లఘు సమాధాన ప్రశ్నలు

1. “ఈ కుబ్జుండు అలతిఁబోడు” అని శుక్రాచార్యుడు చెప్పడంలో అతని ‘ఉద్దేశమేమై’ ఉంటుంది? దానితో మీరు ఏకీభవిస్తారా?

   జ: వామనుడు సామాన్యుడు కాడని, తాను అడిగిన మూడు అడుగుల నేలతో పోడని, ఆ మూడడుగుల పేరుతో, మూడులోకాలనూ కొలుస్తాడనీ, బ్రహ్మాoడo అంతా నిoడిపోతాడనీ, బలి చక్రవర్తి రాజ్యాన్ని స్వాధీనం చేసుకొంటాడనీ, శుక్రాచార్యుడు చెప్పిన మాటల్లోని సారాంశం.  రాక్షస వంశ గురువైన శుక్రాచార్యుడు, రాక్షసరాజు బలిని కాపాడాలనే ఉద్దేశంతో అలా మాట్లాడాడు. బలి చక్రవర్తిని తన వంశాన్ని, రాజ్యాన్నినిలుపుకోమని ఉపదేశించాడు. కనుక  నేను కూడా శుక్రాచార్యుని మాటలతో  ఏకీభవిస్తాను. 

2. హాలికునికి కావలసిన వసతి సౌకర్యాలు ఏవిధంగా ఉంటే అతడు తృప్తి జెందుతాడు? 

జ: హాలికుడంటే రైతు. రైతును దేశానికి వెన్నెముక అంటారు. కాని రైతుకు వసతి సౌకర్యాలేవి కల్పించరు. మంచిపొలం, విత్తనాలు, నీటివసతి, ఎరువులు, పొలంలో పనిచేసేoదుకు చౌకగా కూలీలు దొరికితే, రైతు తృప్తి చెందుతాడు. తాను పండించిన పంటను అమ్ముకొనేందుకు మార్కెట్ సదుపాయం ఉండి, దళారి వ్వవస్థ లేకపోతే మరింత బాగా తృప్తి చెందుతాడు.

]


3. ‘సిరి మూట గట్టుకొని పోవంజాలిరే?’ అనడంలో బలి చక్రవర్తి ఆంతర్యమేమై ఉంటుంది?

జ: పూర్వం ఎందరో రాజులు ఉన్నారు. వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ధన ధాన్య సంపదలు కూడబెట్టారు. కాని, వారు మరణించినపుడు వాటిని తమ వెంట తీసుకెళ్ళలేదు. ఎవరూ తాము సంపాదించిన సిరిసంపదలను చనిపోతూ కూడా తీసుకువెళ్ళరు. సంపదలు శాశ్వతం కావనీ, వారు సంపాదించిన కీర్తి ప్రతిష్టలే శాశ్వతంగా నిలుస్తాయనీ, బలి చక్రవర్తి మాటల్లోని ఆంతర్యం.

4.ఈ పాఠాన్ని బట్టి పోతన కవిత్వం ఎలా ఉందని భావిస్తున్నారు?

జ: పోతనగారి కవిత్వం, శబ్దాలంకారాల సొగసుతో పండిత పామరులకు నచ్చేవిధంగా ఉన్నది. వామన చరిత్రలోని పోతన గారి పద్యాలు తెలుగు వారి నాలుకలపై నాట్యమాడుతూ ఉంటాయి. అంత్యాను ప్రాసలు ఎక్కువగా కనబడుతాయి.  తన కవిత్వంలో శబ్దాలంకారాలను ఎక్కువగా ప్రయోగించాడు. అర్థాలంకారాలను కూడా సందర్భానుసారంగా ప్రయోగించాడు. ఈ వామనావతార ఘట్టంలో బలిచక్రవర్తి దానగుణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు. బలిచక్రవర్తి తాను ఇచ్చినమాటకు కట్టుబడి తన గురువు వారించినా, హెచ్చరిస్తున్నా కాదంటూ ‘వామనుని’ కోరిక మేరకు దానం చేసే, ఆ అద్భుత సన్నివేశాన్ని పోతన రమణీయoగా వర్ణించాడు.

5. ‘ఆడినమాట తప్పగూడదు’ ఎందుకు?

జ: పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డపని చేసినవాడినైనా భరిస్తాను కాని, ఆడినమాట తప్పినవాడిని మాత్రం మోయలేను అని చెప్పింది! అంతేకాదు, తాను అన్నమాటకు కట్టుబడి సత్యంతో బతకడం, అభిమానధనులైన వారికి ఉత్తమ మార్గం. ఎన్ని కష్టాలు వచ్చినా, పేదరికం సంభవించినా, ధన ప్రాణాలకు చేటు వచ్చినా, చివరికి మరణమే సంభవించినా అభిమానధనులు మాట తప్పరు. సత్యం మాట్లాడేవారికి స్వర్గాది పుణ్యలోకాలు సంభవిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. కాబట్టి ఆడినమాట తప్పకూడదు.  

II) కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) నేటి సమాజానికి దాతృత్వం కల వ్యక్తుల ఆవశ్యకతను తెలపండి.

  జ:  నేటి సమాజంలో ధనవంతులు, పేదవారు ఉన్నారు. మహాసంపన్నుల వద్ద ధనం మూలుగుతోంది. వారంతా ఆ ధనాన్ని విదేశీబ్యాంకుల్లో దాస్తున్నారు. తమ పిల్లలకు ఇస్తున్నారు. సమాజంలో ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు. వారికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, తాగడానికి మంచి నీరు దొరకడం లేదు. కాబట్టి ధనవంతులు దాతృత్వ గుణాన్ని పెంపొందించుకొని, బీదవారికి తోచిన సహాయం చేయాలి. మంచి విద్యాలయాలు, వైద్యశాలలు ప్రారంభించి బీదవారికి సాయపడాలి. ఆదాయం పన్నులు ఎగ్గొట్టి ఎంత ధనాన్ని సంపాదించినా వారు చనిపోయేటప్పుడు ఆ ధనాన్ని వెంట తీసుకెళ్ళరు. ఎంత లక్షాధికారైనా లవణమూ, అన్నమే తింటాడు. కాని బంగారాన్ని తినడు. ఈ సత్యాన్ని ధనవంతులు గుర్తించి తమ సొమ్ములో కొంత భాగాన్ని దాన ధర్మాలకు ఖర్చుపెట్టాలి. అలా చేస్తే స్వర్గాది పుణ్యలోకాలు లభిస్తాయి. మానసిక ఆనందం కలుగుతుంది.

ఆ) ఆడినమాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండడం మొదలైన విశిష్ట లక్షణాల ఆవశ్యకతను  తెలుపుతూ నినాదాలు సూక్తులు రాయండి.

 జ:  నేటికి ఈ సమాజం ఈ విధంగా, మంచిగా ఉందంటే కారణం, ఆడినమాట తప్పనివారు, దానగుణం కలిగిన వారు ఉండడం. కాబట్టి ఆడినమాట తప్పడం కన్నా మరణించడం మేలు. దానగుణం అన్ని గుణాల్లో గొప్పది.

ఆడినమాట తప్పకపోవడం

      నినాదాలు :

  1. ఆడి తప్పకండి – పలికి బొంకకండి.

  2. ఇచ్చినమాట నిలబెట్టుకోండి – నీతిగా బతకండి. 

  3. మాటమీద నిలబడండి – పౌరుషంగా బతకండి.

  4. మితంగా మాట్లాడండి – అమితంగా విలువివ్వండి 

సూక్తులు :

  1. మాటకు ప్రాణం సత్యం

  2. మానధనులు మాట తప్పరు

  3. ప్రాణం కంటే మాటవిలువైనది

దానగుణం

నినాదాలు :

  1. రక్తదానం చేయండి  - ప్రాణాలు కాపాడండి

  2. విద్యాదానం చేయండి – వివేకం పెంచండి

  3. దానధర్మాలకు కాని ధనం – ఎంతున్నా దండుగే


  • పువ్వు గుర్తు గల పద్యాలు

1. కారే రాజులు ? రాజ్యముల్ గలుగవే ? గర్వోన్నతింబొందరే ?

 వారేరి? సిరి మూట గట్టుకొని పోవంజాలిరే ? భూమిపై

 బేరైనం గలదే ? శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశ:కాములై 

యీరే కోర్కులు ? వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా ! 

 ప్రతిపదార్థo:

భార్గవా ! =  ఓ శుక్రాచార్యా ! (భార్గవుడు = భృగువు పుత్రుడు, శుక్రుడు)

రాజులు = ఎంతోమందిరాజులు

కారే = కాలేదా ?

రాజ్యముల్ = రాజ్యములు

కలుగవే =  పొందలేదా ఏమి ? 

గర్వ = అహంకారంతో

ఉన్నతిన్ = గొప్పదనాన్ని

పొందరే  = పొందలేదా  ఏమి ?

వారు= వాళ్ళందరు

ఏరి= ఎక్కడ ఉన్నారు ?

సిరిని =సంపదలను

మూటగట్టుకొని = కూడగట్టుకొని

పోవన్+ చాలిరే = తీసుకెళ్ళగలిగారా, లేదు

భుమిపైన్ = నేలపైన  ( ఈ భూలోకంలో )

పేరు+ ఐనన్ = కనీసము పేరైన

కలదే  = ఉన్నదా, లేదు

శిబి = శిబి చక్రవర్తి

ప్రముఖులున్ = మొదలగువారు

యశః = కీర్తిని

కాములు + ఐ  = కోరువారై

కోర్కులు  = దానములను

ప్రీతిన్ = సంతోషముతో

ఈరే  =  ఇవ్వలేదా

ఈ  =  ఇప్పటి

కాలమున = కాలమునందు

వారలన్  =  వారిని

మఱచిరే  =   మరచిపోయారా,  లేదు.  (మరచిపోలేదని భావం)

2. నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు

ర్మరణం బైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము, కానిమ్ము పో;

హరుడైనన్, హరియైన, నీరజభవుం డభ్యాగతుండైన నౌఁ;

దిరుగన్ నేరదు నాదు జిహ్వ ; వినుమా ! ధీవర్య ! వేయేటికిన్?

 ప్రతిపదార్థo:

ధీవర్య          =  ఓ విజ్ఞాని ! (ఓ పండితోత్తమా!)

నిరయంబు +  ఐన = నరకము దాపురించినా

నిబంధము + ఐన  = అనారోగ్యo కలిగిన

ధరణీ     = రాజ్యము

నిర్మూలనంబు = నాశనము

ఐనన్   =  అయినా సరే

దుర్మరణంబు + ఐనన్ = అకాల మరణం సంభవించినా

కుల + అంతము + ఐన  = వంశం నాశనమైన

నిజమున్  =  నిజంగానే పైవన్నీ

రానిమ్ము  =  వస్తే రాని

కానిమ్ము  =  జరిగెడిది జరగనిమ్ము

వేయేటికిన్ =  వేయి మాటలు దేనికి

వినుమా = వినుము

అభ్యాగతుండు = అతిథిగా వచ్చినవాడు

హరుడు = శివుడు

ఐనన్ = అయినా

హరి = విష్ణువు

నీరజభవుడు+ ఐన = బ్రహ్మదేవుడైనా

నాదు  = నా యొక్క

జిహ్వ = నాలుక

ఔన్   =  ఇస్తానని

తిరుగన్  = వెనుతిరుగుట (మాట తప్పడం)

నేరదు  = చేయలేదు

  • వ్యక్తీకరణ – సృజనాత్మకత

1. సత్య వాక్యాన్ని పలకడంలోనూ, దానశీలం కలిగి యుండడంలోనూ గల విశిష్టతను తెలుపుతూ (వ్యాసం) రాయండి.         

  సత్య దాన విశిష్టత : సత్యాన్ని మించిన దైవము లేదు. సత్యవాక్యాన్ని మించిన ధర్మం లేదు. ఆడి తప్పరాదు. తనకున్న దానిలో పరులకు కొంత దానం చేయాలి. ఈ జన్మలో అధిక దానాలు చేస్తే, మరుసటి జన్మలో మరింతగా సంపన్నుడిగా జన్మిస్తాడు.  మనం పుట్టినప్పుడు మన వెంట ఏ ధనాన్ని తేలేదు. తిరిగి చనిపోయినప్పుడు మన వెంట ఏమి తీసుకుపోము. బలిచక్రవర్తి గురువు గారికి చెప్పినట్లు, ఎందరో రాజులు తాము చక్రవర్తులమని గర్వించారు. వారు చనిపోయినప్పుడు, వారు సంపాదించిన ధనాన్ని వెంట తీసుకుపోలేదు. నేడు లోకంలో వారి పేరు కూడా లేదు. శిబి చక్రవర్తి, కర్ణుడు వంటి గొప్పదాతలు చేసిన దానాలను గూర్చి, వారి త్యాగాలను గూర్చి, నేటికి లోకంలో చెప్పుకుంటారు. వారి కీర్తి చిరస్థాయిగా నిలిచింది.

   హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు వచ్చినా సత్యాన్నే మాట్లాడాడు. చివరకు ఆ కష్టాలను అధిగమించాడు. రంతిదేవుడు, సక్తుప్రస్థుడు వంటి దాతలు, తమ సర్వస్వాన్నీ దానం చేసి పేరు పొందారు. ప్రాణాలు పోతాయని తండ్రి దేవేంద్రుడు హెచ్చరించినా, కర్ణుడు కవచకుండలాలు బ్రాహ్మణుడికి దానం చేశాడు. బలి చక్రవర్తి గురువు కాదన్నా, మూడు అడుగుల భూమిని వామనునికి ధారపోశాడు.  సత్యం, దానం విశిష్టగుణాలు, మనం సత్యమే పలుకుదాం. మనకు ఉన్నంతలో పరులకు దానం చేద్దాం.

2. రక్తదానం, నేత్రదానం, అవయవదానం చేయడం పట్ల ప్రజలలో చైతన్యం కలిగించేలా ‘కరపత్రం’ తయారుచేయండి. 

దానగుణం

   వదాన్యులారా! మానవత్వం మూర్తీభవించిన కరుణామూర్తులారా ! సోదర సోదరీమణులారా !

        దానగుణం పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన పూర్వులు మహాదాతలు. మనమూ ఆ బాటలో నడుద్దాం. అన్నదానం చేస్తే ఒక్కపూట ఆకలి తీర్చిన పుణ్యం వస్తుంది. ధన దానం చేస్తే కొన్ని అవసరాలను తీర్చినవారo అవుతాం. వస్త్రదానం చేస్తే కొద్దికాలమే ఆ వస్త్రాలు ఉపయోగిస్తాము. రక్తదానం చేస్తే ప్రాణాలు కాపాడవచ్చు. ప్రాణదానం చేసిన పుణ్యం వస్తుంది. నేత్రదానం చేస్తే మరణించిన తర్వాత కూడా గ్రహితద్వారా లోకాన్ని చూడవచ్చు. అవయవదానం చేసినా శాశ్వతంగా జీవించవచ్చు. దానం చేద్దాం. తోటివారికి సాయపడుదాం.                                        

                                                                                                                    ఇట్లు

                                                                                        అవయవదాన కమిటీ,

                                                                                         నాదర్ గుల్,

                                                                                          హైదరాబాద్.

  1. దానం చేయడం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి. 

                                                                                                                                  హైదరాబాద్,

                                                                                                                               19-03-2018. ప్రియమైన మణికంఠ !

        ఎట్లున్నవు ? నేను బాగున్న. బాగా చదువుతున్న. మాతరగతిలో మొన్ననే “ దానశీలం ” అనే పాఠం చెప్పుకున్నాo.  మా గురువు గారు బలిచక్రవర్తి యొక్క దాన గుణాన్ని చాలా చక్కగా వివరించారు. దానం చేయాలని చెప్పారు. శిబి, బలి, కర్ణుడు, రంతిదేవుడు మొదలైన మహాదాతల గురించి వివరించారు. వారి గురించి తెలుసుకొన్న తరువాత నాకోటి అనిపించింది. దానం చేయడంలోనే నిజమైన ఆనందం ఉoదని, అన్నదానం, విద్యాదానం, రక్తదానం, అవయవదానం మొదలైన దానాల వలన ఎంతో ప్రయోజనం ఉందని కూడా తెలుసుకున్నాం. అందుచేత మనం కూడా ఏదో ఒకదానం చేయాలి. దానం చేయడం వలన చాలా ఆనందం కలుగుతుంది. 

                                                                                                                    ఇట్లు

                                                                                                          కౌశిక్ గౌడ్.  

చిరునామా 

బి. మణికంఠ,

క్రమసంఖ్య  (5)  10వ తరగతి,

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,

బాలాపూర్ గ్రా,  మం,

రంగారెడ్డి జిల్లా.

పిన్ నెం 501510.



ప్రశ్నల నిధి:

I) లఘు సమాధాన ప్రశ్నలు 

  1. ఈ పాఠ్యభాగ కవి పరిచయము రాయండి.

  2. ఈ పాఠ్యభాగ నేపథ్యం రాయండి.

  3. ప్రస్తుత పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది. 

  4. బలిచక్రవర్తి స్వభావం గురించి రాయండి.

  5. “మాట దిరుగలేరు మానధనులు” ఈ మాటను మీరు సమర్థిస్తారా ?

  6. సిరి మూట గట్టుకొని పోవం జాలిరే అనడంలో బలిచక్రవర్తి ఆంతర్యం ఏమై ఉంటుంది ?

II) వ్యాసరూప సమాధాన ప్రశ్నలు 

  1. పోతన రచనలోని గొప్పతనాన్ని వివరింపుము?

  2. పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి. 

  3. దాన శీలము కలిగిన వ్యక్తుల వలన సమాజానికి కలిగే ప్రయోజనం ఏమిటి?

III) సృజనాత్మకత

  1. దానం యొక్క గొప్పతనాన్ని వివరించే నినాదాలు రాయండి.

  2. దానగుణం పెంచుకోమని కోరుతూ కరపత్రం తయారు చేయండి.

  3. దానం చేయడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.   






 నికష

I) ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.               4మా 

     1. ఆడినమాట తప్పకూడదు ఎందుకు ?

    2. మానధనులంటే ఎవరు ? వారి స్వభావం ఎట్లాంటిది ?

II) ఈ కింది పద్యమును పూరించి, భావం రాయండి.       3మా 

     కారే రాజులు ............................. భార్గవా!

III) ఈ కింది పదాలకు అర్థాలు రాయండి.           3మా 

    1. హరి =                                    2. ధరణి =                                    3. అభ్యాగతుడు =

  













10 వ తరగతి తెలుగు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu