8.లక్ష్య సిద్ధి
I) పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు
తెలంగాణ తొలిదశ – మలిదశ ఉద్యమాల గురించి చెప్పగలగాలి. రాయగలగాలి.
సంపాదకీయ వ్యాసం గురించి సొంత మాటల్లో రాయగలగాలి.
పత్రికల్లో సంపాదకీయాలు ఎందుకు రాస్తారో చెప్పగలగాలి.
అతిశయోక్తి, స్వభావోక్తి అలంకారాలను గుర్తించగలగాలి.
II) ముఖ్య పదాలు - అర్థాలు
సజీవంగా = ప్రాణ సహితంగా
శకం = రాజ్యకాలం
క్షణం = సమయం
తారలు = నక్షత్రాలు
బాష్పాలు = కన్నీళ్ళు
ముసురుకొని = కమ్ముకొని
నినాదాలు = ధ్వనులు
స్వీయరాష్ట్రం = సొంతరాష్ట్రం
తత్త్వo = స్వభావం
వివక్ష = భేదం
III) చర్చనీయ అంశాలు
1. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో స్పందన .......
‘తెలంగాణ రాష్ట్ర సిద్ధి’ కల సాకారమవుతుందన్న ఆశ ఇక్కడి వాళ్లందరి మనస్సులో బలంగా వెలుగుతున్నా, సుడిగాలి లాంటి ఆంధ్రనాయకుల విజృoభణ ఏ క్షణాన ఎలాంటి పరిణామాలు కొని తెస్తుందోనన్న అనుమానం కుదిపేస్తుంది. గతంలో చాలా సార్లు నోటిదాకా వచ్చిన ముద్ద జారిపడ్డ గత అనుభవాలే ఈ అనుమానానికి కారణం. కాని, అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ప్రకటించింది. బీజేపి కూడా తన మాటను నిలబెట్టుకుంది. రెండు నాల్కల ధోరణి అనుసరించిన వాళ్లు కుదేలైపోయారు. మసిపూసి మారేడుకాయ చేసి మంచిపేరు తెచ్చుకోవాలని ఆరాటపడ్డవాళ్ల ఆటలు సాగలేదు. ఆంధ్రానాయకుల నిరసనలు తెలంగాణ ప్రాంతానికి చెందిన తీపికబురును అడ్డుకోలేక పోయాయి. తెలంగాణ ప్రకటన విషయాన్ని చాలా మంది నమ్మలేకపోయారు. ఎట్టకేలకు షాక్ నుంచి తేరుకొని అర్థరాత్రి వేళ ఆకాశాన్నంటే సంబురాలను ఆనందంగా జరుపుకున్నారు. ఎక్కడి వాళ్ళక్కడ తీన్మార్ దరువులతో, డాన్సులతో, బతుకమ్మ ఆటలతో, ఉద్యమం పాటలతో
ఆకాశమే హద్దుగా ఆనంద నృత్యాలు చేశారు. ఉద్యమ స్మృతులను నెమరువేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. మాటిమాటికి అమరవీరులకు జోహార్లు అర్పించారు. బాణాసంచా వెలుగులతో అర్థరాత్రిని పట్టపగలుగా మార్చారు. ఒక కొత్తశకం ప్రారంభమైన వైనాన్ని పత్రికలన్నీ ముక్తకంఠoతో అభినందిచాయి. మేమంతా వీధుల్లోకి వెళ్లి మిఠాయిలు తినిపించుకున్నాo. డాన్సులు చేసి అబినందించుకున్నాo.
2. తెలంగాణ ప్రాంత ప్రజల హృదయాలను ఆర్ద్రంగా మార్చిన పోరాట ఘట్టాలు :
తెలంగాణ ఏర్పాటు కోసం సాగిన రెండు దశల ఉద్యమంలో తొలిదశ ఉద్యమానికి సంబంధించి ఈ తరం వారికి ప్రత్యక్ష నిదర్శనాలు అంతగా అందుబాటులో లేవు. కాని మలిదశ ఉద్యమంలో మాత్రం ఎన్నో సంఘటనలు ప్రజలను కలచివేశాయి. కన్నీరు వరదలై పారిన సంఘటనలు, హృదయం చెమ్మగిల్లేలా చేశాయి. 2001 లో ప్రారంభమైన మలిదశ ఉద్యమం చాలా ఉధృతంగా సాగింది. 2010 – 11లో కొంచెం నెమ్మదించినట్టు ఉన్నా, 2012లో పడిలేచిన కెరటమై విజృoభించింది. స్త్రీలు, బాలురు, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు, రోజుకూలీలు, ఆటోకార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, కులసంఘాలు..... పల్లెలు, పట్నాలు, నగరాలు, వీధులు, వాడలు అన్నీ కలిపి ఉప్పెనై సీమాంధ్ర నాయకులను ముంచెత్తాయి. ఆ సందర్భంగా మనసులను చెమ్మగిల్లేలా చేసిన వాటిలో కొన్ని........
అ) శ్రీకాంతాచారి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకోవడం.
ఆ) కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం.
ఇ) పార్లమెంట్ భవన్ సమీపంలో యాదిరెడ్డి ఆత్మార్పణ గావించడం.
ఈ) ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై విచక్షణా రహితంగా బాష్పవాయువు ప్రయోగించడం, లాఠీలతో విపరీతంగా కొట్టడం.
ఉ) సీమాంధ్రుల సమైక్యవాద సభ ఎల్.బి స్టేడియంలో జరుగుతున్నప్పుడు, అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పోలీస్ ‘జై తెలంగాణ’ నినాదం చేసి అధికారులచే శిక్ష ఎదుర్కోవడం..... ఇలా ఎన్నెన్నో ఆర్ద్రమైన జ్ఞాపకాలు ఇప్పటికీ, ఇంకా పచ్చిగానే ఉన్నాయి.
3. ‘జై తెలంగాణ’ నినాదం బలపడటానికి దారితీసిన పరిస్థితులు, పర్యవసానాలు.......
నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటాన్ని మొదటి నుంచి ఇక్కడి ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అప్పటి ప్రధాని ‘జవహర్ లాల్ నెహ్రూ’ ఇది తాత్కాలిత బంధమే. అన్న ఆపద్దర్మ సూత్రంతో రెండు ప్రాంతాలను ముడివేశాడు. ఆనాటి నుంచి 2014 జూన్ 2 వరకు ఆ బలహీనమైన బంధం తుమ్మితే ఊడిపడే ముక్కులాగే సాగింది. అయితే ముల్కీ నిబంధనల ప్రకారం ఇక్కడి స్థానిక ప్రజలకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే, పరిస్థితులు ఇంత దారుణంగా మారేవి కాదు. క్రమక్రమంగా తెలంగాణేతర ప్రాంతీయుల ఆధిపత్యం బలపడటం, పాలకవర్గంలో వాళ్ల బలం అధికం కావడంతో తమకు అన్యాయం జరుగుతుందన్న స్పృహ కలిగింది తెలంగాణ ప్రజల్లో. అది అంతకంతకూ తీవ్రమై 1969లో ఉధృతరూపం దాల్చింది. ‘జై తెలంగాణ’ నినాదం ఊపిరి పోసుకుంది. ఒక్కసారి ప్రజల నాలుకల మీదికి వచ్చిన ఈ నినాదం ఇప్పటికీ అలసట లేకుండా నర్తిస్తోంది. ఒకప్పుడు ఆర్తితో, ఇప్పుడు ఆనందంతో.
వలస పాలకుల వివక్షపూరిత నిర్ణయాలు, పెత్తనాలు, అవమానాలు, అమర్యాదలు, పక్షపాత ధోరణులు, ఒంటెద్దు పోకడలు, అణచివేత విధానాలు ‘జై తెలంగాణ’ నినాదం మరింతగా బలపడేటట్లు చేశాయి.
4. గన్ పార్క్ అమరవీరుల స్తూపoతో ముడిపడిన సంఘటనలు......
తొలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీర పోరాటయోధుల స్మృతి చిహ్నంగా 1969లో గన్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన స్తూపమే అమరవీరుల స్తూపం. దీని రూపశిల్పి ఎక్కా యాదగిరి. గత అర్థశతాబ్దంగా ఈ స్తూపం తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తిని రగుల్కొల్పుతూనే ఉంది. తెలంగాణలోని చాలా ఉద్యమాలు ఇక్కడే ప్రారంభం కావడం ఆనవాయితీగా మారింది.
తొలిదశ ఉద్యమంలో 258 మంది బలిదానానికి గుర్తుగా ఈ స్తూపాన్ని నిర్మించారు. నలుపు, తెలుపు, ఎరుపు రంగుల రాళ్లను స్తూప నిర్మాణానికి ఉపయోగించడం భిన్నమైన విషాదాలకు సంకేతం. అశోకచక్రం గుర్తు రాజ్యాంగ హక్కులకు ప్రతీక. మెడలాంటి నిలువు చారలు తుపాకి తూటాలను గుర్తు చేస్తాయి. శిఖర భాగంలోని తెల్లని పువ్వు స్వేచ్ఛకు సంకేతం. తెలంగాణ ఉద్యమం ఆరంభం నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకు అనేక కార్యక్రమాలకు ఈ స్తూపం వేదికగా నిలిచింది. నిరాహారదీక్షలు, ప్రతిజ్ఞలు, మానవహారాలు, తీర్మానాలు, సభలు – ర్యాలీల ఆరంభాలకు ఇదే వేదిక. లాఠీలకు తూటాలకు కూడా ఇదే మౌనసాక్షి.
5. తెలంగాణ పునర్నిర్మాణoలో చేపట్టవలసిన తక్షణ చర్యలు......
తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా రాష్ట్ర పునర్నిర్మాణంలో చేపట్టవలసిన అంశాలను గురించి నమస్తే తెలంగాణ పత్రిక సంపాదకుడు ఆశించినవి.
అ) తెలంగాణ భాష, సంస్కృతులకు ప్రాణం పోయాలె.
ఆ) తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్దరించుకోవాలె.
ఇ) ప్రజలకు కడుపు నిండాతిండి, కలతలేని నిద్రా, భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలె.
ఈ) సంక్షేప పథకాలు చేపట్టాలె.
ఉ) నీటి పారుదల రంగంలో జరిగిన అన్యాయాలు చక్కదిద్దాలె.
ఊ) పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టాలె.
IV) పాఠ్యపుస్తకములోని ప్రశ్నజవాబులు
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలల్లో జవాబులు రాయండి.
అ) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు?
జ: అది తెలంగాణ పోరాటం గమ్యాన్ని అందుకున్న శుభక్షణం. తెలంగాణ జాతి చరిత్రలో అది అరుదైన క్షణం. అద్భుతమైన క్షణం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సమయంలో మూడు తరాల పిల్లల కన్నుల నుండి భావోద్వేగంతో ఆనందబాష్పాలు కారాయి. ఆనందోత్సాహాలతో పాటు పోరాట జ్ఞాపకాలు కూడా ముసురుకొని, తెలంగాణ ప్రజల హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి.అందుకే రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో అద్భుత ఘట్టంగా అనుకుంటున్నారు.
ఆ) సంపాదకీయాల్లోని భాష, శైలి ఎట్లా ఉంటుంది ?
జ: సంపాదకీయాల్లో సృజనాత్మక శైలి వాడుతారు. సంపాదకీయం రచన, సరళంగా, సూటిగా, నిష్కర్షగా, సాధికారంగా, సులభగ్రాహ్యంగా ఉండాలి. సంక్లిష్టమైన అంశాలనూ, జనభవితవ్యాన్ని, వర్తమానాన్ని ప్రభావితం చేసే అంశాలను విశ్లేషించి పాఠకునికి అందివ్వాలి. సంపాదకీయాల్లో ఆసక్తిని కల్గించే ఎత్తుగడ, వివరణ, ముగింపు అవసరం. పత్రికా హృదయమే సంపాదకీయం. సృజనాత్మక శైలి ఎక్కువగా సంపాదకీయల్లోనూ, ప్రత్యేకవ్యాసాల్లోనూ కనిపిస్తుంది.
ఇ) సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు ?
జ: పత్రికలో అతి ముఖ్యమైన రచన, సంపాదకీయం అని కొందరు చెప్పారు. పత్రికా హృదయమే సంపాదకీయమని కొందరు చెప్పారు.ప్రజల అభిప్రాయాలు వారికే వ్యాఖ్యానించి చూపి, మార్గనిర్దేశనం చేసేందుకు, సమస్యలపై స్పందించేలా నిర్మాణాత్మకంగా ఆలోచింపజేసేoదుకు, సంపాదకీయం రాస్తారు. తక్షణ సమస్యలపై, తాజా వార్తలపై, సంఘటనలపై చేసే పరిశోధన, ఆలోచనల వ్యాఖ్యానమే సంపాదకీయం. సంపాదకీయంలో ఆసక్తిని కల్గించే ఎత్తుగడ, వివరణ, ముగింపు ఉంటాయి. సంపాదకీయాలు, సమాజ చైతన్యానికి తోడ్పడతాయి. తక్కువ మాటల్లో, పాఠకులను ఆలోచింపచేసేటట్లు, ఆకట్టుకునేటట్లు, సంపాదకీయాలు రాస్తారు.
ఈ) పత్రికల్లోని సంపాదకీయలకు, సాధారణ వార్తాంశాలకు మధ్యనున్న భేదాలేవి ?
జ: పత్రికల్లో సంపాదకీయలకు సృజనాత్మక శైలి వాడాలి. వార్తా రచనలో కల్పనలకూ, అతిశయోక్తులకూ చోట్టివ్వరాదు. ప్రజలపట్ల, ప్రభుత్వ అధికార యంత్రాంగం పట్ల బాధ్యత కల్గి వార్తారచన చేయాలి. సంపాదకీయ రచన, సరళంగా, సూటిగా, నిష్కర్షగా, సాధికారంగా, సులభగ్రాహ్యంగా ఉండాలి. వార్త వ్యాసాలలాగే సంపదకీయాల్లో కూడా, ఆసక్తిని కల్గించే ఎత్తుగడ, వివరణ, ముగింపు అవసరం. వార్తలను సక్షేపించి రాయాలి. పత్రికల్లో వార్తా రచనలో భాష చాలా సరళంగా ఉండాలి. చిన్న చిన్న వాక్యాలలో రచన సాగాలి. చిన్న పదాలలో చెప్పదగిన భావాన్ని, చిన్న మాటలోనే సూచించాలి. పెద్ద మాటలను అనవసరంగా ఉపయోగించకూడదు.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) “ ఒక పత్రికలోని సంపాదకీయాలను చదివితే ఆ పత్రిక ఆలోచనా ధోరణులను, దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చు”. దీనిపట్ల మీ అభిప్రాయాలను సోదాహరణంగా వివరించండి.
జ: సంపాదకీయం చదివితే ఆ పత్రిక ఆలోచనా ధోరణినీ, దృక్పథాన్ని తెలుసుకోవచ్చు అన్నమాట యథార్థము. మన రాష్ట్రంలో వెలువడే “నమస్తే తెలంగాణా” పత్రిక, ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ గారు చేసిన ప్రతి పనిని సమర్థిస్తుంది.“నమస్తే తెలంగాణా” పత్రిక ప్రభుత్వానికి అనుకూలంగా రాస్తుంది. అదే ఈనాడు పత్రిక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది. ఈనాడు పత్రిక తెలుగుదేశం పార్టీకీ అనుకూలంగా రాస్తుంది. ఈనాడు పత్రిక సంపాదకీయాలు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటాయి. నమస్తే తెలంగాణా పత్రిక, కే.సీ.ఆర్ పార్టీ పెట్టిన పత్రిక. అందుకే దాని సంపాదకీయంలో కే.సీ.ఆర్ ముఖ్యమంత్రిగా చేసిన తొలి ప్రసంగాన్ని ఆ పత్రిక మెచ్చుకుంటూ రాసింది. కే.సీ.ఆర్ సంక్షేమ రాజ్యానికి అనుగుణమైన హామీలు ఇచ్చాడని ఆయనను పొగిడింది. కే.సీ.ఆర్ రుణాలమాఫీ చేస్తానన్నాడనీ, పేదలకు రెండు పడక గదుల ఇల్లు కట్టిస్తానన్నాడనీ మెచ్చుకుంది.
V) తరగతి గదిలో రాయవలసిన అంశాలు :
1. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ఏదైనా ప్రధాన సామాజికాంశం / సంఘటనల ఆధారంగా సంపాదకీయ వ్యాసం రాయండి.
2. దిన పత్రికలకు సంబంధించిన పదజాలం ఆధారంగా భావనా చిత్రాన్ని గీయండి.
VI) గైహికము (ఇంటిపని)
1. పుటసంఖ్య 82లోని పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
2. ప్రశ్నజవాబులు చదువండి. రాయండి.
VII) పదజాలo :
1. కింది పదాలు ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) ముసురుకొను - మామిడి పండుపై ఈగలు ముసురుతున్నాయి.
ఆ) ప్రాణంపోయు - ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కే.సీ.ఆర్. ప్రాణం పోశారు.
ఇ) గొంతు వినిపించు - పాటపాడి గొంతు వినిపించుమని ప్రేక్షకులు అంతా అడిగారు.
ఈ) యజ్ఞం - వర్షాలు కావాలని, ప్రజలు వరుణ యజ్ఞం తలపెట్టారు.
2. కింది పదాలకు పర్యాయపదాలు రాసి, వాటితో వాక్యాలు రాయండి.
అ) జ్ఞాపకం = జ్ఞప్తి , స్మృతి
వాక్యప్రయోగం : కాళిదాసు శ్లోకాలు, నాకు స్మృతి పథంలో లేవు.
ఆ) పోరాటం = యుద్ధం, సమరం
వాక్యప్రయోగం : అన్నదమ్ముల మధ్య సమరం మంచిది కాదు.
ఇ) విషాదం = ఖేదం, దుఖం
వాక్యప్రయోగం : మనిషికి అత్యాశ ఉంటే దుఃఖం తప్పదు.
సంస్కరణ = సంస్కారం, సంస్క్రియ
వాక్యప్రయోగం : దేశాభివృద్ధికి ఉత్తమ సంస్కారాలు అమలు చేయాలి.
VIII) వ్యాకరణాంశాలు :
1. కింది ప్రత్యక్ష కథన వాక్యాలను పరోక్ష కథనంలోకి మార్చండి.
అ) రాజకీయ పార్టీలవారు “జనానికి తక్షణo కావాల్సింది కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర” అని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు. (ప్రత్యక్ష కథన వాక్యo)
జ: ) రాజకీయ పార్టీలవారు జనానికి కావాల్సింది కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర అని, ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు. (పరోక్ష కథన వాక్యం)
ఆ)“సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది” అని నెహ్రూ అన్నారు.(ప్రత్యక్ష కథన వాక్యo)
జ: సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుందని నెహ్రూ అన్నాడు. (పరోక్ష కథన వాక్యం)
2. కింది పరోక్ష కథన వాక్యాలను ప్రత్యక్ష కథనoలోకి మార్చండి.
అ) పరిపాలన రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరమని ముఖ్యమంత్రి ప్రకటించాడు. (పరోక్ష కథన వాక్యం)
జ: “పరిపాలన రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరo” అని ముఖ్యమంత్రి ప్రకటించాడు. (ప్రత్యక్ష కథన వాక్యo)
ఆ) సమాజాన్ని సంక్షేమపథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరని మేధావులు నిర్ణయించారు. (పరోక్ష కథన వాక్యం)
జ:“సమాజాన్ని సంక్షేమపథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి” అని మేధావులు నిర్ణయించారు.(ప్రత్యక్ష కథన వాక్యo)
ఇ) తెలుగులోనే రాయండని, తెలుగే మాట్లాడండని టీ.వీ ఛానల్లో ప్రసారం చేశారు. (పరోక్ష కథన వాక్యం)
జ: “తెలుగులోనే రాయండి. తెలుగే మాట్లాడండి” అని టీ.వీ ఛానల్లో ప్రసారం చేశారు. (ప్రత్యక్ష కథన వాక్యo)
3. కింది పదాలను విడదీసి, సంధులను గుర్తించి, సూత్రాలు రాయండి.
అ) ప్రపంచమంతా :
జ: ప్రపంచము + అంతా - ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యంగా వస్తుంది.
ఆ) అత్యద్భుతం :
జ: అతి + అద్భుతం - యణాదేశసంధి
సూత్రం : ఇ, ఉ, ఋ, లకు అసవర్ణమైన అచ్చులు పరమైతే య, వ, ర, లు ఆదేశంగా వస్తాయి.
ఇ) సచివాలయం
జ: సచివ + ఆలయం
సూత్రం : అ, ఇ, ఉ, ఋ, లకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశoగా వస్తుంది.
4. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.
అ) బృహత్కార్యం :
జ: బృహత్తు అయిన కార్యం - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) శక్తియుక్తులు :
శక్తియును, యుక్తియును - ద్వంద్వ సమాసం
ఇ) సంక్షేమపథకాలు :
జ: సంక్షేమం కొఱకు పథకాలు - చతుర్థీ తత్పురుష సమాసం
IX) ప్రశ్నలనిధి
అ) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు?
ఆ) సంపాదకీయాల్లోని భాష, శైలి ఎట్లా ఉంటుంది ?
ఇ) సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు ?
ఈ) పత్రికల్లోని సంపాదకీయలకు, సాధారణ వార్తాంశాలకు మధ్యనున్న భేదాలేవి ?
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) “ ఒక పత్రికలోని సంపాదకీయాలను చదివితే ఆ పత్రిక ఆలోచనా ధోరణులను, దృక్పథాన్ని అర్థం
చేసుకోవచ్చు”. దీనిపట్ల మీ అభిప్రాయాలను సోదాహరణంగా వివరించండి.
X) నికష :
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలల్లో జవాబులు రాయండి. 4మా
అ) సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు ?
ఆ) పత్రికల్లోని సంపాదకీయలకు, సాధారణ వార్తాంశాలకు మధ్యనున్న భేదాలేవి ?
2. కింది పదాలు ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి. 2మా
అ) గొంతు వినిపించు ఆ) యజ్ఞం
3. కింది పదాలకు పర్యాయపదాలు రాయండి. 2మా
అ) విషాదం ఆ) జ్ఞాపకం
4. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి. 2మా
అ) సంక్షేమపథకాలు ఆ) బృహత్కార్యం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి