11, అక్టోబర్ 2022, మంగళవారం

గుణనిధి కథ inter 1st year telangana

 3. గుణనిధి కథ


-శ్రీనాథుడు


కవి పరిచయం:


శ్రీనాథుడు కొండవీటి రెడ్డి రాజుల ఆస్థానకవి. క్రీ.శ.1385-1475 ల మధ్యకాలంలో జీవించాడు. భీమాంబ, మారయ మాత్యులు శ్రీనాథుని తల్లిదండ్రులు, తెలుగు సాహిత్య చరిత్రలో పురాణ యుగానికి, ప్రబంధ యుగానికి మధ్య శ్రీనాథుడు కావ్య యుగకర్త గా ప్రసిద్ధి కెక్కాడు. 'చిన్నారి, పొన్నారి, చిఱుతకూకటినాడు...' అనే పద్యంలో శ్రీనాథుడు మరుత్తరాట్చరిత్ర, శాలివాహన సప్తశతి, శృంగార నైషధం, కాశీఖండం, భీమఖండం వంటి కావ్యాలు రచించినట్లు చెప్పుకున్నాడు. ఇవే కాకుండా, శివరాత్రి మహాత్మ్యం, కం. పల్నాటి వీరచరిత్ర వంటి కావ్యాలు కూడా శ్రీనాథుని రచనలే.

శ్రీనాథుడు బ్రాహ్మీదత్తవరప్రసాదుడు, సకల విద్యా సనాథుడు. దగ్గుపల్లి దుగ్గన తన నాసికేతోపాఖ్యానంలో శ్రీనాథుని వైదుష్యాన్ని ప్రశంసించాడు.

శ్రీనాథుడు తన జీవితకాలంలో పెక్కు రాజాస్థానాలు దర్శించి సన్మానాలు పొందినట్లు తెలుస్తున్నది. 'దీనారటంకాల తీర్ధమాడించితి దక్షిణాధీశు ముత్యాలశాల' అనే పద్యం వల్ల "గౌడ డిండిమభట్టు కంచుఢక్క పగుల గొట్టించినట్లు తెలుస్తున్నది. 'వచియింతు వేములవాడ భీమన భంగి నుద్దండలీల నొక్కొక్కమాటు' అనే పద్యంలో ఉద్దండలీల, ఉభయవాక్ర్పౌడి, రసాభ్యుచిత పదబంధం, సూక్తి వైచిత్రి- వంటి లక్షణాలు తన కవిత్వానికున్నట్లు చెప్పుకున్నాడు. 


పాఠ్యభాగ సందర్భం:

గుణనిధి కథ కాశీఖండంలో ఉంది. యజ్ఞదత్తుని కుమారుడు గుణనిధి. యజ్ఞదత్తుడు వేదవేదాంగాలను అధ్యయనం చేసి విద్యా విశారదునిగా ప్రసిద్ధికెక్కాడు. గుణనిధి పండిత పుత్రుడైనప్పటికీ ద్యూతక్రీడలకు అలవాటుపడి చదువును నిర్లక్ష్యం చేశాడు. ఇంటి నుండి బయటికి వెళ్ళాల్సిన దశలో జీవిత పరమార్థాన్ని అర్ధం చేసుకుంటాడు. విద్యాధనమే మనిషికి నిజమైన ధనమనీ, అది చోరుల చేత అపహరించబడడం సాధ్యం కాదని తెలుసుకుంటాడు. ప్రస్తుత పాఠ్యభాగం కాశీఖండంలోని చతుర్థాశ్వాసం నుండి స్వీకరించబడింది.


పాఠ్యభాగం:

తే. భూసురోత్తమ ! కాంపిల్య పురమునందు

యజ్ఞదత్తాఖ్యుఁడొక్క బ్రాహ్మణుఁడు గలదు

వేద వేదాంగ వేదార్థ విత్తముండు

యజ్ఞ విద్యావిశారదుండా ద్విజుండు


తే. అతని పుత్రుండు గుణనిధి యనెడివాఁడు

దర్పకునితోడి జోడు సౌందర్య రేఖ

నెయ్య మలరంగ గురులుపనీతుఁ జేసి

చదువఁ బెట్టిరి వాని నాచార్యునొద్ద


కం. ద్యూత క్రీడా రతుఁడై

యాతడు కితవులునుదాను నాసాయంబా

ప్రాతస్సమయము దిరుగ న

పేత నిజాచారుఁడగుచు నెల్లెడ వీటన్


సీ. బ్రాహ్మణాచారంబు పరిహాసకము సేయు

నగ్నిహోత్ర విధానమన్న నలుగు

సంధ్యాభివందన శ్రద్ధయుజ్జన సేయు

గీత వాద్య వినోద కేళిఁదగులుఁ

బాషండ భండదుర్భాష లావర్తించు 

ద్యూతకారుల తోడియుద్దివడయు

ధాతువాదుల మీఁదఁ దాత్పర్య మొనరించుఁ

జెలిమి వాటించు నాస్తికుల తోడ

నటుల మన్నించు హర్షించు విటులఁ జూచి

పీఠమర్దుల కొనరించు పెద్దఱికము

కౌలటేయులఁ బాటించు గారవించు

శిష్టకుల దీక్షితుని పట్టి సిగ్గువిడిచి


వ. సజీవ నిర్జీవ ద్యూతంబుల నోడిన ధనంబులు గితవులకుం దల్లి మేనిరవణంబుల నమ్మి

పెట్టుచుండ


తే. తల్లి బోధించుఁ దత్పరత్వమ్ము గలిగి

  యన్న! మీయన్నచెప్పినయట్ల చేయు 

ధూర్తసంగతి విడువు సాధువులు తోడ

బరిచయము సేయుమని పుత్రుబ్రతిదినంబు


వ. దీక్షితుండును గృహకార్యాభ్యంతరవ్యగ్రుండై కొడుకు వర్తనంబుఁ బరామర్శింపక యుండు


తే. ఎడప దడపఁ దనూభవుండెచటనుండు

గానరాఁడంచు గృహభర్త కాంతనడుగ 

నింతదడవును నాయొద్ద నిచట నుండి 

యరిగెఁ జదువంగనని భర్త కతివమొఱఁగు


ఆ. గొడ్డువీఁగి కన్న బిడ్డండు కావున

నొక్కరుండు కాన నుత్పలాక్షి

ధూర్తుఁడైన వాని దుశ్చేష్టితము లెల్ల

నధిపునెఱుఁగ నీక యడచుచుండు


వ. చూడా కర్మానంతరంబున షోడశ వర్షంబున గృహ్యోక్త ప్రకారంబున నతనికి వివాహంబు చేసి 

ప్రత్యహంబును


కం. స్నేహార్ధ హృదయయైఁయతి

సాహస కృత్యములు మాన్పసమకొల్పుటకై

యూహాపోహ విచార స

మాహిత గతిఁ దల్లిసుతుని మరిబోధించున్




చం. విడువకు నీవు పట్టణము వీధుల వీధులు వెర్రివాఁడవై

చెడుగులఁ గూడి ధౌర్త్యములు సేయ మహీరమణుండెఱింగెనే

విడుచును సోమయాజి మనువృత్తులు చేకొనునెల్లభంగులన్

జెడుదుము నీకతంబుననుఁ జీరయుఁగూడును లేక పుత్రకా!


తే. పట్టణములోన నీవు దర్పమునఁజేయు

కొయ్యతనములు వీక్షించి కూర్మితనయ

నవ్వుదురు నిన్ను మొదల నానా విధముల

నవ్వుదురు దీక్షితుని ననంతరము జనులు


వ. అని యంత నిలువక


తే. తల్లిబడి కొల్లిచట్టంచు నుల్లసంబు

లాడుదురు నన్నుఁ గూర్చి నిన్నహరహంబు\

దుర్ణయం బెల్లనా మీఁదఁ ద్రోచిజనులు

డబ్బరలు పల్కువారి కడ్డంబు గలదె?


కం. అవినయ నిధానమగు నీ

నవ యౌవన శైశవముల నడిమి వయసునం

గవిసెడు వ్యసనోద్రేకం

బవగాఢము దాని మానుమయ్య తనూజా !


వ. అని యనేక ప్రకారంబులు బోధించిన తల్లి మాటలు చెవుల సోకనీక యిట్టట్టనక యూర కుండె, 

మృగయా మధ్య పైశున్యవేశ్యా చౌర్య దురోదర పరదారాభిలాషంబులను దోషంబులు 

నవయౌవనారంభమున సంభవించె నేని వానిం బరావర్జింప నెవ్వరు నేర్తురు? గురువచనం బతి 

నిర్మలంబయ్యు సలిలంబునం బోలెశ్రవణ స్థితంబై యభవ్యునికి శూల పుట్టించు. నయథార్ధ 

నామధేయుండగు నగ్గుణనిధి యథాపూర్వంబు దుర్వర్తనంబులఁ దిరుగాడు. చుండ నొక్కనాఁడు.


సీ. దర్శనం బిచ్చె నెద్దానిఁ గోమటి క్రొత్త 

పొడ చూపనేతెంచె భూభుజునకు

దనకిచ్చె నెద్దాని ధారాంబు పూర్వంబు

పుణ్యకాలమునాఁడు భూమిభర్త

దానిచ్చె నెద్దాని ధర్మ గేహినియైన

సోమిదమ్మకు మనః ప్రేమమలర

దఱిఁజూచి యిచ్చె నెద్దానిఁ బట్టికిఁదల్లి

జూదమాడిన పైఁడి సుట్టుకొనిన

యట్టినవరత్న మయమైన యంగుళీయ

కంబు యజ్ఞావ బుధపుణ్యకర్మసాక్షి

వీటిలో నొక్కజూదరి వ్రేల నుండ

జూచెఁ గనురెప్ప వెట్టక సోమయాజి





వ. చూచి తన సొమ్మౌట యెఱింగి దీక్షితుండక్షక్రీడాజీవనుం గదిసి యెలుంగెత్తి 

యీయంగుళీయకంబు నీకెట్టు గలిగె? ఉన్న రూపు చెప్పు. తప్పఁ జెప్పితేని భూపాలు సన్నిధిం 

బెట్టి దండితు ననన జూదరి నీతనయుండు గుణనిధి నెత్తంబున నొడ్డిన విత్తంబునకై యీ 

యంగుళీయకంబు నాకిచ్చె. మఱి బంగారు భృంగారు కర్కరీకలాచికలు, తలియలు, 

పళ్ళెరంబులు, తామ్రపాత్రంబు, లార కూట ఘటంబు లన్నియుం దాకట్టు వెట్టియు దురోదర క్రీడా 

పరాయణుండై పట్టణంబు లోనం జరియించుచున్న వాఁడు. 


తే. అక్షధూర్తులలోన నీ యనుగుఁగొడుకు

దొరయునంతటి యక్షధూర్తుండు లేఁడు

క్షితి తలంబున యాగ దీక్షితుల లోనఁ

గీర్తి నియట్టి యాగ దీక్షితుఁడు లేఁడు


వ. అనిన విని లజ్జాక్రోధంబులు మనంబున ముప్పిరిగొన యజ్ఞదత్తుండర్ధ ముండితంబైన 

మూర్ధంబున నీర్కావిధోవతి నఱిముఱిఁ జుట్టుకొని యింటికేతెంచి మొగంబు గంటు పెట్టుకొని 

సోమిదమ్మ! ఏమి చేయుచున్నదాన విటురమ్ము ! నీ కొడు కెక్కడికిం బోయె? బోవుఁగాకేమి! 

వినుమని యిట్లనియె.


*శా. అంగోద్వర్తన వేళ నీవు దరహాసాంకూరముల్లోచనా

పాంగప్రాంతములందిగుర్పనొక సయ్యాటంబుఁ గల్పించినా

యంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా? యా యుంగరం బిప్పుడే

శృంగారింపని చేతఁ బావకునకున్ జేయన్ హవిర్దానమున్.


వ. అనిన నద్దీక్షితాయని దీక్షితున కిట్లనియె


సీ. మధ్యాహ్న సంధ్యాసమాగమం బిది తీర్థ

మవధరింపుము నిత్యమాచరింపు

మగ్ని కార్యముఁదీరు మభవుఁ బూజింపుము

పంచ మహాయజ్ఞపరుఁడ నగుము

మొగసాల నున్నారు జగతీ సుపర్వులు

గ్రాసార్థులగుచుఁ బెక్కండ్రతిథులు

పక్వాన్నములు శాకపాకాదికంబులు

చల్ల నాణినయేనిఁ జవులు దప్పు

బదిలముగ మందసమునందు బరిణలోన

నునిచి దాఁచిన దాన మీ యుంగరంబు

దీరదిప్పుడు పెట్టె శోధించి చూడ

నారగించిన పిదప నేనధిప! తెత్తు


తే. అనిన విని సోమయాజి కోపాగ్రహమునఁ 

దత్తరించుచు వడిసోమిదమ్మఁ బలికె

నౌనే సత్పుత్రజనయిత్రి ! యౌనెసాధ్వి!

యౌనె సూనృతభాషిణి ! యౌనె దేవి !




సీ. స్వాధ్యాయ మెన్నండు జదువంగఁ బోకుండఁ

బోలునే చదువంగఁ బోయెననుట,

తెల్లవాఱఁగ నీటఁ దీర్ధమాడకయుండ

ననురూపమే తీర్ధమాడెననుట

సమయానుకూలత సంధ్యవార్చక యుండ

వైదగ్ధియే సంధ్య వార్చెననుట?

తరితోడ నగ్నిహోత్రము వేల్వకుండంగ

విజ్ఞాన సరణియే వేల్చెననుట?

కల్లలాడంగ ఫలమేమి గలిగె నీకు? 

మాటిమాటికి నేను నీమాట నమ్మి

యరసి రక్షింప నేరక యనుఁగుఁ గొడుకు 

భ్రష్టుఁ జేసితి నేమి చెప్పంగఁ గలదు?


సీ. ఏడఁబోయెనొ కదా మేడలో మంజిష్టి 

పెనుబండువుననైన బెట్టజాల!

దాకట్టు వడదె యింతకు వైశ్యగృహమున

కనక కర్కరిల భృంగారుకమ్ము?

పట్టుసూత్రమయంబు పసిడిమొడ్డాణమే

గురుఁబోఁడి కటీర మెక్కెనొక్కొ! 

శశికాంత పీఠికా స్తంభ లీలారత్న

సాలభంజిక యెందు సాగెనొక్కొ! 

ఎచట నున్నదియో రత్నఖచితమైన

హంసతూలిక డోలావిహార తల్ప

మూచముట్టుగ నీవు నీయొంటి కొడుకు

బాడు చేసితి గృహము నిర్భాగ్యురాల!


తే. చాలునింక నాపాలికిఁ జచ్చినాఁడు 

కొడుకు గుణనిధి యనువాఁడు కులవిషంబు

తిలలు దర్భయు నుదకంబుఁ దెత్తుఁ గాఁక

యేనివాపాంజలుల వానికిత్తునిపుడె !


వ. కుపుత్త్రత్వంబు కంటె నపుత్త్రత్వకంబు మేలు. కులపాంసనుండైన వీని నొక్కనిం ద్యజించి. 

కులంబు రక్షించుట నీతియ కదా! యని పలికి కోపావేశంబునఁ బెదవులదరం గట తటంబులు 

చిటుల భ్రూకుటి నిటలంబున నటింపఁ గటాక్షంబులు గెంపుగదురం. గటకటంబడుచు 

నాహ్నికంబైన క్రియా కలాపంబు నిర్వర్తించి యాగ్రహంబునం గృతార్థత్వంబు నొంద గొన్ని 

దినంబులకు నొక్క శ్రోత్రియుని పుత్రిం బెండ్లియాడి యజ్ఞదత్తుండు గృహస్థ ధర్మంబు 

నిర్వర్తించుచుండె. అంతక మున్న గుణనిధి తండ్రి కోపం బెఱింగి యింటికిం బోవక యెందేని 

యుంజనువాడనని మనంబున నిట్లని వితర్కించు


తే. ఏమి సేయుడు? నెక్కడి కేగువాఁడ? 

ధనము నిప్పచ్చరంబు విద్యయు హుళక్కి 

పెట్టసాఁగెడు నాచేయి భిక్ష సేయ 

నెట్టు నేరుచు? దైవంబ యెఱుఁగు నింక


తే. ఏ భయంబుల నేచ్చోట నేనయలేదు

నరున కెప్పాట విద్యాధనంబ ధనము 

చోరబాధాధికము చేతఁ జూఱవోవు 

ధనము ధనమౌనె యెన్నిచందములఁ దలఁప?


తే. అక్కటకట! దురోదరవ్యసన మెట్లు? 

యాయజూత విశిష్టాన్వవాయమెట్లు? 

ఎట్లు చేసినఁ జేసెఁగాకేమనంగ 

నేర్పువారము? విధి దయానిస్వహృదయు


చ. అరుణ గభస్తిబింబ ముదయాద్రిపయిం బొడతేర గిన్నెలో

బెరుఁగును వంటకంబు వడ పిందియలుం గుడువంగఁ బెట్టు ని

ర్భర కరుణా ధురీణయగు ప్రాణము ప్రాణము తల్లి యున్నదే? 

హరహర! యెవ్వరింకఁ గడు పారఁగఁ బెట్టుదు రీప్సితాన్నముల్ 


వ. అనుచు నెందేనియుఁ జనియె.



==================


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu