29, జనవరి 2023, ఆదివారం

9. జీవన భాష్యం Notes || 10th Telugu Biksha Notes ||

9. జీవన భాష్యం 

                                     - సి. నారాయణ రెడ్డి

I) పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు :

  • ఇతరులకోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని తెలుసుకోవడం   

  • సినారె గజల్ ప్రక్రియను తెలుసుకోవడం    

  • అపరిచిత గేయపాదాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయగలగడం   

  • పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో చెప్పగలగడం,    

II) ముఖ్య పదాలు  -  అర్థాలు :

  1. జీవనం    = బతుకు 

  2. భాష్యం    =  నిర్వచనం

  3. గిరి        =  పర్వతం

  4. నామధేయము = పేరు 

  5. నేస్తం      = మిత్రుడు, స్నేహితుడు

  6. మృగము = జంతువు

  7. శిరస్సు    =  తల

  8. జంకని     = భయపడని

  9. దారి        = తొవ్వ, మార్గం

  10. వంకలు   = ఏరులు




III) చర్చనీయాంశాలు

1. మనసుకు మబ్బు ముసరడం :

  మబ్బు ముసరడం అంటే మబ్బులు కమ్ముకోవడం అని అర్థం. మనసుకు మబ్బు ముసరడం అంటే మనసనే ఆకాశాన్ని మబ్బులనే సమస్యలు చుట్టుముట్టడం అని అర్థం. సమస్యలతో సతమతమయ్యే మనసు స్వచ్ఛంగా, స్పష్టంగా, కనిపించదు, వ్యవహరించదు. చింతలు, వెతలు అస్పష్టభావాలతో నిండి ఉన్న మనసు దుఃఖానికి కేంద్రంగా మారుతుంది. మబ్బు చినుకుల్ని కురిపించినట్లే మనసు దుఃఖాన్ని వర్షింపజేస్తుంది.

2. జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది.

   కొత్తదారిలో వెళ్ళాలంటే, కొత్త మార్గం కనుక్కోవాలంటే, కొత్తగా బాటను వేయాలంటే ఏ అనుమానం, అధైర్యం లేక అడుగు ముందుకు వేయాలి. అలా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఒక కొత్తమార్గంలో నడిచి విజయం సాధించినవారే పదిమందికి ఆదర్శం అవుతారు. వాళ్లు నడిచిన మార్గంలో మరికొంత మందినడిస్తేనే అది దారిగా మారుతుంది. జీవితంలోనూ ఒక ప్రయోజనాన్ని ఆశించి, కొత్త మార్గంలో వెళ్తున్నప్పుడు భయపడకుండా ముందడుగు వేసి, ఆదర్శంగా నిలవాలని కవి భావం.

3. మనిషి  - మృగం

    మనిషి  - మృగం ఎన్నటికి ఒకటి కాదు. మనిషి మనిషే, మృగం మృగమే. ఆకారoలో, స్వరూపంలో, స్వభావంలో స్పష్టమైన తేడాలున్నాయి. మృగానికి వావివరుసలు, తన పర భేదాలుండవు. దాని కడుపునిండడం, సుఖంగా ఉండడమే పరమార్థంగా బతుకుతుంది. తనకు అడ్డంకిగా ఉన్న వాళ్లను నిర్దాక్షిణ్యంగా, పశుబలంతో పక్కకు తోస్తుంది.

ఈ లక్షణాలేవీ మనిషిలో ఉండవు. అన్నిటికీ మించి మనిషి మేధోసంపన్నుడు. ఆలోచించి ఏదిమంచో, ఏది చెడో, ఎవరితో ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలిసి, తెలివిగా జీవిస్తాడు. తెలివి అంటే విచక్షణ (మోసం కాదు). 

4. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. 

   మనిషి పేరు సంపాదించడం అంటే గొప్పపేరు పొందటం అని అర్థం. గొప్పపేరు మామూలు ప్రయత్నం వల్ల లభించదు. అందుకు ఎంతో త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆ త్యాగం ఎంతో విలువైనది కావాలి. అప్పుడు పేరు చిరస్థాయిగా మిగిలి పోతుంది. 

IV) పాఠ్యపుస్తకములోని ప్రశ్నజవాబులు

1. ఈ కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది” అంటే త్యాగం చేసేవారి, మంచిపనులు చేసే వారి పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయి అని అర్థం. అందుకోసం ఎట్లాంటి పనులు చేయాలి ?

  • దానధర్మాలు చేయాలి.

  • దేవాలయాలు, ధర్మసత్రాలు కట్టించాలి.

  • పేదవారికి పెళ్ళిళ్ళు చేయించాలి.

  • విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.

  • విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వాలి.

  • బలహీన వర్గాలవారికి చేయూతనివ్వాలి.

  • వెనుకబడిన తరగతుల వారికి అండగా నిలవాలి.

  • బావులు, చెరువులు తవ్వించాలి.




ఆ) “ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యం ద్వారా విద్యార్థులకు “సినారె” ఇచ్చే సందేశం ఏమై ఉండవచ్చు ? 

జ: ఎడారి దిబ్బలు అంటే ఎడారిలో ఉండే ఇసుక గుట్టలు. అక్కడ అంతా ఇసుక ఉంటుంది. ఇసుక నేలలు పంటలకు మంచివి కావు. అదీగాక ఎడారుల్లో నీరు దొరుకదు. కాబట్టి ఎడారి ఇసుక దిబ్బలను దున్నినా ప్రయోజనం ఉండదని సామాన్య జనం అనుకుంటారు. ఇసుక దిబ్బలు దున్నితే ఫలం ఉండదనుకోవద్దని, కవి సందేశం ఇచ్చాడు. 

   ఇది విద్యార్థులకు సరిపోయే వాక్యం. ఎందుకంటే కొంతమంది విద్యార్థులు ఎంత చదివినా పెద్దగా ప్రయోజనం ఉండదు. వారు మంచి ర్యాంకులు తెచ్చుకొని ఉద్యోగాలు పొందలేరు. కాని ఆ విధంగా వారు నిరాశ చెందవద్దనీ ప్రయత్నిస్తే, అటువంటి తెలివితక్కువ విద్యార్థులు కూడా రాణిస్తారనీ, ప్రయత్నం గట్టిగా సాగాలనీ, ఆశావహదృష్టితో ముందుకు పోవాలనీ విద్యార్థులకు సినారె సందేశం ఇచ్చాడు.

ఇ) ‘మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది’ అని సినారె ఎందుకు అని ఉంటారు ?

జ: ‘మనిషి’ భగవంతుని సృష్టిలో ఒకే రకం జీవి. అయినా నేడు సంఘంలో మనుషులు కులమత భేదాలతో, వర్ణవైషమ్యాయాలతో విడిపోతున్నారు. అందువల్ల సమాజాభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. మత వైషమ్యాల వల్ల దేశాలూ, రాష్ట్రాలూ నాశనం అవుతున్నాయి. ప్రాంతీయ భేదాల వల్ల కలతలూ, కార్పణ్యాలూ పెరిగిపోతున్నాయి. అలాగాక గ్రామంలోని పదుగురూ అంటే పదిమందీ కలిసి ఉంటే, అది చక్కని గ్రామం అవుతుంది. గ్రామంలోని ప్రజలంతా కలిసి ఉంటే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుంది. గ్రామంలో ఉన్నవారంతా కులమత భేదాలు లేకుండా కలిసి, గ్రామాభివృద్ధికి కృషిచేస్తే అది చక్కని ‘ఊరు’ అవుతుంది. ఆదర్శగ్రామం అవుతుందని భావం. ఆ గ్రామానికి కావలసిన సదుపాయాలు అన్నీ సమకూరుతాయి.ప్రభుత్వం కూడా ఆ గ్రామానికి కావలసిన ధన సహాయం చేస్తుంది. గ్రామ ప్రజల్లో సహకారం, ఐకమత్యం అవసరం అని చెప్పడానికే ‘సినారె’ ఈ వాక్యాన్ని రాశారు. 


2. కింది ప్రశ్నలలో ఒకదానికి పది వాక్యాలల్లో జవాబు రాయండి.  

 అ) ఈ పాఠంలో గజల్ ప్రక్రియను గురించి తెలుసుకున్నారు కదా ! మీకు తెలిసిన నాలుగు సాహిత్య ప్రక్రియల పేర్లు తెలుపండి. వాటిని గురించి రాయండి.

జ: నాకు తెలిసిన నాలుగు సాహిత్య ప్రక్రియలు ఇవి: 1) గేయ కవిత     2) వ్యాసం     3) ప్రబంధం     4) గీతం

 1) గేయ కవిత : లయకు ప్రాధాన్యం ఇస్తూ, మాత్రాఛoదస్సులో సాగే రచన “గేయ కవిత”. ఇది పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇందులో పల్లవి, చరణాలు అనే విభాగాలు ఉంటాయి.

2) వ్యాసం : ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా ఆకట్టుకొనేలా వివరించేది వ్యాసం. సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభగ్రాహ్యంగా ఉండటం దీని ప్రత్యేకత.     

3) ప్రబంధం : వర్ణనా ప్రధానమైన కావ్యాలు ప్రబంధాలు. శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని (16 వ శతాబ్దం) తెలుగు సాహిత్య చరిత్రలో “ప్రబంధ యుగం” అoటారు. పురాణ, ఇతిహాసాల నుండి చిన్నకథను తీసుకొని, వర్ణనలు కలిపి, పెంచి స్వతంత్ర కావ్యంగా రచిస్తే దాన్ని ‘ప్రబంధo’ అంటారు. వీటిలో అష్టాదశ(18) రకాల వర్ణనలు ఉంటాయి.

4) గీతం :  లయకు ప్రాధాన్యం ఇస్తూ, మాత్రాఛoదస్సులో సాగే రచన గీతం. శ్రీశ్రీ తన మహాప్రస్థానంలోని ఖండికలన్నీ గీతాలుగా పేర్కొన్నారు.  

(లేదా)

ఆ) మంచి పంటలు పండడానికి రైతు చేసే శ్రమ ఎలాంటిదో వివరించండి.

జ: మంచి పంటలు పండాలంటే రైతులు వేసవిలో పొలాలను చక్కగా దున్నాలి. నీరు రాగానే సేంద్రియ ఎరువులను పొలంలో వేయాలి. పొలంలో ఎత్తుపల్లాలు లేకుండా సమంగా నీరు ప్రవహించేలా చూడాలి. రసాయనిక ఎరువులు నేల స్వభావానికి తగువిధంగా చల్లాలి. వరి చేనులో కలుపుతీసి ఎరువులు వేయాలి. క్రిమిసంహారక మందులు తగు మోతాదులో పిచికారీ చేయాలి. వరిచేను ఈనగానే పుష్కలంగా నీరుపెట్టి మూడవ మోతాదు రసాయనిక ఎరువు చల్లాలి. ఎలుకలు లేకుండా బుట్టలు పెట్టాలి. ధాన్యం పండిన తరువాత చేను కోయాలి.   



V) తరగతి గదిలో రాయవలసిన అంశాలు:

అ) జీవనభాష్యం’ గజల్ లోని అంత్యప్రాసల ఆధారంగా సొంతంగా ఒక వచన కవితను రాయండి.

ఆ) ఆచార్య సి. నారాయణరెడ్డి గారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి నుండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ప్రశ్నలు రాయండి.

VI) గైహికము (ఇంటిపని):

అ) పుటసంఖ్య 91లోని అపరిచిత గేయపాదాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఆ) ప్రశ్నజవాబులు చదువండి. రాయండి.

VII) పదజాలం 

1. కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.

  అ) మబ్బు :   మేఘము,       మెయిలు,       అంబుదము,        ఘనము

  ఆ) గుండె  :  హృదయం,          హృత్తు,          డెందము

  ఇ) శిరసు :   తల,        శీర్షము,       మస్తకము,       మూర్ధము

2. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

  అ) ముసరడం :  ఆహారపదార్థాలపై ఈగలు ముసరడం వల్ల రోగాలు వస్తాయి.

  ఆ) జంకని అడుగులు : దేశ సైనికుల జంకని అడుగులే మనదేశానికి శ్రీరామరక్ష.

  ఇ) ఎడారి దిబ్బలు : ఒంటెలు ఎడారి దిబ్బలను దాటుకుంటూ వేగంగా నడుస్తాయి.     

  ఈ) చెరగని త్యాగం : బలిచక్రవర్తి చేసిన చెరగని త్యాగం చాలా గొప్పది.   

VIII) వ్యాకరణాంశాలు :

1. కింది పదాలు కలిపి, సంధిని గుర్తించి రాయండి.

  అ) నీరవుతుంది               = నీరు + అవుతుంది      -   ఉత్వ సంధి

  ఆ) ఎత్తులకెదిగిన              = ఎత్తులకు + ఎదిగిన     -   ఉత్వ సంధి         

  ఇ) పేరవుతుంది               = పేరు  + అవుతుంది     -   ఉత్వ సంధి

2. కింది పదాలలోని సమాస పదాలు గుర్తించి, విగ్రహవాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో తెలియజేయండి.

  అ) ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు

  జ: ఎడారి దిబ్బలు                 -  ఎడారిలో దిబ్బలు                     షష్ఠి తత్పురుష సమాసం 

  ఆ) ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది.

  జ: ఇసుక గుండెలు               -  ఇసుక యొక్క గుండెలు             - షష్ఠి తత్పురుష సమాసం 

3. కింది వాటిని చదివి ఏ అలంకారాలో గుర్తించండి.

  అ) నీకు వంద వందనాలు

  జ: పై వాక్యoలో “ఛేకానుప్రాసాలంకారం” ఉంది.

  ఆ) తెలుగు జాతికి అభ్యుదయo

       నవ భారతికే నవోదయం 

       భావిపౌరులం మనం మనం 

       భారత జనులకు జయం జయం 

  జ:  అంత్యానుప్రాసాలంకారం

  ఇ) రాజు రివాజులు బూజు పట్టగన్

  జ: వృత్త్యనుప్రాసాలంకారం

 ఈ) అజ్ఞానాంధకారం తొలిగితే మంచిది.

   జ: రూపకాలంకారం

IX) ప్రశ్నలనిధి :

1. ఈ కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది” అంటే త్యాగం చేసేవారి, మంచిపనులు చేసే వారి పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయి అని అర్థం. అందుకోసం ఎట్లాంటి పనులు చేయాలి ?

ఆ) “ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యం ద్వారా విద్యార్థులకు “సినారె” ఇచ్చే సందేశం ఏమై ఉండవచ్చు ? 

ఇ) ‘మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది’ అని సినారె ఎందుకు అని ఉంటారు ?

2. కింది ప్రశ్నలలో ఒకదానికి పది వాక్యాలల్లో జవాబు రాయండి.  

 అ) ఈ పాఠంలో గజల్ ప్రక్రియను గురించి తెలుసుకున్నారు కదా ! మీకు తెలిసిన నాలుగు సాహిత్య ప్రక్రియల పేర్లు తెలుపండి. వాటిని గురించి రాయండి.

ఆ) మంచి పంటలు పండడానికి రైతు చేసే శ్రమ ఎలాంటిదో వివరించండి.

X) నికష :

1. ఈ కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.                              6 మా

అ) ‘మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది’ అని సినారె ఎందుకు అని ఉంటారు ?

ఆ) “ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యం ద్వారా విద్యార్థులకు “సినారె” ఇచ్చే సందేశం ఏమై ఉండవచ్చు ? 

పదజాలం 

1. కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.                                                 2మా 

  అ) మబ్బు                                    ఆ) గుండె  


2. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.                                2మా

  అ) ఎడారి దిబ్బలు                          ఆ) చెరగని త్యాగం  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu