10. గోలకొండ పట్టణం
- ఆదిరాజు వీరభద్రరావు
I) పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు
గోలకొండ పట్టణ ప్రాముఖ్యతను తెలుసుకోగలగాలి.
పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయగలగాలి.
నాటి చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాలు సొంతమాటల్లో చెప్పగలగాలి.
వ్యాకరణాంశాల్లో భాగంగా “బహువ్రీహి సమాసాన్ని” అర్థం చేసుకోగలగడం.
II) ముఖ్య పదాలు – అర్థాలు :
హోనులు = నాల్గు రూపాయల విలువగల నాణెములు
హవు = నీటితొట్టె
హర్మ్యము = మేడ
కౌశల్యము = నేర్పు
దుర్లభము = కష్టం
కైవారం = చుట్టుకొలత
సరదార్లు = యోధులు
ఉపాహారము = చిరుతిండి, ఫలహారం
మొహల్లాలు = వీధులు
బాగ్ = తోట
రాజహర్మ్యములు = రాజుల మేడలు (రాజభవనాలు)
దుర్గము = కోట
III) చర్చనీయంశాలు
1. ఆజంఖాను :
గోలకొండ పట్టణ నిర్మాణ పథకం రూపకర్త ఆజంఖాను. ఇతడే గోలకొండ పట్టణం రూపురేఖలు దిద్దాడు. పట్టణాన్ని అనేక విభాగాలు చేసి, ఆ విభాగాలకు మొహల్లాలని పేరు పెట్టాడు. పట్టణంలోని ఒక్కొక్క మొహల్లాలో ఒక ప్రముఖుడు నివసించడమో లేక ఒక్కొక్క మొహల్లా గురించి శ్రద్ధ వహించడమో జరిగేది. అందుకే మొహల్లాలకు ప్రముఖుల పేర్లు నిర్ణయించారు. ఉదా: మాదన్న మొహల్లా
2. గోలకొండ పట్టణం ప్రత్యేకతలు :
భారతదేశంలోని దక్షిణపథంలో పూర్వం ఏకైక పట్టణంగా ప్రసిద్ధి గాంచింది గోలకొండ పట్టణం. గోలకొండ మూడుకోటలుగా ఉంది. మొదటి కోట, రెండో కోటల మధ్య భాగంలో గోలకొండ పట్టణం విస్తరించి ఉన్నది. దుర్గానికి సుమారు ఏడు మైళ్ళ పరిధిలో ఎనభై బురుజులు, ఎనిమిది ద్వారాలు ఉండేవి. సుమారు నాలుగు మైళ్ళ విస్తీర్ణంలో గోలకొండ పట్టణం వెలిసింది. ఇందులో అనేక మొహల్లాలు ఉండేవి. విశాలమైన వీధులుoడేవి. పడమటిదిశలో రాజభవనాలు ఉండేవి. ధనవంతుల గృహాలతో పాటు ఉద్యోగస్తులకు భవనాలుఉండేవి. ఆలయాలు, మసీదులతోపాటు భిక్షగాళ్ళకు(ఫకీర్లకు) గృహాలు ఉండేవి. ఉద్యానవనాలు, స్నానమందిరాలుండేవి. పాఠశాల భవనాలూ ఉండేవి. మిద్దెల మీది తోటలు జలాశయాలు, నీటికాల్వలు, అంతరాళనందనం ఉండేవి. ఈ అంతరాళనందనం బాబిలోనియాలోని నందనాన్ని పోలి ఉండేది. వాయవ్యదిశలో దొడ్డ బాల్బోవావృక్షం ఒకటి ఉండేది. దాని పాదంలోని తొర్రలో ఒక టేబుల్, నాలుగు కుర్చీలు వేసుకొని కుర్చునేవాళ్ళు.
3. గోలకొండ పట్టణం - రాకపోకల జాగ్రత్తలు :
గోలకొండ పట్టణంలోకి రాకపోకలు చాలా కట్టుదిట్టంగా జరిగేవి.ఎందుకంటే అది రాజధాని. ఎంతో ఖరీదైన వర్తక వ్యాపారాలు జరిగేవి. ముఖ్యమైన రాజపరివారం అంతా అక్కడే నివాసం ఉండేది. విదేశీప్రముఖులు చాలామంది వస్తూ పోతూ ఉండేవారు.
రాజు, రాజకుటుంబం, రాజపరివారాన్ని కంటికి రెప్పలా కాపాడటం సైనిక వ్యవస్థ ప్రధాన భాద్యత.
విదేశీయులు, గూడాచారులు, దొంగలు, మోసగాళ్ళు చొరపడే అవకాశం ఎక్కువగా ఉండేది. వాళ్లను అరికట్టడం, దొరికితే పనిపట్టడం రక్షణ విభాగం కర్తవ్యం.
అక్రమ వ్యాపారం, అనైతిక వ్యవహారాలను అడ్డుకోవలసిన అవసరం ఉంది.
ఇతరుల ప్రవేశం ఇక్కడి ప్రజా జీవితంలో ఇబ్బందులు కలిగించడం, వాటిని అరికట్టడం కోసం సైనికులు, భటులు అప్రమత్తంగా ఉండడం వంటివి పకడ్బందీగా జరిగేవి.
4. గోలకొండ పాదుషాల జీవకారుణ్యం, ప్రకృతియత్వం :
గోలకొండ పాదుషాల కోటలో ఒక ఉండేది. అది జింకల వనం. అక్కడ జింకలు స్వేచ్ఛగా విహరించేవి. వాటిని కొట్టకూడదని ఆంక్షపెట్టారు. ఇప్పటికీ గోలకొండ సమీపంలో జింకల పార్కు ఉంది. కోటలో ఉద్యానవనాలను విరివిగా పెంచారు. ద్రాక్షతోటలు పెంచారు. ఆ కాలంలోనే మిద్దెమీది తోటలు పెంచడం పాదుషాల ప్రకృతి ప్రియత్వానికి నిదర్శనం.
IV) పాఠ్య పుస్తకంలోని ప్రశ్నలకు జవాబులు
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
అ) “గోలకొండ పాదుషాలు సాహిత్య పోషకులు” అనడానికి ఉదాహరణలు తెలుపండి
జ: గోలకొండ పాదుషాలలో ఇబ్రహీం కుతుబ్ షా మంచి విద్యాప్రియుడు. ఇతని ఆస్థానంలో హిందూ, మహమ్మదీయ కవులు, పండితులు ఉండేవారు. ఇతడు విజయనగరంలో రాజాదరణలో పెరిగి తెలుగు భాషా మాధుర్యాన్ని రుచి చూశాడు. అందుకే తెలుగుభాషపై అభిమానంతో తెలుగు కవులను సత్కరించేవాడు.
ఇతడు అద్దంకి గంగాధర కవిచే ‘తపతీ సంవరణోపాఖ్యానం’ కావ్యం రాయించి అంకితం తీసుకొన్నాడు. ఇతడు మరింగంటి సింగరాచార్య కవిని గొప్పగా సత్కరించాడు. ఇతని సేనాని అమీర్ ఖాన్, పొన్నగంటి తెలగనార్యుడిచే ‘యయాతి చరిత్ర’ అనే అచ్చ తెలుగు కావ్యాన్ని రాయించి అంకితం తీసుకున్నాడు.
అబ్దుల్లా పాదుషా, విజ్ఞాన శాస్త్రములను, లలితకళలను వృద్ధి చేయడానికి ప్రయత్నిoచాడు. పై విషయాలను బట్టి గోలకొండ పాదుషాలు సాహిత్య పోషకులని చెప్పవచ్చు.
ఆ) నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చస్థితిలో ఉందని ఎట్లా చెప్పగలరు ?
జ: తెలంగాణమును, గోలకొండ రాజధానిగా పాలించిన నవాబులలో ఇబ్రహీం కులీకుతుబ్ షా మంచి విద్యాప్రియుడు. ఇతడు కొంతకాలం విజయనగరంలో రాజాదరణలో పెరిగి ఆంధ్రభాషపై అభిమానం కలిగి తెలుగు కవులను సన్మా నిoచాడు. అద్దంకి గంగాధరకవి ‘తపతీ సంవరణోపాఖ్యానం’ అనే కావ్యాన్ని రాసి, ఇబ్రహీం కులీకుతుబ్ షాకు అంకితం ఇచ్చాడు. ఇబ్రహీం పాదుషా మరింగంటి సింగరాచార్య మహాకవికీ ఏనుగులు, తెల్లగొడుగు, గుఱ్ఱాలు, బంగారం, వస్త్రాలు, పల్లకీలు, ఇచ్చాడు.
ఇబ్రహీం పాదుషా సేనాని అమీర్ ఖాన్, పొన్నగంటి తెలగనార్యుడిచే అచ్చ తెలుగు కావ్యం, యయాతి చరిత్ర రాయించి అంకితం తీసుకున్నాడు. దీనిని బట్టి నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చస్థితిలో ఉందని చెప్పవచ్చు.
ఇ) “తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడి” అనడానికి కారణాలు రాయండి.
జ: గోలకొండ పట్టణములో వర్తక ప్రముఖులు విదేశాలతో వర్తకము చేస్తూ కుబేరులతో సమంగా ఉండేవారు. గోలకొండలో అన్ని వస్తువులు దొరికేవి. గోలకొండ వజ్రాలకు పుట్టినిల్లు. విదేశాలనుండి వచ్చే సరుకులు బందరు రేవు ద్వారా గోలకొండకు వచ్చేవి. విదేశీవ్యాపారం చేసే వారిలో డచ్చివారు ప్రధానంగా ఉండేవారు. ఈ వర్తకం, గోలకొండ పట్టణం ప్రధాన కేంద్రంగా తెలంగాణలో అంతా జరిగేది.
ఇబ్రహీం కులీకుతుబ్ షా కాలంలో తెలంగాణం, ఈజిప్టు వలె ప్రపంచపు అంగడిగా ఉండేది. తుర్కిస్థాన్, అరేబియా, పారశీకము మొదలైన దేశాలనుండి వర్తకులు వచ్చేవారు.
ఈ) ఈనాడు పట్టణాలలో జనాభా అధికమవడం వలన కలిగే ఇబ్బందులు ఏమిటి ?
జ: ఈనాడు పట్టణాలలో జనాభా పెరిగిపోతుంది. దీనివల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి.
పట్టణంలో ప్రజల నివాసానికి సరిపడ ఇళ్ళు, వారికి తగినంత నీటివసతి, కావలసిన ఆహారపదార్థాలు లభ్యం కావడం లేదు.
పట్టణాలలో సరిపడ ఇళ్ళు లేకపోవడంతో ప్రజలు చేరువులనూ, ఖాళీ ప్రదేశాలను ఆక్రమించుకొని ఇళ్ళు కట్టుకుంటున్నారు. దానితో మురికివాడలు నగరంలో పెరిగిపోతున్నాయి. చెరువులలో నీరు లేక పోవడంతో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి.
వర్షం నీరు పోయే దారులు మూసుకుపోవడంతో, వర్షం వస్తే ఇళ్ళు మునుగుతున్నాయి. మురికి నీరు ప్రవహించే దారులు మూతపడుతున్నాయి.
పెరుగుతున్న జనాభాకు సరిపడ మంచినీరు, పాలు, నిత్యావసర వస్తువులు దొరకడం కష్టం అవుతుంది.
విద్యా, వైద్య, రవాణా సదుపాయాలు కల్పించడం కష్టం అవుతుంది.
ఇళ్ళ స్థలాల ధరలు పెరిగిపోతున్నాయి. పిల్లల చదువుల ఖర్చులు పెరిగిపోయాయి.
నగరవాసులకు మంచిగాలి, నీరు, ఎండ కూడా లభించడం లేదు. ఇరుకు కొంపలలో గాలి,వెలుతురు లేకుండా ప్రజలు జీవించవలసి వస్తుంది.
2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) గోలకొండ పట్టణం అందచందాలు, వైభవం, విశిష్టత గూర్చి విశ్లేషించండి.
జ: దక్షిణ భారతంలో గోలకొండ పట్టణం ప్రసిద్ధి చెందింది. గోలకొండ దుర్గం అంటే, మూడు కోటలు. ఈ దుర్గానికి ఏడు మైళ్ళ కైవారము, 87బురుజులు ఉన్నాయి. ఆజంఖాన్ అనే ఇంజనీరు ఈ గోలకొండ పట్టణ రూపశిల్పి. ఈ పట్టణంలో వీధులను మొహల్లాలు అనేవారు.
ఈ పట్టణంలో జనసమ్మర్దం ఎక్కువ. రాజభవనాలు పడమటి దిక్కున ఉండేవి. ఈ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి కులీకుతుబ్ షా పాదుషాలు మంచి శ్రద్ధ తీసుకున్నారు. ఇబ్రహీం కుతుబ్ షా పట్టణాన్ని అలంకార భూయిష్టంగా తీర్చిదిద్దాడు. ‘నగీనాబాగ్’ అనే అందమైన ఉద్యానవనం షాహిమహలు, దిల్ కుషా అనే రాజభవనాలు యుద్ధభటులకు రెండు బారకాసులు ఉండేవి. అందమైన మిద్దెలమీద తోటలు ఉండేవి. ఉద్యానవనాలకు నీటి సరఫరా ఏర్పాట్లు, ఉండేవి. 80 అడుగుల చుట్టుకొలత గల దొడ్డబాల్బోవా వృక్షం, దానిలో పెద్ద తొర్ర ఉండేది.
పట్టణంలో 40వేల ఇండ్లు, 2లక్షల ప్రజలు ఉండేవారు. పట్టణ ప్రజలకు కటోరా హవుజు ద్వారా మంచినీరు సరఫరా చేసే ఏర్పాటు ఉండేది. బజార్లలో అన్ని వస్తువులూ దొరికేవి. పట్టణంలోని సరుకులు బంజారా దర్వాజా గుండా వచ్చేవి. ఉమ్రావులు దర్జాగా డాబుసారిగా నగరంలో ఊరేగేవారు. ప్రజలందరూ వినోదాలతో భోగలాలసులై ఉండేవారు.
ఆ) గోలకొండ పట్టణం పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
జ: గోలకొండ దుర్గంలో మూడు కోటలు ఉండేవి. ఈ దుర్గం ఏడు మైళ్ళ కైవారంలో ఉంటుంది. ఈ పట్టణ నిర్మాణ పథకానికి కర్త ‘ఆజంఖాన్’ అనే ఇంజనీరు. పట్టణ వీధులను మొహల్లాలు అంటారు. పట్టణంలో జనసమ్మర్దం ఎక్కువ. గోలకొండ పట్టణాన్ని కులీకుతుబ్ షాలు అందంగా నిర్మించారు. ఇబ్రహీం కుతుబ్ షా పట్టణాన్నిఅందంగా తీర్చిదిద్దాడు.
పట్టణంలో నగీనాబాగ్’ అనే అందమైన తోట షాహిమహలు, దిల్ కుషా అందమైన రాజహర్శ్యములు. రెండు బారకాసులు ఉండేవి. మిద్దె మీద తోటలు ఉండేవి. అందమైన ఉద్యానవనాలు, వాటికి నీటి సరఫరా ఏర్పాట్లు ఉండేవి. ప్రజల సౌకర్యాలకు మహమ్మదు కులీ కుతుబ్ షా 78 లక్షల హానులు ఖర్చు చేశాడు. దుర్గంలోని కటోరా హవుజు నుండి ప్రజలకు నీటి సరఫరా చేసేవారు.
విదేశాలతో వర్తకం చేసి బాగా డబ్బు గడించిన వర్తకులు ఉండేవారు. బందరు రేవు నుండి విదేశీ వస్తువులు దిగుమతి చేసుకొనేవారు. ఆ రోజుల్లో హోను, పెగోడా వంటి నాణెములు చెలామణిలో ఉండేవి. కొత్తవారికి నగరంలోకి తేలికగా ప్రవేశం దొరికేది కాదు. ఉప్పుపై, పొగాకుపై పన్ను వేసేవారు.
గోలకొండ పాదుషాలలో ఇబ్రహీం కుతుబ్ షా మంచి సాహిత్య పోషకుడు. ఇతడూ, ఇతని సేనాని, తెలుగు కావ్యాలు అంకితం తీసుకున్నారు. కోటలో జింకలవనం, ద్రాక్షతోటలు ఉండేవి. 1589లో నగరంలో మశూచి వచ్చింది. సాధువులు భజనలు చేస్తే రోగం తగ్గింది. దానికి కృతజ్ఞతగా నగరంలో ‘చార్మినార్’ కట్టబడింది. నగరంలో దోషిని వెంటనే శిక్షించేవారు. 1687లో ఔరంగజేబు ఈ కోటను సర్వనాశనం చేశాడు.
V) తరగతి గదిలో రాయవలసిన అంశాలు:
అ) ఏదైనా ఒక పట్టణం లేదా ఊరి చారిత్రక / సాంస్కృతిక విశేషాలతో వ్యాసం రాయండి.
ఆ) గోలకొండ పాదుషాలు జీవకారుణ్యం గలవారని, ప్రకృతి ప్రేమికులని ఎట్లా చెప్పగలరు.
VI) గైహికము (ఇంటిపని )
అ) కింది పదాలను వివరించి రాయండి.
జలాశయం అగ్రహారం బంజారా దర్వాజా ద్రాక్షాసవము
ఆ) పుటసంఖ్య 104లోని పేరాను చదివి పట్టికను పూరించండి.
VII) పదజాలం:
1. కింది వాటిని సొంత వాక్యాల్లో ప్రయోగించండి.
అ) పుట్టినిల్లు : వరంగల్లు నగరం, కాకతీయ చారిత్రక వైభవానికి పుట్టినిల్లు.
ఆ) పాటుపడటం : ప్రతి వ్యక్తి తన జీవితాన్ని సుఖంగా సాగించడానికి పాటుపడటం తప్పదు.
ఇ) పీడవదలడం : దేశం బాగుపడాలంటే అవినీతి పీడవదలడం అతిముఖ్యం
ఈ) తలదాచుకోవడం : తుఫానుకు ఇల్లు కూలడంతో, రమేష్ కు తానూ, పిల్లలూ, తలదాచుకోవడం ఎలాగో తెలియలేదు.
VIII) వ్యాకరణాంశాలు:
1. కింది వాక్యాల్లోని సంధి పదాలను విడదీసి, అవి ఏ సంధులో రాయండి.
అ) పండుగ దినాలలో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి.
దేవాలయాలు = దేవ + ఆలయాలు
ఆ) మధురలోని రమ్యోద్యనములు చూపరుల మనస్సులను ఆకట్టుకుంటాయి.
రమ్యోద్యనములు = రమ్య + ఉద్యానములు
ఇ) ఛత్రపతి శివాజీ అశ్వారూఢుడు అయి శత్రువులను సంహరించాడు.
అశ్వారూఢుడు = అశ్వ + ఆరూఢుడు
ఈ) రాజాజ్ఞ లేనిదే ఏ కార్యక్రమాలు జరుపరు.
రాజాజ్ఞ = రాజ + ఆజ్ఞ
2. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లను రాయండి.
సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
అ. బ్రాహ్మణభక్తి బ్రాహ్మణుల యందు భక్తి సప్తమీ తత్పురుష సమాసం
ఆ. నీలవేణి నీలమైన వేణి కలది బహువ్రీహి సమాసం
ఇ. పుష్పగుచ్చం పుష్పముల యొక్క గుచ్చం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఈ. గోలకొండ పట్టణం గోలకొండ అనే పేరుగల పట్టణం సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
ఉ. గరళకంఠుడు గరళము కంఠమునందు కలవాడు బహువ్రీహి సమాసం
ఊ. సుందరాకారములు సుందరములైన ఆకారములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
దయాంతరంగుడు దయతో కూడిన అంతరంగము కలవాడు బహువ్రీహి సమాసం
అండచందములు అందమును, చందమును ద్వంద్వ సమాసం
3. కింది వాక్యాలను వ్యవహారభాషలోనికి మార్చండి.
అ) ఈ మందిరము నందే పారశీకపు రాయబారికిని, అతని అనుచర వర్గమునకు బస ఏర్పాటు చేసిరి.
జ: ఈ మందిరము నందే పారశీకపు రాయబారికీ, అతడి అనుచర వర్గానికీ బస ఏర్పాటు చేశారు.
ఆ) నీటి కాలువలు, జలాశయములు, జలపాతములు, అచ్చెరువు గొల్పుచుండెను.
జ: నీటి కాలువలూ, జలాశయాలూ, జలపాతాలూ, ఆశ్చర్యo కల్గిస్తున్నాయి.
ఇ) పెద్ద అధికారుల యొక్క మందిరములన్నియు లోపలి కోటలో నుండుచుండును.
జ: పెద్ద అధికారుల మందిరాలన్నీ లోపలి కోటలో ఉంటాయి.
ఈ) వజ్రములకు గోలకొండ పుట్టినిల్లే గదా !
జ: వజ్రాలకు గోలకొండ పుట్టినిల్లే కదా !
ఊ) పట్టణములోనికి సరుకంతయు బంజారా దర్వాజా ద్వారానే వచ్చుచుండును.
జ: పట్టణoలోకి సరుకంతా బంజారా దర్వాజా నుండే వస్తూంటుంది.
IX) ప్రశ్నలనిధి:
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
అ) “గోలకొండ పాదుషాలు సాహిత్య పోషకులు” అనడానికి ఉదాహరణలు తెలుపండి.
ఆ) నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చస్థితిలో ఉందని ఎట్లా చెప్పగలరు ?
ఇ) “తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడి” అనడానికి కారణాలు రాయండి.
ఈ) ఈనాడు పట్టణాలలో జనాభా అధికమవడం వలన కలిగే ఇబ్బందులు ఏమిటి ?
2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) గోలకొండ పట్టణం అందచందాలు, వైభవం, విశిష్టత గూర్చి విశ్లేషించండి.
ఆ) గోలకొండ పట్టణం పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
X) నికష:
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి. 4మా
అ) నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చస్థితిలో ఉందని ఎట్లా చెప్పగలరు ?
ఆ) ఈనాడు పట్టణాలలో జనాభా అధికమవడం వలన కలిగే ఇబ్బందులు ఏమిటి ?
2. కింది సంధి పదాలను విడదీసి, అవి ఏ సంధులో రాయండి. 2మా
అ) అశ్వారూఢుడు ఆ) రాజాజ్ఞ
3. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లను రాయండి. 2మా
అ) గరళకంఠుడు ఆ) సుందరాకారములు
4. కింది వాటిని సొంత వాక్యాల్లో ప్రయోగించండి. 2మా
అ) పుట్టినిల్లు ఆ) తలదాచుకోవడం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి