6. భాగ్యోదయం
- కృష్ణస్వామి ముదిరాజ్
i) పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు
బడుగువర్గాల కోసం కృషి చేసిన భాగ్యరెడ్డివర్మ గురించి చెప్పగలగడం
సమాజం కోసం పాటుపడిన వారి గురించి ‘అభినందన’ వ్యాసం రాయగలగడం
ప్రత్యక్ష, పరోక్ష కథన వాక్యాలను తెలుసుకోవడం
పాఠం ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలకు సొంతమాటల్లో సమాధానాలు రాయగలగడం.
ii) ముఖ్య పదాలు - అర్థాలు
1. అవస్థ = సంకటం
2. అవగతం = అర్థం కావడం
3. ఉన్నతి = అభివృద్ధి
4. అర్పించడం = భక్తితో ఇవ్వడం
5. ఎరుక = జ్ఞానం
6. చైతన్యం = కదలిక
7. ఉదాసీనత = పట్టించుకోకపోవడం
8. సమస్తం = సర్వం
9. లిఖిత బద్ధం = రాయబడినది
10. కడగండ్లు = కష్టాలు
iii) చర్చనీయ అంశాలు :
1. కులవ్యవస్థ - సమాజంపై ప్రభావం :
‘కులవ్యవస్థ’ అంటే ఒక కులానికి సంబంధించిన వాళ్లనంతా ఒకే వర్గంగా భావించి, ఆ వర్గం వ్యక్తుల్లోనే సంబంధ బాంధవ్యాలను విస్తరింపజేసుకోవడం. ఈ వ్యవస్థ మానవ సమాజాన్ని విభజిస్తుంది కానీ ఆధునిక యుగంలో విజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో ఇది మరింత పటిష్టం కావడం ఆశ్చర్యకరమైన పరిణామం. కుల సంఘాలు స్థాపించుకోవడం, రాజకీయ ప్రయోజనాలు ఆశించడం, ఇతర కులాలతో పిల్లలు సంబంధాలు ఏర్పరచుకోవడాన్ని వ్యతిరేకించడం ఆరోగ్యకరమైన అంశాలు కావు. ఇది పరిహరించి మనుషులంతా ఒక్కటే అన్న భావన పెంపొందించాలి.
2. చిత్తశుద్ధి :
అంటే మనసులో ఏ ఇతర ఆలోచనలు లేకుండా వ్యవహరించడం. అంటే స్వచ్ఛమైన మనసుతో ప్రవర్తించాలి. మనఃపూర్వకంగా పనిచేయాలి.
3. నిజాయితీ :
న్యాయబద్ధంగా నడుచుకోవడమే నిజాయితీ. మనం చేసేపని ధర్మబద్ధంగా, సత్యాన్ని అతిక్రమించకుండా, ఎవరికీ అన్యాయం కలగకుండా ఉండేటట్లు చూసుకోవడం నిజాయితీ.
4. అజ్ఞానం, ఉదాసీనత వల్ల నష్టాలు :
అజ్ఞానం అంటే తెలియనితనం. ఉదాసీనత అంటే పట్టనట్లుండడం. ఈ రెండు అనేక కష్టాలకు, నష్టాలకూ కారణమవుతాయి. మానవజాతి వినాశనానికి సగం కారణం అజ్ఞానం ఐతే మరోసగం అమాయకత్వం అన్నారు మహానుభావులు.
ఏ విషయానికి సంబంధించిన జ్ఞానం లేకపోయినా ఆ విషయంలో ప్రయోజనాన్ని పొందలేము. ఉదాహరణకు మహిళలకు గృహహింస చట్టం గురించి తెలియదనుకోండి. అప్పుడు ఇంట్లో ఎంత వేదన అనుభవిస్తున్నా, కష్టాలు పడుతున్నా ఎవరికీ చెప్పుకోలేక, చెప్పుకున్నా ఫలితం ఉండదని తమలో తాము బాధపడుతూ చివరికి ప్రాణాంతక పరిస్థితుల్లోకి తమనుతాము నెట్టుకుంటారు. ఇక రెండోది ఉదాసీనత. ఇది అజ్ఞానం కంటె భయంకరమైనది.చట్టాల గురించి తెలిసినా సరే ! ఎవరొచ్చి ఉద్ధరిస్తారు?’ అని అనుకోవడం. ‘నా కర్మ ఇలా కాలింది’ అని సరిపెట్టుకోవడం. ఏ మాత్రం లక్ష్యపెట్టకపోవడం..... ఇవన్నీ నష్టాన్ని కలిగించేవే కదా! ఇదే విధంగా ....
ప్రభుత్వ పథకాలు ; హక్కులు ; ఉమ్మడి ఆస్తుల రక్షణ, వినియోగం; సామాజిక సౌకర్యాలు; ఓటు హక్కు ; సమాచార హక్కు వంటి వాటి గురించి తెలుసుకోకపోవడం....
మనకేం జరిగినా; పక్కవాళ్ళకి నష్టం జరిగినా; పర్యావరణం పాడైపోతున్నా; వీధి వాడ మురికి కూపంగా మారినా; ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నా; అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం అన్ని రకాల కష్టనష్టాలు కలిగిస్తాయి.
5. మూఢ నమ్మకాలు అంటే .....
మూఢo అంటే అజ్ఞానం (తెలివిలేనితనం). ఏ విషయాన్నైనా గుడ్డిగా (అజ్ఞానంగా) నమ్మడాన్నే మూఢనమ్మకం అంటారు.ఎదుటివాళ్లు ఏది చెప్పినా నిజమేనన్న అమాయకత్వంతో, ఎదురు ప్రశ్నించకుండా, కనీసం ఆలోచించకుండా నమ్మి అనుసరించడమే మూఢనమ్మకం. తరతరాలుగా ఇలాంటి నిజాలని అనుసరిస్తూ, వాటిని సంప్రదాయంగా మలచి , కొన్ని ప్రత్యేకమైన గుర్తింపు పొందిన మూఢనమ్మకాలను ఈ సమాజంలో స్థిరపడేటట్లు చేసుకున్నాం.
దయ్యాలు; చేతబడులు; బాణామతులు; తుమ్మితే, పిల్లిఎదురైతే, విధవల ముఖం చూస్తే అశుభం కలుగుతుందనుకోవడం; కుడికాలు – ఎడమకాలుకు తేడా; పుట్టుమచ్చలు; బల్లిపడటం; కలలుకనడం..... ఇలా ఎన్నో......
6. వర్మ తన జాతి జనుల్లో తెచ్చిన మార్పు ......
భాగ్యరెడ్డివర్మ తెలంగాణ రాష్ట్రంలో 20వ శతాబ్దపు ప్రారంభంలో నిమ్న జాతుల అభ్యున్నతికి, సమాజ శ్రేయస్సుకు జీవితాన్ని అంకితం చేసిన సంస్కర్త.
మనుషులంతా సమానమని, ఎవరూ ఎక్కువ తక్కువ కాదన్న నిజాన్ని గ్రహించేలా చేశాడు.
నిమ్న జాతులపై నిరంతరం శ్రద్ధ వహిస్తూ, వాళ్లు చదువుకునేలా చేశాడు.
బహిరంగ సభలు నిర్వహించి, హిందువులందరినీ ఒక్క తాటిమీదికి తెచ్చే ప్రయత్నం చేశాడు.
దేవదాసీ, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలకు అడ్డుకట్ట వేశాడు.
తాగుడు మాన్పించగలిగాడు.
అనేక దురాచారాల నుంచి కొన్ని కుటుంబాలను కాపాడగలిగాడు.
7. మంచి వక్త:
మంచి వక్త అంటే బాగా మాట్లాడగలిగేవాడు. బాగా మాట్లాడటం అంటే 1) సందర్భానికి తగ్గట్టు మాట్లాడడం. 2) తగినంత మాట్లాడటం 3) మంచి భాష ఉపయోగించి, స్పష్టంగా మాట్లాడటం 4) ఎంత కఠినమైన విషయాన్నైనా సున్నితంగా చెప్పగలగడం. 5) చక్కని జాతీయాలు, ఉదాహరణలు, సామెతలు సమయోచితంగా ఉపయోగించడం 6) ధారాళంగా మాట్లాడడం 7) ప్రేక్షకులకు/శ్రోతలకు అర్థమయ్యేట్టుగా మాట్లాడడం 8) అలంకారంగా మాట్లాడడం 9) హేతుబద్ధతతో మాట్లాడడం 10) ప్రయోజనాత్మకంగా, సందేశాత్మకంగా మాట్లాడడం
8. నాయకత్వ పటిమను అంచనా వేయడం :
‘నాయకత్వం’ అంటే పదిమంది మేలుకోరుతూ ముందుండి పనిచేయడం. నూటికొక్కడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. ఒక నాయకుని నాయకత్వ పటిమను అంచనా వేయాలంటే ....
ధైర్యంగా ఎంతటివారితోనైనా మాట్లాడడం.
ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వెంటనే స్పందించి సాయం అందించడం.
తనకు నష్టమైనా, కష్టమైనా భరిస్తూ, సమాజం మేలు కోసం పనిచేయడం.
సమాజ చైతన్యం కోసం కృషి చేయడం.
స్వార్థాన్ని వదిలి, అందరి బాగు కోసం పనిచేయడం.
అందరినీ తన మాటలతో ఒప్పించడం, చేతలతో అభిమానాన్ని చూరగొనడం.
సమాజాన్ని ఒక్క తాటి మీద నడిపించడం.
పోరాట పటిమను రగిలించడం.
అనుకున్నది సాధించడానికి ప్రాణాలనైనా త్యజించడానికి సిద్ధపడడం.
iv) పాఠ్యపుస్తకములోని ప్రశ్న – జవాబులు
1. ఈ కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
అ) చదువుకుంటే కలిగే లాభాలను తెలుపండి.
జ: చదువుకుంటే విచక్షణ కలుగుతుంది. వివేకం వస్తుంది. మంచిచెడులు తెలుస్తాయి. ప్రపంచంలో జరిగే విషయాలన్నీ తెలుస్తాయి. దురాలవాట్ల వలన కలిగే నష్టాలు తెలుస్తాయి. గౌరవం పెరుగుతుంది. ఉపాధి దొరుకుతుంది. చేసేపనిలో నైపుణ్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమస్యలను పరిష్కరించుకోగల సామర్థ్యం వస్తుంది.
ఆ) అసమానతలు తొలిగి సమానత్వం రావాలంటే ఏం జరగాలి ?
జ: చదువుకునే అవకాశాలు పెరగాలి. చదువుకునేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఉద్యోగాలలో రిజర్వేషను అమలు చేయాలి. భూమి లేని పేదలకు భూములు ఇవ్వాలి. పని కల్పించాలి. రాజకీయ పదవులను కూడా ఇవ్వాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ప్రతీ వ్యక్తీ గౌరవంగా జీవించడానికి సరిపడా సదుపాయలు కల్పించాలి. పేదలకు ప్రభుత్వం అండగా నిలబడాలి. మానవులంతా సమానమనే భావం కలిగించాలి. చైతన్యం కలిగించాలి. మూఢనమ్మకాలను పారద్రోలాలి. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కల్గించాలి. కుల నిర్మూలన జరగాలి. అప్పుడే సమాజంలోని అసమానతలు తొలుగుతాయి. సమానత్వం వస్తుంది. నవసమాజం ఏర్పడుతుంది.
ఇ) అంకితభావంతో పని చేయడం అంటే ఏమిటి ?
జ: అంకితము అంటే పూర్తిగా వశం అవ్వడం. అంకితభావం అంటే పూర్తిగా వశం అయినట్లు భావించడం. అంకితభావంతో పనిచేయడమంటే పూర్తిగా పనిలో మునిగిపోవడం. ఇతరం ఏమీ ఆలోచించకుండా పని గురించే ఆలోచించడం. వేరే పనులేమి చేయకుండా చేయదలచుకొన్న పని మాత్రమే చేయడం. అంటే చేస్తున్న పనిలో పూర్తిగా మునిగిపోవడం. ఫలితం ఆశిoచకుండా కేవలం పని చేయడం. తనకంటూ వేరే ఆలోచన లేకుండా పనిచేయడాన్ని అంకితభావంతో పనిచేయడo అంటారు.
ఈ) వ్యసనాల వలన ఎట్లాంటి నష్టాలు కలుగుతాయి ?
జ: వ్యసనం అంటే అలవాటు. అది మంచి అలవాటు ఐతే సద్వ్యసనం అంటారు. చెడు అలవాటైతే దుర్వ్యసనం అంటారు. సాధారణంగా వ్యసనం అనే మాట ‘చెడు అలవాటు’ అనే అర్థంలోనే ఉపయోగిస్తారు. చెడు వ్యసనాల వలన చాలా నష్టాలు కలుగుతాయి. అనవసరంగా డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. సంపాదనా మార్గాలు, సమయం తగ్గిపోతుంది. సమాజంలో గౌరవం తగ్గిపోతుంది. ఆరోగ్యం పాడవుతుంది. కోపం పెరుగుతుంది. గొడవలు పెరుగుతాయి. బంధువులు, స్నేహితులు దూరం అయిపోతారు.ఒక్కొక్కసారి భయంకరమైన రోగాలు కూడా వస్తాయి. దానితో మరణం కూడా సంభవించవచ్చు. అందుచేత చెడు వ్యసనాలున్న వారిని చైతన్యపరచి ఆ చెడు వ్యసనాలను మాన్పించడం మనధర్మం. మన కర్తవ్యం.
2. కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.
అ) మీ చుట్టూ ఉన్న సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను పారదోలడానికి మీరు ఏం చేయగలరు?
జ: చుట్టుపక్కల వారిని చైతన్యపరుస్తాం. మూఢనమ్మకాల వల్ల కలిగే అనర్థాలను సోదాహరణంగా వివరిస్తాం. నమ్మకం మంచిదే. కాని మూఢనమ్మకo పనికిరాదని చెబుతాం. వాళ్లకు పూర్తిగా నమ్మకం కలగడానికి అనుభవపూర్వకంగా నిరూపిస్తాం. దిగదుడుపులు వలన రోగాలు తగ్గవని చెబుతాం. దిగదుడిచినవి తొక్కినా ఏమీ కాదని నిరూపిస్తాం. దిగదుడిచిన నిమ్మకాయలు కోసుకొని హాయిగా రసం తాగుతాం. చిల్లంగి, చేతబడి వంటివి కూడా తప్పని నిరూపిస్తాం. జనవిజ్ఞాన వేదిక వారిని మా గ్రామానికి ఆహ్వానిస్తాం. ప్రదర్శనలు ఇప్పిస్తాం. ఉపన్యాసాలు చెప్పిస్తాం. ప్రజలలో చైతన్యం కలిగిస్తాం. మా గ్రామం నుండి మూఢనమ్మకాలను తరిమేస్తాం. సశాస్త్రీయంగా ఆలోచించడం అలవాటు చేస్తాం. ‘మూఢనమ్మకాలు లేని గ్రామం’ అని మా గ్రామపు సరిహద్దులలో బోర్డు పెడతాం.
(లేదా)
ఆ) భాగ్యరెడ్డివర్మ ఆదిహిందువుల కోసం చేసిన కృషిని వివరించండి?
జ: ఆదిహిందువులు అనుభవిస్తున్న అవస్థల నుండి వారిని గట్టెక్కించడానికి భాగ్యరెడ్డివర్మ చాలా కృషి చేశాడు. అంకితభావంతో పనిచేశాడు. తమ దుస్థితికి కారణం తమ అజ్ఞానం, ఉదాసీనత అనే విషయం వారు గ్రహించేలా చేశాడు వర్మ. మానవులలో ఎక్కువ, తక్కువలు లేవని ఆదిహిందువులు తెలుసుకొనేలా చేశాడు. 3,348 ఉపన్యాసాలు ఇచ్చి ఆదిహిందువులను చైతన్యపరిచాడు. దేవదాసీ, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకొన్నాడు.
ఆదిహిందువులకు చదువుపై శ్రద్ధ కలిగించాడు. తాగుడు మాన్పించాడు. మూఢాచారాలు మాన్పించాడు. ఆటల ప్రదర్శన నిర్వహించాడు. ఆదిహిందువులకు ప్రభుత్వం అండగా నిలిచేలా చేశాడు.
v) పదజాలం
1. కింది పదాలకు పర్యయపదాలను రాయండి.
అ) అండ = ఆధారం, ఆదరువు, ఆలంబనం, ఆసరా, ఆశ్రయం
ఆ) ఉన్నతి = గొప్ప, ఘనత, పెంపు, దొడ్డతనం, మేటి
ఇ) స్వేచ్ఛ = స్వచ్ఛదoము, అలవోక, స్వతంత్రత, స్వాతంత్ర్యం
ఈ) వికాసం = వికసనం, ప్రఫల్లం
2. కింది పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.
అ) ఏకతాటిపై = ప్రజలంతా ఏకతాటిపై ఉండాలి. అప్పుడే ప్రగతి సాధ్యం.
ఆ) మచ్చుతునక = తెలంగాణ వైభవానికి నల్లగొండ కోట మచ్చుతునక.
ఇ) మహమ్మారి = వరకట్న మహమ్మారికి ఎన్నో జీవితాలు బలైపోతున్నాయి.
ఈ) నిరంతరం = పిల్లలు నిరంతరం చదువుపై దృష్టి పెట్టాలి.
3. కింది పదాలను/ పదబంధాలను వివరించి రాయండి.
అ) అoకితం కావడం = చేయదలచుకొన్న పని తప్ప వేరే ఆలోచన, పని లేకపోవడం
ఆ) నైతిక మద్దతు = ధన సహాయం మొదలైనవి చేయలేకపోయినా కనీస బాధ్యతగా మద్దతును
ప్రకటించడం.
ఇ) చిత్తశుద్ధి = మనస్సులోని వ్యతిరేక భావాలను తొలగించుకొని మనస్ఫూర్తిగా ప్రవర్తించడం.
ఈ) సాంఘిక దురాచారాలు = సంఘపరమైన చెడు ఆచారాలు
ఉ) సొంతకాళ్ళపై నిలబడడం = ఎవరిపైనా, దేనికీ ఆధారపడకుండా తనను తాను పోషించుకోవడం.
vi) తరగతి గదిలో రాయవలసిన అంశాలు :
అ) భాగ్యరెడ్డివర్మ గురించి తెలుసుకొన్నారు కదా! ఇట్లాగే సమాజం కోసం పాటుపడిన వాళ్ళలో ఎవరి గురించైనా ‘అభినందన‘ వ్యాసం రాయండి.
ఆ) భాగ్యరెడ్డివర్మ, అంబేద్కర్ ల మధ్య పోలికలు తెలపండి?
vii) గైహికము (ఇంటిపని)
అ) పుట సంఖ్య 60,61లోని పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఆ) పుట సంఖ్య 62,63లోని వ్యాకరణాంశాలు చదువండి.
viii) ప్రశ్నలనిధి
i) ఈ కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
1. చదువుకుంటే కలిగే లాభాలను తెలుపండి.
2. అసమానతలు తొలిగి సమానత్వం రావాలంటే ఏం జరగాలి ?
3. అంకితభావంతో పని చేయడం అంటే ఏమిటి ?
4. వ్యసనాల వలన ఎట్లాంటి నష్టాలు కలుగుతాయి ?
ii) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.
1. మీ చుట్టూ ఉన్న సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను పారదోలడానికి మీరు ఏం చేయగలరు?
2. భాగ్యరెడ్డివర్మ ఆదిహిందువుల కోసం చేసిన కృషిని వివరించండి?
ix) నికష
i) ఈ కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి. 4మా
1. అంకితభావంతో పని చేయడం అంటే ఏమిటి ?
2. వ్యసనాల వలన ఎట్లాంటి నష్టాలు కలుగుతాయి ?
ii) కింది పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి. 2మా
1. నైతిక మద్దతు 2. సొంతకాళ్ళపై నిలబడడం
iii) కింది పదాలకు పర్యయపదాలను రాయండి. 2మా
1. అండ = 2. నిరంతరం
iv) మీకు తెలిసిన ప్రత్యక్ష, పరోక్ష కథన వాక్యాలు రాయండి. 2మా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి