29, జనవరి 2023, ఆదివారం

7. శతక మధురిమ || 10th Class Telugu || Shataka Madhurima || Telugu notes

7. శతక మధురిమ 

I) పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు:

  •   నైతిక, ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకోవడం

  •  శతక పద్యాల ఆధారంగా మిత్రునికి లేఖ రాయగలగడం 

  •   ఆటవెలది పద్య లక్షణాలు తెలుసుకోవడం

  •  చుక్కపద్యాలు కంఠస్థo చేసి, ప్రతిపదార్థం రాయగలగాలి 

II) చుక్కపద్యాలు – ప్రతిపదార్థాలు

1. భవదీయార్చన సేయుచోఁ బ్రథమ పుష్పoబెన్న సత్యంబు, రెం

   డవ పుష్పంబు దయాగుణం, బతివిశిష్టం బేకనిష్ఠా సమో 

   త్సవ సంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యో 

   గవిధానం బవి లేని పూజల మదిoగైకోవు సర్వేశ్వరా. 

  ప్రతి పదార్థం:

సర్వేశ్వరా                      =   ఓ సర్వేశ్వరా !

భవదీయార్చన                 

(భవదీయ +  అర్చన)       =   నీ యొక్క పూజ

చేయుచోన్                     =   చేసేటప్పుడు 

సత్యంబు                       =   సత్య వచనం

ఎన్నన్                         =   పరిగణింపగా 

ప్రథమ పుష్పoబు            =    మొదటి పుష్పం 

దయాగుణం                   =    దయను కలిగి ఉండటం 

      రెండవ                         =   రెండవదైన  

      పుష్పoబు                     =   పుష్పం

      అతివిశిష్టంబు                 =   మిక్కిలి గొప్ప శ్రేష్ఠమైన 

      ఏకనిష్ఠా సమోత్సవ సంపత్తి; 

      ఏకనిష్ఠా                       =   (నీపై) ఏకాగ్రనిష్ఠతో

      సమోత్సవ సంపత్తి           =   నిండిన ఆనందాధిక్యం

      (సమ + ఉత్సవ, సంపత్తి)  

      తృతీయ పుష్పము          =    మూడవ పుష్పం    

      అది                           =     ఆ పూజ 

      భాస్వద్భక్తి సంయుక్తి యోగవిధానంబు ;

భాస్వత్                        =    మిక్కిలి ప్రకాశించే 

భక్తి సంయుక్తి                 =      భక్తితో కూడిన 

యోగవిధానంబు             =     అష్టాంగ యోగ విధి

అవి లేని పూజలన్           =    ఆ సత్యము, దయ, ఏకాగ్రత, యోగము అనేవి లేని పూజలను ;

మదిన్                         =    నీ మనస్సు నందు 

కైకోవు                         =    స్వీకరింపవు (గ్రహింపవు)

2. ఊరూరం జనులెల్ల భిక్షమిడరో, యుండంగుహల్గల్గవో

    చీరానీకము వీధులందొరకదో, శీతామృత స్వచ్ఛవాః

    పూరం బేరుల బారదో, తపసులం బ్రోవంగ నీవోపవో 

చేరం బోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా ! 

  ప్రతి పదార్థం:

శ్రీకాళహస్తీశ్వరా                 =   శ్రీకాళహస్తి క్షేత్రoలో వెలసిన ఓ ఈశ్వరా ! 

ఊరూరన్                         =   ప్రతి గ్రామంలోనూ    

జనులెల్లన్                       =   ప్రజలందరున్

(జనులు + ఎల్లన్)

 భిక్షమిడరో                      =   అడిగినచో భిక్షం పెట్టారా

(భిక్షము + ఇడరు + ఓ)

ఉందన్                           =   నివాసం ఉండడానికి ; (నివసించడానికి)

గుహల్                           =   గుహలు

కల్గవో (కల్గవు + ఓ)          =   లేవా ?

చీరానీకము                    =   నారబట్టల సముదాయం

(చీర + అనీకము)                      (చెట్టు పట్టలు)

వీధులన్                       =   వీధి అంగళ్ళలో 

దొరకదో                        =   లభింపదా ?

(దొరకదు + ఓ)

శీతామృత స్వచ్ఛవాఃపూరంబు ;

శీత                               =   చల్లని

అమృత                         =   అమృతం వంటి 

స్వచ్ఛ                           =  నిర్మలమైన 

వాఃపూరంబు                  =   నీటి ప్రవాహం 

ఏఱులన్                       =   సెలయేళ్ళలో

పాఱదో                         =    ప్రవాహించట్లేదా ?

(పాఱదు + ఓ)

తపసులన్                    =   ఋషులన్ (తపస్సు చేసుకునే మునులను)

ప్రోవంగన్                      =   రక్షించడానికి

 నీవు                           =   నీవు

ఓపవో                          =   సమర్థుడవు కావా !

(ఓపవు + ఓ)

జనుల్                         =   ప్రజలు

రాజులన్                      =    రాజులను 

చేరన్                          =    ఆశ్రయించడానికి 

పోవుదురేల                 =    ఎందుకు వెడతారో  కదా !

(పోవుదురు + ఏల)

     

3. సిరి లేకైన విభూషితుండె యయి భాసిల్లున్ బుధుoడౌదలన్

    గురుపాదానతి కేలనీగి చెవులoదున్విన్కి వక్త్రంబునన్  

     స్థిర సత్యోక్తి భుజంబులన్విజయమున్ చిత్తంబునన్ సన్మనో

     హర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా నీతివాచస్పతీ !

 ప్రతి పదార్థం:

సురభిమల్లా                   =    ఓ “సురభిమల్ల” భూపాలుడా!

నీతివాచస్పతీ                 =    నీతిశాస్త్రములయందు దేవతల గురువైన బృహస్పతి వంటి గొప్పవాడా !

ఔదలన్                         =    శిరస్సు  

గురుపాదానతి                

(గురుపాద + ఆనతి)

గురుపాద                       =    గురువు గారి పాదాలకు 

ఆనతి                            =    మ్రొక్కుటయు (నమస్కరించడమూ)

కేలన్                             =    చేతియందు

ఈగి                               =    దాన గుణమునూ

చెవులoదున్                   =    చెవులయందు

విన్కి                              =   శాస్త్ర శ్రవణమునూ (శాస్త్రములు వినుటయూ)

వక్త్రంబునన్                     =    ముఖమునందు

స్థిర సత్యోక్తి 

 స్థిర                               =   స్థిరమైన  

సత్యోక్తి (సత్య + ఉక్తి)         =   సత్యమైన వాక్కునూ               

భుజంబులన్                   =   భుజములందు

విజయమున్                  =   విజయమునూ 

చిత్తంబునన్                   =   మనస్సునందు

 సన్మనోహర సౌజన్యము ;

సత్                              =   చక్కని

మనోహర                       =   ఇంపైన 

సౌజన్యము                    =   మంచితనమునూ 

కల్గినన్                          =   కల్గి ఉన్నట్లయితే

బుధుoడు                      =   పండితుడు

సిరి                               =   ఐశ్వర్యo

లేకైనన్ (లేక + ఐనన్)     =   లేకుండా ఉన్నా(లేకపోయినా)

విభూషితుండె                 =   అలంకరింపబడినవాడే   

(విభూషితుండు + ఎ) 

అయి                             =   అయి

భాసిల్లున్                        =  ప్రకాశిస్తాడు.

4. భండనభీముఁ  డార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణ కో

    దండ కళాప్రచండ భుజతాండవ  కీర్తికి రామమూర్తికిన్

    రెండవ సాటి దైవమిక లేఁడనుచున్ గడగట్టి భేరికా

    డాండ డడాండ డాండ నినదంబులజాండము నిండ మత్తవే

    దండము నెక్కి చాటెదను దాశరథి ! కరుణా పయోనిధీ

  ప్రతి పదార్థం:          

దాశరథీ                       =    దశరథుని కుమారుడవైన ఓ శ్రీరామచంద్రా! 

కరుణాపయోనిధీ            =     దయకు సముద్రుడైన వాడా! (గొప్ప దయగలవాడా!) ఓ శ్రీరామా!

భండనభీముడు

భండన                         =    యుద్ధముల యందు

భీముడు                       =    శత్రువులకు భయంకరుడు

ఆర్తజన బాంధవుడు ;      

ఆర్తజన                         =    దుఃఖమును పొందినవారికి (దీనులకు)

బాంధవుడు                   =    బంధువు (చుట్టం)

డుజ్జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ  కీర్తికిన్ ;

ఉజ్జ్వల                          =    ప్రకాశించుచున్న 

బాణ                             =    బాణములను  

తూణ                            =    అమ్ముల పొదులును గల 

కోదండ కళా                   =    విలువిద్య యందు; 

ప్రచండ                          =    ఉగ్రమైన (మిక్కిలి తీవ్రమైన)

భుజతాండవ                  =    బాహువుల యొక్క నటనము చేత కలిగిన 

కీర్తికిన్                          =    కీర్తి కలవాడు

రామమూర్తికిన్               =    శ్రీరామచంద్రునికి 

రెండవ సాటి దైవము       =    సమానమైన మరియొక దేవుడు

ఇకన్                           =    ఇంక

లేడు                            =     లేడు

అనుచున్                     =    అని చెపుతూ 

గడగట్టి                         =   స్తంభమునాటి (జెండాచేత పట్టుకొని)

భేరికా డాండ డడాండ డాండ నినదంబులు ;

భేరికా                          =    భేరివాద్యము యొక్క

డడాండ, డాండ, డాండ  =    డాం డాం డాం అనే

నినదంబులు                =    ధ్వనులు

అజాండము                 =    బ్రహ్మాoడo

నిండన్                       =    నిండునట్లుగా

మత్తవేదండమున్         =    మదించిన ఏనుగును

ఎక్కి                           =    ఎక్కి

చాటెదను                    =     చాటిస్తాను. (ప్రకటిస్తాను)


5.  ఘనుడవ్వాడగు, వేడు త్యాగమయ దీక్షంబూని సర్వoసహా

    జన  దైన్యస్థితి  బోనడంచి  సకలాశాపేశలానంద  జీ 

    వన సంరంభము పెంచి, దేశజననీ ప్రాశస్త్యమున్ పంచునో

    అనిదంపూర్వ యశస్వి యాతడగు నన్నా ! విశ్వనాథేశ్వరా !


  ప్రతి పదార్థం:

విశ్వనాథేశ్వరా                            

(విశ్వనాథ + ఈశ్వరా)                  =   ఓ విశ్వనాథుడు అనే ఈశ్వరా !

వేడు                                         =    ఎవడు

త్యాగమయ దీక్షన్                       =    త్యాగంతో కూడిన దీక్షను 

పూని                                        =    వహించి 

సర్వo సహా జనదైన్య స్థితిన్ ;     

సర్వoసహా                                 =    భూమిపైనున్న 

జన                                          =    జనులయొక్క 

దైన్య స్థితిన్                                =    దీనత్వమును (జాలి కలిగించే స్థితిని)

పోనడంచి                                  =    పోయేటట్లుగా ఆపి 

(పోన్ + అడంచి)                         =      (పోయేటట్లు చేసి) 

సకలాశాపేశలానంద జీవన సంరంభమున్ ;

సకల                                        =    సమస్తమైన

ఆశా                                         =    కోరికలతో

పేశల                                        =   అలంకరించబడిన (అన్ని కోరికలు తీరిన)

ఆనంద                                     =    సంతోషమయమైన

జీవన                                       =    బ్రతుకులోని

సంరంభమున్                            =    ఉత్సాహమును

పెంచి                                      =    పెంపుచేసి

దేశజననీ ప్రాశస్త్యమున్

దేశజననీ                                 =    దేశమాత యొక్క

ప్రాశస్త్యమున్                            =    ప్రశస్తి (ప్రసిద్ధిని ) గొప్పతనాన్ని

పెంచునో                                  =     పెంచుతాడో (వృద్ధిని పొందిస్తాడో)

అవ్వాడు (ఆ + వాడు)               =     అటువంటివాడే

ఘనుడు + అగున్                    =     గొప్పవాడు అవుతాడు.


6. పొత్తంబై కడునేర్పుతో హితము నుద్భోధిoచు మిత్రుండు, సం 

   విత్తంబై యొక కార్యసాధనమునన్ వెల్గొందు మిత్రుండు, స్వా 

   యత్తంబైన కృపాణమై యరుల నాహారించు మిత్రుండు, ప్రో

   చ్చితంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీలొంకరామేశ్వరా ! 

  

ప్రతి పదార్థం:

శ్రీలొంకరామేశ్వరా

శ్రీ                       =   వన్నెగల 

లొంక                  =   లొoకలో వెలిసిన  (లొoక క్షేత్రంలో)

రామేశ్వరా           =   రామేశ్వర స్వామీ!

మిత్రుండు           =   స్నేహితుడు

పొత్తంబై              =   పుస్తకమై

(పొత్తంబు + ఐ) 

కడున్                =   మిక్కిలి

నేర్పుతోన్        =  నేర్పుతో

హితమున్       =   మంచిని  (మేలు చేకూర్చు దానిని)

ఉద్భోధిoచున్   =   బోధిస్తాడు

మిత్రుండు        =   స్నేహితుడు

సంవిత్తంబై        =   విలువైన ధనమై

(సంవిత్తంబు + ఐ)

ఒక కార్యసాధనమునన్ =   ఒక కార్యాన్ని సాధించే పనిలో

వెల్గొందున్       =       ప్రకాశిస్తాడు

స్వాయత్తంబైన  =     తన స్వాధీనమైన

(స్వాయత్తంబు + ఐన)

కృపాణమై       =   ఖడ్గము వంటివాడై

(కృపాణము + ఐ)

అరులన్         =   శత్రువులను 

ఆహారించున్    =   ఆరగిస్తాడు (సంహరిస్తాడు)

మిత్రుడు        =   స్నేహితుడు

తగన్            =   తగు విధంగా 

ప్రోచ్చితంబై           =   నిండు మనసు కలవాడై

(ప్ర + ఉత్ + చిత్తంబు + ఐ)

సుఖము              =   సుఖాన్ని

ఇచ్చున్               =   ఇస్తాడు.  

III) పాఠ్యపుస్తకములోని ప్రశ్నజవాబులు

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) మీ దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడంటే ఎట్లా ఉండాలి ?

జ: నా దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడంటే, శ్రీరాముని వలె, ధర్మరాజువలె, ఉండాలి. ఎందుకంటే రాముడు పితృవాక్య పరిపాలకుడు. తండ్రి చెబితే, సముద్రంలోనైనా, అగ్నిలోనైనా దూకుతానన్నాడు. రాముడు శరణాగత రక్షకుడు. విభీషణునికి అభయమిచ్చి, అతడిని లంకానగర చక్రవర్తిని చేశాడు. ధర్మరాజు ఇంద్రప్రస్థ ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నాడు. తమ్ముళ్ళతో కలిసి ఉన్నాడు. సత్యమునే పలికాడు. శాంతి, దయలను ఆభరణాలుగా ధరించాడు.   

ఆ) నిజమైన త్యాగి ఎవరు ? అతని లక్షణాలెట్లా ఉంటాయి?

జ: తన జన్మభూమి కోసం, తన తోటి ప్రజలకోసం తన సుఖాన్నీ, భార్యాబిడ్డలనూ త్యాగం చేసినవాడు, నిజమైన త్యాగి. మనదేశంలో ఎందరో త్యాగపురుషులు తాము చేస్తున్న ఉద్యోగాలు వదిలి, తాము చదివే చదువులు మాని, దేశం కోసం  బ్రిటిష్ వారిని ఎదిరించి  జైళ్ళలో ఉన్నారు. కొందరు ప్రాణాలు వదిలారు. కొందరు దేశంకోసం సంసారాన్నీ, తాము సంపాదించే ధనాన్నీ, వృత్తులనూ విడిచిపెట్టారు. 

   గాంధీ, నెహ్రూ, పటేలు అల్లూరి సీతారామరాజు వంటి దేశభక్తులు, నిజమైన త్యాగులు. పురాణకథల్లో చూస్తే శిబిచక్రవర్తి, రంతిదేవుడు, బలి వంటి వారు నిజమైన త్యాగులు. దేశం కోసం, పరోపకారం కోసం, తమ ధన, మాన, ప్రాణ, రాజ్య, సుఖాలను విడిచిపెట్టడమే, త్యాగుల లక్షణం.



ఇ) మిత్రుడు పుస్తకం వలె మంచి దారిని చూపుతాడని ఎట్లా చెప్పగలవు ?

జ: నీతిగ్రంథాలు మనిషికి మంచిదారిని చూపిస్తాయి. భర్తృహరి సుభాషితాలు, నీతి శతకాలు, మనిషి కర్తవ్యములనూ, చేయరాని పనులను బోధిస్తాయి. రామాయణం వంటి పుస్తకం చదివితే, రాముని వలె నడవాలి. రావణునిలా ఉండరాదనే విషయం తెలుస్తుంది. అలాగే మంచి మిత్రుడు సహితమూ, తన మిత్రులకు ఆపదలు ఎదురయినపుడు, వారికి ఎలా ముందుకు వెళ్ళాలో దారి తెలియనప్పుడు, కర్తవ్యమునూ, ఆకర్తవ్యమునూ బోధిస్తాడు. మంచి మిత్రుడు తన స్నేహితుని వెంట ఉండి, మంచి పుస్తకంలా మంచి చెడ్డలు బోధిస్తాడు. అందుకే మిత్రుడు మంచిపుస్తకం వంటివాడు. 

ఈ) పాఠంలో పూజకు పుష్పం, సత్యం, దయ, ఏకాగ్రత అవసరమని తెలుసుకున్నారు కదా! మరి చదువు విషయంలో ఏవేవి అవసరమనుకుంటున్నారు ?

జ: పూజకు పుష్పం, సత్యం, దయ, ఏకాగ్రత వలె చదువుకు మంచి గురువు, పుస్తకాలు, శ్రద్ధ, మంచి పట్టుదల అవసరం అవుతాయి. చదువు బాగా రావాలంటే మంచి విద్యావేత్త గురువుగా దొరకాలి. ఆ గురువు శిష్యుడికి చక్కని జ్ఞానబోధ చెయ్యాలి. శిష్యుడు శ్రద్ధ, పట్టుదల కలిగి, క్రమశిక్షణతో చదువుకోవాలి. చెప్పిన విషయాన్ని కంఠస్థo చెయ్యాలి. గురువు బోధించిన విషయాలను పునశ్చరణ చేసుకోవాలి. చదివేవాడికి ఏకాగ్రత ముఖ్యం. నిరంతరపఠనం అవసరం. ఇలా చేస్తే చదువుకున్న చదువు రాణిస్తుంది. 

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా ఉపయోగపడతాయో విశ్లేషిస్తూ]రాయండి.

జ: శతక పద్యాలలో నీతిపద్యాలూ, భక్తి ప్రభోదక పద్యాలూ ఉంటాయి. మనిషి జీవితంలో ఎలా ముందుకు సాగాలో తెలియజెప్పే నీతులు ఉంటాయి. కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం.

  • నరరూప రాక్షసుల లక్షణాలను భీమకవి వేణుగోపాల శతకంలో చెప్పాడు. ఆ పద్యాలను చదివితే, రాక్షస లక్షణాలను విడిచిపెట్టి మంచిగా నడుచుకోవచ్చు.

  • మిత్రుడి మంచి లక్షణాలను శతకపద్యాల ద్వారా తెలుసుకొని, మంచి మిత్రులను సంపాదించుకొని, జీవితంలో సుఖపడవచ్చు.

  • విశ్వనాథేశ్వర శతకంలో చెప్పిన మంచి విషయాలను గ్రహించి, దేశభక్తిని పెంచుకోవచ్చు. తాము కూడా త్యాగబుద్ధితో, ప్రజల దైన్యస్థితిని తొలగించవచ్చు.

  • నరసింహ శతకపద్యాలు చదివి, మంచి లక్షణాలు అలవరచుకోవచ్చు. దేవమాన్యాలు అపహరించకుండా, మంచివారిని మోసం చేయకుండా ఉండవచ్చు.

  • భగవంతుని పూజకు సత్యం, దయ, ఏకాగ్రత ముఖ్యమని గ్రహించి దైవభక్తితో జీవించవచ్చు.

  • రాజాశ్రయం అన్న ధూర్జటి పద్యం చదివి రాజకీయ నాయకులవెంట తిరగడం మాని, హాయిగా స్వేచ్ఛగా బ్రతకవచ్చు.

  • పండితునికి డబ్బుకంటే సత్యభాషణము, మంచితనము, గురుభక్తి ముఖ్యమని గ్రహించవచ్చు.

  • గోపన్న చెప్పినట్లు శ్రీరాముని సాటిదైవం లేడని తెలుసుకోవచ్చు. 

 

IV) తరగతి గదిలో రాయవలసిన అంశాలు :

అ) పాఠం ఆధారంగా మనం అలవరచుకోవలసిన మంచిగుణాలు, ఉండకూడని గుణాలు వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.

ఆ) నీతి పద్యాల ఆవశ్యకతను తెలుపుతూ వ్యాసం రాయండి.

V) గైహికం (ఇంటిపని)

అ) పుటసంఖ్య 73లోని పద్యాన్ని చదివి భావం సొంతమాటల్లో రాయండి.

ఆ) చుక్కపద్యాలు కంఠస్థo చేయండి. 

VI) పదజాలం :

1. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.

 అ) భాసిల్లు : మన తెలంగాణ రాష్ట్రo, సకల సంపదలతో భాసిల్లుతోంది.

 ఆ) ఉద్బోదించు: గాంధీజీ కులమత భేదాలనూ, అవినీతినీ రూపుమాపాలని, ప్రజలకు ఉద్బోధించారు.

 ఇ) దైన్య స్థితి : ప్రజల దైన్యస్థితిని తొలగించడానికి, యత్నిoచేవారే సరియైన ప్రజాప్రతినిధులు.

 ఈ) నరరూప రాక్షసుడు : ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాలకుడు నరరూప రాక్షసుడితో సమానం.

2. పర్యాయ పదాలు గుర్తించి రాయండి.

 అ)  ఏనుగు  :   గజము,     కరి,       నాగము

 ఆ) స్నేహితులు :  మిత్రులు,   నెచ్చెలులు

 ఇ) కృపాణం :   కత్తి,     అసి

 ఈ) బంగారం :  కనకం,     స్వర్ణం

3. ప్రకృతి  - వికృతులు

 అ) దిశ   -  దెస                  ఆ) సముద్రం   -  సంద్రం                   ఇ) రాజు  -  రేడు 


VII)వ్యాకరణాoశాలు :

1. కిoది పదాలు విడదీసి, సంధిపేరు రాయండి.

 అ) బుద్ధిమంతురాలు               బుద్ధిమంత  +  ఆలు          =   రుగాగమసంధి

 ఆ) అచ్చోట                           ఆ            +  చోట           =   త్రికసంధి

 ఇ) దివ్యౌషధం                        దివ్య         +  ఔషధం       =   వృద్ధిసంధి

 ఈ) సాహాసవంతురాలు            సాహాసవంత  +  ఆలు          =  రుగాగమసంధి

 ఉ) సమైక్యత                        సమ           +  ఐక్యత        =  వృద్ధిసంధి

 ఊ) ఎక్కాలము                      ఏ             +  కాలము      =   త్రికసంధి

2. కింది పద్యపాదానికి గణవిభజన చేసి గురులఘువులను గుర్తించి ఏ పద్యపాదమో తెలుపండి.

అ) భండనభీముఁ  డార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణ కో

     భ              ర          న            భ              భ             ర           వ

U   I I       U   I U          I I I      U    I    I       U    I    I     U   I   U       I   U              

భండన     భీముఁడా    ర్తజన     బాంధవుఁ     డుజ్జ్వల    బాణతూ    ణకో

 ‘భ, ర, న, భ, భ, ర, వ’ గణాలున్నాయి కాబట్టి ఇది ‘ఉత్పలమాల’ పద్యపాదం.

VIII) ప్రశ్నల నిధి :

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) మీ దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడంటే ఎట్లా ఉండాలి ?

ఆ) నిజమైన త్యాగి ఎవరు ? అతని లక్షణాలెట్లా ఉంటాయి?

ఇ) మిత్రుడు పుస్తకం వలె మంచి దారిని చూపుతాడని ఎట్లా చెప్పగలవు ?

ఈ) పాఠంలో పూజకు పుష్పం, సత్యం, దయ, ఏకాగ్రత అవసరమని తెలుసుకున్నారు కదా! మరి చదువు విషయంలో ఏవేవి అవసరమనుకుంటున్నారు ?

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా ఉపయోగపడతాయో విశ్లేషిస్తూ రాయండి.

IX) నికష :

1. కింది ప్రశ్నకు ఐదు వాక్యాల్లో జవాబు రాయండి.               5 మా

 అ) పాఠం ఆధారంగా మనం అలవరచుకోవలసిన మంచిగుణాలు, ఉండకూడని గుణాలు వివరిస్తూ మిత్రునికి లేఖ   రాయండి.

2.  కింది పద్యానికి ప్రతిపదార్థం రాయండి.                           5 మా

    పొత్తంబై కడునేర్పుతో హితము నుద్భోధిoచు మిత్రుండు, సం 

   విత్తంబై యొక కార్యసాధనమునన్ వెల్గొందు మిత్రుండు, స్వా 

   యత్తంబైన కృపాణమై యరుల నాహారించు మిత్రుండు, ప్రో

   చ్చితంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీలొంకరామేశ్వరా ! 








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu