11, అక్టోబర్ 2022, మంగళవారం

విద్యా లక్ష్యం Inter 1st Year

 1.విద్యా లక్ష్యం


కవి పరిచయం


నన్నయ 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజనరేంద్రుని ఆస్థానకవి. ఉభయభాషా కావ్యరచనాభి, శోభితుడు, లోకజ్ఞుడు, ఉచితజ్ఞుడు, రసజ్ఞుడు అయిన నన్నయ సాగించిన భారతానువాదం అనన్య సామాన్యం. వేదవ్యాస విరచితమై పంచమ వేదంగా చెప్పుకొనే సంస్కృత మహాభారతాన్ని రాజరాజు కోరిక మేరకు తెలుగులోకి అనువాదం చేసాడు. 'నన్నయ 'శ్రీవాణీ గిరిజాశ్చిరాయ' అంటూ సంస్కృత శ్లోకంతో మహాభారతాన్ని మొదలుపెట్టి. ఆనాటి ప్రాచీన విద్వాంసుల మెప్పు పొందాడు. బహుభాషా విజ్ఞుడు, ఉద్దండపండితుడు అయిన నన్నయ మహాభారతంలో ఆది, సభా, అరణ్యపర్వంలోని నాల్గవ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు రచించాడు. వాటితోపాటు ఆంధ్ర శబ్దచింతామణి, చాముండికా విలాసం, ఇంద్ర విజయం, లక్షణసారం అనే గ్రంథాలు రచించాడు. మిత్రుడైన నారాయణభట్టు సహాయంతో నన్నయ భారతానువాదానికి ఉపక్రమించాడు. మహాభారతాన్ని చంపూ పద్ధతిలో అనువదించిన నన్నయ భారత రచన ఒక స్వతంత్ర రచనలాగా సాగింది. నన్నయ తదనంతర కవులెందరికో మార్గదర్శకుడై 'ఆదికవి' అనిపించుకున్నాడు.

నన్నయ కథా నిర్వహణలో, భాషలో, శైలిలో, దృక్పథంలో మూలంలోకన్నా స్వతంత్రంగా వ్యవహరించాడు. మార్గ పద్ధతిలో సాగిన నన్నయ రచనలో అక్షర రమ్యత, నానారుచిరార్థ సూక్తి నిధిత్వము, ప్రసన్న కథా కలితార్థయుక్తి అనే లక్షణాలు కనిపిస్తాయి. నన్నయ వచనం కూడా పద్యంలా సొగసుతో ప్రౌఢ సమాసాలతో రసభరితంగా సాగింది. నన్నయభట్టు తెలుగులో భాషాసంస్కరణల్ని ప్రవేశపెట్టి 'శబ్దశాసనుడు'గా పేరు గాంచాడు. వ్యాసభారతంలోని ధర్మాన్ని నన్నయ కావ్యశైలిలోకి మార్చి తెలుగు సాహిత్యంలో కావ్య రచనకు మార్గం సుగమం చేశాడు.

ఆధ్యాత్మిక ధర్మప్రబోధం, లోకజ్ఞత, రాజనీతి, లౌకికనీతులు, శాస్త్ర వైదుష్యం నన్నయ రచనలో గాఢంగా కనిపిస్తాయి.


ప్రస్తుత పాఠ్యభాగం 'విద్యాలక్ష్యం' నన్నయ భట్టు విరచితమైన 'శ్రీమదాంధ్ర మహాభారతం! లోని ఆదిపర్వం, పంచమ ఆశ్వాసం నుంచి గ్రహించబడింది.


పాఠ్యాంశ సందర్భం:


భరద్వాజ మహర్షి పుత్రుడైన ద్రోణాచార్యుడు గొప్ప అస్త్రవిద్యా నిపుణుడు. కౌరవ పాండవులకు విలువిద్యను నేర్పడానికి భీష్ముడు ద్రోణాచార్యుడిని నియమించాడు. కురు పాండవులు ద్రోణాచార్యుని వద్ద గురుకులంలో విద్యను అభ్యసిస్తున్నారు. ద్రోణాచార్యుడు తన అస్త్రవిద్యా నైపుణ్యాలను వేటినీ దాచుకోకుండా తన శిష్యులకు నేర్పించాడు. అందులో తన ప్రియశిష్యుడైన అర్జునుడికి అనేక ధనుర్విద్యా రహస్యాలను బోధించాడు. గురుకులంలో శిక్షితులందరినీ పరీక్షించడానికి, వాళ్ళ నైపుణ్యం తెలుసుకొనేందుకు ఒక పరీక్షను ఏర్పాటు చేసాడు. గురువు పెట్టే పరీక్షలను అర్థం చేసుకుని లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విద్యార్థికి ఉండవలసిన లక్షణాలను తెలుపుతుంది ఈ పాఠ్యాంశం.










పాఠ్యభాగం:


వ. ద్రోణుండును నగ్నివేశ్యుండను మహామునివలన ధనుర్విద్యాపారగుం డై తత్ప్రసాదంబును నాగ్నేయాస్త్రంబాదిగాననే కదివ్యబాణంబులు వడసి, భరద్వాజు నియోగంబునఁ బుత్రలాభార్ధంబు కృపుని చెలియలిఁ గృపి యనుదాని వివాహంబయి, దానియందశ్వత్థామ యను కొడుకుంబడసి. 1


కం. అరిగి మహేంద్రాచలమునఁ

బరమ తపోవృత్తి నున్న భార్గవు లోకో

త్తరు భూరి కర్మ నిర్మల

చరితుని ద్రోణుండు గాంచి సద్వినయమునన్. 2


వ. 'ఏను భారద్వాజుండ, ద్రోణుండనువాఁడ; నర్ధార్థి నై నీ కడకు వచ్చితి' ననినఁ బరశు రాముం డిట్లనియె. 3


చ. కల ధన మెల్ల ముందఱ జగన్నుత! విపుల కిచ్చి, వార్ధమే

ఖలనిఖిలోర్వి యంతయును గశ్యపుఁ డన్ముని కిచ్చితిన్; శరం

బులును శరీరశస్త్రములుఁ బొల్పుగ నున్నవి; వీనిలోన నీ

వలసిన వస్తువుల్ గొను ధ్రువంబుగ నిచ్చెద నీకు నావుడున్. 4


కం. ధనములలో నత్యుత్తమ

ధనములు శస్త్రాస్త్రములు; ముదంబున వీనిం

గొని కృతకృత్యుఁడ నగుదును

జననుత! నా కొసఁగు మస్త్రశస్త్రచయంబుల్. 5


వ. అని పరశురాముచేత దివ్యాస్త్రంబులు ప్రయోగ రహస్య మంత్రంబులతోడంబడసి, ధనుర్విద్యయునభ్యసించి, ధనార్థియయి తనబాలసఖుండైన ద్రుపు పాలికింజని 'యేను ద్రోణుండ, నీ బాలసఖుండ, సహాధ్యాయుండ నన్నెఱుంగుదే' యని ప్రణయపూర్వకంబుగాఁ బలికిన విని యప్పలుకులు విన సహింపక ద్రుపదుండలిగి యిట్లనియె. 6


*చ. ధనపతితో దరిద్రునకుఁ, దత్త్వవిదుండగు వానితోడ మూ

ర్ఖునకుఁ, బ్రశాంతుతోడఁ గడుఁ గ్రూరునకున్, రణశూరుతోడ భీ

రునకు, వరూథితోడ నవరూథికి, సజ్జనుతోడఁ గష్టదు

ర్జనునకు నెవ్విధంబునను సఖ్యము దా నొడఁ గూడ నేర్చునే? 7


కం. సమశీలశ్రుతయుతులకు

సమధనవంతులకు సమసుచారిత్రులకు

దమలో సఖ్యమును వివా

హము నగుఁ గా; కగునె రెండు నసమానులకున్? 8


వ. 'మణి, యట్లుంగాక రాజులకుఁ గార్యవశంబునంజేసి మిశ్రామిత్ర సంబంధంబులు సంభవించుం గావున మా యట్టి రాజులకు మీ యట్టిపేద పాలువారలతోఁ గార్యకారణం బైన సఖ్యం బెన్నందును గానేర' దని ద్రుపదుండైశ్వర్యగర్వంబున మెచ్చక పలికిన విని, ద్రోణుం డవమానజనిత మన్యుఘూర్ణమాన మానసుండయి యెద్దియుం జేయునది నేరక పుత్రకళత్రాగ్నిహోత్ర శిష్యగణంబులతో హస్తిపురంబునకు వచ్చె;నంత నప్పుడ బహిరంగణంబున ధృతరాష్ట్ర పాండునందనులందఱుఁ గందుక క్రీడాపరులయి వేడుకతో నాడుచున్నంత నక్కాంచనకందుకం బొక్కనూతం బడిన. 9


ఆ. నీరిలోనఁ దోఁచు తారక ప్రతిబింబ

మొక్కొ యనఁగ వెలుఁగుచున్నదాని

రాచకొడుకులెల్లఁ జూచుచునుండిరి

దానిఁ బుచ్చుకొనువిధంబు లేక. 10


వ. అట్టి యవసరంబున 11


వ. "దీని బాణపరంపరం జేసి పుచ్చి యిచ్చెదఁ జూడుఁ; డీ విద్య యొరు లెవ్వరు నేర రని ద్రోణుం డొక్కబాణంబభిమంత్రించి దృష్టి ముష్టి సౌష్టవంబు లొప్ప నక్కందుకంబు నాటనేసి దాని పుంఖంబు మఱియొక బాణంబున నేసి తత్పుంఖంబొండొక బాణంబున నేసి వరుసన బాణరజ్ఞువు గావించి దానిందిగిచికొని యిచ్చినంజూచి రాజకుమారులెల్ల విస్మయంబంది ద్రోణుందోడ్కొనిచని భీష్మునకంతయు నెఱింగించిన నాతండును. 12


క. 'ఎందుండి వచ్చి తిందుల

కెందుండఁగ నీకు నిష్ట మెఱిఁగింపుము స

ద్వందిత!" యనియడిగిన సా

నందుఁడు ద్రోణుండు భీష్మునకు నిట్లనియెన్. 13


వ. ఏను ద్రోణుండనువాఁడ; భరద్వాజపుత్రుండ నగ్నివేశ్యుండను మహామునివరునొద్ద బ్రహ్మచర్యాశ్రమంబున వేదాధ్యయనంబు సేసి ధనుర్వేదంబభ్యసించుచున్ననాఁడు పాంచాలపతియైన వృషతుపుత్రుండు ద్రుపదుండనువాఁడు నా కిష్టసఖుండయి యెల్లవిద్యలు గఱచి, 'యేను పాంచాల విషయంబునకు రాజయిననాఁడు నా యొద్దకు వచ్చునది; నా రాజ్యభోగంబులు నీవు ననుభవింప నర్హుండ'వని నన్నుఁ బ్రార్థించి చని, పృషతు పరోక్షంబునఁ దద్దేశంబునకు రాజయియున్న, నేను గురునియుక్తుండనై గౌతమిం బాణి గ్రహణంబు సేసి యిక్కుమారు నశ్వత్థామనధికతేజస్వినాత్మజుంబడసి, ధనంబు లేమిం గుటుంబ భరణంబునందసమర్థుండనయి యుండియు. 14


క. పురుషవిశేషవివేకా

పరిచయులగు ధరణిపతుల పాలికిఁ బోవం

బరులందు దుష్ప్రతిగ్రహ

భర మెదలో రోసి ధర్మ పథమున నున్నన్. 15


కం. ధనపతుల బాలురు ముదం

బున నిత్యముఁ బాలు ద్రావఁబోయిన నస్మ

తనయుండు వీఁడు బాల్యం

బుననేడ్చెను బాలు నాకుఁ బోయుండనుచున్. 16


వ. దానింజూచి 'దారిద్ర్యంబున కంటెఁ గష్టం బొండెద్దియు లేదు; దీని నా బాలసఖుండగు పాంచాలు పాలికిం బోయి పాచికొందు; నాతండు తన దేశంబున కలిపిస్తుందు గా బోవుచుండి నన్ను రా బనిచిపోయె.' 17


*మ.కో. వేఁడు టెంతయుఁ గష్టమైనను వేఱులేని సుహృజ్జనున్

వేడికో లుచితంబ కావున వేడుతోఁ అని సోమకున్ 

వేఁడినన్ ధనమోపఁడేనియు వీని మాత్రకు నాలుగేన్ 

పాడి కుర్రుల నీఁడె వీనికిఁ బాలు ద్రావుచునుండఁగన్. 18


వ. అని నిశ్చయించి ద్రుపదునొద్దకుంబోయి నన్నెఱింగించిన, నాతండు ధన రాజ్యమదంబున నన్నును దన్నును నెఱుంగక 'యేను రాజను నీవు పేద పాఱుండవు; నాకును నీకును నెక్కడి సఖ్యం బని పలికిన వానిచేత నవమానితుండనయి వచ్చితి' నని ద్రోణుండు. ధనవృత్తాంతంబంతయుఁ జెప్పిన. 19


కం. విని రోయు తీఁగ గాళ్ళం

బెనఁగెం దా ననుచుఁ బొంగి భీష్ముఁడు ద్రోణున్

ఘనభుజు నభీష్ట పూజా

ధన దాన విధానముల ముదంబునఁ దనిపెన్. 20


చ. మనుమలనెల్లఁ జూపి మతిమంతుఁడు శాంతనవుండు 'వీరిఁ జే

కొని గురువృత్తిమైఁ గఱపు ఘోరశరాసన విద్యలెల్లఁ; బెం 

పున జమదగ్నిసూనుఁడును బోలఁడు' నిన్నని విందు విల్లునే

ర్పున నైపుణ్యంబునను భూరిపరాక్రమగర్వసంపదన్. 21


వ. అని కుమారులు నెల్లంజూపి ద్రోణునకు శిష్యులంగా సమర్పించిన 22


క. నరుఁడస్త్ర శస్త్ర విద్యా

పరిణతి నధికుఁడయి వినయపరుఁడయి శశ్వ

ద్గురుపూజాయత్నంబునఁ

బరఁగుచు సంప్రీతుఁ జేసె భారద్వాజున్. 23


సీ. ఆతని యస్త్రవిద్యాభియోగమునకుఁ

    బ్రియశిష్యవృత్తికిఁ బెద్ద మెచ్చి

యన్న! ధనుర్ధరు లన్యులు నీకంటే

    నధికులు గాకుండునట్లు గాఁగఁ

గఱపుడు విలువిద్య ఘనముగా' నని పల్కి

   ద్వంద్వ సంకీర్ణ యుద్ధముల తెఱఁగు

రథ మహీ వాటి వారణములపై నుండి

   దృఢచిత్ర సౌష్టవస్థితుల నేయ


తే. బహువిధ వ్యూహ భేదనోపాయములను

సంప్రయోగ రహస్యాతిశయము గాఁగఁ

గఱపై నర్జునుఁ దొంటి భార్గవుఁడు వింట

నిట్టిఁ దేశీయని పొగడంగ నెల్ల జనులు. 24


మ.కో. భూపనందను లివ్విధంబున భూరి శస్త్రమహాస్త్రవి

ద్యోపదేశపరిగ్రహస్థితి నున్న నందఱయందు వి

ద్యోపదేశము దుల్యమైనను నుత్తమోత్తముఁ డయ్యె వి

ద్యాపరిశ్రమకౌశలంబున దండితారి నరుండిలన్. 25


వ. అక్కుమారుల ధనుర్విద్యాకౌశలంబెఱుంగ వేఁడి యొక్కనాఁడు ద్రోణుండు కృత్రిమంబయిన భాసంబను పక్షి నొక్క వృక్షశాఖాగ్రంబున లక్ష్యంబుగా రచియించి, దాని నందఱకుఁ జూపి 'మీమీ ధనువులు బాణంబులు సంధించి నా పంచిన యప్పుడు యిప్పక్షి తలఁ దెగ నేయం; డే నొకళ్ళొకళ్ళన పంచెద' నని ముందఱ ధర్మనందనుం బిలిచి 'యీ వృక్షశాభాగ్రంబున నున్న పక్షి నిమ్ముగా నీక్షించి మద్వచనానంతరంబున శరమోక్షణంబుసేయు' మనిన నతండును వల్లె యని సేసియున్న నయ్యుధిష్ఠిరునకు ద్రోణుండిట్లనియె. 26


తే. 'వృక్షశాభాగ్రమున నున్న పక్షిశిరము

దెల్లముగఁ జూచితే మహీవల్లభుండ!'

యనిన నిమ్ముగఁ జూచితి ననిన, వెండి

అప్పటికి యును గురుఁడు ధర్మజున కిట్టు లనియెఁ బ్రీతి. 27


క. 'జననుత! యా మ్రానిని న

న్నును మణి నీ భ్రాతృవరులనుం జూచితే నీ?'

వనపుడుఁ జూచితి నన్నిటి

ననఘా! వృక్షమున నున్న యవ్విహగముతోన్. 28


వ. అనిన విని ద్రోణుండు ధర్మజుం బదరి 'నీ దృష్టి చెదరె; నీవు దీని నేయనోపవు పాయు' మని యివ్విధంబున దుర్యోధనాదులైన ధార్తరాష్ట్రులను భీమసేన నకుల సహదేవులను నానాదేశాగతులైన రాజపుత్రులను గ్రమంబున నడిగిన వారలు ధర్మనందను చెప్పినట్ల చెప్పిన, నందఅనిందించి, పురందరనందనుంబిలిచి వారినడిగిన యట్ల యడిగిన నాచార్యునకు నర్జునుండిట్లనియె. 29


క. 'పక్షిశిరంబు దిరంబుగ

నీక్షించితి; నొండు గాన నెద్దియు' ననినన్

లక్షించి యేయు మని సూ

క్ష్మేక్షణు ద్రోణుండు పనిచే నింద్రతనూజున్. 30


క. బగురువచనాంతరమున

నరుఁ డప్పుడు శరవిమోక్షణము సేయుఁడుఁ జె

బక్షిశిరము దిగి త

ద్ధరణీరుహశాఖనుండి !! ధారుణి బడియెన్. 31


వ. ఇట్లశ్రమంబునఁ గృత్రిమ పక్షితలఁ దెగనేసిన యర్జును నచలిత దృష్టికి మెచ్చి ద్రోణుండాతనికి ధనుర్వేద రహస్యంబు లుపదేశించె; నంత. 32


క. మానుగ రాజకుమారుల

తో నొక్కట నొక్కనాఁడు ద్రోణుఁడు గంగా

స్నానార్ధ మరిగి యందు మ

హా నియమస్థుఁడయి నీళ్ళనాడుచునున్నన్ 32


క. వెఱచఱవ నీరిలో నొ

క్కెఱగా నొక మొసలి చూడ్కికి నగోచరమై

పఱతెంచి కుంభసంభవు

చిఱుతొడ వడిఁ బట్టికొనియె శిష్యులు బెదరన్. 34


క. దాని విడిపింప ద్రోణుఁడు

దానపుడు సమర్థుఁడయ్యుఁ దడయక పనిచెన్

'దీని విడిపింపుఁ" డని నృప

సూనుల శరసజ్యవాపశోభితకరులన్ 35


*శా. దానిన్ నేరక యందఱున్ వివశులై తారున్న, నన్నీరిలో

గానంగాని శరీరముంగల మహోగ్ర గ్రాహమున్ గోత్ర భి

త్సూనుం డేను శరంబులన్ విపుల తేజుండేసి శక్తిన్ మహా 

సేన ప్రఖ్యుఁడు ద్రోణుజంఘ విడిపించెన్ విక్రమం బొప్పఁగన్. 36


వ. అమ్మ హెూగ్రగ్రాహంబు పార్థబాణపంచక విభిన్నదేహం బయి పంచత్వంబుఁ బొందినం మరణం జూచి, ద్రోణుండర్జును ధనుః కౌశలంబునకుఁ దనయందతి స్నేహంబునకు మెచ్చి, వీనిచే ద్రుపదుండు బంధుసహితంబు పరాజితుం డగునని తన మనంబున సంతోషించి, వానికి ననేక దివ్యబాణంబు లిచ్చెనని యర్జును కొండుకనాఁటి పరాక్రమ గుణసంపదలు వైశంపాయనుండు జనమేజయునకుం జెప్పెనని. 37



అభ్యాసం


I. వ్యాసరూప ప్రశ్నలు


1. ద్రోణార్జునుల గురుశిష్య సంబంధాన్ని చర్చించండి?


2. 'విద్యాలక్ష్యం' పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి?


II. సంగ్రహరూప ప్రశ్నలు


1. నన్నయభట్టు గురించి తెలుపండి?


2. ద్రుపదుడి చేతిలో ద్రోణుడు ఏవిధంగా భంగపడ్డాడు?


3. ఎవరెవరి మధ్య 'సఖ్యత' కుదరదని ద్రుపదుడు చెప్పాడు?


4. 'కల్పిత పక్షి'ని ఛేదించే సమయంలో కురుకుమారుల ప్రతిభ తెలుపండి?


III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు


1. నన్నయకు భారత రచనలో ఎవరు సహాయపడ్డారు?


2. నన్నయ ఎవరి ఆస్థానకవి?


3. ద్రోణుడి మిత్రుడి పేరేమిటి?


4. అశ్వత్థామ ఎవరి కుమారుడు?


5. ద్రోణాచార్యుడికి ఎవరెవరు అస్త్రశస్త్రాలు ప్రసాదించారు?


6. 'పక్షికన్ను' లక్ష్యంగా ఎవరు బాణం వేశారు?


7. పరశురాముడు తనధనాన్ని ఎవరికి ఇచ్చాడు?


8. ద్రోణుడిని ధనుర్విద్యాచార్యుడిగా ఎవరు నియమించారు?



IV. సందర్భసహిత వ్యాఖ్యలు.


1. సఖ్యము దానొడఁ గూడ నేర్చునే!


2. అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు


3. నారాజ్యభోగంబులు నీవు ననుభవింపనర్హుండ


4. దారిద్య్రంబున కంటెఁగష్టంబొండెద్దియులేదు.


V. సంధులు


1. వేదాధ్యయనంబు


2. నిఖిలోర్వి


3. విద్యోపదేశం


4. అత్యుత్తమ


5. పాలికిఁబో


6. మహోగ్ర


7. శాఖాగ్ర



VI. సమాసాలు


1. అస్త్రశస్త్రాలు


2. దివ్యబాణం


3. గుణసంపద


4. విపులతేజుడు


5. గురువచనం


6. తపోవృత్తి


7. పుత్రలాభం


8. ధనుర్విద్యాకౌశలం


9. ధనపతి


10. ఇష్ట సఖుడు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu