29, జనవరి 2023, ఆదివారం

11. భిక్ష Notes || Telugu 10th Class || Bhiksha Notes ||

11. భిక్ష 

                                                             - శ్రీనాథుడు 

I) పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు 

  • కోపం వల్ల కలిగే అనర్థాలను తెలుసుకోవడం 

  •  భిక్ష యొక్క ప్రాధాన్యతను సొంతమాటల్లో చెప్పగలగడం

  • పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయగలగడం

  • చుక్కపద్యాలు కంఠస్థo చేయడం  

 II) చుక్కపద్యాలు 

1. వేదపురాణశాస్త్ర పదవీ నదవీయసియైన పెద్దము 

    త్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ య

    య్యాదిమ శక్తి, సంయమివరా ! యిటు రమ్మని పిల్చెహస్తసం 

    జ్ఞాదరలీల రత్నఖచితాభరణంబులు ఘల్లు ఘల్లనన్ 

ప్రతిపదార్థo :

వేదపురాణశాస్త్ర పదవీ నదవీయసియైన

వేద               =          వేదముల యందు

పురాణ           =           పురాణముల యందు 

శాస్త్ర              =           శాస్త్రముల యందు ప్రతిపాదింపబడిన 

పదవీ            =           మార్గమునకు

 నదవీయసియైన

 న + దవీయసి + ఐన = మిక్కిలి దూరము నందు లేని ( అనగా దగ్గరగా నున్న)

                                  ( వేద పురాణ మార్గాన్ని అనుసరిస్తున్న)

పెద్దముత్తైదువ           =        పెద్దదైన పురంధ్రి

కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ 

         కాశికానగర       =   కాశికానగరము అనెడి

        హాటకపీఠ          =   స్వర్ణ పీఠం యొక్క 

             శిఖా            =   శిఖరమందు 

         అధిరూఢ          =   అధిరోహించియున్న 

    ( ఆ + ఆదిమశక్తి )   =   ఆ ఆదిశక్తి  స్వరూపిణి 

 హస్తసంజ్ఞాదరలీలన్ ;    

       హస్తసంజ్ఞా            =     చేతి సంజ్ఞ యందు వెల్లడి యవుతున్న 

            ఆదర             =     ఆదరముతో కూడిన 

           లీలన్              =     విలాసముతో 

రత్నఖచితాభరణంబులు 

              రత్న            =    రత్నములతో 

             ఖచిత            =    పోదుగబడిన (కూడిన)

          ఆభరణంబులు     =    నగలు

        ఘల్లు ఘల్లనన్      =    గల్లు గల్లుమని శబ్దము చేస్తుండగా 

          సంయమివరా     =    ఓ  మునీశ్వరా !

    ఇటురమ్ము  +   అని   =   ఇలా రమ్మని (ఇటు వైపు రమ్మని)

           పిల్చెన్            =    పిలిచింది  

2. ఆ కంఠంబుగ నిప్డు మాధుకర భిక్షాన్నంబు భక్షింపఁగా 

   లేకున్నo గడు నంగలార్చెదవు మేలే ? లెస్స ! శాంతుండవే !

   నీకంటెన్ మతిహీనులే కటకటా ! నీవార ముష్టింపచుల్

   శాకాహారులుఁ గందభోజులు, శిలోoఛప్రక్రముల్ తాపసుల్ !

ప్రతిపదార్థo :

 ఇప్డు                         =    ఇప్పుడు

 ఆ కంఠంబుగన్             =  కంఠము దాకా (గొంతు దాకా)

 మాధుకర భిక్షాన్నంబు    =  మాధుకర రూపమైన భిక్షాన్నమును

 భక్షింపఁగాన్                 =     తినడానికి 

 లేకున్నన్ (లేక + ఉన్నన్) =  లేకపోయేసరికి 

 కడున్                        =   మిక్కిలి

 అంగలార్చెదవు              =  అంగలు వేస్తున్నావు (తొట్రుపడుతున్నావు) (గంతులు వేస్తున్నావు)

 మేలే (మేలు + ఏ)         =  నీవు చేసే పని మంచిదేనా 

 లెస్స                         =  బాగున్నదా ?

 శాంతుండవే                 =   నీవు శాంతగుణం  కలవాడవేనా !

(శాంతుండవు  +  ఏ)

కటకటా                       =   అక్కడ కటా !

నీవార ముష్టింపచుల్       =   ఏ పూటకు ఆ పూట పిడికెడు నివ్వరి వడ్లు దంచుకొని వండి తినేవారునూ  

శాకాహారులుఁ               =  కాయ కూరలు మాత్రమే తినేవారునూ

(శాక  +  ఆహారులు)

కందభోజులు                =  దుంపలు మాత్రమే తినేవారునూ

శిలోoఛప్రక్రముల్ ;

శిల ప్రక్రముల్              =  కోతకోసిన వరిమళ్ళలో రాలిపడిన కంకులను ఏరుకొని

                                   వాటితో బతికేవారునూ 

ఉంఛ ప్రక్రముల్            =  రచ్చరోళ్ళ వద్ద, వడ్లు దంచేటప్పుడు, చుట్టూ జారిపడిన బియ్యపు గింజలు

                                   ఏరుకొని జీవనం సాగించే వాళ్ళు అయిన 

తాపసుల్                   =   తపస్సు చేసుకొనేవారు ; (మునులు)

నీకంటెన్                    =  నీ  కన్న

మతిహీనులే               =   బుద్ధితక్కువ వారా ?

                                   (తెలివి తక్కువ వారా) 

3.  ఓ మునీశ్వర ! వినవయ్య యున్న యూరుఁ

     గన్నతల్లియు నొక్క రూపన్న రీతి 

     యటు విశేషించి శివుని యర్దాంగలక్ష్మి 

     కాశి ; యివ్వీటిమీఁద  నాగ్రహము దగునె ?



ప్రతిపదార్థo :


ఓ మునీశ్వర ! 

(ముని + ఈశ్వరా)              =  ఓ మునీశ్వరుఁడా !

ఉన్న యూరున్

(ఉన్న + ఊరున్)              =   తాను ఉన్న ఊరునూ 

కన్న తల్లియున్                =   తనను కన్న తల్లియునూ 

ఒక్క రూపు                     =   ఒకే రూపము 

అన్న రీతి                        =  అన్న పధ్ధతి 

వినవయ్య                       =   నీవు వినలేదా ?

అటు విశేషించి                 =    అంతకంటెను విశేషించి 

కాశి                               =   కాశీ పట్టణం 

శివుని                            =   ఈశ్వరుని యొక్క 

అర్థాంగ లక్ష్మి                   =   భార్య 

ఇవ్వీటిమీదన్

(ఈ + వీటిమీదన్)            =    ఈ కాశీనగరo మీద 

ఆగ్రహము                      =     కోపము 

తగునె ( తగును + ఎ )     =        తగునా ?  


4. అనవుడు నల్ల నవ్వి కమలానన యిట్లను, లెస్సగాక, యో

    మునివర ! నీవు శిష్యగణముoగొని చయ్యన రమ్ము విశ్వనా 

    థునికృప పేర్మి నెందఱతిథుల్ చనుదెంచినఁ గామధేనువుం

    బని గొనునట్లు పెట్టుదు నపారములైన యభీప్సితాన్నముల్ 

ప్రతిపదార్థం :

అనవుడున్             =     వేదవ్యాసుడు ఇట్లు చెప్పగా 

కమలానన

(కమల + ఆనన)      =     పద్మం వంటి ముఖం గల ఆ ముత్తైదువ 

అల్ల                      =     కొంచెం (మెల్లగా)

నవ్వి                     =    నవ్వి

ఇట్లనున్                 

(ఇట్లు + అనున్)      =     ఇలా చెప్పింది

లెస్సగాక               =    మేలు అగునుకాక ! (మంచిది)

ఓ మునివర            =    ఓ మునీశ్వరుడా !

నీవు                    =     నీవు

శిష్యగణమున్          =     శిష్యులందరినీ 

కొని                     =     తీసుకొని 

చయ్యన్                =     శీఘ్రంగా 

రమ్ము                  =     రమ్ము  ( మా ఇంటి భోజనానికి రా)

విశ్వనాథుని           =      విశ్వనాథుడైన పరమేశ్వరుని యొక్క 

కృప పేర్మిన్            =      దయాతిశయం చేత (అధికమైన దయ చేత)

ఎందఱతిథుల్        

(ఎందరు + అతిథుల్) =   ఎంతమంది అతిథులు 

చనుదెంచినన్          =    వచ్చినప్పటికీ 

కామధేనువున్        =   దేవతల కామధేనువును 

పనిగొనినట్లు          =   స్వాధీనం చేసుకొన్న విధంగా (కామధేనువు చెప్పుచేతల్లో ఉన్నవిధంగా)

అపారములైన 

(అపారములు + ఐన) =  అంతులేని 

అభీప్సితాన్నముల్ 

(అభీప్సిత + అన్నముల్)  = కోరిన అన్న పదార్థాలను 

పెట్టుదున్              =     పెడతాను       

III) పాఠ్యపుస్తకములోని ప్రశ్నజవాబులు

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) శ్రీనాథుని గురించి రాయండి.

జ: శ్రీనాథుడు, తెలుగు సాహిత్యంలో పేరుపొందిన పెద్దకవి. ఈయన తల్లితండ్రులు భీమాంబ, మారయలు. ఈయన కొండవీడును పాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు. ఈయన, విజయనగరం చక్రవర్తి ప్రౌఢదేవరాయల ఆస్థానంలోని ‘గౌడడిండిమభట్టు’ను ఓడించి, రాయలచే కనకాభిషేకమునూ, ‘కవిసార్వభౌమ’ అనే బిరుదును పొందాడు. ఈ కవి, శృంగారనైషధం, కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రి మహాత్మ్యం వంటి పెక్కు కావ్యాలు రచించాడు. పెక్కు చాటుపద్యాలు రచించాడు.


ఆ) వ్యాసునికి పాత్ర స్వభావాన్ని వివరించండి.

జ: వ్యాసుడు, సమస్త విద్యలకు గురువు. ఈయనకు పదివేలమంది శిష్యులు ఉండేవారు. ఈయన కాశీనగరంలో శిష్యులకు విద్య నేర్పుతూ, భిక్షాటన చేసుకొంటూ జీవనం సాగించేవాడు. ఒకసారి శివుని మాయవల్ల వ్యాసునకు కాశీనగరంలో రెండురోజులు వరుసగా ఎవరూ భిక్ష పెట్టలేదు. వ్యాసుడు సులభ కోపి. తనకు రెండు రోజులుగా బిక్ష దొరకలేదని సతమతమయ్యాడు. కాశీ నగరవాసులకు మూడు తరాలదాకా, ధనం, విద్యా, మోక్షం లేకుండా ఉండుగాక అని శపించబోయాడు. వ్యాసునికి శిష్యులంటే మంచి ప్రేమ. శిష్యులు తినకుండా తాను ఒక్కడూ తిననని వ్రతం పట్టిన శిష్యవత్సలుడు. నిత్యం పవిత్ర గంగాస్నానం చేసేవాడు. పార్వతీదేవీ చేత మందలింపబడి, తాను చేసిన తప్పును వ్యాసుడు గ్రహించాడు. శిష్యులందరికీ కూడా తనతోపాటు భోజనం పెడతానని ముత్తైదువు చెప్పిన తరువాతే, శిష్యులతో వెళ్ళి, పార్వతీమాత పెట్టిన భోజనం తిన్నాడు.

ఇ) “ నేఁడు నిన్నటికి మఱునాఁడు నిక్కవంబు “ అను మాటలు ఎవరు ఎవరితో, ఏ సందర్భంలో అన్నారు? వీటి అంతరార్థమేమిటో వివరించండి.

జ: “ నేఁడు నిన్నటికి మఱునాఁడు నిక్కవంబు “ అన్న మాటలు, వేదవ్యాసుడు సామాన్య స్త్రీ రూపంలో కనబడి తనను భోజనానికి తన ఇంటికి రమ్మని పిలిచిన పార్వతీదేవితో అన్నాడు. వ్యాసుడు కాశీనగరాన్ని శపించబోయాడు. అప్పుడు పార్వతీదేవి సామాన్య స్త్రీరూపంతో వ్యాసునకు కనబడి, వ్యాసుడు కోపించడం తగదని మందలించి, అతణ్ణి భోజనానికి రమ్మని పిలిచింది. అప్పుడు వ్యాసుడు పార్వతిదేవితో, సూర్యుడు అస్తమిస్తున్నాడనీ, తనకు పదివేలమంది శిష్యులు ఉన్నారనీ, తన వ్రతాన్ని విడిచి తాను ఒక్కడు వచ్చి తినడం వీలుగాదనీ చెప్పాడు.

అంతరార్థం : “ఈరోజు నిన్నటి రోజుకు తరువాతి రోజు అన్నదినిజము” అని ఈ మాటకు అర్థం. అంటే నిన్న ఎలాగైతే భోజనం లేకుండా పస్తు ఉన్నామో, అలాగే ఈ రోజు కూడా పస్తు ఉంటామని, దీని అంతరార్థం.  

ఈ) కోపం వల్ల వ్యాసుడు కాశీ నగరాన్ని శపించాలనుకున్నాడు కదా ! “ కోపం - మనిషి విచక్షణను నశింపచేస్తుంది”. దాని గురించి రాయండి. 

జ: “ కోపo వస్తే నేను మనిషిని కాను” అని సామాన్యంగా అంటూ ఉంటారు. అది నిజమే. కోపం వస్తే తనను తాను మరచి, మనిషి రాక్షసుడు అవుతాడు. ఆ కోపంతో తాను ఏమి చేస్తున్నాడో, తెలుసుకోలేడు. కోపంతోనే అన్నదమ్ములనూ, అక్క చెల్లెండ్రనూ, చివరకు కట్టుకొన్న భార్యనూ, కన్నపిల్లల్నీ కూడా, చంపుతూ ఉంటారు. కాబట్టి కోపం మంచిది కాదు. ఈ కథలో వ్యాసుని అంతటి బ్రహ్మజ్ఞాని, రెండు రోజులు భిక్ష దొరకలేదని కాశీ నగరాన్ని శపించబోయాడు. భర్తృహరి నీతి శతకంలో “క్షమ కవచంబు క్రోధమది శత్రువు” అంటాడు. అంటే ఓర్పు కవచం లాంటిది. కోపం శత్రువు లాంటిది అని దాని అర్థం. శత్రువులాంటి కోపాన్ని విడిచి పెట్టాలి. దుర్యోధనునికి, పాండవులపైనా, భీముడి మీద కోపం. అందుకే వారితో తగవు పెట్టుకొని, యుద్ధంలో తాను మరణించాడు. దేవతలపై కోపంతోనే, రాక్షసులు అందరూ మరణించారు. “కోపమునను ఘనత కొంచమైపోవును” అని వేమన కవి చెప్పాడు. కాబట్టి కోపాన్ని అణుచుకోవాలి. శాంతాన్ని చేబట్టాలి. కోపము మనిషికి శత్రువు వంటిది. “తన కోపమె తన శత్రువు” అంటాడు సుమతీ శతక కర్త. కాబట్టి కోపం మనిషి వివక్షతను నశింపజేస్తుంది.   

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) భిక్ష పాఠంలోని కథను సంక్షిప్తంగా రాయండి.

జ: వ్యాసుడు సకల విద్యలకూ గురువు. ఒకరోజు మధ్యాహ్న వేళలో ఆయన శిష్యులతో కలిసి కాశీ నగరంలో బ్రాహ్మణవాడలలో భిక్షాటనం కోసం వెళ్ళాడు. ఏవోకారణాలు చెప్పి, ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. ఆ రోజుకు ఉపవాసం ఉందామనీ, మరుసటి రోజు భిక్ష తప్పక దొరుకుతుందనీ, వ్యాసుడు నిశ్చయించాడు. 

  ఈశ్వరుడి మాయవల్ల మరుసటిరోజున కూడా ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. వ్యాసుడు కోపంతో భిక్షాపాత్రను నడివీధిలో పగులకొట్టి, కాశీ వాసులకు  మూడు తరాలపాటు ధనం, విద్య, మోక్షం లేకపోవుగాక అని శపించబోయాడు.

   ఇంతలో పార్వతీదేవి ఒక సామాన్య స్త్రీ రూపంలో బ్రాహ్మణ గృహం వాకిట్లో ప్రత్యక్షమయి, వ్యాసుని మందలించి తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది. అప్పుడు వ్యాసుడు “సూర్యుడు అస్తమిస్తున్నాడు. నాకు పదివేలమంది శిష్యులున్నారు. వారు తినకుండా నేను తినను. ఈ రోజు కూడా నిన్నటిలాగే పస్తుంటాను” అన్నాడు. అప్పుడు పార్వతీదేవీ నవ్వి “ నీవు శిష్యులందరినీ నీ వెంట తీసుకొని రా ! ఈశ్వరుడి దయతో ఎంతమంది వచ్చినా, కావలసిన పదార్థాలను పెడతాను”. అని చెప్పింది. వ్యాసుడు సరే అని, శిష్యులతో గంగలో స్నానంచేసి వచ్చాడు. పార్వతీదేవీ వారికి ఎదురేగి స్వాగతం చెప్పి, భోజనశాలలో వారందరికి భోజనం పెట్టింది.

ఆ) కోపం వల్ల కలిగే దుష్పరిణామాలను గూర్చి రాయండి.

జ: కోపం వచ్చిన మనిషిలో మంచిచెడ్డలను గ్రహించే విచక్షణ జ్ఞానం నశిస్తుంది. మనిషిలో రాకాస ప్రవృత్తి పెరిగిపోతుంది. ఎలాగైనా ఎదుటివాడిని కష్టపెట్టాలనీ, ఎదుటి వాడికి కష్టం కల్గించాలనీ, బుద్ధి కలుగుతుంది. కోపం వచ్చిన మనిషి పశువులా సంచరిస్తాడు. కోపంతో కళ్ళు మూసుకుపోతాయి. అవివేకంతో ఒకప్పుడు తన భార్యనూ, పిల్లలనూ, తల్లిదండ్రులనూ కూడా, చంపడానికి ప్రయత్నిస్తాడు.

    కోపం శత్రువు వంటిది అని భర్తృహరి చెప్పాడు. “ తన కోపమే తన శత్రువు “ అని సుమతీ శతకకర్త కూడా చెప్పాడు. కోపం వల్లే, వ్యాసమహర్షి, కన్నతల్లి వంటి కాశీనగరాన్నీ శపించబోయాడు. కోపంతో దుర్వాసుడు, విశ్వామిత్రుడు వంటి మహర్షులు ఎన్నో కష్టాలు పడ్డారు. కోపం వల్ల జ్ఞానం నశిస్తుంది. తమోగుణం పెరుగిపోతుంది. కోపం వల్లనే, పాపకార్యాలు చేయడానికి మనిషి సిద్ధపడతాడు. కోపం వల్లనే మోహం పెరుగుతుందని గీతాకారుడు చెప్పాడు. 

IV) తరగతి గదిలో రాయవలసిన అంశాలు 

అ) “ కోపం తగ్గించుకోవడం మంచిది !” అనే అంశాన్ని బోధిస్తూ మిత్రునికి లేఖ రాయండి.

ఆ) మీకు తెలిసిన జాతీయాలు, సామెతలు రాయండి. వాటిని ఏ సందర్భంలో ఉపయోగిస్తామో చెప్పండి.

V) గైహికము (ఇంటిపని)

అ) చుక్కపద్యాలు కంఠస్థo చేసి ప్రతిపదార్థాలు రాయండి.

ఆ) ప్రశ్నజవాబులు చదువండి. రాయండి 

VI) పదజాలం 

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.

అ) ద్వాఃకవాటంబు దెఱవదు వనిత యొకతె.

జ:       స్త్రీ        పురంధ్రి           అంగన        పడతి         నారి

ఆ) ప్రక్షాళితంబైన పసిడి చట్టువము.

జ:      బంగారము          సువర్ణము       కనకము        హిరణ్యము        పైడి 

ఇ) పారాశర్యుoడు క్షుత్పిపాసా పరవశుండై శపియింపదలంచెను.

జ:  వ్యాసుడు           బాదరాయణుడు           సాత్యవతేయుడు                కృష్ణ ద్వైపాయనుడు

ఈ) ఇవ్వీటి మీద నాగ్రహము తగునె ?

జ:  కోపము            క్రోధము           రోషము            కినుక

ఉ) అస్తమింపగా జేసినాడు ఆహిమకరుడు.

జ: సూర్యుడు           రవి          ఆదిత్యుడు           భాస్కరుడు  

2. కింది పదాలకు అర్థాలను రాయండి.

అ)   ద్వాఃకవాటంబు   =   ద్వారపు తలుపు 

ఆ)   వీక్షించు           =   చూచు 

ఇ)    అంగన            =   స్త్రీ 

ఈ)   మచ్చెకంటి       =   చేప వంటి కన్నులు కలది. (స్త్రీ)

ఉ)    భుక్తిశాల         =   భోజనశాల 

3. కింది వాక్యాలలోని నానార్థాలను గుర్తించి రాయండి.

అ) వీడు ఏ వీడు వాడో గాని దుష్కార్యములను వీడుచున్నాడు.

జ:  ఇతడు (ఈ మనిషి)       పట్టణము           వదులుట

ఆ)  రాజు ఆకాశంలోని రాజును చూసి సంతోషించాడు.

జ:  క్షత్రియుడు             చంద్రుడు             ప్రభువు 

4. ప్రకృతి - వికృతులు

     విద్య           -   విద్దె 

     భిక్షము       -   బిచ్చము 

     యాత్ర         -    జాతర 

     మత్స్యము    -    మచ్చెము

     రత్నము      -    రతనము

     పంక్తి           -    బంతి

VII) వ్యాకరణాంశాలు 

1. కింది పదాలు విడదీసి, సంధి పేరు రాయండి.

అ) పుణ్యాంగన                పుణ్య  +  అంగన         (సవర్ణదీర్ఘ సంధి)  

ఆ) యివ్వీటి                   ఈ      +  వీటి             (త్రిక సంధి)

ఇ) మునీశ్వర                  ముని  +  ఈశ్వర         (సవర్ణదీర్ఘ సంధి)  


VIII) ప్రశ్నలనిధి 

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) శ్రీనాథుని గురించి రాయండి.

ఆ) వ్యాసునికి పాత్ర స్వభావాన్ని వివరించండి.

ఇ) “ నేఁడు నిన్నటికి మఱునాఁడు నిక్కవంబు “ అను మాటలు ఎవరు ఎవరితో, ఏ సందర్భంలో అన్నారు? వీటి అంతరార్థమేమిటో వివరించండి.

ఈ) కోపం వల్ల వ్యాసుడు కాశీ నగరాన్ని శపించాలనుకున్నాడు కదా ! “ కోపం - మనిషి విచక్షణను నశింపచేస్తుంది”. దాని గురించి రాయండి. 


2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) భిక్ష పాఠంలోని కథను సంక్షిప్తంగా రాయండి.

ఆ) కోపం వల్ల కలిగే దుష్పరిణామాలను గూర్చి రాయండి.

IX) నికష 

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.             6మా

అ) వ్యాసునికి పాత్ర స్వభావాన్ని వివరించండి.

ఆ) “ నేఁడు నిన్నటికి మఱునాఁడు నిక్కవంబు “ అను మాటలు ఎవరు ఎవరితో, ఏ సందర్భంలో అన్నారు? వీటి అంతరార్థమేమిటో వివరించండి.

2. కింది పదాలకు అర్థాలను రాయండి.                                       2మా

అ)   ద్వాఃకవాటంబు                            ఆ) అంగన             

3. కింది పదాలు విడదీసి, సంధి పేరు రాయండి.                           2మా 

  అ) పుణ్యాంగన                                  ఆ) యివ్వీటి                   





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu