29, జనవరి 2023, ఆదివారం

4. కొత్తబాట || 10th Class Telugu || kothabata notes ||

4. కొత్త బాట 

i) పాఠం ఆధారంగా సాధించవలసిన సామర్థ్యాలు 

  • పల్లె సౌందర్యాన్ని వర్ణించగలగాలి.

  • ప్రాంతీయభాష (యాస)ను గుర్తించగలగాలి.

  • పల్లెల్లో నాటి తరానికి నేటి తరానికి మధ్య వ్యత్యాసాలు గుర్తించగలగాలి.

  • భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చోటుచేసుకున్న మార్పులు,  స్థానిక ఆధిపత్యశక్తుల మీద సామాన్యుడి విజయాలను గురించి సొంతమాటల్లో రాయగలగాలి.

ii) ముఖ్యపదాలు - అర్థాలు 

            బాట         =      దారి

            రొద          =     ధ్వని

            ఎన్నెల      =     వెన్నెల

చిర్తగండు    =     మగపులి

కూనలు     =     పిల్లలు

ఆదెరువు    =    ఆధారం

రచ్చకట్ట     =    రచ్చబండ

యోగం      =    అదృష్టం

మత్తడి      =    రేగడి పొలం



చర్చనీయ అంశాలు

1.సెవ్వుమీద పేనువారుడు

   అంటే చెవి మీద పేను పారడం. దీని అర్థం పట్టించుకోకపోవడం. స్పర్శ జ్ఞానం బాగా కలిగిన శరీర భాగాల్లో ఒకటి చెవి. తలలో ఉండే పేలు ఒక్కొక్కసారి దారి తప్పి చెవి మీదికి వస్తాయి. అది వెంటనే తెలిసిపోతుంది. ఆ విధంగా  చెవి మీద పేను పారడం అంటే గ్రహింపు కలగటం అని అర్థం. ‘సెవ్వుమీద పేనువార్తెనా ?’ అని రచయిత్రి ప్రయోగించడంలో అర్థం అసలు ‘పట్టించుకోవడం లేదు’ (గ్రహించడం లేదు) అని.

2. నడుచుకుంటూ పోయేటప్పుడు గమనించేవి :

   మామూలుగా నడుచుకుంటూ పోయేటప్పుడు చాలా మంది చుట్టూ గమనించే స్థితిలో ఉండరు.కారణం ఇప్పుడు నడక చాలా తగ్గింది.ఎప్పటిలాగా నడిచే నడక అలవాటైపోయి పరిసరాల మీద దృష్టి అంతగా ఉండదు. కొత్త ప్రదేశంలో ఆయా ప్రాంతాలను చూడటానికి వెళ్లినప్పుడు ప్రత్యేకంగా అన్నీ గమనిస్తాం.హృదయానికి కళ్లుంటే, కళ్లు హృదయపూర్వకంగా చూస్తుంటే ఎన్ని అంశాలైనా గమనించవచ్చు.

  • గాలివీచడంలోని ప్రత్యేకత

  • నేల, నేల మీద పరుచుకున్న ప్రకృతి

  • చుట్టూ ఉన్న వాతావరణంలోని ప్రత్యేకతలు

  • రకరకాల మనుషుల ప్రవర్తనలు 

  • చుట్టూ పేరుకుపోయిన మాలిన్యం, మనుషుల మనసుల్లోని కాఠిన్యం

3.తనకాళ్ళ మీద తాను నిలబడటం :

   అంటే స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం. సాధారణంగా ఎదిగిన పిల్లలు ఏదో ఒక వృత్తిలోనో, ఉద్యోగంలోనో స్థిరపడి, తల్లితండ్రుల మీద ఆధారపడకుండా బతికే సందర్భంలో ఈ మాటను ప్రయోగిస్తారు. ఈ మాట ఎవరైనా ఇతరుల మీద ఆధారపడకుండా  జీవించాలనే సందేశాన్ని ఇస్తుంది.

4. నాటి – నేటి  ఆచార వ్యవహారాల్లో తేడాలు :

   మానవ జీవితం ఆనందంగా, ఆదర్శంగా ఉండటం కోసం ఏర్పరచుకున్న విధానాలే ఆచార వ్యవహారాలు.మనిషి ఆలోచనల్లో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు సాంకేతిక విజ్ఞానం శరవేగంతో ముందుకు దూసుకునిపోవడం, సమసమాజ చింతన, అభ్యుదయవాదం ఆచారవ్యవహారాల్లో పరిణామాలకు  కారణమవుతున్నాయి. అందుకే ఒకప్పటికి ఇప్పటికి ఆ తేడాలు స్పష్టంగా తెలుస్తున్నాయి.

  • ఒకప్పుడు వర్గభేదాలు స్పష్టంగా కనిపించేవి. ఇప్పుడు ఉన్నత వర్గాలు – నిమ్న వర్గాల మధ్యగల అంతరం

             తగ్గిపోయింది.  

  • కులతత్వం వేళ్ళూనుకొని ఉండేది. ఇప్పుడు కుల సంఘాలున్నా వాటి పరిధి, పనితీరు మారింది.

  • అంతరానితరం పాటించేవారు. ఇప్పుడది తీవ్రనేరం.

  • వస్త్రధారణ సంప్రదాయబద్దం – ఇప్పుడు ఆధునిక వస్త్రాలు ధరిస్తున్నారు.

5. కడ్పుల ఇసం – నాల్కెన తీపి :

   కడుపులో విషం – నాలుక మీద తీయదనం అంటే మనసులో అసూయ, కుట్ర ఉన్నప్పటికీ పైకి మాత్రం ప్రేమతో మాట్లాడుతూ ఉండటమని అర్థం. ఆధునిక సమాజంలో ఈ లక్షణం సర్వ సాధారణమై పోయింది.

6. కళదప్పిన ఇల్లు :

    ఇల్లు కళ దప్పడం అంటే అందాన్ని కోల్పోవడం.ఇది భౌతికమైంది కాదు. కొత్తగా రంగులు వేసి అలంకరించిన ఇంట్లో ఏదైనా అశుభం జరిగితే ఆ ఇల్లు కళదప్పుతుంది. ఇంటినిండా మనుషులుండి ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే ఇల్లు కళకళలాడుతుంది.

పెద్ద ఇంట్లో మనుషులెవరు లేకపోయినా, ఒక్కరిద్దరే ఉంటున్నా, దీపం వెలిగించే దిక్కు లేక[పోయినా ఇల్లు కళతప్పుతుంది.

7. నలుగురు నడిసిందే బాట :

    నలుగురూ నడిచిందే బాట. అంటే పది మంది పాటించింది పద్ధతిగా మారుతుంది. ఈ విషయాన్నే వేమన ‘పదుగురాడుమాట పాడియె ధర జెల్లు; ఒక్కడాడు మాట ఎక్కదెందు’ అని వక్కాణించాడు. నలుగురూ దేన్ని సమర్థిస్తారో అదే అనుసరణీయమవుతుంది. నలుగురు ఏది అనుసరిస్తారో అదే పద్ధతిగా, సంప్రదాయంగా మారుతుంది.    నలుగురూ నడిచినప్పుడే అది బాటగా మారుతుంది. దాన్నే తక్కిన వాళ్ళుకూడా అనుసరిస్తారు.

1. ఈ కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలల్లో జవాబులు రాయండి.

అ) “ ఎంత చెడ్డపని, ఎంత బాగా బతికిన గని ఇంకోణి ఆసరతోటి మంది భుజాలెక్కి నడువకుండ పయినం సాగితే సాలు” అన్న అక్క మాటల్లో ఆంతర్యం ఏమై ఉంటుంది ?

జ: ఎవరైనా సరే ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడితే చులకనగా చూడబడతారు. విలువ ఉండదు. అందుకని తాను కష్టపడి పనిచేసి సంపాదించిన దానితో కలో, గంజో తాగుతూ, తన నోటి మాట బయటకు రాకుండా గడుపుకుంటూ స్వేచ్ఛగా, సంతోషంగా ఉంటే చాలు అనేది, అక్క మాటల్లోని అంతర్యం.

ఆ) “ అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు కనబడ్తూన్నవి ” అంటే మీకేం అర్థమైంది? 

 జ: అదునుగాయడం అంటే అవకాశం కోసం కాచుకొని కూచోవడం.నక్కలు జిత్తులమారివి. అవి స్వయంగా వేటాడ లేవు. తేరగా ఆహారం ఎలా దొరుకుతుందా అని చూస్తాయి.పొదల్లో నక్కి ఉండి అదునుచూసి, సింహం, పెద్దపులి వంటి జంతువులు తినగా మిగిలిన జంతువుల మాంసాన్ని తినడానికి కాచిపెట్టుకు కూర్చుంటాయి. రెండు జంతువులు ఒకదానిని మరొకటి చంపుకుంటే, ఈ నక్కలు ఆ రెంటి మాంసాన్ని తినడానికి సిద్ధంగా ఎదురుచూస్తూ ఉంటాయని అర్థమైంది.

ఇ) మీ గ్రామంలోని ప్రకృతిని లేదా మీ ఊరి ప్రత్యేకతలను గురించి రాయండి.

జ: ఆధునికీకరణ కారణంగా గ్రామాలల్లో ప్రకృతిలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. మా గ్రామంలోని ప్రకృతి సౌందర్యం చూడముచ్చటగా ఉంటుంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, పక్షుల కిలకిలారావాలు, రకరకాల పూలమొక్కలు, పచ్చటి పొలాలు, పాడి పశువులతో కళకళలాడుతూ ఉంటుంది. ఊరి మధ్యలో శివాలయం ఉంది. ఊరి చివర చెరువు ఉంది. ఆ చెరువు పంట పొలాలకు ఆధారంగా ఉంది. చెరువులో చేపలు సమృద్ధిగా ఉంటాయి. వాటికోసం కొంగలు వస్తుంటాయి. మా గ్రామంలో ప్రజలు ఒకరికొకరు సహాయపడుతూ, కలిసిమెలిసి ఉంటారు. ఆప్యాయంగా పలకరిస్తారు. మా గ్రామ వాతావరణం ఆహ్లాదకరoగా, ప్రశాంతంగా ఉంటుంది.

ఈ) చెరువుల ప్రాముఖ్యత ఏమిటి ?

జ: సాధారణంగా నీటి వసతి ఉన్న చోటే గ్రామాలు ఏర్పడతాయి. గ్రామాలు ఏర్పాటైన కొత్తలో గాని, కొంత కాలానికి గాని చెరువులు, కుంటలు ఏర్పాటు చేసుకోవడం తెలంగాణలోని ప్రత్యేకత. అందుకే ఈ విషయంపై అందరికీ అవగాహన ఉంటుంది. చెరువుల ప్రాముఖ్యతలోని ముఖ్యాంశాలు........

  • చెరువు నీరు పంటపొలాలకు నీటి వసతి కల్పిస్తుంది.

  • చెరువులో ఉండే చేపలు ఎందరికో జీవనోపాధిని కలిగిస్తున్నాయి.

  • చెరువు నీరు పశువులకు దాహార్తిని తీరుస్తుంది.

  • ప్రజలకు తాగునీటిని అందిస్తుంది.

  • గ్రామాల్లో చెరువులు ఉంటే భూగర్భజలాలు ఎండిపోవు.

  • చెరువులోని మట్టి పంటలకు ఎరువుగా ఉపయోగపడుతుంది.

  • చెరువుల్లో నీరు ఉంటే గ్రామాల్లోని ప్రకృతి పచ్చగా కళకళలాడుతుంది.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

  అ) పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి.

  • పల్లెల్లో ఒకప్పుడు పచ్చని ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన వాతావరణంలో ఉoడేవి. రవాణా సౌకర్యాలు ఉండేవి కాదు. కుల వృత్తులు అందరు తప్పనిసరిగా పాటించేవాళ్ళు. చదువు అంతంతమాత్రంగా ఉండేది. సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేసేవాళ్ళు. వస్త్రధారణ, భాష నగరాలకు భిన్నంగా ఉండేది........ అటువంటి గ్రామాల్లో చెప్పుకోదగిన మార్పులు వచ్చాయి.

  • పూర్వం పల్లెల్లో భూస్వాములు సన్న, చిన్న కారు రైతులపై పెత్తనం చెలాయిస్తూ ఉండేవారు. రైతులకు అప్పులిచ్చి అధిక వడ్డీలు వసూలుచేసి, పేద రైతులను, పీడించేవారు.   

  • పల్లెల్లో జనసాంద్రత పెరిగి, సాగుబడిలో లేని నేల కూడా వ్యవసాయానికి వినియోగించడం వల్ల అడవులు, చెట్లు తగ్గిపోయాయి.

  • ప్రభుత్వ పథకాలు, ప్రణాళికల కారణంగా రవాణా సౌకర్యాలు పెరిగాయి. ప్రజలు కాలినడకపై ఆధారపడవలసిన అవసరం లేకుండా పోయింది. పొలాలకు కూడా కొందరు ద్విచక్రవాహనాలపై వెళ్తున్నారు.

  • చదువుకున్న వాళ్ల సంఖ్య పెరిగింది. సామాజిక అసమానతలు తగ్గిపోతున్నాయి. వర్గాభేదాలు, కులభేదాలు, మత వైషమ్యాలు తగ్గుతున్నాయి.

  • భాషలో కూడా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. స్థానిక మాండలిక యాస తగ్గిపోయి, పత్రికల భాష, ఇంగ్లీషు మాటలతో కూడిన భాష, టీ.విల భాష ఇప్పుడు పల్లెల్లో ప్రవహిస్తుంది.

  •   మనుషుల మధ్య మునుపటి ఆత్మీయతలు సన్నగిల్లుతున్నాయి. గతంలో ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించేవాళ్ళు. ఇప్పుడా పరిస్థితి లేదు. దాంతో పరస్పరం లెక్క చేసుకోవడం తగ్గిపోయింది.

  • కుల మతాల పట్టింపులు కూడా మునుపున్ననంత తీవ్రంగా లేవు. నిమ్న కులాల వాళ్లను నీచంగా చూడటం లేదు. కులాలకు అతీతంగా మనుషులు పరస్పరం గౌరవించుకోవడం చూడగలుగుతున్నాం.

iii) పదజాలం 

1. కింది వాక్యాల్లో గీతగీసిన పదాలను సొంతవాక్యాల్లో ఉపయోగించండి.

  అ) ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని చెవివారిచ్చి వినాలి.

  జ:  చెవివారిచ్చి వినడం             =   శ్రద్ధగా వినడం

 నేను మా అమ్మ చెప్పే మంచి మాటలను చెవివారిచ్చి వింటాను.

  ఆ) చిరుతపులులు గవిన్లలో నివసిస్తాయి.

  జ:  గవిన్లు                  =  గుహలు 

   సింహానికి ఆకలి వేసి గవిన్లలో నుండి బయటికి వచ్చింది.

  ఇ) కుటిలవాజితనం పనికిరాదు.

   జ: కుటిలవాజితనం =   మోసం

  కొందరు కుటిలవాజితనంతో ఇతరులను ఇబ్బంది పెడతారు.

  ఈ) మా ఊరి పొలిమేరలో పంటపొలాలున్నాయి.

   జ: పొలిమేర   =  సరిహద్దు 

   మా ఊరి పొలిమేరలో ఆంజనేయ స్వామి గుడి ఉoది.

2. పర్యాయపదాలు 

  అ)  పెయి      =   మేను,      దేహం

  ఆ) తావు       =   చోటు,   ప్రదేశం

3. ప్రకృతి -  వికృతులు 

  అ)  సముద్రం  -   సంద్రం                                     ఈ) విద్య   -   విద్దె 

  ఆ) ఆధారము   -  ఆదెరువు                                 ఉ)  ప్రయాణం   - పయనం (పైనం)

  ఇ) శిఖ    -    సిగ 

4. కింది జాతీయాలను వివరించండి. 

  నిండుకొన్నవి  :  ‘అయిపోయినవి ’ అనే అర్థంలో వాడతారు. ఖాళీ అవడం.

  దడిగట్టు        :  ‘రక్షణ కల్పించు ‘అనే అర్థంలో వాడతారు.

  నిప్పుకలు సెరుగంగ :  ‘మిక్కిలి కోపాన్ని ప్రదర్శించడం’ అనే అర్థంలో వాడతారు.

iv) వ్యాకరణాంశాలు

 1) కింది పదాలను విడదీసి సంధులను గుర్తించండి.

  అ) ప్రాణాలు గోల్పోవు         =   ప్రాణాలు   +  కోల్పోవు     -        గసడదవాదేశ సంధి       

  ఆ) మూటఁగట్టు                =  మూటన్    + కట్టు           -        సరళాదేశ సంధి (లేదా) ద్రుతప్రకృతిక సంధి      

  ఇ) ఆసువోయుట              =    ఆసు      + పోయుట      -       గసడదవాదేశ సంధి                    

  ఈ) కాలు సేతులు             =    కాలు      + చేయి       -       గసడదవాదేశ సంధి          

  ఉ) పూచెను గలువలు        =   పూచెను    + కలువలు     -       సరళాదేశ సంధి (లేదా) ద్రుతప్రకృతిక సంధి

      వృద్ధి సంధి  : అ కారానికి (అ,ఆ లకు)  ఏ, ఐ లు పరమైతే ‘ఐ’ కారం,  ఓ, ఔ లు పరమైతే  ‘ఔ’ కారం ఏకాదేశంగా   వస్తాయి. 

అ) ఏకైక                 =  ఏక          +        ఏక                (అ+ ఏ=ఐ)

ఆ) వసుధైక             =  వసుధ      +       ఏక                 (అ+ ఏ=ఐ)

ఇ) దేశైశ్వర్యం           =  దేశ          +      ఐశ్వర్యం            (అ+ ఐ=ఐ)

ఈ) అష్టైశ్వర్యాలు       =  అష్ట          +   ఐశ్వర్యాలు            (అ+ ఐ=ఐ)

ఉ) వనౌషధి             =    వన        +  ఓషధి                   (అ+ ఓ= ఔ) 

ఊ) మహౌషధి          =    మహా      +    ఓషధి                 (అ+ ఓ= ఔ) 

ఋ) దివ్యౌషధం         =    దివ్య      +   ఔషధం                 (అ+ ఔ=ఔ) 

ౠ) నాటకౌచిత్యం     =   నాటక     +   ఔచిత్యం                (అ+ ఔ=ఔ)

v) తరగతిగదిలో చేయవలసిన అంశాలు

 1. పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పది పంక్తుల వచన కవిత రాయండి.

 2. పాఠం చదువండి. ముఖ్యమైన అంశాలు గుర్తించి రాయండి. చర్చించండి.

 3. పల్లెకు సంబంధించిన కవిత/పాట సేకరించి రాయండి.

vi) గైహికము (ఇంటిపని)

  1. రచయిత్రి పరిచయం, పాఠం ఉద్దేశం అంశాలు చదువండి. రాయండి.

  2. పుట సంఖ్య 43లోని  పేరా చదువండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

 vii)ప్రశ్నల నిధి 

i) లఘుసమాధాన ప్రశ్నలు 

1. నలుగురు నడిసిందే బాట’ అంటే మీకేమర్థమైంది ?

 2. కళదప్పిన ఇల్లు అంటే ఏమిటి ?

3. నాటి – నేటి  ఆచార వ్యవహారాల్లో తేడాలు ఏమిటి ?

4. “ అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు కనబడ్తూన్నవి ” అంటే మీకేం అర్థమైంది? 

5. “ ఎంత చెడ్డపని, ఎంత బాగా బతికిన గని ఇంకోణి ఆసరతోటి మంది భుజాలెక్కి నడువకుండ పయినం సాగితే సాలు”   అన్న అక్క మాటల్లో ఆంతర్యం ఏమై ఉంటుంది ?

6. మీ గ్రామంలోని ప్రకృతిని లేదా మీ ఊరి ప్రత్యేకతలను గురించి రాయండి.

7. చెరువుల ప్రాముఖ్యత ఏమిటి ?

8. కడ్పుల ఇసం – నాల్కెన తీపి అంటే ఏమిటి?

ii) కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

  అ) పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి.

  viii) నికష 

i) ఈ కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలల్లో జవాబులు రాయండి.                      5 మా

    1. మీ గ్రామంలోని ప్రకృతిని లేదా మీ ఊరి ప్రత్యేకతలను గురించి రాయండి.

     2. కడ్పుల ఇసం - నాల్కెన తీపి అంటే ఏమిటి?

ii) ఈ కింది పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి.                     2మా

     1.  పొలిమేర                         2. కుటిలవాజితనం

iii) కింది పదాలను విడదీసి సంధులను గుర్తించండి.                                  3మా 

    1. వసుధైక                          2.మూటఁగట్టు                3. కాలు సేతులు          





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu