29, జనవరి 2023, ఆదివారం

5. నగర గీతం || 10th Class Telugu || Kothabata Notes ||

5. నగరగీతం

                                                                          - అలిశెట్టి ప్రభాకర్ 

I) పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు : 

  • నగర జీవితంలోని అనుకూల, ప్రతికూల అంశాలను గురించి చెప్పగలగాలి   

  •  పరిసరాల పరిశుభ్రత కోసం అందరు కృషి చేయాలని తెలుపుతూ కరపత్రం రాయగలగాలి           

  •  పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో చెప్పగలగాలి. రాయగలగాలి

  • రూపకాలంకారం లక్షణాలను తెలుసుకోగలగాలి

II) ముఖ్య పదాలు – అర్థాలు 

మినీ కవిత               =  గొప్ప ప్రాధాన్యం కల విషయాన్ని కొద్దిమాటలలో చెప్పడం 

నగారా                    =   పెద్ద ఢoకా 

పఠనీయ గ్రంథమే       =  చదువ దగిన పుస్తకమే 

సిటీ                      =  నగరం, పట్టణం 

దారిద్ర్యం                 =  బీదతనం 

తీరిక                     =  విశ్రాంతి 

మెర్క్యురీ నవ్వులు    =   పాదరసం నవ్వులు (తెచ్చి పెట్టుకున్న అసహజపు నవ్వులు)

చిక్కదు                 =   దొరకదు 

రసాయన శాల         =   ప్రయోగశాల 

మహా వృక్షం మీద    =    పెద్ద చెట్టు మీద 

సౌభాగ్యం               =  ధన వైభవం 


III) పాఠ్యపుస్తకములోని ప్రశ్నజవాబులు

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) అలిశెట్టి ప్రభాకర్ ‘సిటీలైఫ్’ కవితల ప్రత్యేకత ఏమిటి ?

జ: అలిశెట్టి ప్రభాకర్ గారు, ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరు సంవత్సరాలపాటు సీరియల్ గా ‘సిటీలైఫ్’ పేరుతో హైదరాబాదు నగర జీవనంపై మినీ కవితలు రాశారు. ప్రభాకర్ గారి కవితలు ప్రఖ్యాతి పొందాయి.  అలిశెట్టి ప్రభాకర్ గారు కవిత్వాన్ని ఆయుధంగా మలచుకొని, పాఠకుల్లో ప్రగతినీ, ఆలోచనా దృక్పథాన్నీ, సామాజిక చైతన్యాన్నీ పెంపొందించిన మహాకవి. నగర జీవితంలోని యథార్థ దృశ్యాన్ని, పాఠకుల కళ్ళముందు నిలుపుతూ, నగరం యొక్క మరో పార్శ్వాన్ని  కవి ఎత్తిచూపారు. వాస్తవాలను కఠినంగా నిర్వచించారు. శ్రీశ్రీ తరువాత అంత ఎక్కువగా కోట్ చేయబడ్డ కవిత్వం, అలిశెట్టి ప్రభాకర్ గారిదే.

ఆ) పల్లెకు – నగరానికి గల తేడాలు తెలుపండి.

జ: నగరం అంటే పట్టణం. పట్టణాలను మున్సిపాలిటీలుగా, కార్పోరేషనులుగా వర్గీకరిస్తారు. పట్టణాల్లో కనీసం 50 వేలకు పైగా జనాభా ఉంటారు. కోటి జనాభా మించిన నగరాలు కూడా మన భారతదేశంలో ఉన్నాయి. మన దేశంలో బొంబాయి, కలకత్తా, చెన్నై, హైదరాబాదు నగరాల జనాభా కోటిని మించింది. పల్లెలను పంచాయితీలుగా, నగర పంచాయితీలుగా, మైనర్ పంచాయితీలుగా వర్గీకరిస్తారు. నగరాల్లో పన్నులు ఎక్కువ. అయినా మంచినీరు సదుపాయం, మంచి రోడ్లు, వీధి దీపాలు, రోడ్లను శుభ్రంచేసే సిబ్బంది ఉంటారు. పల్లెల్లో సదుపాయాలు తక్కువ. నగరాల్లో 24 గంటలు విద్యుత్తు ఉంటుంది. పరిశ్రమలు ఉంటాయి. విద్యా వైద్య సదుపాయాలు ఉంటాయి. పల్లెల్లో సదుపాయాలు ఉండవు.

ఇ) ‘నగరజీవికి తీరిక దక్కదు. కోరిక చిక్కదు’ అనే కవితా పంక్తుల్లోని వాస్తవాన్ని వివరించండి.

జ: నగరవాసులకు తీరిక ఉండదు. నగరంలో ఉద్యోగాలు చేసేవారు ఉదయమే బయలుదేరి దూరంగా ఉన్న తమ కార్యాలయాలకు ఉరుకులు పరుగులు పెడుతూ పొద్దున్నే వెళ్ళాలి. ట్రాఫిక్ జామ్ లు ఉంటాయి. కాబట్టి ఆఫీసు వేళకు చాలా ముందుగానే వారు ఇంటినుండి బయలుదేరాలి. తిరిగి వచ్చేటప్పటికి పొద్దుపోతుంది. అలాగే నగరంలో కూలిపనులు చేసి జీవించే వారికి కూడా, వారికి పని దొరికే ప్రాంతానికి రావడానికీ, పోవడానికీ ఎంతో సమయం పడుతుంది. అందుచేత వారికి కూడా తీరిక దక్కదు.

     ఎంత కష్టపడినా నగరజీవి చిరుసంపాదనతో వారి కోరికలు తీరవు. తిండికీ, బట్టకూ, ప్రయాణాలకూ వారికి ఖర్చయిపోతుంది. అందువల్ల నగరవాసులకు తీరిక దక్కదు, కోరిక చిక్కదు అని కవి నిజం చెప్పాడు.  

ఈ) నగర జీవితంలోని ప్రతికూల అంశాలను ఇంత కఠినంగా వర్ణించడంలో కవి ఆంతర్యం ఏమిటి ?

జ: పట్టణాలకు వచ్చి ఏవో సుఖాలను అనుభవించాలనుకునే వారికి, పట్టణాల నిజస్వరూపాన్ని తెలపడమే కవి యొక్క ఆంతర్యం. నగరాల్లో ప్రజలు సుఖంగా జీవిస్తూ ఉంటారని భ్రాంతిపడే పల్లె ప్రజలకు, పట్టణాల్లో ఎన్నో అసౌకర్యాలు ఉన్నాయనీ, పేద, మధ్యతరగతి ప్రజలకు నగరజీవనం, సమస్యల వలయం అనీ చెప్పడమే కవి ఆంతర్యం.

   నగర జీవనం ‘పద్మవ్యూహం’ లాంటిదనీ, ఒక్కసారి ఆ నగరజీవనం చిక్కుల్లో చిక్కుకుంటే, ఆ బంధనాల నుండి బయటపడడం కష్టమనీ తెలపడమే, కవి ఆంతర్యం. నగరవాసులకు తీరిక దక్కదనీ, వారి కోరికలు తీరవనీ, కవి నగరం యథార్థ స్వరూపాన్ని వెల్లడించాడు. నగరంలో కనిపించే పైపై మెరుగులకు మురిసిపోయి పల్లెలను వదిలి నగరాలకు రావద్దని, పల్లెవాసులకు హితబోధ చేయడమే, కవి గారి ఆంతర్యం. 

ఉ) నగరంలో మనిషి జీవన విధానాన్ని పాఠం ఆధారంగా వివరించండి.

(లేదా)

నగర జీవితం ఎలా ఉంటుందో రాయండి.

జ: నగరంలో మనిషి రోడ్లమీద నడుస్తూ ఉన్నా, లేక ఏదైనా వాహనాలలో వెళ్ళినా పెద్దగా నగారా మోగినట్లుగా ధ్వని వినబడుతూ ఉంటుంది. పట్టణాల్లో చిన్న చిన్న ఇరుకు ఇళ్ళల్లో జీవించాలి. అక్కడ గాలికూడా సరిగా రాదు. నగరంలో ఒకరిని ఒకరు పట్టించుకోరు. ఎవరి బతుకు వారిదే. పేవ్ మెంట్లపై నడవాలి. సిటీబస్సులు ఎక్కాలి. ఎక్కడచూసినా జనమే. పిల్లల్ని కాన్వెంటులకు పంపాలి. పట్టణాల్లో అందమైన భవనాలతో పాటు పూరిపాకలు కూడా ఉంటాయి. నగరంలో ఐశ్వర్యంతో పాటు దరిద్రం కూడా ఉంటుంది. అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. 

      ఎంత కష్టపడి పనిచేసినా, నగరవాసుల కోరికలు తీరవు. నగరంలో ఎవరికీ తీరుబడి ఉండదు. కృత్రిమపు నవ్వులు  నవ్వుతూ హడావిడి నడకలతో మనుష్యులు వెళ్ళిపోతూ ఉంటారు. లేనివాళ్ళు కాలినడకన, కొందరు రిక్షాలపైన, డబ్బు గలవాళ్ళు కార్లపైన వెడుతూ ఉంటారు. నగరంలో రోడ్లమీద జాగ్రత్తగా నడవాలి. నాలుగుప్రక్కలకూ చూసుకోవాలి. అక్కడ ఏ పక్కనుంచైనా ప్రమాదం ఎదురవుతుంది. నగరంలో ప్రజలు ఏకాకిగా జీవిస్తారు. నగరజీవనం ఒక పట్టాన అర్థం కాదు. అది ఒక చిక్కుల వలయం. పద్మవ్యూహం.



2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో రాయండి.

జ: నేడు మనుషులంతా నగరాల్లోనే జీవించాలని తాపత్రయపడుతున్నారు. నగరంలో ఉన్నతవిద్య, ఆధునిక వైద్య సౌకర్యాలు, ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అన్ని తరగతుల ప్రజలకూ అక్కడ జీవించడానికి ఉపాధి సౌకర్యాలు లభిస్తాయి. అందువల్ల ప్రజలందరూ నగరాలకు ఎగబ్రాకుతున్నారు. అందువల్ల నగరాల్లో జనాభా పెరిగిపోయింది. నగరాలలోకి వచ్చే ప్రజలు ఉండడానికి ఇళ్ళు సరిపడ దొరకట్లేదు. ప్రజలు నడచివెళ్ళడానికి రోడ్లు చాలట్లేదు. సరిపడ మంచినీరు దొరకట్లేదు. ఆహారపదార్థాల ధరలు పెరిగిపోతున్నాయి. నగరాలకు వచ్చే వారు మురికివాడల్లో నివసించవలసి వస్తోంది. సిటీబస్సులు, రైళ్ళు ఎన్ని ఏర్పాటు చేసినా వారికి ప్రయాణసౌకర్యాలు సరిపోవడం లేదు. చెరువులు వగైరా కప్పిపెట్టి, పల్లపు ప్రదేశాల్లో వారు ఇళ్ళు కడుతున్నారు. అందువల్ల వర్షాలు వచ్చినప్పుడు వారి ఇళ్ళు మునిగిపోతున్నాయి. త్రాగడానికీ, వాడదానికీ వారికి నీరు సరిపోవడం లేదు.

     అందరికి ఉద్యోగాలు దొరకడం లేదు. నగరాల్లో వివిధ పరిశ్రమలు ప్రారంభిస్తున్నారు. దానితో నగరాల్లో వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. పీల్చడానికి మంచి గాలి కూడా దొరకడం లేదు. ఇళ్ళ అద్దెలు పెరిగాయి. కొత్త ఇళ్ళు కట్టుకోవడానికి స్థలాలు దొరకడం లేదు. పిల్లల చదువుల కాన్వెంటు ఫీజులు పెరిగిపోయాయి. తగినంత ఆదాయాలు లేవు. అందువల్ల నేడు నగర జీవనం సంక్లిష్టంగా మారింది.   

 IV) తరగతి గదిలో రాయవలసిన అంశాలు:

అ) నగరజీవనంలోని అనుకూల అంశాలపై కవిత రాయండి.

ఆ) మనపరిసరాల పరిశుభ్రత కోసం అందరూ కృషిచేయాలని తెలిపేలా, కరపత్రం రాసి ప్రదర్శించండి.



V) గైహికము (ఇంటిపని)

అ)పుట సంఖ్య 52లోని వచన కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఆ)పాఠం చదివి ముఖ్యమైన పదాలు గుర్తించి రాయండి.

VI) పదజాలం :

1. కింది పదాలకు అర్థాలు రాయండి.

అ) నగారా        =  పెద్ద ఢoకా           ఆ) హోరు = తీవ్రమైన ధ్వనికి అనుకరణం (గాలివీయడం, వానకురవడం)

ఇ) పఠనీయ గ్రంథo       =  చదువ దగిన పుస్తకo

2. పర్యాయపదాలు

 అ) నరుడు  :   మానవుడు,       మనిషి 

 ఆ) అరణ్యం  :   విపినం,     అడవి

 ఇ) రైతు      :   కర్షకుడు,    కృషీవలుడు 

  ఈ) పువ్వు   :   కుసుమం,    పుష్పం

  ఉ) మరణం   :   చావు,     మృత్యువు

  ఊ) వాంఛ    :  కోరిక,       అభిలాష

  ఋ) వృక్షం   : చెట్టు,    తరువు

VII) వ్యాకరణాంశాలు :

1. కింది కవితాభాగాల్లోని అలంకారాన్ని గుర్తించండి.

  అ) ‘నగారా మోగిందా

       నయాగరా దుమికిందా’

  జ: అంత్యానుప్రాసాలంకారం

  ఆ) కొందరికి రెండు కాళ్ళు

       రిక్షావాళ్ళకి మూడు కాళ్ళు

       ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు

  జ: అంత్యానుప్రాసాలంకారం

VIII) ప్రశ్నల నిధి 

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) అలిశెట్టి ప్రభాకర్ ‘సిటీలైఫ్’ కవితల ప్రత్యేకత ఏమిటి ?

ఆ) పల్లెకు – నగరానికి గల తేడాలు తెలుపండి.

ఇ) ‘నగరజీవికి తీరిక దక్కదు. కోరిక చిక్కదు’ అనే కవితా పంక్తుల్లోని వాస్తవాన్ని వివరించండి.

ఈ) నగర జీవితంలోని ప్రతికూల అంశాలను ఇంత కఠినంగా వర్ణించడంలో కవి ఆంతర్యం ఏమిటి ?

ఉ) నగరంలో మనిషి జీవన విధానాన్ని పాఠం ఆధారంగా వివరించండి.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో రాయండి.

IX) నికష

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.                  6మా

  అ)పల్లెకు – నగరానికి గల తేడాలు తెలుపండి.

  ఆ) ‘నగరజీవికి తీరిక దక్కదు. కోరిక చిక్కదు’ అనే కవితా పంక్తుల్లోని వాస్తవాన్ని వివరించండి.                         

2. కింది పదాలకు అర్థాలు రాయండి.                                             2మా

   అ) నగారా =                                         ఆ) హోరు =

3. కింది వాటికి పర్యాయపదాలు  రాయండి.                                    2మా 

   అ) రైతు                                               ఆ) పువ్వు   


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu