భాగవతం ఆణిముత్యాలు
ప్రథమ స్కంధం
1-1 శ్రీకైవల్యపదంబు
సందర్భం:
తెలుగుల పుణ్యపేటి బమ్మెర పోతన శ్రీమద్భాగవత అమృతాన్ని తెలుగుజాతికి అందించటానికి పూనుకొని ముందుగా నందాంగనాడింభకుడైన శ్రీకృష్ణపరమాత్మను హృదయంలో నిలుపుకుంటున్నాడు. మనలను కూడా నిలుపుకోమంటున్నాడు.
శా. శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకర
క్షైకారంభకు భక్తపాలనకళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నా
నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్.
ప్రతిపదార్ధం:
శ్రీ = శుభకరమైన; కైవల్య = ముక్తి; పదంబున్ = స్థితిని; చేరుటకునై = పొందుటకై; చింతించెదన్ = ప్రార్థిస్తాను; లోక = లోకాలన్నిటిని; రక్ష = రక్షించటమనే; ఏక = ముఖ్యమైన; ఆరంభకు = సంకల్పం కలవానికి; భక్త = భక్తులను; పాలన = పాలించే; కళా = నేర్పునందు; సంరంభకున్ = వేగిరపాటు ఉన్నవానికి; దానవ = రాక్షసుల; ఉద్రేక = ఉద్రేకమును; స్తంభకున్ = మ్రాన్పడేలా చేసేవానికి; కేళి = ఆటలలో; లోల = అందంగా; విలసత్ = ప్రకాశించే; దృక్జాల= చూపుల వల నుండి; సంభూత = పుట్టిన; నానా = వివిధ; కంజాత భవాండ = బ్రహ్మాండముల {కంజాతభవాండ - కం (నీటిలో) జాత (పుట్టినదాని, (పద్మం) లోపుట్టినవాని (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; కుంభ = రాశి తనలో కలిగినవానికి; మహా = గొప్పవాడైన; నందాంగనా = నందుని భార్య (యశోద) యొక్క; డింభకున్ = కొడుకునకు;
తాత్పర్యం:
మహానందుడనే పుణ్యాత్ముని ఇల్లాలు యశోద. ఆ ఇద్దరినీ అనుగ్రహించడానికి వారి ముద్దుబిడ్డడుగా వారిని చేరుకున్నాడు కన్నయ్య. ఆ మహాత్ముడు అనుగ్రహించే కైవల్యపదం 'శ్రీ' తో కూడినది. 'శ్రీ' అంటే లోకాలను, లోకులను - సర్వాన్నీ నడిపించే మహాశక్తి. దానితో కలిసి ఉండే మోక్ష సామ్రాజ్యమే శ్రీకైవల్య పదం. దానికోసం శ్రీకృష్ణవాసుదేవుని నిరంతరమూ ధ్యానిస్తూ ఉంటాను. ఆ పసిబిడ్డ లోకాలను రక్షించటం అనే ఒకే ఒక్క కార్యం కలవాడు. భక్తులను కాపాడటం అనే కళలో తొందరతనం కలవాడు. రక్కసుల పొగరును నిలువరించే సామర్థ్యం కలవాడు. ఆటలలో అందంగా కదలాడుతున్న చూపుల సముదాయంతో రూపొందిన అనేక బ్రహ్మాండాలనే కుండలు గలవాడు. అట్టి బాలగోపాలుని మనస్సులో ధ్యానిస్తూ ఉంటాను.
1-2 వాలినభక్తి
సందర్భం:
తన భాగవత రచన సకల శుభపరంపరలతో సాగాలని మహాభక్త శిఖామణి అయినటువంటి పోతన సర్వజ్ఞుడైన శ్రీ శంకరుని వైభవాన్ని సంభావిస్తూ ఇలా ప్రార్థిస్తున్నాడు.
ఉ. వాలినభక్తి మ్రొక్కెద నవారిత తాండవకేళికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మమయూఖ మాలికిన్
బాలశశాంకమౌళికి కపాలికి మన్మథ గర్వపర్వతో
న్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికిన్.
ప్రతిపదార్ధం:
వాలిన = అతిశయించిన; భక్తి = భక్తితో; మ్రొక్కెదన్ = మ్రొక్కెదను;
అవారిత = వారింపలేని; తాండవకేళికిన్ = తాండవమనే ఆట ఆడేవానికి; దయాశాలికిన్ = దయకలవాడికి; శూలికి = శూలధారికి; శిఖరిజా = పర్వతరాజ పుత్రిక (పార్వతి) యొక్క; ముఖపద్మ = ముఖము అనే పద్మానికి; మయూఖమాలి = సూర్యుడైన వానికి {మయూఖమాలి - కిరణములు కలవాడు, సూర్యుడు}; బాల = చిన్న; శశాంక = చంద్రుని {శశాంక - శశ (కుందేలు) గుర్తు కలవాడు - చంద్రుడు}; మౌళికిన్ = శిరస్సున ధరించిన వానికి; కపాలికిన్ = పుర్రెలు ధరించేవానికి; మన్మథ = మన్మథుని; గర్వపర్వత = గర్వమనే పర్వతాన్ని; ఉన్మూలికిన్ = నిర్మూలించిన వానికి; నారదాది = నారదుడు మొదలైన; ముని = మునులలో; ముఖ్య = ముఖ్యుల; మనస్ = మనస్సులనే; సరసీరుహ = పద్మాలయందు {సరసీరుహ - సరస్సులో పుట్టినది, పద్మం); హాళికిన్ = ఆసక్తి గల వానికి.
తాత్పర్యం:
నేను అతిశయించిన భక్తితో పరమశివునకు మ్రొక్కుతాను. ఆ శివుడు ఎవరికీ నిలువరించటానికి సాధ్యం కాని తాండవనృత్యం ఆటగా గలవాడు. సర్వప్రాణులయందూ దయతో అలరారేవాడు. శూలం కలవాడు. పర్వతరాజతనయ మోము అనే తామరపూవునకు కిరణాల మాలలుగల భాస్కరుడు అయినవాడు. చిన్ని చందమామను తలపై పూవుగా దాల్చినవాడు. బ్రహ్మ తలను గోటితో గిల్లి ఆ పుఱ్ఱెను విలాసంగా చేతిలో ధరించి తిరుగాడుతూ ఉండేవాడు. మన్మథుని గర్వం ఒక పెద్ద పర్వతం వంటిది, దానికి అందరూ అణగిమణగి ఉండటం తప్ప మరొక దారిలేదు. అటువంటి గర్వపర్వతాన్ని అవలీలగా పెల్లగించి పారవేసినవాడు. నారదుడు మొదలైన జ్ఞానసంపన్నుల హృదయపద్మాలలో మనోజ్ఞమైన నాదం చేస్తూ తిరుగాడే తుమ్మెద వంటివాడు.
1-3 ఆతతసేవ
సందర్భం:
నాలుగుమోముల దేవర బ్రహ్మయ్య. జ్ఞానవిజ్ఞానాల స్వరూపమైన సరస్వతి వేదాల రూపంతో ఆయన నాలుగుమోములలోనూ నిరంతరం కదలాడుతూ ఉంటుంది. తన నోటినుండి భాగవత పరమార్థం రసాత్మకంగా వెలువడాలంటే ఆ పరమేష్ఠి అనుగ్రహం కూడా కావాలి. అందువలన పోతన తన మధుర మంజుల వాక్కులతో బ్రహ్మను కొనియాడుతున్నాడు.
ఉ. ఆతతసేవ చేసెద సమస్తచరాచర భూతసృష్టి వి
జ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్యవిధాతకు వేదరాశి ని
ర్ణేతకు దేవతానికరనేతకు గల్మషజేతకున్ నత
త్రాతకు ధాతకున్ నిఖిలతాపసలోక శుభప్రదాతకున్.
ప్రతిపదార్ధం:
ఆతత = అతిశయమైన; సేవన్ = భక్తిని; చేసెదన్ = చేస్తాను; సమస్త = సమస్తమైన; చర = చరములు (చలనము గలవి); అచర = అచరములు (చలనము లేనివి) అయిన; భూత = ప్రాణులను; సృష్టి = సృష్టించు; విజ్ఞాతకు = నేర్పరికి; భారతీ = సరస్వతీదేవి; హృదయ = హృదయానికి; సౌఖ్య = సంతోషాన్ని; విధాతకు = కలిగించే వానికి; వేదరాశి = వేదాలన్నిటిని; నిర్ణేతకు = క్రమీకరించినవానికి; దేవతా = దేవతల; నికర = సమూహముయొక్క; నేతకు = నాయకునికి; కల్మష = పాపములను; జేతకున్ = ఛేదించేవానికి; నత = నమస్కరించే వారిని; త్రాతకు = రక్షించే వానికి; ధాతకున్ = బ్రహ్మకు; నిఖిల = మొత్తం; తాపసలోక = తాపసులందరికి; శుభ = శుభాలను; ప్రదాతకున్ = ఇచ్చేవానికి.
తాత్పర్యం:
ఆయన ధాత. సకలసృష్టినీ పట్టి నిలిపేవాడు. ఆ సృష్టిలో కదలాడేవీ, కదలాడనివీ అయిన రెండు విధాల భూతాలున్నాయి. వాటి తీరుతెన్నులన్నింటినీ మొత్తంగా తెలిసినవాడు. చదువులతల్లి హృదయానికి సౌఖ్యం కూర్చే జ్ఞానసంపద ఆయన సొమ్ము. వేదాల రాశులను ఇదీ అదీ అని నిర్ణయించి జనులకు తెలివితేటలను ప్రసాదించినవాడు. ఇంద్రుడు మొదలైన దేవతలందరినీ వారివారి విధులలో నడిపించే నాయకుడు. పాపాలు ఏమాత్రమూ తననంటకుండా పరిశుద్ధుడై ప్రకాశిస్తున్నవాడు. తనయెడల వినయంతో ఉన్నవారందరినీ ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. తమ తపశ్శక్తితో ఈ భూమినంతటినీ పట్టి నిలుపుతున్న తాపసులందరికీ శుభాలను ప్రదానం చేస్తూ ఉండేవాడు. అట్టి బ్రహ్మదేవునకు చాలాపెద్ద ఎత్తున పూజ చేస్తాను.
1-4 ఆదరమొప్ప
సందర్భం:
బ్రహ్మ మొదలైన దేవతలు కూడా తమ తమ పనులు ప్రారంభించేటప్పుడు అతనికి మ్రొక్కి కృతకృత్యులవుతారట. ఇంక మానవుల సంగతి చెప్పనేల? కాబట్టి ఉత్తమ పురుషుడైన పోతనామాత్యుడు భాగవత రచనా మహాకార్యంలో తనకు ఏవిధమైన విఘ్నాలూ కలుగకూడదని గజాననునికి మ్రొక్కులు చెల్లిస్తున్నాడు.
ఉ. ఆదరమొప్ప మ్రొక్కిడిదు నద్రిసుతాహృదయానురాగ సం
పాదికి దోషభేదికి బ్రపన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జన నందవేదికిన్
మోదక ఖాదికిన్ సమద మూషకసాదికి సుప్రసాదికిన్.
ప్రతిపదార్ధం:
ఆదరము = మన్నన; ఒప్పన్ = ఉట్టి పడేలా; మ్రొక్కిడుదు = నమస్కరించెదను; అద్రి సుతా = పర్వతరాజ పుత్రి (పార్వతి); హృదయ = హృదయమునందు; అనురాగ = అనురాగాన్ని; సంపాదికిన్ = సంపాదించినవానికి; దోష = పాపాలని; భేదికి = పోగొట్టేవానికి; ప్రపన్న = శరణాగతులైన భక్తులకు; వినోదికి = సంతోషము కలిగించువానికి; విఘ్న = విఘ్నాల; వల్లికా = సమూహమును; ఛేదికి = నాశనము చేసేవానికి; మంజు = మనోజ్ఞముగ; వాదికి = మాట్లాడేవానికి; అశేష = సర్వ; జగత్ = లోకములందలి; జన = జనులకు; నంద = ఆనందము; వేదికిన్ = కలిగించేవానికి; మోదక = ఉండ్రాళ్ళు; ఖాదికిన్ = తినువానికి; సమద = చక్కగ; మూషక = ఎలుక; సాదికి = నడిపేవానికి; సుప్రసాదికిన్ = మంచి నిచ్చేవానికి.
తాత్పర్యం:
ఆ మహాత్ముడు అమ్మ పార్వతీదేవి హృదయపు అనురాగాన్ని నిరంతరం సంపాదించుకుంటాడు. చెడుపనులను చీల్చి చెండాడుతాడు. తానే దిక్కని నమ్ముకొన్నవారిని ఉల్లాసపరుస్తూ ఉంటాడు. విఘ్నములు అనెడి చిక్కుముడులుగల లతలను త్రెంపివేస్తాడు. పరమ మనోజ్ఞమైన పలుకులతో అందరికీ ఆనందం కలిగిస్తాడు. అన్నిలోకాలలో ఉండే ప్రాణుల ఆనందాన్ని ఎరిగినవాడు. కుడుములను ఆప్యాయంగా ఆరగించేవాడు. పొగరెక్కిన ఎలుకను వాహనంగా కలిగినవాడు. సర్వప్రాణికోటియందూ ప్రసన్నత కలవాడూ అయిన గణపయ్యకు మ్రొక్కుతాను.
1-6 క్షోణితలంబు
సందర్భం:
హృదయంలో భవ్యమైన భావన కదలాలంటే ఆ తల్లి అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. ఆ భావన పలుకుగా రూపం దిద్దుకొని నాలుకపై నాట్యమాడాలంటే ఆ అమ్మ చల్లని చూపు జాలువారాలి. అందునా పలుకబోయేది భాగవతం. దానికై చదువుల తల్లి సరస్వతి సదమలకృప సమృద్ధిగా కావాలి. పోతన ఆమె దయకోసం ప్రార్థిస్తున్నాడు.
ఉ. క్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి, చంచరీకచయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికి, తోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్,
వాణికి, నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.
ప్రతిపదార్ధం:
క్షోణి = భూమి; తలంబునన్ = తలమున; నుదురు = నుదురు; సోఁకఁగన్ = ఆనేలా; మ్రొక్కి = నమస్కరించి; నుతింతున్ = స్తుతిస్తాను; సైకత = ఇసకతిన్నెల వంటి; శ్రోణికి = పిరుదులు గల తల్లికి; చంచరీక = తుమ్మెదల; చయ = గుంపు లాంటి; సుందర = అందమైన; వేణికిన్ = జుట్టుగలది; రక్షితామర శ్రేణికి = దేవతల గుణాలతో ఉత్తములను రక్షించునది, తోయజాతభవ = నీటిలో పుట్టిన పద్మమునందు పుట్టినవాని (బ్రహ్మ); చిత్త = మనసును; వశీకరణ = వశీకరించు కోగల; ఏక = ముఖ్యమైన; వాణికిన్ = వాక్కు గలది; వాణికిన్ = సరస్వతీదేవికి; అక్ష = స్పటికముల; దామ = మాల; శుక = చిలుక; వారిజ = తామరపువ్వు; పుస్తక = పుస్తకము; రమ్యపాణికిన్ = అందంగా చేత ధరించినది అయిన తల్లికి.
తాత్పర్యం:
నా విశాలమైన ఫాలభాగం నేలకు చక్కగా తాకించి తల్లికి మ్రొక్కుతాను. నోరారా ఆ సరస్వతీమాతను పలుకులతో కొనియాడతాను. ఆమె ఇసుకతిన్నెవంటి పిరుదుల భాగంతో విశ్వాన్నంతటినీ నింపుకున్నదా అన్నట్లున్నది. కదలాడుతున్న తుమ్మెదల బారులుగా కన్పిస్తున్న అందమైన కేశసౌభాగ్యంతో గగనాన్నంతటినీ ప్రకాశింప జేస్తున్నది. అందరినీ ఆనందపరచే అమరగుణాలతో అలరారే ఉత్తములను కాపాడుతూ ఉంటుంది. అన్ని లోకాలకూ చివరిదైన సత్యలోకంలో సృష్టికార్యంలో తలమున్కలుగా ఉన్న బ్రహ్మదేవుని చిత్తాన్ని వశం చేసుకొనే వాక్కులతో విరాజిల్లుతున్నది. జపమాల, చిలుక, తామరపూవూ, పుస్తకమూ నాలుగు చేతులలో చక్కగా పట్టుకొని నా యెదుట సాక్షాత్కరిస్తున్నది.
1-7 పుట్టంబుట్ట
సందర్భం:
అహంకారం పతనానికి కారణం. వినయం సమున్నత శిఖరాలను ఎక్కిస్తుంది. భాగవతం తెలుగులో వ్రాయాలని సంకల్పించిన మహావ్యక్తి పోతన తనలోని అహంకారాన్ని సమూలంగా దులిపి వేసుకుని, వినయాన్ని ప్రోది చేసుకుని చదువుల తల్లితో ఇలా అంటున్నాడు.
శా. పుట్టంబుట్ట, శరంబునన్ మొలవ నంభోయానపాత్రంబునన్
మెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నాకీవమ్మ యో! యమ్మ మేల్
పట్టున్మానకు మమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ!
ప్రతిపదార్ధం:
బ్రాహ్మీ = సరస్వతీ దేవీ; దయ = దయ అనే; అంభోనిధీ = నీటికి నిధివైన సముద్రమా!; పుట్టన్ = పుట్టలో; పుట్టలేదు = పుట్టి ఉండలేదు (వాల్మీకిని కాదు); శరంబునన్ = రెల్లుపొదలో; మొలవ = పుట్టి ఉండలేదు (కుమారస్వామిని కాదు); అంభోయాన = జలప్రయాణ; పాత్రంబునన్ = సాధనములో - పడవలో; నెట్టన్ = పుట్టుకను; కల్గను = పొందని వానిని కాదు (వ్యాసుడను కాదు); కాళిన్ = కాళి; కొల్వను = ఆరాధించిన వాడను కాదు (కాళిదాసును కాదు); పురాణింపన్ = పురాణ (భాగవత) రచనకి; దొరంకొని = పూనుకొని; ఉంటిని = ఉన్నాను; మీఁదు = ముందు చెప్పిన; ఇట్టే = అటువంటివారి; వెంటన్ = పద్ధతినే; చరింతున్ = నడుస్తాను; తత్ = ఆ; సరణి = విధమును; నాకు = నాకు; ఈవమ్మ = ఇవ్వు తల్లీ; ఓ యమ్మ = ఓ తల్లీ; మేల్ = మంచి; పట్టున్ = దన్నుగా; మానకుము = మానకు; అమ్మ = తల్లీ; నమ్మితిన్ = (నిన్నే) నమ్మొకొంటిని; చుమీ = సుమా.
తాత్పర్యం:
అమ్మా! బ్రహ్మదేవుని యిల్లాలా! సముద్రంలో జలం ఎంత ఉంటుందో నీలో దయ అంత ఉంటుంది. కనుక నా విన్నపం విఫలం కాదనే నమ్మకంతో నిన్ను ప్రార్థిస్తున్నాను. నేను పుట్టలో పుట్టినవాడను కాదు. అలా పుట్టిన వాల్మీకి శ్రీమద్రామాయణం రచించాడు. రెల్లుతోటలో పుట్టిన కుమారస్వామినీ కాను. ఆయన మహాసారస్వత నిర్మాత. ఓడలో పయనించి ద్వీపం చేరుకొన్న పరాశరుని దయచేత అక్కడ ఉదయించిన వ్యాసుడనూ కాను. కాళీమాతను పూజించిన కవికులగురువు కాళిదాసుడను కూడా కాను. అయినా పురాణ రచనకు పూనుకొన్నాను. ఇకమీద ఏవిధంగా నడచుకోవాలో ఆ మార్గాన్ని నీవు నాకు అనుగ్రహించు. నీవు అమ్మవు కదా! నాకు చేయూతనివ్వటం మానకు, తల్లీ. అమ్మా! నేను నిన్నే నమ్ముకొన్నాను.
1-8 అమ్మలఁ గన్నయమ్మ
సందర్భం:
"దుర్గామ్ దేవీం శరణ మహం ప్రపద్యే" అనమంటున్నది వేదమాత. 'నేను దుర్గాదేవి శరణు పొందుతాను' అనుకుంటూ ఆ పని చేయాలి. ఈ వేదవాక్యం వలన కలిగిన సంస్కారంతో పోతన మహాకవి దుర్గా దేవిని స్తుతిస్తూ, తెలుగు వారందరినీ కూడా ఈ పద్యం చదువుకొని తరించమంటున్నాడు.
ఉ. అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యీవుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.
ప్రతిపదార్ధం:
అమ్మల = ఆ + మల = పర్వతరాజైన హిమవంతుడు; కన్న = కన్నటువంటి; అమ్మ = పార్వతీదేవి; ముగురమ్మల = ముగ్గురు అమ్మలకు {లక్ష్మి సరస్వతి పార్వతి}; మూలపుటమ్మ = మూలమైన మాత; చాల = చాలా; పెద్దమ్మ = పెద్దతల్లి; సురారులమ్మ = దేవతల శత్రువులైన రాక్షసుల తల్లుల; కడుపు = కడుపు; ఆఱడి = మంట; పుచ్చిన యమ్మ = కలిగించిన తల్లి; తన్ను = తనను; లోనమ్మిన = లోపల నమ్మిన; వేల్పుటమ్మల = దేవతల తల్లుల; మనమ్ముల = మనసులలో; ఉండెడి = ఉండే; అమ్మ = మాత; దుర్గ = దుర్గాదేవి; మా యమ్మ = మా తల్లి; కృపాబ్ధి = దయా సముద్రముతో; మహత్త్వ = గొప్పదైన; కవిత్వ = కవిత్వంలో; పటుత్వ = పటుత్వమనే; సంపదల్ = సంపదలను; ఈవుత = ఇచ్చుగాక.
తాత్పర్యం:
దుర్గాదేవి మాయమ్మ. మాయకు అమ్మ. అంటే పరబ్రహ్మ స్వరూపం. కృపాబ్ధి, కృపకు సముద్రం అయినది. అంటే నిలువెల్లా దయయే అయిన తల్లి. ఆ మల – ఆ హిమగిరి కన్న అమ్మ. పర్వతరాజ తనయగా అవతరించి లోకాలకు కన్నతల్లి అయినది. భారతి, ఉమ, రమ అనే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలైన ముగ్గురమ్మలకు మూలమైన ఆదిశక్తి దుర్గమ్మ. అందువలనే సనాతని కనుక చాలా పెద్ద అమ్మ. దేవీ భావనలకు పగవారైన రాక్షసుల అమ్మల కడుపును పనికిమాలినదిగా చేసి లోకాలను కాపాడే అమ్మ. హృదయం లోపలి సన్నని వరిముల్లువంటి రంధ్రంలో నిలుపుకొని నమ్మి కొలిచే దివ్యత్వం కల మాతృభావంతో ఉండేవారి మనస్సులనే ఆలయాలలో అలరారే అమ్మ. ఆ అమ్మ మాకు ఎంతో సమున్నతమైన విలువలుగల కవిత్వంలోని పాటవానికి సంబంధించిన సంపదలను ప్రసాదించుగాక.
1-9 హరికిన్ బట్టపుదేవి
సందర్భం:
ఆ లక్ష్మీదేవిని లోకమాత అంటారు. సమస్తప్రాణికీ అమ్మలాగా సర్వమూ అనురాగంతో అమర్చిపెట్టే వెలుగుల తల్లి. నిజానికి ఆమె బిడ్డలకు అడగకపోయినా అన్నీ సమకూరుస్తుంది. పోతనామాత్యులవారు ఇందిరా మాతను ఇలా ప్రార్థిస్తున్నారు.
మ. హరికిన్ బట్టపుదేవి, పున్నెములప్రోవర్థంబుపెన్నిక్క చం
దరుతోఁ బుట్టువు, భారతీగిరిసుతల్ తోనాడు పూబోణి, తా
మరలందుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించునిల్లాలు, భా
సురతన్ లేములు వాపుతల్లి సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.
ప్రతిపదార్ధం:
హరికిన్ = విష్ణుమూర్తికి; పట్టపుదేవి = పట్టపురాణి; పున్నెముల = పుణ్యముల; ప్రోవు = పోగు; అర్థంపు = సంపదలకు; పెన్నిక్క = పెద్ద నిధి; చందురు = చంద్రునికి; తోబుట్టువు = తోడపుట్టినది; భారతీ = సరస్వతి; గిరి = పర్వత; సుతల్ = పుత్రికల (పార్వతి); తోనాడు = కలిసి ఆడుకొనే; పూఁబోణి = పూవు వలె సున్నితమైన స్త్రీ; తామరలందున్ = పద్మములలో; ఉండెడి = ఉండే; ముద్దరాలు = మనోజ్ఞమైన స్త్రీ; జగముల్ = లోకాలు; మన్నించు = గౌరవించే; ఇల్లాలు = స్త్రీ; భాసురతన్ = (తన) ప్రకాశము వలన; లేములు = దరిద్రాలను; వాపు = పోగొట్టే; తల్లి = అమ్మ; సిరి = లక్ష్మి; ఇచ్చున్ = ఇచ్చుగాక; నిత్య = శాశ్వతమైన; కల్యాణముల్ = శుభములు.
తాత్పర్యం:
శ్రీమహావిష్ణువునకు పట్టపురాణి, పుణ్యాలరాశి, సంపదలకు పెద్దనిధి. ప్రాణులందరి మూడు కరణాలకూ పరమానందం అందించే చందురుని అక్కగారు. చదువులతల్లి భారతి, జ్ఞానప్రసూన అయిన గిరిజ ఆమెకు ఇష్టసఖులు. తమ వికాసంతో జనుల హృదయాలను వికసింపజేసే తామరపూవులలో నివసించే ముద్దరాలు. లోకాలన్నీ పూజించే యిల్లాలు. అద్భుతమైన కాంతులను విరజిమ్ముతూ జనుల లేములను పోగొట్టే తల్లి. ఆమె మనకు అనంతమైన కల్యాణాలను ఇస్తుంది.
1-9A శారదనీరదేందు
సందర్భం:
దివ్యత్వాన్ని సాధారణమైన కన్నులతో చూడలేము. భావన అనే నేత్రంతోనే చూడాలి. అలా చూడటం గొప్ప తపశ్శక్తితో గానీ సాధ్యంకాదు. శ్రీభారతీదేవి దివ్యదర్శనంకోసం ఆర్తితో విన్నవించుకుంటున్నారు పోతనామాత్యులు.
ఉ. శారదనీరదేందు ఘనసార పటీర మరాళమల్లికా
హారతుషారఫేన రజతాచల కాశఫణీశ కుందమం
దార సుధాపయోధి సితతామరసామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ!
ప్రతిపదార్ధం:
భారతీ = సరస్వతీదేవీ!; శారద = శరత్కాలంనాటి; నీరద = మేఘము; ఇందు = చంద్రుడు; ఘనసార = కర్పూరం; పటీర = మంచిగంధం; మరాళ = హంస; మల్లికా హార = మల్లెపూలదండ; తుషార = నీటి; ఫేన = నురుగు; రజతాచల = వెండి కొండ; కాశ = రెల్లుపువ్వులు; ఫణీశ = ఆదిశేషుడు; కుంద = అడవిమల్లె; మందార = కల్ప వృక్షము; సుధాపయోధి = పాల సముద్రము; సిత = తెల్లని; తామరస = తామరపూలు; అమర = దేవతల; వాహినీ = నది - ఆకాశగంగ; శుభ = శుభకరమైన; ఆకారతన్ = ఆకారంతో; ఒప్పు = అమరు; నిన్ను = నిన్ను; మదిన్ = మదిలో; కానగ = చూచుట; ఎన్నడు = ఎప్పుడు; కల్గు = కలుగుతుంది?
తాత్పర్యం:
“సర్వశుక్లా సరస్వతీ” సరస్వతి నిలువెల్లా తెల్లదనంతో అలరారుతుంది అని ఋషుల భావన. లోకంలో తెల్లదనంతో విరాజిల్లే పవిత్ర వస్తువులు కొన్నింటిని ఉపమానాలుగా సరస్వతీ స్వరూపాన్ని సంభావిస్తున్నారు పోతనామాత్యులు. శరత్కాల మేఘం, చందమామ, కర్పూరం, నీటి నురుగు, వెండికొండ, రెల్లుపూలు, మొల్లలు, మందారాలు, అమృత సముద్రం, తెల్లని తామరలు, దేవతల నది మందాకిని - అనేవాని శుభమైన ఆకారంవంటి ఆకారంతో ప్రకాశించే ఓ తల్లీ! భారతీ! నిన్ను హృదయం అనే గుడిలో ప్రతిష్ఠించుకుని చూడగలగటం ఎన్నటికి సాధ్యమవుతుందో కదా?
1-9B అంబ! నవాంబుజోజ్జ్వల
సందర్భం:
కవిత్రయంలో మూడవవాడు ఎఱ్ఱాప్రగడ. అత్యద్భుతమైన వినయశీలంగల మహాకవి. అతడు అమ్మ భారతిని పరమసుందరంగా ప్రార్థించిన పద్యం ఇది. పోతన మహాకవి ఆ పద్యం అందానికి అబ్బురపడి, ఆనందపడి అది తన భాగవత మహాకావ్యంలో తిలకంలాగా ఉండాలని కోరుకొని చేర్చుకున్నాడనుకుంటారు పోతన సచ్ఛీలం ఎరిగిన సహృదయులు.
ఉ. అంబ! నవాంబుజోజ్జ్వలకరాంబుజ! శారదచంద్రచంద్రికా
డంబరచారుమూర్తి! ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ! శ్రుతిసూక్తవివిక్త నిజప్రభావ! భా
వాంబరవీథి విశ్రుతవిహార! ననుం గృప జూడు భారతీ!
ప్రతిపదార్ధం:
అంబ = తల్లీ; నవ = లేత; అంబుజ = పద్మములతో సమంగా; ఉజ్వల = ప్రకాశిస్తున్న; కర = చేతులనే; అంబుజ = పద్మములు కలదానా; శారద = శరదృతువులోని; చంద్ర = చంద్రుని; చంద్రిక = వెన్నెల; ఆడంబర = ఆడంబరంలాంటి; చారు = అందమైన; మూర్తి = స్వరూపము కలదానా; ప్రకట = ప్రకాశించే; స్ఫుట = ప్రస్పుటమైన; భూషణ = ఆభరణాలలోని; రత్నదీపికా = రత్నాలకాంతితో; చుంబిత = స్పృశించు; దిక్ = దిక్కుల; విభాగ = విభాగాలు యున్నదానా; శృతి = వేద; సూక్తి = సూక్తులచే; వివిక్త = వెల్లడింపబడిన; నిజ = స్వయంసిద్ధమైన; ప్రభావ = ప్రభావము కలదానా; భావ = భావాలనే; అంబరవీథి = ఆకాశవీథిలో; విశ్రుత = విస్పష్టంగా; విహారి = విహరించేదానా; నన్ = నన్ను; కృపన్ = దయతో; చూడు = చూడు; భారతీ = సరస్వతీదేవీ.
తాత్పర్యం:
అమ్మా! భారతీ! అప్పుడప్పుడే వికసిస్తున్న పద్మపుకాంతులతో వెలిగిపోతున్న పద్మంవంటి చేతితో అలరారుతున్నావు. శరత్కాలపు చందమామ వెన్నెలల జిలుగులవంటి మనోహరమైన ఆకృతితో మమ్ములను ఆహ్లాదపరుస్తున్నావు. నీవు ధరింపగా విస్పష్టంగా కానవస్తున్న నగలలోని రత్నాల కాంతులు దిక్కుల అంచులను సుకుమారంగా తాకుతున్నాయి. నీదైన ప్రభావాన్ని వేదసూక్తాలు విస్పష్టంగా వివరించి మానవులకు జ్ఞానసంపదను హాయిగా అందిస్తున్నాయి. నీవు మా భావం అనే గగనవీథిలో నాదరూపంలో తెలియవస్తూ విహరిస్తూ ఉంటావు. నన్ను దయజూడు తల్లీ!
1-9C కాటుక కంటినీరు
సందర్భం:
పోతన మహాకవీంద్రులకు చదువులతల్లి సాక్షాత్కరించింది. ఆమె దర్శనం ఆయనకు ఆనందపారవశ్యం కలిగించలేదు. గుండెను తల్లడిల్లజేసింది. ఆ భారతితో ఈ భారతీ పరిచారకుడు ఇలా అంటున్నాడు
ఉ. కాటుక కంటినీరు చనుకట్ట పయింబడ నేల యేడ్చెదో
కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల! ఓ మదంబ! ఓ
హాటకగర్భురాణి! నిను నా కటికిం కొనిపోయి అల్ల క
ర్ణాట కిరాట కీచకుల కమ్మ, త్రిశుద్ధిగ నమ్ము భారతీ!
ప్రతిపదార్ధం:
భారతీ = వాక్కుకు రూపమైన తల్లీ!; కాటుక కంటినీరు = కాటుకతో మలినమైన కన్నీరు; చనుకట్టు పయిం = పైటమీద; పడన్ = జాలువారేట్లుగా; ఏల ఏడ్చెదో = ఏడుస్తున్నావెందుకమ్మా! కైటభ = కైటభుడు అనే; దైత్య = రాక్షసుని; మర్దనుని = సంహరించిన శ్రీమహావిష్ణువు; గాదిలి = ప్రియమైన; కోడల = కోడలా!; ఓ మదంబ = అమ్మా! నా తల్లీ!; ఓ = ఓ; హాటకగర్భు = కనకం గర్భంలో ధరించిన బ్రహ్మదేవుని; రాణి = రాణివమ్మా! నిను = పుస్తకరూపంలోని నిన్ను; ఆ కటికిన్ = శ్మశాన సదృశమైన రాజాస్థానాలకు; కొనిపోయి = తీసుకొని వెళ్ళి; అల్ల = ఆ; కర్ణాట కిరాట కీచకులకు = పరమ నికృష్టమైన కర్ణాటులు, కిరాటులు, కీచకులు అనే పాడు బుద్ధులుగల రాజులకు; అమ్మ = విక్ర యించను; త్రిశుద్ధిగ = మనస్సు, మాట, శరీరములను పరిశుద్ధంగా చేసుకొని ఇస్తున్న ఈ మాటను; నమ్ము = నమ్ము తల్లీ!
తాత్పర్యం:
అమ్మా! నా తల్లీ! భారతీ! నీవు కైటభుడనే కరకు గుండెగల రక్కసుని అణచివేసిన శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన కోడలివి. కడుపంతా కనకమే అయిన నాలుగు మోముల దేవరకు రాణివి. కాటుకతో మలినమైన కన్నీరు పైటమీద జాలువారే తీరుగా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నేను మూడు కరణాలనూ పరిశుద్ధంగా చేసికొని మాట ఇస్తున్నాను. నీవే అయిన నా యీ వాగ్దేవిని తీసుకొనిపోయి పరమ నికృష్టులైన కర్ణాటులు, కిరాటులు, కీచకులు అనే పాడుబుద్ధులు గల పార్థివులకు ఆకలి తీర్చుకోవటంకోసం అమ్ముకోనమ్మా! ఈ నామాట నమ్ము.
1-11 ఇమ్మనుజేశ్వరాధముల
సందర్భం:
తనకు పూర్వం కొందరు కవులు తమ సుఖభోగాల కోసం కావ్యాలను రాజులకు అంకితం పేరుతో అమ్ముకున్నారు. పోతనకు అది పరమనీచమైన పని అని అనిపించింది. అంతేకాదు, ఆ పాడు పనికి యముడు అతిఘెరంగా శిక్షిస్తాడనికూడా ఆయన మనస్సు చెబుతున్నది. తానా పాతకానికి ఒడిగట్టనని ప్రతిజ్ఞ చేస్తున్నాడు.
ఉ. ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములు గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే
సమ్మెటపోటులం బడక సన్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్.
ప్రతిపదార్ధం:
ఈ = ఈ; మనుజ = మానువులు; ఈశ్వర = ఈశ్వరుడు - రాజులనే; అధములకు = చెడ్డవారికి; ఇచ్చి = ఇచ్చి; పురంబులు = ఊళ్ళు; వాహనంబులున్ = వాహనాలు; సొమ్ములున్ = ధనం; కొన్ని = మొదలైనవి కొన్ని; పుచ్చుకొని = తీసుకొని; సొక్కి = అలసిపోయి; శరీరము = శరీరము; వాసి = వదలి; కాలుచే = యముడిచేత; సమ్మెట = సుత్తి; పోటులన్ = దెబ్బలు; పడక = తినకుండ; సన్మతి = ఇష్టంగా; శ్రీహరికి = విష్ణువునకు; ఇచ్చి = ఇచ్చి; ఈ = ఈ; బమ్మెర = బమ్మెర; పోతరాజు = పోతరాజు; ఒకఁడు = అన బడేవాడు ఒకడు; భాగవతంబున్ = భాగవతమును; జగత్ = లోకానికి; హితంబుగన్ = ప్రియము కలుగునట్లుగా; చెప్పెన్ = చెప్పెను.
తాత్పర్యం:
సాధారణంగా రాజ్యాలేలే వాళ్ళు నీచులై ఉంటారు. ‘చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష’ అనే భావనతో బ్రతకటమే ఆ నీచత్వం. కానీ తాము గొప్పవారుగా లెక్కకెక్కాలి అని కూడా వారి ఉబలాటం. దానికోసం కవులకు ఏదో విదిలిస్తూ కృతిభర్తలుగా కీర్తి పొందాలనే దాహం వారికి ఉంటుంది. ఈ బమ్మెర పోతరాజు అటువంటి రాజులు ఇచ్చే అగ్రహారాలూ, ఏనుగులూ, గుఱ్ఱాలూ మొదలైన వాహనాలనూ, ధనాన్నీ కోరడు. ఎందుకంటే అవన్నీ ప్రాయంలో బాగానే ఉంటాయి. ముసలితనం వచ్చినప్పుడు అవే ముప్పుతిప్పలు పెడతాయి. శరీరం పోయిన తరువాత కాలుడు ఈ పాపానికి శిక్షగా సహించనలవికాని సమ్మెట పోటులతో సత్కరిస్తాడు. ఆ శిక్షను పొందకుండా శ్రీమహావిష్ణువునకు అంకితంగా సమస్త జగత్తుకూ మేలుకలిగే విధంగా భాగవతాన్ని ఈ బమ్మెరపోతరాజు ‘ఒక్కడు’ చెబుతున్నాడు.
1-12 చేతులారంగ
సందర్భం:
మానవుడు నిజమైన మానవుడు కావాలంటే కొన్ని విశిష్ట లక్షణాలను పెంపొందించుకోవాలి. అలాకాకపోతే వాని పుట్టుకకు ఒక ప్రయోజనం ఉన్నదని నిరూపించు కోలేడు. అప్పుడు అతడు పశువుకన్నా హీనుడైపోతాడు. ఆ విశిష్టలక్షణాలను ప్రకటిస్తూ పోతన తన పుట్టుకను తాను ఏ విధంగా ఉదాత్తంగా రూపొందించుకునే యత్నంచేస్తున్నాడో చెప్పటం ద్వారా లోకానికి ఒక ఉపదేశం చేస్తున్నాడు.
తే. చేతులారంగ శివుని పూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగా దలపడేని
గలుగనేటికి దల్లులకడుపుచేటు.
ప్రతిపదార్ధం:
చేతులు = చేతులు; ఆరంగ = నిండుగ; శివుని = శివుడిని; పూజింపఁడేని = పూజింపని వాడు; నోరు = నోరు; నొవ్వంగ = నొప్పెట్టేలా; హరి = విష్ణువు యొక్క; కీర్తి = కీర్తిని; ఉడువఁడేని = కీర్తించనివాడు; దయయు = దయ మఱియు; సత్యంబు = సత్యములు; లోనుగాన్ = కలుగునట్లు; తలఁపఁడేనిన్ = ఎంచకపోతే; తల్లుల = వారి తల్లుల యొక్క; కడుపు = గర్భం; చేటు = చెడపటానికే; కలుగన్ = పుట్టుట; ఏటికి = ఎందులకు?
తాత్పర్యం:
నమకచమకాలు పఠిస్తూ శివునికి అభిషేకం చేస్తాము. లేదా వేయినామాలు చదువుకుంటూ పూలతో శివుని పూజిస్తాము. కొంతసేపటికి చేతులు ఆ శ్రమను తట్టుకోలేక అభిషేకానికో, పూజకో మొరాయిస్తాయి. దీక్ష కలవాడు ఆ మొరాయింపునకు లొంగిపోడు. చేతులను శిక్షించి అయినా పూజను తుదిముట్టా పూర్తిచేయాలి. చేతులారంగ శివుని పూజించటం అంటే అదేమరి. అలాగే ఏ విష్ణుస్తోత్రాలో, సహస్రనామాలో చదువుతూ ఉంటే కొంతసేపటికి నోరు నొప్పిపొందుతుంది. అలా అయినప్పుడు పఠనాన్ని ఆపివేయగూడదు. నోటిని నొప్పించి అయినా హరికీర్తిని ఆదరంతో అంటూనే ఉండాలి. అలాగే దయ, సత్యం మొదలైన ఉత్తమ గుణాలయందు మనసును కుదురుకొల్పాలి. అప్పుడే పుట్టుకకు సార్థకత. అలా కాకపోతే తల్లి కడుపును చెరచటానికే పుట్టినట్లవుతుంది.
1-16 మెఱుగు చెంగట
సందర్భం:
పోతనమహాకవి ఏదైనా శ్రీమన్నారాయణ కథను కావ్యంగా రచించాలనే ఉత్సాహంతో ఉన్నాడు. ఒక పున్నమినాడు చంద్రగ్రహణ సమయంలో గంగను చేరుకొని పుణ్యస్నానం ఆచరించి మహేశ్వర ధ్యానం చేస్తూ ఉన్నాడు. అప్పుడాయనకు శ్రీరామభద్రమూర్తి అరమోడ్పు కనులలో సాక్షాత్కరించాడు. పోతనమహాకవి ఆ మూర్తిని మన కన్నులకు ఇలా కట్టిస్తున్నాడు.
సీ. మెఱుగు చెంగట నున్న మేఘంబుకైవడి ఉవిద చెంగటనుండ నొప్పువాడు
చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిఱునవ్వు మొలచువాడు
వల్లీయుతతమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున పరగువాడు
నీలనగాగ్ర సన్నిహిత భానునిభంగి ఘనకిరీటము దల గల్గువాడు
ఆ. పుండరీకయుగము పోలు కన్నులవాడు
వెడద యురమువాడు విపులభద్ర
మూర్తివాడు రాజముఖ్యు డొక్కరుడు నా
కన్నుగవకు నెదుర గానబడియె.
ప్రతిపదార్ధం:
మెఱుఁగు = మెఱుపుతీగ; చెంగటన్ = ప్రక్కన; ఉన్న = ఉన్నటువంటి; మేఘంబు = మబ్బుల; కైవడిన్ = విధంగా; ఉవిద = స్త్రీ (భార్య) / లక్ష్మి; చెంగట = దగ్గఱ; ఉండన్ = ఉండగా; ఒప్పువాడు = చక్కగ యండెడివాడు; చంద్ర = చంద్ర; మండల = బింబపు; సుధా = వెన్నెల; సారంబు = వెలుగు; పోలిక = వలె; ముఖమున = ముఖములో; చిఱునవ్వు = చిఱునవ్వు; మొలచువాడు = వెలయు - ప్రకాశించువాడు; వల్లీయుతతమాల = పూలతీగతోకూడిన; వసుమతీజము = భూమిపై పుట్టిన చెట్టు; భంగిన్ = వలె; పలు = బలిష్టమైన; విల్లు = విల్లు; మూఁపునన్ = భుజమున; పరఁగు వాడు = ప్రకాశిస్తున్నవాడు; నీల = నీల; నగాగ్ర = గిరిశిఖరము; సన్నిహిత = సమీపంగా నున్న; భానుని = సూర్యుడి; భంగిన్ = వలె; ఘన = గొప్ప; కిరీటము = కిరీటము; తలన్ = తలపైన; కలుగువాడు = కలవాడు; పుండరీకయుగము = తెల్లని తామరలజంట; పోలు = వంటి; కన్నులవాడు = వెలిగే కన్నులు కలవాడు; వెడద = విశాలమైన; యురమువాడు = వక్షఃస్థలం కలవాడు; విపులభద్రమూర్తివాడు = సర్వమంగళమూర్తి అయినవాడు; రాజముఖ్యుడు = రాకుమారుడు; నా కన్నుగవకు = నా కన్నులకు; ఎదుర = ఎదుట; కానబడియె = కానవచ్చాడు.
తాత్పర్యం:
మెఱుపుతీగను అంటిపెట్టుకొని ఉన్న మేఘంలాగా జానకీకాంత చెంగట ఉండగా వెలిగిపోతున్నాడు. మోమున చిన్నినవ్వు పుట్టుకొని వస్తున్నది. అది చంద్రబింబంనుండి వెలువడే అమృతపు జల్లులాగా ఉన్నది. పెద్ద విల్లు భుజంమీద అలరారుతూ ఉంటే లత చుట్టుకొన్న పెద్ద చెట్టులాగా ప్రకాశిస్తున్నాడు. నల్లనికొండ పరిసరాలలో ఉదయిస్తున్న సూర్యునిలాగా రత్నాల కిరీటం తలపైన కుదురుకొని ఉన్నది. చక్కగా వికసించిన తెల్లని తామరల జంటలాగా ఆ మహానుభావుని కన్నులు కాంతులను జిమ్ముతున్నాయి. విశాలమైన వక్షఃస్థలం అతని హృదయ వైశాల్యాన్ని స్ఫురింపజేస్తున్నది. ఏ వైపునుండి చూచినా మంగళమూర్తియే అయి అలరారుతున్నాడు. అట్టి రాజముఖ్యుడొకడు నా కన్నులయెదుట కానవచ్చాడు.
1-18 పలికెడిది
సందర్భం:
శ్రీరామచంద్రులవారు నాపేరు పేర్కొంటూ శ్రీమహాభాగవతాన్ని తెలుగు చేయవయ్యా! దానితో నీ భవబంధాలన్నీ పటాపంచలయిపోతాయి అని పోతన కవీంద్రునితో అన్నాడు. ఆ మహాకవికి పరమానందం కలిగింది. ఆ భావననుండి ఆ మహాకవి నోట అద్భుతమైన పద్యం వెలువడింది.
కం. పలికెడిది భాగవత మట;
పలికించు విభుండు రామభద్రుండట; నే
పలికిన భవహర మగునట
పలికెద వేఱొండుగాధ పలుకగ నేలా.
ప్రతిపదార్ధం:
పలికెడిది = పలుకునది; భాగవతమట = భాగవతం అట; పలికించు = పలికించెడి; విభుండు = ప్రభువు; రామభద్రుండట = శ్రీరాముడట; నే = నేను; పలికిన = చెప్తే; భవ = సంసార బంధనములు; హరము = తొలగుట; అగు నఁట = అవుతుందట; పలికెద = (అందుకే) నే చెప్తాను; వేఱొండు = ఇంకొక; గాథ = కథ; పలుకఁగన్ = పలకటం; ఏలా = ఎందుకు.
తాత్పర్యం:
ఏమిటేమిటి? నేను పలుకబోతున్నది భగవంతుని అమృతంవంటి చరిత్రమట! ఏదో నేను పలుకుతున్నాననుకొంటున్నాను, కానీ నన్ను పలికించేవాడు సాక్షాత్తూ పరమాత్మయే అయిన ఆ రామభద్రుడట! పలికితే కలిగే ఫలం సంసారం అనే ఘోరమైన దుఃఖాన్ని పోగొట్టుకోవటమే అట! అటువంటి కార్యమూ, ఆ విధంగా చేయించే స్వామి, అంత అనితర సాధారణమైన ఫలమూ సమకూరుతూ ఉండగా మఱొక గాధను పలుక వలసిన పనియేమున్నది? కాబట్టి భాగవత గాధనే పలికి మహాఫలాన్ని అందుకుంటాను.
1-19 భాగవతము
సందర్భం:
కరుణావరుణాలయుడు శ్రీరామచంద్రమూర్తి శ్రీభాగవతాన్ని తెలుగులో వ్రాయవలసినదిగా తనను ఆదేశించాడు. కానీ అదేదో ఆషామాషీ వ్యవహారం కాదని తనకు తెలుసు. దానికి సారస్వత వ్యవసాయం చాలా కావాలి. పోతన మహాకవి దానిని లోకానికి ఇలా తెలియజేస్తున్నాడు.
కం. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు
శూలికైన తమ్మిచూలికైన
విబుధజనుల వలన విన్నంత కన్నంత
తెలియవచ్చినంత తేటపఱతు.
ప్రతిపదార్ధం:
భాగవతము = భాగవతమును; తెలిసి = తత్త్వం తెలుసుకొని, పలుకుట = చెప్పగలగటం; శూలికైన = త్రిశూలధారియైన శివునికీ; తమ్మిచూలికైన = మహావిష్ణువు గర్భంలో ఉదయించిన పద్మంలో పుట్టిన ఆ బ్రహ్మదేవునికీ; చిత్రంబు = కష్టమైనపని; విబుధజనుల వలన = పండితులవలన; విన్నంత = విన్నంతవరకూ; కన్నంత = అర్థం చేసుకొన్నంతవరకూ; తెలియవచ్చినంత = నాకు తెలిసినదానిని; తేటపఱతు = అందరికీ అర్థమయ్యేలా తెలియచెప్తాను.
తాత్పర్యం:
భాగవతం తత్త్వం తెలియటమే చాలా కష్టమైన పని. తెలిసినదానిని తెలియచెప్పటం కోసం పడవలసినపాట్లు అన్నీయిన్నీ కావు. ఎవరికి? మానవమాత్రునకే కాదు, అటు సర్వజ్ఞమూర్తిగా పేరొందిన శూలికీ, ఇటు నాలుగుమోములతో నాలుగు వేదాలనూ ఉచ్చరించే బ్రహ్మదేవునికీ కూడా. వారిద్దరూ కూడా ఇది చాలా చిత్రమైన విషయంగా భావిస్తారు. మఱి నీవెలా వ్రాస్తావయ్యా అంటారేమో! చక్కని వివేకంతో కూడిన విద్వాంసులవలన విన్నాను. దానిని ఆకళింపునకు తెచ్చుకున్నాను. ఆ రెండు సంస్కారాల వలన నా బుద్ధికి తోచిన దానిని ధ్యానరూపంతో నిలుపుకొని అందరికీ అర్థమయ్యేట్లు అక్షరాలలో నిక్షేపిస్తాను.
1-21 ఒనరన్
సందర్భం:
పోతన తన అదృష్టాన్ని తానై కొనియడుకుంటున్నాడు. ఎందుకంటే తనకు పూర్వులైన నన్నయతిక్కనాదులు భాగవతం జోలికి పోలేదు. అట్టి తన భాగ్యాన్ని పైకి సంభావించుకుంటూ లోపలలోపల మహాకవుల మహోన్నత వైభవాన్ని లోకానికి తెలియజేస్తున్నాడు.
మ. ఒనరన్ నన్నయతిక్కనాది కవులీయుర్విన్ పురాణావళుల్
తెనుగున్ జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో
తెనుగున్ జేయరు మున్ను భాగవతమున్; దీనిన్ తెనింగించి నా
జననంబున్ సఫలంబు సేసెద పునర్జన్మంబు లేకుండగన్.
ప్రతిపదార్ధం:
ఒనరన్ = (రచనలు) చేసేటప్పుడు; నన్నయ = నన్నయ; తిక్కన = తిక్కన; ఆది = మొదలైన; కవులు = కవులు; ఈ = ఈ; ఉర్విన్ = భూమ్మీద; పురాణ = పురాణ {పురాణ లక్షణములు - సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము}; ఆవళుల్ = సమూహములు; తెనుఁగు = ఆంధ్రీకరణ; చేయుచున్ = చేస్తూ; మత్ = నా యొక్క; పురా = పూర్వజన్మలలో; కృత = చేసిన; శుభ = పుణ్యపు; అధిక్యంబు = గొప్ప తనం; తాన్ = అది; ఎట్టిదో = ఎలాంటిదో కాని; మున్ను = ఇంతకు ముందుగ; భాగవతమున్ = భాగవతాన్ని; తెనుఁగు = ఆంధ్రీకరణ; చేయరు = చేయలేదు; దీనిన్ = దీనిని; తెనింగించి = ఆంధ్రీకరించి; నా = నా యొక్క; జననంబున్ = జన్మను; పునః = మళ్ళీ; జన్మంబున్ = పుట్టుకలు; లేకుండఁగన్ = లేకుండే లాగ. సఫలంబు = సార్థకము; చేసెదన్ = చేసుకుంటాను.
తాత్పర్యం:
అసమాన ప్రతిభగల నన్నయ, తిక్కన మొదలైన మహాకవులు పురాణాల సముదాయాలను తెలుగులో రచించటానికి పూనుకున్నారు. కానీ నేను పూర్వజన్మలలో చేసిన పుణ్యాలపంట ఎటువంటిదో కానీ భాగవతం వారు రచించలేదు. అది నాకోసమే అన్నట్లుగా మిగిల్చారు. కనుక నేను భాగవతాన్ని తెలుగుకావ్యంగా రచించి నా పుట్టుక సఫలం అయ్యేట్లు చేసుకుంటాను. దీనితో నాకు పునర్జన్మే లేనటువంటి మహాభాగ్యం కలుగుతుంది.
1-22 లలితస్కంధము
సందర్భం:
పోతన మహాకవీంద్రునకు భాగవతం ఒక కల్పవృక్షంలాగా కనపడుతున్నది. కల్పవృక్షం కోరిన కోరికలనన్నింటినీ తీర్చి ఆనందాన్నందిస్తుంది. భాగవతం కూడా అటువంటిదే అని పోతన గారి సంభావన.
మ. లలితస్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం
జులతాశోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరో
జ్జ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్ద్విజశ్రేయమై.
ప్రతిపదార్ధం:
లలిత = చక్కని / అందమైన; స్కంధము = మానుతో / స్కంధములతో; కృష్ణ = నల్లని / కృష్ణుని కథలు; మూలము = వేళ్ళుతో / మూలాధారముగ; శుక = చిలుకల / శుకయోగి; ఆలాప = పలుకులతో / పలుకులచే; అభిరామంబు = రమణీయంగా / మిక్కిలి శోభాకరమై; మంజులత = అందమైన పూలతీగలతో / మనోహరమైన వాక్కు లతో; శోభితమున్ = అలంకరిపబడి / అలరారి; సువర్ణ = మంచి రంగులుగల / మంచి అక్షరప్రయోగాలు కలిగి; సుమనస్ = మంచి పువ్వులతో / మంచి మనసున్న వారికి; సుజ్ఞేయమున్ = చక్కగ కనిపిస్తున్న / చక్కగ తెలిసే లాగ; సుందర = అందంగా / అందమైన; ఉజ్జ్వల = బాగా పెరిగిన / విలాసవంతమైన; వృత్తంబున్ = గుండ్రము గానున్న / వృత్తముల తోను; మహా = పెద్ద / గొప్ప; ఫలంబు = పళ్ళతో / ఫలితాన్నిచ్చేలాగా; విమల = విస్తారమైన / నిర్మల మూర్తియైన; వ్యాస = చుట్టుకొలత గల / వ్యాసుడనే; ఆలవాలంబునై = పాదుతో ఉన్నది/ పునాది కలిగినదై; భాగవతాఖ్య = భాగవతమనే పేరు గల; కల్పతరువు = కల్పతరువు; ఉర్విన్ = భూమి మీద / లోకంలో; సద్ద్విజ = చక్కటి పిట్టలకు / సజ్జనులు మరియు ద్విజులకు; శ్రేయమై = మేలుకూర్చునదై / శ్రేయస్కరమై; వెలయున్ = రూపుకట్టి యున్నది / రూపొందియున్నది.
తాత్పర్యం:
తాత్పర్యం:
ఇదిగోనండీ భాగవతమనే కల్పవృక్షం. ఈ వృక్షం బోదె చాలా సుకుమారంగా ఉంటుంది. అలాగే భాగవతంలో స్కంధాలు కూడా లలితంగా ఉంటాయి. ఆ చెట్టుమూలం సారవంతమైన నల్లరేగడి మట్టితో ఉన్నట్లుగా భాగవతం కూడా శ్రీకృష్ణుడే మూలంగా ఒప్పారుతున్నది. చిలుకలు కమ్మని నాదాలతో చెట్టును మనోహరం చేస్తాయి. ఈ భాగవతం శుకమహర్షి ఆలాపాలతో హృదయంగమంగా అలరారుతున్నది. చెట్టునల్లుకొని పూలతీగలు దాని సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి. భాగవతం మంజులత్వంతో ప్రకాశిస్తూ ఉంటుంది. కనువిందు చేసే రంగురంగుల పూవులతో అందరినీ ఆకర్షిస్తుందీ వృక్షం. ఈ భాగవత వృక్షం మంచి అక్కరాలతో గొప్ప హృదయసౌందర్యం కలవారికి చక్కగా తెలియవస్తుంది. అందమైన కాంతులు విరజిమ్ముతూ ఉండే పాదు ఈ చెట్టును అలంకరిస్తున్నది. అందమైనవీ, వెలుగులు చిమ్ముతున్నవీ అయిన ఛందస్సునందలి వృత్తాలు ఈ భాగవతంలో ఉన్నాయి. స్వచ్ఛమైనదీ, వెడల్పైనదీ అయిన పాదు ఈ వృక్షానికి ఉన్నది. స్వచ్ఛమైన హృదయం గల వ్యాసుల వారే భాగవతానికి జన్మభూమి. వృక్షం గొప్ప ఫలాలను లోకానికి అందిస్తుంది. ఈ భాగవతం గొప్పదైన మోక్షం అనే ఫలాన్ని ఇస్తుంది. ఆ చెట్టును ఆశ్రయించి మంచి పక్షులు బ్రతుకుతూ ఉంటాయి. ఈ భాగవతం సత్-ద్విజులు, అంటే ఉత్తమ సంస్కారం కల పండితులకు, ఆశ్రయింపదగినదై విరాజిల్లుతున్నది.
1-29 హారికి
సందర్భం:
మన కావ్యాలలో ఒక సంప్రదాయం ఉన్నది. కవి తన కావ్యాన్ని ఎవనికి అంకితం ఇస్తున్నాడో అతని మహిమలను పేర్కొంటూ కొన్ని పద్యాలను పీఠికలో వ్రాస్తాడు. ఆ విశేషణాలన్నీ షష్ఠీవిభక్తితో అంతమౌతూ ఉంటాయి. కనుక వానిని షష్ఠ్యంతాలు అంటారు. పోతన కవీంద్రుడు ఆ షష్ఠ్యంతాలతో శ్రీకృష్ణచంద్రుని స్తుతిస్తున్నాడు.
ఉ. హారికి నందగోకులవిహారికి చక్రసమీరదైత్య సం
హారికి భక్తదుఃఖపరిహారికి గోపనితంబినీమనో
హారికి దుష్టసంపదపహారికి ఘోషకుటీపయోఘృతా
హారికి బాలకగ్రహ మహాసురదుర్వనితాప్రహారికిన్.
ప్రతిపదార్ధం:
హారికి = మనోహరమైన రూపము గలవానికి; నంద = నందుని; గోకుల = గో కులములో; విహారికి = విహరించు వానికి; చక్ర = చక్రము వలె తిరుగు; సమీర = గాలి - సుడిగాలి రూపధారియైన; దైత్య = రాక్షసుని - తృణావర్తుని; సంహారికి = సంహరించిన వానికి; భక్త = భక్తులయొక్క; దుఃఖ = దుఃఖమును; పరిహారికి = తీసివేయువానికి; గోప = గోపాలకుల వంశములో పుట్టిన; నితంబినీ = స్త్రీల యొక్క {నితంబిని - గొప్ప పిరుదులు గలవారు}; మనోహారికి = మనసులను గెలిచినవానికి; దుష్ట = దుష్టుల; సంపద = సంపదను; పహారికి = అపహరించు వానికి; ఘోష = గొల్లల; కుటీ = ఇళ్ళలోని; పయః = పాలు; ఘృత = పెరుగు; ఆహారికి = తినేవానికి; బాలక = పిల్లలను; గ్రహ = పట్టుకొనే; మహాసుర = రాక్షసియైన; దుర్వనితా = చెడ్డ స్త్రీ - పూతనను; ప్రహారికిన్ = చంపినవానికి.
తాత్పర్యం:
ఆ చిన్నారి కన్నయ్య అందరి హృదయాలను అలరింపజేసే అందగాడు. నందుని గోకులంలో విహారాలు చేసేవాడు. సుడిగాలి రూపంలో వచ్చిన రక్కసుని మక్కెలు విరగదన్ని చంపినవాడు. భక్తుల దుఃఖాన్ని తొలగించే దయామూర్తి. గోపకాంతల మనస్సులను దొంగిలించే మహనీయుడు. చెడుగుణాల సంపదలను నాశనంచేసే మహాత్ముడు. గొల్లభామలు కుటీరాలలో దాచుకున్న పాలూ, నెయ్యీ మొదలైన వానిని కొల్లగొట్టిన వెన్నదొంగ. బాలకగ్రహ రూపంలో వచ్చిన పాడురక్కసి పూతన ప్రాణాలను చనుబాలతో పాటు పీల్చి చంపివేసిన అద్భుత బాలకుడు. అటువంటి శ్రీకృష్ణచంద్రునకు నా కావ్యాన్ని అంకితం చేస్తున్నాను.
1-30 శీలికి
సందర్భం:
శ్రీకృష్ణుని మహోన్నత గుణాలను మరింతగా కొనియాడుతూ మురిసి పోతున్నాడు భక్తశిఖామణి పోతన.
ఉ. శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్తని
ర్మూలికి ఘోరనీరదవిముక్తశిలాహత గోపగోపికా
పాలికి వర్ణధర్మపరిపాలికి అర్జునభూజయుగ్మ సం
చాలికి మాలికిన్ విపులచక్రనిరుద్ధమరీచిమాలికిన్.
ప్రతిపదార్ధం:
శీలికి = శీలము కలవానికి; నీతిశాలికి = నీతి స్వభావము గలవానికి; వశీకృత = వశపఱచుకోబడిన; శూలికి = శివుడు గలవానికి; బాణ = బాణాసురుని; హస్త = చేతులను; నిర్మూలికి = నిర్మూలించిన వానికి; ఘోర = భయంకరమైన; నీరద = మేఘముల నుండి; విముక్త = వర్షించిన; శిలా = రాళ్ళచే; హత = కొట్టబడిన; గోప = గోపాలుర; గోపికా = గోపికల; పాలికి = పరిపాలకునికి; వర్ణ = వర్ణములను {చతుర్వర్ణ ములు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర,}; ధర్మ = ధర్మములను {ధర్మ – వేద ధర్మము లను}; పరిపాలికి = పరిపాలించేవానికి; అర్జున = మద్ది; భూజ = చెట్ల; యుగ్మ = జంటను; సంచాలికి = కదిలించినవానికి; మాలికి = మాలలు ధరించినవానికి; విపుల = పెద్దదైన; చక్ర = చక్రముచే; నిరుద్ధ = అడ్డగింపబడ్డ; మరీచి = సూర్యకిరణములనే; మాలికిన్ = మాలికలకి కారణభూతికి.
తాత్పర్యం:
అందరూ ఆయన మానినీ చిత్తచోరుడంటారు. కానీ నిజానికి ఆతడు గొప్ప శీలసంపద కలవాడు. లోకాలన్నిటినీ చక్కగా నడిపించే నీతితో అలరారేవాడు. త్రిశూలాన్ని ధరించిన శ్రీమహాశివుని తన గుండె గుడిలో నిలుపుకొన్న మహాత్ముడు. బాణాసురుని వేయిచేతులనూ విలాసంగా ముక్కలుగా గొట్టిన మహాబలశాలి. చాలా ఉద్ధృతంగా విజృంభించిన రాలవానతో దెబ్బతిన్న గొల్లలందరినీ భద్రంగా కాపాడిన కృపామూర్తి. వర్ణధర్మాలను కాపాడి లోకాన్ని ఒక త్రాటిమీద నడిపించే దిట్ట. జంట మద్దిచెట్లను పసితనంలోనే కదిలించి కుదిలించి కూల్చిన ప్రోడ. నిరంతరం పూమాలలను ధరించి వానికి వన్నెతెచ్చిన అందగాడు. తన చక్రంతో సూర్యుని కిరణాల ప్రసారాన్ని అడ్డగించిన సర్వేశ్వరుడు. అతనికి అంకితంగా నా భాగవత మహారచనను ప్రారంభిస్తున్నాను.
1-31 క్షంతకుఁ
సందర్భం:
అనంత కల్యాణ గుణసంపన్నుడైన శ్రీకృష్ణస్వామి భగవల్లక్షణాలను మరింత ఆనందపు పొంగుతో అభివర్ణించి మురిసిపోతున్నాడు పోతన. మనకు కూడా ఆ ఆనందాన్ని అందిస్తున్నాడు.
ఉ. క్షంతకుఁ గాళియోరగ విశాల ఫణోపరినర్తన క్రియా
రంతకు నుల్లసన్మగధరాజ చతుర్విధఘోర వాహినీ
హంతకు నింద్రనందన నియంతకు, సర్వచరాచరావళీ
మంతకు, నిర్జితేంద్రియ సమంచిత భక్తజనానుగంతకున్.
ప్రతిపదార్ధం:
క్షంతకు = క్షమించు వానికి; కాళియ = కాళీయుడు అను; ఉరగ = పాము యొక్క; విశాల = పెద్ద; ఫణ = పడగల; ఉపరివర్తన = మీద తిరుగుట క్రియారంతకు = క్రీడించేవానికి; ఉల్లసత్ = ఉల్లాసము చెందిన; మగధరాజ = మగధకు రాజైన జరా సంధుని; చతుర్విధ = చతురంగబలాలతో కూడిన {చతురంగబలములు - రథ, గజ, హయ, కాల్బలములు.}; ఘోర = భయంకరమైన; వాహినీ = సేనావాహినిని; హంతకు = చంపిన వానికి; ఇంద్రనందన = ఇంద్రుని కుమారుడైన అర్జునుని; నియంతకు = నడిపించే వాడి కి; సర్వ = సకల; చరచరావళీ = కదలగల, కదలలేని సముదాయానికి; మంతకు = రక్ష కునికి; నిర్జిత = జయించిన; ఇంద్రియ = ఇంద్రియములు కల; సమంచిత = బాగుగా పూజించు; భక్త = భక్త; జన = జనులను; అనుగంతకు = అనుసరించి నడచువానికి.
తాత్పర్యం:
నల్లని ఆ స్వామి ఎట్టివానినైనా క్షమించే హృదయవైశాల్యం గలవాడు. కాళియ సర్పరాజు విశాలమైన పడగలమీద నర్తనం చేయటం అనే పనిలో ఆనందించేవాడు. పొగరెక్కి మిడిసిపడుతున్న జరాసంధుని రథములు, ఏనుగులు, గుఱ్ఱాలు, కాలుబంటులు అనే నాలుగువిధాలైన సేనలను రూపుమాపినవాడు. ఇంద్రుని కుమారుడైన అర్జునుని రథానికి సారథి అయినవాడు. సమస్తమైన ప్రాణికోటికీ, కదలకుండా నిలిచి ఉండే జడ పదార్థాల సముదాయానికీ భావింపదగినవాడు. ఇంద్రియాలను తమ అదుపులో ఉంచుకొనే యోగులైన గొప్పభక్తుల వెంటనంటి మెలగేవాడు. అట్టి నీలవర్ణశోభితుడైన కన్నయ్యకు నా కావ్యాన్ని అంకితం ఇస్తున్నాను.
1-32 న్యాయికి
సందర్భం:
శ్రీవాసుదేవుని గుణకథనంతో తృప్తి తీరని పోతన, గొప్ప అలంకారాలతో అలరారుతున్న పద్యపుష్పంతో ఇంకా ఇలా కొనియాడుతున్నాడు.
ఉ. న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన
స్థ్సాయికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం
ధాయికిఁ బీతవస్త్రపరిధాయికిఁ బద్మభవాండభాండ ని
ర్మాయికి, గోపికానివహ మందిరయాయికి, శేషశాయికిన్.
ప్రతిపదార్ధం:
న్యాయికి = న్యాయమైన ప్రవృత్తి కలవానికి; భూసుర = బ్రాహ్మణ; ఇంద్ర = శ్రేష్ఠుని; మృత = చనిపోయిన; నందన = పుత్రుని; దాయికి = తెచ్చి ఇచ్చినవానికి; రుక్మిణీ = రుక్మిణీదేవి; మనస్స్థాయికి = మనసులో స్థిరముగ ఉండువానికి; భూత = జీవులకు; సమ్మద = సంతోషము; విధాయికి = కూర్చువానికి; సాధు = మంచి; జన = జనులకు; అనురాగ = అనురాగమును; సంధాయికి = కూర్చువానికి; పీత = పచ్చని పట్టు; వస్త్ర = వస్త్రములు; పరిధాయికి = ధరించేవానికి; పద్మ = పద్మంలో; భవాండ = బ్రహ్మ మొదలు అండముల; భాండ = కోశములను; నిర్మాయికి = నిర్మించేవానికి; గోపికా = గోపికల; నివహ = అందఱి; మందిర = ఇళ్ళకు; యాయికి = వెళ్ళేవానికి; శేష శాయికిన్ = శేషతల్పంపై శయనించేవానికి.
తాత్పర్యం:
శ్రీకృష్ణస్వామి న్యాయప్రవృత్తి కలవాడు. తన గురువైన సాందీపనికి అతని మృతి చెందిన కుమారుని గురుదక్షిణగా సమర్పించిన మహాత్ముడు. రుక్మిణీదేవి హృదయాలయంలో సుస్థిరమైన గూడు కట్టుకున్నవాడు. ఉత్తమ శీలంకల జనులకు అనురాగాన్ని కూర్చేవాడు. చూడముచ్చట అయిన పట్టుపుట్టాన్ని కట్టేవాడు. బ్రహ్మాండములనే భాండములను నిర్మించేవాడు. గోపికల మందిరాలలో తిరుగాడేవాడు. శేషతల్పం మీద సుఖనిద్ర పొందేవాడు. అటువంటి శ్రీకృష్ణునికి అంకితముగా నేను శ్రీమదాంధ్ర భాగవతాన్ని రచిస్తున్నాను.
1-36 శ్రీమంతమై
సందర్భం:
భాగవతం అంటే ఏమిటి? దానినే ఎందుకు అధ్యయనం చేయాలి? అలాచేస్తే కలిగే ప్రయోజనాలెట్టివి? ఈ ప్రశ్నలకు పోతనగారు చక్కని సమాధానాలు చెబుతున్నారు.
సీ. శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతంబైన భాగవతంబు సద్భక్తితోడ
వినగోరువారల విమలచిత్తంబుల చెచ్చెర నీశుండు చిక్కుగాక
యితరశాస్త్రంబుల నీశుండు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు
కపట నిర్ముక్తులై కాంక్షసేయక యిందు తగిలియుండుట మహాతత్వబుద్ధి
తే. పరగ నాధ్యాత్మికాది తాపత్రయంబు
నడచి పరమార్థభూతమై యఖిలసుఖద
మై సమస్తంబు గాకయు నయ్యునుండు
వస్తు వెఱుగంగదగు భాగవతమునందు.
ప్రతిపదార్ధం:
శ్రీమంతమై = శుభకరమై; మునిశ్రేష్ఠ = మునులలో శ్రేష్ఠుడైన – వ్యాసుని చేత; కృతంబైన = రచింపబడినది అయినట్టి; భాగవతంబు = భాగవతము; సద్భక్తితోడన్ = మంచిభక్తితో; వినన్ = వినుటను; కోరువారల = కోరేవారి; విమల = నిర్మలమైన; చిత్తం బులన్ = మనస్సులలో; చెచ్చెరన్ = తొందరగా; ఈశుండు = జీవులలో నున్న ఈశ్వరు డు; చిక్కున్ = దొరకును; కాక = అంతేకాని; ఇతర = ఇతర; శాస్త్రంబులన్ = పద్ధతు లకు; ఈశుండు = ఈశ్వరుడు; చిక్కునే = దొరుకుతాడా, దొరకడు; భాగవతమునందు = భాగవతంలో; మంచివారలకున్ = మంచి వాళ్ళకు; నిర్మత్సరులు = మాత్సర్యం లేని వాళ్ళకు; కపట = మాయనుంచి; నిర్ముక్తులై = విడిపింపబడ్డ వారై; కాంక్ష = కోరుట; సేయక = చేయకుండ; ఇందు = ఈ భక్తియందు; తగిలి = లగ్నమై; ఉండుటన్ = ఉండటమును; మహాతత్త్వ = మహత్త్వమైన అంతర్యామియందు; బుద్ధిన్ = కుతూహల మున; పరఁగ = ప్రవర్తిల్లగ; ఆధ్యాత్మిక = ఆధ్యాత్మికము; ఆది = మొదలైన; తాపత్రయం బున్ = మూడు రకాలైన తాపములను {తాపత్రయంబు - (ఆధ్యాత్మిక, ఆధిభౌతిక , ఆధిదైవిక)}; అణఁచి = తొలగించి; పరమార్థ = మోక్షముయొక్క; భూతమై = రూపమై; అఖిల = సర్వ; సుఖదమై = సుఖప్రదమై; సమస్తంబున్ = సర్వమును; కాకయు = కాకుండా; అయ్యున్ = అయినవాడు కూడా; ఉండు = ఉండేటటువంటి; వస్తువు = వస్తువు; ఎఱుఁగంగన్ = తెలిసికొనుటకు; తగు = వీలున్నది.
తాత్పర్యం:
భాగవతం జ్ఞానలక్ష్మితో ప్రకాశిస్తూ ఉంటుంది. మహర్షులలో శ్రేష్ఠుడు శ్రీవేదవ్యాసుడు దానిని రచించినవాడు. గొప్పభక్తితో దానిని వినాలనే కోరికగల నిర్మల చిత్తంగలవారిలో పరమేశ్వరుడు వడివడిగా చేరుకొని అక్కడ స్థిరనివాసం చేస్తాడు. ఇతర శాస్త్రాల వలన అటువంటి మహాఫలం సిద్ధించదు. సత్పురుషులు, మాత్సర్యంలేనివారు, కపట భావాలు లేనివారూ మఱి దేనిని కోరకుండా ఈ భాగవతాన్నే అంటిపెట్టుకొని ఉంటారు. అట్టివారికి ఆధ్యాత్మికం, ఆధిదైవికం, ఆధిభౌతికం అనే తాపాలు మూడూ అణగి పోతాయి. అప్పుడు వారి హృదయాలలో పరమతత్త్వం ప్రసన్నంగా ఉంటుంది. అది అన్ని విధాలైన సుఖాలనూ కలిగిస్తుంది. ఆ వాసుదేవుడు అన్నీ తానే అయినవాడు, కానివాడు కూడా. అట్టి పరమాత్మను తెలుసుకోవాలంటే భాగవతాన్ని తెలుసుకోవాలి.
1-37 వేదకల్పవృక్ష
సందర్భం:
భాగవతరసాన్ని ఆస్వాదించటం ఎంతటి మహాఫలితాన్ని ఇస్తుందో పోతన్నగారు చక్కని అలంకార భాషలో మనకు బోధిస్తున్నారు.
ఆ. వేదకల్పవృక్షవిగళితమై శుక
ముఖ సుధాద్రవమున మొనసియున్న
భాగవత పురాణ ఫలరసాస్వాదన
పదవి గనుడు రసికభావవిదులు.
ప్రతిపదార్ధం:
వేద = వేదము అను; కల్పవృక్ష = కల్పవృక్షము నుండి; విగళితమై = జారినదై; శుక = శుకబ్రహ్మ / చిలుక; ముఖ = ముఖమను / ముక్కు తగిలిన; సుధా ద్రవమున = అమృతముతో / మంచి రసముతో; మొనసి = నిండినదై / రుచి కలదియై; ఉన్న = ఉన్నటువంటి; భాగవత = భాగవత మను పేరు గల; పురాణ = పురాణము యొక్క / పురాణము అను; ఫల = ఫలితముయొక్క / పండుయొక్క; రస = భావమును / రసమును; ఆస్వాదన = ఆస్వాదించు; పదవిన్ = ఉన్నతమైన స్థితిని / మార్గాన్ని; రసిక = రసికత్వ / రుచియొక్క; భావ = భావ వివరాలు / ప్రత్యేకత; విదులు = బాగా తెలిసినవారు; కనుఁడు = కనుగొనుడు / చూడండి.
తాత్పర్యం:
రసికులైన తత్త్వమెరిగిన నరులారా! ఈ భాగవతం అనే పురాణపు ఫలంనుండి జాలు వారే రసాన్ని ఆస్వాదించే పదవిని పొందండి. ఈ పండు వేదాలనే కల్పవృక్షమునందే పండి క్రిందికి జారివచ్చింది. చిలుకవంటి శుకమహర్షి ముఖమందుండే అమృతద్రవాన్ని అంటించుకొని మరింతగా మాధుర్యాన్ని సంతరించుకొన్నది. నేలకు దిగివచ్చి మనందరకూ అందుబాటులో కదలాడుతున్నది. రసికత ఉన్నవారైతే దీనిని కర్ణపుటాలతో జుఱ్ఱుకోండి. మీ జన్మ ధన్యమవుతుంది.
1-137 ధీరులు నిరపేక్షులు
సందర్భం:
నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహర్షులకు పురాణాలు చెప్పటంలో గొప్ప ప్రజ్ఞగల సూతుడు, భాగవతాన్ని వ్యాసమహర్షి రచించి తన కుమారుడైన శుకయోగీంద్రుని చేత చదివించాడు అని చెప్పగా శౌనకుడు, “అయ్యా శుకునకు మోక్షం తప్ప మరేమీ అక్కరలేదే. అతడు దేనినీ పట్టించుకోడే. అట్టివాడు భాగవతాన్ని ఎందుకు అభ్యసించాడు” అని అడిగాడు. అప్పుడు సూతుడు ఇలా అన్నాడు.
కం. ధీరులు నిరపేక్షులు నా
త్మారాములు నైన మునులు హరిభజనము ని
ష్కారణమ చేయుచుందురు
నారాయణు డట్టివాడు నవ్యచరిత్రా.
ప్రతిపదార్ధం:
నవ్యచరిత్రా = కొనియాడదగిన చరిత్ర కలవాడా; ధీరులు = విద్వాంసులు; నిరపేక్షులున్ = దేనియందు ఆపేక్షలేనివారు; ఆత్మారాములునైన = ఆత్మయందు ఆనందించువారును అయినట్టి; మునులు = మునులు; హరి = హరియొక్క; భజనమున్ = సంకీర్తనమును; నిష్కారణమ = కారణమేమియు లేకనే; చేయుచుందురు = చేస్తూ ఉంటారు; నారాయణుఁడు = నారాయణుడు; అట్టివాడు = అటువంటివాడు.
తాత్పర్యం:
మహర్షీ! నీ నడవడి కొనియాడదగినదయ్యా! విను. నీప్రశ్నకు బదులు చెబుతాను. గొప్పబుద్ధితో విలాసంగా విహరించేవారూ, ఏ అపేక్షతో అంటుసొంటులు లేనివారూ, ఆత్మతత్త్వమునందే ఆనందంపొందే శీలం కలవారూ అయిన మునులు శ్రీమహావిష్ణువు భజనను ఏ కారణమూ లేకుండానే చేస్తూ ఉంటారయ్యా! ఆ నారాయణుడు అటువంటి వాడు! ఏ కోరికా లేనివారికి కూడా అతనిని పూజించాలనే కోరిక కలుగుతూ ఉంటుంది.
1-139 నిగమములు
సందర్భం:
శౌనకమహర్షికి శ్రీమహావిష్ణువును గూర్చి తెలియజెప్పే భాగవతం ఇంకా ఎంత గొప్పదో సూతుడు ఇలా వివరిస్తున్నాడు.
కం. నిగమములు వేయు చదివిన
సుగమంబులు గావు ముక్తి సుభగత్వంబుల్
సుగమంబు భాగవతమను
నిగమంబు పఠింప ముక్తినివసనము బుధా.
ప్రతిపదార్ధం:
బుధా = బుద్ధిమంతుడా; నిగమములు = వేదములు; వేయున్ = వేల కొలది; చదివినన్ = పఠించిన కూడ; సుగమంబులు = సులభముగ అర్థము అగునవి; కావు = కావు; ముక్తి = ముక్తినిచ్చు; సుభగత్వంబుల్ = సౌభాగ్యము కలవి; సుగమంబు = సులభముగ అర్థమగునదైన; భాగవతమను = భాగవతమనే; నిగమంబున్ = వేదమును; పఠింప = చదివిన; ముక్తి = ముక్తి; నివసనము = నివాసమగును.
తాత్పర్యం:
మహర్షీ! ఈ సృష్టిలో వాక్కుల స్వరూపాలెన్నో ఉన్నాయి. ఆ అన్నింటిలో చాలా ఉన్నతమైన తావులో ఉన్నవి వేదాలు. అవి పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని భద్రంగా పట్టి ఇస్తాయి. కానీ ముక్తి అందచందాలను అందించటంలో అవి యోగ్యమైనవిగా కనిపించటం లేదు. ఎందుకంటే అవి వేలకొలదిగా చదివినా సుఖంగా తెలియరావు. కానీ భాగవతం అనే వేదాన్ని శ్రద్ధతో చదివితే ముక్తి గుట్టుమట్టులన్నీ సులభంగా అందుకోవచ్చు.
1-161 ఉద్రేకంబున
సందర్భం:
అశ్వత్థామ కసాయివానికంటే ఘోరంగా, నిద్రిస్తూ ఉన్న పాండవకుమారులను, మరి కొందరినీ నరికిప్రోవులు పెట్టాడు. ద్రౌపది ఆ కడుపుకోతను తట్టుకోలేక కుమిలి కుమిలి ఏడ్చింది. అర్జునుడు ఆమెను ఓదార్చి అశ్వత్థామను వధించటానికి కృష్ణునితోపాటు వెళ్ళాడు. అతడు దొరికాడు. కానీ గురుపుత్రుడని చంపక, కట్టితెచ్చి ద్రౌపదిముందు నిలిపాడు. అప్పుడా తల్లి ఇలా అన్నది.
శా. ఉద్రేకంబున రారు, శస్త్రధరులై యుద్థావనిన్ లేరు, కిం
చిద్ద్రోహంబును నీకు జేయరు, బలోత్సేకంబుతో చీకటిన్
భద్రాకారుల పిన్నపాపల రణప్రౌఢక్రియా హీనులన్
నిద్రాసక్తుల సంహరింప నకటా నీచేతులెట్టాడెనో?
ప్రతిపదార్ధం:
ఉద్రేకంబున = ఉద్రేకముతో; రారు = రారు; శస్త్రధరులై = శస్త్రములు ధరించినవారై; యుద్ధావనిన్ = రణభూమిలో; లేరు = లేరు; కించిత్ = కొంచెముకూడా; ద్రోహంబును = ద్రోహమును; నీకున్ = నీకు; చేయరు = చేయరు; బల = బలము వలని; ఉత్సేకంబుతో = ఉద్రేకముతో; చీకటిన్ = చీకట్లో; భద్ర = శుభ; ఆకారులన్ = ఆకారముగల వారిని; పిన్న = చిన్న; పాఁపల = పిల్లలను; రణ = యుద్ధము; ప్రౌఢ = నేర్పుగా; క్రియా = చేయట; హీనులన్ = రానివారిని; నిద్రాసక్తుల = ఆదమరచి నిద్రిస్తున్నవారిని, సంహరింపన్ = సంహరించుటకు; అకటా = అకటా; నీ చేతులు = నీ చేతులు ఎట్లు = ఎలా; ఆడెనో = వచ్చెనో.
తాత్పర్యం:
అయ్యా! గురుపుత్రా! నా పసిబిడ్డలు నీ మీదకు ఉద్రేకంతో నిన్నేదో చేసివేయాలని రాలేదే! ఆయుధాలు పట్టుకొని రణరంగంలో వీరవిహారం చేయలేదే! పైగా కండబలమూ, గుండెబలమూ పురికొల్పగా నీకు పిసరంత కూడా అపకారం చేసినవారు కారు గదా! చీకటిలో ఆదమరచి నిద్రిస్తున్నవారిని, యుద్ధంలో దుడుకు పనులుచేయటం చేతకాని వారిని, చంపటానికి, అయ్యయ్యో! నీకు చేతులెట్లా వచ్చాయి?
1-179 చెల్లెలికోడల
సందర్భం:
పాండవులు చేసిన పరాభవానికి కుమిలిపోయిన అశ్వత్థామ వెనుకా ముందూ చూడకుండా పాండవ గర్భాలను మాడ్చివేసే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది అభిమన్యుని యిల్లాలు ఉత్తర గర్భంలో ఉన్న శిశువును కాల్చివేయబోతున్నది. అప్పుడు ఉత్తర మరొక దారి లేక శ్రీకృష్ణుణ్ణి ఇలా ప్రార్థించింది.
కం. చెల్లెలికోడల; నీమే
నల్లుడు శత్రువులచేత హతుడయ్యెను; సం
పుల్లారవిందలోచన!
భల్లాగ్ని నణంచి శిశువు బ్రతికింపగదే.
ప్రతిపదార్ధం:
సంఫుల్ల = పూర్తిగ వికసించిన; అరవింద = పద్మములవంటి; లోచన = కన్నులున్నవాడా; చెల్లెలి = మీ చెల్లెలికి; కోడల = కోడలను; నీ మేనల్లుఁడు = నీ సోదరి పుత్రుడు; శత్రువులచేత = వైరులచేతిలో; హతుఁడయ్యెను = చనిపోయాడు; భల్ల = బాణ ముల యొక్క; అగ్నిన్ = అగ్నిని; అణంచి = అణచివే; శిశువున్ = శిశువును; బ్రతికింపఁ గదే = బ్రతికింపుము.
తాత్పర్యం:
బాగా విప్పారిన పద్మాలవంటి కన్నులుగల కన్నయ్యా! నేను నీ ముద్దుల చెల్లెలి కోడలిని. నీకు ఎంతో ప్రియుడైన నీ మేనల్లుడు పగవారికి చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. ఇదిగో ఆ అశ్వత్థామ వేసిన బాణం నా గర్భాన్ని కాల్చివేస్తున్నది. దానిని అణగగొట్టి కడుపులో ఉన్న నిసుగును బ్రతికించు మహాత్మా!
1-182 తనసేవారతిచింత
సందర్భం:
ఉత్తర ఆర్తనాదం శ్రీకృష్ణుని దయాంతరంగాన్ని కదిలించివేసింది. వెంటనే అతడు క్షణమైనా ఆలస్యం చేయకుండా ఉత్తర కడుపును కాపాడటానికి పూనుకున్నాడు.
మ. తనసేవారతిచింత గాని పరచింతాలేశమున్ లేని స
జ్జనులం బాండుతనూజులన్ మనుపు వాత్సల్యంబుతో ద్రోణనం
దను బ్రహ్మాస్త్రము నడ్డపెట్ట బనిచెన్ దైత్యారి సర్వారి సా
దననిర్వక్రము రక్షితానఖిల సుధాంధశ్చక్రముం జక్రమున్.
ప్రతిపదార్ధం:
తన = తనయొక్క; సేవారతి = భక్తితో తపించు; చింత = ఆలోచన; కాని = తప్ప; పరచింతాలేశమున్ = ఇతరఆలోచన కొంచెం కూడ; లేని = లేని; సజ్జనులన్ = మంచివారిని; పాండుతనూజులన్ = పాండవులను; మనుచు = కాపాడవలెననే; వాత్సల్యంబుతో = ఆపేక్షతో; ద్రోణనందను = అశ్వత్థామ యొక్క {ద్రోణుని కొడుకు - అశ్వత్థామ}; బ్రహ్మాస్త్రమున్ = బ్రహ్మాస్త్రమును; దైత్యారి = కృష్ణుడు {దైత్యారి - దైత్యుల శత్రువు, కృష్ణుడు}; సర్వ = సమస్త మైన; అరి = శత్రువులను; సాధన = నశింప చేయుటలో; నిర్వక్రము = తిరుగులేనిది; రక్షిత = రక్షింపబడిన; అఖిల = సమస్త; సుధాంధస్ = దేవతలసమూహముగలదియైన; చక్రమున్ = చక్రమును; అడ్డుపెట్టన్ = అడ్డుకొనుటకు; పనిచెన్ = నియోగించెను.
తాత్పర్యం:
ఆ పాండురాజు కొడుకులకు ఎల్లవేళలా తనను సేవించుకోవటమనే భావనయే కానీ మరొక చింత రవంత కూడా లేదు. అట్టివారిని ఆదుకోవాలి అనే వాత్సల్య భావంతో రక్కసులను చీల్చి చెండాడే వాడైన శ్రీకృష్ణుడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకోవలసినదిగా చక్రాన్ని ఆదేశించాడు. అది సుదర్శనమనే నామం గలది. పగ వారినందరినీ రూపుమాపటంలో గురితప్పనిది. అమృతమే అన్నమైన దేవతల సమాజాన్నంతటినీ కంటికిరెప్పలా కాపాడేది. అట్టి ఆ చక్రం తల్లి కడుపులో ఉన్న చిన్నినిసుగును కాపాడకుండా ఎలా ఉంటుంది?
1-183 సకలప్రాణి
సందర్భం:
శ్రీకృష్ణపరమాత్మ ఉత్తర గర్భాననున్న చిన్నిబిడ్డను కాపాడిన తీరులో వేదాంత రహస్యాలు శ్రోతల హృదయాలలో వింత వెలుగులను ప్రసరించే విధంగా పోతన మహాకవి అద్భుతంగా వర్ణిస్తున్నాడు.
మ. సకలప్రాణి హృదంతరాళముల భాస్వజ్జ్యోతి యై యుండు సూ
క్ష్మకళుం డచ్యుతు డయ్యెడన్ విరటజా గర్భంబు తా చక్రహ
స్తకుడై వైష్ణవమాయ గప్పి కురుసంతానార్థియై యడ్డమై
ప్రకటస్ఫూర్తి నణంచె ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్.
ప్రతిపదార్ధం:
సకల = సమస్తమైన; ప్రాణి = ప్రాణులయొక్క; హృదంతరాళములన్ = హృదయముల లోలోపల; భాస్వత్ = ప్రకాశించే; జ్యోతియై = దీపమై; ఉండు = ఉండెడి; సూక్ష్మకళుండు = సూక్ష్మమైన నేర్పుకలవాడు; అచ్యుతుఁడు = నాశనము లేనివాడు / హరి; ఆ ఎడన్ = ఆ సమయంలో; విరటజా = ఉత్తర యొక్క {విరటజ - విరటుని సంతానము / ఉత్తర}; గర్భంబున్ = గర్భమును; తాన్ = తాను; చక్ర = చక్రమును; హస్తకుడై = చేతియందు ధరించినవాడై; వైష్ణవ = విష్ణువు యొక్క; మాయన్ = మాయచే; కప్పి = కప్పి; కురు = కురువంశ; సంతాన = సంతానమును; అర్థియై = నిలబెట్టగోరిన వాడై; అడ్డమై = అడ్డముగా నిలబడినవాడై; ప్రకట = అభివ్యక్తమైన; స్ఫూర్తిన్ = స్ఫూర్తితో; ద్రోణతనయు = అశ్వత్థామ యొక్క; బ్రహ్మాస్త్రమున్ = బ్రహ్మాస్త్రమును; = అవలీల / లీలావిలాసముగా; అణంచెన్ = అణచెను.
తాత్పర్యం:
ఆ పరమాత్మ ప్రాణంకల అందరి హృదయాలనే ఆలయాలలోపల దివ్య కాంతులతో వెలుగొందే మహాదీపం. సూక్ష్మమైన కళతో అలరారేవాడు. ఎక్కడా ఏ విధమైన జారుపాటూ లేనివాడు. అట్టి జ్ఞానదీపమైన దేవుడు విరాటరాజ పుత్రిక అయిన ఉత్తరగర్భంలో ప్రవేశించాడు. చూడనలవికాని వెలుగులను చిందిస్తున్న చక్రాన్ని చేతితో పట్టుకున్నాడు. ఆయన అందరిలో, అన్నింటిలో, లోపలా వెలుపలా సంచరించే విష్ణువు కదా! అట్టి వైష్ణవ మాయతో కప్పివైచి కౌరవ వంశానికి అంకురమైన బిడ్డను కాపాడటానికై, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని విలాసంగా అణచివేశాడు.
1-191 కోపముతోడ
సందర్భం:
కుంతీదేవి కన్నయ్య చిన్ననాటి అల్లరిని తలచుకునీ తలచుకునీ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఇలా అంటున్నది.
ఉ. కోపముతోడ నీవు దధికుంభము భిన్నము సేయుచున్నచో
గోపికఁ ద్రాటఁ గట్టిన వికుంచిత సాంజన బాష్పతోయ ధా
రాపరిపూర్ణ వక్త్రముఁ గరంబులఁ బ్రాముచు వెచ్చనూర్చుచుం
బాపఁడవై నటించుట కృపాపర! నామదిఁ జోద్య మయ్యెడిన్.
ప్రతిపదార్ధం:
కోపముతోడ = కినుకతో; నీవు = నీవు; దధికుంభము = పాలకుండను; భిన్నము = ముక్కలు; సేయుచున్నచో = చేస్తూ ఉన్నపుడు; గోపిక = గోపస్త్రీ అయిన యశోద; త్రాటగట్టిన = తాడుతో కట్టగా; వికుంచిత = చెదరిన; సాంజన = కాటుకతో కూడిన; బాష్పతోయధారా = కన్నీటిధారలతో; పరిపూర్ణ = నిండిన; వక్త్రమున్ = ముఖమును; కరంబులన్ = చేతులతో; ప్రాముచు = అలముకొనుచు; వెచ్చ = వేడిగా; నూర్చుచున్ = నిట్టూర్పులు నిగడించుచు; పాపఁడవై= శిశువువై; నటించుట = నటించుట; కృపాపర = దయను ప్రసరించువాడా; నామదిన్ = నా మనసులో; చోద్యము = ఆశ్చర్యమును; అయ్యెడిన్ = కలిగించుచున్నది.
తాత్పర్యం:
కన్నయ్యా! నీవు అడిగిన వెంటనే అమ్మ అడిగినది ఇవ్వలేదని అలుకచెంది పెరుగు కుండను పగులకొట్టావు. ఆమె తెచ్చిపెట్టుకొన్న కోపంతో నిన్నొక త్రాటితో కట్టివేసి నీ వైపు ఓరగా చూస్తున్నది. అప్పుడు నీవు కళ్ళు చికిలించుకొని కాటుకతో నిండిన కన్నీళ్ళు ధారలై జాలువారుతున్న మోమును చేతులతో పాముకుంటూ వేడిగా నిట్టూర్పులు పుచ్చుతూ బాలుడవై నటించటం, కృపాకరా! నా మనస్సులో ఎంతో అబ్బురంగా భాసిస్తున్నది.
1-198 యాదవు లందుఁ
సందర్భం:
కుంతీదేవి గొప్ప జ్ఞానజ్యోతిని గుండెలో దాచుకొన్న మహావ్యక్తి. పరమాత్మ అనుగ్రహాన్ని అందుకొనే మహాభాగ్యం కలవారు స్వామిని ఏమి కోరాలో మనకు తన మాటల ద్వారా తెలియజేస్తున్నది. ఆమె మానవ సమాజానికి గొప్ప గురువు.
ఉ. యాదవు లందుఁ బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి
చ్ఛేదము సేయుమయ్య! ఘనసింధువుఁ జేరెడి గంగభంగి నీ
పాదసరోజచింతనముపై ననిశంబు మదీయబుద్ధి న
త్యాదరవృత్తితోఁ గదియునట్లుగఁ జేయఁ గదయ్య! యీశ్వరా!
ప్రతిపదార్ధం:
ఈశ్వరా = ఈశ్వరుడా/కృష్ణా!; యాదవులందున్ = యదువంశమువారి మీదను; పాండుసుతులందున్ = పాండురాజు పుత్రులమీదను; అధీశ్వర = ప్రభూ; నాకు = నాకు; మోహ = మోహమును; విచ్ఛేదమున్ = విమోచనము; సేయుమయ్య = చేయవయ్యా!; ఘనసింధువున్ = సముద్రమును; చేరెడి = చేరునట్టి; గంగ = గంగ; భంగి = వలె; నీ = నీ; పాద = పాదములనే; సరోజ = పద్మముల; చింతనముపై = ధ్యానించుటపై; అనిశంబు = పగలూ రాత్రి; మదీయ బుద్ధి = నా మనసులో; అత్యాదర వృత్తి = మిక్కిలి ఆదరమైన ప్రవర్తనతో; కదియునట్లుగన్ = కూడియుండునట్లుగా; చేయగదయ్య = చేయవయ్యా!
తాత్పర్యం:
సర్వకాలాలలో సర్వలోకాలనూ పాలించే ఓ ఈశ్వరా! నాకు నా పుట్టింటివారైన యాదవులందూ, మెట్టినింటివారైన పాండవులయందూ మోహం ఆవంత కూడా లేకుండా చేయి నాయనా! నీవు అన్ని లోకాలకూ పాలకుడవు. నా బుద్ధి సర్వకాల సర్వావస్థలలోనూ సముద్రంలోనికి చేరుకొనే గంగలాగా, నీ పాదపద్మాలను మాత్రమే ఎక్కువ ఆదరంతో కలిసిపోయే విధంగా దయచూడు, స్వామీ.
1-199 శ్రీకృష్ణా
సందర్భం:
శ్రీకృష్ణవాసుదేవుడు ఉత్తరగర్భంలో ఉన్న కురువంశాకురాన్ని పరిరక్షించి తన నివాసానికి బయలుదేరాడు. ఆ సందర్భంలో శ్రీకృష్ణతత్వం చక్కగా తెలిసికొన్న కుంతీదేవి ఆ గోపాలబాలకుని ఇలా స్తుతించింది.
శా. శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగార రత్నాకరా!
లోకద్రోహినరేంద్రవంశ దహనా! లోకేశ్వరా! దేవతా
నీకబ్రాహ్మణ గోగణార్తి హరణా! నిర్వాణ సంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!
ప్రతిపదార్ధం:
శ్రీకృష్ణా = కృష్ణమూర్తీ {కృష్ణ - నల్లనివాడు}; యదు భూషణా = యదు వంశమునకు భూషణము వంటివాడు ; నరసఖా = అర్జునునకు సఖుడు; శృంగార రత్నా కరా = శృగార రసమునకు సముద్రము వంటివాడు; లోకద్రోహి నరేంద్ర వంశ దహనా దుష్టరాజవంశములను నాశనము చేయువాడు; లోకేశ్వరా = లోకములకు ఈశ్వరుడు; దేవతానిక = దేవతలసమూహమునకును; బ్రాహ్మణ = బ్రాహ్మణులకును; గోగణ = గోవులమందకును; ఆర్తిహరణా = బాధలను హరించువాడు; నిర్వాణసంధాయకా = మోక్షమును కలిగించువాడు; నీకున్ = నీకు; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; భవలతల్ = సంసారబంధనములు; త్రుంపవే = తెంపుము; నిత్యానుకంపానిధీ = నిత్యమైన దయకు నిలయమైనవాడు.
తాత్పర్యం:
శ్రీకృష్ణా! నీవు యదువు, శూరుడు, వసుదేవుడు మొదలైన మహానుభావుల వంశానికి గొప్ప అలంకారం అయినవాడవు, నరుడైన అర్జునుడు నీకు ప్రాణమిత్రుడు. సౌందర్యం ఒక రత్నాల గనియైన సముద్రమైతే ఆ రత్నాకరుడవు నీవే. లోకాలకు కీడుచేసే రాజవంశాలను కాల్చి బూడిదచేసిన దయామయుడవు నీవు. పదునాలుగు లోకాలకూ ప్రభుడవు. దేవతల గుంపులకు, బ్రహ్మజ్ఞాన సంపన్నులకూ, గోవులకూ కలిగే ఆర్తిని హరించివేస్తావు. నీవు భక్తులైన వారికి పరమసుఖాన్ని చక్కగా ప్రసాదిస్తావు. నిత్యమైన దయకు నిధివైన ఓ స్వామీ! నాతండ్రీ! సంసారంలో కట్టిపడేసే బంధాలనే తీగలను త్రెంచివేయవయ్యా! నీకు మ్రొక్కుతాను.
1-212 రాజఁట ధర్మజుండు
సందర్భం:
అంపశయ్యపై వెలుగొందుతూ అవసాన కాలాన్ని ఎదురు చూస్తున్న భీష్ముణ్ణి దర్శించుకోవటానికి ధర్మరాజు తమ్ములతో, బంధువులతో సర్వలోక బాంధవుడైన వాసుదేవునితో కలసి వెళ్ళాడు. ఆ సమయంలో పాండవులు పడ్డ కష్టాలను, వారి భాగ్యసంపదను సంభావిస్తూ భీష్ముడు ఇలా అన్నాడు.
ఉ. రాజఁట ధర్మజుండు, సురరాజ సుతుండట ధన్వి, శాత్రవో
ద్వేజకమైన గాండివము విల్లఁట, సారథి సర్వభద్ర సం
యోజకుఁడైన చక్రి యఁట, యుగ్ర గదాధరుఁడైన భీముఁ డ
య్యాజికిఁ దోడు వచ్చునఁట, యాపద గల్గుట యేమి చోద్యమో!
ప్రతిపదార్ధం:
రాజట = రాజుట; ధర్మజుండు = ధర్మరాజు {ధర్మజుడు - యమధర్మరాజ పుత్రుడు}; ధన్వి = ధనస్సు ధరించినవాడు; సురరాజ సుతుండట = అర్జునుడట {సురరాజ సుతుడు – దేవతల రాజైన ఇంద్రుని పుత్రుడు}; శాత్రవ = శత్రువులకు; ఉద్వేజకమైన = ఉద్వేగకరమైన; గాండివము = గాండివము; విల్లట = ధనస్సు అట; సారథి = నడిపించు వాడు; సర్వ = సమస్త; భద్ర = శుభములను; సంయోజకుఁడైన = కలిగించువాడైన; చక్రి యట = చక్రధారి / కృష్ణుడట {చక్రి - చక్రము ధరించు వాడు, కృష్ణుడు}; ఉగ్ర = భయంకరమైన; గదాధరుడైన = గదను ధరించువాడైన; భీముఁడు = భీముడు; ఆ యాజి కిన్ = ఆ యజ్ఞము చేసినవానికి / ధర్మరాజుకు; తోడువచ్చునట = తోడుగా ఉంటాడట; ఆపద = విపత్తులు; కల్గుట = కలుగుట; ఏమి = ఎంత; చోద్యమో = విచిత్రమో కదా.
తాత్పర్యం:
ధర్మదేవత కుమారుడు ధర్మరాజు రాజట. దేవేంద్రుని కుమారుడు అర్జునుడు గొప్ప విలుకాడట. పగవారి గుండెలలో గుబులు పుట్టించే గాండీవం ఆ అర్జునుడు ఉపయోగించే విల్లట. సర్వజనులకూ, సర్వవిధాలైన శుభాలను సమకూర్చే చక్రధారి కృష్ణుడు ఆ గాండీవికి సారథిగా ఉన్నాడట. పరమ భయంకరమైన గదను చేతబట్టిన భీమసేనుడు ఆ పోరులో తోడుగా ఉన్నాడట. ఇంత సాధన సంపత్తి ఉన్నా, నాయనలారా! మీకు ఆపద కల్గినది కదా! ఇది యెంత అబ్బురమైన విషయమో!
1-217 ఆలాపంబులు మాని
సందర్భం:
తాత భీష్ముడు తాను కోరుకున్నప్పుడు మరణం పొందే వరాన్ని తండ్రివలన పొందిన వాడు. తనకు మిక్కిలి ఆప్తులైన ఉత్తమ పురుషులు పాండవులు, పురుషోత్తముడైన వాసుదేవుడూ తనను సేవిస్తూ తన దగ్గర ఉన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. చేయవలసిన పని ఏమీలేదు. దేహాన్ని వదలివేయాలని నిశ్చయించుకొన్నాడు.
శా. ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముం జేసి దృ
గ్జాలంబున్ హరిమోముపైఁ బఱపి తత్కారుణ్య దృష్టిన్ విని
ర్మూలీభూత శరవ్యధా నిచయుఁడై మోదించి భీష్ముండు సం
శీలం బొప్ప నుతించెఁ గల్మషగజశ్రేణీ హరిన్ శ్రీహరిన్.
ప్రతిపదార్ధం:
ఆలాపంబులు = మాటలు; మాని = మానేసి; చిత్తము = మనసును; మనీషా = ప్రజ్ఞతో; ఆయత్తమున్ = సిద్ధమైనదిగా; చేసి = చేసి; దృక్ = చూపుల; జాలంబున్ = సమూహమును / వలను; హరి = కృష్ణుని; మోముపై = ముఖముమీద; పఱపి = నిలిపి ఉంచి; తత్ = అతని; కారుణ్య = దయతో కూడిన; దృష్టిన్ = దృష్టితో; వినిర్మూలీభూత = పూర్తిగా నిర్మూలనము చేయబడిన; శర = అమ్ముల వలన కలిగిన; వ్యధా = బాధల యొక్క; నిచయుఁడై = సమూహము గలవాడై; మోదించి = మిక్కిలి సంతోషము పొంది; భీష్ముండు = భీష్ముడు; సంశీలంబు = మంచినడత; ఒప్పన్ = ఒప్పుచుండగ; కల్మష = పాపములనే; గజ = ఏనుగుల; శ్రేణీ = సమూహమును; హరిన్ = హరించు వానిని / కృష్ణుని; శ్రీహరిన్ = శ్రీకృష్ణుని; నుతించెన్ = స్తుతించెను.
తాత్పర్యం:
అనవసరమైన మాటలను మానివేశాడు. మనస్సును బుద్ధికి అధీనంలో ఉండే విధంగా కూర్చుకొన్నాడు. చూపులన్నింటినీ శ్రీకృష్ణుని మోము మీదనే నిలిపి ఉంచాడు. ఆ మహాత్ముడు వాసుదేవుని దయతో నిండిన చూపులవలన యుద్ధమాడినపుడు ఒడలిలో గ్రుచ్చుకొన్న బాణపు ములుకులు పెడుతున్న బాధలన్నీ మూలముట్టుగా తొలగిపోయాయి. ఆనందం తనలో తాండవిస్తూ ఉన్నది. మిక్కిలి ఉత్తమమైన శీలం ప్రకాశిస్తూ ఉన్నది. అలా అన్నింటినీ చక్కచేసుకొని పాపాలనే ఏనుగుపంక్తులను రూపుమాపే శ్రీహరిని స్తుతించాడు.
1-219 త్రిజగన్మోహన
సందర్భం:
అంపశయ్యమీద హాయిగా మేను వాల్చి శ్రీకృష్ణపరమాత్మను హృదయ దేవాలయంలో భద్రంగా నిలుపుకొని ఆనందసామ్రాజ్యంలో విహరిస్తున్నాడు శంతనుని కుమారుడు భీష్ముడు. అప్రయత్నంగా తనకు ఆత్మీయులైన పాండవులతో కలసి తాను ఉన్న చోటుకే వచ్చి నిలుచున్నాడు వాసుదేవుడు. ఆ పరమాత్ముని నోరారా కొనియాడుతున్నాడు భీష్ముడు.
మ. త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప ప్రాభాత నీ
రజబంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృంభింప మా
విజయున్ జేరెడు వన్నెలాడు మది నావేశించు నెల్లప్పుడున్.
ప్రతిపదార్ధం:
త్రిజగత్ = మూడులోకములను; మోహన = మోహింపచేయగల; నీలకాంతి = నీలమైనకాంతితో; తనువు = శరీరము; ఉద్దీపింపన్ = బాగా ప్రకాశిస్తుండగా; ప్రాభాత = ఉదయకాలపు; నీరజ = పద్మములకు; బంధు = బంధువు - సూర్యుని; ప్రభమైన = కాంతికలదైన; చేలము = వస్త్రము; పయిన్ = వంటి పైన; రంజిల్లన్ = ఎర్రగా ప్రకాశిస్తుండగ; నీలాలక = నల్లని ముంగురులయొక్క; వ్రజసంయుక్త = సమూహముతో కూడిన; ముఖారవిందము = ముఖము అనే పద్మము; అతి = మిక్కిలి; సేవ్యంబై = సేవింపదగినదై; విజృంభింపన్ = చెలరేగుతూ; మా = మా; విజయున్ = అర్జునుని; చేరెడు = చేరియుండు; వన్నెలాఁడు = విలాసవంతుడు; ఎల్లప్పుడున్ = ఎల్లప్పుడూ; మదిన్ = మనస్సును; ఆవేశించున్ = ప్రవేశించును గాక.
తాత్పర్యం:
మూడులోకాలూ మురిసిపోయే నీలవర్ణంలో అలరారే దేహం పైపైకి కాంతులను విరజిమ్ముతూ ఉన్నది. ఉదయకాలంలో సూర్యభగవానునివంటి ఉత్తరీయం ఆ నల్లని దేహంమీద రంజిల్లుతున్నది. నిగనిగలాడే నల్లని ముంగురుల మొత్తాలు మోము అనే పద్మంమీద క్రమ్ముకొని దోబూచులాడుతున్నాయి. ఎంతసేపు చూసినా ఆ మొగం సొబగు ఇకచాలు అనిపించటం లేదు కదా. ఆ విధమైన స్వరూపంతో మా ముద్దుల మనవడు అర్జునుని కడకు చేరుకొంటున్న వన్నెచిన్నెలస్వామి కన్నయ్య నా హృదయంలో ఎల్లప్పుడూ నెలకొని ఉండాలి.
1-220 హయరింఖాముఖ
సందర్భం:
పరమ భాగవతోత్తముడు, గంగమ్మ ముద్దులబిడ్డడు, జ్ఞానసంపన్నుడు అయిన భీష్ముడు ఇంకా శ్రీకృష్ణపరమాత్మను గురించి యిలా అంటున్నాడు.
మ. హయరింఖాముఖ ధూళి ధూసరపరిన్యస్తాలకోపేతమై
రయజాతశ్రమతోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
జయమున్ పార్ధున కిచ్చువేడ్క నని నా శస్త్రాహతింజాల నొ
చ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్.
ప్రతిపదార్ధం:
హయ = గుర్రముల; రింఖాముఖ = గిట్టల చివళ్ళనుండి లేచు; ధూళి = దుమ్మువలన; ధూసర = బూడిద వర్ణము; పరిన్యస్త = పైపూతగా ఉన్న; అలక = ముంగురులతో; ఉపేతమై = కూడినదై; రయ = వేగమువలన; జాత = పుట్టినట్టి; శ్రమ = అలసటవలన పట్టిన; తోయ = నీటి / చెమట; బిందుయుతమై = బిందువులతో కూడినదై; రాజిల్లు = ఎర్రనైన; నెఱమోముతో = నిండుముఖముతో; జయమున్ = గెలుపును; పార్థునకున్ = అర్జునుకు; ఇచ్చువేడ్కన్ = ఇవ్వవలెననే కోరికతో; అనిన్ = యుద్ధములో; నా = నాయొక్క; శస్త్ర = శస్త్రముల; ఆహతిన్ = దెబ్బలవలన; చాలన్ = అధికముగ; నొచ్చియున్ = నొప్పిచెందియు; పోరించు = యుద్ధమును చేయించు; మహా నుభావున్ = మహిమాన్వితుని; మదిలోన్ = మనసులో; అశ్రాంతమున్ = విడువకుండా చింతింతున్ = స్మరింతును.
తాత్పర్యం:
ఆ కన్నయ్య మహానుభావుడు. ఊహల కందని గొప్పతనం కలవాడు. ఎందుకంటే ఆయన సాక్షాత్తూ పరమాత్మ అని తెలిసి కూడా నేను యుద్ధధర్మాన్ని పాటించి ఆయన దేహాన్ని కుళ్ళబొడిచాను. అయినా ఆయన నన్ను చంపటమో, యుద్ధభూమి నుండి రథికుడైన అర్జునుని తొలగించుకొని పోవటమో చేయక ఏది ఏమైనా సరే అతనికి జయమునే కలిగించాలనే గొప్ప ఉత్సాహంతో పోరు సాగించిన మహానుభావుడు. గుఱ్ఱాల డెక్కల కొనల తాకిడికి లేచిన దుమ్ముతో నిండిన ముంగురులు మొగంమీద చిందులు త్రొక్కుతున్నాయి. వడివడిగా గుఱ్ఱాలను తోలటం వలన మోము అంతా చెమట బిందువులతో ఒప్పులకుప్పగా ప్రకాశిస్తున్నది. పరమమనోహరమైన ఆ మొగంతో అలరారే ఆ స్వామిని అలుపూ సొలుపూ లేకుండా భావిస్తూనే ఉంటాను.
1-221 నరుమాటల్
సందర్భం:
ఎప్పుడో కురుక్షేత్ర మహాసంగ్రామంలో తనముందు కదలాడిన చైతన్యమూర్తి శ్రీకృష్ణుడే అంపశయ్య మీద హాయిగా పవ్వళించిన భీష్ముని హృదయ మందిరంలో మెరసి పోతున్నాడు. ఆ అనుభూతిని మాటలతో అందరికీ అమృత ప్రసాదంలాగా అందిస్తున్నాడు భక్త శిఖామణి భీష్ముడు.
మ. నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో
పరు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచున్
పరభూపాయువులెల్ల చూపులన శుంభత్కేళి వంచించు నీ
పరమేశుండు మెలంగుచుండెడు మనఃపద్మాసనాసీనుడై.
ప్రతిపదార్ధం:
నరు = అర్జునుని; మాటల్ = (విహ్వల) పలుకులను; విని = విన్నవాడై; నవ్వుతో = చిరునవ్వుతో; ఉభయ = రెండు; సేనా = సేనల; మధ్యమక్షోణి = మధ్య ప్రదేశంలో; పరులు = శత్రువులు; ఈక్షింపన్ = చూస్తుండగా; రథంబున్ = రథమును; నిల్పి = నిలబెట్టి; పర = శత్రువులైన; భూపాల = రాజులయొక్క; ఆవళిన్ = సమూహమును; చూపుచున్ = చూపెడుతూ; పర = శత్రువులైన; భూప = రాజులయొక్క; ఆయు వులు = ప్రాణములు; ఎల్లన్ = అన్నిటిని; చూపులన = చూపులతో; శుంభత్ = మెరు స్తున్న; కేళి = విలాసముతో; వంచించున్ = లాగికొనుచు; ఈ = ఈ; పరమేశుండు = పరమమైన హరి; హృత్ = నాహృదయమనే; పద్మాసనాసీనుడై = పద్మమునే ఆసనముగా స్వీకరించినవాడై; వెలుంగుచు = ప్రకాశిస్తూ; ఉండెడును = ఉండు గాక.
తాత్పర్యం:
కౌరవులూ, పాండవులూ కురుక్షేత్రంలో పోరాటానికి తలపడి నిలిచి ఉన్నారు. హఠాత్తుగా పాండవపక్షంలోని పరమవీరుడు పార్థుడు ‘అచ్యుతా! నా రథాన్ని రెండు సేనల మధ్యలో నిలబెట్టు. నేనెవరితో పోరాడాలో ఒకసారి చూస్తాను’ అన్నాడు. కన్నయ్యకు ఆ మాటలు విన్నంతనే నవ్వు వచ్చింది. పగవారు పట్టిపట్టి పరికిస్తూ ఉండగా రెండు సేనల మధ్యలో ఉన్న నేలమీద రథాన్ని నిలబెట్టాడు పార్ధసారధి. శత్రువులైన రాజులందరినీ చూపిస్తున్నాడు. ఆ చూపులతోనే పరరాజుల ఆయువులన్నింటినీ విలాసమైన ఒక ఆటగా లాగివేసుకుంటున్నాడు. అట్టి పరమాత్మ నా మనస్సు అనే పద్మంలో సుఖంగా నెలకొని మెలగుతూ ఉండాలి.
1-222 తనవారి
సందర్భం:
పరమ భాగవతశిఖామణి భీష్ముడు శ్రీకృష్ణవాసుదేవుని జ్ఞానకిరణాల ప్రసారాన్ని గురించి యిలా తన హృదయంలో ముచ్చటించుకుంటున్నాడు.
కం. తనవారి చంపజాలక
వెనుకకు బో నిచ్చగించు విజయుని శంకన్
ఘనయోగవిద్య బాపిన
మునివంద్యుని పాదభక్తి మొరయున్ నాకున్.
ప్రతిపదార్ధం:
తనవారిన్ = తన వారిని; చంపన్ = చంపుట; చాలక = చేయలేక; వెనుకకున్ = వెనక్కి; పోన్ = వెళ్లుటను; ఇచ్చగించు = కోరుతున్న; విజయుని = అర్జునుని; శంకన్ = సందేహమును; ఘన = గొప్ప; యోగ = యోగమును గూర్చిన; విద్య = విద్యవలన; బాపిన = పోగొట్టిన; ముని = మునులచే; వంద్యుని = స్తుతింపబడువాని - కృష్ణుని; పాద = పాదములమీది; భక్తి = భక్తి; నాకున్ = నాకు; మొరయున్ = ఉద్భవించును గాక.
తాత్పర్యం:
అతని పేరు విజయుడు. అది ఆషామాషీగా రాలేదు. అనేక యుద్ధాలలో సాధించిన గెలుపులకు సంకేతంగా వచ్చింది. అటువంటి మహావీరుడు అర్జునుడు తప్పనిసరిగా గెలువవలసిన కురుక్షేత్ర మహాసంగ్రామం దగ్గరకు వచ్చేసరికి నీరుకారిపోయాడు. చంపవలసిన వారందరూ తనవారే. ఎలా చంపటం?! ఇదీ అతని శంక. ఈ శంక కూడా ఆషామాషీగా పోయేది కాదని సర్వజ్ఞుడైన వాసుదేవునికి తెలుసు. అందుకని ఘనమైన యోగవిద్యను ఉపదేశించవలసి వచ్చింది. అదే యోగశాస్త్రమైన భగవద్గీత. అది వాసుదేవుని జ్ఞానాస్త్రం. దానితో అర్జునుని శంక నామరూపాలు లేకుండా పోయింది. గీతోపదేశం చేసిన జ్ఞానమూర్తి కనుకనే ఆయన మునులందరికీ వంద్యుడైనాడు. ఆ మహాత్ముని పాదాలమీది భక్తి నాకు అనుక్షణమూ గుండెగుడిలో ఘంటల మ్రోతలాగా మ్రోగుతూ ఉండాలి.
1-223 కుప్పించి యెగసిన
సందర్భం:
పోరు అతిక్రూరంగా జరుగుతున్నది. పరశురామునంతటి వానిని కదలించి కుదిలించి వైచిన భీష్ముడు ప్రళయకాలంలో రుద్రునిలాగా పాండవసేనను చీల్చి చెండాడుతున్నాడు. పరమశివుని బాణవిద్యలో మెప్పించిన అర్జునుడు తల్లడిల్లిపోతున్నాడు. తన ప్రతిజ్ఞను కూడా ప్రక్కనపెట్టి భక్తరక్షణకళలో పేరుపొందిన కృష్ణుడు భీష్ముణ్ణి చంపి అర్జునుని కాపాడటానికి సంసిద్ధుడైనాడు. అప్పటి శ్రీకృష్ణుని సంరంభాన్ని ఇప్పటిదాకా హృదయంలో పదిలంగా నిలుపుకొన్న భీష్ముడు దానిని కమనీయ వాక్కుల ద్వారా ఇలా తెలియచేస్తున్నాడు.
సీ. కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పిగొనగ
ఉఱికిన నోర్వక ఉదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదల
చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార
నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపుమని క్రీడి మఱల దిగువ
కరికి లంఘించు సింహంబు కరణి మెరసి
నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు
విడువు మర్జున! అనుచు మద్విశిఖ వృష్టి
తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు.
ప్రతిపదార్ధం:
కుప్పించి = దుమికి; యెగసిన = పైకిలేచిన; కుండలంబుల = కుండలముల యొక్క; కాంతి = కాంతి; గగన = ఆకాశ; భాగంబు = భాగము; ఎల్లన్ = సమస్తము; కప్పికొనఁగన్ = నిండిపోగా; ఉఱికిన = దుమికిన; ఓర్వక = ఓర్చుకొనలేక; ఉదరంబు లోన = పొట్టలోపల ఉన్నట్టి; జగముల = జగత్తుల; వ్రేఁగున = వడివలన; జగతి = భూమి; కదల = కదలగా; చక్రంబు = చక్రమును; చేపట్టి = చేతిలో ధరించి; చనుదెంచు = వచ్చుచున్న; రయమున = వేగము వలన; పైనున్న = ఒంటిపై ఉన్నట్టి; పచ్చని = పచ్చని; పటము = వస్త్రము; జాఱ = జారగా; నమ్మితి = నిన్నే నమ్ముకొన్నాను; నాలావు = నా బలవిక్రమాలను; నగుఁబాటు = నవ్వులపాలు; సేయకు = చేయవద్దు; మన్నింపుము = మన్నించు; అని = అని; క్రీడి = అర్జునుడు; మరల = వెనుకకు; దిగువ = లాగు చుండగా; కరికి = ఏనుగుపైకి; లంఘించు = దూకు; సింహంబు = సింహము; కరణి = వలె; మెఱసి = ప్రకాశించుచు; నేఁడు = ఈవేళ; భీష్ముని = భీష్ముని; చంపుదు = సంహ రించెదను; నిన్నున్ = నిన్ను; కాతు = కాపాడుదును; విడువుము = వదులు; అర్జున = అర్జునా; అనుచు = అంటూ; మత్ = నా యొక్క; విశిఖ = బాణాల; వృష్టిన్ = వానను; తెరలి = తప్పించుకొని; చనుదెంచు = వచ్చెడి; దేవుండు = భగవంతుడు; నాకు = నాకు; దిక్కు = శరణమగు గాక.
తాత్పర్యం:
శ్రీకృష్ణుడు రథంలో సారధిస్థానం నుండి ఒక్క పెట్టున కుప్పించి పైకి లేచాడు. ఆ ఊపుతో అతని కుండలాల కాంతి గగనాన్నంతా క్రమ్మివేసింది. అదే వేగంతో క్రిందికి దూకాడు. బొజ్జలో ఉన్న లోకాల బరువునకు వెలుపలి జగత్తు కంపించిపోయింది. తల నరకటానికి చక్రాన్ని చేతిలో అమర్చుకొని తనపైకి వస్తున్నాడు. ఆ వడికి ఉత్తరీయంగా వేసుకొన్న పచ్చని పట్టుబట్ట జారిపోతున్నది. ‘స్వామీ! నిన్నేనమ్ముకొన్నాను. నా బలవిక్రమాలను నవ్వులపాలు చేయబోకు. నా పరువు కాపాడు’ అని ఇంద్రుడు మెచ్చి బహూకరించిన కిరీటం తలమీద మిలమిలలాడుతున్న అర్జునుడు వెనుకకు త్రిప్పటానికి బలమంతా ఉపయోగించి లాగుతున్నాడు. అయినా ఏనుగుమీదికి దూమికే సింహంలాగా మెరసిపోతూ ‘ఉండు, అర్జునా! నన్ను వదలిపెట్టు. ఈనాడు భీష్ముణ్ణి చంపుతాను. నిన్ను కాపాడుతాను’ అంటూ నా బాణాల జడివానను తప్పించుకుంటూ నా మీదికి వస్తూ ఉన్నాడు. ఆ విధంగా వచ్చి, నన్ను చంపాలని నేను కోరుకుంటున్న ఆ స్వామియే నాకు దిక్కు.
1-224 తనకున్
సందర్భం:
స్వామి భక్తులను సంరక్షించే కళలో గొప్ప ఉత్సాహం కలవాడు. ఆ ప్రయోజనం కోసం తన స్థాయికి తగని ఏ పనికైనా, సిద్ధపడతాడు. అందుకే అర్జునుని రథంలో కూర్చుని గుఱ్ఱాలను తోలడానికి పూనుకున్నాడు. అంటే మహాభక్తితో భక్తుల సేవలందుకొనే స్వామి సేవకుడయ్యాడు. దానిని భీష్ముడు ఇలా భావిస్తున్నాడు.
మ. తనకున్ భృత్యుఁడు వీనిఁ గాఁచుట మహాధర్మంబు వొమ్మంచు న
ర్జునసారథ్యము పూని పగ్గములు చేఁ జోద్యంబుగాఁ బట్టుచున్
మునికోలన్వడిఁ జూపి ఘోటకములన్మోదించి తాడించుచున్
జనులన్మోహము నొందఁజేయు పరమోత్సాహుం బ్రశంసించెదన్.
ప్రతిపదార్ధం:
తనకున్ = తనకు; భృత్యుఁడు = సేవకుడు; వీనిన్ = ఇతనిని; కాఁచుట = కాపాడుట; మహాధర్మంబు = ముఖ్యమైన ధర్మము; ఒమ్మంచు = పొమ్ము అనుచు; అర్జున = అర్జునుని; సారథ్యము = రథసారథ్యము; పూని = చేపట్టి; పగ్గములు = పగ్గములను; చేన్ = చేతితో; చోద్యంబుగాన్ = ఆశ్చర్యకరముగ; పట్టుచున్ = పట్టుకొని; ముని కోలన్ = ములుగర్రను; వడిన్ = త్రిప్పువేగమును; చూపి = ప్రదర్శిస్తు; ఘోటకములన్ = గుర్రములను; మోదించి = హుషారు చేస్తూ; తాడించుచున్ = శబ్దం వచ్చేలా కొడుతూ; జనులన్ = ప్రజలను; మోహము = మోహము; ఒందన్ = పొంద; చేయు = చేయు చున్న; పరమ = మిక్కిలి; ఉత్సాహున్ = ఉత్సాహము గల వానిని; ప్రశంసించెదన్ = స్తోత్రము చేసెదను.
తాత్పర్యం:
ఈ అర్జునుడు నాకు, తల్లికి కొడుకులాగా, కంటికి రెప్పలాగా, కాపాడవలసిన వాడు. వీనిని కాపాడటం మహాధర్మం అని అతని రథాన్ని నడపటానికి పూనుకొన్నాడు కృష్ణుడు. సారథులను ఎందరినో చూచాను. కానీ ఈయన పగ్గాలు పట్టుకొన్న తీరుతెన్నులు ఎంత అద్భుతంగా ఉన్నాయి. అలా ఒక చేతిలో పగ్గాలూ, మరో చేతిలో చెర్నాకోల. దానితో పొగరు గుఱ్ఱాలను ప్రమోదంతో చిన్ని చిన్ని దెబ్బలు తగిలిస్తూ – అబ్బే తగిలిస్తున్నట్లు కనిపిస్తూ - యుద్ధరంగంలోని జనులను మోహపెడుతూ ఉండే పరమోత్సాహంగల స్వామిని తనివితీరా కొనియాడుతాను.
1-227 ఒక సూర్యుండు
సందర్భం:
ఆయన మన కళ్ళముందు అందరిలాగా తిరుగుతూ మామూలు మనిషే అనిపిస్తాడు. కానీ జ్ఞానసంపన్నుడైన భీష్ముని చూపునకు మాత్రం పరమాత్మయే. ఆచార్య భీష్ములవారు ఆ పరమ రహస్యాన్ని ఎంత సుందరంగా తెలియజేస్తున్నారో ఒక్కసారి వినండి.
మ. ఒక సూర్యుండు సమస్త జీవులకు తా నొక్కొక్కడై తోచు పో
లిక నే దేవుడు సర్వకాలము మాహాలీలన్ నిజోత్పన్న జ
న్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుడై యొప్పుచునుండు నట్టి హరి నే ప్రార్థింతు శుద్ధుండనై.
ప్రతిపదార్ధం:
ఒక సూర్యుండు = ఒక సూర్యుడే; సమస్త జీవులకు = ప్రపంచంలోని అందరికీ; తాను = తాను; ఒక్కొక్కడై = ఒక్కొక్క విధంగా; తోచు పోలిక = అనిపిస్తూ ఉంటాడో అలాగే; ఏ దేవుండు = ఏ కృష్ణభగవానుడు; మహాలోలన్ = ఎంతో లీలగా; నిజోత్పన్నజన్య = తననుండే ఉద్భవించిన, కదంబంబులన్ = ప్రాణుల సమూహముల; హృత్సరోరుహములన్ = హృదయాలనే పద్మాలలో; నానావిధానూన = అనేకవిధాలైన; రూపకుడై = రూపాలతో; ఒప్పుచునుండు = ప్రకాశిస్తూ ఉంటాడో; అట్టి = అటువంటి; హరి = శ్రీకృష్ణుని; శుద్ధుండనై = త్రికరణ శుద్ధిగా; నే ప్రార్థింతు = నేను ప్రార్థిస్తూ ఉంటాను.
తాత్పర్యం:
ప్రతిదినం మనం ఆకాశంలో ఈ అంచున ఉదయించి ఆ అంచున అస్తమించే అంబరమణి సూర్యభగవానులవారిని చూస్తూనే ఉంటాం. నిజానికి ఆయన ఒక్కడే. కానీ చూచే ప్రతివ్యక్తీ నా సూర్యుడు, నావాడే సూర్యుడు అనుకొనేట్లుగా కనపడుతూ ఉంటాడు. అలాగే ఇప్పుడు కృష్ణభగవానుని రూపంతో కానవస్తున్న ఈ దేవుడు అనంతమైన లీలతో, తననుండి పుట్టిన ప్రాణుల గుంపుల హృదయాలనే పద్మాలలో నానావిధాలైన గొప్పగొప్ప రూపాలతో కానవస్తూ ఉంటాడు. అట్టి పరమాత్ముణ్ణి మనస్సులో, మాటలో, చేష్టలో సహజంగా ఏర్పడే మాలిన్యాన్ని పిసరంతకూడా మిగులకుండా తొలగించుకొని ప్రార్థిస్తూ ఉంటాను.
1-247 నీపాదాబ్జము
సందర్భం:
కురుకుల పితామహుడు భీష్ముడు మానుషదేహాన్ని వదలివైచి తన స్థానానికి వెళ్ళిపోయాడు. ధర్మరాజు అతనికి శాస్త్రం చెప్పిన విధంగ పరలోక క్రియలు భక్తిశ్రద్ధలతో ఆచరించాడు. తరువాత ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. జగన్నాయకుడు శ్రీకృష్ణుడు తిరిగి తన నివాసం అయిన ద్వారకకు చేరుకొన్నాడు. అక్కడి ప్రజలు ఆనందంతో అతనిని ఇలా పూజిస్తున్నారు.
శా. నీపాదాబ్జము బ్రహ్మపూజ్యము గదా! నీ సేవ సంసార సం
తాపధ్వంసిని యౌఁ గదా! సకలభద్రశ్రేణులం బ్రీతితో
నాపాదింతు గదా! ప్రపన్నులకుఁ గాలాధీశ! కాలంబు ని
ర్వ్యాపారంబు గదయ్య! చాలరు గదా! వర్ణింప బ్రహ్మాదులున్.
ప్రతిపదార్ధం:
నీ = నీయొక్క; పాద = పాదము అనే; అబ్జము = పద్మము; బ్రహ్మ = బ్రహ్మ చేత; పూజ్యము = పూజింపదగినది; కదా = కదా; నీ = నీమీది; సేవ = భక్తి; సంసార = సంసారమందలి; సంతాపధ్వంసిని యౌ గదా= బాధలను నాశనం చేయగలది కదా; సకల = సమస్త; భద్ర = శుభముల; శ్రేణులన్ = పంక్తులను; ప్రీతితో = ప్రేమతో; ఆపాదింతు = సంక్రమింపచేయుదువు; కదా = కదా; ప్రపన్నులకు = భక్తులకు; కాలాధీశ = కాలమునకు అధిపతీ; కాలంబు = కాలము; నిర్వ్యాపారంబు కదయ్య = ప్రవర్తనలు లేనిది అవుతుంది కదా; నినున్ = నిన్ను; వర్ణింపన్ = వర్ణించుటకు; బ్రహ్మ = బ్రహ్మ దేవుడు; ఆదులున్ = మొదలగువారును; చాలరు = సరిపోరు.
తాత్పర్యం:
కృష్ణా! వాసుదేవా! ఈ పదునాలుగు లోకాలనూ సృష్టించే బ్రహ్మదేవునకు నీ అడుగుదామర పూజింపదగినది కదా! నిన్ను సేవిస్తే సంసార బంధమైన తాపమంతా రూపుమాసిపోతుంది. నీవే తప్ప మరొక దిక్కులేదు అని నిన్ను చేరుకొన్నవారికి సమస్త కల్యాణ పరంపరలను ప్రీతితో నీవు కూరుస్తావు. కాలానికి కూడా నీవే ప్రభుండవు. నీవు సంకల్పిస్తే కాలం కదలకుండా మెదలకుండా నిలిచిపోతుంది. నీ గుణగణాలను వర్ణించటానికి నాలుగు నోళ్ళున్న బ్రహ్మదేవుడు, వేయి నోళ్ళున్న ఆదిశేషుడు మొదలైనవారు కూడా శక్తిలేనివారే అవుతారు.
1-256 జలజాతాక్షుడు
సందర్భం:
శ్రీకృష్ణచంద్రుడు ద్వారకలో రాజమార్గంలో విలాసంగా సంచరిస్తూ కానవస్తున్నాడు. ఆదివ్యసుందర మూర్తిని పురకాంతలు చూస్తూ పులకలెత్తిన దేహాలతో పొంగిపోతున్నారు. అప్పుడప్పుడే విరిసిన పూవులను శ్రీకృష్ణునిపై వర్షిస్తున్నారు. అప్పటి కన్నయ్య ఉన్న తీరు ఎంత మనోజ్ఞంగా ఉన్నదో!
ఉ. జలజాతాక్షుడు చూడ నొప్పె ధవళచ్ఛత్రంబుతో, చామరం
బులతో, పుష్పపిశంగచేలములతో, భూషామణిస్ఫీతుడై
నలినీబాంధవుతో, శశిద్వయముతో, నక్షత్ర సంఘంబుతో
బలభిచ్చాపముతో తటిల్లతికతో భాసిల్లు మేఘాకృతిన్.
ప్రతిపదార్ధం:
జలజాతాక్షుడు = పద్మములవంటికన్నులు కలిగిన కృష్ణుడు; చూడన్ = చూచుటకు; ధవళచ్ఛత్రంబుతో = తెల్లనిగొడుగుతో; చామరంబు లతో = చామరములతో; పుష్ప = పుష్పములతో; పిశంగ = వంగపండురంగు; చేలములతో = వస్త్రములతో; భూషామణిస్ఫీతుడై = భూషణములలోని మణులు అధికముగా కలవాడై; నలినీభాంధవు = పద్మముల బంధువైన సూర్యునితో; శశిద్వయముతో = చంద్రునితో; నక్షత్ర సంఘంబుతో = తారకల సమూహముతో; బలభిచ్చాపముతో = ఇంద్రధనుస్సుతో; తటిల్లతికతో = మెరుపులతో; భాసిల్లు = ప్రకాశించు; మేఘాకృతిన్ = మేఘము యొక్క ఆకృతితో; ఒప్పె = చక్కగా ఉన్నాడు.
తాత్పర్యం:
నల్లనివాడు, పద్మనయనంబులవాడు అయిన శ్రీకృష్ణుడు ద్వారకలో ఊరేగింపుగా మెలమెల్లగా అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ కదలుతున్నాడు. పైన తెల్లని గొడుగు. అటు ఇటూ వింజామరలు. పూవులుకుట్టిన పచ్చనికాంతితో కనులపండుగ చేస్తున్న కమనీయ వస్త్రాలు. నిలువెల్లా పెక్కుతీరులైన బంగారంలో పొదిగిన వజ్రాలు, వైడూర్యాలు మొదలైనవి కల నగలు. ఆహా! ఎంత మనోహర రూపం. ఆయనను చూచి పైకి అలా భావనతో చూస్తే ఒక నల్లని మేఘం. ఇక్కడి గొడుగు ఆ మేఘం మీద వెలుగుల కుప్పలతో కప్పుచున్న సూర్యుణ్ణి తలపింపజేస్తున్నది. చామరాలు రెండూ చందమామలలా ఉన్నాయి. నగలు నక్షత్రాలలాగా మెరిసిపోతున్నాయి. ఆభరణాలు ఇంద్రధనుస్సులాగా విరాజిల్లుతున్నాయి. మణులు మెరుపుతీగలను స్ఫురింపజేస్తున్నాయి.
1-348 అన్నా! ఫల్గున
సందర్భం:
శ్రీకృష్ణస్వామి అవతార ప్రయోజనం ముగించుకొని తన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అర్జునుడు బరువెక్కిన హృదయంతో ద్వారకకు వెళ్ళి చేయవలసిన పనులన్నీ చేసి తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. కళాకాంతులులేని ఆతని మోమును చూచి కంగారుపడి ద్వారక లోని వార్తలను అడుగుతూ ధర్మరాజు ఇలా అన్నాడు.
శా. అన్నా! ఫల్గున! భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడా
పన్నానీక శరణ్యు డీశుడు జగద్భద్రానుసంధాయి శ్రీ
మన్నవ్యాంబుజపత్రనేత్రుడు సుధర్మామధ్య పీఠంబునం
దున్నాడా? బలభద్రు గూడి సుఖియై యుత్సాహియై ద్వారకన్.
ప్రతిపదార్ధం:
అన్నా = నాయనా; ఫల్గున = అర్జునా; భక్తవత్సలుండు = భక్తులయందు; ఆపేక్ష కలవాడు; బ్రహ్మణ్యుండు = వేదధర్మమును నిలుపువాడు; గోవిందుఁడు = గోవు లకు ఆనందం కలిగించేవాడు; ఆపన్నానీక = ఆపద చెందినవారికి; శరణ్యుఁడు = శరణు వేడదగ్గవాడు; ఈశుఁడు = అధిపతి; జగత్ = జగత్తులకు; భద్ర = భద్రమును; అనుసంధాయి = కలుగజేయువాడు; శ్రీమన్నవ్యాంబుజ పత్రనేత్రుడు = శ్రీమంతమై అప్పుడే నీటిలో పుట్టిన పద్మపత్రమువంటి కన్నులు కలవాడు; సుధర్మామధ్య = సుధర్మ మండపము మధ్యన ఉన్న; పీఠంబునన్ = ఆసనమునందు; బలభద్రున్ = బలభద్రునితో; కూడి = కలిసి ఉండి; సుఖియై = సుఖముగా; ఉత్సాహియై = ఉత్సాహముతో; ద్వారకన్ = ద్వారకలో; ఉన్నాఁడా = ఉన్నాడా.
తాత్పర్యం:
నాన్నా! అర్జునా! మన సారథి మన సచివుడు ఇంకా ఎన్నెన్నో అయిన కృష్ణయ్య, భక్తులయందు పరమవాత్సల్యం కలవాడు. బ్రహ్మజ్ఞానమే ఆకారం అయినవాడు, గోవులకు ఆనందం కలిగించేవాడు, ఆపదలలో వేదనలు పొందే భక్తుల సముదాయాలకు సంరక్షణ కూర్చేవాడు. ప్రభువు, జగత్తులకు శుభాలను అమర్చిపెట్టేవాడు, చక్కని కాంతులతో అప్పుడప్పుడే వికసించిన తామర రేకులవంటి కన్నులున్న మహాత్ముడు, దేవలోకంలో సుధర్మ అనే దేవసభలో కొలువుతీరి ఉన్న దేవేంద్రునిలాగా ద్వారకలో తన కొలువులో సింహాసనం మీద అన్న బలరామునితో కూడి సుఖంగా, ఉత్సాహంగా ఉన్నాడు కదా?
1-350 మున్నుగ్రాటవిలో
సందర్భం:
ద్వారకలో శ్రీకృష్ణవాసుదేవుడు తనువు చాలించి తన ధామానికి వెళ్ళిపోయాడు. ఆయన నిత్యానందమూర్తి. కానీ భక్తులు ఆయన అవతారం చాలించటం తట్టుకోలేరుకదా! అందునా, అర్జునునివంటి నిత్యసన్నిహితుల గుండెలు కుతకుతలాడిపోతాయి కదా! అటువంటి అర్జునుని చూస్తున్న అన్న ధర్మరాజునకు గుండె బరువెక్కి పోయింది. తమ్మునితో ఇలా అంటున్నాడు.
శా. మున్నుగ్రాటవిలో వరాహమునకై ముక్కంటితో పోరుచో
సన్నాహంబున కాలకేయుల వడిం జక్కాడుచో ప్రాభవ
స్కన్నుండై చను కౌరవేంద్రు పనికై గంధర్వులం ద్రోలుచో
కన్నీరెన్నడు తేవు తండ్రి! చెపుమా! కల్యాణమే? చక్రికిన్.
ప్రతిపదార్ధం:
మున్ను = ఇంతకు ముందు; ఉగ్రాటవిలో = భయంకరమైన అడవిలో; వరాహ మునకై = పందికై; ముక్కంటితో = మూడుకన్నులు కల శివునితో; పోరుచో = యుద్ధము చేయునప్పుడు కాని; సన్నాహంబునన్ = పోరుకు దిగినప్పుడు కానీ; కాలకేయులన్ = కాలకేయులను; అనిన్ = యుద్ధములో; జక్కాడుచోన్ = చెండాడుచున్నప్పుడు కాని; ప్రాభవస్కన్నుండై = వైభవమును కోల్పోయినవాడై; చను = వెళ్లు; కౌరవేంద్రు = దుర్యో ధనుని, పనికై = పనికై; గంధర్వులన్ = గంధర్వులను; తోలుచో = పారత్రోలునప్పుడు కాని; కన్నీరు = కన్నీరు; ఎన్నడున్ = ఎప్పుడును; తేవు = తీసుకొనిరావు; తండ్రి = నాయనా; చెపుమా = చెప్పుము; చక్రికిన్ = కృష్ణునికి; కల్యాణమే = శుభమేనా.
తాత్పర్యం:
నాయనా! అర్జునా! నీకు లోగడ మహాభయంకరమైన కష్టాలు ఎన్నో వచ్చాయి. అతిభయంకరమైన అడవిలో పందికోసం మూడుకన్నుల దేవుడు పరమేశ్వరునితో పోరాడావు. కాలకేయులనే క్రూరరాక్షసులను ఒక్కడవై తుక్కుదూగరగా కొట్టావు. గుండె దిటవు చెడగొట్టుకొని గంధర్వులకు దొరకిపోయి కుమిలిపోతున్న కురుకుల సార్వభౌముడు దుర్యోధనుని కాపాడటానికి గంధర్వులను తరిమికొట్టావు. ఇంకా ఇటువంటి మహాసాహస కార్యాలు చేసిన ఏ సమయంలోనూ నీవు కన్నులలో నీరుపెట్టలేదు. చెప్పు, త్వరగా చెప్పు, బాబూ! చక్రంతో దుష్టులను తునిమితూటాడే మహాత్ముడు శ్రీకృష్ణుడు క్షేమమే కదా?
1-358 మన సారథి
సందర్భం:
అన్న మాటలు వింటున్న అర్జునునకు ఉల్లం మరింత ఎక్కువగా తల్లడిల్లిపోతున్నది. మాట పెగలటంలేదు. ఎలాగో తెముల్చుకొని కన్నీళ్ళు తుడుచుకొని నిట్టూర్పులు నిగుడుస్తూ ఇలా అన్నాడు.
కం. మన సారథి, మన సచివుడు
మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుడున్
మన విభుడు, గురువు, దేవర
మనలను దిగనాడి చనియె మనుజాధీశా!
ప్రతిపదార్ధం:
మనుజాధీశా = రాజా! మన = మన; సారథి = మార్గదర్శకుడు / రథసారథి; మన = మన; సచివుడు = మంత్రాంగము చెప్పువాడు; మన = మన; వియ్యము = వియ్యంకుడు; మన = మన; సఖుండు = స్నేహితుడు; మన = మన; బాంధవుఁడున్ = బంధువు; మన = మన; విభుడు = వైభవమునకు కారకుడు; గురుడు = పెద్ద దిక్కు; దేవర = దైవస్వరూపుడు; మనలను = మనలను; దిగనాడి = విడిచిపెట్టి; చనియెన్ = పోయాడు;
తాత్పర్యం:
మహారాజా! మనందరినీ రణరంగంలోనూ, జీవితంలోనూ భద్రంగా నడిపించిన సారథి, మనకు అవసరమైన అన్ని సమయాలలోనూ సరియైన ఆలోచనలను ఉపదేశించిన మంత్రి, మన యింటికి పిల్లనిచ్చిన సంబంధి, మన ప్రాణాలకు ప్రాణమైన చెలికాడు, మన అమ్మకు మేనల్లుడైన దగ్గరి చుట్టము, మన ప్రభువు, మన గురువు, మన దేవుడు మనలను ఇక్కడనే వదలివేసి తన దారిని తాను వెళ్ళిపోయాడయ్యా!
1-360 ఇభజిద్వీర్య
సందర్భం:
కృష్ణుడు తనకూ తనవారికీ చేసిన ఉపకారాలనూ, కంటికి రెప్పలా కాపాడిన సన్నివేశాలనూ తలచుకొనీ తలచుకొనీ, తక్కిన సోదరుల ముందర అన్నకు చెప్పుకొని కకావికలై పోతున్నాడు గాండీవి అయిన అర్జునుడు.
మ. ఇభజిద్వీర్య! మఖాభిషిక్తమగు నీ యిల్లాలి ధమ్మిల్లమున్
సభలో శాత్రవు లీడ్చినన్ ముడువ కా చంద్రాస్య దుఃఖింపగా
అభయం బిచ్చి ప్రతిజ్ఞ చేసి భవదీయారాతికాంతాశిరో
జ భరశ్రీలు హరింపడే విధవలై సౌభాగ్యముల్ వీడగన్.
ప్రతిపదార్ధం:
ఇభజిద్వీర్య = సింహమువంటి పరాక్రమము కలవాడా; మఖాభిషిక్తమగు = యజ్ఞమునందు అవభృథ స్నానం చేసినది అయినట్టి; నీ యిల్లాలి = నీ భార్య; ధమ్మిల్ల మున్ = కొప్పును; సభలో = సభలో; శాత్రవులు = శత్రువులు; ఈడ్చినన్ = ఈడ్చి లాగగా; ముడువక = ముడి వేసుకొనక; ఆ చంద్రాస్య = ఆ సుందరి; దుఃఖింపఁగా = బాధపడుతుండగా; అభయంబు = శరణు; ఇచ్చి = ఇచ్చి; ప్రతిజ్ఞ = ప్రతిన; సేసి = చేసి; భవదీయారాతి = నీ శత్రువుల; కాంతా = స్త్రీల యొక్క; శిరోజ = తలవెంట్రుకల; భర = నిండుతనము అనే; శ్రీలన్ = సంపదలను; విధవలై = భర్త పోయినవాళ్ళై; సౌభాగ్యముల్ = సౌభాగ్యములు వీడఁగన్ = తొలగిపోగా; హరింపఁడే = పోగొట్టలేదా.
తాత్పర్యం:
ఏనుగులను చీల్చిచెండాడే గొప్ప శక్తిగల సింహంవంటి పరాక్రమంగల ఓ ధర్మరాజా! నీ ధర్మపత్ని ద్రౌపది రాజసూయమూ, అశ్వమేధమూ మొదలైన మహాయజ్ఞాలు చేసినప్పుడు నీతోపాటు అవభృథ స్నానం చేసిన గొప్ప పవిత్రమూర్తి. అట్టి ఆమె కొప్పును పట్టుకొని నీచులైన నీ పగవారు ఈడ్చుకొని వచ్చారు. దానితో పగపట్టిన నాగుపామువలె చంద్రునివంటి మోముగల ఆ యిల్లాలు కొప్పును ముడవక దుఃఖంతో ఎంతోకాలం అలాగే ఉన్నది. అట్టి ఆ ఉత్తమ వనితకు అభయం ఇచ్చి ఆ పురుషోత్తముడు ఆ పరమనీచులను పరిమార్చి వారి ఇల్లాండ్రను విధవలనుగా చేస్తానని ప్రతిజ్ఞచేశాడు. ప్రతిన ననుసరించి నీ పగవారి పడతుల తలవెంట్రుకల సౌభాగ్యం అంతరించి పోయే విధంగా వారిని విధవలను చేశాడు కదా!
1-361 వైరుల్ గట్టిన
సందర్భం:
కృష్ణుడు తనవారియెడల చూపిన కారుణ్యాన్ని మళ్ళీమళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటూ అర్జునుడు అన్నగారితో ఇలా అంటున్నాడు. ద్రౌపది నిండుసభలో పొందిన పరాభవాన్నీ, దానికి శ్రీకృష్ణుడు చేసిన ప్రతిక్రియనూ ఈ పద్యంలో స్మరిస్తున్నాడు ఆ మహాత్ముడు.
శా. వైరుల్ గట్టిన పుట్టముల్ విడువగా వారింప నావల్లభుల్
రారీవేళ ఉపేక్షసేయ దగవే? రావే? నివారింపవే?
లేరే? త్రాతలు కృష్ణ! యంచు సభలో లీనాంగియై కుయ్యిడన్
కారుణ్యంబున భూరివస్త్రకలితంగా చేయడే; ద్రౌపదిన్.
ప్రతిపదార్ధం:
వైరుల్ = శత్రువులు; కట్టిన = నేను కట్టుకొన్న; పుట్టముల్ = వస్త్రములను; విడువఁగా = విప్పుతుండగా; వారింపన్ = ఆపుటకు; నా వల్లభుల్ = నా భర్తలు; రారు = వచ్చుట లేదు; ఈ వేళన్ = ఈ సమయమున; ఉపేక్షన్ = ఆలస్యమును; చేయన్ = చేయుటకు; తగవే = తగదు; రావే = రమ్ము; నివారింపవే = అడ్డగింపుము; ఏ త్రాతలు = రక్షించేవారు ఎవరూ; లేరు = లేరు; కృష్ణా = శ్రీకృష్ణా; అంచున్ = అంటూ; సభలో = సభలో; లీనాంగియై = ఒదిగిన శరీరముకలదై; కుయ్యిడన్ = మొరపెట్టుకొనగా; కారుణ్యంబున = దయతో; ద్రౌపదిన్ = ద్రౌపదిని; భూరివస్త్రకలితంగా = అత్యధికములు అయిన {భూరి - మిక్కిలి పెద్ధ సంఖ్య, 1 తరువాత 32 సున్నాలు} వస్త్రములు కలుగునట్లుగ; చేయఁడే = చేయలేదా.
తాత్పర్యం:
పగవారు పరమనీచులు. నీతిమాలినవారు. గొప్పకులంలో పుట్టి గొప్పవారిని చేపట్టిన పరమ పవిత్ర అయిన పాంచాలిని నిండుసభలో బట్టలను ఊడదీయటానికి ప్రయత్నించారు. అన్నా! కృష్ణా! నా భర్తలు ఈ నీచమైన పనిని నిలువరించటానికి రాకున్నారు. నీవు కూడా ఉపేక్ష చేస్తే ఎలా! రావయ్యా! ఈ ఘోరకృత్యాన్ని ఆపవయ్యా! నన్ను రక్షింపగలవారు ఇంకెవరూ లేరు కదయ్యా! అంటూ సభలో మొరపెట్టుకున్న ద్రౌపదికి అంతటా అన్నిటా అన్ని కాలాలలో ఉండే స్వామి పెద్దయెత్తున వస్త్రాలనిచ్చి కాపాడాడు కదయ్యా!
1-364 గురుభీష్మాదుల
సందర్భం:
అర్జునుడు శ్రీకృష్ణదేవుని కరుణను ఇంకా ఇలా తలచుకుంటూ అన్నకు విన్నవించుకుంటున్నాడు. తాను పార్థుడు. ఆయన పార్థసారథి. జగన్నాటక ప్రవర్తకుడు తనకు సారథి కావటం ఎంతటి మహాభాగ్యం!
మ. గురుభీష్మాదుల గూడి పన్నిన కురుక్షోణీశ చక్రంబులో
గురుశక్తిన్ రథయన్తయై, నొగలపై కూర్చుండి, యా మేటి నా
శరముల్ వాఱకమున్న వారల బలోత్సాహాయురుద్యోగత
త్పరతల్ చూడ్కుల సంహరించె నమితోత్సాహంబు నాకిచ్చుచున్.
ప్రతిపదార్ధం:
గురు = ద్రోణుడు; భీష్మాదులన్ = భీష్ముడు మొదలగువారితో; కూడి = కలిసి; పన్నిన = రచించిన; కురు = కౌరవవంశపు; క్షోణీశ = రాజుల; చక్రంబులో = సైనికుల దండులో; గురు = గొప్ప; శక్తిన్ = శక్తితో; రథయంతయై = సారథిగా; నొగలపై = రథమునకు ముందు భాగములో; కూర్చుండి = కూర్చొని; ఆ = ఆ; మేటి = సమర్థుడు; నా = నాయొక్క; శరముల్ = బాణములు; వాఱకముందే = వాడకముందే; వారల = వారియొక్క; బల = బలము; ఉత్సాహ = ఉత్సాహము; ఆయుః = ఆయువు; ఉద్యోగ = ప్రయత్నములు; తత్పరతల్ = లక్ష్యములను; చూడ్కులన్ = చూపులతోనే; సంహరించెన్ = నాశనము చేసి; అమిత = మిక్కిలి; ఉత్సాహంబున్ = ఉత్సాహమును; నాకు = నాకు; ఇచ్చుచున్ = పెంపొందించాడు.
తాత్పర్యం:
మనకు ఎదురు పక్షంలో ఉన్నవారు దేవతలకు కూడా అడలు పుట్టింపగల ద్రోణుడు, భీష్ముడు మొదలైనవారు. వారు గొప్పగొప్ప వ్యూహాలను పన్నుకొని పోరికి శూరులై నిలిచి ఉన్నారు. ఈ స్వామి నా రథానికి సారథి. చాలా గొప్పశక్తిని నింపుకొని బండి నొగలపై కూర్చుండినాడు. నేను నా శక్తినంతా ఉపయోగించి పగవారిమీద బాణాలు గుప్పిస్తూ ఉన్నాను. కానీ అవి ఆ పోటుమగలను చేరకముందే వారి బలాన్నీ, ఉత్సాహాన్నీ, ఆయువునూ, పూనికనూ, శ్రద్ధనూ చూపులతోనే రూపుమాపివేశాడు. ఆ పనితో నాకు పిక్కటిల్లిన ఉత్సాహాన్ని పెంపొందించాడు.
1-371 అటమటమయ్యె
సందర్భం:
శ్రీకృష్ణుని ఎడబాటును తట్టుకోలేకపోతున్నాడు మహాధీరుడైన పాండవ మధ్యముడు. ఇంద్రాదులను గూడా ధనుర్విద్యలో మెప్పించిన కిరీటి హృదయంలోని ఆరాటం అతనిని నిలువనీయటంలేదు. తన దుఃఖావేశాన్ని అన్నకు ఇలా తెలుపుకుంటున్నాడు.
చ. అటమటమయ్యె నాభజనమంతయు భూవర! నేడు చూడుమా!
యిటువలె గారవించు జగదీశుడు కృష్ణుడు లేని పిమ్మటన్
పటుతర దేహలోభమున ప్రాణములున్నవి వెంటబోక నే
కటకట! పూర్వజన్మమున కర్మము లెట్టివి చేసినాడనో!
ప్రతిపదార్ధం:
భూవర = రాజా; నా = నా యొక్క; భజనము = పూజలు; అంతయు = మొత్తమంతా; నేఁడు = ఇప్పుడు; అటమటము = వృథా; అయ్యెన్ = అయ్యెను; సూడు మా = చూడవోయి; ఇటువలె = ఇలా; గారవించు = ఆదరించు; జగదీశుఁడు = జగత్తునకు ఈశుడు; కృష్ణుఁడు = కృష్ణుడు; లేని = లేకుండా పోయిన; పిమ్మటన్ = తరువాత కూడ; పటుతర = చాలా గట్టిదైన; దేహ = శరీరము మీది; లోభమునన్ = మమకారముతో; వెంటన్ = కూడా; పోకన్ = వెళ్ళకుండా; ప్రాణములు = ప్రాణములు; ఉన్నవి = ఉన్నవి; నే = నేను; కటకట = అయ్యయ్యో; పూర్వ = క్రిందటి; జన్మమునన్ = జన్మలలో; కర్మములు = కర్మములు; ఎట్టివి = ఎటువంటివి; చేసినాఁడనో = చేసితినో కదా.
తాత్పర్యం:
ప్రభూ! చేసిన శ్రీకృష్ణ భజనమంతా బూడిదలో పోసిన పన్నీరులాగా పనికిమాలినదయిపోయింది చూడు. నన్నింతగా ప్రేమాదరాలతో లాలించిన జగన్నాథుడు, శ్రీకృష్ణుడు లేని తరువాత కూడా నా ప్రాణాలు ఈ కట్టెవంటి కాయంమీద మమకారంతో ఆయన వెంటపోకుండా నిలిచి ఉన్నాయి. పూర్వజన్మలో ఎట్టి పాడుపనులు చేసినానో కదా నేను!
1-501ఉరగాధీశ
సందర్భం:
కర్మవశంచేత ధర్మాత్ముడైన పరీక్షిన్మహారాజు శమీకుడనే మహర్షి మెడలో చచ్చిన పామును పడవైచి యింటికి పోయాడు. ఆ మహర్షి కొడుకు దానిని చూచి కుళ్ళికుళ్ళి ఏడ్చాడు. కోపం ఆపుకోలేక మా తండ్రిని ఈ విధంగా అవమానించిన పాపాత్ముడు ఏడు రోజులలో తక్షకుని విషపు మంటలలో మాడిపోవుగాక అని శపించాడు. అది తెలుసుకుని పరీక్షిత్తు పశ్చాత్తాపంతో తనను చూడవచ్చిన మహర్షులతో ఇలా అంటున్నాడు.
మ. ఉరగాధీశ విషానలంబునకు మే నొప్పింతు శంకింప నీ
శ్వరసంకల్పము నేడు మానదు; భవిష్యజ్జన్మజన్మంబులన్
హరిచింతారతియున్ హరిప్రణుతిభాషా కర్ణనాసక్తియున్
హరిపాదాంబుజసేవయున్ గలుగ మీరర్థిన్ ప్రసాదింపరే.
ప్రతిపదార్ధం:
ఉరగాధీశ = పాముల ప్రభువు తక్షకుని; విషానలంబునకు = విషము అనే అగ్నికి; మేను = నా శరీరమును; ఒప్పింతున్ = అప్పచెప్పుదును; శంకింపన్ = వెను దీయను; ఈశ్వర = ఈశ్వరునిచేత; సంకల్పము = సంకల్పించబడినది; నేఁడు = ఈవేళ; మానదు = తప్పదు; భవిష్య = భవిష్యత్తులో రాబోవు; జన్మజన్మంబులన్ = ఎల్ల జన్మల లోను; హరి = హరిని – భగవంతుని; చింతారతియున్ = స్మరించు ఆసక్తియు; హరి = భగవంతుని; ప్రణుతి = స్తోత్రము చేయు; భాష = సంభాషణములను; ఆకర్ణన = వినుట యందు; ఆసక్తియున్ = ప్రీతియును; హరి = భగవంతుని; పాద = పాదములు అను; అంబుజ సేవయున్ = పద్మములందు భక్తియు; కలుగన్ = కలుగునట్లు; మీరు = మీరు; అర్థిన్ = ఆదరముతో; ప్రసాదింపరే = ప్రసాదించండి.
తాత్పర్యం:
అయ్యలారా! ఆత్మస్వరూపులారా! నా మనవిని ఆలకించండి. పాములరాజైన తక్షకుని విషం అనే అగ్నికి నా దేహాన్ని సమర్పించుకుంటాను. అందులో ఏమాత్రమూ శంకించను. ఈశ్వరుని సంకల్పం నేడు తప్పకుండా నెరవేరుతుంది. ఇంక ముందుముందు నాకు కలుగబోయే జన్మలు ఏమయినా ఉంటే వానిలో నేను కోరుకొనేది ఒక్కటే. నా మనస్సు హరిని భావించటంలోనే ఆనందం పొందుతూ ఉండాలి. నా వాక్కు శ్రీహరిని కొనియాడటంలోనూ, నా చెవులు శ్రీహరి కీర్తనను ఆలకించటంలోనూ ఆసక్తి కలవై ఉండాలి. నా దేహం శ్రీహరి పాదపద్మాలను నిరంతరం సేవించుకుంటూ ఉండాలి. ఈ మహాభాగ్యాన్ని నాకు మీరు ప్రసాదించండి.
----------------------------------------------------------------------------
ద్వితీయ స్కంధము
2-11 గోవిందనామ
సందర్భం:
పరీక్షిత్తు చిన్న తప్పిదం వలన శాపగ్రస్తుడైనాడు. అతనికి ముక్తి పొందాలనే కోరిక చాలా గట్టిగా కలిగింది. శ్రీ శుకమహర్షి యాదృచ్ఛికంగా అతని దగ్గరకు ఏతెంచాడు. పరీక్షిత్తు తన కోరికను విన్నవించుకొన్నాడు. శుకమహర్షి అతనికి ముక్తిమార్గాన్ని ఉపదేశిస్తూ ముందుగా ఇలా అన్నాడు.
కం. గోవిందనామ కీర్తన
గావించి భయంబు దక్కి ఖట్వాంగ ధరి
త్రీ విభుడు సూఱ గొని యెను
కైవల్యము తొల్లి రెండు గడియలలోనన్.
ప్రతిపదార్ధం:
గోవింద = భగవంతుని, నామ = నామముల; కీర్తనన్ = కీర్తించుటలు; కావించి = చేసి; భయంబున్ = భయమును; తక్కి = విడిచి పెట్టి; ఖట్వాంగ = ఖట్వాం గుడు అను; ధరిత్రీవిభుఁడున్ = భూమికి ప్రభువు; కైవల్యమున్ = మోక్షమును; తొల్లి = పూర్వము; రెండు = రెండు; గడియల = గడియలు {గడియ - 24 నిముషముల కాలము}; లోనన్ = లోపల; చూర గొనియెను = సంపాదించు కొనెను.
తాత్పర్యం:
పరీక్షిన్మహారాజా! పూర్వం ఖట్వాంగుడనే మహారాజు ఉండేవాడు. ఆయన గోవింద నామాన్ని జపించి, సంసారభయాన్ని పోగొట్టుకొని రెండు గడియల కాలంలోనే ముక్తిని పొందాడు. ముక్తి అంటే పుట్టటం, చనిపోవటం అనే చక్రం మళ్ళీమళ్ళీ తిరుగుతూ ఉండటం అనే దానినుండి విడుదల పొందటం. దానినే కేవలత్వం, కైవల్యం అని కూడా అంటారు.
2-17 హరిమయము
సందర్భం:
పరీక్షిత్తునకు ముక్తిని సాధించాలననే గాఢమైన వాంఛ కలిగింది. అతనికి ఆ మహాఫలాన్ని అందించటానికి భగవంతుడే స్వయంగా పంపాడా అన్నట్లుగా అన్ని సంగాలనూ అవలీలగా వదలిపెట్టిన శుకయోగీంద్రుడు అతని దగ్గరకు వచ్చాడు. రాజు అతనిని సేవించుకొని కొన్ని ప్రశ్నలు అడిగాడు. శుకమహర్షి సమాధానాలు చెబుతూ ఇలా అన్నాడు.
కం. హరిమయము విశ్వమంతయు
హరి విశ్వమయుండు సంశయము పనిలే దా
హరిమయము గాని ద్రవ్యము
పరమాణువు లేదు వంశపావన! వింటే.
ప్రతిపదార్ధం:
వంశ = వంశమును; పావనా = పావనము చేసిన వాడా!; వింటే = తెలుసు కొంటే హరి = విష్ణువుతో; మయము = నిండినది; విశ్వము = విశ్వము - సృష్టి; అంత యున్ = సమస్తమూ; హరి = విష్ణువు; విశ్వమయుండు = విశ్వమంతా నిండినవాడు; సంశయము = సందేహించే; పని లేదు = అవసరం లేదు; ఆ = ఆ; హరి = విష్ణువుతో; మయమున్ = నిండినది; కాని = కాకుండ ఉన్న; ద్రవ్యము = వస్తువు; పర మాణువున్ = సూక్ష్మాతిసూక్ష్మం కూడా; లేదు = లేదు.
తాత్పర్యం:
నాయనా! పరీక్షిన్మహారాజా! నీవు నీ వంశాన్ని నీ పుట్టుకచేత పవిత్రం చేసినవాడవు. చూడు, పదునాలుగు లోకాల సముదాయమైన విశ్వమంతా శ్రీమహావిష్ణువుతో నిండిపోయినదే. ఆయనకంటె వేరుగా ఏమీలేదు. అంతేకాదు, ఆ హరి విశ్వమంతా నిండి సర్వమూ తానే అయి ఉన్నాడు. శ్రీహరితో వ్యాపించి ఉండని వస్తువు పరమాణు మాత్రమైనా లేదు సుమా! విన్నావా?
2-21 కమనీయ
సందర్భం:
శుకమహర్షి ఆర్తుడైన పరీక్షిన్మహారాజునకు ప్రపంచ సంబంధమైన భోగభాగ్యాల కోసం వెంపరలాడటం తగదనీ, అది మానవుణ్ణి ముక్తికి దూరం చేస్తుందనీ వివరిస్తూ ఇలా పలుకుతున్నాడు.
సీ. కమనీయ భూమిభాగములు లేకున్నవే
పడియుండుటకు దూది పఱుపు లేల?
సహజంబులగు కరాంజలులు లేకున్నవే
భోజనభాజన పుంజమేల?
వల్కలాశాజినావళులు లేకున్నవే
కట్ట దుకూల సంఘాతమేల?
కొనకొని వసియింప గుహలు లేకున్నవే
ప్రాసాదసౌధాదిపటలమేల?
తే. ఫలరసాదులు గురియవే పాదపములు?
స్వాదుజలముల నుండవే సకల నదులు
పొసఁగ భిక్షయు పెట్టరే పుణ్యసతులు
ధనమధాంధుల కొలువేల? తాపసులకు!
ప్రతిపదార్ధం:
తాపసులకు = ఋషులుకు; కమనీయ = చూడచక్కని; భూమిభాగములు = చదునైన ప్రదేశములు; లేకున్నవే = లేవా; పడియుండుటకున్ = పండుకొనుటకు; దూది = దూది; పఱుపులు = పరుపులు; ఏల = ఎందులకు; సహజంబులగు = సహజమై నట్టివి; కరాంజలులు = దోసిళ్ళు; లేకున్నవే = లేవా; భోజన = భుజించు; భాజన = పాత్రల; పుంజము = గుంపు; ఏల = ఎందులకు; వల్కలాజిన = నారచీరలు, తోలు వస్త్ర ములు; కుశావళులు = దర్భ కట్టలు - సమూహములు; లేకున్నవే = లేవా; కట్ట = కట్టు కొనుటకు; దుకూల = నాణ్యమైన పట్టుబట్టల; సంఘాతము = గుట్ట; ఏల = ఎందులకు; కొనకొని = పూని; వసి యింపన్ = నివసించుటకు; గుహలు = గుహలు; లేకున్నవే = లేవా; ప్రాసాద = మిద్దెలు; సౌధాది = మేడలు మొదలగు; పటలము = గుంపు; ఏల = ఎందులకు; పాదపములు = వృక్షములు; ఫలరసాదులు = పండ్లరసాలు మొదలగునవి; కురియవే = వర్షించవా; సకల = ఎల్ల; నదులు = నదీ నదాలు; స్వాదు = తీయని; జలములన్ = నీటితో; ఉండవే = ఉండవా; పుణ్య = పుణ్యవంతులైన; సతులు = గృహిణులు; పొసగన్ = చక్కగా; భిక్షయు = భిక్షలు; పెట్టరే = పెట్టరా; ధన = ధనము చేత కలిగిన; మద = గర్వము వలన; అంధుల = గ్రుడ్డివారైన వారిని; కొలువన్ = సేవించుట; ఏల = ఎందులకు.
తాత్పర్యం:
మహారాజా! మోక్షం అనే మహాఫలం పొందాలి. అంటే మానవుడు తపస్సును వదలిపెట్టరాదు. అట్టివారే తాపసులు. పుట్టించిన భగవంతుడు ప్రాణులు సుఖంగా జీవించటానికి అవసరమైన అన్నింటినీ ఏర్పాటుచేసి అందుబాటులో ఉంచాడు. అది గమనింపక ఏదో కావాలని ఆరాటపడుతూ జీవనకాలాన్ని వ్యర్థం చేసుకోవటం ఎంత అవివేకం? చూడు, దేహానికి సుఖాన్నిచ్చే చక్కని ప్రదేశాలు చాలా ఉన్నాయి. పడి ఉండటానికి దూదిపరుపులెందుకు? రెండు చేతులూ కలుపుకుని దోసిలిగా చేసుకొని ఏ పదార్థాన్నయినా నోటిలోనికి పెట్టుకోవచ్చు. తిండి తినటానికి పాత్రలను ప్రత్యేకించి కూర్చుకోవాలా? నారచీరలు, చనిపోయిన జంతుచర్మాలూ కావలసినంతగా దొరుకుతాయి. వానికోసం అష్టకష్టాలూపడి పట్టువస్త్రాలు సంపాదించాలా? ఉండటానికి కొండగుహలు మెండుగా ఉన్నాయి. పెద్దపెద్ద ఇండ్లను కట్టుకోవాలా? అడుగడుగునా ఎన్నో విధాలయిన చెట్లు పండ్లరసాలను కురిపిస్తున్నాయి. నదులన్నీ ఎంతో కమ్మని జలాలను అందిస్తున్నాయి. కన్నతల్లులవంటి వనితలు భిక్షపెట్టి కడుపు నింపుతారు. వీనికోసం ధనమదంతో కన్ను గానని వారిని కొలవటం ఎందుకు?
2-22 రక్షకులు
సందర్భం:
మానవుడు ముందుగా వివేకం పండించుకోవాలి. ఆత్మతత్త్వాన్ని చక్కగా తెలుసుకోవాలి. తన్ను రక్షించేవాడు భగవంతుడొక్కడే అని నిరూపిస్తున్నాడు శుకయోగీంద్రుడు.
కం. రక్షకులు లేనివారల
రక్షించెద ననుచు చక్రిరాజైయుండన్
రక్షింపు మనుచు నొక నరు
నక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞునకున్.
ప్రతిపదార్ధం:
ఆత్మజ్ఞునకున్ = ఆత్మతత్త్వము తెలిసిన జ్ఞానికి; రక్షకులున్ = కాపాడేవాళ్ళు; లేనివారల = ఎవరు లేనివాళ్ళను; రక్షించెదన్ = కాపాడుదును; అనుచు = అంటూ; చక్రి = చక్రధారి - విష్ణువు; రాజైయుండన్ = రక్షకుడై ఉండగా; రక్షింపుము = కాపాడుము; అనుచున్ = అని; ఒక = ఒక; నరునక్షము = మానవాధముని; ప్రార్థింపన్ = వేడుకొనుట; ఏల = ఎందులకు.
తాత్పర్యం:
అజ్ఞానం వలన కొందరు ‘అయ్యో! నన్ను రక్షించేవారు ఎవరున్నారు’ అని అనవసరంగా అలమటిస్తూ ఉంటారు. గొప్ప పనితనంగల సుదర్శన చక్రాన్ని పట్టుకొని విష్ణువు ‘నేను మీ అందరినీ రక్షిస్తాను’ అని పాలకుడై అన్ని కాలాలలో అన్ని దేశాలలో అండదండలిస్తూ నిలిచి ఉన్నాడు. దానిని గమనింపక ‘బాబూ! నన్ను కాపాడు’ అంటూ ఆ పనికి ఏమాత్రమూ సామర్థ్యంలేని ఒక మనిషిని దేబెరించటం ఆత్మతత్త్వం తెలిసినవానికి చేయదగిన పనికాదు.
2-51 నారాయణుని
సందర్భం:
పరీక్షిత్తు పసితనంనుండీ పరమాత్మను అర్చించే శీలం కలవాడు. శుకమహర్షి వాసుదేవునియందే మూడు కరణాలనూ చెదరకుండా నిలుపుకొన్నవాడు. అటువంటి శుకమహర్షి పరీక్షిత్తునకు విష్ణు భావనలేని దౌర్భాగ్యాన్ని ఇలా వివరిస్తున్నాడు.
సీ. నారాయణుని దివ్యనామాక్షరములపై
కరగని మనములు కఠినశిలలు
మురవైరి కథలకు ముదితాశ్రురోమాంచ
మిళితమై యుండని మేను మొద్దు
చక్రికి మ్రొక్కని జడుని యౌదల నున్న
కనకకిరీటంబు కట్టెమోపు
మాధవార్పితముగా మనని మానవుసిరి
వనదుర్గ చంద్రికావైభవంబు
ఆ. కైటఖారి భజన కలిగియుండనివాడు
గాలిలోననుండి కదులు శవము
కమలనాభు పదము గననివాని బ్రదుకు
పసిడికాయలోని ప్రాణిబ్రతుకు.
ప్రతిపదార్ధం:
నారాయణుని = విష్ణుమూర్తి యొక్క; దివ్య = దివ్యమైన; నామ = నామము లందలి; అక్షరములపై = అక్షరములయందు; కరఁగని = కరిగిపోని; మనములు = మనస్సులు; కఠినశిలలు = బండరాళ్ళు; మురవైరి = విష్ణుని; కథలకు = కథల విని; ముదితాశ్రు = ఆనందబాష్పములు, కన్నీరు; రోమాంచ = గగుర్పాటుతో; మిళితమై = కూడినదైది; ఉండని = ఉండని; మేను = శరీరము; మొద్దు = కర్రదుంగ, బండబారిన శరీరము; చక్రికి = చక్రధారికి, హరి; మ్రొక్కని = మ్రొక్కనట్టి, పూజింపని; జడుని = మూర్ఖుని; ఔదల నున్న = నెత్తిన ఉన్నట్టి; కనక = బంగారు; కిరీటంబున్ = కిరీటము; కట్టె = కర్రల; మోపు = మోపు; మాధవ = లక్ష్మీపతికి; అర్పితముగా = సమర్పంచి; మనని = బతుకని; మానవుసిరి = మానవుని శోభ, సిరిసంపదలు; వన = అడవి; దుర్గ = పొదలలో; చంద్రికా = విరిసిన వెన్నెల; వైభవము = వైభవం వంటిది; కైటభారిన్ = విష్ణుని; భజన = భక్తి; కలిగి = కలిగి; ఉండనివాడు = ఉండనట్టివాడు; గాలి = ఊపిరి, ప్రాణవాయువు; లోననుండి = లోపల ఉండి; కదలు = కదలుతూ ఉండే; శవము = శవము వంటివాడు; కమలనాభున్ = విష్ణుని; పదమున్ = పాదములను; కనని = చూడని; వాని = వాడి; బ్రతుకు = బతుకు; పసిడికాయ = మేడిపండు; లోనిప్రాణి = లోపలి పురుగు; బ్రతుకు = బతుకు లాంటిది.
తాత్పర్యం:
నారాయణ నామం దివ్యమైన నామం. ఆ నామాన్ని విని కరగని మనస్సులు బండరాళ్ళు. ఆయన మురవైరి. అంటే దుష్టులైన రక్కసులను రూపుమాపేవాడు. ఆయన కథలు వింటూ ఉంటే ఆనందబాష్పాలు జాలువారుతూ ఉంటాయి. అటువంటి ఆనందాన్ని పొందనివాని దేహం ఒక పెద్దమొద్దు. సుదర్శనం అనే చక్రాన్ని ధరించి అందరినీ కాపాడే ఆ స్వామికి మ్రొక్కనివాడు జడుడు. వాని తలమీదనున్న కిరీటం కట్టెలమోపు. మాధవుని సేవ కోసం కాకుండా బ్రతికేవాని సంపద అడవిలో కాచిన వెన్నెల. శ్రీమహావిష్ణువు భజన లేనివాడు గాలిలో కదలాడే పీనుగు. బ్రహ్మదేవుని జన్మకు కారణమైన కమలం బొడ్డునందు కల లక్ష్మీపతి పాదాలను చూడలేనివాని బ్రతుకు మేడిపండులోని పురుగు బ్రతుకు.
2-60 ఏ విభు
సందర్భం:
భగవంతుడు ఏ శక్తులను ఆశ్రయించి పెక్కురూపాలు పొందుతాడు? ఆయనకు ఈ జగత్తులను పుట్టించటం మొదలైన వినోదాలు ఎందుకు అనేటటువంటి ప్రశ్నలు పరీక్షిత్తునకు పుట్టాయి. శుకమహర్షిని అడిగాడు. సమాధానం చెప్పబోతూ ముందుగా శుకుడు ఆ పరమేశ్వరునకు నమస్కారం చేస్తున్నాడు.
ఉ. ఏ విభు వందనార్చనము లేవిభుచింతయు నామకీర్తనం
బేవిభు లీల లద్భుతము లెవ్వని సు శ్రవణంబు సేయ దో
షావలి బాసి లోకము శుభాయతవృత్తి జెలంగునండ్రు నే
నావిభు నాశ్రయించెద నఘౌఘనివర్తను భద్ర కీర్తనున్.
ప్రతిపదార్ధం:
ఏ = ఏ; విభు = ప్రభువు యొక్క; వందన = స్తుతించుటలు; అర్చనములున్ = పూజించుటలు; ఏ = ఏ; విభు = ప్రభువు యొక్క; చింతయున్ = స్మరించుటలును; నామ = నామములను; కీర్తనంబున్ = కీర్తించుటలు; ఏ = ఏ; విభు = ప్రభువు యొక్క; లీలన్ = లీలలను; అద్భుతములు = అద్భుతమైన కార్యములును; ఎప్పుడున్ = ఎల్లప్పు డును; సంశ్రవణంబున్ = చక్కగ వినుటలును; చేయన్ = చేయుచుండగ; దోషావలిన్ = దోషముల పంక్తులును; పాసి = తొలగి; లోకమున్ = లోకమున; శుభ = క్షేమములు; ఆయతవృత్తిన్ = రాబడికల విధానంగా; చెలంగున్ = వృద్ధి పొందును; అండ్రు = అంటూ ఉంటారో; నే = నేను; అఘోఘనివర్తను = పాపపు సమూహములను పోగొట్టు వానిని; భద్ర = క్షేమము కలిగించు; కీర్తనున్ = కీర్తనములు కల వానిని ఆ విభున్ = ఆ ప్రభువును; ఆశ్రయించెదన్ = ఆశ్రయిస్తాను.
తాత్పర్యం:
పరమాత్మను చక్కగా తెలుసుకున్నవారు ఆయనకు మ్రొక్కటం, పూజలు చేయటం, భావిస్తూ ఉండటం, నామజపం చేయటం, లీలలను స్మరిస్తూ ఉండటం అనే పనులు అద్భుతాలని చెబుతూ ఉంటారు. ఆయన విభుడు. కనుక అన్ని రూపాలతో మనకు కానవస్తూ ఉంటాడు. దేవదేవుడైన అతని కథలు వినటం వలన పాపాలన్నీ తొలగిపోతాయి, లోకమంతా సమస్త శుభాలతో మెలుగుతూ ఉంటుంది అని కూడా పలుకుతారు. పాపాల రాశులను పోగొట్టి శుభపరంపరలను కలుగజేసే ఆ పరమేశ్వరుని నేను ఆశ్రయిస్తాను.
2-61 ఏ పరమేశు
సందర్భం:
పరీక్షిత్తు ప్రశ్నలకు సమాధానం చెప్పబోతూ పరమాత్మ జ్ఞానాన్ని ప్రసన్నంగా తెలుసుకోవటానికీ, తెలియజెప్పటానికీ తననుతాను రూపొందించుకుంటూ శుకుడు చేస్తున్న ప్రార్థన.
ఉ. ఏ పరమేశుపాదయుగ మెప్పుడు కోరి భజించి నేర్పరుల్
లోపలి బుద్ధిలో ఉభయలోకములందున సక్తి బాసి యే
తాపము లేక బ్రహ్మగతి తారుగతశ్రములై చరింతు రే
నా పరమేశు మ్రొక్కెద నఘౌఘ నివర్తును భద్రకీర్తనున్.
ప్రతిపదార్ధం:
ఏ = ఏ; పరమేశున్ = అత్యుత్తమ ప్రభువు యొక్క; పాద = పాదముల; యుగమున్ = జంటను; ఎప్పుడున్ = ఎల్లప్పుడును; కోరి = ఇష్ట పూర్తిగ; భజించి = పూజించి, కీర్తించి; నేర్పరుల్ = నిపుణ మతులు; లోపలి = అంతర్ముఖ; బుద్ధిన్ = బుద్ది; తోన్ = తో; ఉభయ = (ఇహ పర) రెండు; లోకములు = లోకములు; అందులన్ = అందలి; సక్తిన్ = తగులములను; పాసి = తొలగించుకొని; ఏ = ఏ విధమైన; తాపమున్ = తాపములును {తాపత్రయములు - ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికము} {తాపము – తపింప జేయునది}; లేకన్ = లేకుండగ; బ్రహ్మ = పరబ్రహ్మను; గతిన్ = చేరు మార్గమును; తారు = తాము; గత = గతించిన, పోయిన; శ్రములు = శ్రమ కలవారు; ఐ = అయ్యి; చరింతురు = తిరుగుదురో; ఏన్ = నేను; ఆ = ఆ యొక్క; పరమేశున్ = సర్వేశ్వరుని; మ్రొక్కెదన్ = నమస్కరింతును, మొక్కుదును; అఘ = పాపపు; ఓఘన్ = సమూహములు; నివర్తనున్ = పోగొట్టు వానిని; భద్ర = క్షేమము కలిగించు; కీర్తనున్ = కీర్తనములు కలవానిని.
తాత్పర్యం:
వివేకం కలవారు ఆ పరమేశ్వరుని పాదాల జంటను నిరంతరమూ కోరి సేవించుకుంటూ బ్రదుకుతారు. గుండెలోపలి పొరలలో ఈ లోకానికీ, ఆ లోకానికీ చెందిన తగులాలను పోగొట్టుకుంటూ ఉంటారు. ఏ బాధలూ లేనివారై బ్రహ్మమునందే దారి కలవారై శ్రమలను దూరం చేసుకొని మెలగుతూ ఉంటారు. అలాంటి వివేకవంతుల పాపాలను పటాపంచలు చేసి ఆ పరమేశ్వరుడు వారికి శుభాలను కలిగిస్తూ ఉంటాడు. ఆయనకు నేను మ్రొక్కుతూ ఉంటాను.
2-62 తపములు చేసియైన
సందర్భం:
శుకమహర్షి తన జ్ఞాన సంపదనంతా పద్యాలనే పెట్టెలో భద్రంగా నిక్షేపించి పరీక్షిత్తునకు ఉపదేశిస్తూ పరమాత్మను ఇలా స్తుతిస్తున్నాడు.
చ. తపములు చేసియైన మఱిదానము లెన్నియు చేసియైన నే
జపములు చేసియైన ఫలసంచయ మెవ్వని చేర్పకున్న హే
యపదములై దురంత విపదంచిత రీతిగ నొప్పుచుండు న
య్యపరిమితున్ భజించెద అఘౌఘ నివర్తను భద్రకీర్తనున్.
తాత్పర్యం:
పరమాత్మ పాపాల రాశులన్నింటినీ భస్మం చేసి వేస్తాడు. ఆయనను కీర్తిస్తే సర్వశుభాలూ కలుగుతాయి. ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా వాని ఫలాలన్నింటినీ ఆ పరమాత్మునకు సమర్పించుకోవాలి. లేకపోతే అవన్నీ పాడైపోతాయి, దాటశక్యం కాని ఆపదలను కలుగజేస్తాయి. అటువంటి కీడు కలుగకుండా నన్ను కాపాడవలసిందిగా ఏ కొలతలకు అందని ఆ పరమాత్మను వేడుకుంటాను.
2-64 తపములు సేసిననో
సందర్భం:
శుకమహర్షి తన జ్ఞానసంపదనంతా పద్యాలనే పెట్టెలో భద్రంగా నిక్షేపించి పరీక్షిత్తునకు ఉపదేశిస్తూ పరమాత్మను స్తుతిస్తున్నాడు
మ. తపముల్ సేసిననో, మనోనియతినో, దానవ్రతప్రీతినో,
జపమంత్రంబులనో, శ్రుతిస్మృతులనో, సద్భక్తినో యెట్లు ల
బ్దపదుండౌ నని బ్రహ్మ రుద్ర ముఖరుల్, భావింతు రెవ్వాని న
య్యపవర్గాధిపుఁ డాత్మమూర్తి సులభుం డౌఁ గాక నా కెప్పుడున్.
ప్రతిపదార్ధం:
తపముల్ = తపస్సులు; సేసిననో = చేయుట వలన; మనస్ = మనస్సును; నియతినో = నిగ్రహించుట వలన; దాన = దానము లందు; వ్రత = వ్రతము లందు; ప్రీత్తినో = ఇష్టం వలన; జప = జపాలు చేయుట; మంత్రంబులనో = మంత్రాలు పఠించుట వలన; శ్రుతి = వేదములు; స్మృతులనో = ధర్మశాస్త్రాల వలన; సద్భక్తినో = మంచి భక్తి వలన; ఎట్లు = వీటిలో దేని వలన; లబ్ద = పొందబడిన; పదుండు = పదము, సన్నిధి కలవాడు; ఔన్ = అగును; అని = అని; బ్రహ్మ = బ్రహ్మ; రుద్ర = శివుడు; ముఖరుల్ = మొదలగు ముఖ్యులు; భావింతురు = స్మరిస్తుంటారో, విచారిస్తుంటారో; ఎవ్వనిన్ = ఎవరిని గురించి అయితే; ఆ = ఆ యొక్క; అపవర్గన్ = మోక్షమునకు; అధిపుడు = అధిపతియు; ఆత్మ = పరమాత్మ; మూర్తి = స్వరూపుడు; సులభుండు = మంచిగ అందువాడు; ఔన్ = అగుట; కాక = కావలసినది; నాకు = నాకు; ఎప్పుడున్ = ఎల్లప్పుడును.
తాత్పర్యం:
బ్రహ్మ, రుద్రుడు మొదలైన వారు పరమేశ్వరుని దివ్యసన్నిధికి ఎలా చేరగలం, తపస్సులతోనా, మనోనిగ్రహంతోనా, దానాలతోనా, వ్రతాలతోనా, జపాలతోనా, మంత్రాలతోనా, శ్రుతిస్మృతులను వల్లించడం వల్లానా, లేక ఉత్తమభక్తితోనా అని చింతిస్తు ఉంటారు. ఆట్టి ఆ మోక్షప్రభువు, ఆత్మస్వరూపుడు నాకు ఎల్లవేళలా సులభుడవుగాక.
2-81 నానాస్థావరజంగమ
సందర్భం:
శుకుడు భాగవత కథలను పరీక్షిత్తునకు వివరిస్తూ బ్రహ్మదేవునికీ, నారదునకూ అయిన సంవాదాన్ని ప్రస్తావించాడు. అందులో నారదుడు బ్రహ్మను విశ్వప్రకారం తెలియజేయ వలసినదిగా కోరగా ఆయన ఇలా అన్నాడు.
శా. నానాస్థావరజంగమ ప్రకరముల్ నాయంత నిర్మింప వి
జ్ఞానం బేమియు లేక తొట్రుపడ నిచ్చన్ నాకు సర్వానుసం
ధానారంభ విచక్షణత్వము మహోదారంబుగా నిచ్చె ము
న్నేనా యీశ్వరు నాజ్ఞ గాక జగముల్ నిర్మింప శక్తుండనే?
ప్రతిపదార్ధం:
నానా = వివిధములైన; స్థావర = కదలని ప్రాణులు; జంగమ = కదులు ప్రాణులు; ప్రకరముల్ = సమూహములను; నా = నా; అంతన్ = అంతట (నేనే); నిర్మింపన్ = సృష్టించుటకు; విజ్ఞానంబున్ = నైపుణ్యము; ఏమియున్ = ఏ మాత్రమును; లేకన్ = లేక పోవుటచే; తొట్రుపడన్ = తడబాటు పడగ; ఇచ్చన్ = తన ఇష్టప్రకారము; నాకున్ = నాకు; సర్వ = సమస్తమైన; అనుసంధాన = జతపరచే; ఆరంభ = ప్రయత్నము యొక్క; విచక్షణత్వమున్ = వివేకమును, నేర్పరితనమును; మహా = గొప్ప; ఉదారంబుగాన్ = దయతో; ఇచ్చెన్ = ఇచ్చెను; మున్ను = పూర్వము; నేన్ = నేను; ఆ = ఆ; ఈశ్వరున్ = ప్రభువు యొక్క; ఆజ్ఞన్ = ఆనతిని; కాక = కాకుండగ; జగముల్ = లోకములను; నిర్మింపన్ = నిర్మించుటకు; శక్తుండనే = శక్తి కలవాడనా ఏమిటి.
తాత్పర్యం:
నాయనా! నారదా! ఈ విశ్వం అంతా పెక్కు విధాలయిన వ్యక్తులతో, వస్తువులతో నిండి ఉన్నది. అందులో కొన్ని స్థావరాలు - కదలికలేక నిలిచి ఉండేవి. కొన్ని జంగమాలు - కదలుతూ ఉండేవి. ఇలా ఉండే వానినన్నింటినీ నా అంత నేను సృష్టి చేసే విజ్ఞానం కొంచెం కూడా లేక తికమక పడుతూ ఉన్నాను. అప్పుడు తనకు తానుగా నాకు సాక్షాత్కరించి ఆ పరమేశ్వరుడు అన్నింటినీ కూర్చుకొని నిర్మింపగల వివేకాన్ని చాలా గొప్పగా నాకు కలుగజేశాడు. ఆయన ఆజ్ఞ లేకపోతే నేను ఈ లోకాలన్నింటినీ నిర్మించే శక్తి కలవాడనా?
2-85 ఆ యీశు డనంతుడు
సందర్భం:
బ్రహ్మ నారదునితో పరమాత్మ వైభవాన్ని గూర్చి ఇలా వివరిస్తున్నాడు. సృష్టి మొదలైన కార్యాలన్నీ ఆ మహాత్మునకు ఒక ఆట అని చెప్పాడు. ఆయన సర్వమునకూ పాలకుడని చెబుతూ ఇలా అంటున్నాడు.
కం. ఆ యీశు డనంతుడు హరి
నాయకు డీ భువనములకు నాకున్ నీకున్
మాయకు ప్రాణివ్రాతము
కేయెడలన్ లేదు ఈశ్వరేతరము సుతా!
ప్రతిపదార్ధం:
సుతా = పుత్రా! నారదా!; ఆ = ఆ; ఈశుఁడు = భగవంతుడు; అనంతుడు = శాశ్వతుడు; హరి = పాపములను హరించు వాడు; నాయకుఁడు = నియామకుడు, ప్రభువు; ఈ = ఈ; భువనములకు = లోకములకు; నాకున్ = నాకును; నీకున్ = నీకును; మాయకు = మాయకు; ప్రాణివ్రాతముకు = ప్రాణుల సమూహములకు; ఏ యెడలన్ = వీటిలో ఎక్కడ కూడ; ఈశ్వరేతరము = భగవంతునికి అన్యమైనది, వేరైనది; లేదు = లేదు.
తాత్పర్యం:
నాయనా! కుమారా! నారదా! ఆ పరమాత్మ మొదలూ తుదీ లేనివాడు. ఆయనను హరి అంటారు. నాకూ, నీకూ, ఈ లోకాలన్నింటికీ ఆయనయే నాయకుడు. ఈ సృష్టిలో ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవులరాశులు అన్నింటికీ కూడా ఆయనయే నాయకుడు. దానికి ముందు మాయ అని ఒకటి ఉన్నది. మాయ అంటే ఆయన వలన ఏర్పడిన ప్రకృతియే. దానిని కూడా నడిపించే శక్తి ఆ పరమాత్మయే. ఎక్కడా కూడా ఆ పరమాత్మకంటే వేరైనది ఏదీలేదు.
2-110 పరమాత్ముం డజు
సందర్భం:
పరమాత్ముని మహిమను నారదునకు బ్రహ్మ ఇలా తెలియజేస్తున్నాడు. ఆయన దివ్యచరిత్రను భావించీ భావించీ ఆనందం పొందుతూ ఆ జ్ఞానాన్ని అమృతంలాగా కొనియాడుతూ ఇలా అంటున్నాడు.
మ. పరమాత్ముం డజు డీజగంబు ప్రతికల్పంబందు కల్పించు తా
పరిరక్షించును ద్రుంచు నట్టి యనఘున్ బ్రహ్మాత్ము నిత్యున్ జగ
ద్భరితుం గేవలు నద్వితీయుని విశుద్ధజ్ఞాను సర్వాత్ము నీ
శ్వరు నాద్యంతవిహీను నిర్గుణుని శశ్వన్మూర్తి చింతించెదన్.
ప్రతిపదార్ధం:
పరమాత్ము = పరమమైన ఆత్మ కలవానిని; అజుఁడు = పుట్టుక లేనివాడు అని, జగంబున్ = విశ్వమును; ప్రతికల్పంబందు = ప్రతి కల్పమునందును; కల్పించు = సృష్టిం చును; తా = తానే; పరిరక్షించున్ = పరిరక్షించును; త్రుంచున్ = నాశనము చేయును; అట్టి = అటువంటి; అనఘున్ = పాపము లేనివానిని; బ్రహ్మాత్ము = బ్రహ్మమే తానైన వానిని; నిత్యున్ = శాశ్వతుని; జగద్భరితుం = విశ్వమును భరించువానిని; కేవలున్ = కేవలము తానే అయినవానిని; అద్వితీయుని = తనతో సమానుడు లేనివానిని; విశుద్ధ జ్ఞాను = పరిశుద్ధమైన జ్ఞానస్వరూపుని; సర్వాత్మున్ = సమస్తమునకు ఆత్మ అయిన వానిని; ఈశ్వరున్ = భగవంతుని; ఆద్యంతవిహీనున్ = ఆది అంతములు లేనివానిని; నిర్గుణునిన్ = ఏ గుణాలు లేనివానిని; శశ్వన్మూర్తిన్ = ఎల్లప్పుడూ నిలిచి ఉండే వానిని; చింతించెదన్ = ధ్యానించెదను.
తాత్పర్యం:
నారదా! ఆయనను పరమాత్ముడు అంటాయి వేదాలు. ఎందుకంటే ఆయన అజుడు, అంటే పుట్టుక లేనివాడు. కానీ ప్రతి కల్పంలోనూ ఈ జగత్తును కల్పిస్తూ ఉంటాడు. దానిని కాపాడుతూ ఉంటాడు. కొంతకాలం తరువాత మళ్ళీ తనలో కలిపివేసుకుంటూ ఉంటాడు. ఆయనకు మనకులాగా ఏ పాపాలూ ఉండవు. ఏ కొలతలకూ అందని ఆత్మ స్వరూపుడు. జీవులకువలె మరణం ఉండదు, కనుక ఆయన నిత్యుడు. జగములన్నింటను నిండి ఉండేవాడు. ఆయనతో పోల్చిచెప్పటానికి ఆయనవంటి తత్త్వం మరొకటి ఏదీ లేదు. ఆ విధంగా ఆ పరమాత్మను అద్వితీయుడు, కేవలుడు అని వర్ణిస్తాయి వేదాలు. ఆయనది విశుద్ధమైనజ్ఞానం. ఆయన సర్వులకూ, సర్వమునకూ ఆత్మ. ఈశ్వరుడు. ఆయన మొదలూ, తుదీ లేనివాడు. ఏ గుణాలూలేనివాడు. ఎల్లప్పుడూ ఉండేవాడు. అట్టి పరమాత్మను గూర్చి భావిస్తూ ఉంటాను.
2-209 హరి పరమాత్ము
సందర్భం:
బ్రహ్మదేవుడు పరమాత్మ అయిన విష్ణువును గూర్చి తనకు తెలిసిన దానినంతటినీ నారదునకు తెలియజేస్తున్నాడు. వరుసగా అవతార విశేషాలన్నింటినీ సంగ్రహంగా చెప్పి పరమాత్మను తెలుసుకోవటం అంత సులభమైన విషయం కాదని వివరిస్తున్నాడు.
ఉ. హరి పరమాత్ము నచ్యుతు ననంతుని చిత్తములం దలంచి సు
స్థిరత విశోకసౌఖ్యముల చెందిన ధీనిధు లన్యకృత్యముల్
మరచియు చేయనొల్లరు తలంచిన నట్టిదయౌ సురేంద్రుడుం
బరువడి నుయ్యి ద్రవ్వునె పిపాసితుడై సలిలాభిలాషితన్.
ప్రతిపదార్ధం:
హరిన్ = దుఃఖములను హరించువానిని; పరమాత్మున్ = పరమమైన ఆత్మ కలవానిని; అచ్యుతున్ = పతనము లేని వానిని; అనంతుని = అంతము లేనివానిని; చిత్త ములన్ = మనసులలో; తలంచి = స్మరించుచు; సుస్థిరత = చక్కటి నిశ్చలత్వము; విశోక = శోకములేని; సౌఖ్యములన్ = సుఖములను; చెందిన = పొందినట్టి; ధీనిధులు = బుద్ధిమంతులు; అన్య = ఇతరమైన; కృత్యములు = కార్యములను; మఱచియుఁన్ = పొరపాటున కూడ; చేయనొల్లరు = చేయుటకు అంగీకరించరు; తలంచినన్ = ఆలోచించి చూస్తే; అట్టిదయౌ = అలాంటిదే అగును; సురేంద్రుఁడున్ = దేవేంద్రుడైనా (వర్షాధిపతి) పరువడి = పరుగెట్టి; నుయ్యి = నూతిని; త్రవ్వునె = తవ్వుతాడా!
తాత్పర్యం:
ఆయన హరి. సర్వాన్నీ తనలోకి తీసుకొనే స్వభావం కలవాడు. ఆయన పరమాత్మ - అంతయూ తానే అయి అంతటా వ్యాపించి ఉండేవాడు. ఆయన అనంతుడు - ఎక్కడనో అయిపోవటం అనే లక్షణం లేనివాడు. అట్టి మహాప్రభువును మనస్సులలో భావించి ఎప్పటికీ నశించినవీ, దుఃఖం అణువంత కూడా లేనివీ అయిన సుఖాలను పొందే బుద్ధిమంతులు ఇతరములైన పనులను, మరచి కూడా చేయటానికి ఇష్టపడరు. ఆలోచిస్తే అదీ అటువంటిదే. దేవేంద్రుడంతటివాడైనా దప్పిక కలిగినప్పుడు పారా, పలుగూ పట్టుకొని గబగబా నుయ్యి త్రవ్వుతాడా?!
2-211 కారణకార్యహేతువగు
సందర్భం:
భగవంతుని మహిమను నారదునికి బ్రహ్మదేవుడు ఇంకా ఇలా వివరిస్తున్నాడు. తొమ్మిది విధాలుగా భగవంతుని గుణవిశేషాలను పాడుకుంటూ ఉండటం ఒక భక్తిమార్గం. దానిలో ప్రవర్తించి దానిద్వారా పరమస్థితికి చేరుకోవాలని తెలియజేస్తున్నాడు.
ఉ. కారణకార్యహేతువగు కంజదళాక్షునికంటె నన్యు లె
వ్వారును లేరు, తండ్రి భగవంతు ననంతుని విశ్వభావనో
దారుని సద్గుణావళు లుదాత్తమతిం గొనియాడకుండినన్
చేరవు చిత్తముల్ ప్రకృతి చెందని నిర్గుణమైన బ్రహ్మమున్.
ప్రతిపదార్ధం:
కారణ = కారణమునకు; కార్య = కార్యమునకు; హేతువు = కారణభూతము, చేయించేది; అగు = అయిన; కంజదళాక్షునికంటె = విష్ణువును కంటె; అన్యులు = ఇతరులు; ఎవ్వారును = ఎవ్వరూ; లేరు = లేరు; తండ్రి = తండ్రిని; భగవంతుని = భగవంతుని అనంతునిన్ = అంతములేని వానిని; విశ్వభావనోదారుని = జగత్తును తన భావనలో నిలుపుకొన్న వానిని; సద్గుణావళులు = అట్టి గుణములను; ఉదాత్త = ఉత్తమ మైన; మతిన్ = బుద్ధితో; కొనియాడక = స్తోత్రములు చేయక; ఉండినన్ = ఉండినట్లైతే; చిత్తముల్ = మనసులు; ప్రకృతి = ప్రకృతితో; చెందని = కూడని; నిర్గుణమైన = గుణాతీతమైన; బ్రహ్మమున్ = పరబ్రహ్మమును (ముక్తిని); చేరవు = చేరలేవు.
తాత్పర్యం:
శ్రీ మహావిష్ణువును పుండరీకాక్షుడు అంటారు. బాగా వికసించిన పద్మపు విశాలమైన రేకులవంటి కన్నులున్నవాడు. సృష్టిలో ఏర్పడే ప్రతిదానిని కార్యం అంటారు. దానికి కారణం ఒకటి వేరుగా ఉంటుంది. విత్తనం కారణం. చెట్టు కార్యం. కాని పరమాత్మా, జగత్తూ రెండూ విష్ణువే. మరొకరులేరు. నాయనా! అటువంటి భగవంతునీ, అంతములేనివానినీ, లోకాల సముదాయాన్నంతటినీ భావిస్తూ ఉండేవానినీ ధ్యానిస్తూ ఉండాలి. నిజానికి ఆయనకు ఏ గుణాలూ లేవుగానీ, మనలను ఉద్ధరించటానికి ఆయన కొన్ని గుణాలు ఏర్పరచుకొని మనయందు కృపతో తెలియవస్తూ ఉంటాడు. అటువంటి గుణాలను గొప్పగా సంస్కరించుకొన్న బుద్ధితో మనం కొనియాడుతూ ఉండాలి. అలా చేయకపోతే గుణాలు లేని పరమాత్మను మన మనస్సులు చేరవు. అది చాలా పెద్ద ప్రమాదం సుమా!
2-214 ఉపవాసవ్రత
సందర్భం:
నారదునకు ఆయన తండ్రిగారైన బ్రహ్మ భక్తిని గూర్చి గట్టిగా బోధిస్తున్నాడు. అదితప్ప వేరే గతి లేదంటున్నాడు. భక్తి లేకపోతే భగవంతుని కోసం చేసే గొప్ప పనులన్నీ ఫలం లేనివైపోతాయని తెలియజేస్తున్నాడు.
మ. ఉపవాసవ్రత శౌచశీలమఖ సంధ్యోపాసనాగ్ని క్రియా
జపదానాధ్యయనాది కర్మముల మోక్షప్రాప్తి సేకూర ద
చ్చపుభక్తిన్ హరి పుండరీకనయనున్ సర్వాతిశాయిన్, రమా
ధవు పాపఘ్ను పరేశు నచ్యుతుని నర్ధిన్ గొల్వలేకుండినన్.
ప్రతిపదార్ధం:
ఉపవాస = ఉపవాస ముండుటలు; వ్రత = వ్రతదీక్షలు పట్టుట; శౌచ = శుచిత్వములు; శీల = సత్ప్రవర్తనలు; మఖ = యఙ్ఞాలు చేయుట; సంధ్యోపాసన = సంధ్యా వందనములు; అగ్నిక్రియా = హోమములు; జప = జపములు; దాన = దానములు; అధ్యయ = వేదాధ్యయనములు; ఆది = మొదలగు; కర్మములన్ = పనుల వలన; మోక్ష = మోక్షము; ప్రాప్తిన్ = పొందుట; చేకూరదు = లభింపదు; అచ్చపు = స్వచ్చమైన; భక్తిన్ = భక్తితో; హరిఁన్ = హరిని {హరి - పాపములను హరించు వాడు, విష్ణువు}; పుండరీకనయనున్ = పుండరీకాక్షుని {పుండరీకనయనుడు - పుండరీకముల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; సర్వాతిశాయిన్ = సర్వాతిశాయిని {సర్వాతిశాయి - సమస్తమును అతిశయించి (మించి) ఉండువాడు, విష్ణువు}; రమాధిపున్ = లక్ష్మీపతిని {రమాధిపుడు - రమ (లక్ష్మి) అధిపుడు (పతి), విష్ణువు}; పాపఘ్నున్ = పాపనాశనుని {పాపఘ్నుడు - పాపములను పోగొట్టు వాడు, విష్ణువు}; పరేశు = పరేశుని {పరేశుడు - పరమమున (ఉత్కృష్ట మైన గతి, ముక్తి) కి అధిపతి}; అచ్యుతునిన్ = అచ్యుతుని {అచ్యుతుడు - పతనము లేనివాడు}; అర్థిన్ = కోరి; కొల్వన్ = కొలుచుట; లేకుండినన్ = లేకపోతే.
తాత్పర్యం:
కుమారా! నారదా! మానవులు కర్మబంధాలను త్రెంచి వేసుకొని పుట్టుకా, చావూ అనే ఆగకుండా తిరుగుతూ ఉండే సంసారచక్రం నుండి బయటపడాలి. దానినే మోక్షం అంటారు. అది పొందటానికి శాస్త్రాలు కొన్ని మార్గాలను బోధించాయి. అవి ఉపవాసాలు, వ్రతాలూ, లోపలా బయటా పరిశుద్ధిని సాధించటం, మంచి శీలాన్ని పెంపొందించుకోవటం, యజ్ఞాలూ, సంధ్యావందనాలూ, అగ్నికార్యాలూ, భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండటమూ, దానాలూ, వేదాలను వల్లించటమూ మొదలైనవి. వీటిని అన్నింటినీగానీ, కొన్నింటినిగానీ శక్తిమేరకు చేస్తూనే ఉండాలి. అయితే ఒక్క విషయాన్ని గట్టిగా పట్టుకోవాలి. అది పుండరీకాక్షుడూ, అందరికంటె, అన్నింటికంటె దాటిపోయిన మహిమ కలవాడూ, లక్ష్మీపతీ, పాపాలను రూపుమాపేవాడూ, దేవతలకు కూడా దేవుడూ అచ్యుతుడూ అయిన శ్రీహరిని అచ్చమైన భక్తితో ఆరాధిస్తూ ఉండటం. అది లేకపోతే ఉపవాసాలూ మొదలైనవానితో మోక్షం కలుగదు.
2-278 హరియందు
సందర్భం:
శుకయోగీంద్రుడు పరీక్షిన్మహారాజునకు సృష్టితత్త్వాన్నీ, దానికి మూలకారణమైన పరమాత్మతత్త్వాన్నీ ఇలా తెలియజేస్తున్నాడు.
సీ. హరియందు నాకాశ మాకాశమున వాయు
వనిలంబువలన హుతాశనుండు
హవ్యవాహనునందు నంబువు లుదకంబు
వలన వసుంధర గలిగె, ధాత్రి
వలన బహుళప్రజావళి యుద్భవంబయ్యె
నింతకు మూలమై యెసగునట్టి
నారాయణుడు చిదానందస్వరూపకుం
డవ్యయు డజరు డనంతు డాఢ్యు
తే. డాది మధ్యాంతశూన్యు డనాదినిధను
డతనివలనను సంభూతమైన యట్టి
సృష్టిహేతుప్రకార మీక్షించి తెలియ
జాల రెంతటిమునులైన జనవరేణ్య!
ప్రతిపదార్ధం:
జనవరేణ్య = పరీక్షిన్మహారాజా!; హరియందు = విష్ణువునందు; ఆకాశము = ఆకాశము; ఆకాశమున = ఆకాశమునుండి; వాయువు = గాలి; అనిలంబువలన = గాలి వలన; హుతాశనుండు = అగ్ని; హవ్యవాహనునందు = అగ్నియందు; అంబువులు = నీరు; ఉదకంబువలన = నీటి వలన; వసుంధర = నేల; కలిగె = కలిగినవి; ధాత్రివలన = నేలనుండీ; బహు = వివిధమైన; ప్రజావళి = జీవులసమూహములు; ఉద్భవంబయ్యె = పుట్టుట జరిగెను; ఇంతకు = దీనంతటికి; మూలమై = మూలకారణమై; ఎసగునట్టి = అతిశయించునట్టి; నారాయణుండు = నారాయణుడు; చిదానంద స్వరూపకుండు = ఉనికీ, జ్ఞానమూ, ఆనందములే స్వరూపమైనవాడు; అవ్యయుండు = అవ్యయుడు; అజుడు = పుట్టుకలేనివాడు; అనంతుడు =అంతము లేనివాడు; ఆఢ్యుఁడు = సకల సంపదలు కలవాడు; ఆది మధ్యాంత శూన్యుడు = పుట్టుక, స్థితి, తుది లేనివాడు; అనాది నిధనుఁడు = అన్నింటికి మొదలు అయినవాడు; అతనివలనను = అతనివలన; సంభూతమైనయట్టి= పుట్టినదైనటువంటి; సృష్టి = సృష్టికి; హేతు = కారణములు; ప్రకార = విధానములు; ఈక్షించి = చూసి; ఎంతటి = ఎంతటి; మునులైన = మునులైనా; తెలియజాలరు = తెలియలేరు.
తాత్పర్యం:
మహారాజా! మహావిష్ణువునుండి మొట్టమొదట ఆకాశం ఏర్పడింది. ఆకాశంనుండి వాయువూ, వాయువునుండి అగ్నీ, అగ్నినుండి నీరూ, నీటి నుండి భూమీ ఏర్పడ్డాయి. భూమినుండి పెక్కు విధాలైన ప్రాణుల గుంపులు పుట్టుకొని వచ్చాయి. ఈ అంతటికీ మూలకారణం నారాయణుడు. నారాయణుడంటే ఉనికీ, జ్ఞానమూ, ఆనందమూ అనే మూడు మహావిషయాల రాశి. ఏ విధమైన మార్పులూ లేకుండా ఒకే తీరున ఉండేవాడు. జీవులలాగా ఆ స్వామికి ముసలితనం, మరణం ఉండవు. అందువలననే ఆయనను అందరూ అన్నివేళలా ధ్యానిస్తూ ఉంటారు. పుట్టటం, జీవించడం, పోవటం అనే వికారాలు అయనకు లేవు. ఈ సృష్టి అంతా అతని వలననే వెలువడింది. దీని తత్త్వం పట్టుకోగలగటం ఎంతటి తపశ్శక్తి కలవారికి కూడా సులభం కాదు.
2-280 ధరణీశోత్తమ
సందర్భం:
పరమాత్మ అంటే ఏమిటో విస్పష్టంగా తెలుసుకోవటానికి సహకరించే మఱికొన్ని జ్ఞానవిషయాలను శుకుడు పరీక్షిత్తునకు ఇలా తెలుపుతున్నాడు.
మ. ధరణీశోత్తమ! భూతసృష్టి నిటు సంస్థాపించి రక్షించు నా
హరి కర్తృత్వము నొల్ల కాత్మగత మాయారోపితంజేసి, తా
నిరవద్యుండు నిరంజనుండు పరుడున్ నిష్కించనుండాఢ్యుడున్
నిరపేక్షుండును నిష్కళంకు డగుచున్ నిత్యత్వమున్ బొందెడిన్.
ప్రతిపదార్ధం:
ధరణీశోత్తమ = రాజులలో శ్రేష్టుడా!; భూతసృష్టిన్ = జీవులసృష్టిని; ఇటు = ఇలా; సంస్థాపించి = చక్కగా ఏర్పరచి; రక్షించున్ = రక్షించే; ఆ హరి = ఆ హరి; కర్తృత్వమున్ = కర్తృత్వమును; ఒల్లక = అంగీకరింపక; ఆత్మగత = తనయందు; మాయారోపితన్ = మాయవలననే అని; చేసి = చేసి; తా = తాను; నిరవద్యుండు = నిందలేనివాడు; నిరంజనుండు = దోషములేనివాడు; పరుడున్ = పరుడు; నిష్కించనుడు = వెలితి లేనివాడు; ఆఢ్యుడున్ = సంపన్నుడు; నిరపేక్షుండును = దేనిని కోరనివాడు; నిష్కళంకుడు = మచ్చలేనివాడు; అగుచు = అగుచు; నిత్యత్వముం = శాశ్వతత్వమును; పొందెడిన్ = పొందుచుండును.
తాత్పర్యం:
పరీక్షిన్మహారాజా! అంతా తానే అయిన ఆ శ్రీమహావిష్ణువు ఇదంతా నావలననే జరిగింది, నేనే కర్తను అనుకోడు. తనలోని మాయ దీనికి కారణం అని తెలియజేస్తూ ఉంటాడు. దానికి అనుగుణంగా నెలకొల్పటం, కాపాడటం చేస్తూ కూడా తామరాకు మీద నీటిబొట్టులాగా అంటుసొంటులు లేకుండా ఉంటాడు. అందువలన ఆయనలో అహంకారం మొదలైన ఏ దోషాలూ ఉండవు. తగులములు ఉండవు. సృష్టి మొదలైన వానితో సంబంధంలేని పరుడై ప్రకాశిస్తాడు. తనది అంటూ ఏమీలేనివాడూ, అందరిచేత కొనియాడబడేవాడూ అయి ఉంటాడు. పూర్ణకాముడు కనుక ఆయనకు కోరదగినది ఏమీలేదు. కోరికలు తీర్చుకోవటానికి కొన్ని సందర్భాలలో పాపాలు చేయవలసివస్తుంది. ఆ విధమైన మచ్చలు ఆయనకు లేవు. కనుక ఆయన నిత్యుడు. సర్వకాలాలలో, సర్వదేశాలలో ఏ బాధలూ లేకుండా ఆనందస్వరూపుడై విరాజిల్లుతూ ఉంటాడు.
2-286 రామ! గుణాభిరామ
సందర్భం:
తెలుగుల పుణ్యాల పెట్టె అయిన పోతన మహాకవి రెండవ స్కంధం రచనను పూర్తిచేసి తన స్వామి శ్రీరామచంద్రునకు విన్నవించుకుంటూ ఆ పరమాత్మను ఈ విధంగా స్తుతిస్తున్నాడు.
ఉ. రామ! గుణాభిరామ! దినరాజకులాంబుధిసోమ! తోయద
శ్యామ! దశాననప్రబల సైన్యవిరామ! సురారిగోత్ర సు
త్రామ! సుబాహు బాహుబల దర్పతమః పటు తీవ్రధామ! ని
ష్కామ! కుభృల్లలామ! గరకంఠసతీనుతనామ! రాఘవా!
ప్రతిపదార్ధం:
రామ = శ్రీరామ; గుణాభిరామ = సద్గుణములతో ఒప్పువాడా; దినరాజ = దినమునకురాజైన సూర్యుని; కులాంబుధిసోమ = వంశమనే సముద్రమునకు చంద్రుడా; తోయదశ్యామ = మేఘము నల్లని రంగు కలవాడా; దశానన = దశకంఠుని; ప్రబలసైన్య = బలమైన సైన్యమును; విరామ = అంతము చేసినవాడా; సురారిగోత్ర = రాక్షసులనే పర్వతములకు; సుత్రామ = ఇంద్రుని వంటివాడా; సుబాహు = సుబాహుని; బాహుబల = చేతుల బలము వలని; దర్పతమః = గర్వమనే చీకటికి; పటు = మిక్కిలి; తీవ్రధామ = తీవ్రమైన కిరణములకు నివాసమైన సూర్యుని వంటివాడా; నిష్కామ = కోరికలు లేని వాడా; కుభృల్లలామ = రాజతిలకమా; కఱకంఠసతీ = నల్లనికంఠము కలవాని భార్యచేత, నుత నామ= స్థుతించు నామము కలవాడా; రాఘవా = రఘు వంశ తిలకమా! నమస్కారము.
తాత్పర్యం:
శ్రీరామా! నీగుణాలన్నీ చాలా మనోహరములయినవయ్యా! సూర్యదేవుని కులం అనే సముద్రంలో పుట్టిన చంద్రుడవు నీవు. నీలమేఘం వంటి మేనిఛాయతో అలరారుతూ ఉంటావు. పదితలల రక్కసుని పిక్కటిల్లిన బలం కల సేనలను రూపుమాపినవాడవు. దేవతల పగవారు అనే కొండలకు ఇంద్రుడవు. సుబాహువు ఆనే రాక్షసుని బాహువుల బలం వలన కలిగిన పొగరు ఒక చీకటి అయితే దానికి నీవు సూర్యుడవు. నీకు ఏ కోరికలూ లేవు. భూమిని పాలించేవారిలో మేలుబంతి అయినవాడవు. పరమేశ్వరుని యిల్లాలు పార్వతీదేవి నీ నామాన్ని నిరంతరమూ జపిస్తూ ఉంటుంది. రఘువంశం నీ వలన మహిమను పొందిందయ్యా.
-----------------------------------------------
తృతీయ స్కంధము
3-1 శ్రీమహిత
సందర్భం:
పోతనమహాకవి మూడవ స్కంధం రచనను ప్రారంభిస్తూ సంప్రదాయాన్ని అనుసరించి తన కృతిపతి అయినటువంటి శ్రీరామచంద్రుని గుణగణాలను పేర్కొంటూ ఇలా ప్రార్థిస్తున్నారు.
కం. శ్రీమహిత వినుత దివిజ
స్తోమ! యశస్సీమ! రాజసోమ! సుమేరు
స్థేమ! వినిర్జిత భార్గవ
రామ ! దశాననవిరామ! రఘుకులరామా!
ప్రతిపదార్ధం:
శ్రీ = శుభకరమైన; మహిత = మహిమ కలవాడా; వినుత = పొగడుతున్న; దివిజస్తోమ = దేవతల సమూహము కలవాడా; యశస్సీమ = కీర్తికి హద్దు అయిన వాడా; రాజసోమ = రాజులలో చంద్రుడా; సుమేరుస్థేమ = మేరుపర్వతము వంటి స్థైర్యం కలవాడా; వినిర్జిత = జయింపబడిన; భార్గవరామ = పరశురాముడు కలవాడా; దశానన విరామ = రావణుని సంహరించినవాడా; రఘుకులరామ = శ్రీరామా!
తాత్పర్యం:
వాక్కుల సంపదలతో దేవతలు గుంపులు గుంపులుగా చేరి నిన్ను స్తుతిస్తూ ఉంటారు. నీ కీర్తి చిట్టచివరి అంచులకు చేరినట్టిది. రాజులందరూ తారలు అనుకొంటే నీవు వారిలో చంద్రుడవు, బంగారుకొండవలె సుస్థిరంగా నిలువగలవాడవు. ఇరవైయొక్క పర్యాయాలు రాజులందరినీ ఊచకోతకోసిన పరశురాముడు నీ చేతిలో ఓడిపోయాడు. పదితలల పెద్ద రక్కసుడు రావణుడు నీతో పోరాడి ఘోరమైన చావు చచ్చాడు. రామా! రఘువంశం నీవలన గొప్ప మహిమను, అందచందాలనూ పొందింది. స్వామీ! అట్టి నీవు నా కవిత్వాన్ని ఆలకించి నన్ను ధన్యుణ్ణి చెయ్యి, స్వామీ!
3-30 ఏ పరమేశుచే
సందర్భం:
పరీక్షిత్తునకు శుకమహర్షి భాగవత రహస్యాలను వివరిస్తున్నాడు. అందులో భాగంగా విదురుడు ధృతరాష్ట్రునకు బోధిస్తున్న శ్రీకృష్ణుని మహిమను ఈ పద్యం మనకు తెలియజేస్తున్నది.
ఉ. ఏ పరమేశుచే జగము లీ సచరాచరకోటితో సము
ద్దీపితమయ్యె, ఏవిభుని దివ్యకళాంశజు లబ్జగర్భగౌ
రీపతి ముఖ్యదేవ మునిబృందము, లెవ్వడనంతు డచ్యుతుం
డాపురుషోత్తముండు కరుణాంబుధి కృష్ణుడు వో నరేశ్వరా!
ప్రతిపదార్ధం:
ఓ నరేశ్వరా! = ధృతరాష్ట్రమహారాజా!; ఏ = ఏ; పరమేశుచే = దేవునిచేత; జగములు = లోకములు; ఈ = ఈ; సచరాచరకోటితో = చరాచర జీవరాశులన్నీ కలిసి; సమ = చక్కగా; ఉద్దీపితమయ్యె = వెలుగచున్నవో; ఏ = ఏ; విభుని = ప్రభువుయొక్క; దివ్య = దివ్యమైన; కళాంశజులు = కళల అంశతో పుట్టినవారైన; అబ్జగర్భ = బ్రహ్మ; గౌరీపతి = శివుడు; ముఖ్య = మొదలగు; దేవముని బృందములు = దేవతలు, మునుల సమూహములు; అనంతుడు = అంతము లేనివాడు; అచ్యుతుండు = నాశనము లేని వాడు; ఎవ్వడు = ఎవడో; ఆ = ఆ; పురుషోత్తముండు = పురుషులలో ఉత్తముడు; కరుణాంబుధి = కరుణకు సముద్రుడు; కృష్ణుడు = కృష్ణుడే సుమా.
తాత్పర్యం:
ధృతరాష్ట్ర మహారాజా! శ్రీకృష్ణవాసుదేవుడు సముద్రమంతటి దయగలవాడయ్యా! ఆయన పురుషోత్తముడు; అంటే పరమాత్మ అని వేదాలు ఎవనిని కొనియాడుతున్నాయో అటువంటివాడు. అచ్యుతుడు - ఎక్కడా, ఎందునా జారుపాటులేనివాడు. అనంతుడు - అంతంలేని ఆనందమే అయినవాడు. కదులుతూ ఉండేవీ, కదలకుండా ఉండేవీ అయిన జీవరాశులతో నిండిన లోకాలన్నీ ఆ దేవునిచేతనే వెలుగొందుతూ ఉన్నాయి. లోకాలనన్నింటినీ సృష్టి చేసే బ్రహ్మదేవుడూ, లయం చేసే పరమశివుడూ, ఇంకా దేవేంద్రుడు మొదలైన దేవతలూ, జ్ఞానసంపన్నులైన మహర్షుల సముదాయాలూ ఆ మహాత్ముని కళల వలననే ఏర్పడినవారు.
3-71 అట్టి సరోజాక్షు
సందర్భం:
తీర్థయాత్రలు చేసి వచ్చిన విదురుడు శ్రీకృష్ణుని ప్రియమిత్రము ఉద్ధవుణ్ణి కలుసుకున్నాడు. ఆత్రంగా శ్రీకృష్ణాదుల క్షేమవార్తలను అడుగుతున్నాడు. ఆ సందర్భంలో వెనుక కౌరవసభకు దూతగా వచ్చినప్పటి శ్రీకృష్ణవాసుదేవుని అద్భుతమైన ప్రవృత్తిని తలచుకొని ఇలా అంటున్నాడు.
సీ. అట్టి సరోజాక్షు డాత్మీయ పదభక్తు
లడవుల నిడుమల గుడుచుచుండ
దౌత్యంబు సేయ కొందఱు విరోధులు పట్టి
బద్ధుని జేయ సన్నద్ధులైన
బలహీను మాడ్కి మార్పడ లేడ యసమర్థు
డని తలంచెదవేని అచ్యుతుండు
పరుల జయింప నోపక కాదు విద్యాభి
జన ధనమత్తులై జగతి పెక్కు
తే. బాధల నలంచు దుష్టభూపతుల నెల్ల
సైన్యయుక్తంబుగా నని సంహరించు
కొరకు సభలోన నప్పుడా కురుకుమారు
లాడు దుర్భాషణములకు నలుగడయ్యె
ప్రతిపదార్ధం:
అట్టి = అట్టి; సరోజాక్షుడు = కృష్ణుడు; ఆత్మీయ = తన; పదభక్తులు = పాదములందు భక్తి కలవారు; అడవులన్ = అడవులలో; ఇడుమలన్ = బాధలను; కుడుచుచుండ = పడుతూ ఉండగా; దౌత్యంబుసేయ = దౌత్యము చేయుచుండగా; కొందఱు = కొంతమంది; విరోధులు = శత్రువులు; పట్టి = పట్టకొని; బద్ధుని జేయ = బంధింప చేయుటకు; సన్నద్ధులైన = సిద్ధమైనవారు కాగా; బలహీనుమాడ్కి = బలము లేనివానివలె; మార్పడ లేడ = ఎదురు తిరుగలేదు; అసమర్థుడని = చేతకానివాడు అని; తలంచెదవేని = అనుకొంటే; అచ్యుతుండు = కృష్ణుడు; పరుల = ఇతరుల, శత్రువుల; జయింపన్ = గెలుచుట; ఓపకకాదు = చేతకాక కాదు; విద్య = విజ్ఞానము; అభిజన = వంశము; ధన = సంపదలవలన; మత్తులై = గర్విస్తున్నవారై; జగతి = లోకమును; పెక్కు = మిక్కిలి; బాధలన్ = బాధలతో; కలంచు = బాధించెడి; దుష్ట = చెడ్డ; భూపతులన్ = రాజులన్; ఎల్లన్ = అందరను; సైన్యయుక్తంబుగాన్ = సైన్యంతో సహా; అని = యుద్ధములో; సంహరించుకొరకు = అంతముచేయుట కోసమై; సభలోన = కురుసభలో; అప్పుడు = అప్పుడు; ఆ = ఆ; కురుకుమారుల = కురువంశము నందలి బాలురైన కౌరవులు; ఆడు = పలుకు; దుర్భాషణములకు = దుర్భాషలకు; అలుగడయ్యె = కోపం తెచ్చుకోని వాడు అయ్యాడు.
తాత్పర్యం:
ఉద్ధవా! ఆ పుండరీకాక్షుడు అడవులలో ఇడుములు పడుతున్న, తనవారైన పాండవులను గమనించాడు. వారికోసం కౌరవుల దగ్గరకు దూతగా వెళ్ళాడు. బుద్ధిలేని కొందరు అతనిని కట్టిపడవేయాలనుకొన్నారు. స్వామి వారిని అలవోకగా రూపుమాప గలడు. కానీ బలహీనునిలాగా నటించి వారిని బ్రతకనిచ్చాడు. ఎందుకంటే వారి కారణంగా దుర్మార్గులoదరినీ మట్టుపెట్టాలి. వారు తమకున్న కొద్దిపాటి చదువు, కులమూ, ధనమూ అనే వానితో పొగరెక్కి ఉన్నారు. లోకాన్ని బాధిస్తున్నారు. అట్టి దుష్టులు బంధు మిత్రపరివారంతో నాశనమైపోవాలి. దానిని మనస్సులో కుదురుకొల్పుకొని దుర్యోధనుడు మొదలైన నీచుల కాఱుకూతలను పట్టించుకోలేదు. వారిమీద అప్పటికి మాత్రం కోపాన్ని చూపలేదు.
3-72 జననంబందుటలేని
సందర్భం:
విదురుడు శ్రీకృష్ణదేవుని జన్మకర్మముల రహస్యాన్ని ఉద్ధవునకు ఈవిధంగా వివరిస్తున్నాడు. గీతలో భగవంతుడు నా జన్మమూ, నా కర్మమూ దివ్యములయ్యా అని అర్జునునకు స్వయంగా చెప్పాడు. కనుక భగవంతుని దివ్యమైన జన్మకర్మములను విదురుడు ఇలా తెలియజేస్తున్నాడు.
మ. జననంబందుటలేని యీశ్వరుడు తా జన్మించు టెల్లన్ విరో
ధినిరాసార్థము, వీతకర్ముడగు నద్దేవుండు కర్మప్రవ
ర్తను డౌటెల్ల చరాచరప్రకట భూతశ్రేణులం కర్మవ
ర్తనులం జేయ దలంచి కాక కలవే దైత్యారికిన్ కర్మముల్
ప్రతిపదార్ధం:
జననంబు = పుట్టుట; అందుటలేని = పొందటం లేనట్టి; ఈశ్వరుడు = కృష్ణుడు; తా = తాను; జన్మించుటెల్లన్ = పుట్టటమంతా; విరోధి = లోకవిరుద్ధుల; నిరాసార్థము = వధించుట కోసమే; వీతకర్ముడు = కర్మలు వీడినవాడు; అగు = అయిన; ఆ = ఆ; దేవుండు = దేవుడు; కర్మప్రవర్తనుడు = కర్మలను చేయువాడు; ఔట = అగుట; ఎల్ల = అంతా; చరాచర = కదలునవి, కదలలేనివిగా; ప్రకట = వెలువడు; భూత = జీవ; శ్రేణులన్ = రాశులను; కర్మవర్తనులం = కర్మలను అనుసరించు వారలనుగా; చేయదలంచి = చేయవలెనని అనుకొని; కాక = అలా కాకపోతే; దైత్యారికిన్ = కృష్ణునికి; కర్మముల్ కలవే = కర్మలు ఉన్నాయా?
తాత్పర్యం:
ఉద్ధవా! మనస్వామి వాసుదేవునకు పుట్టుక అనేదిలేదు. ఆయన అందరకు ఈశ్వరుడు. మఱి కృష్ణుడుగా పుట్టినాడు గదా అంటావేమో. అది జగములకు పగవారైన దుష్టులను రూపుమాపటంకోసమే. అలాగే మనకులాగా ఆయనకు చేయవలసిన పనులేవీ లేవు. కానీ ఎన్నో కర్మములు చేస్తున్నాడు. అది ఎందుకంటే లోకాలలోని స్థావరములు, జంగమములూ అయిన ప్రాణులనందరినీ వారివారికి ఏర్పడిన క్రియలలో ఎలా మెలగాలో తెలియజేయటానికి మాత్రమే. రక్కసులను మట్టుపెట్టే మహాత్ములకు కర్మలంటూ ఉంటాయా?
3-73 హరి నరుల
సందర్భం:
విదురుడు ఉద్ధవునితో శ్రీకృష్ణుని లీలాస్వరూపాన్ని గురించి యిలా చెబుతున్నాడు. ఈ పద్యం కర్మబంధంలో చిక్కుకొన్న ప్రాణులకూ, కర్మబంధాలులేని భగవంతునకూ ఉన్న భేదాన్ని చక్కగా తెలియజేస్తుంది.
కం. హరి నరుల కెల్ల పూజ్యుడు
హరి లీలా మనుజుడును గుణాతీతుడు నై
పరగిన భవ కర్మంబుల
పొరయండట, హరికి కర్మములు లీలలగున్.
ప్రతిపదార్ధం:
హరి = కృష్ణుడు; నరుల కెల్ల = మానవులకు అందరకి; పూజ్యుడు = పూజింప తగినవాడు; హరి = కృష్ణుడు; లీలా మనుజుడును = లీలకు మాత్రమే మానవుడు; గుణ = గుణములకు; అతీతుడునై = అతీతమైనవాడై; పరగిన = ప్రవర్తిల్లుటచే; భవ = సంసార; కర్మంబులన్ = కర్మములందు; పొరయండట = అంటడట; హరికి = కృష్ణునికి; కర్మములు = కర్మములు; లీలలగున్ = లీలలు అవుతాయి.
తాత్పర్యం:
మహానుభావా! ఉద్ధవా! కర్మవశం వలన పుట్టిన జీవులందరికీ శ్రీహరి పూజింప దగినవాడు. ఆయన కోరికోరి కొన్ని మహాకార్యాలను చేయటానికి భూమిపై పుడుతూ ఉంటాడు. అందువల్లే ఆయనను లీలామనుజుడు అంటారు. జీవులందరు సత్త్వము, రజస్సు, తమస్సు అనే గుణాలనుబట్టి మెలగుతూ ఉంటారు. దానివలన వారు బంధాలను వదలించుకోలేరు. కానీ శ్రీహరి గుణాలకు లోబడినవాడుకాడు. కాబట్టి ఆయనకు కర్మబంధాల అంటుసొంటులు ఉండవు. ఆయన చేసే కర్మములు ఆ విధంగా లీలలు అవుతాయి.
3-148 కనియెం
సందర్భం:
పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన సందర్భంలోని వింతలను వివరిస్తున్న ఘట్టం. శ్రీకృష్ణుడు సరస్వతీ నదీతీరంలో ఒక చెట్టు మొదట కూర్చున్నాడు. ఉద్ధవుణ్ణి బదరీవనానికి పొమ్మన్నాడు. కానీ ఉద్ధవుడు పోలేక అతనినే అనుసరించాడు. అలా ఉండగా మహాభాగవతుడైన మైత్రేయమహర్షి శ్రీకృష్ణదర్శనభాగ్యాన్ని పొందటాన్ని ఈ పద్యం మనకు తెలియజేస్తున్నది.
మ. కనియెం దాపసపుంగవుండఖిలలోకఖ్యాతవర్ధిష్ణు, శో
భనభాస్వత్పరిపూర్ణ యౌవనకళాభ్రాజిష్ణు, యోగీంద్ర హృ
ద్వనజాతైక చరిష్ణు, కౌస్తుభముఖోద్య ద్భూషణాలం కరి
ష్ణు నిలింపాహితజిష్ణు విష్ణు ప్రభవిష్ణుం కృష్ణు రోచిష్ణునిన్.
ప్రతిపదార్ధం:
తాపసపుంగవుడు = మైత్రేయుడు; అఖిలలోకఖ్యాతవర్థిష్ణు = సమస్త లోకములచే కీర్తింపబడి అతిశయించు శీలము కల కృష్ణుని; శోభన భాస్వత్పరిపూర్ణ యౌవన కళా భ్రాజిష్ణు = శుభకరమై ప్రకాశిస్తున్న నిండుజవ్వనపు శోభచే ప్రకాశించువాడైన కృష్ణుని; యోగీంద్ర హృద్వనజాతైక చరిష్ణు = యోగులలో శ్రేష్టులైన వారి హృదయపద్మములందు ఒకడై చరించువాడైన కృష్ణుని; కౌస్తుభ ముఖోద్యద్భూషణాలంకరిష్ణు = కౌస్తుభము మొదలగు ముఖ్యమైన మిక్కిలి ప్రకాశిస్తున్న భూషణములచే అలంకరింపబడిన కృష్ణుని; నిలింపాహిత జిష్ణు = దేవతలకు శత్రువులగు రాక్షసులను జయించు శీలము కల కృష్ణుని; విష్ణున్ = కృష్ణుని; ప్రభవిష్ణున్ = సృష్టియే స్వభావముకల కృష్ణుని; కృష్ణున్ = నల్లనివానిని; రోచిష్ణున్ = ప్రకాశించు స్వభావము కలవానిని; కనియెన్ = దర్శించెను.
తాత్పర్యం:
తాపసులలో తలమానికం అనదగిన మైత్రేయుడు శ్రీకృష్ణవాసుదేవుని దర్శించుకున్నాడు. ఆ మహాత్ముడు లోకాలన్నింటికీ బాగా తెలిసిన ఔన్నత్యం కలవాడు. గొప్పగా ప్రకాశించే నిండైన యౌవనపు కళతో విరాజిల్లుతున్నవాడు. మహాయోగుల హృదయాలనే కమలాలలో మాత్రమే సంచరించే శీలం కలవాడు. కౌస్తుభమూ మొదలైన దివ్యములైన భూషణాలతో అలరారుతున్నవాడు. ఇంకా విష్ణుమూర్తి. రక్కసులను ముక్కలు ముక్కలుగా నరికి ప్రోగులుపెట్టే శీలం కలవాడు. అంతటా వ్యాపించి ఉండేవాడు. సర్వకార్యాలనూ చక్కగా చేసే సామర్థ్యం కలవాడు. గొప్ప దేహకాంతితో విరాజిల్లేవాడు.
3-356 చారు పటీర
సందర్భం:
మైత్రేయుడు విదురునకు అనేక తత్త్వవిషయాలను బోధించాడు. అందులో ప్రళయకాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉండే స్థితిని ఈ పద్యం అభివర్ణిస్తున్నది.
ఉ. చారు పటీర హీర ఘనసార తుషార మరాళ చంద్రికా
పూర మృణాళ హార పరిపూర్ణ సుధాకర కాశ మల్లికా
సారనిభాంగశోభిత భుజంగమతల్పమునందు యోగని
ద్రారతి చెందియుండు జఠరస్థిత భూర్భువరాది లోకుడై
ప్రతిపదార్ధం:
చారు = చక్కటి; పటీర = చందనము, మంచిగంధము; హీర = వజ్రము; ఘనసార = కర్పూరము; తుషార = మంచుబిందువులు; మరాళ = హంస; చంద్రికా పూర = నిండు వెన్నెల; మృణాళ = తామరతూడు; హార = ముత్యాల హారము; పరిపూర్ణ = నిండుపున్నమి నాటి; సుధాకర = చంద్రుడు; కాశ = రెల్లుపువ్వు; మల్లికా = మల్లెపూల; సార = సారము; నిభ = సాటిరాగల; అంగశోభిత = శరీరముతో శోభించుచున్న; భుజంగమ = పెద్ద సర్పమైన ఆదిశేషుడు; తల్పమునందు = పాన్పు పైన; యోగనిద్రా = యోగనిద్రయందు; రతిన్ = ఆసక్తిని; జఠర = ఉదరమున; స్థిత = ఉన్నట్టి; భూర్భువరాది లోకుడై = ముల్లోకములును ధరించిన వాడై; చెందియుండున్ = పొంది ఉండును.
తాత్పర్యం:
విదురా! శ్రీహరి ప్రళయ సమయంలో మహాసముద్రంలో శేషశయ్యమీద పవ్వళించి యోగనిద్రలో హాయిగా ఉంటాడు. ఆ శేషుడు ఎంత తెల్లగా చల్లగా ఉంటాడో చెబుతాను విను. మంచిగంధంలాగా, వజ్రంలాగా, కర్పూరంలాగా, హంసలాగా, వెన్నెలలాగా, తామర తూడులలాగా, ముత్యాలహారం లాగా, నిండు చందురునిలాగా, రెల్లుపూవులలాగా, మల్లెపూవులలాగా ఉంటాడు. అలా తెల్లని కాంతులను విరజిమ్ముతున్న ఆదిశేషుణ్ణి పానుపుగా చేసుకొని పవ్వళించి ఉన్నాడు ఆ విష్ణుమూర్తి. ఆయన కడుపులో భూలోకం, భువర్లోకం, స్వర్లోకం మొదలైన లోకాలన్నీ చల్లగా ఉన్నాయి.
3-513 వరవైకుంఠము
సందర్భం:
సనకసనందనాది జ్ఞానమూర్తులు ఏ అపేక్షలూ లేనివారు. కేవలం ఆనందం కోసం శ్రీమహావిష్ణువును దర్శించుకుని పోదామని వైకుంఠ మహానగరానికి వెళ్ళారు. వారు చేరుకున్న వైకుంఠం ఎలా ఉన్నదో వివరిస్తున్నది యీ పద్యం.
మ. వరవైకుంఠము సారసాకరము, దివ్యస్వర్ణశాలాంకగో
పుర హర్మ్యావృతమైన తద్భవన మభోజంబు తన్మందిరాం
తర విభ్రాజిత భోగి కర్ణిక, తదుద్యద్భోగ పర్యంకమ
దిరవొందన్ వసియించు మాధవుడు దా నేపారు భృంగా కృతిన్
ప్రతిపదార్ధం:
వర = లోకోత్తరమైన; వైకుంఠపురము = వైకుంఠము అను నగరము; సార సాకరము = ఒక సరస్సు; దివ్య = దివ్యమైన; స్వర్ణ = బంగారపు; శాలాంక = మండపాల గోడలు; గోపుర = గోపురములు; హర్మ్య = మేడలు; ఆవృతమైన = కూడినదై; తత్ = ఆ; భవనమంభోజంబు = మందిరము పద్మమువంటిది; తన్మందిరాంతర = ఆ మందిరము లోపల; విభ్రాజిత = విలసిల్లుతున్న; భోగికర్ణిక = ఆదిశేషుడు; తత్ = ఆ; ఉద్యత్ = ఎత్తిన; భోగ = పడగలు కల; పర్యంకమందు = శయనతల్పమునందు; ఇరవొందన్ = నెలకొని; వసియించు = ఉండు; మాధవుడు = విష్ణుమూర్తి; తాన్ = అతను; ఏపారు = అతిశయిస్తున్నాడు; భృంగాకృతిన్ = తుమ్మెదవలె.
తాత్పర్యం:
వైకుంఠం చాలా మేలైనపురం. అది ఒక పద్మాల కొలను అనుకొంటే అందులోని పసిడి గోపురాలతో కూడిన మేడల మధ్యఉన్న శ్రీ మహావిష్ణువు ఉండే భవనం ఒక గొప్ప పద్మంలాగా ఉన్నది. ఆ భవనం లోపల విరాజిల్లుతున్న ఆదిశేషుడు, విష్ణువునకు సెజ్జగానుండి పద్మంలోని దుద్దులాగా కానవస్తున్నాడు. పైకి చక్కగా ఎత్తిపట్టి ఉన్న ఆ శేషుని తలలనే పానుపు మీద మాధవుడు మకరందాన్ని తనివితీరా గ్రోలటానికి వచ్చిన తుమ్మెదలాగా కనపడుతున్నాడు.
3-537 నిఖిలమునీంద్ర
సందర్భం:
వైకుంఠంలో శేషశయ్య మీద పవ్వళించియున్న శ్రీమహావిష్ణువును మన కన్నులకు కట్టే విధంగా వర్ణిస్తున్నాడు పోతన మహాకవి.
సీ. నిఖిలమునీంద్ర వర్ణిత సస్మిత ప్రస
న్నాన నాంబుజముచే నలరువాడు
విశ్రుతస్నేహార్ద్రవీక్షణ నిజభక్త
జన గుహాశఁయుడన దనరువాడు
మానిత శ్యామాయ మానవక్షమున నం
చిత వైజయంతి రాజిల్లువాడు
నతజనావన కృపామృత తరంగితములై
భాసిల్లు లోచనాబ్జములవాడు
తే. అఖిల యోగీంద్ర జనసేవ్యుడైనవాడు
సాధుజనముల రక్షింపజాలువాడు
భువనచూడా విభూషయై భూరిమహిమ
మించు వైకుంఠపురము భూషించువాడు.
ప్రతిపదార్ధం:
నిఖిల = సమస్తమైన; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్టుల చేత; వర్ణిత = కీర్తింపబడు; సస్మిత = చిరునవ్వుతో కూడిన; ప్రసన్న = ప్రసన్నమైన; ఆనన = మోము అనెడి; అంబుజము = పద్మము; చేన్ = చేత; అలరు వాడు = ఒప్పు వాడు; విశ్రుత = ప్రసిద్ది కెక్కిన; స్నేహ = ప్రేమతో; ఆర్ద్ర = చెమ్మగిలిన; వీక్షణ = కన్నులు కల; నిజ = తన; భక్తజన = భక్తులైన జనుల; గుహాశయ అన = హృదయములందు నివసించు వాడని; తనరువాడు = అతిశయించువాడు; మానిత = గౌరవింపబడిన; శ్యామాయమాన = నల్లని విశాలమైన; వక్షమున = వక్షస్థలమున; అంచిత = అలంకరింపబడిన; వైజయంతి = వైజయంతి అను మాలచేత; రాజిల్లువాడు = విరాజిల్లువాడు; నత = స్తుతి స్తున్న; జనావన = జనులను రక్షించునట్టి; కృపామృత = దయ అను అమృతంతో; తరంగితములై = తొణుకుచున్నవై; భాసిల్లు = ప్రకాశించు; లోచనాబ్జములవాడు = కన్నులు అనెడు పద్మములు కలవాడును; అఖిల = సమస్తమైన; యోగీంద్ర జన సేవ్యుం డైనవాడు = యోగులలో ఉత్తములైనవారిచే సేవింపబడువాడు; సాధుజనముల = మంచి వారిని; రక్షింప = రక్షించుటకు; చాలువాడు = సమర్థుడు; భువన = సకల భువనములకు; చూడావిభూష = శిరోమణి అను ఆభరణము వంటి; భూరిమహిమన్ = గొప్పమహిమతో; మించి = అతిశయించి; వైకుంఠపురము = వైకుంఠము అను పురమున; భూషించువాడు = ఆభరణము వంటివాడు.
తాత్పర్యం:
వైకుంఠంలో ఉన్న శ్రీమహావిష్ణువు గొప్ప మునులందరూ వర్ణించే చిరునవ్వుతో కూడిన ప్రసన్నమైన పద్మంవంటి మోముతో అలరారుతున్నారు. ప్రసిద్ధమైన చెలిమితో చెమ్మగిల్లిన కన్నులు ఉన్న తన భక్తజనులకు గుహవలె రక్షణ కల్పించే హృదయం కలవాడా అన్నట్లు ఉన్నాడు. ఆ దేహకాంతి చూడముచ్చటగా ఉంటుంది. అటువంటి దేహంలోని వక్షోభాగంలో కాంతులను విరజిమ్ముతున్న వైజయంతి అనే పూలమాల విరాజిల్లుతున్నది. తనకు మ్రొక్కులు చెల్లించే జనులను కాపాడే దయ అనే అమృతం అలలుఅలలుగా పైకి ఉబుకుతున్నదా అన్నట్లున్న పద్మాలవంటి కన్నులతో ప్రకాశిస్తున్నాడు. యోగివర్యులందరూ ఆయనను సేవించుకుంటూ అన్నివైపులా కూర్చున్నారు. ఆ వైకుంఠపురం భూమికంతటికీ ఒక గొప్ప అలంకారం అనుకుంటే దానికి అలంకారంగా వెలిగిపోతూ ఉన్న మహనీయుడు ఆ శ్రీహరి.
3-534 కటి విరాజిత
సందర్భం:
శ్రీమహావిష్ణువు మూర్తిని అక్షరాలా చిత్రపటంలో చక్కగా రూపొందించి మనకు చూపిస్తున్నాడు మహాకవి.
సీ. కటి విరాజితపీతకౌశేయశాటితో
వితతకాంచీగుణద్యుతి నటింప
ఆలంబి కంఠహారావళి ప్రభలతో
కౌస్తుభరోచులు క్రందుకొనగ
నిజకాంతిజిత తటిద్వ్రజ కర్ణకుండల
రుచులు గండద్యుతుల్ ప్రోదిసేయ
మహనీయ నవరత్నమయ కిరీట ప్రభా
నిచయంబు దిక్కుల నిండ బర్వ
తే. వైనతేయాంస విన్యస్త వామహస్త
కలిత కేయూర వలయ కంకణము లొప్ప
అన్యకరతల భ్రమణీ కృతానుమోద
సుందరాకార లీలారవింద మమర
ప్రతిపదార్ధం:
కటి = మొల ప్రాంతమున; విరాజిత = విరాజిల్లుతున్న; పీత = పచ్చని; కౌశేయ = పట్టు; శాటితో = వస్త్రముతో; వితత = మించుతున్న; కాంచీగుణ = మొల తాడు; ద్యుతి = ప్రకాశము; నటింపన్ = విరజిమ్ముతుండగా; ఆలంబి = వేలాడే; కంఠ = మెడలోని; హారావళి = హారముల వరుసలయొక్క; ప్రభలతో = ప్రకాశముతో; కౌస్తుభ రోచులు = కౌస్తుభమణి కాంతులు; క్రందుకొనగన్ = కమ్ముకొనగా; నిజకాంతి = తన ప్రకాశముచే; జిత = జయింపబడిన; తటిత్ = మెరుపుతీగల; వ్రజ = సమూహములు కల; కర్ణకుండల = చెవి కుండలముల; రుచులు = కాంతి; గండద్యుతుల్ = చెక్కిళ్ల కాంతులు; ప్రోదిసేయన్ = కలిసిపోగా; మహనీయ = గొప్ప; నవరత్నమయ = నవ రత్నములు పొదిగిన {నవ రత్నములు - తొమ్మిది జాతుల మణులు, 1 మౌక్తికము (ముత్యము) 2 పద్మరాగము (కెంపు) 3 వజ్రము 4 ప్రవాళము (పగడము) 5 మరకతము (గరుడ పచ్చ, పచ్చ) 6 నీలము 7 గోమేధికము 8 పుష్యరాగము 9 వైడూర్యము}; కిరీటప్రభా = కిరీటము యొక్క కాంతుల; నిచయంబు = సమూహములు; దిక్కులనిండ = నలుదిక్కుల నిండుగా; పర్వన్ = వ్యాపించగా; వైనతేయ = గరుత్మంతుని; అంస = మూపుపై; విన్యస్త = ఉంచబడిన; వామ = ఎడమ; హస్త = చేతికి; కలిత = ఉన్నట్టి; కేయూర = భుజకీర్తులు; వలయ = మురుగులు; కంకణముల్ = కంకణములు; ఒప్పన్ = ఒప్పియుండగా; అన్య = ఇంకొక; కరతల = అరచేతిలో; భ్రమణీకృత = తిప్పుతూ ఉన్నట్టి; అనుమోద = సంతోషముతో కూడిన; సుందర = అందమైన; ఆకార = ఆకారముతో; లీలన్ = లీలకైన; అరవిందము = పద్మము; అమరన్ = అమరి ఉండగా (ప్రకాశిస్తున్నాడు).
తాత్పర్యం:
నడుముమీద మెరిసిపోతున్న పట్టుపీతాంబరం మీద మొలత్రాడు దీప్తి చిందులు త్రొక్కుతున్నది. చాలా పొడవుగా వ్రేలాడుతున్న హారాల కాంతులను కౌస్తుభమణి కాంతులు మించిపోతున్నాయి. తన కాంతులనే మెరపుల గుంపులను జయించిన చెవులకు ఆభరణాలైన కుండలాల కాంతులను చెక్కిళ్ళ వెలుగులు మరింత పెంపొందిస్తున్నాయి. చాలా గొప్పవి అయిన తొమ్మిది రకాల రత్నాలు పొదిగిన కిరీటం ప్రభలు దిక్కులంతటా వ్యాపిస్తున్నాయి. విలాసంగా ఆస్వామి తన పాదాల దగ్గర ఉన్న గరుత్మంతుడి భుజంమీద ఎడమ చేతిని ఉంచాడు. ఆ చేతికున్న వలయాలు, కంకణాలు, కేయూరాలూ వెలుగులను వెదజల్లు తున్నాయి. రెండవ చేతితో ఒక సుందరమైన పద్మాన్ని విలాసంగా త్రిప్పుతూ ప్రకాశిస్తున్నాడు ఆ స్వామి.
3-861 భూరి మదీయమోహతమముం
సందర్భం:
తృతీయ స్కంధంలో చాలా భాగం విదుర మైత్రేయుల సంవాదం. మైత్రేయుడు విదురునకు కపిల, దేవహూతుల సంవాదాన్ని తెలియజేశాడు. అందులో తల్లి దేవహూతి కొడుకు కపిలుని వలన తత్త్వజ్ఞానం పొందిన సందర్భంలోని ఒక ఆణిముత్యాన్ని గమనిద్దాం.
ఉ. భూరి మదీయమోహతమముం బెడబాప సమర్థులన్యులె
వ్వారలు నీవు కాక? నిరవద్య! నిరంజన! నిర్వికార! సం
సారలతాలవిత్ర! బుధసత్తమ! సర్వశరణ్య! ధర్మవి
స్తారక! సర్వలోక శుభదాయక! నిత్యవిభూతి నాయకా!
ప్రతిపదార్ధం:
భూరి = అత్యధికమైన {భూరి - 1 తరవాత 34 సున్నాలు ఉండు సంఖ్య. అదే కోటి అయితే 7 సున్నాలే}; మదీయ = నా యొక్క; మోహ తమమున్ = మోహము అనెడి చీకటిని; ఎడబాప = దూరముచేయుటకు; సమర్థులు = చేయగలవారు; నీవు కాక = నీవు తప్ప; అన్యులు = ఇతరులు; ఎవ్వారలు = ఎవరు కలరు; నిరవద్య = లోపములు లేనివాడా; నిరంజన = అసహాయ దర్శనుడా; నిర్వికార = మనోవికారములు లేనివాడా; సంసార లతా లవిత్ర = సంసారమను లతలకు కొడవలి వంటివాడా; బుధసత్తమ = జ్ఞానులలో ఉత్తముడా; సర్వశరణ్య = సర్వులకును శరణ్యమైన వాడా; ధర్మవిస్తారక = ధర్మమును విస్తరించువాడా; సర్వలోక శుభదాయక = సమస్త లోకములకు శుభములు కలిగించువాడా; నిత్యవిభూతి నాయకా = శాశ్వతమైన వైభవములను నడపువాడా.
తాత్పర్యం:
నాయనా! కపిలా! నన్ను చాలా ఎక్కువైన అజ్ఞానం అనే చీకటి క్రమ్ముకొని ఉన్నది. దానిని తొలగించివేయటానికి సమర్థులు నీకంటె వేరైనవారు ఎవ్వరూలేరు. ఎందుకంటే నీవు ఏ దోషాలూ లేనివాడవు. ఏ అంటుసొంటులూ లేనివాడవు. ఏ వికారాలూ నీకు లేవు. నీవు సంసారం అనే తీగలను కోసివేయగల కొడవలివంటివాడవు. సర్వమూ తెలిసినవారిలో నీది మొదటి స్థానం. అందరకూ నీవే దిక్కు. ధర్మాన్ని పెంపొందించే దైవస్వరూపుడవు నీవు. అన్ని లోకాలకూ శుభాలను ఇవ్వగలవాడవు. ఎన్నటికీ చెడిపోని మహిమలకు నాయకుడవు.
3-952 హరిమంగళ
సందర్భం:
కపిలుడు సర్వజ్ఞానాలూ నిండుగా ఉన్నవాడు. తల్లి దేవహూతికి పరమాత్మను చేరుకోవటానికి చెందిన అన్ని యోగాలను యాగాలనూ బోధించాడు. అందులో భక్తియోగాన్ని గురించి తెలుపుతూ ఇలా అంటున్నాడు.
కం. హరిమంగళ గుణకీర్తన
పరుడై తగ నార్జవమున భగవత్పరులం
గరమనురక్తి భజించుట
నిరహంకారముగ నుంట, నిశ్చలు డగుటన్
ప్రతిపదార్ధం:
హరి = విష్ణుదేవుని; మంగళ = శుభకరమైన; గుణ = గుణములను; కీర్తన = స్తోత్రములందు; పరుడై = నిమగ్నమైన వాడై; తగన్ = అవశ్యమున్; ఆర్జవమునన్ = ఋజువర్తనలతో; భగవత్ = భగవంతుని; పరులన్ = భక్తులను; కరము = మిక్కిలి; అనురక్తిన్ = ఇష్టముతో; భజించుట = కొలచుట; నిరహంకారమునన్ = అహంకారము లేకుండగ; ఉంటన్ = ఉండుట; నిశ్చలుండు = నిశ్చలముగ ఉండు వాడుగ; అగుటన్ = అగుటచేత హరిని చేరవచ్చు.
తాత్పర్యం:
తల్లీ! నారాయణునివన్నీ మంగళగుణాలే. వానిని కొనియాడుతూ ఉండటమే తన బ్రతుకు అనుకోవాలి సాధకుడు. భగవంతుని భక్తియేతప్ప మరొకటి పట్టనివారిని భాగవతులు అంటారు. అట్టివారి విషయంలో కల్లాకపటాలు లేకుండా, అనురాగంతో వారికి సేవలందిస్తూ ఉండాలి. అహంకారం అంటే నేనే గొప్ప అనుకోవటం. అది అణువంతైనా లేకుండా ప్రవర్తించాలి. భక్తి విషయంలో చపలచిత్తం లేకుండా మెలగాలి.
3-955 అనిశము
సందర్భం:
కపిలాచార్యుడు తన తల్లి దేవహూతికి భక్తియోగాన్ని ఇంకా ఇలా వివరిస్తున్నాడు.
చ. అనిశము సర్వభూతహృదయాంబుజవర్తి యనందనర్చు నీ
శునను నవజ్ఞచేసి మనుజుం డొగి మత్ర్పతిమార్చనా విడం
బనమున మూఢుడై యుచితభక్తిని నన్ను భజింపడేని అ
మ్మనుజుడు భస్మకుండమున మానక వేల్చిన యట్టి వాడగున్.
ప్రతిపదార్ధం:
అనిశమున్ = నిత్యమును; సర్వభూత = సమస్తమైన; భూత = జీవుల; హృదయ = హృదయములను; అంబుజ = పద్మములందు; వర్తియనన్ = మెలగెడు వాడనగా; తనర్చు = అతిశయించు; ఈశున్ = భగవంతుని; నను = నన్ను; అవజ్ఞ = అవమానము; చేసి = చేసి; మనుజుండు = మానవుడు; ఒగిన్ = ఆడంబరముగ; మత్ = నా; ప్రతిమ = బొమ్మలను; అర్చనావిడంబనమున = పూజిస్తూ మోసగించుచు; మూఢుడై = మూర్ఖుడై; ఉచిత భక్తిన్ = తగిన భక్తితో; నన్ను = నన్ను; భజింపడేని = కొలువనట్లైతే; ఆ = ఆ; మనుజుండు = మానవుడు; భస్మకుండమునన్ = బూడిదగుంటలో; మానక = విడువక; వేల్చినట్టి = హోమము చేసినట్టి; వాడగున్ = వాడు అగును.
తాత్పర్యం:
అమ్మా! పరమాత్ముడనైన నేను సర్వకాలాలలో ప్రాణులందరి హృదయపద్మాలలోనే ఉంటాను. ఊరకనే ఉండటంకాదు సుమా . పరిపాలిస్తూ ఉంటాను. అట్టి నన్ను కొంచెంపాటి జ్ఞానంకూడాలేని మనిషి లెక్కచెయ్యడు. కానీ నా విగ్రహాలను ముందుపెట్టుకొని లోకం మెప్పును ఆశిస్తూ మూఢుడై మెలగుతూ ఉంటాడు. అది సరియైన భక్తికాదు. ఆ విధంగా ప్రవర్తించేవాడు బూడిదరాశిలో హోమద్రవ్యాలను వేసేవాడవుతాడు. జ్వాలలతో అలరారుతున్న అగ్నిలో హవ్యాలను వేయాలి కాని, బూడిదలో వేస్తే అది పనికిమాలినదే అవుతుంది కదా!
3-984 అనయమును
సందర్భం:
కపిల మహర్షి తల్లికి గర్భంలో పిండం ఎలా ఏర్పడుతుందో చెప్పాడు. ఆ వరుసలో తల్లి గర్భంలో ఉన్న జీవుడు భగవంతుణ్ణి ఎలా స్తుతిస్తాడో అనే విషయాన్ని కూడా వివరిస్తున్నాడు.
కం. అనయమును భువనరక్షణ
మునకై స్వేచ్ఛానురూపమున పుట్టెడి వి
ష్ణుని భయవిరహితమగు పద
వనజయుగం బర్థి కొల్తు వారనిభక్తిన్
ప్రతిపదార్ధం:
అనయమును = ఎల్లప్పుడు; భువన = లోకములను; రక్షణమునకై = కాపాడుట కొరకై; స్వేచ్ఛానురూపమున = తన యిష్టమైన రూపములో; పుట్టెడి = అవతరించెడి; విష్ణుని = ఆ విష్ణుదేవుని; భయవిరహితమగు = భయము తొలగించునట్టి; పదవనజ యుగంబు = పదములనే పద్మాలను; అర్థి = కోరికతో; వారని భక్తిన్ = నిశ్చలమైన భక్తి తో; కొల్తు = కొలుస్తూ ఉంటాను.
తాత్పర్యం:
ఆ శ్రీ మహావిష్ణువు ఎల్లకాలాలలో లోకాలన్నింటినీ కాపాడటంకోసం తన యిష్టాన్ని బట్టి అవతరిస్తూ ఉంటాడు. ఆ మహాత్ముని పాదాలు పద్మాలవంటివి. వానిని ఆశ్రయిస్తే సంసారభయం తొలగిపోతుంది. నిశ్చలమైన భక్తితో ఆ పాదపద్మాలను నేను పూజించుకొంటూ ఉంటాను.
3-994 భరమగుచున్న
సందర్భం:
తల్లిగర్భంలోపడి పెక్కుకష్టాలు అనుభవిస్తున్న జీవుడు పరమాత్మను పరమభక్తితో ఆరాధించటం తప్ప మరొక గతిలేదనుకుంటూ ఉంటాడని కపిలుడు దేవహూతికి చెబుతున్నాడు.
చ. భరమగుచున్న దుర్వ్యసనభాజనమై, ఘనదుఃఖ మూలమై
యరయగ పెక్కుతూంట్లు గలదై క్రిమిసంభవమైన యట్టిదు
స్తరబహుగర్భవాసముల సంగతి మాన్పుటకై భజించెదన్
సరసిజనాభ భూరిభవసాగరతారక పాదపద్మముల్
ప్రతిపదార్ధం:
భరమగుచున్న = భారమైనదియు; దుర్వ్యసన = చెడ్డ బాధలకు; భాజనమై = నెలవై; ఘన = అత్యధికమైన; దుఃఖమూలమై = దుఃఖమునకు కారణమై; అరయగ = తెలియగ; పెక్కు = అనేకమైన; తూంట్లు = కన్నములు; కలదై = ఉన్నదై; క్రిమి = క్రిములు; సంభవమైన = పుట్టునదైన; అట్టి = అటువంటి; దుస్తర = దాటరాని; బహు = అనేక; గర్భవాసముల్ = గర్భములందు వసించుటతో; సంగతి = కూడుటను; మాన్పుట కై = మానునట్లు చేయటంకోసం; భజించెదన్ = కొలచెదను; సరసిజనాభ = నారాయ ణుని; పాద = పాదములు అనెడి; పద్మముల్ = పద్మములు; భూరి = మిక్కిలి పెద్దదైన; భవ = సంసారము అనెడి; సాగర = సముద్రమును; తారక = తరింపజాలినవి.
తాత్పర్యం:
అయ్యయ్యో! తల్లిగర్భంలో ఉండటం ఎంత ఘోరమైన విషయం! ఎందుకంటే దానిని భరించటం చాలా కష్టం. అది చాలాచాలా వ్యసనాలకు పాదు. గొప్ప దుఃఖాలకు మూలం. అన్నీ చిల్లులే. అంతేనా అక్కడ అసహ్యమైన సూక్ష్మజీవులు పుట్టి తనచుట్టూ తిరుగుతూ బాధిస్తూ ఉంటాయి. దానినుండి తప్పించుకోవటం తేలిక పనికాదు. పైగా అటువంటివి లెక్కపెట్టటానికి కూడా సాధ్యంకానివి. అటువంటి మహాభయంకరమైన దుఃఖాన్ని తొలగించుకోవటం కోసం శ్రీ మహావిష్ణువు పాదపద్మాలను నిరంతరంగా సేవించుకొంటూ ఉంటాను. అవేకదా చాలా పెద్దది అయిన సంసారమనే సముద్రము నుండి జీవుణ్ణి తరింపజేసేవి!
3-1002 ధనపశుపుత్ర
సందర్భం:
పుట్టినజీవికి వరుసగా బంధాలు పెరిగిపోతాయి. మొదట ఆలు, తరువాత పిల్లలూ, ఇల్లూవాకిలీ, గొడ్డూగోడా ఏర్పడతాయి. అవన్నీ జీవుణ్ణి సంసారంలో కట్టిపడవేసి భగవంతుణ్ణి గుర్తించకుండా చేస్తాయి. అది ఒక భయంకరమైన చావు. దీనిని తెలుసు కోవాలి అని తల్లికి కపిలుడు తెలియజేస్తున్నాడు.
చ. ధనపశుపుత్ర మిత్ర వనితా గృహకారణభూతమైన యీ
తనువున నున్నజీవుడు పదంపడి యట్టి శరీరమెత్తినన్
అనుగతమైన కర్మఫల మందగపోవకరాదు, మింటబో
యిన భువి దూఱినన్ దిశలకేగిన ఎచ్చటనైన దాగినన్.
ప్రతిపదార్ధం:
ధన = సంపద; పశు = పశువులు; పుత్ర = పుత్రులు; మిత్ర = మిత్రులు; వనితా = భార్య; గృహ = నివాసములకు; కారణభూతమైన = కారణాంశముగా ఉన్నట్టి; ఈ = ఈ; తనువునన్ = దేహమున; ఉన్న = ఉన్నట్టి; జీవుడు = జీవుడు, దేహి; పదంపడి = తరవాత; అట్టి = అటువంటి; శరీరము = దేహమును; ఎత్తినన్ = ధరించినను; మింటబోయిన = ఆకాశమునకు వెళ్ళినను; భువి = భూమిలోనికి; దూరినన్ = దూరి పోయినా; దిశలకేగిన = దిక్కులకు పారిపోయిన; ఎచ్చటనైన = ఎక్కడయినా; డాగినన్ = దాగుకొనినను; అను గతమైన = అనుసరించునదైన; కర్మ = కర్మముల; ఫలమున్ = ఫలితమును; అందకన్ = అనుభవించకుండా; పోవగరాదు = పోవుట వీలుకాదు.
తాత్పర్యం:
ఒక్కమారు సంసారమనే ఊబిలో చిక్కుకొన్న జీవుని అవస్థ ఎలా ఉంటుందో, అమ్మా! గమనించు. వాడు ధన సంపాదనకోసం పాట్లుపడుతూ ఉంటాడు. ధనము , పశువులు, కొడుకులు, చెలికాండ్రు, స్త్రీలు, ఇళ్లు ఏర్పరచుకొంటూ ఉంటాడు. దీనికి మూలకారణం ఈ దేహం. అందులో ఉన్న జీవుడు అది పోయిన తరువాత కూడా దాని బంధాలను పోగొట్టుకోలేడు. ఆకాశంలోనికి ప్రవేశించినా, భూమిలో దూరినా, దిక్కులకు పాఱినా, ఎక్కడ దాక్కున్నా కూడా వెనుక ప్రోగుచేసుకొన్న ఫలం వెంట తగులుకొని వస్తూనే ఉంటుంది. మళ్ళీ మరొక శరీరాన్ని పొందుతూ ఉంటాడు.
3-1028 నీనామస్తుతి
సందర్భం:
కర్దమ ప్రజాపతి యిల్లాలు దేవహూతి సాక్షాత్తూ విష్ణుని అవతారమే అయిన తన కొడుకు కపిలుని వలన పరమార్థజ్ఞానం అంతా ఆకళింపు చేసుకొన్నది. ఆనందంతో ఆ పరమాత్ముని స్తోత్రం చేస్తున్నది.
కం. నీనామస్తుతి శ్వపచుం
డైనను జిహ్వాగ్రమందు ననుసంధింపన్
వానికి సరి భూసురుడుం
గానేరడు చిత్ర మిది జగంబుల నరయన్
ప్రతిపదార్ధం:
నీ = నీ యొక్క; నామ = నామములను; స్తుతి = స్తుతించుట; శ్వపచుండు = నీచకులస్తుడు {శ్వపచుడు - కుక్కలను వండుకొని తినువాడు, నీచ కులస్తుడు}; ఐనను = అయినను; జిహ్వాగ్రమందు = నాలుక చివర అయినను; అనుసంధింపన్ = తగిలించిన ఎడల; వానికి = వానికి; సరి భూసురుడుం = సమానమైన బ్రాహ్మణుడు; కానేరడు = కాలేడు; జగంబులన్ = లోకములో; అరయన్ = పరిశీలించినచో; ఇది = ఇది; చిత్రము = విచిత్రమైనది.
తాత్పర్యం:
కుమారా! కపిలుని రూపంతో కానవస్తున్న పరమాత్మా! కుక్క మాంసం వండుకొని తింటూ బ్రతికే నీచుడైనా నీ నామాలను తన నాలుక కొనమీద భద్రంగా ఉంచుకొని స్తుతిస్తే, అట్టివానికి, గొప్ప పుట్టుక కలవాడనని అహంకరించే బ్రాహ్మణుడు కూడా సాటిరాడు. గమనిస్తే ఇది ఈ లోకాలలో చాలా చిత్రమైన విషయం సుమా!
చతుర్థ స్కంధము
4-91 నెలకొని
సందర్భం:
మైత్రేయమహర్షి విదురునకు అనేక పురాణ విషయాలను ఉపదేశించాడు. వరుసలో దక్షప్రజాపతి కథ వచ్చింది. దక్షుడు సరియైన జ్ఞానంలేక పరమశివునితో పగ పెట్టుకున్నాడు. తన బిడ్డను, ఆమె భర్తనూ ఘోరంగా అవమానించాడు. తన తనయ దాక్షాయణి దానిని సహింపలేక తన దేహాన్ని అగ్నిలోవేసి బూడిద చేసుకున్నది. ఆ పనికి ముందు దక్షునకు శివ మహిమను సుదీర్ఘంగా బోధించిన సందర్భంలోనిది ఈ పద్యం.
చ. నెలకొని ధర్మపాలన వినిర్మలు భర్గు తిరస్కరించు న
క్కలుషుని జిహ్వ గోయదగు గా కటుసేయగ నోపడేని తా
పొలియుట యొప్పు, రెంటికి ప్రభుత్వము సాలమికర్ణ రంధ్రముల్
బలువుగ మూసికొంచు చన పాడి యటందురు ధర్మవర్తనుల్.
తాత్పర్యం:
ఓయీ దక్షా! ఆ పరమేశ్వరుడు పట్టుదలతో ధర్మాన్ని కాపాడటంలో దిట్ట. అందులో రవంత మాలిన్యం కూడా అంటనివాడు. అధర్మాన్ని చీల్చిచెండాడే శీలం కలవాడు. అట్టి మహాత్ముణ్ణి కాదని కాఱుకూతలు కూసే పాపాత్ముని నాలుకను ముక్కలుముక్కలుగా కోసివేయాలి. ఆ పని చేయలేకపోతే తన్నుతాను రూపుమాపుకోవాలి. అదీ చేతకాకపోతే చెవులు రెండూ గట్టిగా మూసుకొని అక్కడనుండి దూరంగా వెళ్ళిపోవాలి. ధర్మాన్ని భద్రంగా పాటించేవాళ్ళు చేసే ఉపదేశం ఇది.
ప్రతిపదార్ధం:
నెలకొని = స్థిరమైన; ధర్మపాలన = ధర్మపరిపాలన చేయు; వినిర్మలున్ = మిక్కిలి నిర్మల మైనవాని; భర్గున్ = శివుని; తిరస్కరించు = తెగడు నట్టి; ఆ = ఆ; కలుషునిన్ = పాపి యొక్క; జిహ్వన్ = నాలుకను; కోయన్ = కోసి వేయుట; తగున్ = సరి యైన పని; కాక = లేకపోతే; అటు = అలా; చేయగన్ = చేయుటకు; ఓపడు = శక్తి లేనివాడు; ఏని = అయితే; తాన్ = తనే; పొలియుట = మరణించుట; ఒప్పు = తగిన పని; రెంటికిన్ = రెండు పనులకు; ప్రభుత్వము = సామర్థ్యము; చాలమిన్ = సరిపోక పోయినచో; కర్ణ = చెవుల; రంధ్రముల్ = కన్నములను; బలువుగన్ = బలముగ; మూసికొంచున్ = మూసికొంటూ; చనన్ = వెళ్ళిపోవుట; పాడి = నీతి; అటన్ = అని; అందురు = అంటారు; ధర్మ = ధర్మము ప్రకారము; వర్తనుల్ = ప్రవర్తించువారు.
4-108 అభ్రంలిహాదభ్ర
సందర్భం:
దక్షుడు పదవీగర్వంతో పరమేశ్వరునకు ఘోరమైన అవమానం చేశాడు. సతీదేవి సహించలేక దక్షునిముందే అగ్నిలోపడి బూడిద అయిపోయింది. రుద్రుడు దక్షుని పని చూడమని వీరభద్రుణ్ణి పంపాడు. ఆ వీరభద్రుని ఆవిర్భావాన్ని అద్భుతంగా అభివర్ణిస్తున్నది యీ పద్యం.
సీ. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్ర భ్రమ
కృన్నీల దీర్ఘశరీర మమర
ప్రజ్వలజ్జ్వలనదీప్త జ్వాలికాజాల
జాజ్జ్వల్యమానకేశములు మెఱయ
చండ దిగ్వేదండ శుండాభ దోర్దండ
సాహస్రధృతి హేతిసంఘ మొప్ప
వీక్షణత్రయలోక వీక్షణ ద్యుతిలోక
వీక్షణతతి దుర్నిరీక్షముగను
క్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ
ఘన కపాలాస్థి వనమాలికలును దనర
నఖిలలోక భయంకరుఁ డగుచు వీర
భద్రుడుదయించె మాఱట రుద్రుడగుచు.
తాత్పర్యం:
ఆకాశం అంచులుముట్టే ఊపుగల కారుమేఘమా అనిపించే పొడవైన శరీరం ఒప్పారుతున్నది. భగభగా మండుతున్న అగ్నిజ్వాలలలాగా కేశములు వెలిగిపోతున్నాయి. భయం కలిగించే దిగ్గజాలు చాచిన పొడవైన తొండలా అన్నట్లున్న వేయిచేతులలోని వాడికత్తులు వేడిని క్రక్కుతూ కదలుతున్నాయి. మూడు కన్నులూ మూడు మార్తాండ బింబాలలాగా నిప్పులు క్రక్కుతూ లోకుల కన్నులకు చూడనలవికాకుండా మండిపోతున్నాయి. చాలా గట్టితనంగల రంపాలలాగా కోరలు పటపటలాడుతున్నాయి. పెద్దపెద్ద ఎముకలతో ఏర్పడిన మాలలు మెడనుండి కాళ్ళవరకూ వ్రేలాడుతున్నాయి. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయటానికై వీరభద్రుడు ఇలా మహాభయంకరంగా ఉదయించాడు.
ప్రతిపదార్ధం:
అభ్రంలిహ = ఆకాశమును నాకుచున్న; అదభ్ర = మహావిస్తారమై; విభ్రమ = పరిభ్రమిస్తున్న; అభ్ర = మేఘముల వంటి; భ్రమ కృత్ = సుడులు తిరుగుచున్న; నీల = నల్లని; దీర్ఘ = పొడవైన; శరీరము = దేహము; అమరన్ = అమరి యుండగ; ప్రజ్వల = బాగా మండుతున్న; జ్వలన = మంటల; దీప్త = వెలుగుతున్న; జ్వాలికా = మంటల; జాల = సమూహములవలె; జాజ్వల్యమాన = మండిపోతున్నట్టున్న; కేశములు = శిరోజములు; మెఱయన్ = మెరుస్తుండగ; చండ = భయంకరమైన; దిగ్వేదండ = దిగ్గజముల యొక్క; శుండా = తొండములు; అభ = వంటి; దోర్దండ = చేతులు; సాహస్ర = వేనవేలు; ధృత = ధరింపబడిన; హేతి = ఆయుధముల; సంఘము = సమూహము; ఒప్ప = ఒప్పు తుండగ; వీక్షణ = కన్నుల; త్రయ = మూడింటి; లోక = లోకములను; వీక్షణ = చూసెడిచూపుల; ద్యుతిన్ = కాంతి; లోక = లోకము లందలి; వీక్షణ = చూసేవారి; తతి = సమూహమునకు; దుర్నిరీక్ష్యముగను = చూడ శక్యము కాకుండగ. క్రకచ = ఱంపము వలె; కఠిన = కరు కైన; కరాళ = వంకర్లు తిరిగిన; దంష్ట్రలు = కోరలు; వెలుంగ = ప్రకాశిస్తుండగ; ఘన = పెద్ద; కపాల = పుర్రెలు; అస్థి = ఎముకలు కూర్చిన; వనమాలికలు = ఆకులు పూల దండలు; తనరన్ = అతిశయించగ; అఖిల = సమస్తమైన; లోక = లోకములకు; భయంకరుడు = భీకరుడు; అగుచున్ = అవుతూ; వీరభద్రుడు = వీరభద్రుడు; ఉదయించెన్ = పుట్టెను; మాఱట = రెండవ; రుద్రుడు = రుద్రుడు; అగుచున్ = అవుతూ.
4-134 భాసురలీల
సందర్భం:
దక్షయజ్ఞం సర్వనాశనం అయిపోయింది. ఆ యజ్ఞంలో పాల్గొన్న దేవతలు కూడా వీరభద్రుని ధాటికి నిలువలేకపోయారు. పరమేశ్వరుని కరుణను పొందాలనుకున్నారు. బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు. బ్రహ్మ వారందరినీ కైలాసానికి తీసుకొని వెళ్ళాడు. ఆ కైలాసం ఎలా ఉన్నదో ఈ పద్యం కమనీయంగా వివరిస్తున్నది.
ఉ. భాసురలీల గాంచిరి సుపర్వులు భక్తజనైకమానసో
ల్లాసము కిన్నరీజన విలాసము నిత్యవిభూతి మంగళా
వాసము సిద్ధగుహ్యక నివాసము రాజితభూవికాసి కై
లాసము కాంతినిర్జిత కులక్షితిభృత్సుమహద్విలాసమున్
తాత్పర్యం:
పరమేశ్వరుని భక్తుల మనస్సులకు ఉల్లాసం కలిగించే ఒకేఒక చోటు కైలాసం. అక్కడ కిన్నరకాంతల ఇంపుసొంపులు చూడముచ్చటగా ఉంటాయి. సర్వకాలాలలో వెలుగొందే వైభవాలూ, మంగళాలూ అక్కడ కానవస్తాయి. సిద్ధులూ, యక్షులూ మొదలైన దేవజాతుల వారికి అది నివాసం. వెండి వెలుగులు నిండిన భూమితో అలరారుతూ ఉంటుంది. ఆ కైలాసపర్వతం కాంతులలో ఏడు కులపర్వతాల గొప్పవిలాసాలన్నీ వెలవెలబోతూ ఉంటాయి. అటువంటి కైలాస పర్వతాన్ని దేవతలు చూచారు.
ప్రతిపదార్ధం:
భాసుర = ప్రకాశిస్తున్న; లీలన్ = విధమును; కాంచిరి = చూసిరి; సుపర్వులు = దేవతలు; భక్త = భక్తులైన; జన = జనుల; ఏక = ముఖ్యమైన; మనస్ = మనసునకు; ఉల్లాసమున్ = సంతోషమును కలిగించునది; కిన్నరీ = కిన్నరీ; జన = స్త్రీల; విలాసమున్ = విలాసముల నివాసము; నిత్య = శాశ్వతమైన; విభూతి = వైభవములకు; మంగళ = శుభములకు; ఆవాసము = నివాసము; సిద్ధ = సిద్ధులకు; గుహ్యక = గుహ్యకులకు; నివాసము = నివాసము; రాజత = వెండివంటి కాంతులను; భూ = పుట్టించి; వికాసి = వెలుగొందుచున్నది; కైలాసమున్ = కైలాసమును; కాంతి = కాంతిచేత; నిర్జిత = జయింపబడిన; కులక్షితిభృత్ = కులపర్వతముల యొక్క; సుమహత్ = చాలా గొప్ప; విభాసమున్ = ప్రకాశము గలది.
4-137 ఉజ్జ్వలంబయి
సందర్భం:
బ్రహ్మ దేవతలనందరినీ వెంటబెట్టుకొని కైలాసానికి వెళ్ళాడు. వీరభద్రుని విజృంభణకు దెబ్బతిన్న దేవతలను కాపాడమని కైలాసవాసిని ప్రార్థించాలి. అక్కడ కైలాసంలో స్వామి ఒక మఱ్ఱిచెట్టు మొదట కూర్చుని ఉన్నాడు. ఏ కొలతలకూ అందని స్వామికి ఆధార భూమి అయిన ఆ మఱ్ఱిచెట్టు ఎంత మహిమ కలదియో ఈ పద్యం వివరిస్తున్నది.
సీ. ఉజ్జ్వలంబయి శతయోజనంబుల పొడ
వొగి పంచసప్తతి యోజనముల
పఱపును గల్గి యే పట్టున తఱుగని
నీడ శోభిల్ల నిర్ణీతమగుచు
పర్ణశాఖా సమాకీర్ణమై మాణిక్య
ముల పోలగలఫలముల తనర్చి
కమనీయ సిద్ధయోగ క్రియామయమయి
యనఘ ముముక్షు జనాశ్రయంబు
తే. భూరి సంసారతాప నివార కంబు
నగుచు తరురాజమనగ పెంపగ్గలించి
భక్తజనులకు నిచ్చలు ప్రమద మెసగ
వలయు సంపదలందు నావటము వటము
తాత్పర్యం:
స్వామి కూర్చున్న ఆ మఱ్ఱిచెట్టు కాంతులను విరజిమ్ముతున్నది. నూరు ఆమడల పొడవు, డెబ్బది అయిదు యోజనాల వైశాల్యంతో ఒప్పారుతున్నది. ఏవేళనయినా దాని నీడ తఱుగదు. ఆకులు, కొమ్మలు దట్టంగా ఏర్పడి ఉన్నాయి. దాని పండ్లు మాణిక్యాలను తలపింపజేస్తున్నాయి. సొంపైన సిద్ధులు అక్కడ యోగక్రియలను హాయిగా చేసుకుంటారు. ఆవిధంగా ముక్తిని కోరేవారికి అది విడిదిపట్టు. ఘోరమైన సంసారతాపాన్ని అది రూపుమాపుతుంది. ఇన్ని కారణాలుగా అది వృక్షాలకు రాజుగా పేరొందింది. భక్తులకు పరమానందాన్ని కలిగిస్తుంది. కోరిన సంపదలను కూర్పగల మహావృక్షం ఆ మఱ్ఱిచెట్టు.
ప్రతిపదార్ధం:
ఉజ్జ్వలంబు = ప్రకాశిస్తున్నది; అయి = అయ్యి; శత = వంద (100); యోజనంబుల = యోజనముల; పొడవును = పొడవు; పంచసప్తతి = డెబ్బై ఐదు (75); యోజనముల = యోజనముల; పఱపును = వెడల్పును; కల్గి = కలిగి ఉండి; ఏపట్టున = ఎక్కడైన; తిరుగని = వెనుతగ్గని; నీడ = నీడ; శోభిల్లన్ = శోభిల్లుట; నిర్ణీతము = నిశ్చయము; అగుచున్ = అవుతూ; పర్ణ = ఆకులతోను; శాఖా = కొమ్మలతోను; సమ = చక్కగా; ఆకీర్ణము = వ్యాపించినది; ఐ = అయ్యి; మాణిక్యములన్ = మణులను; పోలన్ = సరి పోల్చుటకు; కల = తగిన; ఫలములన్ = పండ్లతో; తనర్చి = అతిశయించి; కమనీయ = మనోహరమైన; సిద్ధ = సిద్ధుల; యోగ = యోగమునకు చెందిన; క్రియా = క్రియలతో; మయ = కూడినట్టిది; అయి = అయ్యి; అనఘ = పుణ్యు లైన; ముముక్షు = మోక్షము కోరెడి; జన = వారికి; ఆశ్రయంబు = ఆస్థానమైనదియును;
భూరి = అత్యధిక మైన; సంసార = సంసారమునకు చెందిన; తాప = బాధలను; నివారకంబును = పోగొట్టునది; అగుచున్ = అవుతూ; తరు = వృక్షములలో; రాజము = శ్రేష్ట మైనది, పెద్దది; అనగన్ = అనగా; పెంపగ్గలించి = అతిశయించి; భక్త = భక్తు లైనట్టి; జనుల్ = వారి; కున్ = కి; నిచ్చలున్ = నిత్యము; ప్రమదము = సంతోషము; ఎసగ = అతిశయించుటకు; వలయు = కావలసిన; సంపదలన్ = సౌఖ్యాలు; అందు = కలిగి ఉండుటలో, అందించుటకు; ఆవటము = నివాసము; వటము = మఱ్ఱిచెట్టు.
4-139 ఇద్ధసనందాది
సందర్భం:
సర్వోత్కృష్టమయిన మఱ్ఱిచెట్టు క్రింద ధ్యానంలో కూర్చున్న మహాదేవుణ్ణి దర్శించుకోవటానికి మహాకవి మనకు ఒక పరమసుందరమైన అక్షరచిత్రాన్ని అందిస్తున్నారు.
సీ. ఇద్ధసనందాది సిద్ధసంసేవితు
శాంతవిగ్రహుని వాత్సల్యగుణుని
కమనీయలోక మంగళదాయకుని, శివు
విశ్వబంధుని జగద్వినుత యశుని
గుహ్యక సాధ్యరక్షోయక్షనాథ కు
బేరసేవితుని దుర్వారబలుని
ఉదితవిద్యా తపోయోగయుక్తుని బాల
చంద్ర భూషణుని మునీంద్ర నుతుని
తే. తాపసాభీష్టకరు భస్మదండలింగ
ఘనజటాజినధరుని, భక్తప్రసన్ను
వితతసంధ్యాభ్రరుచి విడంబిత వినూత్న
రక్తవర్ణు, సనాతను బ్రహ్మమయుని!
తాత్పర్యం:
శ్రీ దక్షిణామూర్తి మహాస్వామిని తేజస్సుతో వెలుగొందే సనందుడు మొదలైన సిద్ధులు చక్కగా సేవించుకుంటున్నారు. ఆయన నిలువెల్లా నిండుగా ఉన్న శాంతాకారం కలవాడు. అందరియందూ, అన్నింటియందూ, తల్లికి బిడ్డలయందు ఉండే వాత్సల్యం ఆయనలో కానవస్తున్నది. లోకంలో అందరికీ శుభాలను కలిగించేస్వామి శివుడు. విశ్వానికి బంధువు. లోకాలన్నీ ఆయన కీర్తిని ఎల్లవేళలా కొనియాడుతూ ఉంటాయి. గుహ్యకులు, సాధ్యులు, రక్షస్సులు, యక్షులు అనే దేవజాతుల వారికందరికీ ఏలిక అయిన కుబేరుడు ఆయనను భక్తితో సేవిస్తున్నాడు. ఆ ప్రభువు బలాన్ని ఎవ్వరూ నిలువరించలేరు. పైకి పొంగుకొని వస్తున్న విద్యలూ, తపస్సూ, యోగమూ అతని సొమ్ములు. నెలవంక ఆయన తలపై అలంకారంగా విరాజిల్లుతున్నది. మునీంద్రులు నోరారా ఆ స్వామిని కొనియాడుతున్నారు. తపస్వుల కోరికలన్నీ ఆయన వలన తీరుతున్నాయి. భక్తులయెడల ప్రసన్నంగా ఉంటాడు. సంజకెంజాయలను మరపింపజేసే ఎర్రని కాంతులతో చూడముచ్చటగా ఉన్నాడు. సనాతనుడు. సాక్షాత్తూ పరబ్రహ్మమే.
ప్రతిపదార్ధం:
ఇద్ధ సనందాది సిద్ధ సంసేవితు = శివుని {ఇద్ధ సనందాది సిద్ధ సంసేవితుడు - ఇద్ధ (ప్రసిద్ధులైన) సనంద (సనందుడు) ఆది (మొదలైన) సిద్ధ (సిద్ధులచే) సంసేవితుడు (చక్కగా సేవించబడు తున్నవాడు), శివుడు}; శాంత విగ్రహుని = శివుని {శాంత విగ్రహుడు – శాంత స్వరూపము కలవాడు, శివుడు}; వాత్సల్య గుణునిఁ = శివుని {వాత్సల్య గుణుడు - వాత్యల్య(సంతానము యెడనుండు స్నేహభావము) పూరిత మైన గుణములు కలవాడప, శివుడు}; కమనీయ లోక మంగళ దాయకుని = శివుని {కమనీయ లోక మంగళ దాయకుడు - కమనీయ (మనోహర మైన) లోక (విశ్వ జనీన) మంగళ (శుభములను) దాయకుడు (ఇచ్చువాడు, శివుని}; శివు = శివుని; విశ్వ బంధుని = శివుని {విశ్వ బంధువు - లోకమునకు మంచి కోరువాడు, శివుడు}; జగ ద్వినుత యశుని = శివుని {జగ ద్వినుత యశుడు - విశ్వమున వినుత (ప్రసిద్ధ మైన) యశస్సు కలవాడు, శివుడు}; గుహ్యక సాధ్య రక్షో యక్షనాథ కుబేర సేవితుని = శివుని {గుహ్యక సాధ్య రక్షో యక్షనాథ కుబేర సేవితుడు –గుహ్యకులచే సాధ్యులచే రాక్షసులచే యక్షలకునాయకుడైన కుబేరునిచే సేవింపబడువాడు, శివుడు}; దుర్వార బలుని = శివుని {దుర్వార బలుడు – వారింప శక్యముకాని బలము కలవాడు, శివుడు}; ఉదిత విద్యా తపో యోగ యుక్తుని = శివుని {ఉదిత విద్యా తపో యోగ యుక్తుడు - ఉద్భవించిన విద్యలు తపస్సు యోగములుతో కూడినవాడు, శివుడు}; బాలచంద్ర భూషణుని = శివుని {బాలచంద్ర భూషణుడు - బాలచంద్రుడు (చంద్రవంక) భూషణముగ కలవాడు, శివుడు}; మునీంద్ర నుతుని = శివుని {మునీంద్ర నుతుడు – మునులలో శ్రేష్ఠులచే నుతింప బడువాడు, శివుడు};
తాప సాభీష్ట కరుని = శివుని {తాప సాభీష్ట కరుడు – తస్సులు చేసే వారి కోరికలు తీర్చే వాడు, శివుడు}; భస్మ దండ లింగ ఘనజటాజిన ధరుని = శివుని {భస్మ దండ లింగ ఘనజటాజిన ధరుడు - భస్మము (విభూతి) దండము లింగము ఘన (గొప్ప) జటలు అజిన (లేడి చర్మము) ధరించినవాడు, శివుడు}; భక్త ప్రసన్ను = శివుని {భక్త ప్రసన్నుడు - భక్తుల యెడ ప్రసన్నముగ యుండువాడు, శివుడు}; వితత సంధ్యాభ్ర రుచి విడంబిత వినూత్న రక్త వర్ణు = శివుని {వితత సంధ్యాభ్ర రుచి విడంబిత వినూత్న రక్త వర్ణుడు - వితత (విస్తార మైన) సంధ్యాకాల అభ్ర (మేఘము) ని పోలిన వినూత్న (ప్రశస్త మైన) రక్త(ఎర్రని) వర్ణుడు (రంగు వాడు), శివుడు}; సనాతను = శివుని {సనాతనుడు - శాశ్వతుడు, శివుడు}; బ్రహ్మ మయుని = శివుని {బ్రహ్మ మయుడు - బ్రహ్మ స్వరూపుడు, శివుడు}.
4-140 అంచితవామ
సందర్భం:
బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు మొదలైన మహాత్ములు శ్రీ దక్షిణామూర్తి అయిన మహాదేవుని ఇలా సందర్శించుకుంటున్నారు.
సీ. అంచితవామ పాదాంభోరుహము దక్షి
ణోరుతలంబున నొయ్య నునిచి
సవ్యజానువుమీద భవ్యబాహువు సాచి
వలపలి ముంజేత సలలితాక్ష
మాలిక ధరియించి మహనీయ తర్క ము
ద్రా యుక్తుడగుచు చిత్తంబులోన
అవ్యయంబయిన బ్రహ్మానందకలిత స
మాధినిష్ఠుడు వీతమత్సరుండు
యోగపట్టాభిరాముడై ఉచితవృత్తి
రోషసంగతి బాసి కూర్చున్న జముని
యనువునను దర్భరచిత బ్రుస్యాసనమున
నున్న మునిముఖ్యు నంచితయోగ నిరతు.
తాత్పర్యం:
ఆ దక్షిణామూర్తి మహాదేవుడు. తన ఎడమకాలిని కుడి తొడపై చక్కగా పెట్టుకొని ఉన్నాడు. ఎడమ మోకాలిమీదికి చేతిని చాపి ఉంచాడు. కుడి ముంజేతితో మిక్కిలి సుకుమారమైన స్ఫటికమాలను పట్టుకొని ఉన్నాడు. కుడిచేతితో చాలా గొప్పభావాన్ని తలపించే జ్ఞానముద్రను ప్రదర్శిస్తున్నాడు. ఆ జ్ఞానమూర్తిని పరిశీలిస్తుంటే ఆయన హృదయంలో బ్రహ్మానందం తాండవిస్తున్న స్ఫూర్తి కలుగుతుంది. మాత్సర్యం ఏమాత్రమూ లేనివాడు. యమధర్మరాజు రోషాన్నంతటినీ వదలించుకొని యోగపీఠం మీద పట్టాభిషిక్తుడై ఉన్నాడా అనిపిస్తున్నాడు. దర్భలతో అల్లిన ఆసనంమీద కూర్చుండి యోగసంపదను నిరంతరంగా సంపాదించుకుంటున్నాడు. అట్టి దక్షిణామూర్తిని బ్రహ్మాదులు సందర్శించుకున్నారు.
ప్రతిపదార్ధం:
అంచిత = ఒప్పుతున్న; వామ = ఎడమ; పాద = పాదము అనెడి; అంభోరుహమున్ = పద్మమును {అఁబోరుహము - అంబువు (నీట) ఊరుహము (పుట్టునది), పద్మము}; దక్షిణ = కుడి; ఊరు = తొడ; తలంబునన్ = ప్రదేశము నందు; ఒయ్యన = తీర్పుగ; ఉనిచి = ఉంచి; = సవ్య = ఎడమ; జానువు = మోకాలి; మీద = పైన; భవ్య = శుభ మైన; బాహువు = హస్తమును; సాచి = చాచి; వలపలి = కుడి; ముంజేత = మంజేతి యందు; సలలిత = అంద మైన; అక్ష మాలిక = జపమాల; ధరియించి = ధరించి; మహనీయ = గొప్ప; తర్క ముద్రా = ధ్యానముద్రతో; యుక్తుడు = కూడినవాడు; అగుచున్ = అవుతూ; చిత్తంబు = మనసు; లోనన్ = అందు; అవ్యయంబు = తరుగనిది; ఐన = అయిన; బ్రహ్మానంద = బ్రహ్మానందముతో; సంకలిత = కూడిన; సమాధి = సమాధి; నిష్ఠుడు = నిష్ఠ కలవాడు; వీత = తొలగిన; మత్సరుండు = మాత్సర్యము కలవాడు;
యోగ = యోగము; పట్టాభిరాముడు = అందు ఒప్పుతున్న వాడు; ఐ = అయ్యి; ఉచిత = తగిన; వృత్తి = విధముగ; రోష = రోషము ఎడల; సంగతిన్ = సంగము నుండి; పాసి = దూరమై; కూర్చున్న = కూర్చుని ఉన్న; జముని = యముని; అనువునను = వలె; దర్భ = దర్భలతో; రచిత = కూర్చిన; బ్రుసి = వ్రతాభ్యాసమున కైన; ఆసనమున = చాపపై; ఉన్న = ఉన్నట్టి; ముని = మునులలో; ముఖ్యు = ప్రముఖుని; అంచిత = పూయనీయ మైన; యోగ = యోగము నందు; నిరతున్ = నిష్ఠ కలవానిని.
4-163 మానిత శ్యామాయమాన
సందర్భం:
ప్రజాపతి అయిన దక్షుడు ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. దానిని చూచి ఆనందం పొందటానికి దేవతలు, దేవతా సార్వభౌములూ చాలామంది విచ్చేశారు. సర్వలోకాలకూ గురువైన శ్రీమన్నారాయణుడు కూడా విచ్చేశాడు. ఆ రాకను వివరిస్తున్న సందర్భంలోనిది ఈ పద్యం.
సీ. మానిత శ్యామాయమాన శరీర దీ
ధితులు నల్దిక్కుల దీటుకొనగ,
కాంచనమేఖలా కాంతులతోడ, కౌ
శేయ చేలద్యుతుల్ చెలిమిసేయ
లక్ష్మీసమాయుక్త లలితవక్షంబున
వైజయంతీ ప్రభల్ వన్నె సూప
హాటకరత్న కిరీటకోటిప్రభల్
బాలార్క రుచులతో మేలమాడ
తే. లలితనీలాభ్రరుచి కుంతలములు తనర
ప్రవిమలాత్మీయ దేహజప్రభసరోజ
భవభవామరముఖ్యుల ప్రభలు మాప
అఖిలలోకైక గురుడు నారాయణుండు.
తాత్పర్యం:
మన్నన పొందటానికి వీలైన నీలదేహం కాంతులు నాలుగు దిక్కులకూ వ్యాపిస్తున్నాయి. బంగారు మొలత్రాటి ప్రభలతో పట్టుపీతాంబరం వెలుగులు చెలిమి చేస్తున్నాయి. లక్ష్మీదేవికి ఆటపట్టయిన వక్షస్థలం మీద వైజయంతి కాంతులు వెలిగిపోతున్నాయి. రత్నాలు పొదిగిన బంగారు కిరీటపు శోభలు ఉదయిస్తున్న సూర్యుని ప్రభలతో ఆడుకుంటున్నాయి. సుకుమారమైన నల్లని మేఘం వన్నెలతో స్వామి కేశాలు విరాజిల్లుతున్నాయి. మిక్కిలి నిర్మలమైన ఆ ప్రభువు దేహంనుండి వెలువడే దీప్తి బ్రహ్మ, శివుడు, దేవేంద్రుడు మొదలైనవారి ప్రభలను తక్కువ చేస్తున్నది. ఈ కాంతిపుంజములతో ప్రకాశిస్తున్న సర్వాలోకాలకూ గురువైన శ్రీమన్నారాయణుడు దక్షయజ్ఞానికి విచ్చేశాడు.
ప్రతిపదార్ధం:
మానిత = మన్నింప దగు; శ్యామాయమాన = నల్లని దైన; శరీర = దేహ; దీధితులు = కాంతులు; నల్దిక్కులన్ = నాలుగు (4) దిక్కులను {నాలుగు దిక్కులు - 1తూర్పు 2దక్షిణము 3పశ్చిమము 4ఉత్తరము}; దీటుకొనగ = పరచుకొనగ; కాంచన = బంగారపు; మేఖలా = మొలనూలు యొక్క; కాంతుల = ప్రకాశముల; తోడన్ = తోటి; కౌశేయ చేల = పట్టుబట్ట; ద్యుతుల్ = మెరుపులు; = చెలిమి = స్నేహము; చేయన్ = చేస్తుండగ; లక్ష్మీ = లక్ష్మీదేవితో; సమాయుక్త = కూడి ఉన్న; లలిత = అంద మైన; వక్షంబున = వక్ష స్థలమున; వైజయంతీ = వైజయంతిమాల; ప్రభల్ = కాంతులు; వన్నెచూప = ప్రకాశిస్తుండగ; హాటక = బంగారపు; రత్న = రత్నములు తాపిన; కిరీట = కిరీటము యొక్క; కోటి = అతిశయిస్తున్న; ప్రభల్ = కాంతులు; బాల = ఉదయిస్తున్న; అర్క = సూర్యుని; రుచుల = కాంతుల; తోన్ = తో; మేలమాడ = పరిహాసమాడు తుండగా;
లలిత = అందమైన; నీల = నల్లని; అభ్ర = మేఘముల; రుచిన్ = కాంతులతో; కుంతలములు = ముంగురులు; తనరన్ = అతిశయించగా; ప్రవిమల = మిక్కిలి నిర్మల మైన; ఆత్మీయ = తన; దేహజ = శరీరము నుండి జనించు; ప్రభ = కాంతి; సరోజభవ = బ్రహ్మదేవుడు {సరోజభవ - సరోజము (పద్మము) న భవ (జనించిన వాడు), బ్రహ్మదేవుడు}; భవా = శివుడు మొదలగు; అమర = దేవ; ముఖ్యుల = ప్రముఖుల; ప్రభలు = కాంతులు; మాపన్ = తగ్గింపజేయగ; అఖిల లోకైక గురుడు = విష్ణువు {అఖిల లోకైక గురుడు – సమస్త మైన లోకములకు ఒకడే యైన పెద్ద, హరి}; నారయణుండు = విష్ణువు {నారాయణుడు - నారములు (నీటి) యందు వసించువాడు, హరి}.
4-181 దితిసంతాన
సందర్భం:
దక్షయజ్ఞం దర్శించటానికి విచ్చేసిన శ్రీమన్నారాయణ స్వామిని బ్రహ్మాదులు చాలా గొప్పగా స్తుతించారు. అందులో దేవేంద్రుడు చేసిన స్తుతి ఈ విధంగా ఉన్నది.
మ. దితిసంతాన వినాశసాధన సముద్దీప్తాష్ట బాహాసమ
న్వితమై యోగిమనోనురాగపదమై వెల్గొందు నీ దేహమా
యతమైనట్టి ప్రపంచముం బలెను మిథ్యాభూత ముంగామి శా
శ్వతముంగా మదిలో తలంతు హరి! దేవా! దైవచూడామణీ.
తాత్పర్యం:
స్వామీ! దేవా! దేవతాసార్వభౌమా! శ్రీమన్నారాయణా! నీ ఈ దేహం ఎనిమిది పెద్ద చేతులతో అలరారుతూ ఉన్నది. ఆ చేతులు రక్కసి మూకల నాశనానికి సాధనాలై గొప్ప కాంతులతో వెలిగిపోతున్నాయి. యోగుల హృదయాల అనురాగానికి తావు అయినది నీ దేహం. అతివిశాలమైన ఈ ప్రపంచంలాగా అది అబద్ధమైనది కాదు. అందువలన ఈ నీ దేహం ఎన్నటికీ నిలిచి ఉండేదీ, ఎన్నటికీ నాశనం పొందనిదీ అని నేను భావిస్తున్నాను.
ప్రతిపదార్ధం:
దితి = దితి యొక్క; సంతాన = సంతానమునకు; వినాశ = వినాశనము చేయుటకు; సాధన = సాధనములు, ఆయుధములతో; సమ = చక్కగా; ఉద్దీప్త = ప్రకాశిస్తున్న; అష్ట = ఎనిమిది (8); బాహా = చేతులతో; సమ = చక్కగా; ఆన్వితము = కూడినది; ఐ = అయ్యి; యోగి = యోగుల; మనః = మనసులకు; అనురాగ = కూరిమి; కరము = కలిగించునది; ఐ = అయ్యి; వెల్గొందు = ప్రకాశించెడి; నీ = నీ యొక్క; దేహము = శరీరము; ఆయతము = విస్తారము; ఐనట్టి = అయినట్టి; ప్రపంచమున్ = లోకము; వలెను = వలె; మిథ్యాభూతముం = అసత్య మైనది; కామిన్ = కాపోవుట వలన; శాశ్వతమున్ = శాశ్వత మైనది; కాన్ = అగునట్లు; మది = మనసు; లోన్ = లో; తలంతున్ = భావించెదను; హరి = నారాయణ; దేవా = నారాయణ; దైవ చూడామణీ = నారాయణ {దైవ చూడామణీ - దైవములలో శిరోమణి వంటివాడు, విష్ణువు}.
4-193 విశ్వాత్మ
సందర్భం:
దక్షయజ్ఞాన్ని చక్కదిద్దటానికి వచ్చిన శ్రీమహావిష్ణువును కనుగొని యోగీశ్వరులీ విధంగా స్తుతించారు.
సీ. విశ్వాత్మ! నీయందు వేఱుగా జీవులన్
గన డెవ్వడట వానికంటె ప్రియుడు
నీకు లేడు, అయినను నిఖిలవిశ్వోద్భవ
స్థితి విలయంబులకతన నైన
సంగతి నిర్భిన్నసత్త్వాదిగుణవిశి
ష్టాత్మీయ మాయచే నజభవాది
వివిధభేదము లొందుదువు, స్వస్వరూంపంబు
నందుండుదువు, వినిహతవిమోహి
తే. వగుచునందువు గద, నిన్ననన్యభక్తి
భృత్యభావంబు తాల్చి సంప్రీతి గొల్చు
మమ్ము రక్షింపవే కృపామయ! రమేశ!
పుండరీకాక్ష! సంతత! భువనరక్ష.
తాత్పర్యం:
స్వామీ! నారాయణా! విశ్వమంతా నీవే! నీకంటె వేరుగా జీవులు ఉన్నారు అనుకోవటం కేవలం అజ్ఞానం. ఆ అజ్ఞానం లేనివారికంటె నీకు ప్రియమైనవాడు లేడు. అంటే నీకు జ్ఞానులంటేనే చాలా ఇష్టం. అయినా ఈ విశ్వమంతా ఏర్పడటానికీ, నిలిచి ఉండటానికీ, మళ్ళీ నీలో కలసిపోవటానికీ నీవే వేరువేరుగా రజస్సు, సత్త్వము, తమస్సు అనే గుణాలతో కూడిన నీదే అయిన మాయతో బ్రహ్మగా, విష్ణువుగా, శివుడుగా ఇంకా పెక్కుదేవతలుగా రూపాలను పొందుతూ ఉంటావు. అయినా నీకు నీదైన జ్ఞానం ఏమాత్రమూ జారిపోదు. కనుక నిలువెల్లా కృపయే అయిన దేవా! లక్ష్మీపతీ! పద్మములవంటి కన్నులున్న ప్రభూ! అంతటా వ్యాపించి ఉండు సర్వాత్మకా! లోకాలనన్నింటినీ కాపాడే ఆదిదేవా! నిన్ను మాత్రమే భక్తితో, మిక్కిలి ప్రీతితో, సేవకులమై కొలిచే మమ్ములను కాపాడు తండ్రీ!
ప్రతిపదార్ధం:
విశ్వాత్మ = నారాయణ {విశ్వాత్మ - విశ్వమే ఆత్మ (స్వరూపము) గా కలవాడు, విష్ణువు}; నీ = నీ; అందు = నుండి; వేఱుగా = ఇతరము అగునట్లు; జీవులన్ = సమస్త జీవములను; కనడు = చూడడు; ఎవ్వడు = ఎవడో; అటువాని = అటువంటివాని; కంటెన్ = కంటె; ప్రియుండు = ఇష్టుడు; = నీకున్ = నీకు; లేడు = లేడు; అయినను = అయినప్పటిటకిని; నిఖిల = సమస్త మైన; విశ్వ = భువన; ఉద్భవ = సృష్టి; స్థితి = స్థితి; లయంబుల = లమముల; కతన = కోసము; దైవ = దైవత్వ; సంగతిన్ = కూడుట చేత; నిర్భిన్న = నశించని; సత్త్తాది గుణ = త్రిగుణములతో {సత్త్వాది - సత్త్వ రజస్తమో గుణములు అనెడి త్రిగుణములు}; విశిష్ట = విశిష్ట మైన; ఆత్మీయ = తన; మాయన్ = మాయ; చేన్ = చేత; అజ = బ్రహ్మదేవుడు; భవ = శివుడు; ఆది = మొదలైన; వివిధ = రకరకముల; భేదములన్ = భేదములు కల రూపములను; ఒందుదువు = పొందుతావు; స్వ = నీ యొక్క; స్వరూపంబున్ = స్వరూపము; అందున్ = లోను; ఉండుదువు = ఉంటావు; వినిహత = బాగుగా పోగొట్ట బడిన; విమోహుడు = మోహము కలిగిన వాడవు;
అగుచున్ = ఔతూ; ఉందువు = ఉంటావు; కదా = కదా; నిన్ను = నిన్ను; అనన్య = అనితర మైన; భక్తిన్ = భక్తితో; భృత్యు = సేవక; భావంబున్ = భావమును; తాల్చి = ధరించి; సంప్రీతిన్ = మిక్కిలి ప్రీతితో; కొల్చు = సేవించు; మమ్మున్ = మమ్ములను; రక్షింపము = కాపాడుము; ఓ = ఓయీ; కృపామయ = దయామయ; రమేశ = నారాయణ {రమేశ - రమ (లక్ష్మీదేవి) యొక్క ఈశ (భర్త), విష్ణువు}; పుండరీకాక్ష = నారాయణ {పుండరీకాక్ష - పుండరీకము (పద్మము) ల వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; సంతత భువన రక్ష = నారాయణ {సంతత భువన రక్ష - సంతత (ఎల్లప్పుడు) భువన (జగత్తును) రక్ష (రక్షించువాడు), విష్ణువు}.
4-251 హారకిరీట
సందర్భం:
ప్రేమతో తండ్రి ఒడిలో కూర్చోవటానికి ఉబలాటపడిన ధ్రువుణ్ణి సవతితల్లి త్రోసివేసి అవమానించింది. బాలుని గుండె కుతకుతలాడిపోయింది. తల్లి అనుమతితో తపస్సు చేసుకోవటానికి బయలుదేరాడు ధ్రువుడు. భాగ్యవశంచేత అతనికి దారిలో నారదమునీంద్రుడు కనపడి ‘శ్రీమన్నారాయణ’ తత్త్వాన్ని, తపస్సు పద్ధతినీ ఉపదేశిస్తూ ఇలా అన్నాడు.
సీ. హారకిరీట కేయూర కంకణ ఘన
భూషణుం డాశ్రితపోషణుండు
లాలిత కాంచీకలాపశోభిత కటి
మండలుండంచిత కుండలుండు
మహనీయ కౌస్తుభమణియుక్తమైన గ్రై
వేయకుండానందదాయకుండు
సలలిత ఘనశంఖచక్రగదా పద్మ
హస్తుండు భువన ప్రశస్తు డజుడు
తే. కమ్ర సౌరభవనమాలికా ధరుండు
హతవిమోహుండు నవ్యపీతాంబరుండు
లలితకాంచన నూపురాలంకృతుండు
నిరతిశయసద్గుణుడు దర్శనీయతముడు.
తాత్పర్యం:
నాయనా! ధ్రువా! నారాయణుడు హారాలు, కిరీటమూ, బాహుపురులూ, వలయాలూ మొదలైన గొప్ప నగలతో అలంకరింపబడినవాడు. తనను ఆశ్రయించినవారిని పోషిస్తూ ఉంటాడు. చక్కని మొలత్రాడు పేటలతో శోభలను వెలువరిస్తున్న నడుము కలవాడు. కాంతులతో అలరారుతున్న కుండలాలు కలవాడు. వెలకట్టరాని కౌస్తుభమణితో కూడియున్న కంఠంలో వ్రేలాడుతున్న సువర్ణహారం కలవాడు. అందరికీ ఆనందాన్ని అందిస్తున్నవాడు. అందచందాలతో ప్రకాశిస్తున్న శంఖము, చక్రము, గద, పద్మము చేతులందు ఉంచుకొన్నవాడు. అందువలననే ఆతనిని లోకులందరూ కొనియాడుతూ ఉంటారు. కమ్మని సువాసనలతో గుబాళిస్తున్న వనమాలను ధరించి ఉంటాడు. ఇన్ని మహా వస్తువులు ఉన్నా దేనియందూ వ్యామోహంలేని మహాత్ముడు. ఎప్పటికప్పుడు క్రొత్త పట్టువస్త్రాలు ధరిస్తూ ఉంటాడు. చీలమండ దగ్గర మనోహరమైన అందియలు సొంపును పెంపు చేస్తున్నాయి. అతని సద్గుణాలను మించేవి సృష్టిలో మరెక్కడా లేవు. ప్రాణులందరికీ చూడముచ్చట అయినవాడు.
ప్రతిపదార్ధం:
హార = హారములు; కిరీట = కిరీటము; కేయూర = భూజకీర్తులు; కంకణ = కంకణములుచే; ఘన = గొప్పగా; భూషణుండు = అలంకరింప బడిన వాడు; ఆశ్రిత = ఆశ్రయించిన వారిని; పోషణుండు = పాలించు వాడు; లాలిత = అంద మైన; కాంచీ = మొలనూలు; కలాపము = ఆభరణముతో; శోభిత = శోభిల్లు తున్న; కటి = నడుము; మండలుండు = ప్రదేశము కలవాడు; అంచిత = అలంకరింప బడిన; కుండలుండు = కుండలములు కలవాడు; = మహనీయ = గొప్ప; కౌస్తుభ = కౌస్తుభము అనెడి; మణి = మణి యొక్క; ఘృణి = కాంతులు కలవాడు; చారు = అంద మైన; గ్రైవేయకుండు = కంఠహారములు కలవాడు; ఆనంద = ఆనందమును; దాయకుండు = ఇచ్చువాడు; = సలలిత = అందము గల; ఘన = గొప్ప; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గదా = గద; పద్మ = పద్మము; హస్తుండు = చేత కలవాడు; భువన = లోకముల; ప్రశస్తుడు = ప్రశంసించ బడు వాడు; అజుడు = జన్మము లేని వాడు;
కమ్ర = కమ్మని; సౌరభ = సువాసనలు కల; వనమాలికా = వనమాలలు {వనమాల - పూలు పత్రములు కూర్చిన దండ}; ధరుండు = ధరించిన వాడు; హత = పోగొట్ట బడిన; విమోహుండు = మోహముల వాడు; నవ్య = కొత్త; పీతాంబరుండు = పట్టుబట్టలు కలవాడు; లలిత = అంద మైన; కాంచన = బంగారు; నూపుర = అందెలచే; అలంకృతుండు = అలంకరించబడినవాడు; నిరతిశయ = అతిశయము కాని; సత్ = మంచి; గుణుండు = గుణములు కలవాడు; దర్శనీయతముఁడు = అత్యధికమైన చూడదగ్గవాడు {దర్శనీయుడు - దర్శనీయతరుడు - దర్శనీయతముఁడు}.
4-253 దూర్వాంకురంబుల
సందర్భం:
నారద మునీంద్రుడు కుమారుడైన ధ్రువునకు పరమాత్మ అయిన నారాయణుని ఏ విధంగా పూజించాలో చక్కగా ఉపదేశిస్తున్నాడు.
సీ. దూర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము
జలజంబులను చారుజలజనయను
తులసీదళంబుల తులసికా దాముని
మాల్యంబులను సునైర్మల్యచరితు
పత్రంబులను పక్షిపత్రుని, కడువన్య
మూలంబులను ఆదిమూలఘనుని
అంచిత భూర్జత్వగాది నిర్మిత వివి
ధాంబరంబులను పీతాంబరధరు
తే. తనరుభక్తిని మృచ్ఛిలాదారు రచిత
రూపములయందు గాని నిరూఢమైన
సలిలములయందు గాని సుస్థలములందు
గాని పూజింపవలయు నక్కమలనాభు.
తాత్పర్యం:
కుమారా! ధ్రువా! పరమాత్మ మన సౌకర్యంకోసం ఆకారం ధరించి మన ముందు మెలగుతూ ఉంటాడు. ఆ స్వరూపానికి మనం పూజలు చేస్తూ పుణ్యం సంపాదించుకోవాలి. ఆ స్వామి లేత గరికవంటి దేహం కలవాడు. కాబట్టి లేతగరికలు ఆయనకు సమర్పించుకోవాలి. అందమైన పద్మాలవంటి నేత్రాలు ఆయనవి. వానిని భావిస్తూ పద్మాలతో పూజించాలి. ఆయనకు తులసీదళాల మాలను ధరించటం చాలా ఇష్టం. కాబట్టి తులసీ దళాలను సమర్పించుకోవాలి. ఆయన అతి నిర్మలమైన నడవడి కలవాడు. మాలలతో అర్చించాలి. స్వామికి వాహనం పక్షి. పూజకు పనికివచ్చే పత్రాలు ఆయనకు ఇచ్చుకోవాలి. సృష్టికీ, దేవతలకూ, సర్వమునకూ ఆయన మూలకారణం. కాబట్టి వనాలలోని మొక్కల వ్రేళ్ళను తెచ్చి పూజలు చేయాలి. ఆయన పచ్చని పట్టుబట్ట ధరిస్తాడు. మేలైన బూరుగుచెట్టు మొదలైనవాని పట్టలతో నేసిన వస్త్రాలు ఆయనకు అందించాలి. మట్టితోగానీ, రాతితో గానీ, కొయ్యతో గానీ రూపొందించుకొన్న విగ్రహాన్ని ముందు పెట్టుకొని అర్చనలు చెదరని భక్తితో చేయాలి. లేదా పవిత్రమైన నదీజలములయందు కూడా చేయవచ్చు. అలాగే మహిమగల క్షేత్రాలలో కూడా ఆచరించవచ్చు. ఆయన కమలనాభుడు. ఈ సృష్టినంతా చేస్తున్న బ్రహ్మకు జన్మనిచ్చిన పద్మం బొడ్డునందు ఉన్నవాడు.
ప్రతిపదార్ధం:
దూర్వార = గఱిక అనెడి గడ్డి; అంకురంబులన్ = లేత చివుళ్ళతో; దూర్వారాంకురశ్యాము = లేత గఱిక వలె నవనవలాడు శ్యాముని; జలజంబులను = పద్మములతో; చారు = అంద మైన; జలజ నయనున్ = పద్మముల వంటి కన్నులు కలవాని; తులసీ దళంబులన్ = తులసి దళములతో; తులసీకా దామునిన్ = తులసిమాల ధరించినవాని; మాల్యంబులన్ = మాలలతో; సు = మంచి; వినిర్మల = నిర్మల మైన; చరిత్రున్ = వర్తన కలవానిని; పత్రంబులన్ = ఆకులతో; పక్షి = గరుత్మంతుని; పత్రుని = రెక్కలకలవానిని; కడు = అనేక మైన; వన్య = అడవి; = మూలంబులను = దుంపలతో; ఆది మూల ఘనుని = సృష్టికి మొదటి దుంప వంటి వానిని; అంచిత = చక్కటి; భూర్జ = బూరుగు దూది; త్వక్ = బట్ట; ఆది = మొదలైన వానిచే; నిర్మిత = చేయ బడిన; వివిధ = రకరకముల; అంబరములను = వస్త్రముల చేత; పీతాంబర = పట్టుబట్టలు;
ధరునిన్ = ధరించు వానిని; తనరు = అతిశయించిన; భక్తిని = భక్తితో; మృత్ = మట్టి; శిలా = శిల; దారు = కర్ర; రచిత = చేయ బడిన; రూపములన్ = బొమ్మలు; అందు = తో; కాని = కాని; నిరూఢ మైన = ప్రసిద్ధ మైన; సలిలముల = జలముల; అందు = లో; కాని = కాని; సుస్థలముల = మంచి ప్రదేశముల; అందు = లో; కాని = కాని; పూజింప వలయున్ = పూజించవలెను; ఆ = ఆ; కమలనాభున్ = విష్ణుమూర్తిని {కమలనాభుడు - పద్మము నాభి యందు కలవాడు, విష్ణువు}.
4-287 సర్వేశ
సందర్భం:
ధ్రువుని తపస్సుపంట పండింది. స్వామి సాక్షాత్కరించాడు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన అతని చెక్కిలిపై నారాయణుడు వేదమయమైనదీ, నాదమయమైనదీ అయిన శంఖాన్ని తాకించినంతనే ధ్రువుని వదనం నుండి కమనీయ స్తుతి వాక్యాలు వెలువడ్డాయి. అందులోనిదే యీ పద్యం.
సీ. సర్వేశ! కల్పాంత సమయంబునందు నీ
యఖిల ప్రపంచంబు నాహరించి
అనయంబు శేష సహాయుండవై శేష
పర్యంకతలమున పవ్వళించి
యోగనిద్రారతినుండి నాభీసింధు
జస్వర్ణలోకకంజాతగర్భ
మందు చతుర్ముఖు నమర పుట్టించుచు
రుచి నొప్పు బ్రహ్మస్వరూపివైన
తే. నీకు మ్రొక్కెద అత్యంత నియమ మొప్ప
భవ్యచారిత్ర! పంకజపత్రనేత్ర!
చిర శుభాకార! నిత్యలక్ష్మీవిహార
అవ్యయానంద! గోవింద! హరి! ముకుంద.
తాత్పర్యం:
సర్వమునకూ పాలకుడవైన ప్రభూ! గొప్ప చరిత్రగల స్వామీ! పద్మపత్రాలవంటి నేత్రాలుగల సుందరమూర్తీ! నీయందు నిరంతరం శ్రీదేవి విహరిస్తూ ఉంటుంది. సర్వకాలాలలో తరుగువోని ఆనందం నీది. గోవిందా! హరీ! ముక్తిప్రదాతా! నీవు కల్పం ముగిసే సమయంలో ఈ సర్వప్రపంచాన్నీ నీలో కలుపుకుంటావు. ఆదిశేషుడు నీకు సహాయకుడు. ఆ శేషశయ్యమీద పవ్వళించి యోగనిద్రలో ఆనందం పొందుతూ ఉంటావు. నీ బొడ్డు అనేది ఒక నది. అందులోని బంగారు భవనంనుండి నాలుగుమోముల దేవుడైన బ్రహ్మను పుట్టిస్తూ ఉంటావు. నీవు పరబ్రహ్మవు. అట్టి నీకు గట్టి పట్టుదలతో మ్రొక్కుతూ ఉంటాను.
ప్రతిపదార్ధం:
సర్వేశ = హరి; కల్పాంత = ప్రళయ; సమయంబున్ = కాలము; అందున్ = లో; ఈ = ఈ; అఖిల = సమస్త మైన; ప్రపంచంబున్ = ప్రపంచమును; ఆహరించి = మింగి; అనయంబున్ = అవశ్యము; శేష = శేషుని; సహాయుండవు = సహాయము కలవాడవు; ఐ = అయ్యి; శేష = శేషుడు అనెడి; పర్యంకతలమునన్ = శయ్యా తల్పము పై; పవ్వళించి = పండుకొని; యోగనిద్రా = యోగనిద్ర; రతిన్ = అనుభవించుటలో; ఉండి = ఉండి; నాభీ = బొడ్డు అనెడి; సింధు = సముద్రమును; జ = పుట్టిన; స్వర్ణ = బంగారు; లోక = విశ్వం అనే; కంజాత = పద్మము యొక్క; గర్భము = గర్భము; అందున్ = లో; చతుర్ముఖున్ = చతుర్ముఖ బ్రహ్మను; అమరన్ = చక్కగ; పుట్టించుచున్ = సృష్టిస్తూ; రుచిన్ = ప్రకాశముతో; ఒప్పు = చక్కగ ఉండెడి; బ్రహ్మ = పరబ్రహ్మ యొక్క; స్వరూపివి = స్వరూపముగ కలవాడవు; ఐన = అయిన;
నీకున్ = నీకు; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; అత్యంత = మిక్కిలి; నియమము = నియమము; ఒప్పన్ = ఒప్పునట్లు; భవ్యచారిత్ర = హరి; పంకజ పత్ర నేత్ర = హరి; చిర శుభాకార = హరి; నిత్య లక్ష్మీ విహార = హరి; అవ్యయానంద = హరి; గోవింద = హరి; హరి = హరి; ముకుంద = హరి.
4-553 అదిగాన
సందర్భం:
ఇది పృథు చక్రవర్తి కథలోని పద్యం. పృథువు చాలా గొప్ప మనీషి. ఆయన పేరుతోనే భూమికి పృథివి అనే పేరు ఏర్పడింది. ఆయన మహాత్మకు సంతోషించి శ్రీమన్నారాయణుడు అతనికి దర్శనం అనుగ్రహించాడు. పృథువు విష్ణువును స్తుతిస్తూ ఇలా అన్నాడు.
కం. అదిగాన, పద్మలోచన
సదమలభవదీయఘనయశము వినుటకునై
పదివేల చెవులు కృప ని
మ్మదియే నాయభిమతంబు నగును ముకుందా!
తాత్పర్యము:
దేవా! పుండరీకాక్షా! నాకు నీ పాదపద్మాల భక్తియే కావాలి. నీ కీర్తిని సర్వకాలాలలో అన్ని అవస్థలలోనూ పాడుకుంటూ ఉండాలి. కాబట్టి ఆవంతయినా మచ్చలేనిదయిన నీ గొప్పకీర్తిని వినటానికై దయతో నాకు పదివేల చెవులివ్వు. నీవు ముకుందుడవు. భక్తులకు ముక్తినిచ్చే ప్రాభవం కలవాడవు. నాకు అదే యిష్టమైన వరం. వేరు వరం నేను కోరను.
ప్రతిపదార్ధం:
అదిగాన = అందుచేత; పద్మలోచన = నారాయణా; సత్ = మిక్కిలి; అమల = స్వచ్చమైన; భవదీయ = నీ యొక్క; ఘన = గొప్ప; యశమున్ = కీర్తిని; వినుట = వినుట; కున్ = కోసము; ఐ = అయ్యి; పదివేల = పదివేలు (10000); చెవులు = చెవులు; కృపన్ = దయతో; ఇమ్ము = ఇమ్ము; అదియే = అదే; నా = నా యొక్క; అభిమతంబున్ = కోరిక; అగును = ఐ ఉన్నది; ముకుందా = నారాయణా.
4-581 నారాయణుండు
సందర్భం:
పృథు చక్రవర్తి యజ్ఞాలూ, తపస్సూ చేసి శ్రీమన్నారాయణుని వలన ప్రశంసలందుకున్నాడు. శ్రీమన్నారాయణుని ఆజ్ఞ మేరకు రాజ్యపరిపాలన చేయడానికి తన పట్టణానికి తిరిగివచ్చాడు. ఆ రాజుకు విప్రవరులతో వాసుదేవుడు ఉన్నాడా లేడా అనే విషయంలో చర్చ కలిగింది. అందులో అతడు వారితో ఇలా అంటున్నాడు.
కం. నారాయణుండు జగదా
ధారుండగు నీశ్వరుండు; దలఁప నతనికిన్
లే రెందు సములు నధికులు
ధీరోత్తముఁ డతఁడు నద్వితీయుం డగుటన్.
తాత్పర్యము:
విప్రవర్యులారా! వాసుదేవుడు ఉన్నాడు. ఊరకే ఉండడం కాదు. లోకాలన్నింటికీ ఆధారమై ఉన్నాడు. ఇంకా ఈశ్వరుడై పాలిస్తూ ఉన్నాడు. మరొక్క విషయం. అతనితో సమానులు లేరు. అతనిని మించినవారు కూడా లేరు. అతనితో పోల్చి చెప్పతగినవాడు ఒక్కడు కూడా లేని కారణంగా అతడు ధీరుడు, ఉత్తముడూ అయ్యి వెలుగొందుతూ ఉన్నాడు. ధీరుడంటే అందరికీ మించిన బుద్ధిశక్తితో ఎక్కడా ఎప్పుడూ ఎదురులేనివాడు. అతనికంటే గొప్పవాడని చెప్పడానికి ఎవరూ లేరు కనుక ఉత్తముడు. అందువలననే ఆయనకు నారాయణుడు అనే ప్రతిష్ఠతో కూడిన పేరు కలిగింది.
ప్రతిపదార్ధం:
నారాయణుండు = హరి; జగదాధారుండున్ = విష్ణుమూర్తి {జగదాధారుండు - జగత్ (విశ్వనము) నకు ఆధారమైనవాడు, విష్ణువు}; అగు = అయిన; ఈశ్వరుండు = విష్ణుమూర్తి; తలపన్ = తరచి చూసిన; అతని = ఆయన; కిన్ = కు; లేరు = లేరు; ఎందున్ = ఏవిధముగను; సములు = సమాన మైన వారు; అధికులు = గొప్పవారు; ధీరోత్తముడు = విష్ణుమూర్తి {ధీరోత్తముడు - ధీరులు (ఙ్ఞానులు) లో ఉత్తముడు, విష్ణువు}; అతడు = ఆయన; అద్వితీయుండు = ఇతరము అన్నది లేని వాడు.
4-583 కర్మవశంబునం
సందర్భం:
పృథు చక్రవర్తి బ్రాహ్మణోత్తములకు నారాయణుడు ఉన్నాడని తర్కపటిమతో చెప్పి ఆ మహావిష్ణువు ఈశ్వరుడు ఎలా అయ్యాడో నిరూపిస్తున్నాడు.
ఉ. కర్మవశంబునం జగము గల్గును హెచ్చు నడంగు నన్నచో
గర్మముఁ బుద్ధిఁ జూడ జడకార్యము; గాని ప్రపంచ కల్పనా
కర్మమునందుఁ గర్త యనఁగా విలసిల్లఁగఁ జాల; దీ జగ
త్కర్మక కార్యకారణము గావున నీశుఁడు విష్ణుఁ డారయన్.
తాత్పర్యము:
'అదేమయ్యా! జగత్తులన్నీ కర్మవశం చేత కదా కలుగుతున్నాయి, పెంపొందుతున్నాయి, మళ్ళీ అణిగిపోతున్నాయి. మధ్యలో వీనిని చేసేవాడు నారాయణుడెందుకవుతాడూ?' అంటారేమో. అది సరియైన మాట కాదు. బుద్ధిశక్తి నుపయోగించి చూస్తే, కర్మము తనంత తాను స్వయంగా ప్రవర్తించే స్వతంత్ర పదార్థం కాదు. అందువలన అది జడము. రాయీ రప్పా వంటిది. దానిని సృష్టించినవాడు కూడా ఒకడు ఉన్నాడు. కాబట్టి అట్టిదానిని ప్రపంచాన్ని కల్పించే పనిలో ' కర్త ' అని చెప్పే అవకాశం లేదు. అందువలన ఈ జగత్తు అనే పనికి, కారణమైన వాడు, తనకు ఒక కారణం లేనివాడు అయిన స్వతంత్రుడు విష్ణువే.
ప్రతిపదార్ధం:
కర్మ = కర్మ సూత్రము {కర్మ సూత్రము - ప్రతికర్మ (పని) కి కారణము (చేసిన వాడు) ఉండును}; వశంబునన్ = వశ మై, అనుసరించి; జగము = విశ్వము; కల్గును = పుట్టును; హెచ్చున్ = పెరుగును; అడంగును = అణగిపోవును; అన్నచో = అంటే; కర్మమున్ = కర్మమును; బుద్దిన్ = ఆలోచించి; చూడన్ = చూసినచో; జడ = చైతన్యము లేని; కార్యము = కర్మము; కాని = అంతే కాని; ప్రపంచ = ప్రపంచమును; కల్పనా = సృష్టించెడి; కర్మమున్ = పని; అందున్ = లో; కర్త = పనిచేసినది, కారణము; అనగా = ఐ; విలసిల్లగ = ప్రసిద్దమగుటకు; చాలదు = సరిపడదు; ఈ = ఈ; జగత్ = భువనము; కర్మక = సృష్టించెడికర్మ అనెడి; కార్య = కార్యమునకు; కారణము = కర్త, చేసినవాడు; కావునన్ = కనుక; విష్ణుడు = విష్ణుమూర్తి; అరయన్ = తరచి చూసిన.
4-608 భువి నెవ్వని
సందర్భం:
ఒకనాడు పృథు చక్రవర్తి దగ్గరకు బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులనే జ్ఞానసంపన్నులు విచ్చేశారు. మహాభక్తితో రాజు వారికి పూజలు చేసి తన అదృష్టాన్ని కొనియాడుకుంటూ ఇలా అంటున్నాడు.
కం. భువి నెవ్వని యెడ విప్రులు
భవుఁడును విష్ణుఁడుఁ దదీయ భక్తులును బ్రస
న్నవరదు లగుదురు వానికి
భువిని దివి నసాధ్యకర్మములు లే వనఘా.
తాత్పర్యము:
పుణ్యమే మూర్తిగా అయిన మహానుభావులారా! జ్ఞాన సంపన్నులైన మీవంటి విప్రులు, కైలాసవాసి అయిన శివుడూ, వైకుంఠవాసి అయిన విష్ణువూ, ఆ ఇరువురి భక్తులూ ఎవని విషయంలో ప్రసన్నులై, వరాలివ్వటానికి వస్తారో, అట్టివానికి ఇటు భూలోకంలో గానీ, అటు దేవలోకంలో కానీ, అసాధ్యమైన పనులు ఏమీ ఉండవు. మీ అనుగ్రహం వలన నాకు అటువంటి మహాభాగ్యం కలిగింది.
ప్రతిపదార్ధం:
భువిన్ = భూమి పై; ఎవ్వని = ఎవని; ఎడన్ = అందు; విప్రులున్ = బ్రాహ్మణులు; భవుడునున్ = శివుడు; విష్ణుడున్ = నారాయణుడును; తదీయ = అతని; భక్తులును = భక్తులును; ప్రసన్న = ప్రసన్న మైన; వదనులు = ముఖము కలవారు; అగుదురు = అయ్యెదరో; వాని = వాని; కిన్ = కి; = భువిన్ = ప్రపంచము లోను; దివిన్ = స్వర్గము లోను; అసాధ్య = సాధ్యము కాని; కర్మములు = పనులు; లేవు = లేవు; అరయన్ = తరచి చూసిన.
4-702 పంకజనాభాయ
సందర్భం:
ప్రాచీనబర్హి అనే మహారాజునకు సముద్రుని కూతురూ మహా సౌందర్యవతీ అయిన శతధృతి వలన పదిమంది కొడుకులు కలిగారు. వారందరూ, ఒకే పేరూ, ఒకే తీరూ కలవారు. వారిని ప్రచేతసులు అంటారు. వారు గొప్ప తపస్సు చేసి రుద్రుని అనుగ్రహం సంపాదించి అతని వలన ' రుద్రగీత ' అనే ఒక మహామంత్రాన్ని ఉపదేశంగా పొందారు. అది శ్రీమన్నారాయణుని మంగళ స్తోత్రం. శ్రీరుద్రదేవుడు వారికి ఉపదేశ రూపంగా ఆ స్తుతిని ఇలా ప్రారంభించాడు.
సీ. పంకజనాభాయ, సంకర్షణాయ, శాం
తాయ, విశ్వప్రబోధాయ, భూత
సూక్ష్మేంద్రియాత్మనే, సూక్ష్మాయ, వాసుదే
వాయ, పూర్ణాయ, పుణ్యాయ, నిర్వి
కారాయ, కర్మవిస్తారకాయ, త్రయీ
పాలాయ, త్రైలోక్యపాలకాయ,
సోమరూపాయ, తేజోబలాఢ్యాయ, స్వ
యం జ్యోతిషే, దురంతాయ, కర్మ
తే. సాధనాయ, పురాపురుషాయ, యజ్ఞ
రేతసే, జీవతృప్తాయ, పృథ్విరూప
కాయ, లోకాయ, నభసేం, తకాయ, విశ్వ
యోనయే, విష్ణవే, జిష్ణవే, నమోస్తు.
తాత్పర్యము:
శ్రీమన్నారాయణ దేవా! దేవదేవా! బ్రహ్మకు జన్మనిచ్చిన పద్మం నీ నాభిలో విరాజిల్లుతున్నది. నిన్ను సంకర్షణుడని అంటారు. ఎందుకంటే ప్రళయకాలంలో ప్రాణకోటినంతటినీ నీ లోనికి లాగి వేసుకుంటావు. నీవు శాంతుడవు. విశ్వాలనన్నిటినీ మేల్కొలుపుతావు. పంచభూతాల సూక్ష్మతత్త్వాలు శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనేవి నీ స్వరూపాలే! నీవు ఇంద్రియాలకు గోచరింపవు గనుక సూక్ష్ముడవు. అన్నింటిలో నీవు ఉంటావు, అన్నీ నీలో ఉండి వెలుగొందుతూ ఉంటాయి కనుక వాసుదేవుడవు. నీవు పూర్ణుడవు, పుణ్యుడవు, ఏ వికారాలూ నీకు లేవు. ప్రాణులను కర్మబంధాల నుండి విడుదల చేయించే స్వామివి. వేదాలను పరిరక్షిస్తూ ఉంటావు. అలాగే మూడులోకాలను కాపాడుతూ ఉంటావు. నీవు చంద్రుడవు. గొప్ప తేజోబలం గల సూర్యుడవు కూడా నీవే! అన్నింటినీ నీవు ప్రకాశింపచేస్తావు. కానీ, నిన్ను ప్రకాశింప చేయగల తేజస్సు మరొకటి లేదు. నీకు అంతం లేదు. ప్రాణులందరూ ఆయా కార్యాలనన్నింటినీ నీ వలననే సాధిస్తారు. నీవు సనాతనుడవు. యజ్ఞాలకు బీజం నీవే! భూమి అంతా నీ రూపమే! అన్ని లోకాలూ నీవే. ఆకాశం నీవే. యముడు నీ రూపమే. ఈ విశ్వమంతా నీ నుండియే వెలువడింది. నీవు అంతటా వ్యాపించి ఉంటావు. నీవు జయించటమే శీలం అయిన వాడవు. స్వామీ! నీకు నమస్సులయ్యా!
ప్రతిపదార్ధం:
పంకజ నాభాయ = హరి {పంకజ నాభుడు - పద్మము నాభిన కలవాడు, విష్ణువు}; సంకర్షణాయ = హరి {సంకర్షణుడు – చతుర్వ్యూహముల లోని సంకర్షణుడు, అహంకారమునకు అధిష్టాత, విష్ణువు}; శాంతాయ = హరి {శాంతుడు – శాంతము కలవాడు, విష్ణువు}; విశ్వ ప్రభోధాయ = హరి {విశ్వ ప్రభోధాయ - జగతికి చైతన్యము కలిగించు వాడు, విష్ణువు}; భూత సూక్ష్మేంద్రి యాత్మనే = హరి {భూత సూక్ష్మేంద్రి యాత్మ - జీవులకు సూక్ష్మేంద్రియములు (తన్మాత్రలు, ఇంద్రియములు) తానైన వాడు, విష్ణువు}; సూక్ష్మాయ = హరి {సూక్ష్ముడు - సూక్ష్మమే తానైన వాడు, విష్ణువు}; వాసుదేవాయ = హరి {వాసుదేవుడు – చతుర్వ్యూహముల లోని వాసుదేవుడు, బుద్ధికి అధిష్టాన దేవత, సమస్త మందు వసించెడి దేవుడు, విష్ణువు}; పూర్ణాయ = హరి {పూర్ణుడు - విశ్వమంతా నిండి యున్న వాడు, పరిపూర్ణ మైన వాడు, విష్ణువు}; పుణ్యాయ = హరి {పుణ్యుడు - పుణ్యమే తానైన వాడు, విష్ణువు}; నిర్వికారాయ = హరి {నిర్వికారుడు - వికారములు (మార్పులు) లేని వాడు, విష్ణువు}; కర్మ విస్తారకాయ = హరి {కర్మ విస్తారకాయుడు – వేద కర్మలను విస్తరింప జేయు వాడు, విష్ణువు}; త్రయీ పాలాయ = హరి {త్రయీ పాలుడు – వేద ధర్మాలను రక్షించే వాడు, విష్ణువు}; త్రైలోక్య పాలకాయ = హరి {త్రైలోక్య పాలకుడు - త్రైలోక్య (ముల్లోకములను) పాలకుడు, విష్ణువు}; సోమ రూపాయ = హరి {సోమరూపుడు - యఙ్ఞ రూప మైన వాడు, విష్ణువు}; తేజో బలాఢ్యాయ = హరి {తేజో బలాఢ్యుడు - తేజము బలము మిక్కిలిగా కల వాడు, విష్ణువు}; స్వయం జ్యోతిషే = హరి {స్వయం జ్యోతిషుడు - స్వయముగా ప్రకాశము అగు వాడు, విష్ణువు}; దురంతాయ = హరి {దురంతుడు – అంతము లేని వాడు, విష్ణువు};
కర్మసాధనాయ = హరి {కర్మసాధనుడు - వేదకర్మలకు సాధన మైన వాడు, విష్ణువు}; పురా పురుషాయ = హరి {పురా పురుషుడు – పురాణ పురుషుడు, విష్ణువు}; యఙ్ఞ రేతసే = హరి {యఙ్ఞ రేతస్సుడు - యఙ్ఞమునకు రేతస్సు వంటి వాడు (కారణుడు), విష్ణువు}; జీవ తృప్తాయ = హరి {జీవ తృప్తుడు – జీవ మనెడు తృప్తము (పురోడాశము, యఙ్ఞార్థమైన ఆపూపము) కల వాడు, విష్ణువు}; పృథ్వి రూపకాయ = హరి {పృథ్వి రూపకుడు - భూమికి రూపము యిచ్చినవాడు, విష్ణువు}; లోకాయ = హరి {లోకుడు - లోకము తానైన కలవాడు, విష్ణువు}; నభసే = హరి {నభస్సు - ఆకాశము తానైనవాడు, విష్ణువు}; అంతకాయ = హరి {అంతకుడు – లయ కారకుడు, విష్ణువు}; విశ్వ యోనయే = హరి {విశ్వ యోని - విశ్వమునకు ఉత్పత్తి స్థాన మైన వాడు, విష్ణువు}; విష్ణవే = హరి {విష్ణువు – వ్యాపించెడి వాడు, విష్ణువు}; జిష్ణవే = హరి {జిష్ణవు – జయించెడి వాడు, విష్ణువు}; నమోస్తు = నమస్కారము.
4-703 స్వర్గాపవర్గ
సందర్భం:
ప్రచేతసుల కోసం శ్రీరుద్రుడు శ్రీమన్నారాయణస్వామిని ఇంకా ఇలా స్తుతిస్తున్నాడు. వారికి స్వామి చేస్తున్న ఉపదేశం.
సీ. స్వర్గాపవర్గ సుద్వారాయ, సర్వర
సాత్మనే, పరమహంసాయ, ధర్మ
పాలాయ, సద్ధిత ఫలరూపకాయ, కృ
ష్ణాయ, ధర్మాత్మనే, సర్వశక్తి
యుక్తాయ, ఘన సాంఖ్య యోగీశ్వరాయ, హిర
ణ్య వీర్యాయ, రుద్రాయ, శిష్ట
నాథాయ, దుష్ట వినాశాయ, శూన్య ప్ర
వృత్తాయకర్మణే, మృత్యవే
తే. విరాట్చరీరాయ, నిఖిల ధర్మాయ, వాగ్వి
భూతయే, నివృత్తాయ, సత్పుణ్య భూరి
వర్చసే, ఖిల ధర్మదేహాయ, చాత్మ
నే, నిరుద్ధాయ, నిభృతాత్మనే, నమోస్తు.
తాత్పర్యము:
స్వామీ! స్వర్గానికీ, అపవర్గం అనే మోక్షానికీ నీవే ద్వారం. సర్వరసాలూ నీ స్వరూపమే! నీవు యోగసిద్ధి పొందిన పరమహంసవు. ధర్మపాలుడవు. సత్పురుషులకు హితమైన ఫలాన్ని అనుగ్రహించే స్వామివి. కృష్ణుడవు. ధర్మాత్ముడవు. సర్వశక్తులూ నీయందే నిండుగా ఉన్నాయి. గొప్పదైన సాంఖ్యయోగానికి ప్రభువైన కపిలుడవు నీవే. నీది స్వర్ణమయమైన తేజస్సు. నిన్ను రుద్రుడు అని కూడా అంటారు. అందరి రోదనాలను తొలగించివేస్తావు కదా. మంచి శీలం గలవారికి నాథుడవు నీవే. దుష్టులను రూపుమాపేవాడవు నీవే. కానీ నీకంటూ ఒక ప్రవృత్తి లేదు. నీవు కర్మస్వరూపుడవు, మృత్యుస్వరూపుడవు, నీ దేహంలో విశ్వమంతా నెలకొని ఉన్నది. అన్ని ధర్మాలూ నీకు సంబంధించినవే, అన్ని వాక్కులూ నీ విభూతులే. నీకు ఏ తగులములూ లేవు. ఉదాత్త పుణ్యకార్యాల దివ్యకాంతులను నీయందే చూడాలి. నీవు సర్వధర్మ స్వరూపుడవు. పరమాత్ముడవు. నిన్ను నిలువరింపగలిగేవాడు లేడు. పరిపూర్ణమైన స్వరూపం నీది. దేవా! స్వామీ! ప్రభూ! ఇట్టి నీకు మా మ్రొక్కులు.
ప్రతిపదార్ధం:
స్వర్గాపర్గ సుద్వారాయ = హరి {స్వర్గాపర్గ సుద్వారము - స్వర్గమునకు అపవర్గము (మోక్షము) నకు మంచి ద్వారము వంటి వాడు, విష్ణువు}; సర్వ రసాత్మనే = హరి {సర్వ రసాత్మ - సమస్త రసములకు అంతర్యామి, విష్ణువు}; పరమ హంసాయ = హరి {పరమ హంస – అత్యున్నత మైన ఆత్మ, పరమాత్మ, విష్ణువు}; ధర్మ పాలాయ = హరి {ధర్మ పాలుడు - ధర్మమును కాపాడెడి వాడు, విష్ణువు}; సద్ధిత ఫల రూపకాయ = హరి {సద్ధిత ఫల రూపకుడు - సత్ (మంచివారి) కి ఫలితమే రూపము యైన వాడు, విష్ణువు}; కృష్ణాయ = హరి {కృష్ణుడు – నల్లని వాడు, విష్ణువు}; ధర్మాత్మనే = హరి {ధర్మాత్మ - సకల ధర్మములు తానైన వాడు, విష్ణువు}; సర్వ శక్తి యుక్తాయ = హరి {సర్వ శక్తి యుక్తుడు – సమస్త మైన శక్తులు కలవాడు, విష్ణువు}; ఘన సాంఖ్య యోగీశ్వరాయ = హరి {ఘన సాంఖ్య యోగీశ్వరుడు - ఘన (గొప్ప) సాంఖ్య యోగులకు ఈశ్వరుడు, విష్ణువు}; హిరణ్య వీర్యాయ = హరి {హిరణ్య వీర్యుడు - హిరణ్యగర్భాండమునకు వీర్యము (కారణ భూతము) యైనవాడు, విష్ణువు}; రుద్రాయ = హరి {రుద్రుడు - రౌద్రము కల వాడు, విష్ణువు}; శిష్ట నాథాయ = హరి {శిష్ట నాథుడు - శిష్టు (ఙ్ఞాను) లకు నాథుడు (రక్షకుడు), విష్ణువు}; దుష్ట వినాశాయ = హరి {దుష్టవినాశుడు - చెడును (పాపులను) నాశనము చేయు వాడు, విష్ణువు}; శూన్య ప్రవృత్తాయ = హరి {శూన్య ప్రవృత్తుడు – శూన్య మైన ప్రవృత్తులు కలవాడు, విష్ణువు}; అకర్మణే = హరి {అకర్మణుడు - కర్మములు అంచరించని వాడు, విష్ణువు}; మృత్యవే = హరి {మృత్యువు – మృత్యు స్వరూపుడు, విష్ణువు};
విరాట్చరీరాయ = హరి {విరా ట్చరీరుడు - విరాట్ (విశ్వము సమస్తమును) తాను యైన వాడు, విశ్వ రూపుడు, విష్ణువు}; నిఖిల ధర్మాయ = హరి {నిఖిల ధర్ముడు – సమస్త మైన ధర్మములు తానైనవాడు, విష్ణువు}; వా గ్విభూతయే = హరి {వా గ్విభూతుడు - వాక్కు అనెడి వైభవము యైన వాడు, విష్ణువు}; నివృత్తాయ = హరి {నివృత్తుడు - ప్రవృత్తులు లేని వాడు, విష్ణువు}; సత్పుణ్య భూరి వర్చసే = హరి {సత్పుణ్య భూరి వర్చస్సు – సత్ (సత్య మైన) భూరి గొప్ప వర్చస్ (ప్రకాశము గల వాడు, విష్ణువు}; అఖిల ధర్మ దేహాయ = హరి {అఖి లధర్మ దేహుడు - సమస్త ధర్మముల స్వరూప మైన వాడు, విష్ణువు}; చ = మరియు; ఆత్మనే = హరి {ఆత్మ - పరమాత్మ, విష్ణువు}; అనిరుద్దాయ = హరి {అనిరుద్దుడు – అడ్డుకొనరాని వాడు, చతుర్వ్యూహముల లోని అనిరుద్ధుడు (చిత్తమునకు సంకేతము), విష్ణువు}; నిభృతాత్మనే = హరి {నిభృతాత్మ – వృద్ధి క్షయములు లేని స్థిర మైన ఆత్మ, విష్ణువు}; నమోస్తు = నీకు నమస్కారము.
4-704 సర్వసత్త్వాయ
సందర్భం:
ప్రచేతసుల కొఱకై రుద్రుడు నారాయణ తత్త్వాన్ని స్తుతి రూపంలో ఇలా సంభావిస్తున్నాడు.
తే. సర్వసత్త్వాయ, దేవాయ, సన్నియామ
కాయ, బహిరంతరాత్మనే, కారణాత్మ
నే, సమస్తార్థ లింగాయ, నిర్గుణాయ,
వేధసే, జితాత్మక సాధవే, నమోస్తు.
తాత్పర్యము:
స్వామీ! ఆదిదేవా! ఏ మాత్రమూ దేనితోనూ కలయిక లేని సత్త్వస్వరూపం నీది. అంతేకాదు సృష్టిలోని సర్వ ప్రాణులూ నీ స్వరూపాలే. అందువలననే నీవు దేవుడవు. అన్నింటినీ, అందరినీ, హద్దులలో నిలుపగల ప్రభుడవు నీవు. ప్రాణులందరికీ వెలుపలా, లోపలా ఉండి ఆడిస్తున్న మహాస్వామివి నీవు. సర్వులకూ, సర్వమునకూ కారణమైనవాడవు కూడా నీవే. సర్వ జీవకోటినీ, చైతన్యం లేని పదార్థాలను ఇది ఇది అని గుర్తించడానికి వీలైన ఏర్పాటు చేసిన మహాశిల్పివి నీవు. గుణముల అంటుసొంటులు లేనివాడవు. సృష్టి అంతటికీ కర్తవు నీవే. ఇంద్రియాలమీద పట్టు చిక్కించుకున్న యోగులకు మేలుచేసే స్వామివి నీవు. అట్టి నీకు ఎల్లవేళలా నమస్కరిస్తూ ఉంటాము.
ప్రతిపదార్ధం:
సర్వసత్తాయ = హరి {సర్వ సత్తుడు – అఖిల మైన సత్తువలు (సామర్థ్యములు) తానైన వాడు, విష్ణువు}; దేవాయ = హరి {దేవుడు – ప్రకాశించు వాడు, విష్ణువు}; స న్నియామకాయ = హరి {స న్నియామకుడు - సత్ (సత్య మైన) నియామకుడు, విష్ణువు}; బహి రంత రాత్మనే = హరి {బహి రంత రాత్మ - పరమాత్మ మరియు అంతరాత్మ అయినవాడు, విష్ణువు}; కారణాత్మనే = హరి {కారణాత్మ – కారణ భూత మైన ఆత్మ, విష్ణువు}; సమ స్తార్థలింగాయ = హరి {సమ స్తార్థ లింగము - సమస్త ప్రయోజనము లకు లింగము (చిహ్నము) యైనవాడు, విష్ణువు}; నిర్గుణాయ = హరి {నిర్గుణుడు - త్రిగుణాతీతుడు, విష్ణువు}; వేధసే = హరి {వేధ - బ్రహ్మదేవుని స్వరూపము యైనవాడు, విష్ణువు}; జితాత్మక సాధవే = హరి {జితాత్మక సాధు – చిత్త మనెడి ఆత్మను జయించిన సాధు స్వరూపుడు, విష్ణువు}; నమోస్తు = నమస్కారము.
4-713 ఎనసిన
సందర్భం:
శ్రీ పరమేశ్వరుడు ప్రచేతసులకు రుద్రగీతను ఉపదేశిస్తూ వారికోసం తానే శ్రీమన్నారాయణుని మహిమను కొనియాడుతున్నాడు.
చం. ఎనసిన భక్తియోగమున నే భవదీయపదాబ్జ మూలము
న్ననయముఁ బొందువాఁడు చటులాగ్రహ భీషణ వీర్య శౌర్య త
ర్జనములచే ననూనగతి సర్వజగంబులు సంహరించు న
య్యనుపముఁ డైన కాలుని భయంబును బొందఁడు సుమ్ము కావునన్.
తాత్పర్యము:
దేవాదిదేవా! ఏ మానవుడు నీదైన పాదపద్మాల మూలాన్ని ఉప్పొంగిన భక్తియోగంతో అందుకుంటాడో, అట్టి మహాభక్తుడు, అతి తీవ్రమైన కోపంతో, భయంకరమైన శక్తిసామర్ధ్యాలను చూపుతూ బెదిరింపులతో అత్యంత వేగంతో అన్ని లోకాలనూ నాశనం చేసే పనిలో అతనికతడే సాటియనదగిన యముని వలన ఎన్నటికీ భయం పొందడు సుమా!
ప్రతిపదార్ధం:
ఎనసిన = విస్తరించిన, సిద్ధించిన; భక్తియోగమునన్ = భక్తియోగమున; భవదీయ = నీ యొక్క; పదా = పాదములు అనెడి; అబ్జము = పద్మములను; మూలమున్ = మూలము; అనయమున్ = ఎల్లప్పుడు; పొందువాడు = కోరెడి వాడు; చటుల = భయంకర; ఆగ్రహ = కోపము; భీషణ = భీషణము; వీర్య = శౌర్యము; తర్జనముల్ = భయపెడుతూ {తర్జనము - చూపుడు వేలుతో బెదిరించుట}; చేన్ = చేత; అనూన = దేనికిని తగ్గని; గతిన్ = విధముగా; సర్వ = అన్ని; జగంబులున్ = లోకములను; సంహరించు = సంహరించెడి; ఆ = ఆ; అనుపముడు = సాటి లేని వాడు; ఐన = అయిన; కాలుని = యముని వలన; భయంబునున్ = భయమును; పొందడు = పొందడు; సుమ్ము = సుమా; కావునన్ = అందుచేత.
4-718 సరసిజనాభ
సందర్భం:
రుద్రదేవుడు మునుపు బ్రహ్మదేవుడు సనకాదులను ఉపదేశించిన రుద్రగీతను ప్రచేతసులకు బోధిస్తూ ఆ స్వామి వాసుదేవుని గూర్చి యిలా అంటున్నాడు.
చం. సరసిజనాభ! సత్పురుషసంగ సమంచిత భక్తి యోగ వి
స్ఫురణ ననుగ్రహింపబడి శుద్ధము నొందినవాని చిత్త మ
స్థిర బహిరంగముం గనదు; చెందదు భూరి తమస్స్వరూప సం
సరణ గుహన్ జిరంబు గనఁజాలు భవన్మహనీయ తత్త్వమున్.
తాత్పర్యము:
బ్రహ్మగారి సృష్టికి కారణమైన పద్మం నాభియందు విరాజిల్లే నారాయణా! సత్పురుషుల సాంగత్యం వలన మరింత ఉజ్జ్వలంగా ప్రకాశించే భక్తియోగంతో మానవుని చిత్తం నిర్మలం అవుతుంది. అప్పుడు అది చంచలమైన వెలుపలి ప్రపంచాన్ని చూడదు. లెక్కకు అందని అజ్ఞానస్వరూపమైన సంసారమనే గుహలోనికి చేరుకోదు. అంతేకాదు, నీదైన మహనీయ తత్త్వాన్ని నిత్యమూ పొందగలుగుతుంది.
ప్రతిపదార్ధం:
సరసిజ నాభ = విష్ణుమూర్తి {సరసిజ నాభుడు - సరసిజము (పద్మము) నాభి (బొడ్డు) న కల వాడు, విష్ణువు}; సత్ = మంచి; పురుష = వారి; సంగ = సాంగత్యము వలన; సమంచిత = చక్కగా కలిగిన; భక్తి యోగ = భక్తి యోగము; విస్పురణన్ = విస్తరించుట; అనుగ్రహింప బడి = ఇవ్వబడి; శుద్ధమున్ = శుద్ధి చేయబడుటను; ఒందిన = పొందిన; వాని = వాని యొక్క; చిత్తము = మనసు; అస్థిర = చంచల మైన; బహిరంగమున్ = బయటి ప్రపంచమును; కనదు = చూడదు; చెందదు = చెందదు; భూరి = అత్యధికమైన; తమస్ = తమోగుణ, చీకటి; స్వరూప = రూపము గల; సంసరణ = సంసారము యనెడి; గుహన్ = గుహను; చిరంబున్ = స్థిరముగ; కనజాలున్ = చూడ గలుగును; భవత్ = నీ యొక్క; మహనీయ = గొప్ప; తత్త్వమున్ = తత్త్వమును.
4-916 కేశవ
సందర్భం:
ప్రచేతసులు చేసిన తపస్సు పంటకు వచ్చింది. శ్రీమన్నారాయణమూర్తి వారికి తన దర్శన భాగ్యాన్ని అనుగ్రహించాడు. వారికి భవిష్యత్తు కర్తవ్యాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఆనంద సముద్రంలో హాయిగా మునకలు వేస్తున్నవారు స్వామితో ఇలా అంటున్నారు.
సీ. కేశవ! సంతత క్లేశ నాశనుఁడవు; కోరి మనో వా గగోచరుఁడవు
నిద్ధ మనోరథ హేతుభూ తోదార; గుణనాముఁడవు సత్త్వగుణుఁడ వఖిల
విశ్వోద్భవస్థితి విలయార్థ ధారిత; విపుల మాయాగుణ విగ్రహుఁడవు
మహి తాఖి లేంద్రియ మార్గ నిరధిగత; మార్గుఁడ వతిశాంత మానసుఁడవు
తే. తవిలి సంసారహారి మేధస్కుఁడవును
దేవదేవుఁడవును వాసుదేవుఁడవును
సర్వభూతనివాసివి సర్వసాక్షి
వైన నీకు నమస్కారమయ్య! కృష్ణ!
తాత్పర్యము:
కేశవా! నీవు ఎడతెగకుండా వచ్చిపడే ఘోరమైన కష్టాలనన్నింటినీ రూపు మాపుతావు. నీవు మనస్సులకూ, మాటలకూ అందనివాడవు. నీ గుణాలూ, నీ పేరులూ, భక్తుల హృదయాలలో చెలరేగే మోక్షకాంక్షను చక్కగా ఫలవంతం చేస్తాయి. సత్త్వగుణం నీ సొమ్ము. సమస్త లోకాల పుట్టుక, స్థితి, వినాశమూ అనే పనులను నిర్వహించడానికి నీవు మాయాగుణాలతో కూడిన రూపాలను స్వీకరిస్తావు. ఇంద్రియమార్గాలన్నీ నీ మార్గం దగ్గర నిలిచి పోతాయి. ఆ మార్గాలు నీ మార్గంలో అడుగు కూడా పెట్టలేవు. ప్రశాంతమైన మనస్సుతో విరాజిల్లుతూ ఉంటావు. భక్తుల సంసారమనే ఘోరమైన బంధాన్ని ఎలా నాశనం చేయాలో తెలిసిన జ్ఞానస్వరూపుడవు నీవు. దేవదేవుడవు. వాసుదేవుడవు. సర్వభూతాల హృదయాలే నీ ఆలయాలు. నీవు సర్వసాక్షివి. కృష్ణా! వాసుదేవా! నీకు నమస్కారాలు చేస్తూనే ఉంటాము.
ప్రతిపదార్ధం:
కేశవ = నారాయణ {కేశవుడు – మంచి వెంట్రుకలు గల వాడు, కేవలము శుభ మైన వాడు, విష్ణువు}; సంతత క్లేశ నాశనుడవు = నారాయణ {సంతత క్లేశనాశనుడు - నిత్యము క్లేశముల (చిక్కుల) ను నాశనము చేయు వాడు, విష్ణువు} {క్లేశములు – చిత్త వృత్తుల నుండి జనించు నవి యైదు 1ప్రమాణము (త్రివిధ ప్రమాణములు అవి 1ఇంద్రియ గోచరము 2అనుమానము 3శబ్ద ప్రమాణము) 2విపర్యయము (ప్రమాణాతీతమైనది) 3మిథ్య (ఉన్న స్థితికి వేరుగ దర్శించుట) 4నిద్ర (గుర్తించెడి సామర్థ్యము లోపించుట) 5స్మృతి (ప్రమాణము లేనప్పటికిని గుర్తించుట)} కోరి మనోవా గగోచరుడవు = నారాయణ {మనోవా గగోచరుడు - మనస్సులకు వాక్కులకు అగోచరుడవు (అందని వాడవు), విష్ణువు}; ఇద్ధ మనోరథ హేతు భూతోదార గుణ నాముడవు = నారాయణ {ఇద్ధ మనోరథ హేతు భూతోదార గుణనాముడు - ఇద్ధ (ప్రసిద్ధ మైన) మనోరథ (శ్రేయస్సులకు)హేతుభూత (కారణ మైనది) ఉదార (ప్రసాదించెడి) గుణ (సుగుణములకు) నాముడు (పేరుబడ్డ వాడు), విష్ణువు}; = సత్త్వగుణుడవు = నారాయణ {సత్త్వగుణుడు – సత్త్త్వగుణము గల వాడు, విష్ణువు}; అఖిల విశ్వోధ్భవ స్థితి విలయార్థ ధారిత విపుల మాయాగుణ విగ్రహుడవు = నారాయణ {అఖిల విశ్వోధ్భవ స్థితి విలయార్థ ధారిత విపుల మాయా గుణ విగ్రహుడు – సమస్తమైన లోకములకు ఉద్భవ (సృష్టి) స్థితి లయముల అర్థ (ప్రయోజనములకు) ధారిత (ధరింపబడిన) విపుల (విస్తారమైన) మాయా (మాయతో కూడిన) గుణ (గుణములు) విగ్రహుడవు (రూపముగా కల వాడు, విష్ణువు}; మహితాఖిలేంద్రియ మార్గ నిరవధి గత మార్గుడవు = నారాయణ {మహి తాఖి లేంద్రియ మార్గ నిరవధి గత మార్గుడు - మహిత (గొప్ప) అఖిల (సర్వ) ఇంద్రియముల (నడవడికకు) నిరవధిక (ఎడతెగని) గత (వెళ్ళిన మార్గమున) (అధిగతుడు), విష్ణువు}; అతి శాంతి మానసుడవు = నారాయణ {అతి శాంతి మానసుడు - మిక్కిలి శాంతి స్వభావము గలవాడు, విష్ణువు};
తవిలి సంసార హారి మేధస్కుడవును = నారాయణ {తవిలి సంసార హారి మేధస్కుడు - తవిలి (తగులుకొన్న) సంసార (భవబంధములను) హారి (హరించు నట్టి) మేధస్కుడు (బుద్ధి బలము గల వాడు), విష్ణువు}; దేవ దేవుడవును = నారాయణ {దేవ దేవుడు - దేవవుళ్ళకే దేవుడు, విష్ణువు}; వాసుదేవుడవును = నారాయణ {వాసుదేవుడు - వసుదేవుని పుత్రుడు, కృష్ణుడ}; సర్వ భూత నివాసివి = నారాయణ {సర్వ భూత నివాసి - సర్వ (సకల) భూతముల (జీవుల) యందును నివసించెడి వాడు, విష్ణువు}; సర్వ సాక్షివిన్ = నారాయణ {సర్వసాక్షి - సమస్తమునకు సాక్షీభూతుడు, విష్ణువు}; ఐన = అయిన; నీకున్ = నీకు; నమస్కారమున్ = నమస్కారము; అయ్య = తండ్రి; కృష్ణా = కృష్ణుడా.
4-918 తోయరుహోదరాయ
సందర్భం:
ప్రచేతసులు శ్రీకృష్ణపరమాత్మను ఇంకా ఇలా సంస్కృత పదజాలంతో ప్రస్తుతిస్తూ నమస్కరిస్తున్నారు.
ఉ. తోయరుహోదరాయ, భవదుఃఖహరాయ, నమోనమః పరే
శాయ, సరోజ కేసర పిశంగ వినిర్మల దివ్య నవ్య వ
స్త్రాయ, పయోజ సన్నిభ పదాయ, సరోరుహ మాలికాయ, కృ
ష్ణాయ, పరాపరాయ, సుగుణాయ, సురారి హరాయ, వేధసే
తాత్పర్యము:
జనార్ధనా! నీవు బ్రహ్మ పుట్టుకకు కారణమైన పద్మాన్ని నాభియందు ధరించినవాడవు. సంసార దు:ఖాన్ని హరించివేస్తావు. పరమాత్మవు. నీవు ధరించిన పట్టువస్త్రం పద్మాలలోని కింజల్కాల పసిమివన్నెతో అత్యంతము, నిర్మలమై, దివ్యమై నవ్యమై ఒప్పారుతూ ఉంటుంది. నీ పాదాలు పద్మాలవలె కాంతులతో విరాజిల్లుతూ ఉంటాయి. నీవు మెడనుండి పాదాలవరకూ ధరించిన వనమాల మనోజ్ఞమైన తమ్మిపూలతో నిండి చూచేవారికి చూడముచ్చటగా ఉంటుంది. నీవు ఇంద్రుడు, బ్రహ్మ, పరమేశ్వరుడు మొదలగు వారికంటె మహాత్ముడవు. సృష్టిలో ఉండే సుగుణాలన్నీ నిన్నే ఆశ్రయించుకుని ఒప్పారుతున్నాయి. మ్రుక్కడి రక్కసులను చంపివైచి సాధువులను సంరక్షిస్తూ ఉంటావు. నీవు బ్రహ్మదేవునకు కూడా తండ్రివి. అట్టి నీకు వేలకొలది నమస్కారాలు.
ప్రతిపదార్ధం:
తోయరు హోదరాయ = విష్ణుమూర్తి {తోయరు హోదరాయ - తోయరుహము (పద్మం) ఉదరుడు (గర్భమున గల వాడు), విష్ణువు}; భవ దుఃఖ హరాయ = విష్ణుమూర్తి {భవ దుఃఖ హర - భవ (సంసారము) యొక్క దుఃఖములను హరాయ (హరించెడి వాడు), విష్ణువు}; నమోనమః = నమస్కారము; పరేశాయ = విష్ణుమూర్తి {పరేశుడు - పర (అత్యున్నత మైన) ఈశుడు (దైవము), విష్ణువు}; సరోజ కేస రపిశంగ వినిర్మల దివ్య నవ్య వస్త్రాయ = విష్ణుమూర్తి {సరోజ కేసర పిశంగ వినిర్మల దివ్య భర్మ వస్త్రుడు - సరోజ (పద్మము)ల కేసరముల వలె పిశంగ (పసుపు రంగు) గల వినిర్మల (స్వచ్చ మైన) దివ్య (దివ్య మైన) నవ్య (సరికొత్త) వస్త్ర (బట్టలు ధరించిన వాడు), విష్ణువు}; పయోజ సన్నిభ పదాయ = విష్ణుమూర్తి {పయోజ సన్నిభ పదుడు - పయోజ (పద్మము) సన్నిభ (సమాన మైన) పదుడు (పాదములు గలవాడు), విష్ణువు}; సరోరుహ మాలికాయ = విష్ణుమూర్తి {సరోరుహ మాలిక - సరోరుహ (పద్మము)ల మాలిక ధరించిన వాడు, విష్ణువు}; కృష్ణాయ = విష్ణుమూర్తి {కృష్ణుడు - కృష్ణ (నల్లని వాఢు) అయిన వాడు}; పరాపరాయ = విష్ణుమూర్తి {పరాపరుడు - పరము అపరమూ కూడ అయిన వాడు, పరలోకములకే పర మైన వాడు, విష్ణువు}; సుగుణాయ = విష్ణుమూర్తి {సుగుణ – సుగుణములు గల వాడు, విష్ణువు}; సురారి హరాయ = విష్ణుమూర్తి {సురారి హర - సురారుల (రాక్షసుల) ను హరాయ (హరించు వాడు), విష్ణువు}; వేధసే = విష్ణుమూర్తి {వేధ – సృష్టి కర్తయైన వాడు, విష్ణువు}.
4-950 చర్చింప
సందర్భం:
ప్రచేతసులు శ్రీమన్నారాయణుని ఆజ్ఞను శిరసావహించి తమ కుమారుని కడ తమ ధర్మపత్నిని ఉంచి వనవాసానికి వెళ్ళారు. అక్కడ ఆత్మవిజ్ఞానం పొందాలని సంకల్పం చేసికొని ఉండగా వారి కడకు సర్వలోక ప్రియుడైన నారదుడు విచ్చేశాడు. వారు అతనికి తగిన విధంగా గౌరవ మర్యాదలు చేసి అతనితో ప్రసంగం చేస్తూ మాకు ఆత్మతత్త్వాన్ని బోధించమని అడిగారు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు.
సీ. చర్చింప నరులకే జన్మకర్మాయుర్మనో వచనంబుల దేవదేవుఁ
డఖిల విశ్వాత్మకుం డైన గోవిందుండు; విలసిల్లు భక్తి సేవింపఁబడును
నవియ పో, జన్మ కర్మాయు ర్మనో వచనములను ధరణి నెన్నంగఁ దగును
వనరుహనాభ సేవా రహితము లైన; జననోపనయన దీక్షాకృతంబు
తే. లైన జన్మంబు లేల? దీర్ఘాయు వేల?
వేద చోదిత యగు కర్మ వితతి యేల?
జప తపశ్శ్రుత వాగ్విలాసంబు లేల?
మహిత నానావధాన సామర్థ్య మేల?
తాత్పర్యము:
దేవమహర్షీ! దేవదేవుడు శ్రీమన్నారాయణుడు మానవులకు పుట్టుకనూ, ప్రత్యేక కర్మములనూ, ఆయువు, మనస్సు, మాట అనేవానినీ అనుగ్రహించాడు. మానవుడు వానితో అతిశయించిన భక్తితో అఖిల విశ్వమూ తనదే అయిన గోవిందుణ్ణి నిరంతరమూ సేవించాలి. అప్పుడే ఆ పుట్టుకా మొదలైనవానికి సార్థకత చేకూరుతుంది. అలా కాక పద్మనాభుని సేవ లేని జన్మమూ, ఉపనయనము మొదలైన సంస్కారములూ పనికిమాలినవైపోతాయి. ఆ జన్మ సార్థకం కానిదవుతుంది. వానికి పెద్దకాలం బ్రతకడం ప్రయోజనకరం కాదు. వాడు చేసే జపము, తపము, వేదాలు వల్లించడం, చిలక పలుకుల వంటి మాటలాడడం మొదలైనవన్నీ వ్యర్థం. పెక్కు విషయాల మీద ధ్యానం ఉంచడం వంటి పనులు కూడా పనికిమాలినవే అయిపోతాయి.
ప్రతిపదార్ధం:
చర్చింపన్ = చర్చించి చూడగా; నరుల్ = మానవుల; కున్ = కు; ఏ = ఏ యొక్క; జన్మ = పుట్టుక; కర్మ = కర్మములు; ఆయుర్ = ఆయుర్దాయము; మనః = మనసు; వచనంబులన్ = వాక్కులతో; దేవదేవున్ = నారాయణుని; అఖిల = సమస్త మైన; విశ్వ = జగత్తు; ఆత్మకుండు = తాను యైన వాడు; ఐన = అయిన; గోవిందుండున్ = నారాయణుడు; విలసిల్లు = విలసిల్లెడి; భక్తిన్ = భక్తితో; సేవింప బడెడున్ = సేవింప బడును; అవియపో = అవే; జన్మ = పుట్టుక; కర్మ = కర్మములు; ఆయుర్ = ఆయుష్షు; మనః = మనస్సు; వచనములు = వాక్కులు; అని = అని; ధరణిన్ = భూమిపైన; ఎన్నంగన్ = ఎంచుటకు; తగును = తగి యుండును; వనరుహ నాభ = విష్ణు; సేవా = సేవించుటలు; రహితములు = లే నట్టివి; ఐన = అయిన; జనన = పురిటిశుద్ధి; ఉపనయన = వడుగు; దీక్షా = దీక్షలు; కృతంబులు = పట్టుటలు; ఐన = కలిగిన; జన్మంబుల్ = జన్మలు; ఏలన్ = ఎందులకు; దీర్ఘ = పెద్ద దైన; ఆయుర్ = ఆయుర్దాయము; ఏలన్ = ఎందులకు; వేద = వేదముల ప్రకారము; చోదిత = నడప బడెడివి; అగు = అయిన; కర్మ = కర్మల; వితతి = సమూహము; ఏలన్ = ఎందులకు; జపః = జపము; తపః = తపస్సు; శ్రుత = వేద పఠనము; వాగ్విలాపంబులున్ = నోటితో చర్చలు; ఏలన్ = ఎందులకు; మహిత = గొప్ప; నానా = రకరకముల; అవధాన = అవధరించెడి; సామర్థ్యము = నేర్పులు; ఏలన్ = ఎందులకు.
4-956 అరయన్నభ్రతమః
సందర్భం:
తమకు ఆత్మతత్త్వం ఉపదేశించవలసినదిగా ప్రార్థించిన ప్రచేతసులతో దివ్యజ్ఞానసంపన్నుడైన నారద మహాముని యిలా అంటున్నాడు
మ. అరయన్నభ్రతమః ప్రభల్ మును నభంబం దొప్పఁగాఁ దోచి క్ర
మ్మఱ వీక్షింపఁగ నందె లేనిగతి బ్రహ్మంబందు నీ శక్తులున్
బరికింపన్ ద్రిగుణప్రవాహమున నుత్పన్నంబు లై క్రమ్మఱన్
విరతిం బొందుచు నుండుఁ గావున హరిన్ విష్ణున్ భజింపం దగున్.
తాత్పర్యము:
నాయనలారా! చూడండి. గగనంలో కారు మేఘాలు కదలాడుతూ ఉంటాయి. వాని వలన క్రిందనున్న వారికి చీకట్లు క్రమ్ముకున్నట్లు ఉంటుంది. కానీ, కొద్ది క్షణాలలోనే ఆ మబ్బులు విచ్చుకునిపోతాయి. స్వచ్చమైన ఆకాశం వెలుగులను నింపుతూ కానవస్తుంది. అలాగే బ్రహ్మమునందు ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేవి సత్త్వము, రజస్సు, తమస్సు అనేవాని ప్రవాహంలో పడి ఉన్నట్లుగా కనబడుతూ ఉంటాయి. మళ్ళీ నామరూపాలు లేకుండా పోతాయి. అలా తోచడానికీ, పోవడానికీ, కారణమైనవాడు శ్రీమహావిష్ణువు. ఆ చీకట్లను హరించేవాడు కనుక హరి అని కూడా ఆయనను అంటారు. అట్టి హరిని సేవిస్తే అజ్ఞానం తొలగిపోతుంది. జ్ఞానం వెలిగిపోతుంది.
ప్రతిపదార్ధం:
అరయన్ = తరచి చూసిన; అభ్ర = మేఘముల లోని; తమః = చీకట్ల; ప్రభల్ = కాంతులు; మునున్ = ముందు; నభంబున్ = ఆకాశము; అందున్ = లో; ఒప్పగా = చక్కగా; తోచి = తోచి నప్పటికిని; క్రమ్మఱన్ = మరల; వీక్షింపగన్ = చూచినచో; అందె = అక్కడే; లేని = లేక పోవు; గతిన్ = విధముగా; బ్రహ్మంబున్ = పర బ్రహ్మము; అందున్ = లో; ఈ = ఈ; శక్తులున్ = శక్తులను; పరికింపన్ = పరికించి చూసినచో; త్రిగుణ = త్రిగుణముల; ప్రవాహమునన్ = ప్రవహించుట చేత; ఉత్పన్నంబులు = పుట్టినవి; ఐ = అయ్యి; క్రమ్మఱన్ = మరల; విరతిన్ = లయ మగుట; పొందుచున్ = పొందుతూ; ఉండున్ = ఉండును; కావునన్ = కనుక; హరిన్ = నారాయణుని; విష్ణున్ = విష్ణుని; భజింపన్ = సేవించుట; తగున్ = చేయ తగును.
---------------------------------------------------------------
పంచమ స్కంధం
5P-45 పరిపూర్ణుడ వై
సందర్భం:
నాభి అనే ఒక మహానుభావునకు ఉత్తమ సంతానం పొందాలని కోరిక కలిగింది. యజ్ఞపురుషుడైన వాసుదేవుణ్ణి అతడు గొప్ప భక్తిశ్రద్ధలతో ఆరాధించాడు. ఆ ఆరాధనలో తన సహధర్మచారిణికి కూడ అవకాశం కల్పించాడు. పుండరీకాక్షుడు తన సుందర రూపాన్ని వారికి అనుగ్రహించాడు. అప్పుడు వారు ఆనంద పారవశ్యంతో ఇలా అంటున్నారు.
కం. పరిపూర్ణుడ వై యుండియు,
మఱవక మా పూజలెల్ల మన్నింతువు నీ
చరణారవింద సేవయు,
ధర బెద్దలు చెప్పినటులు దగ జేసెద మౌ.
ప్రతిపదార్ధం:
పరిపూర్ణుడవై = పరిపూర్ణుడవై; ఉండియు = ఉండి కూడ; మఱువక = మరచి పోకుండ; మా = మా యొక్క; పూజలెల్ల = సేవలన్నింటిని; మన్నింతువు = మన్నించె దవు; నీ = నీ యొక్క; చరణారవిందసేవయు = పాదములనెడి పద్మముల సేవను; ధరన్ = భూమిపై; పెద్దలు = పెద్దలు; చెప్పినటులు = చెప్పిన విధముగా; తగన్ = అవశ్యము; చేసెదమౌ = తప్పక చేయుదుము.
తాత్పర్యం:
దేవా! నీవు పరిపూర్ణుడవు. విశ్వమంతా నీలోనే నిలుపుకొన్న అనంతమైన రూపం కలవాడవు. అయినా ఏమరుపాటు ఏమాత్రమూ లేక మమ్మల్నీ, మేము చేసే పూజలనూ మన్నిస్తూ ఉంటావు. ఇంత దయామూర్తివైన నీ చరణారవిందాల సేవను మేము వదలము. అనుభవం పండించుకొన్న ఆత్మారాములు ఉపదేశించిన విధానంతో నీ పాదపద్మాల సేవను మేము నిరంతరమూ చేసుకుంటూనే ఉంటాము. ఔను, ఇది మా వ్రతం.
5-1-162 ధరలోన
సందర్భం:
భరతుడనే మహారాజు సహజంగా వైరాగ్యం పొంది బ్రతుకుతున్నాడు. కొన్ని పరిస్థితులలో ఒక దిక్కుమాలిన లేడికి సంరక్షుడయ్యాడు. దానిమీద కొండంత మమకారం పెంచుకున్నాడు. మరణసమయంలో కూడ దానినే స్మరించటంవలన మరుజన్మలో లేడి అయ్యాడు. అయినా వెనుకటి పుట్టుక జ్ఞాపకాలు పోలేదు. ఆ తరువాతి జన్మలో ఒక అవధూతగా పుట్టి రహూగణుడనే రాజుకు ఈ విధంగా తత్త్వబోధన చేశాడు.
సీ. ధరలోన బ్రహ్మంబు తపమున దానంబులను గృహధర్మంబులను జలాగ్ని
సోమ సూర్యులచేత శ్రుతులచే నైనను బరమభాగవతుల పాదసేవ
బొందినమాడ్కిని బొందంగ రాదని పలుకుదు రార్యులు పరమమునులు
ఘన తపో బాహ్యసౌఖ్యములకు విముఖులునై పుణ్యులు హరిగుణానువాద
తే. మోదితాత్ములు నగుబుధపాదసేవ
ననుదినంబును జేసిన నంతమీద
మోక్షమార్గంబునకును పద్మాక్షునందు
పట్టువడియుండు నెప్పుడు పరగ బుద్ధి
ప్రతిపదార్ధం:
ధరలోన = భూమియందు; బ్రహ్మంబు = పరబ్రహ్మమును; తపమునన్ = తపస్సు చేతను; దానంబులను = దానముల చేతను; గృహధర్మంబులను = గృహస్థ ధర్మములచేతను; జల = జలము; అగ్ని = అగ్ని; సోమ = చంద్రుడు; సూర్యులచేత = సూర్యులచేత; శ్రుతులచేనైనను = వేదములచేతనైనను; పరమ = అత్యున్నతమైన; భాగవతుల = భాగవతుల యొక్క; పాదసేవన్ = పాదములను సేవించుటవలన; పొందిన = పొందినట్టి; మాడ్కిని = విధమున; పొందంగరాదని = పొందలేరని; పలుకుదురు = చెప్పెదరు; ఆర్యులు = శ్రేష్ఠులు; పరమ = అత్యుత్తమ; మునులు = మునులు; ఘన = గొప్ప; తపః = తపస్సు కన్న; బాహ్య = ఇతరమైన; సౌఖ్యములకు = సుఖములకు; విముఖులునై = వ్యతిరిక్తులై; పుణ్యులు = పుణ్యులు; హరి = నారాయణుని; గుణ = గుణములను; అనువాద = కీర్తించుటయందు; మోదితాత్ములును = సంతోషించిన మనసులు గలవారు; అగు = అయిన; బుధ = ఙ్ఞానుల; పాద = పాదములను; సేవన్ = సేవించుటను; అనుదినంబును = ప్రతిదినము; చేసి = చేసి; అంతమీద = ఆ పైన; మోక్ష = మోక్షమును చెందెడి; మార్గంబునకును = మార్గమునకు; పద్మాక్షునందు = విష్ణుని యందు; ఎప్పుడు = నిరతము; పరగబుద్ధి = ప్రవర్తిల్లెడి బుద్దితో; పట్టుపడి = కట్టుబడి; ఉండున్ = ఉండును.
తాత్పర్యం:
రాజా! ఈలోకంలో బ్రహ్మజ్ఞానంకోసం తపస్సులూ, దానాలూ, గృహధర్మాలూ చక్కగా చేస్తూ ఉంటారు. అలాగే నీరు, నిప్పు, చందమామ, భాస్కరుడు మొదలైన దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. వేదాలు వల్లిస్తూ ఉంటారు. కానీ పరమభాగవతుల పాదసేవ చేస్తే గానీ బ్రహ్మము పట్టుపడదని మహాత్ములూ, మహర్షులూ పలుకుతూ ఉంటారు. గొప్ప తపస్సుతో సంబంధంలేని సౌఖ్యాల విషయంలో పెడమొగంపెట్టిన పుణ్యాత్ములు శ్రీహరి గుణాలను వదలకుండా పలుకుతూ మహానందం అనుభవిస్తూ ఉంటారు. అట్టి జ్ఞానమూర్తుల పాదసేవను నిత్యమూ చేస్తూ ఉంటే కొంతకాలానికి బుద్ధి మోక్షమార్గానికి కట్టుబడి ఉంటుంది. శ్రీహరిమీద నెలకొని ఉంటుంది.
5-1-176 అక్కట
సందర్భం:
ఆంగిరసుని పుత్రుడై పుట్టిన జ్ఞాని భరతుడు అవధూతస్థితిలో రహూగణుడనే రాజునకు ఉత్తమ జ్ఞానవిద్యను ఉపదేశించాడు. దానిని శ్రద్ధగా విన్న ఆ సింధురాజు అవధూతతో ఇలా పలుకుతున్నాడు.
కం. అక్కట! మానుషజన్మం,
బెక్కువ యై యుండు నెపు డభేదమతిం బెం
పెక్కిన యోగిసమాగమ,
మక్కజముగ గలిగెనేని యఖిలాత్ములకున్.
ప్రతిపదార్ధం:
అక్కట = ఆహా; ఎపుడున్ = ఎప్పుడైతే; అభేదమతిం = నేనువేరు, బ్రహ్మము వేరు అను భావనలేక; పెంపెక్కిన = అతిశయించిన; యోగిసమాగమ = యోగుల సాంగత్యము; అక్కజముగన్ = ఆశ్చర్యకరముగా; కలిగెనేని = కలిగినచో; అఖిలాత్ములకున్ = సామాన్య పురుషులకు; మానుషజన్మంబు = మానవజన్మ; పెక్కువయై = శ్రేష్ఠమై; ఉండున్ = ఉండును.
తాత్పర్యం:
ఆహా! స్వామీ! ఈ సృష్టిలో అన్ని విధాల వారికి, నేను వేరు, బ్రహ్మము వేరు అనే భావన లేకుండా, ఉన్నది ఒక్కటే అనే జ్ఞానం పూర్తిగా కలిగిన ఆ మహాయోగులతో కలయిక కలిగితే ఆ మానవజన్మయే నిజమైన మానవజన్మగా మెచ్చుకొనదగినదవుతుంది కదా !
5-2ఆ-55 భారతవర్ష
సందర్భం:
పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రుణ్ణి స్వామీ! ఈ భూమి ఏడు ద్వీపాలుగా, ఏడు సముద్రాలుగా అయినట్లు చెప్పారు మీరు. ఈ లోకాలను గూర్చి తెలుసుకుంటే లోకేశ్వరుణ్ణి తెలుసుకున్నట్లే. కాబట్టి ద్వీపాలు, వర్షాలు అనేవాని విశేషాలను నాకు తెలియజెప్పండి అని ప్రార్ధించాడు. శ్రీ శుక యోగీంద్రులు ఆ సందర్భంలో భారతవర్షం మహిమను ఇలా అభివర్ణిస్తున్నారు.
ఉ. భారతవర్ష జంతువుల భాగ్యము లేమని చెప్పవచ్చు! నీ
భారతవర్షమందు హరి పల్మఱు పుట్టుచు జీవకోటికిం
ధీరతతోడ దత్త్వ ముపదేశము సేయుచు జెల్మిసేయుచు
న్నారయ బాంధవాకృతి గృతార్థుల జేయుచునుండు నెంతయున్.
ప్రతిపదార్ధం:
భారతవర్ష = భారతదేశపు; జంతువుల = ప్రాణుల; భాగ్యములు = అదృష్టములు; ఏమని = ఎంతయో ఎలా; చెప్పవచ్చు = చెప్పగలము; ఈ = ఈ; భారతవర్ష మందు = భారతదేశమునందు; హరి = నారాయణుడు; పల్మఱు = అనేకసార్లు; పుట్టుచు = అవతరించుచూ; జీవకోటికిం = ప్రాణుల సమస్తమునకు; ధీరతతోడన్ = ధీశక్తితోటి; తత్త్వము = తత్త్వమును; ఉపదేశము = ఉపదేశించుట; చేయుచు = చేయుచు; చెల్మి సేయుచు = స్నేహముచేయుచూ; ఆరయ = తరచిచూసిన; బాంధవాకృతి = బంధువు వలె; ఎంతయున్ = అధికముగా; కృతార్థుల = ధన్యులను; చేయుచుండును = చేయు చుండును.
తాత్పర్యం:
రాజా! మహాపురుషులు భారతవర్షాన్ని గొప్పగా కొనియాడుతారు. అప్పటివారి మాటలు ఇలా ఉంటాయి. ఆహా! భారతవర్షంలో పుట్టిన జంతువుల భాగ్యాలు చెప్పడానికి మాకు సాధ్యమవుతుందా? ఎందుకంటే ఈ పవిత్రమైన భారతవర్షంలో శ్రీమహావిష్ణువు పెక్కుమారులు అవతరిస్తూ ఉంటాడు. జ్ఞానం పండిన బుద్ధితో ప్రాణికోటులకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు. ఆ బోధచేసే సమయంలో ఆ కరుణామయుడు వారిని ఉధ్దరించాలనే తపనతో కొందరితో చెలిమిచేస్తూ ఉంటాడు. మఱికొందరితో చుట్టరికం కలుపుకుంటూ ఉంటాడు. ఆ విధంగా వారిని కృతార్ధులను చేస్తూ ఉంటాడు.
5D-56 తన జన్మ
సందర్భం:
శ్రీకృష్ణవాసుదేవుని దయ ఎంతగొప్పదో శ్రీశుకమహర్షి పరీక్షిత్తునకు మనోజ్ఞంగా తెలుపుతున్నారు.
కం. తన జన్మకర్మములనుం,
గొనియాడెడివారి కెల్ల గోరిన వెల్లన్
దనియగ నొసగుచు మోక్షం,
బనయము గృపసేయు గృష్ణు డవనీనాథా!
ప్రతిపదార్ధం:
అవనీనాథా = రాజా!; కృష్ణుడు = శ్రీకృష్ణుడు; తన = తన యొక్క; జన్మ = అవతారములు; కర్మములనుం = ఆచరణలను; కొనియాడెడి = పొగిడెడి; వారికి = వారలకు; ఎల్లన్ = అందరకు; కోరినవెల్లన్ = మనోరథములను అన్నిటిని; తనియగన్ = తనివి తీరునట్లుగ; ఒసగుచు = ఇచ్చుచు; మోక్షంబు = మోక్షమును; అనయము = తప్పక; కృపచేయు = దయతో కలుగ జేయును.
తాత్పర్యం:
రాజా! శ్రీకృష్ణపరమాత్మ భారతవర్షంలో ప్రాణులను ఉద్ధరించటానికి అవతరించాడు. ఆ మహాత్ముడు భూమిలో తాను అవతరించినప్పటి విశేషాలనూ, తాను లోకరక్షణ కోసం చేసిన మహాకార్యాలను శ్రద్ధతో, ఆదరంతో చెప్పుకొనే వారందరికీ తనివితీరా కోరినవన్నీ ప్రసాదిస్తాడు. అంతేకాదు! ఎంతో పుణ్యం పండించుకొన్న మహనీయులకు, గొప్పతపస్సులు చేసిన యోగులు మొదలగువారికి కూడా లభించని మోక్షం కూడా అనుగ్రహిస్తాడయ్యా!

షష్ఠమ స్కంధం
6-12 ఎమ్మెలు
సందర్భం:
తెలుగు భాగవతంలో ఆరవ స్కంధాన్ని ఏర్చూరి సింగయ రచించాడు. తనకు మార్గదర్శకుడైన బమ్మెరపోతన్న గారిని పరమభక్తితో ఇలా స్తుతిస్తున్నాడు సింగయ.
ఉ. ఎమ్మెలు సెప్పనేల? జగ మెన్నగ పన్నగరాజశాయికిన్
సొమ్ముగ వాక్యసంపదలు సూఱలు చేసినవాని, భక్తిలో
నమ్మినవాని, భాగవత నైష్ఠికు డై తగువాని, పేర్మితో
బమ్మెర పోతరాజు కవిపట్టపురాజు దలంచి మ్రొక్కెదన్.
ప్రతిపదార్ధం:
ఎమ్మెలు = ప్రగల్భములు; చెప్పనేల = చెప్పుట ఎందులకు; జగము = లోకము ఎన్నగన్ = కీర్తించగా; పన్నగరాజశాయికిన్ = ఆదిశేషుడు పాన్పుగా కల నారాయణు నికి; సొమ్ముగా = సొమ్ములుగా; వాక్యసంపదలు = మాటలనెడి సంపదలు; చూఱలు చేసినవాని = కొల్లలుగా సమర్పించిన వానిని; భక్తి = భక్తిగా; లోనమ్మినవాని = మనసు లో నమ్మినవానిని; భాగవత = భాగవతులలో; నైష్ఠికుడై = నిష్ఠ గలవాడై; తగువాని = తగిన వానిని; పేర్మితో = ఆదరముతో; బమ్మెఱ పోతరాజు = బమ్మెఱ పోతన అను; కవి పట్టపురాజున్ = కవులలో మిక్కిలి శ్రేష్ఠుడైన వానిని; తలంచి = సంస్మరించి; మ్రొక్కెదన్ = కొలిచెదను.
తాత్పర్యం:
వినోదం మాటలు ఎందుకులెండి. ఉన్నమాట ఉన్నట్టు అంటాను అంటారు మా గురువు పోతన్నగారు. అందువలననే ఆదిశేషుని పడగలమీద పవ్వళించే పరమాత్మకు ఆభరణాలు అయ్యే తీరుతో వాక్యాలసంపదలు కొల్లలుగా నివేదించుకున్నారు. దానిని జగమంతా కొనియాడింది. పరమభక్తితో ఆ స్వామినే నమ్ముకొని జీవించారు. భగవంతుని కథలమీదా, భగవంతుని భక్తుల కథలమీదా పరమనిష్ఠగల భాగవతోత్తములు వారు. అట్టి కవిసార్వభౌముడని కొనియాడదగిన బమ్మెర పోతనగారిని స్మరిస్తూ మ్రొక్కులు చెల్లించుకుంటాను.
6-14 ఎయ్యది
సందర్భం:
ఏర్చూరి సింగన బమ్మెర పోతనను భక్తితో ఉపాసించిన ఉత్తమకవి. ఆ ప్రభావంతో ఏర్పడిన సంస్కారబలంతో భాగవతం ఒక పరమ మంత్రంగా సంభావించి దానిని పలుకుతానంటున్నాడు.
ఉ. ఎయ్యది కర్మబంధముల నెల్ల హరించు, విభూతికారణం
బెయ్యది, స న్మునీంద్రులకు నెల్ల గవిత్వసమాశ్రయంబు ము
న్నెయ్యది, సర్వమంత్రముల నేలిన దెయ్యది, మోక్షలక్ష్మిరూ
పెయ్యది, దానిఁ బల్కెద సుహృద్యము భాగవతాఖ్య మంత్రమున్.
ప్రతిపదార్ధం:
ఎయ్యది = ఏది ఐతే; కర్మ = కర్మము యొక్క; బంధములన్ = బంధనములను; ఎల్లన్ = సమస్తమును; హరించు = నశింపజేసెడి; విభూతి = వైభవమునకు; కారణంబు = కారణమైనది; ఎయ్యది = ఏదైతే; సత్ = మంచి; ముని = మునులలో; ఇంద్రుల్ = ఇంద్రుని వంటివారి; కున్ = కి; ఎల్లన్ = అందరి; కవిత్వ = కవిత్వమునకు; సమాశ్రయంబు = చక్కటి ఆశ్రయమైనది; మున్ను = పూర్వము నుండి యున్నది; ఎయ్యది = ఏదైతే; సర్వ = సమస్తమైన; మంత్రములన్ = మంత్రములను; ఏలినది = పాలించునది; ఎయ్యది = ఏదైతే; మోక్ష = మోక్ష మనెడి; లక్ష్మీ = సంపదల; రూపు = స్వరూపము; ఎయ్యది = ఏదైతే; దానిన్ = దానిని; పల్కెద = చెప్పెదను; సు = మంచి; హృద్యము = మనసులకు నచ్చు నట్టిది; భాగవత = భాగవతము యనెడి; ఆఖ్య = పేరు గల; మంత్రమున్ = మంత్రము యైన దానిని.
తాత్పర్యం:
భాగవతం అంటే భగవంతునికి సంబంధించిన గుణగణాలను ప్రపంచించి చెప్పే ఒక మహామంత్రం. అది కర్మలవలన కలిగే బంధాలన్నింటినీ తొలగించివేస్తుంది. పొందదగిన గొప్పసంపదలన్నింటినీ భక్తులకు సిద్ధింపజేస్తుంది. నిత్యసత్యమైన పరతత్త్వాన్ని మాత్రమే పలకాలనే పట్టుదలగల మహర్షులు వాల్మీకికీ, వ్యాసుల వారికీ అత్యద్భుతమైన కవిత్వభిక్ష పెట్టింది. మంత్రాలన్నింటినీ ఏలిన మహామంత్రం అది. ఒక్కమాటలో చెప్పాలంటే అది అందరూ అందుకోవలసిన మోక్షలక్ష్మియే. భక్తుల హృదయాలలో భద్రంగా నెలకొని ఉండేది ఆ మంత్రమే. కనుక నేను దానినే వాక్కులతో ఉపాసిస్తాను.
—--------------------------------
6-23 భాగవతము
సందర్భం:
భాగవతం మరొక రూపంలో మనకు దొరకిన వేదం. అది జ్ఞానదీపం. దానిని తెలిసి పలకటం తేలికైన పనికాదు. ఆ గౌరవాన్ని చక్కగా గమనించి పలుకుతున్నాను అంటున్నారు సింగయ్య కవి.
ఆ. భాగవతము తేటపఱుప నెవ్వడు సాలు ?
శుకుడు దక్కనరుని సకుడు దక్క
బుద్ధి దోచినంత, బుధులచే విన్నంత,
భక్తి నిగిడినంత, పలుకువాడ.
ప్రతిపదార్ధం:
భాగవతమున్ = భాగవతమును; తేటపఱుపన్ = తెలియ జెప్పుటకు; ఎవ్వడు = ఎవరు; చాలున్ = సరిపోగలరు; శుకుడు = శుకయోగి; తక్క = తప్పించి; నరునిసఖుడు = కృష్ణుడు {నరునిసఖుడు - నరుడు (అర్జునుడు) యొక్క సఖుడు, కృష్ణుడు}; తక్క = తప్పించి; బుద్ధిన్ = నా బుధ్ధికి; తోచినంత = అందినంతవరకు; బుధుల్ = జ్ఞానుల; చేన్ = చేత; విన్నంత = వినినంత; భక్తి = నాభక్తి; నిగిడినంత = సాగినంతవరకు; పలుకువాడ = చెప్పెదను.
తాత్పర్యం:
భాగవతం స్పష్టంగా తెలియజెప్పటానికి చాలినవారు ఇద్దరు మాత్రమే. ఒక మహాత్ముడు శుకయోగీంద్రుడు. రెండవవాడు సాక్షాత్తు పరమాత్మయే అయిన శ్రీకృష్ణవాసుదేవుడు. నాబుద్ధిని ప్రేరణచేసి స్వామి ఎంత అందిస్తాడో అంత పలుకుతాను. జ్ఞానసంపన్నులైన పండితులు చెప్పగా చెవులబడినంత పట్టుకొని పలుకుతాను. అన్నింటికంటె ముఖ్యమైనది భక్తి. అది ఎంతదూరం సాగితే అంత చెబుతాను.
6-52 కొందరు పుణ్యవర్తనులు
సందర్భం:
పరీక్షిత్తు శుకయోగీంద్రులను పాప పంకిలం నుండి బయటపడటం ఎలా అని ప్రశ్న చేశారు. దానికి సమాధానంగా శుకులు ఇలా వివరిస్తున్నారు.
ఉ. కొందరు పుణ్యవర్తనులు గోపకుమార పదారవింద జా
నంద మరందపాన కలనా రత షట్పదచిత్తు లౌచు, గో
వింద పరాయణుల్ విమలవేషులు దోష మడంతు రాత్మలం
జెందిన భక్తిచేత రవి చేకొని మంచు నడంచుకై వడిన్.
ప్రతిపదార్ధం:
కొందఱు = కొంతమంది; పుణ్యవర్తనులు = పుణ్యమార్గనుసారులు; గోపకుమార = కృష్ణమూర్తి {గోపకుమారుడు - (నంద) గోపుని యొక్క కుమారుడు, కృష్ణుడు}; పద = పాదములు యనెడి; అరవింద = పద్మదళముల; జా = పుట్టిన; ఆనంద = ఆనంద మనెడి; మరంద = తేనెను; పానకలన = తాగుట యందు; ఆరతన్ = ఆతృత గల; షట్పద = తుమ్మెదలవంటి; చిత్తులు = మనసులు గలవారు; ఔచున్ = అగుచూ; గోవింద = గోవిందుని యెడల; పరాయణుల్ = లగ్నమైనవారు; విమల = స్వచ్ఛమైన; వేషులు = వర్తన గలవారు;దోషమున్ = పాపములను; అడంతురు = అణచివేయుదురు; ఆత్మలన్ = తమ ఆత్మలను; చెందిన = పొందిన; భక్తి = భక్తి; చేతన్ = చేత; రవి = సూర్యుడు; చేకొని = పూనుకొని; మంచున్ = మంచుతెరలను; అడంచు = అణచివేయు; కైవడిన్ = వలె.
తాత్పర్యం:
రాజా ! లోకంలో కొందరు సర్వకాలాలలో పుణ్యకార్యాలే చేస్తూ ఉంటారు. వారి నడవడి అంతా పవిత్రంగానే ఉంటుంది. వారు గోపకుమారుడున్నాడే! అదేనయ్యా కృష్ణయ్య! ఆయన పాదాలను పద్మాలుగా భావించి అందునుండి జాలువారే ఆనందం అనే మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆ స్థితిలో వారి హృదయం తుమ్మెద వంటి దవుతుంది. ఆ విధంగా గోవిందుడే పరమగతి అన్న భావనలో నిశ్చలంగా ఉండే భక్తులు స్వచ్ఛమైన వేషం తాల్చి పాపాలను పటాపంచలు చేసుకుంటారు. వారి ఆత్మలలో చక్కగా కుదురుకొన్న భక్తిచేత, సూర్యుడు మంచును అణచివేసినట్లుగా, పాపాలను బాపుకుంటారు.
6-53 హరిభక్తి
సందర్భం:
విష్ణుభక్తిని పెంపొందించుకుంటే పరమాత్మను చేరుకొనే దారిలోని అడ్డంకులన్నీ తొలగిపోవటాన్ని శ్రీ శుక యోగీంద్రులు పరీక్షిత్తునకు ఇలా తెలియజేస్తున్నారు.
కం. హరిభక్తి చేత కొందఱు
పరిమార్తురు మొదలు ముట్ట బాపంబుల ని
ష్ఠురతర కరముల సూర్యుం
డరుదుగ, బెనుమంచుపించ మణచినభంగిన్.
ప్రతిపదార్ధం:
హరి = విష్ణుమూర్తి పైనభక్తి = భక్తిచేతన్ = వలనకొందఱు = కొంత మందిపరిమార్తురు = నాశనము చేసెదరుమొదలు ముట్ట = మొద లంటపాపంబులన్ = పాపములనునిష్ఠురతర = అతితీవ్రమైన {నిష్ఠుర - నిష్ఠురతర - నిష్ఠురతమ} కరములన్ = కిరణముల చేతసూర్యుండు = సూర్యుడుఅరుదుగా = అపూర్వముగాపెను = పెద్దమంచున్ = మంచుపించ మడచిన = గర్వభంగము చేసినభంగిన్ = విధముగా
తాత్పర్యం:
మానవుని పట్టిపల్లార్చేవి పాపాలు. వానిని మూలముట్టుగా మట్టుపెట్టటం మానవునకు తప్పని కర్తవ్యం. ఆ పని చేయకపోతే కలిగేది భ్రష్టతయే. సూర్యభగవానుడు తన తీవ్ర కిరణాలతో బాగా క్రమ్ముకొన్న మంచు పొగరు అణచివేయకపోతే మానవునకు దారి కానరాదు. సూర్యుడు మంచును చీల్చి వెలుగును ప్రసాదించినట్లుగా శ్రీవాసుదేవభక్తి పాపాలను సమూలంగా తొలగించి వేస్తుంది. భగవద్దర్శనానికి అడ్డంగా ఉన్న తెర దానితో తొలగిపోతుంది.
6-58 సతతము
సందర్భం:
శ్రీశుకయోగీంద్రులు పరీక్షిన్మహారాజునకు కృష్ణభక్తి వలన లభించే మహాఫలాన్ని మధురమైన మాటలతో ఇలా వివరిస్తున్నారు.
చ. సతతము కృష్ణ పాదజలజంబులయందు మనంబు నిల్పు సు
వ్రతులు తదీయ శుద్ధ గుణరాగులు కాలుని యుగ్రపాశ సం
హతుల ధరించు తత్సుభటవర్గములం గలలోన గానరే
గతులను దుష్టకర్మములు గైకొని వారల జెందనేర్చునే?
ప్రతిపదార్ధం:
సతతము = ఎల్లప్పుడుకృష్ణ = కృష్ణునిపాద = పాదములు యనెడిజలజంబులన్ = పద్మములఅందున్ = అందుమనంబున్ = మనసునునిల్పు = నిలిపెడిసు = చక్కటివ్రతులు = దీక్ష గల వారుతదీయ = అతనిశుద్ధ = పరిశుద్ధ మైనగుణ = సుగుణము లందురాగులు = అనురాగము గల వారుకాలుని = యమునియుగ్ర = భయంకర మైనపాశ = పాశములసంహతులన్ = గట్టిగాకొట్టుటనుధరించు = ధరించెడితత్ = అతనిసుభటక = గొప్పభటులవర్గములన్ = సమూహములనుకల = స్వప్నములోనన్ = లోనైననుకానరు = పొందరుఏ = ఏగతులను = విధముగనుదుష్ట = పాపపు, చెడ్డకర్మములు = కర్మలుకైకొని = చేపట్టివారలన్ = వారినిచెందన్ = చేరుటనునేర్చునే = కలుగునా.
తాత్పర్యం:
రాజా ! శ్రీకృష్ణుడు పరమాత్మ. నామరూపాలులేని పరమాత్మ లోకాలను అనుగ్రహించటం పనిగా శ్రీకృష్ణమూర్తియై భూమికి దిగివచ్చాడు. ఆయన పాదపద్మాలయందు నిరంతరం మనస్సును నిక్షేపించాలి. అలా చేసేవారిని ‘సువ్రతులు’ అంటారు. ఆ మహాత్ముడు మానవులను ఉద్ధరించటంకోసం భూమిపై సంచరించిన కాలంలో కొన్ని గుణాలను లీలలుగా ప్రకటించాడు. మనం అట్టి అతని శుద్ధగుణాలయందు చెదరని అనురాగం కలవారమైపోవాలి. అలా అయిన వారు భయంకర పాశాల దెబ్బలను వడ్డించే యమభటుల గుంపులను కలలో కూడా చూడరు. ఎటువంటి ఘోరమైన కర్మముల చేయగల అధికార పురుషులైనా కృష్ణభక్తుల దాపునకు ఏవిధంగానూ రాలేరు.
6-72 దూరమున
సందర్భం:
అజామీళుడు అనే ఒక పాపడు పాపాలపుట్ట. కన్యాకుబ్జంలో ఉండేవాడు. సంసార లంపటంలో మునిగి తేలుతూ ఎనభై ఎనిమిదేండ్ల జీవితం వ్యర్థం చేసుకున్నాడు. చివరికి పోగాలం దాపురించింది. యమభటులు ఎదురుగా హృదయం అదరిపోయేలా నిలబడి ఉన్నారు. ఆ సమయంలో అతనికి తన కడగొట్టు ముద్దులపట్టి నారాయణుడు తలపులో మెదిలాడు.
కం. దూరమున నాడు బాలుడు
బోరన దన చిత్తసీమ బొడగట్టిన నో
నారాయణ! నారాయణ! నారాయణ!
యనుచు నాత్మనందను నొడివెన్.
ప్రతిపదార్ధం:
దూరమునన్ = దూరము నందు; ఆడు = ఆడుకొనుచున్న; బాలుడు = పిల్లవాడు; బోరనన్ = శీఘ్రమే; తన = తన యొక్క; చిత్తసీమ = మనసు పొరలలో; పొడగట్టినన్ = కనపడగా; ఓ = ఓ; నారాయణ = నారాయణ; నారాయణ = నారాయణ; నారాయణ = నారాయణ; అనుచున్ = అంటూ; ఆత్మ = తన యొక్క; నందనున్ = కొడుకును; నొడివెన్ = పలికెను.
తాత్పర్యం:
తాను ముచ్చటపడి అతనితోడిదే బ్రతుకు అన్నట్లు కనిపెంచిన నారాయణ నామం గల కొడుకు దూరాన ఆడుకొంటున్నాడు. ఒకవంక యమభటులు తర్జిస్తూ గర్జిస్తూ ప్రాణాలను గుంజుకొనిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. అదృష్టవశాన నారాయణుడు గుర్తుకువచ్చాడు. అప్పుడా మహాపాతక శిరోమణి నారాయణా! నారాయణా! నారాయణా! అని మూడుమారులు గొంతెత్తి పిలిచాడు. కొడుకు నారాయణుడు పలికాడో లేదో కానీ పరమాత్మ అయిన నారాయణుడు అనుగ్రహించి పాపాలన్నీ పోగొట్టి అతనిని అక్కున చేర్చుకున్నాడు.
6-113 నెమ్మి తొడలమీద
సందర్భం:
పాపాలపుట్ట అయిన అజామీళుని విషయంలో ధర్మదూతలకూ, భగవద్దూతలకూ పెద్ద వాగ్వాదం జరిగింది. భగవద్దూతలు ధర్ముని దూతలకు ఒక ధర్మసూక్ష్మాన్ని దృష్టాంత పూర్వకంగా బోధిస్తున్నారు.
గీ. నెమ్మి తొడలమీద నిద్రించు చెలికాని
నమ్మదగినవాడు నయము విడిచి
ద్రోహబుద్ధి జంప దొడరునే? యెం దైన
బ్రీతి లేక ధర్మదూతలార !
ప్రతిపదార్ధం:
నెమ్మిన్ = ప్రేమగా; తొడల = తొడల; మీద = పైన; నిద్రించు = నిద్రపోవుచున్న; చెలికాని = స్నేహితుని; నమ్మదగినవాడు = నమ్మకస్తుడు; నయము = న్యాయమును; విడిచి = వదలేసి; ద్రోహ = మోసపు; బుద్ధిన్ = బుద్ధితో; చంపన్ = చంపుటకు; తొడరునె = యత్నించునా; ఎందైనన్ = ఎక్కడైనను; ప్రీతి = ప్రేమ; లేక = లేకుండగ; ధర్మదూతలార = యమదూతలారా.
తాత్పర్యం:
ధర్మరాజభటులారా! ఒకడు ప్రేమతో ఒక చెలికానిని నిండుగా నమ్మి అతని తొడలమీద ఆదమరచి నిద్రపోతున్నాడు. రెండవవాడు నీతిమాలి ద్రోహబుద్ధితో ప్రీతితప్పి వానిని చంపటానికి పూనుకుంటాడా ఎక్కడైనా? అన్నారు విష్ణుభటులు. అజామీళుడు పాపాలన్నీ చేసినవాడే. కానీ అంత్యకాలంలో అసంకల్పితంగానయినా భగవన్నామాన్ని ఉచ్చరించాడు. అదే అతడు నమ్మి నెమ్మితో చెలికాని తొడలమీద నిద్రించటం. అట్టివానికి ద్రోహం చేయరాదని భగవద్దూతల అభిప్రాయం.
6-117 బ్రహ్మహత్యానేక
సందర్భం:
హరినామ సంకీర్తనం అత్యద్భుతమైన ఫలాలను ప్రసాదిస్తుంది. కీర్తన చేసేవాని పాపాల చిట్టాలను చూడవలసిన అవసరం దానికి లేదు అని నిరూపిస్తున్నారు అజామీళుని తీసుకొనిపోవటానికి వచ్చిన యమభటులతో విష్ణుభక్తులు.
సీ. బ్రహ్మహత్యానేక పాపాటవుల కగ్ని కీలలు హరినామ కీర్తనములు
గురుతల్ప కల్మషక్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు
తపనీయ చౌర్యసంతమసంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు
మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు
తే. మహిత యాగోగ్ర నిత్యసమాధి విధుల
నలరు బ్రహ్మాది సురలకు నందరాని
భూరి నిర్వాణసామ్రాజ్యభోగభాగ్య
ఖేలనంబులు హరినామ కీర్తనములు
ప్రతిపదార్ధం:
బ్రహ్మహత్య = బ్రహ్మహత్య మొదలైన; అనేక = అనేకమైన; పాప = పాపములు యనెడి; అటవులు = అడవుల; కున్ = కి; అగ్నికీలలు = నిప్పుల మంటలు వంటివి; హరి = విష్ణుమూర్తి; నామ = నామములను; కీర్తనములు = కీర్తించుటలు; గురు = గురువు; తల్ప = భార్యా సంగమ; కల్మష = పాపము యనెడి; క్రూర = క్రూరమైన; సర్పములు = పాములకు; కేకులు = నెమళ్ళు వంటివి; హరి = విష్ణుమూర్తి; నామ = నామములను; కీర్తనములు = కీర్తించుటలు; తపనీయ = బంగారమును; చౌర్య = దొంగతనము యనెడి; సంతమసంబున్ = చిక్కటి చీకట్ల; కున్ = కు; సూర్య = సూర్యుని; కిరణముల్ = కిరణములవంటివి; హరి = విష్ణుమూర్తి; నామ = నామములను; కీర్తనములు = కీర్తించుటలు; మధుపాన = మధ్యముత్రాగిన; కిల్బిష = పాపము యనెడి; మద = మదించిన; నాగ = ఏనుగుల; సమితి = సమూహమున; కిన్ = కి; కేసరుల్ = సింహముల వంటివి; హరి = విష్ణుమూర్తి; నామ = నామములను; కీర్తనములు = కీర్తించుటలు;
మహిత = గొప్ప; యోగ = యోగములలో; ఉగ్ర = తీవ్రమైనవాని; నిత్య = శాశ్వతమైన; సమాధి = సమాధి; విధులన్ = కర్మము లందు; అలరు = అలరారెడి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలగు; సురలు = దేవతల; కున్ = కు; అందరాని = అందకోలేని; భూరి = అత్యంత గొప్పదైన; నిర్వాణ = మోక్ష; సామ్రాజ్య = సామ్రాజ్యము యొక్క; భోగ = భోగములు; భాగ్య = భాగ్యములతో కూడిన; ఖేలనంబులు = విలాసములు; హరి = విష్ణుమూర్తి; నామ = నామములను; కీర్తనములు = కీర్తించుటలు.
తాత్పర్యం:
యమభటులారా! ఈవిషయం మీరు సరిగా తెలుసుకోండి. బ్రహ్మహత్య మొదలైన ఘోరపాపాలనే కారడవులను కాల్చిపారవేసే అగ్మిజ్వాలలు హరినామ కీర్తనలు. తల్లులే అయిన గురుపత్నులను కామదృష్టితో చూచే పాపాత్ములనే విషసర్పాలకు నెమళ్ళు హరినామ కీర్తనములు. బంగారాన్ని దొంగిలించటం అనే కాఱుచీకటికి సూర్య కిరణాలు శ్రీహరి కీర్తనలు. మద్యపానం అనే పాపం ఒక మదించిన ఏనుగులమంద అయితే దానికి సింహాలు అవుతాయి శ్రీహరినామ కీర్తనలు. మహాయోగవిద్యను అతి కఠిన నియమాలతో అలవరచుకొని నిత్యసమాధి విధులతో ఆనందమందే బ్రహ్మ మొదలైన దేవతలు కూడా అందుకోలేని మోక్షసామ్రాజ్య భోగభాగ్యాలతోడి క్రీడలు హరినామ సంకీర్తనలు.
6-119 కామంబు
సందర్భం:
నామజపం మహాపుణ్యప్రదం. విష్ణుభక్తులు యమభటులకు దానిని చక్కగా వివరిస్తున్నారు. అజామీళోపాఖ్యానం లోని ఒక అద్భుతమైన పద్యం ఇది.
కం. కామంబు, పుణ్యమార్గ,
స్థేమంబు, మునీంద్ర సాంద్ర చేతస్సరసీ
ధామంబు, జిష్ణు నిర్మల,
నామంబు దలంచువాడు నాథుడు గాడే?
ప్రతిపదార్ధం:
కామంబు = కోరదగినది; పుణ్య = పుణ్యవంత మైన; మార్గ = విధానమునకు; స్థేమంబు = స్థిరమైన స్థానములు; ముని = మునులలో; ఇంద్ర = ఇంద్రుని వంటివారి; సాంద్ర = చిక్కటి; చేతస్ = మనసు యనెడి; సరసీ = సరస్సుల; ధామంబులు = నివాసములు; జిష్ణు = విష్ణుమూర్తి యొక్క; నిర్మల = స్వచ్ఛమైన; నామంబున్ = నామములను; తలచువాడు = స్మరించెడి వాడు; నాథుడు = మించిన వాడు; కాడే = కాడా ఏమి.
తాత్పర్యం:
యమభటులారా! శ్రీమహావిష్ణువునకు ‘జిష్ణుడు’ అని కూడా వ్యవహారం ఉన్నది. అంటే సర్వలోకాలలో సర్వదేశాలలో జయించటమే ఆయన శీలం. అట్టి మహాత్ముని మచ్చలేని నామాన్ని జపించటం అందరికీ కోరదగిన విషయం. జపంచేసేవానిని పుణ్యాల మార్గంనుండి జారిపోకుండా నిలుపుతుంది. మహర్షివరేణ్యులందరూ తమ హృదయాలనే సరస్సులను ఆ నామమునకు దేవాలయంగా నిర్మించుకుంటారు. అట్టి నామాన్ని గట్టిగా భావించే పుణ్యాత్ముడు ‘స్వామి’ కాకుండా పోతాడా?
6-121 బిడ్డపేరు పెట్టి
సందర్భం:
భగవంతుని నామాన్ని ఏ విధంగా పలికినా పాపాలు పారిపోతాయి అని యమభటులకు విష్ణుభక్తులు వివరిస్తున్నారు.
ఆ. బిడ్డపేరు పెట్టి పిలుచుట, విశ్రామ
కేళి నైన, మిగుల గేలి నైన,
పద్య గద్య గీత భావార్ధముల నైన
కమలనయను తలుప కలుషహరము.
ప్రతిపదార్ధం:
బిడ్డ = పుత్రుని; పేరు = పేరు; పెట్టి = తో; పిలుచుట = పిలుచుట; విశ్రామ = కాలక్షేపపు; కేళిన్ = ఆటలకి; ఐనన్ = అయి నప్పటికిని; మిగులన్ = మిక్కిలి; గేలిన్ = పరిహాసమునకు; అయినన్ = అయి నప్పటికిని; పద్య గద్య = కావ్య రూపములు; గీత = కీర్తనల లోని; భావ = గంభీర భావాలు; అర్థములన్ = అర్థాలతో; ఐనన్ = అయి నప్పటికిని; కమలనయను = నారాయణుని {కమల నయనుడు - కమలముల వంటి నయనములు గల వాడు, విష్ణువు}; తలపన్ = స్మరించిన; కలుష = (అవి) పాపములను; హరము = నశింప జేయును.
తాత్పర్యం:
అయ్యా ! యమభటులారా! కొడుకునకు స్వామి పేరుపెట్టుకొని పిలవటమూ, తీరిక సమయాలలో ఆటలాడుకొంటూ కానీ, వేళాకోళానికి కానీ, పద్యాలలో, గద్యాలలో, పాటలలో, కూనిరాగాలలో కానీ, కమలాక్షుణ్ణి స్మరించటమూ పాపాలను రూపుమాపి వేస్తుంది. కాగా నిష్ఠతో చేసే జపము మొదలైన వాని ఫలం ఏ ఎత్తులో ఉంటుందో ఎవరు చెప్పగలరు ?
6-123 అతిపాపములకు
సందర్భం:
విష్ణుదూతలు యమదూతలకు పాపాల స్వభావాలను, వాని పరిహారాలను, వానికి సంబంధించిన విశేషాలను బోధిస్తున్నారు. పరమపురుష పాదపద్మ సేవవలన కలిగే సిద్ధిని కూడా తెలుపుతున్నారు.
సీ. అతిపాపములకు ప్రయత్నపూర్వకముగ తనుపాపములకు మితంబుగాగ
సన్ముని వరులచే సంప్రోక్తమై యుండు నిర్మలం బగు పాప నిష్కృతములు
క్రమరూపమున నుపశమనంబు లగు గాని తత్ క్షణంబున నవి దరువలేవు
సర్వకర్మంబుల సంహార మొనరించి చిత్తంబునకు తత్త్వ సిద్ధి నొసగు
తే. ఒనర నీశుసేవ, యోగి మానస సరో
వాసుసేవ హేమవాసుసేవ,
వేదవేద్యుసేవ, వేదాంతవిభుసేవ
పరమపురుష పాదపద్మసేవ.
ప్రతిపదార్ధం:
అతి = ఘోరమైన; పాపముల = పాపముల; కున్ = కు; ప్రయత్నపూర్వకముగన్ = ప్రయత్నించి చేయగల; తనుపాపముల = చిన్న పాపముల; కు = కు; మితంబు = తగ్గించేవి; కాగ = కాడానికి; సత్ = మంచి; ముని = మునులలో; వరుల = ఉత్తముల; చేన్ = చేత; సంప్రోక్తము = ఉపదేశించ బడినవి; ఐ = అయ్యి; ఉండు = ఉంటాయి; నిర్మలంబు = స్వచ్చ మైనవి; అగు = ఐన; పాప = పాపముల; నిష్కృతములు = ప్రాయశ్చిత్తములు; క్రమరూపమునను = మెల్లిమెల్లిగా; ఉపశమనంబులు = ఉపశమనము నిచ్చునవి; అగున్ = ఔతాయి; కాని = కాని; తత్ = ఆ; పాప = పాపముల; చయములున్ = సమూహములను; తరువ = తరింప, దాటించ; లేవు = లేవు; సర్వ = సమస్త మైన; కర్మంబులన్ = కర్మలను; సంహారము = నాశనము; ఒనరించి = చేసి; చిత్తంబున్ = మనసు; కున్ = కు; తత్త్వ = పరతత్త్వ; సిద్ది = సిద్ధిని; ఒసగు = కలుగ జేయును;
ఒనరన్ = చక్కగా; ఈశు = భగవంతుని; సేవ = భక్తి; యోగి మానస సరోవాసు = నారాయణుని {యోగి మానస సరోవాసుడు - యోగి (యోగుల యొక్క) మానస (మనసు లనెడి) సరః (సరస్సు లందు) వాసుడు (నివసించెడివాడు), విష్ణువు}; సేవ = భక్తి; హేమ వాసు = నారాయణుని {హేమవాసుడు – కనకాంబరములను ధరించు వాడు, విష్ణువు}; సేవ = భక్తి; వేదవేద్యు = నారాయణుని {వేదవేద్యుడు - వేదములచే వేద్యుడు (తెలియబడు వాడు), విష్ణువు}; సేవ = భక్తి; వేదాంత విభు = నారాయణుని {వేదాంత విభుడు - వేదాంతములు (ఉపనిష త్తాదులు) యందలి విభుడు (ప్రభువు), విష్ణువు}; సేవ = భక్తి; పరమ పురుష = నారాయణుని {పరమ పురుషుడు - సర్వమునకు పరమైన పురుషుడు, విష్ణువు}; పాద = పాదము లనెడి; పద్మ = పద్మముల; సేవ = భక్తి.
తాత్పర్యం:
యమభటులారా! అతిఘోరమైన మహాపాతకాలు బ్రహ్మహత్య మొదలైనవి ఉంటాయి . దానికి ఎంతో ప్రయత్నం చేసి గానీ, ప్రాయశ్చిత్తం చేసుకోలేము. చిన్నిచిన్ని పాపాలకు కొద్దిపాటి ప్రాయశ్చిత్తాలుంటాయి. ఈ అన్నింటినీ మహర్షులు లోకానికి చక్కగా చెప్పి ఉన్నారు. వాని నాచరించి పాపాలను పోగొట్టుకొని మానవులు నిర్మలమానసులు కావాలి. అలా కావటం హఠాత్తుగా జరిగేపనికాదు. క్రమక్రమంగా, కాలం గడచినమీదట ఆ పాపాలు ఉపశమనం పొందుతాయి. కానీ యోగిహృదయపద్మాలే ఆలయం అయిన వాడూ, పట్టుపుట్టాలు కట్టేమహాస్వామీ, వేదాలముఖంగానే తెలియదగిన ఆత్మస్వరూపుడూ, వేదాంతాలకు ప్రవర్తకుడూ, పరమపురుషుడూ అయిన వాసుదేవుని పాదసేవమాత్రం, అన్ని కర్మలనూ, వాని ఫలాలనూ అప్పటికప్పుడు రూపుమాపి చిత్తానికి తత్త్వసిద్ధిని కలిగిస్తుంది.
6-152 హరిభక్తులతో
సందర్భం:
అజామీళుని యమలోకానికి ఈడ్చుకు పోవడానికి వచ్చిన యమభటులు విష్ణు భక్తుల విమల విచార వివేక వాక్యాలకు విస్మయం పొంది తమ దారిన తాము వెళ్ళి పోయారు. అజామీళుడు వారి సంవాదమంతా విన్నాడు. తీవ్రమైన పశ్చాత్తాపంతో గాఢమైన పరితాపం పొందాడు. అతని హృదయంలో వైష్ణవ జ్ఞానదీపం చక్కగా వెలుగొందింది. ఇలా అనుకుంటున్నాడు.
క. హరిభక్తులతో మాటలు
ధర నెన్నడు జెడని పుణ్యధనముల మూటల్
వర ముక్తికాంత తేటలు
నరిషడ్వర్గంబు చొరని యరుదగు కోటల్
ప్రతిపదార్ధం:
హరి = నారాయణుని; భక్తుల = భక్తుల; తో = తోటి; మాటలు = సంభాషణములు; ధరన్ = భూమి పైన; ఎన్నడున్ = ఎప్పటికి; చెడని = నశించని; పుణ్య = పుణ్యము యనెడి; ధనముల = సంపదల; మూటల్ = మూటలు; వర = ఉత్తమ మైన; ముక్తి = ముక్తి యనెడి; కాంత = స్త్రీ యొక్క; తేటలు = స్వచ్చ మైన ప్రసంగములు; అరిషడ్వర్గంబు = కామ, క్రోధ మద, మోహ, లోభ, మాత్సర్యాలు అనే ఆరుగురు శత్రువులు; చొరని = ప్రవేశించ లేని; అరుదగు = అద్భుతమైన; కోటల్ = కోటలు.
తాత్పర్యం:
శ్రీ మహావిష్ణువునందు చెదరని భక్తిగల మహాత్ముల మాటలు పుణ్యధనాల మూటలు. వానికి భూమిలో ఎన్నటికీ చేటు ఉండదు. అవి ఎన్నిజన్మలకోగానీ అందుకోరాని మోక్షలక్ష్మి అనుగ్రహించే ప్రసన్నతలు. మనలోనే దొంగలవలె దూరి మన కొంపే ముంచే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనే ఆరుగురు పగవారికి ఆవంతైనా అవకాశం ఇవ్వని అత్యద్భుతమైన కోటలు.
6-158 కోరినవారల
సందర్భం:
పరమనికృష్టమైన బ్రతుకు బ్రతికి యమభటుల చిత్రహింసలకు గురికాబోయే పాపాత్ముడు అజామీళుడు మాటవరుసకు ‘నారాయణా’ అంటే వివేక విజ్ఞానాలు కలిగి సద్యోముక్తి పొందాడు. ఇక సహజంగా సద్భక్తితో స్వామిని స్మరిస్తే దానిఫలం ఎట్టిదని చెప్పాలి అంటున్నారు శ్రీ శుక మహర్షి..
కం. కోరినవారల కెల్లను,
జేరువ కైవల్యపదము, సిరివరుని మదిం
గోరనివారల కెల్లను,
దూరము మోక్షాప్తి యెన్నిత్రోవల నైనన్
ప్రతిపదార్ధం:
కోరిన = కోరెడి; వారల = వారి; కిన్ = కి; ఎల్లన్ = అందరకు; చేరువ = దగ్గరగా నుండును; కైవల్య పదము = ముక్తి మార్గము; సిరి వరుని = నారాయణుని; మదిన్ = మనసున; కోరని = వాంఛించని; వారల = వారి; కిన్ = కి; ఎల్లన్ = అందరకు; దూరము = అందనిది; మోక్షాప్తి = మోక్ష ప్రాప్తి; ఎన్ని = ఎన్ని; త్రోవ లైనన్ = మార్గాలు పట్టినా.
తాత్పర్యం:
పరీక్షిన్మహారాజా! శ్రియఃపతి అయిన శ్రీనివాసుని బుద్ధిపూర్వకంగా సేవించే కోరిక ఉన్నవారికి కైవల్యపదం చేరువలోనే సిద్ధిస్తుంది. చావుపుట్టుకల చక్రంలో సుఖం లేకుండా తిరుగుతూ ఉండటమే సంసారం. దానినుండి భగవదనుగ్రహం వలన బయటపడటమే కైవల్యం. అది కావాలి అనే కాంక్షలేనివారికి ఎన్ని పోకలు పోయినా మోక్షలాభం దూరమే అవుతుంది. అట్టివారికి వద్దనుకొనే దుఃఖం వద్దకు వస్తూనే ఉంటుంది.
6-171 అభవు
సందర్భం:
యమభటులు అజామీళుని విషయంలో అవమానం పొంది తమ ప్రభువు దగ్గరకు పోయి తమ పాట్లు తెలుపుకున్నారు. స్వామీ! ఈ సృష్టిలో నీకంటె మించిన శాసకుడు మరొకడు ఉన్నాడా? అని అడిగారు. అప్పుడు యమధర్మరాజు శ్రీమహావిష్ణువును హృదయంలో నిలుపుకొని ఆయన మహామహిమను తన భటులకు ఇలా హృద్యంగా బోధించాడు.
చ. అభవు, నమేయు, నవ్యయు, ననంతు, ననారతు పూని మేనిలో
నుభయము నై వెలుంగు పురుషోత్తము గానరు చిత్త కర్మ వా
గ్విభవ గరిష్టు లై వెదకి వీఱిడి ప్రాణులు; సర్వవస్తువుల్
శుభగతి జూడనేర్చి తను జూడగనేరని కంటిపోలికన్.
ప్రతిపదార్ధం:
అభవున్ = నారాయణుని {అభవుడు - పుట్టుక లేనివాడు, విష్ణువు}; అమేయున్ = నారాయణుని {అమేయుడు - పరిమితులు లేనివాడు, విష్ణువు}; అవ్యయున్ = నారాయణుని {అవ్యయుడు - వ్యయము లేనివాడు, విష్ణువు}; అనంతున్ = నారాయణుని {అనంతుడు - అంతము లేనివాడు, విష్ణువు}; అనారతున్ = నారాయణుని {అనారతడు - అనవరతము యుండెడివాడు, విష్ణువు}; పూని = పూని; మేని లోను = దేహము లోపల {పరమాత్మ త్రైవిధ్యము - దేహము (మొదటి వాడు) దేహి (జీవుడు, రెండవవాడు), దేహములో (సర్వాంతర్యామి, మూడవవాడు) తానై యుండుట}; ఉభయమును = దృశ్యము ద్రష్ట రెండును; ఐ = అయ్యి; వెలుంగు = ప్రకాశించెడి; పురుషోత్తమున్ = నారాయణుని; కానరు = గుర్తించ లేరు; చిత్త = జ్ఞానము నందు; కర్మ = వైదికకర్మ లందు; వాక్ = ప్రవచనములు చేయుట యందు; విభవ = వైభవము గలిగుండుట లో; గరిష్ఠులు = గొప్పవారు; ఐ = అయ్యి; వెదకి = వెదకి; వీఱిడి = వెర్రివారు; ప్రాణులు = జీవులు; సర్వ = సమస్త మైన; వస్తువుల్ = వస్తువులు; శుభ గతిన్ = చక్కగా; చూడన్ = చూడ; నేర్చి = గలిగినను; తనున్ = తనను తాను; చూడగన్ = చూచుటను; నేరని = సమర్థత లేని; కంటి = కన్ను; పోలికన్ = వలె.
తాత్పర్యం:
భటులారా! శ్రీమహావిష్ణువు పుట్టుకలేనివాడు. ఏ ఊహలకూ అందనివాడు. దేశ కాలాదులు తెచ్చే ఎట్టి మార్పులకూ లోబడకుండా ఏకమైన ఆకృతితో ఉంటాడు. తుదీ, మొదలూ లేనివాడు. అనారతుడు, అంటే ఎక్కడా, ఎప్పుడూ తెరపిలేనివాడు. ఉండటమే తప్ప మఱియొక స్థితిలేనివాడు. అట్టివాడు మన దేహంలో కర్మఫలాలు అనుభవించే జీవుడుగా, సాక్షిమాత్రంగా నిలిచివుండే దేవుడుగా రెండు విధాలుగానూ ఉన్నాడు. అందువలననే ఆయనను పురుషోత్తముడంటారు. కానీ జీవులు ఆయనను చూడలేరు. మనస్సుతో, చేష్టతో, మాటతో శక్తిని పుష్కలంగా సంపాదించుకొని వెదకి కూడా విసిగి వేసారిపోతారు, కానీ తెలుసుకోలేరు. ఇది ఎటువంటిదంటే కన్ను చక్కని చూపుతో సర్వ వస్తువులను చూస్తుంది కానీ తన్నుతాను చూచుకోలేదుగదా.
6-177 వర మహాద్భుతమైన
సందర్భం:
యమధర్మరాజు తన దూతలకు శ్రీమహావిష్ణుతత్త్వం తెలుసుకోవటం సులభం కాదనీ మహాజ్ఞాన సంపన్నులైన కొందరు మాత్రమే ఆ యెఱుక కలవారనీ బోధిస్తున్నాడు.
సీ. వర మహాద్భుతమైన వైష్ణవజ్ఞానంబు తిరముగా నెవ్వరు తెలియగలరు?
దేవాదిదేవుండు త్రిపురసంహరు డొందె, కమలసంభవు డొండె, కార్తి కేయ
కపిల నారదు లొండె, గంగాత్మజుం డొండె, మను వొండె, బలి యొండె, జనకు డొండె
ప్రహ్లాదు డొండె, నేర్పాటుగా శుకు డొండె, భాసురతరమతి వ్యాసు డొండె
తే. కాక యన్యులతరమె? యీలోకమందు
నీ సుబోధంబు సద్బోధ మీ పదార్ధ
మీ సదానంద చిన్మయ మీయగమ్య
మీవిశుద్ధంబు గుహ్యంబు నీశుభంబు
ప్రతిపదార్ధం:
వర = ఉత్తమ మైన; మహా = గొప్ప; అద్భుతము = ఆశ్చర్య కరము; ఐన = అయిన; వైష్ణవ = విష్ణువు గురించిన; జ్ఞానంబు = జ్ఞానము; తిరముగా = సంపూర్తిగ; ఎవ్వరు = ఎవరు; తెలియ గలరు = తెలిసికొన గలరు; దేవాదిదేవుండు = దేవతలకే ముఖ్య దేవుడు; త్రిపుర సంహరుడు = పరమ శివుడు {త్రిపుర సంహరుడు - త్రిపురములను నాశనము చేసిన వాడు, శివుడు}; ఒండె = ఒకరు; కమల సంభవుడు = బ్రహ్మ దేవుడు {కమల సంభవుడు – కమలము లందు సంభవుడు (పుట్టిన వాడు), బ్రహ్మ}; ఒండె = ఒకరు; కార్తికేయ = కార్తికేయుడు; కపిల = కపిలుడు; నారదులు = నారదుడులు; ఒండె = ఒకరు; గంగాత్మజుండు = భీష్ముడు; ఒండె = ఒకరు; మనువు = మనువు; ఒండె = ఒకరు; బలియున్ = బలిచక్రవర్తి; ఒండె = ఒకరు; జనకుడు = జనకమహారాజు; ఒండె = ఒకరు; ప్రహ్లాదుడు = ప్రహ్లాదుడు; ఒండె = ఒకరు; ఏర్పాటుగా = ప్రత్యేకముగా; శుకుడు = శుక మహాముని; ఒండె = ఒకరు; భాసుర = మిక్కలి ప్రకాశిస్తున్న; మతి = మనసు గలవాడు; వ్యాసుడు = వ్యాస భగవానుడు; ఒండె = ఒకరు;
కాక = కాకుండగ; అన్యుల = ఇతరుల; తరమె = సాధ్యమే; ఈ = ఈ; లోకము = లోకము; అందు = లో; ఈ = ఈ; సుబోధంబు = ఉత్తమ జ్ఞనము; సద్భోధము = విశేష జ్ఞానము; ఈ = ఈ; పదార్థము = ప్రయోజనము; ఈ = ఈ; సదానంద = శాశ్వతమైన ఆనందపు; చిత్ = మనసు; మయము = పూరము; ఈ = ఈ; విశుద్ధంబు = పరిశుద్దము; గుహ్యంబు = రహస్యమైవది; ఈ = ఈ; శుభంబు = శుభములు.
తాత్పర్యం:
అది చాలా గొప్పది. అద్భుతమైనది. అటువంటి విష్ణు సంబంధమైన జ్ఞానాన్ని చెదరిపోకుండా హృదయంలో నిలుపుకోగలవారు కొందఱు మాత్రమే ఉన్నారు. అందులో మొట్టమొదటగా చెప్పుకోవలసినవాడు దేవతలకు కూడా ఆదిదేవుడైన పరమేశ్వరుడు. ఆయన త్రిపురాసురులను సంహరించినవాడు. అటు పిమ్మట చెప్పుకోదగినవాడు విష్ణువు నాభిలో వెలుగొందుతున్న కమలంనుండి పుట్టిన నాలుగు మోముల దేవర. ఆ తరువాత చెప్పుకోదగినవాడు కుమార స్వామి. ఆయన ఆరుమొగాల అద్భుతదైవం. అటు పిమ్మట వచ్చేవారు కపిలమహర్షి, నారద మహర్షి, ఇంక భూమికి దిగివస్తే గంగ కొడుకు భీష్ముడు, మనువు, బలిచక్రవర్తి, జనక మహారాజు, ప్రహ్లాదుడు, శుకుడూ, వ్యాసులవారూ. ఈ పన్నెండుగురకు తప్ప విష్ణు సంబంధమైన జ్ఞానం ఇతరులకు తెలియదు. ఇది చక్కని తెలివి, చక్కని ఉపదేశం. మంచి వస్తువు. ఇది సదానందం. జ్ఞానమయమైనది. ఒక పట్టాన పొందనలవి కానిది, పరమశుద్ధమైనది. గొప్ప రహస్యం. మంగళకరం.
6-178 ఈ పన్నిద్దఱు
సందర్భం:
భావం దృఢంగా కుదురుకోవటానికి యమధర్మరాజు ఆ విషయాన్నే మళ్ళీ బోధిస్తున్నాడు.
కం. ఈ పన్నిద్దఱు తక్కగ, నోపరు త క్కొరులు తెలియ నుపనిష దుచిత
శ్రీ పతినామ మహాద్భుత, దీపిత భాగవతధర్మ దివ్యక్రమమున్.
ప్రతిపదార్ధం:
ఈ = ఈ; పన్నిద్దఱున్ = పన్నిండుమంది (12); తక్కగ = తప్పించి; ఓపరు = సమర్థులుగారు; త క్కొరులు = వీరు కాక ఇతరులు; తెలియను = తెలిసికొనుటకు; ఉపనిషత్ = ఉపనిషత్తులలో; ఉచిత = చెప్పబడిన, ఉచ్చరింపబడిన; శ్రీపతి = నారాయణుని {శ్రీపతి - శ్రీ (లక్ష్మీదేవి, సంపదలు) కి పతి (ప్రభువు), విష్ణువు}; నామ = నామము యొక్క; మహా = గొప్ప; అద్భుత = అద్భుతమైన; దీపిత = ప్రకాశవంత మైన; భాగవత = భాగవత; ధర్మ = ధర్మము యొక్క; దివ్య = దివ్య మైన; క్రమమున్ = విధమును.
తాత్పర్యం:
ఇది పరమాత్మజ్ఞానాన్ని ప్రసన్నంగా మూలముట్టుగా బోధించే ఉపనిషత్తులలో నెలకొన్న తత్త్వం. లక్ష్మీనాధుని నామజపానికి సంబంధించిన మహాద్భుతమైనదీ, ప్రకాశించేదీ అయిన భాగవత ధర్మపు దివ్యక్రమం. దీనిని పరమశివుడు, బ్రహ్మదేవుడు, కుమారస్వామి, కపిలుడు, నారదుడు, భీష్ముడు, మనువు, బలిచక్రవర్తి, జనకమహారాజు, ప్రహ్లాదుడు, శుకుడు, వ్యాసుడు అనే పన్నెండుగురు తప్ప ఇతరులు తెలియజాలరు.
6-179 ఏది జపియింప
సందర్భం:
యముడు తన దూతలకు హరికీర్తనమును గురించి యింకా ఇలా తెలియ జేస్తున్నాడు.
తే. ఏది జపియింప నమృత మై యెసగుచుండు
నేది సద్ధర్మపథ మని యెఱుగ దగిన
దదియె సద్భక్తి యోగంబు నలవరించు
మూర్తిమంతంబు దా హరికీర్తనంబు
ప్రతిపదార్ధం:
ఏది = ఏదైతే; జపియింపన్ = నామజపము చేయిస్తే; అమృతము = అమృతము; ఐ = అయ్యి; ఎసగుచుండున్ = ప్రసిద్ది చెందు తుండును; ఏది = ఏదైతే; సద్దర్మ = ఉత్తమ ధర్మము యొక్క; పథము = మార్గము; అని = అని; ఎఱుగ = తెలిసికొన; తగినది = తగి నట్టిది; అదియె = అదే; సద్భక్తి = శ్రేష్టమైన భక్తి; యోగంబున = యోగము వలన; ఆవహించు = కలుగుట; మూర్తి మంతంబు = మూర్తీభవించినది; తాన్ = అది; హరి = నారాయణుని; కీర్తనంబు = కీర్తించుటలు.
తాత్పర్యం:
హరి నామాన్ని జపిస్తే అది అమృతమై విరాజిల్లుతుంది. పరమాత్ముని ధర్మమార్గం ఇదే అని తెలియదగినది హరి కీర్తన యే. అదే సద్భక్తి యోగాన్ని అలవాటు చేస్తుంది. అది భక్తి యోగానికి ఏర్పడిన ఆకారం.
6-186 శ్రుత్యంత
సందర్భం:
యమధర్మరాజు తన భటులకు భగవంతునియందు నిండుగా భక్తి ఉన్నవారి గొప్పతనాన్ని చాలా గొప్పగా అభివర్ణిస్తున్నాడు.
సీ. శ్రుత్యంత విశ్రాంత మత్యనుక్రమణీయ భగవత్ప్రసంగతుల్ భాగవతులు
సనకాదిముని యోగిజన సదానందైక పరమ భాగ్యోదయుల్ భాగవతులు
కృష్ణపద ధ్యాన కేవలామృతపాన పరిణామ యుతులు శ్రీభాగవతులు
బహుపాత కానీక పరిభవ ప్రక్రియా పరుషోగ్ర మూర్తులు భాగవతులు
తే. భావతత్త్వార్థవేదులు భాగవతులు
బ్రహ్మవాదానువాదులు భాగవతులు
సిరులు దనరంగ నెన్నడు చేటులేని
పదవి నొప్పారువారు వో భాగవతులు
ప్రతిపదార్ధం:
శ్రుత్యంత = వేదాంతము లందు; విశ్రాంత = విశ్రమించిన; మతి = బుద్దిని; అనుక్రమణీయ = అనుసరించి పోవు నట్టి; భగవత్ = నారాయణుని; ప్రసంగతుల్ = ప్రసంగములు చేయు వారు; భాగవతులు = భాగవత తత్త్వజ్ఞులు; సనక = సనకుడు; ఆది = మొదలైన; ముని = మునులు; యోగి = యోగులు; జన = ఐన వారి; సదానంద = శాశ్వత మైన ఆనందము; ఏక = మొదలైన; పరమ = అత్యుత్తమ మైన; భాగ్య = భాగ్యములను; ఉదయుల్ = కలిగించెడి వారు; భాగవతులు = బాగవతులు; కృష్ణ = కృష్ణుని; పద = పాదములను; ధ్యాన = సంస్మరించెడి; కేవల = కేవల మైన; అమృత = అమృతమును; పాన = అస్వాదించెడి; పరిణామ = క్రమము; యుతులు = కూడిన వారు; శ్రీ = శుభకర లైన; భాగవతులు = భాగవతులు; బహు = మిక్కిలి; పాతక = పెద్ద పాపముల; అనీక = సమూహములను; పరిభవ = పరాభవము చేసెడి; ప్రక్రియా = నేర్పులు గల; పరుష = కఠిన మైన; ఉగ్ర = ఉగ్ర మైన; మూర్తులు = స్వరూపములు గల వారు; భాగవతులు = భాగవతులు;
భావ = భవమునకు చెందిన; తత్త్వార్థ = తత్త్వ లక్షణములను; వేదులు = బాగుగా తెలిసి కొన్న వారు; భాగవతులు = భాగవతులు; బ్రహ్మవాద = పరబ్రహ్మతత్వమును; అనువాద = వివరించుటలో నేర్పరులు; భాగవతులు = భాగవతులు; సిరులు = సంపదలు; తనరంగ = అతిశయించగ; ఎన్నడును = ఎల్లప్పుడును; చేటు లేని = చెడిపోవుట లేని; పదవిన్ = మహోన్నత స్థానమున; ఒప్పారు వారు = చక్కగ నుండువారు; పో = తప్పక; భాగవతులు = భాగవతులు.
తాత్పర్యం:
ఉపనిషత్తులు భగవత్తత్త్వాన్ని చాలా స్పష్టంగా వివరిస్తాయి. భాగవతుల ప్రసంగాలు ఉపనిషద్ జ్ఞానాన్ని అనుసరించి మాత్రమే వెలుగొందుతూ ఉంటాయి. జ్ఞానమూర్తులైన సనకుడు మొదలైన మునులూ, యోగిజనులూ పొందే సదానంద పరమ భాగ్యమై ఒప్పారే మహాత్ములు భాగవతులు. శ్రీకృష్ణుని పాదాల ధ్యానం అనే సాటిలేని అమృతాన్ని త్రావటంచేత పాకానికివచ్చిన అంతరంగం కలవారు భాగవతులు. పెక్కు విధాలైన పాతకాల సేనలకు పరాభవం చేయటంలో అతికఠినమైన ఆకృతులు కలవారు భాగవతులు. పరమాత్మ తత్వాన్ని బాగుగా తెలిసినవారు భాగవతులు. బ్రహ్మమును గూర్చిన పలుకులను అనుసరించి పలికేవారు భాగవతులు. ఐశ్వర్యం అంబరమంటి, ఎప్పుడూ చేటులేని స్థానాలలో ప్రకాశించేవారు భాగవతులు.
6-188 ఎకసక్కెమునకైన
సందర్భం:
యమదూతలకు యమధర్మరాజు విష్ణుభక్తిలేని వారిని తీసుకొని రావలసినదిగా ఆజ్ఞాపిస్తున్నాడు. అజామీళుని అద్భుతగాథలోని పద్యం ఇది.
సీ. ఎకసక్కెమునకైన నిందిరారమణుని బలుకంగలేని దుర్భాషితులను
కలలోన నైన శ్రీకాంతుని సత్పాద కమలముల్ సూడని కర్మరతుల
నవ్వుచునైన కృష్ణప్రశంసకు చెవి దార్పనేరని దుష్కథా ప్రవణుల
యాత్రోత్సవంబుల నైన నీశుని గుడిత్రోవ ద్రొక్కగలేని దుష్పదులను
ఆ. పరమభాగవతుల పాదధూళి సమస్త
తీర్థసారమనుచు తెలియలేని
వారి వారివారి వారిజేరినవారి
తొలుత గట్టి తెండు దూతలార.
ప్రతిపదార్ధం:
ఎకసెక్కెమున = ఎగతాళి చేయుట; కైనన్ = కోస మైన; ఇందిరా రమణునిన్ = నారాయణుని {ఇందిరా రమణుడు - ఇందిర (లక్ష్మీదేవి) కి రమణుడు (మనోహరుడు), విష్ణువు}; పలుకంగ = కీర్తించ; లేని = లేని; దుర్భాషితులను = చెడుమాట లాడు వారు; కల = స్వప్నము; లోనన్ = లోపల; ఐనన్ = అయినను; శ్రీకాంతుని = నారాయణుని {శ్రీకాంతుడు - శ్రీ (లక్ష్మీదేవి) కాంతుడు (భర్త), విష్ణువు}; సత్ = మంచి; పాద = పాదములు యనెడి; కమలముల్ = పద్మములను; చూడని = చూడ నట్టి; కర్మ = కర్మ లందు; రతులన్ = తగులైన వారు; నవ్వుచున్ = నవ్వులాటలకు; ఐనన్ = అయినప్పటికి; కృష్ణ = కృష్ణుని; ప్రశంస = కీర్తించుట; కున్ = కు; చెవి దార్ప = వినిపించు కొన; నేరని = లేని; దుష్కథా = చెడ్డ కథ లందు; ప్రవణులన్ = ఆసక్తులు; యాత్ర = తీర్థయాత్ర; ఉత్సవంబులన్ = ఉత్సవములలో; ఐనన్ = అయినప్పటికి; ఈశుని = నారాయణుని; గుడి = ఆలయపు; త్రోవ = దారి; త్రొక్కగ లేని = తొక్క లేనట్టి; దుష్పదులను = చెడు నడత వారిని;
పరమ = మిక్కిలి పవిత్ర మైన; భాగవతుల = భాగవతుల యొక్క; పాద = పాదముల; ధూళి = దుమ్ము; సమస్త = నిఖిల; తీర్థ = తీర్థముల యొక్క; సారము = సారము; అని = అని; తెలియ = తెలుసుకొన; లేని = లేని; వారిన్ = వారిని; వారివారిన్ = వారి యొక్క వారిని; వారిన్ = వారిని; చేరిన వారి = అనుసరించు వారిని; తొలుతన్ = ముందుగ; కట్టి = కట్టివేసి; తెండు = తీసుకు రండి; దూతలార = సేవకులూ, యమదూతలూ.
తాత్పర్యం:
యమదూతలారా! వేళాకోళానికైనా ఇందిరా రమణుని పేరు పలుకలేని పాడు కూతలవారినీ, కలలోనైనా శ్రీపతి శ్రీపాద కమలాలను చూడని దుష్ట చేష్టల వారినీ, నవ్వులాటలోనైనా శ్రీకృష్ణుని ప్రశంసకు చెవులొగ్గని పాడు కథల పాండిత్యం కలవారినీ, యాత్రలో జరిగే పండుగలలోనైనా పరమేశ్వరుని ఆలయం దారి త్రొక్కలేని పాడుపాదాలవారినీ, భగవంతుని మహాభక్తుల పాదధూళి మహాతీర్థాలన్నింటిసారం అని తెలిసికోలేని పాడు తెలివి కలవారినీ, వారివారినీ, వారిని చేరినవారినీ మొట్టమొదటగా కట్టి నా దగ్గరకు తీసుకొని రండి.
6-190 అరయ దనదు
సందర్భం:
భగవద్భక్తులు కాని వారి దౌర్భాగ్య జీవితాన్ని యమధర్మరాజు వెక్కిరింతగా కక్కసించు కుంటున్నాడు.
తే. అరయ దనదు జిహ్వ హరిపేరు నుడువదు
చిత్త మతని పాదచింత జనదు
తలప దమకు ముక్తి తంగేటి జున్నొకో?
సకల విష్ణుభక్తులకును బోలె.
ప్రతిపదార్ధం:
అరయన్ = తరచి చూసిన; తనదు = తన యొక్క; జిహ్వ = నాలుక; హరి = నారాయణుని; పేరు = నామమును; నుడువదు = పలుకదు; చిత్తము = మనసు; అతని = అతని యొక్క; పాద = పాదముల; చింతన్ = ఆలోచన లందు; చనదు = వెళ్ళదు; తలప = తరచి చూసిన; తమ = తమ; కున్ = కు; ముక్తి = మోక్ష ప్రాప్తి; తంగేటిజున్నొకో = అంతసుళువైనదా ఏమి {తంగేటిజున్ను - తంగేడు చెట్టు యందున్న తేనె పట్టు యొక్క జున్ను (తేనె)}; సకల = అందరు; విష్ణుభక్తులు = విష్ణుభక్తుల; కును = కు; పోలెన్ = వలె.
తాత్పర్యం:
తన నాలుక ఒక్కమారైనా హరి పేరును పలుకదు. చిత్తం శ్రీపతి పాదాలను పొరపాటున కూడా భావించదు. కానీ నిరంతరం నామ జపం, హరి ధ్యానం చేసే వారికి లాగా ముక్తి అనే తంగేటిజున్ను కావాలి అంటాడు బుద్ధిహీనుడు. ఇంతకంటే మూర్ఖత్వం ఏముంటుంది? ఏమాత్రమూ వివేకం లేని వాని తీరు ఇలా ఉంటుంది!
6-191 పద్మనయను
సందర్భం:
భటులారా! మీకొక హెచ్చరిక, శ్రద్ధగా వినండి అంటున్నాడు ధర్మమూర్తీ సమవర్తీ అయిన యమధర్మరాజు.
ఆ. పద్మనయను మీది భక్తి యోగం బెల్ల
ముక్తి యోగ మనుచు మొద లెఱుంగు
వారి, వారివారి, వారి జేరినవారి
త్రోవ బోవవలదు దూతలార!
ప్రతిపదార్ధం:
పద్మనయను = నారాయణుని; మీది = పైగల; భక్తియోగంబు = భక్తియోగము; ఎల్లన్ = సమస్తమును; ముక్తి యోగము = ముక్తి ప్రదమైన యోగము; అనుచు = అనుచు; మొదలు = ముందుగనే; ఎఱుంగు = తెలిసిన; వారిన్ = వారి; వారివారిన్ = వారి యొక్క వారిని; వారిన్ = వారి; చేరిన వారిన్ = అనుసరించెడి వారి; త్రోవన్ = వైపుకు; పోవవలదు = పో వద్దు; దూతలార = సేవకులు, యమదూతలారా.
తాత్పర్యం:
జీవులు మరణించే సమయంలో మన లోకాలకు రావలసిన వారెవరో, రాగూడని వారెవరో వివేకంతో గమనించండి. ఆ పద్మపత్రాలవంటి అందాలు చిందించే అద్భుతమైన కన్నులుగల శ్రీ మహావిష్ణువునందు చెదరని భక్తి ఉండటమే ముక్తియోగం. ఆ జ్ఞానం ఉన్నవారూ, వారివారూ, వారిని చేరినవారూ పోయిన దారిలో కూడా మీరు పోరాదు.
6-193 స్వాయంభువ
సందర్భం:
అజామీళుని కథ వింటున్న పరీక్షిన్మహారాజునకు హృదయం పరవశించిపోతున్నది. మెల్లగా తేరుకొని శ్రీశుకమహర్షుల వారిని మరొక విషయం అడుగుతున్నాడు.
కం. స్వాయంభువ మనువేళల,
నో యయ్య! సురాసు రాండ జోరగ నర వ
ర్గాయత సర్గము దెలిపితి,
పాయక యది విస్తరించి పలుకం గదవే!
ప్రతిపదార్ధం:
స్వాయంభువ = స్వాయంభువ యనెడి; మనువు వేళలన్ = మన్వంతరములోని; ఓ = ఓ; అయ్య = తండ్రి; సుర = దేవతలు; అసుర = రాక్షసులు; అండజ = గ్రుడ్డు నుండి పుట్టునవి; ఉరగ = పాములు {ఉరగము - ఉర (రొమ్ము) చే గము (గమనము గలవి), పాము}; నర = మానవుల; వర్గ = జాతుల; ఆయత = విస్తార మైన; సర్గమున్ = సృష్టిని; తెలిపితి = తెలియ జేసితివి; పాయక = తప్పక; అది = దానిని; విస్తరించి = మరింకా వివరముగ; పలుకంగదవే = చెప్పుము.
తాత్పర్యం:
స్వామీ! జ్ఞానమూర్తీ! శుకమహర్షీ! ఇంతకు పూర్వం నీవు స్వాయంభువ మన్వంతరంలో ఉన్న దేవతలను, రాక్షసులను, పక్షులను, పాములను, నరులను, ఇంకా తక్కినజాతులను, వారికి సంబంధించిన సృష్టినీ గురించి చెప్పావు. దానిని మఱికొంత విస్తరించి చెప్పు మహాత్మా!
6-200 తప్పక యర్భకావళికి
సందర్భం:
ఒకప్పుడు ప్రచేతసుని కుమారులు ప్రాచీనబర్హి మొదలైన పదిమంది సముద్రం నుండి భూమిమీదకు వచ్చారు. భూమి అంతా చెట్లతో నిండి ఉన్నది. అది చూచినవారికి ఒళ్ళుమండింది. ముఖాలనుండి గొప్ప గాలితో కూడిన అగ్నిని పుట్టించి చెట్లను కాల్చి వేస్తున్నారు. అప్పుడు చంద్రుడు అది గమనించి యిలా అంటున్నాడు.
ఉ. తప్పక యర్భకావళికి తల్లియు దండ్రియు, నేత్రపంక్తికిన్
ఱెప్పలు, నాతికిం బతి, నరేంద్రుడు లోకుల కెల్ల, నర్థికి
న్నొప్ప గృహస్థు, మూఢులకు నుత్తము లెన్నగ వీరు బంధువుల్
ముప్పున గావలేని కడుమూర్ఖులు గారు నిజాల బంధువుల్.
ప్రతిపదార్ధం:
తప్పక = తప్పకుండ; అర్భక = పిల్లల; ఆవళిన్ = సమూహమునకు; తల్లియున్ = తల్లి; తండ్రియున్ = దండ్రి; నేత్ర = కన్నుల; పంక్తి = వరుస; కిన్ = కి; ఱెప్పలు = కనురెప్పలు; నాతి = స్త్రీ; కిన్ = కి; పతియు = భర్త; నరేంద్రుడు = రాజు; లోకుల = జనుల; కున్ = కి; ఎల్లన్ = అందరికి; అర్థి = యాచించెడి వాని; కిన్ = కి; ఇంపొప్ప = చక్కగా; గృహస్థు = గృహస్థుడు; మూఢుల్ = తెలివి తక్కువ వారల; కును = కి; ఉత్తములు = ఉత్తములు; ఎన్నన్ = ఎంచి చూసిన; వీరు = వీరు; బాంధవుల్ = బంధువులు; ముప్పునన్ = ప్రమాద పరిస్థితు లలో; కావ లేని = కాపాడ లేని; కడు = మిక్కిలి; మూర్ఖులు = మూర్ఖులు; కారు = కారు; నిజాల = నిజ మైన; చుట్టముల్ = బంధువులు.
తాత్పర్యం:
పుణ్యాత్ములారా! పసిపిల్లలకు అమ్మానాన్నలు, కన్నులకు రెప్పలు, నాతికి పతి, లోకులందరికీ రాజూ, అడుగు కొనేవారికి గృహస్వామీ, మూఢులకు ఉత్తములూ నిజమైన చుట్టాలు. కానీ, మనకు కీడు మూడినపుడు రక్షింపలేని మూర్ఖులు మాత్రం నిజమైన చుట్టాలు కాదయ్యా! ఈ చెట్లు నిజమైన బంధువులు. ఎవరైనా ప్రేమనిండారిన తమవారిని తగులబెట్టుకోవాలనుకుంటారా?
6-300 గరుడుని మూపుపై
సందర్భం:
శ్రీమహాభాగవతంలో భక్తులను పదిలంగా కాపాడే మహామంత్రాలవంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి శ్రీమన్నారాయణ కవచం. జనమేజయునికి శ్రీశుకయోగీంద్రులు పరమాదరంతో బోధించిన ఆ కవచంలోని ఒక అంశం ఇది.
చ. గరుడుని మూపుపై పదయుగంబు ఘటిల్లగ శంఖ చక్ర చ
ర్మ రుచిరశార్జ్గ ఖడ్గ శర రాజితపాశ గదాది సాధనో
త్కర నికరంబు లాత్మకరకంజములం ధరియించి భూతిసం
భరిత మహాష్టబాహుడు కృపామతితో నను గాచు గావుతన్.
ప్రతిపదార్ధం:
గరుడుని = గరుత్మంతుని; మూపు = వీపు; పైన్ = మీద; పద = పాదముల; యుగంబున్ = రెంటిని; ఘటిల్లగ = ఉండగ; శంఖ = శంఖము; చక్ర = చక్రము; చర్మ = చర్మము; రుచిర = ప్రకాశవంతమైన; శార్ఙ్ఘ = విల్లు; ఖడ్గ = కత్తి; శర = బాణము; రాజిత = విలసిల్లెడి; పాశ = పాశము; గద = గద; ఆది = మొదలగు; సాధన = ఆయుధ; ఉత్కర = సంపత్తుల; నికరంబులు = సమూహములు; ఆత్మ = తనయొక్క; కర = చేతు లనెడి; కంజములన్ = పద్మము లందు; ధరియించి = ధరించి; భూతి = అష్టైశ్వర్యములు; సంభరిత = చక్కగా భరించెడి; మహా = గొప్ప; అష్ట = ఎనిమిది (8); బాహుడు = భుజములు గలవాడు; కృపామతి = దయగల మనసు; తోన్ = తోటి; నను = నన్ను; కాచుగావుత = కాపాడుగాక.
తాత్పర్యం:
శ్రీమహావిష్ణుదేవుడు వేదాత్మకుడైన గరుత్మంతుని మూపుమీద పాదాలు రెండూ చక్కగా నెలకొల్పి ఆసీనుడైయున్నాడు. అప్పటి ఆస్వామి హస్తాలు ఎనిమిది. వానిలో శంఖము, చక్రము, డాలు, వెలుగులు విప్పారజేసే శార్జ్గమనే విల్లు, నందకమనే ఖడ్గము, బాణాలు, పాశము, గద మొదలైన సాధనాలు అమరి ఉన్నాయి. అవి మహాబాహువులు కనుక ఎన్నింటినైనా ఏవిధంగానైనా పట్టుకోగలవు. అదే వాని వైభవం. అటువంటి శ్రీమహావిష్ణువు దయార్ద్రహృదయుడై నన్ను కాపాడుగాక!
6-301 ప్రకట మకర
సందర్భం:
శ్రీమన్నారాయణ కవచంలోనిదే మరొక ప్రార్థన. జనుడు ఎప్పుడూ ఒక్కచోటనే ఉండడుకదా! ఎక్కడెక్కడో, ఏవేవో పనులమీద తిరుగుతూ ఉంటాడు. ఒకవేళ అతడు జలాలలో విహరిస్తూ ఉంటే కాపాడవలసివస్తే ఎలా ప్రార్ధన చేయాలో తెలుపుతున్నారు.
ఆ. ప్రకట మకర వరుణ పాశంబులందుల
జలములందు నెందు బొలియకుండ
గాచుగాక నన్ను ఘను డొక్కడైనట్టి
మత్స్యమూర్తి విద్యమానకీర్తి .
ప్రతిపదార్ధం:
ప్రకట = ప్రసిద్దమైన; మకర = మొసలి; వరుణ = వర్షపు; పాశంబులు = బంధనములు; అందు = అందు; జలములు = నీటి; అందు = అందును; ఎందున్ = దేనిలోను; పొలియకుండన్ = నాశము పొందకుండగ; కాచు గాక = కాపాడు గాక; నన్ను = నన్ను; ఘనుడు = గొప్పవాడు; ఒక్కడు = ఒకడే; ఐనట్టి = అయి నట్టి; మత్యమూర్తి = మత్యావతారము; విద్యమాన = ప్రవర్తిస్తున్న; కీర్తి = యశస్సుగలవాడు.
తాత్పర్యం:
ఆ దేవాదిదేవుడు అన్నివిధాలైన జీవులనూ కంటికి రెప్ప అయి కాపాడటానికి అనేక అవతారాలు ఎత్తాడు. అందులో మత్స్యావతారం ఒకటి. అది మహోదాత్త మహా కార్యాలు చేసి మహాకీర్తితో వెలుగొందుతున్నది . ఆ అవతారం పొందిన ఆ స్వామి మొసళ్ళు, మహాభయంకరమైన వరుణపాశాలూ గల కల జలాలలో ఎక్కడా ఏ ప్రమాదానికీ లోనుకాకుండా నన్ను రక్షించుగాక. రక్షిస్తాడు ఎందుకంటే ఆయన అందరికంటె, అన్నింటి కంటె ఘనమైనవాడు. ఇంకెవరినీ ప్రార్థించి ప్రయోజనంలేదు. ఎందుకంటే ఆయన ఒక్కడే సర్వరక్షకుడు.
6-302 నటుడు
సందర్భం:
జీవుడు నేల మీద తిరుగుతూ ఉన్నప్పుడు కూడా కాపాడవలసినది ఆ దేవదేవుడే. అది తెలిసికొని ప్రార్థించమంటున్నది శ్రీమన్నారాయణ కవచంలోని యీ పద్యం.
కం. నటుడు సమాశ్రిత మాయా,
నటుడు బలి ప్రబల శోభన ప్రతిఘటనో
ద్భటుడు త్రివిక్రమదేవుడు,
చటుల స్థలమందు నన్ను సంరక్షించున్
ప్రతిపదార్ధం:
వటుడు = బ్రహ్మచారి; సమాశ్రిత = చక్కగా ఆశ్రయించిన; మాయా = మాయా; నటుడు = నటనలు చేసెడి వాడు; బలి = బలిచక్రవర్తి; ప్రబల = అత్యధిక మైన; శోభన = తేజస్సును; ప్రతిఘటన = ప్రతిఘటించుట యందు; ఉద్బటుడు = బహు గట్టి వాడు; త్రివిక్రమదేవుడు = వామనుడు {త్రివిక్రమ దేవుడు - త్రివిక్రమావతారము ధరించిన దేవుడు, వామనుడు}; చటుల = భయంకర మైన; స్థలము = ప్రదేశముల; అందు = లో; నన్ను = నన్ను; సంరక్షించున్ = కాపాడుగాక.
తాత్పర్యం:
స్వామి గొప్ప నటుడు. లోకరక్షకుడు ఏ వేషం అవసరమయితే ఆ వేషం వేసుకొని ఆ విధమైన మహిమను ప్రదర్శింపగలవాడు. ప్రపంచాన్నంతా త్రిప్పుతున్న మహామాయ ఆయనను చక్కగా ఆశ్రయించుకొని తన పని తాను చేస్తున్నది. బలిచక్రవర్తి గొప్పబలానికి చాలా అందమైన విధంగా ప్రతిక్రియ చేసిన మహాశక్తిసంపన్నుడు. మొదట వామనుడై అలా అలా బ్రహ్మాండాంతందాకా పెరిగిన త్రివిక్రమదేవుడు. అట్టి ముప్పోకలపోయిన ముకుందుడు నన్ను నేల నెలవులమీద చక్కగా కాపాడుగాక!
6-303 అడవుల సంకటస్థలుల
సందర్భం:
ప్రాణికి ప్రాణభయం కలిగే తావులన్నింటిలో ఆ మహాస్వామి శ్రీనృసింహమూర్తియై కాపాడుగాక! అని ప్రార్థించమంటున్నది శ్రీమన్నారాయణ కవచం.
చ. అడవుల, సంకటస్థలుల, నాజిముఖంబుల, నగ్నికీలలం
దెడరుల నెల్ల నాకు నుతి కెక్కగ దిక్కగుగాక శ్రీనృసిం
హుడు కనకాక్ష రాక్షస వధోగ్రుడు విస్ఫురి తాట్టహాస వ
క్త్రుడు ఘన దంష్ట్రపావక విధూత దిగంతరు డప్రమేయు డై.
ప్రతిపదార్ధం:
అడవుల = అడవు లందు; సంకట = ఆపదలు కలిగెడి; స్థలులన్ = స్థలము లందు; ఆజి = యుద్ధపు; ముఖంబునన్ = ఎదురై నప్పుడు; అగ్నికీలలన్ = నిప్పుమంటలలో; ఎడరులన్ = ఏడారు లందు; ఎల్లన్ = అన్ని చోట్లను; నా = నా; కు = కు; నుతికి = ప్రసిద్దము; ఎక్కగన్ = అగు నట్లు; దిక్కు = రక్షగా; అగుగాక = ఉండుగాక; శ్రీనృసింహుఁడు = నరసింహస్వామి; కనకాక్ష = హిరణ్యాక్షుడు అనే; రాక్షస = దానవుని; వధ = సంహరించెడి; ఉగ్రుడు = భయంకరుడు; విస్పురిత = వెలి గ్రక్కు చున్న; అట్టహాస = వికృతహాసము గల; వక్త్రుడు = నోరు గల వాడు; ఘన = పెద్ద; దంష్ట్ర = దంతముల నుండి జనించిన; పావక = అగ్నిహోత్రునిచే; విధూత = ఎగురకొట్టబడిన; దిగంతరుండు = దిగంతములు గల వాడు; అప్రమేయుండు = పరిమితుల కందని వాడు; ఐ = అయ్యి.
తాత్పర్యం:
అడవులలో, ఆపదలు మూడిన ఘోరప్రదేశాలలో, యుద్ధరంగాలలో, అగ్నికీలలలో, ఇంకా విపత్తులు చుట్టుముట్టిన సమయాలలో నాకు ఆ స్వామి దిక్కయి నిలుచుగాక. ఆయన నరసింహస్వామి. హిరణ్యాక్షుడనే భయంకర రాక్షసుని వధించిన ఉగ్రమూర్తి. దిక్కులదరిపోయే అట్టహాస ధ్వనులను వెలువరించే వదనం కలవాడు. చాలా గొప్పవైన కోరలనే అగ్నిజ్వాలలతో దిక్కుల మధ్య భాగాలను కూడా దూర దూర తీరాలకు చెదరగొట్టిన మహానుభావుడు. ఎవ్వరికీ, ఏ కొలతలకూ అందని అప్రమేయుడు.
6-304 అరయగ
సందర్భం:
మానవుడు బ్రతుకుబాటలో ఎన్నో దారులలో పయనించవలసివస్తున్నది. అనుక్షణం అచ్యుతుని అండదండలుంటే కాని అడుగైనా ముందుకు పడదు. అందువలన ఆ అచ్యుతుడు ఆదివరాహ రూపంలో అడుగడుగునా కాపాడుగాక అని ప్రార్ధించమంటున్నది శ్రీమన్నారాయణ కవచం.
చ. అరయగ నెల్లలోకములు నంకిలి నొంద మహార్ణవంబులో
నొరగి నిమగ్మమైన ధర నుద్ధతి గొమ్మున నెత్తినట్టి యా
కిరిపతి, యజ్ఞకల్పు, డురుఖేలుడు నూర్జిత మేదినీమనో
హరుడు, కృపావిధేయుడు సదాధ్వముల న్నను గాచు గావుతన్.
ప్రతిపదార్ధం:
అరయగన్ = చూడగా; ఎల్ల = సమస్త మైన; లోకములున్ = లోకములు; అంకిలి = కలత, ఆపద; ఒందన్ = బారగా, పొందగా; మహార్ణవంబు = మహా సముద్రము; లోన్ = లోపల; ఒరిగి = ఒరి గిపోయి; నిమగ్నము = మునిగినది; ఐన = అయిన; ధరన్ = భూమిని; ఉద్దతిన్ = ఉద్దరించుటకు; కొమ్మునన్ = కోరల పై; ఎత్తిన = ధరించిన; అట్టి = అటువంటి; ఆ = ఆ; కిరిపతి = యజ్ఞ వరాహుడు {కిరిపతి - కిరి (వరాహము) పతి (ప్రభువు), వరాహావతారుడు}; యజ్ఞకల్పుడు = యజ్ఞ స్వరూపుడు; ఉరు = గొప్పగ; ఖేలుడు = క్రీడించు వాడు; ఊర్జిత = రూపు దాల్చిన; మేదినీ = భూదేవికి; మనోహరుడు = ప్రియుడు; కృప = దయకు; విధేయుడు = లొంగి పోవు వాడు; సదా = ఎల్లప్పుడు; అధ్వములన్ = దారుల యందు; నన్ను = నన్ను; కాచుగావుత = కాపాడుగాక.
తాత్పర్యం:
లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి. భూదేవి రక్కసుని ఉక్కు కోరలలో చిక్కుకుని మహాసముద్రంలో ఒరిగి మునిగిపోయింది. శ్రీమహావిష్ణువు ఒక్కపెట్టున ఆదివరాహమూర్తియై యజ్ఞస్వరూపం కల్పించుకుని, గొప్ప ఆటగా తన కొమ్ముతో ఆమెను ఉద్ధరించాడు. భూదేవి హృదయాన్ని కొల్లగొట్టాడు. సర్వలోక వాసులందరియందూ జాలువారే కరుణతో అలరారేవాడు. అట్టి స్వామి నేను పోయే దారులన్నింటిలోనూ నన్ను కాపాడుగాక!
6-305 రాముడు
సందర్భం:
నేను ఏ కొండకొమ్ములందో తిరుగవలసి వస్తుంది. కొండకొమ్ములంటే ఘోరమైన ఆపదలు. అక్కడ నాకు సంభవించే ఆపదలనుండి నన్ను కాపాడే స్వామి ఆ భార్గవరాముడే.
కం. రాముడు, రాజకులైక వి,
రాముడు, భృగు సత్కులాభిరాముడు, సుగుణ
స్తోముడు, నను రక్షించును,
శ్రీమహితోన్నతుడు నద్రిశిఖరములందున్.
ప్రతిపదార్ధం:
రాముడు = పరశురాముడు; రాజ కులైక విరాముఁడు = పరశురాముడు {రాజ కులైక విరాముఁడు - రాజ (రాజుల) కుల (వంశమునకు) ఏక (సమస్తమును) విరాముడు(ఖండించు వాడు), పరశురాముడు}; భృగు సత్కు లాభిరాముఁడు = పరశురాముడు {భృగు సత్కు లాభిరాముఁడు - భృగు యొక్క సత్కుల (చక్కటి వంశమునకు) అభిరాముడు (ప్రసిద్దమైన వాడు), పరశురాముడు}; సుగుణ స్తోముఁడు = పరశురాముడు {సుగుణ స్తోముడు - సుగుణముల సమూహము గల వాడు, పరశురాముడు}; నను = నన్ను; రక్షించును = కాపాడుగాక; శ్రీమహి తోన్నతుఁడు = పరశురాముడు {శ్రీమహి తోన్నతుడు - శ్రీ (శుభకర మైన) మహిత (గొప్ప) ఉన్నతుడు (ఉన్నత మైన వాడు), పరశురాముడు}; అద్రి = కొండ; శిఖరముల = శిఖరముల; అందున్ = అందు.
తాత్పర్యం:
ఆయన రాముడు. యోగులందరికీ ఆనందమందించే మనోహరుడు. లోక కంటకులైన నీచ క్షత్రియులను వెదకి వెదకి ఇరవై యొక్క మారులు సంహరించిన దుష్టశిక్షకుడు. భృగుమహర్షి వంశానికి ఆనందం కలిగించిన మహాత్ముడు. గొప్పగుణాలన్నీ ఆయనను ఆశ్రయించి ప్రమోదం పొందాయి. శౌర్యలక్షికి ఆటపట్టయి ఉన్నత శిఖరాలందుకొన్న ఆ పరశురాముడు పర్వత శిఖరాలమీద నన్ను పరిరక్షించాలి.
6-306 తాటక మర్దించి
సందర్భం:
దుష్టశిక్షణకోసం, శిష్టరక్షణకోసం, ధర్మస్థాపనకోసం తన మహావైభవాన్నంతా తగ్గించుకొని మానవుడై అవతరించి మహాద్భుత కార్యాలు ఆచరించిన దశరథ మహారాజు తనయుణ్ణి ప్రార్థించి పరదేశాలలో సంభవించే పాటులనుండి కాపాడుకోమంటున్నది శ్రీ మన్నారాయణ కవచం.
సీ. తాటక మర్దించి తపసి జన్నము గాచి హరువిల్లు విఱిచి ధైర్యమున మెఱసి
ప్రబలు లైనట్టి విరాధ కబంధోగ్ర ఖరదూషణాది రాక్షసుల దునిమి
వానరవిభు నేలి వాలి గూలగ నేసి జలరాశి గర్వంబు జక్కజేసి
సేతువు బంధించి చేరి రావణ కుంభకర్ణాది వీరుల గడిమి ద్రుంచి
తే. అలవిభీషణు లంకకు నధిపుజేసి
భూమిసుత గూడి సాకేతపురమునందు
రాజ్యసుఖములు గైకొన్న రామవిభుడు
వరుస నను బ్రోచుచుండు ప్రవాసగతుల.
ప్రతిపదార్ధం:
తాటక = తాటకిని; మర్ధించి = సంహరించి; తపసి = ఋషి యొక్క; జన్నము = యజ్ఞమును; కాచి = కాపాడి; హరు = శివుని; విల్లు = విల్లును; విఱిచి = విరిచి; ధైర్యమునన్ = ధైర్యముతో; మెఱసి = ప్రకాశించుతూ; ప్రబలులు = మిక్కలి బలమైన వారు; ఐనట్టి = అయి నటువంటి; విరాధ = విరధుడు; కబంధ = కబంధుడు; ఉగ్ర = ఉగ్రుడు; ఖర = ఖరుడు; దూషణ = దూషణుడు; ఆది = మొదలగు; రాక్షసులన్ = రాక్షసుల; దునిమి = సంహరించి; వానర విభున్ = సుగ్రీవుని; ఏలి = పాలించి; వాలిన్ = వాలిని; కూలగ = సంహరించుటకు; ఏసి = బాణము వేసి; జలరాశి = సముద్రుని యొక్క; గర్వమున్ = గర్వమును; చక్కజేసి = అణచివేసి; సేతువు = వంతెన; బంధించి = కట్టి; చేరి = పూని; రావణ = రావణుడు; కుంభకర్ణ = కుంభకర్ణుడు; ఆది = మొదలగు; వీరులన్ = వీరులను; కడిమిన్ = పరాక్రమముతో; త్రుంచి = సంహరించి; అల = ఆయొక్క; విభీషణున్ = విభీషణుని; లంక = లంకా రాజ్యమున; కున్ = కు; అధిపున్ = రాజును; చేసి = చేసి; భూమి సుతన్ = సీతాదేవితో {భూమిసుత - భూదేవి యొక్క పుత్రిక, సీత}; కూడి = కలిసి; సాకేత = సాకేతము యనెడి; పురము = పట్టణము; అందు = లో; రాజ్యసుఖములు = రాజభోగములను; కైకొన్న = స్వీకరించిన; రామవిభుడు = శ్రీరామచంద్రుడు; వరుస = క్రమముగా; నను = నన్ను; ప్రోచు చుండు = కాపాడు తుండును; ప్రవాస = దూరప్రాంతములకు; గతులన్ = పోవు నపుడు.
తాత్పర్యం:
శ్రీరామచంద్రుడు పసితనంలోనే కరకు రక్కసి తాటకను సంహరించాడు. తాపసి అయిన విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షించాడు. శివుని విల్లు ఫెళ్ళున విరిచి సీతమ్మను చేపట్టాడు. ధైర్యంతో విజృంభించి మహాబలవంతులైన విరాధుడు, కబంధుడు, ఖరుడు, దూషణుడు మొదలైన రాక్షసులను రాచి రంపాన పెట్టాడు. కోతుల ఏలిక అయిన సుగ్రీవుణ్ణి ఏలుకున్నాడు. వాలినొక్క కోలతో కూలనేశాడు. లంకకు చేరుకోవటానికి దారి ఇవ్వకపోతే సముద్రాన్నే గడగడలాడించాడు. సాగరానికి సేతువుకట్టాడు. లంకకు చేరుకొని రావణుడు, కుంభకర్ణుడు మొదలైన క్రూరాత్ములను క్రుళ్ళబొడిచి చంపివేశాడు. రాక్షసుడైనా ఉత్తమ గుణాలు గల విభీషణుణ్ణి లంకకు రాజుగా చేశాడు. భూదేవి ముద్దుబిడ్డ అయిన జానకితో కూడుకొని సాకేతపురంలో జనరంజకంగా రాజ్యమేలాడు. అటువంటి రామభద్రుడు నన్ను పరసీమలలో పరిరక్షించుగాక!
6-336 దండంబు
తాత్పర్యం:
వృత్రాసురుడు దేవతల పాలిట తోకచుక్క అయి వారిని కాల్చుకు తింటున్నాడు. అతని బాధలకు తాళలేని ఇంద్రుడు మొదలైన దేవతలు శ్రీ మహావిష్ణువునకు మొరపెట్టుకున్నారు. ఆయన అనుగ్రహబుద్ధితో వారికి దర్శనం అనుగ్రహించాడు. వారు ఆయనను ఇలా స్తుతిచేస్తున్నారు.
సీ. దండంబు యోగీంద్రమండల నుతునకు దండంబు శార్జ్గకోదండునకును
దండంబు మండిత కుండలద్వయునకు దండంబు నిష్ఠుర భండనునకు
దండంబు మత్తవేదండ రక్షకునకు దండంబు రాక్షసఖండనునకు
దండంబు పూర్ణేందుమండల ముఖునకు దండంబు తేజః ప్రచండునకును
తే. దండ మద్భుత పుణ్యప్రధానునకును
దండ ముత్తమ వైకుంఠధామునకును
దండ మాశ్రితరక్షణ తత్పరునకు
దండ మురుభోగినాయక తల్పునకును
ప్రతిపదార్ధం:
దండంబు = నమస్కారము; యోగి = యోగులలో; ఇంద్ర = శ్రేష్ఠుల; మండల = సమూహములచే; నుతున్ = స్తుతింప బడెడి వాని; కున్ = కి; దండంబు = నమస్కారము; శార్ఙ్ఘ = శార్ఙ్ఘము అనెడి; కోదండున్ = విల్లు గల వాని; కును = కి; దండంబు = నమస్కారము; మండిత = అలంకరింప బడిన; కుండల = చెవి కుండలముల; ద్వయున్ = జంట గల వాని; కు = కి; దండంబు = నమస్కారము; నిష్ఠుర = అతి కఠిన మైన; భండనున్ = యుద్దము చేయు వాని; కు = కి; దండంబు = నమస్కారము; మత్తవేదండ = గజేంద్రమును; రక్షకున్ = కాపాడిన వాని; కున్ = కి; దండంబు = నమస్కారము; రాక్షస = రాక్షసులను; ఖండనున్ = సంహరించిన వాని; కు = కి; దండంబు = నమస్కారము; పూర్ణ = నిండు; ఇందు = చంద్ర; మండల = మండలము వంటి; ముఖున్ = ముఖము గల వాని; కు = కి; దండంబు = నమస్కారము; తేజస్ = తేజస్సు; ప్రచండున్ = అతి తీవ్రమైనది గల వాని; కున్ = కి;
దండము = నమస్కారము; అద్భుత = అద్భుత మైన; పుణ్య = పుణ్యములను; ప్రధానున్ = ఇచ్చెడి వాని; కును = కి; దండము = నమస్కారము; ఉత్తమ = శ్రేష్ఠ మైన; వైకుంఠ = వైకంఠము; ధామున్ = నివాసముగా గల వాని; కును = కి; దండము = నమస్కారము; ఆశ్రిత = ఆశ్రయించిన వారిని; రక్షణ = కాపాడుట యందు; తత్పరున్ = లగ్న మగు వాని; కు = కి; దండము = నమస్కారము; ఉరు = గొప్ప; భోగినాయక = ఆదిశేషుని {భోగినాయకుడు - భోగి (సర్పము)లకు నాయకుడు, శేషుడు}; తల్పున్ = పాన్పు గా గల వాని; కును = కి.
తాత్పర్యం:
మహాయోగుల మండలమంతా గొంతెత్తి నీ గుణగణాలను నుతిస్తూనే ఉంటుంది. అట్టి నీకు దండం. ‘శార్ఙ్గం’ అనే గొప్ప కోదండంతో దుష్టులను దండించే దండి మగనికి నీకు దండం. అత్యద్భుత ప్రభలను వెదజల్లే కుండలాల జంటతో అలరారే స్వామికి దండం. అతిఘోరమైన పోరులలో ఆరితేరిన అయ్యకు దండం. గజేంద్రుణ్ణి కాపాడిన కరుణామయునికి దండం. రాక్షసులను ముక్కలుముక్కలుగా నరికి పోగులుపెట్టే స్వామికి దండం. నిండుజాబిలి వంటి నెమ్మోముతో విరాజిల్లే సుందరమూర్తికి దండం. ఎట్టివారికైనా తట్టుకోరాని తేజస్సుతో అతితీవ్రంగా ప్రకాశించే అద్భుతమూర్తికి దండం. అద్భుతమైన పుణ్యం ప్రధానమై భాసిల్లే స్వామికి దండం. ఉత్తమమైన వైకుంఠమే మందిరమైన మాధవునకు దండం. ఆశ్రయించిన వారిని రక్షించటానికి ఆరాటపడే దయామూర్తికి దండం. వేయిపడగలలో విరాజిల్లే ఆదిశేషునిపై పవ్వళించే పరమాత్మకు దండం.
6-339 అకట
సందర్భం:
వృత్రాసురుడు పెట్టే చిత్రహింసలకు తట్టుకోలేని దేవతలు శ్రీమహావిష్ణువుకు మొరపెట్టు కుంటున్నారు. కాపాడవలసినదిగా శ్రీవాసుదేవునకు విన్నవించుకుంటున్నారు.
తే. అకట! దిక్కుల కెల్ల దిక్కైన మాకు
నొక్క దిక్కును లేదు కా లూన నైన
దిక్కుగావయ్య! నేడు మా దిక్కు జూచి
దిక్కులేకున్నవారల దిక్కు నీవ
ప్రతిపదార్ధం:
అకట = అయ్యో; దిక్కుల్ = దిక్కుల; ఎల్లన్ = అన్నిటికిని; దిక్కైన = అధినాయకుల మైన; మా = మా; కున్ = కు; ఒక్క = ఏ యొక్క; దిక్కు = మూలను కూడ; లేదు = లేదు; కాలూనన్ = నిలబడెడి యాధారము; ఐనన్ = అయి నప్పటికిని; దిక్కు = శరణిచ్చు వాడవు; కావు = అగుము; అయ్య = తండ్రి; నేడు = ఇప్పుడు; మా = మా; దిక్కు = వైపునకు; చూచి = చూసి; దిక్కు = ఆధారము; లేకున్న = లే నట్టి; వారల = వారికి; దిక్కు = రక్షకుడవు; నీవ = నీవే.
తాత్పర్యం:
దేవా! మేము దిక్కులన్నింటికీ పాలకులం. కానీ స్వామీ మేము కాలుపెట్టటానికైనా దిక్కులేనివారమైనాము. నేడు మా దిక్కు చూచి మమ్ములను కాపాడు. దిక్కులేనివారలకు దిక్కు నీవేకదా!
6-340 నీ దిక్కు గాని వారికి
సందర్భం:
వైకుంఠవాసునకు దిక్పాలకులైన దేవతలు ఇలా మొరపెట్టుకుంటున్నారు. వృత్రాసురుని చిత్రహింసల నుండి సంరక్షించే బాధ్యత నీదే అంటున్నారు.
కం. నీ దిక్కు గానివారికి,
నే దిక్కును వెదక నుండ దిహపరములకున్
మోదింప దలచువారికి,
నీదిక్కే దిక్కు సుమ్ము! నీరజనాభా!
ప్రతిపదార్ధం:
నీ = నీ; దిక్కు = వైపు; కాని = కా నట్టి; వారి = వారి; కిన్ = కి; ఏ = ఏ విధ మైన; దిక్కును = రక్షణయు; లేదు = లేదు; వెదకన్ = ఎంత వెదికిననూ; ఇహపరముల్ = ఈ లోకపై లోక ప్రయోజనముల; కున్ = కు; మోదింపన్ = సంతోషింప; తలచు = కోరెడి; వారి = వారల; కిన్ = కి; నీ = నీ యొక్క; దిక్కే = రక్షణమా త్రమే; దిక్కు = శరణ్యము; సుమ్ము = సుమా; నీరజనాభా = విష్ణుమూర్తి {నీరజ నాభుడు - నీరజము (పద్మము) నాధుడు (బొడ్డున గల వాడు), విష్ణువు}.
తాత్పర్యం:
పద్మనాభా! నీవైపు చూపుపెట్టనివారికి ఎంత వెదికినా ఎక్కడ వెదికినా ఈ లోకంలో నయినా, పరలోకంలోనయినా ఏదిక్కూ ఉండదు. ప్రమోదం పొందాలనుకునేవారికి నీదిక్కే దిక్కుసుమా! కనుక మమ్ములనందరినీ ఆదుకొనే ఆదిదేవా! అసురమర్దనా! కాపాడు, కాపాడు, కాపాడు.

సప్తమ స్కంధము
7-6 చిత్రంబులు
సందర్భం:
పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రుని తో ఇలా అన్నాడు. “మహానుభావా! సర్వభూతాలకూ సముడైన నారాయణుడు ఇంద్రునికోసం రక్కసులను వెదకి వెదకి ఎందుకు చంపాడు? అలా చంపితే దేవతల వలన తనకేమైనా ప్రయోజనం ఉందా? నిర్గుణుడైన అతనికి రక్కసుల వలన కలిగే భయమేమైనా ఉన్నదా? చూడగా ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉన్నది. దీనిని గురించి నీ ప్రజ్ఞంతా ఉపయోగించి నాకు సమాధానం చెప్పు”. అప్పుడు శుకమహర్షి ఇలా అన్నాడు.
కం. చిత్రంబులు త్రైలోక్యప
విత్రంబులు భవలతా లవిత్రంబులు స
న్మిత్రంబులు మునిజనవన
చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్.
ప్రతిపదార్థం:
విష్ణుదేవు = విష్ణుమూర్తిని; చారిత్రంబులు = కథలు; చిత్రంబులు = మనోజ్ఞమైనవి; త్రైలోక్య = ముల్లోకములను; పవిత్రంబులు = పవిత్రము జేయునవి; భవలతా = సంసారపు తీగలనెడి బంధనములను; లవిత్రంబులు = కొడవళ్ళ వలె ఖండించునవి; సన్మిత్రంబులు = మంచిమిత్రులవంటివి; మునిజన = మునుల సమూహముయనెడి; వనచైత్రంబులు = అడవికి చైత్రమాసము వలె అలరించునవి.
తాత్పర్యం:
రాజా! నీ ప్రశ్న చాలా కొనియాడదగినది. శ్రీమన్నారాయణుని సచ్చరిత్రం మహా చిత్రమైనది. ఆ విష్ణుదేవుని చరిత్రలు చాలా విచిత్రమైనవి. మూడు లోకాలనూ అవి పవిత్రం చేస్తాయి. సంసారమనే తీగలకు అవి కొడవండ్లు. సజ్జనులకు నెచ్చెలులు. మహర్షుల సముదాయాలనే పూదోటలను విరియబూయించే చైత్రమాసాలు. వసంతంలో చెట్లన్నీ క్రొత్త చిగురాకులతో, పూలతో కళాకాంతులతో ఒప్పారుతాయి కదా!
7-14 అలుకనైన
సందర్భం:
శుకమహర్షి శ్రీమన్నారాయణుని దివ్యలీలలను ఇలా వినిపిస్తున్నాడు. రాజా! విష్ణునికి రాగద్వేషాలు లేవు. ఆయన తిట్టినా కొట్టినా అది అనుగ్రహమే. ఈ విషయాన్ని మునుపు నారదమహర్షి రాజసూయయాగ సందర్భంలో ధర్మరాజునకు చక్కగా తెలియజెప్పాడు. ఆ మాటలను నీవు కూడా ఆలకించు.
ఆ. అలుకనైన చెలిమినైన కామంబున
నైన బాంధవముననైన భీతి
నైన తగిలి తలప నఖిలాత్ముడగు హరి
జేరవచ్చు వేఱుసేయ డతడు.
ప్రతిపదార్థం:
అలుకనైన = కోపముతో అయినను; చెలిమినైన = స్నేహముతో అయినను; కామంబుననైన = కోరికతో అయినను; బాంధవముననైన = చుట్టరికముతో అయినను; భీతినైన = భయముతో అయినను; తగిలి = అంటిపెట్టుకొని; తలపన్ = తలచినచో; అఖిలాత్ముడగు = సర్వభూతస్వరూపుడయిన; హరిన్ = నారాయణుని; చేరవచ్చును = చేరుట సాధ్యము; అతడు = అతడు; వేఱు సేయడు = భేదభావము చూపడు.
తాత్పర్యం:
నాయనా! ధర్మరాజా! శ్రీమహావిష్ణువుతో వ్యవహారం లోకంలో లోకులతో అయ్యే వ్యవహారం వంటిది కాదు. కోపంతోనైనా, చెలిమితోనైనా, చుట్టరికంతోనైనా, భయంతోనైనా ఆ మహాత్ముణ్ణి అంటిపెట్టుకొని తలపోస్తూ ఉండాలి. దీనినే ఎడతెగని ధ్యానం అంటారు. దానిలో, కోపతాపాలు ఏ స్థాయిలో ఎంతగా ఉన్నా మనస్సూ, మాటా, చేష్టా మాధవుని మీదనే ఉంటాయి. అప్పుడు హరి అటువంటి వానిని తనలో చేర్చుకుంటాడు. ఆయన సర్వమూ తానే అయినవాడు కదా! కాబట్టి కోపతాపాలను తనపై చూపిన వానిని కూడా వేరు చేయడు.
7-18 కామోత్కంఠత
సందర్భం:
నారదుడు ధర్మరాజునకు వేరువేరు భావాలతో శ్రీమహావిష్ణువును ఎలా ఆరాధించాలో దృష్టాంతాలతో వివరిస్తున్నాడు. లోక వ్యవహారంలో మంచి చెడు అనేవి ఉంటాయి. కానీ భగవంతుని పరంగా ఏదీ దోషాలతో కూడుకున్నది కాదు సుమా అంటున్నాడు.
శా. కామోత్కంఠత గోపికల్ భయమునం గంసుండు వైరక్రియా
సామగ్రిన్ శిశుపాలముఖ్యనృపతుల్ సంబంధులై వృష్ణులున్
ప్రేమన్ మీరలు భక్తి నేము నిదె చక్రిం గంటి మెట్లైనను
ద్దామధ్యాన గరిష్ఠుడైన హరి చెందన్ వచ్చు ధాత్రీశ్వరా!
ప్రతిపదార్థం:
ధాత్రీశ్వరా = రాజా!; కామోత్కంఠత = మన్మథ వికారమునందలి ఆసక్తితో; గోపికల్ = గోపికలు; భయమునం = భయముతో; కంసుండు = కంసుడు; వైరక్రియా సామగ్రిన్ = విరోధపు పనులను కల్పించుకొని; శిశుపాలముఖ్యనృపతుల్ = శిశుపాలుడు మున్నగు రాజులు; సంబంధులై = చుట్టములై; వృష్ణులున్ = యాదవులు; ప్రేమన్ = ప్రేమతో; మీరలు = మీరు; భక్తిన్ = భక్తితో; ఏము = మేము; ఇదె = ఇదిగో; చక్రిం = శ్రీకృష్ణుని; కంటిమి = దర్శించితిమి; ఎట్లైనను = ఏ విధముగా అయినప్పటికిని; ఉద్దామ = ఉన్నతమైన; ధ్యాన = ధ్యానముచే; గరిష్టుడైన = శ్రేష్ఠుడైన; హరిన్ = నారాయణుని; చెందవచ్చు = పొందవచ్చు.
తాత్పర్యం:
మహారాజా! యుధిష్ఠిరా! పొంగి పొరలిన కామంతో గోపికలు, భయంతో కంసుడు, పగతో శిశుపాలుడు మొదలైన రాజులు, చుట్టరికంతో వృష్ణివంశం వారు, నెయ్యంతో మీరు, భక్తితో మేము ఇదిగో అద్భుతమైన చక్రం చేత పట్టుకొన్న నారాయణుని కనుగొనగలిగాము. ఉపాయం ఎట్టిదైనా కావలసినది చాలా ఉన్నత స్థాయికి చెందిన ధ్యానం. అది మహోజ్జ్వలంగా ఉంటే శ్రీహరి అటువంటి తన బిడ్డలను అక్కున చేర్చుకుంటాడు.
7-90 గాలిం గుంభిని
సందర్భం:
రక్కసులరేడు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గుఱించి చాలా ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మకు అతని ఘోరతపస్సు చాలా తృప్తిని కలిగించింది. అతనికి సాక్షాత్కరించాడు. ‘నాయనా! దేహాన్ని పురుగులు తొలిచివేస్తున్నా లెక్కచేయక తపస్సు చేశావు. నీ కోరికలన్నీ తీరుస్తాను, అడుగు’ అన్నాడు. హిరణ్యకశిపుడు పొంగులెత్తిన ఆనందంతో బ్రహ్మను కొనియాడి చివరకు తన కోరికను ఇలా అడిగాడు.
శా. గాలిం గుంభిని నగ్ని నంబువుల నాకాశస్థలిన్ దిక్కులన్
రేలన్ ఘస్రములన్ తమఃప్రభల భూరిగ్రాహ రక్షోమృగ
వ్యాళాదిత్య నరాదిజంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్రశ
స్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ! యిప్పింపవే.
ప్రతిపదార్థం:
గాలిన్ = వాయువునందు; కుంభినిన్ = నేలయందు; అంబువులన్ = నీటి లోను; ఆకాశస్థలిన్ = ఆకాశమునందు; దిక్కులన్ = దిక్కులందు; రేలన్ = రాత్రి యందు; ఘస్రములన్ = పగటియందు; తమః = చీకటియందును; ప్రభలన్ = వెలుగు నందు; భూరి = గొప్ప గొప్ప; గ్రాహ = మొసళ్ళు; రక్షః = రాక్షసులు; మృగ = క్రూర మృగములు; వ్యాళ = పాములు; ఆదిత్య = దేవతలు; నరాది = మానవులు మొదలగు; జంతు = శరీరులతో; కలహవ్యాప్తిన్ = పోరాటము సంభవించినప్పుడు; సమస్త = అన్ని రకముల; అస్త్ర = అస్త్రముల; శస్త్రాళిన్ = శస్త్రముల సమూహముచేతను; మృత్యువు = చావు; లేని = లేనట్టి; జీవనమున్ = బ్రతుకును; లోకాధీశ = బ్రహ్మదేవా!; ఇప్పించవే = అనుగ్రహించుము.
తాత్పర్యం:
స్వామీ! సర్వలోకాలకు ప్రభూ! గాలిలో, నేలలో, నిప్పులో, నీటిలో, నింగిలో, దిక్కులలో, రాత్రులలో, పగళ్ళలో, చీకట్లలో, వెలుగులలో, గొప్పగొప్ప దేహాలు గల మొసళ్ళు, రక్షస్సులు, క్రూరమృగాలు, పెనుబాములు, దేవతలు, నరులు మొదలైన ప్రాణులతో సంభవించే పెను యుద్ధాలలో అన్నివిధాలైన అస్త్రాలతో శస్త్రాలతో, ఇంకా పెక్కు విధాలైన ఆయుధాలతో చావు లేని బ్రతుకు నాకు అనుగ్రహించు, పరమాత్మా!
7-92 అన్నా! కశ్యపపుత్ర
సందర్భం:
హిరణ్యకశిపుని కోరికను తీరికగా ఆలకించాడు సృష్టికర్త బ్రహ్మ. అతడు చావు ద్వారాలన్నీ మూసివేశాననుకున్నాడు. ఏదో ఒక సందు ఉండకపోదనుకున్నాడు బ్రహ్మ. నెమ్మదితో నీ కోరికను తీర్చాను అన్నాడు. కరుణతో అతను ఇంకా ఇలా పలికాడు.
శా. అన్నా! కశ్యపపుత్ర! దుర్లభము లీ యర్థంబు లెవ్వారికిన్
మున్నెవ్వారలు గోర రీ వరములన్ మోదించితి న్నీయెడన్
నన్నుం గోరినవెల్ల నిచ్చితి ప్రవీణత్వంబుతో బుద్ధిసం
పన్నత్వంబున నుండుమీ! సుమతి వై భద్రైక శీలుండవై.
ప్రతిపదార్థం:
అన్నా = అయ్యా; కశ్యపపుత్రా = హిరణ్యకశిపా! ఈ అర్థంబులు = ఈ కోరికలు; ఎవ్వరికిన్ = ఎవరికైనను; దుర్లభములు = పొందరానివి; మున్ను = ఇంతకు పూర్వము; ఈ వరములన్ = ఇట్టి వరములను; ఎవ్వారలున్ = ఎవరును కూడ; కోరరు = కోరలేదు; నీయెడన్ = నీయందు; మోదించితిన్ = సంతోషించితిని; నన్నున్ = నన్ను; కోరినవెల్లన్ = కోరినవి అన్నియును; ఇచ్చితిన్ = ప్రసాదించితిని; ప్రవీణత్వంబుతో = నేరుపుతో; బుద్ధిసంపన్నత్వంబునన్ = జ్ఞానమనెడి సంపదతో; సుమతివై = మంచి బుద్ధి గలవాడవై; భద్రైక శీలుండవై = శుభమే ప్రధానమైన స్వభావములు గలవాడవై; ఉండుమీ = ఉండుము.
తాత్పర్యం:
అన్నా! కశ్యపమహర్షికుమారా! ఎటువంటి వారికైనా ఈ ప్రయోజనాలు పొందనలవి కానివి. మునుపు ఎవరూ ఇటువంటి వరాలు కోరలేదు. నేను నీవిషయంలో నిండు సంతోషం పొందాను. నీవు నన్నడిగినవన్నీ ఇచ్చాను. కానీ నీవు బుద్ధిసంపదను నిండుగా పెంచుకొని గొప్ప నేర్పుకలవాడవై, మంచి భావనాబలమూ, శుభాలను మాత్రమే సాధించాలి అనే శీలమూ కలవాడవై ఉండు. ఈ విషయంలో ఏమరుపాటు పొందకు.
7-115 తనయందు
సందర్భం:
బ్రహ్మ అనుగ్రహించిన వరాలతో హిరణ్యకశిపుడు కన్నూమిన్నూ కానని వాడయ్యాడు. బ్రహ్మ చేసిన హెచ్చరికను అతడు పట్టించుకోలేదు. సర్వలోకాలను అతి క్రూరంగా హింసింపదొడగినాడు. దేవతలందరూ శ్రీమన్నారాయణుని శరణు కోరారు. అతడు వారిని ఓదార్చి నేను చూసుకుంటాను అని మాటయిచ్చి పంపించాడు. అటుపిమ్మట హిరణ్యకశిపునకు విచిత్రమైన చరిత్రలుగల నలుగురు కొడుకులు కలిగారు. అందులో ఒకడు ప్రహ్లాదుడు. అతడు-
సీ. తనయందు నఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున జరుగువాడు
పెద్దల బొడగన్న భృత్యునికైవడి చేరి నమస్కృతుల్ సేయువాడు
కన్నుదోయికి నన్యకాంతలడ్డంబైన మాతృభావనసేసి మరలు వాడు
తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులఁ గావ చింతించువాడు
తే. సముల యెడ సోదరస్థితి జరుపువాడు
దైవతములందు గురువుల దలచువాడు
లీలలందును బొంకులు లేనివాడు
లలితమర్యాదుడైన ప్రహ్లాదు డధిప!
ప్రతిపదార్థం:
అధిప = రాజా!; తనయందున్ = తన ఎడల; అఖిల భూతములందున్ = ఎల్ల ప్రాణులయందును; ఒక = ఒకే; భంగిన్ = విధముగా; సమహితత్వంబున = సమభావ ముతో; జరుగు వాడు = మెలగువాడు; పెద్దలన్ = పెద్దలను; పొడగన్న = గమనించి నచో; భృత్యుని = సేవకుని; కైవడి = వలె; చేరి = దగ్గరకు వెళ్ళి; నమస్కృతుల్ = నమస్కారములు; చేయు వాడు = చేసెడివాడు; కన్నుదోయికి = రెండుకళ్ళకు; అన్య కాంతలు = ఇతర స్త్రీలు; అడ్డంబైన = ఎదురుపడిన; మాతృభావనసేసి = తల్లిగా భావించి; మరలువాడు = మెలి గెడివాడు; తల్లిదండ్రులభంగి = తల్లిదండ్రుల వలె; ధర్మ వత్సలతను = న్యాయబుద్ధితో; దీనుల = బీదలను; కావ = కాపాడుటకు; చింతించువాడు = భావించువాడు; సఖులయెడ = స్నేహితుల యందు; సోదరస్థితి = తోడబుట్టిన వాడివలె; జరుపువాడు = నడచుకొంటాడు; దైవతములంచు = దేవతలని; గురువులన్ = గురువులను; తలచువాడు = భావించెడివాడు; లీలలందును = ఆటలయందును; బొంకులు = అబద్ధములు; లేనివాడు = చెప్పనివాడు; లలిత = చక్కటి; మర్యాదుడైన = మర్యాద గలవాడైన; ప్రహ్లాదుడు = ప్రహ్లాదుడు.
తాత్పర్యం:
రాజా! ఆ ప్రహ్లాదుడు లలితమైన మర్యాదలను పాటించే శీలం కలవాడు. మర్యాదలంటే ప్రవర్తనకు సంబంధించిన పద్ధతులు. వాటిలో కొన్నింటిని మనం మెలకువతో పట్టుకోవాలి. అతడు తనయందూ అఖిల ప్రాణులయందూ, వస్తువులయందూ సమము ఉన్న తీరుతో ప్రవర్తిస్తాడు. సమమంటే బ్రహ్మము కదా! విద్యలో, జ్ఞానంలో, వయస్సులో తనకంటే పెద్దవారు కంటపడితే సేవకునిలాగా దగ్గరకు చేరుకుని నమస్కారాలు చేస్తూ ఉంటాడు. అంటే తానొక మహాచక్రవర్తి కుమారుడను అనే అహంకారం అతనిలో ఇసుమంతైనా కనబడదు. లోకంలో ఏ స్త్రీలోనైనా అతడు అమ్మనే చూస్తాడు. తినటానికి తిండీ, కట్టడానికి గుడ్డా లేని అనాథులైన వ్యక్తులు తారసిల్లినప్పుడు తల్లిదండ్రులు వారిని కాపాడే విధంగా ఆదుకోవాలని ఆరాటపడతాడు. తన యీడు బాలకులు తన అన్నదమ్ములే అన్నట్లుగా వ్యవహరిస్తాడు. గురువులను దైవములనుగానే భావిస్తాడు. ఆటపాటలలో పరిహాసానికి కూడా బొంకులులేని వాక్కుల శుద్ధి ఉన్నవాడు.
7-123 పానీయంబులు
సందర్భం:
ప్రహ్లాదునకు ప్రపంచమంతా విష్ణుమయమే. విష్ణువును అన్ని ఇంద్రియాలతో, మనస్సుతో గమనిస్తూ విశ్వాన్ని స్మృతిపరిథిలోనికి రాకుండా చేసుకోగల మహాజ్ఞాని ఆ రాక్షస బాలకుడు. అటువంటి జ్ఞానం మనమందరం అందుకొని ఆచరణలోపెట్టి తరించాలని ఉపదేశించడం కోసమే ప్రహ్లాదుని ప్రవృత్తిని భాగవతం పరమోదాత్తంగా ప్రకటిస్తున్నది.
శా. పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాసలీ
లానిద్రాదులు చేయుచున్ దిరుగుచున్ లక్షింపుచున్ సంతత
శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతా స్వాద సం
ధానుండై మఱచెన్ సురారిసుతుడేత ద్విశ్వమున్ భూవరా!
ప్రతిపదార్థం:
భూవరా = రాజా!; పానీయంబులు = పానీయములను; త్రావుచున్ = తాగుతూ; కుడుచుచున్ = తినుచు; భాషించుచు = మాటలాడుచు; హాస = నవ్వుచూ; లీల = ఆటలాడుచూ; నిద్రాదులు = నిద్రించుట మొదలగువానిని; చేయుచున్ = చేస్తూ; తిరుగుచున్ = తిరుగుతూ; లక్షింపుచున్ = గురిపెట్టి; సంతత = ఎడతెగని; శ్రీ నారాయణు = శ్రీహరియొక్క; పాదపద్మయుగళీ = పాదములనెడి పద్మముల జంటను; చింతామృత = ధ్యానమనెడి అమృతమును; ఆస్వాద = ఆస్వాదించుటయందు; సంధానుండై = లగ్నమై; సురారి తనయుడు = ప్రహ్లాదుడు; ఏతద్విశ్వమున్ = ఈ ప్రపంచమును; మఱచెన్ = మరచిపోయెను.
తాత్పర్యం:
జనమేజయ మహారాజా! దేవతల పగవాడైన హిరణ్యకశిపుని పుత్రుడు అయిన ప్రహ్లాదుడు నీరు, పాలు మొదలైన పానీయాలు త్రాగుతూ, అన్నం తింటూ, ఆయా లోకవ్యవహారానికి సంబంధించిన మాటలు పలుకుతూ, తన వశంలోనే ఉండని నవ్వులలో, ఆటలలో, నిద్ర మొదలైన దశలలో మెలగుతూ, తిరుగుతూ ప్రపంచాన్ని చూస్తూ కూడా ఎల్లవేళలా శ్రీమన్నారాయణుని పాదపద్మాల జంటను భావించటం అనే అమృతాన్ని జుఱ్ఱు కోవటమే పనిగా పెట్టుకొని ఈ విశ్వాన్ని మరచిపోతూ ఉండేవాడు.
7-142 ఎల్ల శరీర ధారులకు
సందర్భం:
కొడుకు తీరుతెన్నులు తండ్రి హిరణ్యకశిపునకు నచ్చలేదు. అతడు అచ్చమైన రక్కసుడై విష్ణువును కక్కసించుకొనే దిక్కుమాలిన శీలం కలవాడయ్యాడు. అందువలన కొడుకు కూడా అటువంటి వాడే కావాలని కోరుకుంటున్నాడు. ఒకనాడు కుమారుని పిలిచి ‘పుత్రా! నీకేది భద్రమైయున్నది?’ అని బుజ్జగిస్తూ అడిగాడు. ప్రహ్లాదుడు జంకుగొంకులు లేకుండా ఇలా అన్నాడు.
చ. ఎల్ల శరీర ధారులకు నిల్లను చీకటి నూతిలోపలం
ద్రెళ్ళక వీరు నేమను మతిభ్రమణంబున ఖిన్నులై ప్రవ
ర్తిల్లక సర్వమున్నతని దివ్యకళా మయమంచు విష్ణునం
దుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ!
ప్రతిపదార్థం:
నిశాచరాగ్రణీ! =రాక్షసరాజా!; ఎల్ల = సర్వ; శరీరధారులకున్ = జీవులకుకు; ఇల్లు = నివాసము; అను = అనెడి; చీకటి = చీకటి; నూతి = నుయ్యికి; లోపలన్ = లోపల; త్రెళ్ళక = పడక; వీరును = వీరు; ఏమను = మేము అనెడి; మతిభ్రమణంబున = చిత్తవైకల్యముతో; భిన్నులై = భేద భావము గలవారై; ప్రవర్తిల్లక = తిరుగకుండగ; సర్వమున్ = అఖిలము; అతని = అతని యొక్క; దివ్యకళామయము = దివ్యమైన మాయావిలాసముతో నిండినది; అంచు = అని తలచుచు; విష్ణునందు = నారాయణుని యందు; ఉల్లమున్ = హృదయమును; చేర్చి = నిలిపి; తారు = తాము; అడవిన్ = అడవిలో; ఉండుట = ఉండుట; మేలు = ఉత్తమము.
తాత్పర్యం:
రాత్రి సమయాలలో దొంగచాటుగా తిరుగుతూ ప్రాణులకు ద్రోహంచేసే వారికి నాయకుడవైన ఓ మహానుభావా! ఈ ఇల్లు అనే సంసారం ఉన్నదే అది పెద్ద పాడుబడ్డ చీకటి బావి. శరీరం ధరించిన ప్రతి జీవునకు మొట్టమొదట కలుగవలసిన జ్ఞానం అందులో కూలిపోరాదు- అని. వీరువేరు, మేమువేరు అనే భావన భయంకరమైన ఒక వెఱ్ఱితనం. దాని వలన కలిగేది పరమ దుఃఖం. దానిలో మెలగరాదు. మూడవ మెట్టు చాలా గొప్పది. దాని కంటే మించిన జ్ఞానం లేదు. అదేమంటే కనిపించేది, తోచేది, ఉన్నది అంతా కూడా ఆ శ్రీమహావిష్ణువునకు సంబంధించిన దివ్యమైన కళతో నిండినది అనే నిశ్చయబుద్ధి. కాబట్టి ఆ జ్ఞానం చక్కగా కుదురుకోవాలి, దాని ప్రయోజనం పొందాలి అంటే కృత్రిమ వాతావరణంతో లోకాన్ని మోసగిస్తున్న గ్రామాలూ, నగరాలూ పనికిరావు. సహజ సిద్ధమైన అడవిలో ఉండాలి. అదే మేలైన దారి.
7-150 మందారమకరంద
సందర్భం:
కొడుకు పలికిన జ్ఞానపూర్ణమైన వాక్కునకు హిరణ్యకశిపుని తల తిరిగిపోయింది. అయినా కొంత ఓర్పును తెచ్చిపెట్టుకొని రాక్షసప్రవృత్తిని ఉపదేశించటానికి పూనుకున్నాడు. ప్రహ్లాదునకు అదేమీ తలకెక్కలేదు. తన వైఖరిని మొగమాటం లేకుండా కమనీయమైన మాటలతో ఇలా ప్రకటించాడు.
సీ. మందారమకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు
నిర్మలమందాకినీ వీచికల దూగు
రాయంచ చనునె తరంగిణులకు
లలితరసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల చేరునే కుటజములకు
పూర్ణేందుచంద్రికా స్ఫురిత చకోరకం
బరుగునే సాంద్రనీహారములకు
తే. అంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృత పానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబు జేరనేర్చు
వినుతగుణశీల మాటలు వేయునేల?
ప్రతిపదార్థం:
వినుతగుణశీల = స్తుతింపదగిన సుగుణములు గల వర్తన గలవాడా; వేయున్ = అనేకములైన; మాటలు = మాటలు; ఏల = ఎందులకు?; మందార = మందారపువ్వు లోని; మకరంద = పూతేనె; మాధుర్యమున = తీయదనమునందు; తేలు = ఓలలాడెడి; మధుపంబు = తుమ్మెద; మదనములకు = ఉమ్మెత్త పూలవద్దకు; పోవునే = వెళుతుందా; నిర్మల = స్వచ్ఛమైన; మందాకినీ = గంగానది యొక్క; వీచికలన్ = తరంగములందు; తూగు = ఊగెడి; రాయంచ = రాజహంస; తరంగిణులకు = సాధారణ ఏరులవైపు; చనునె = పోవునా; లలిత = చక్కటి; రసాల = మామిడి; పల్లవ = చిగుర్లను; ఖాదియై = తింటూ; చొక్కు = మైమరచెడి; కోయిల = కోయిల; కుటజములకు = కొండమల్లెలను; చేరునే = తినదలుస్తుందా! పూర్ణేందు = నిండు జాబిల్లి; చంద్రికా = వెన్నలకు; స్ఫురిత = స్పందించెడి; చకోరకము = వెన్నెలపులుగు; అరుగునే = వెళ్ళునా ఏమి?; సాంద్ర = దట్టమైన; నీహారములకు = మంచు తెరలవద్దకు; అంబుజోదర = నారాయణుని; దివ్య = దివ్యమైన; పాదారవింద = పాదములనెడి పద్మములను; చింతనామృత = ధ్యానమనెడి అమృతమును; పాన = త్రాగి; విశేష = ఆ విశిష్టతచే; మత్త = మత్తెక్కిన; చిత్తము = మనసు; ఏ = ఏ; రీతిన్ = విధముగ; ఇతరంబు = వేరొకదానిని; చేరనేర్చు = చేరగలదా!
తాత్పర్యం:
తండ్రీ! నీవు పదిమంది పరవశించి కొనియాడే గుణాలతో కూడిన శీలం ఉండవలసిన వాడవు. నీకు వెయ్యి మాటలు చెప్పడం ఎందుకు? ప్రపంచాన్ని పరీక్షించు. మనకంటె నీచస్థాయివి అనుకొనే పశువులు, పక్షులు కూడా మహావస్తువుల రుచిమరిగి నీచపదార్థాల వైపు కంటిని కూడా త్రిప్పవే. గమనించు. అదిగో తుమ్మెద. మందారపుష్పం లోని తేనె తియ్యదనంలో తేలియాడుతున్నది. ఎవరెంత ప్రయత్నించినా అది ఉమ్మెత్తలను చేరుకుంటుందా? ఆ రాజహంసను చూడు. నిర్మలమైన గంగానది అలలలో తేలి మైమరచి ఆడుకుంటున్నది. అది సారంలేని ఏరులవైపు పయనిస్తుందా? చాలా మృదువుగావున్న తీయని మామిడి చిగుళ్ళు తింటూ పరవశించిపోతున్న కోకిల కొండమల్లెలకోసం పోతుందా? పున్నమి చందురుని వెన్నెలతో పొంగిపోయే చకోరపక్షి దట్టమైన మంచుదిబ్బల వైపు వెళ్తుందా? అలాగే అన్ని లోకాలను పుట్టించిన బ్రహ్మను పుట్టించిన బొడ్డు తామరగల శ్రీమహావిష్ణుని దివ్యమైన పాదాలనే పద్మాలను భావించటమే అమృతం. అది పుచ్చుకోవటం చేత చాలా ఎక్కువగా మదించిన నా చిత్తం మరొకదానిని ఎలా చేరగలదు?
7-166 చదివించిరి
సందర్భం:
తనయుని జ్ఞాన వాక్కులకు తండ్రికీ, తప్పుడు చదువులు చెప్పే గురువులకూ తల దిమ్మెక్కిపోయింది. గురువులు రాజుమెప్పుకోసం ఆర్భాటంగా ఇటుపై మెలకువతో మూడు పురుషార్థాలను బోధించి తీసుకొని వస్తామని మాట ఇచ్చి ప్రహ్లాదుణ్ణి వెంటబెట్టుకొనిపోయారు. కొన్ని రోజుల తరువాత అతనిని రాజు దగ్గరకు తీసుకొనివచ్చారు. తండ్రి ముచ్చటపడి నీ వెరింగిన శాస్త్రంలో ఒక పద్యాన్ని తాత్పర్యంతోపాటుగా పలకమన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు-
కం. చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థముఖర శాస్త్రంబులు నే
చదివినవి కలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!
అంటూ ప్రారంభించి పరమసుందరమైన జ్ఞానవాహినికి ఒక చక్కని రేవును రూపొందించాడు.
ప్రతిపదార్థం:
తండ్రీ = తండ్రీ!; నను = నన్ను; గురువులు = గురువులు; చదివించిరి = చదివించిరి; ధర్మార్థ ముఖ్య = ధర్మార్థకామ మున్నగు; శాస్త్రంబులున్ = శాస్త్రములను; చదివితి = చదివితిని; నే = నేను; చదివినవి = చదివినట్టివి; పెక్కులు = అనేకమైనవి; కలవు = ఉన్నవి; చదువులలో = చదువులయందలి; మర్మములు = రహస్యములు; ఎల్లన్ = అన్నిటిని; చదివితిన్ = చదివితిని.
తాత్పర్యం:
తండ్రీ! నన్ను గురువులు చదివించారు. ధర్మము, అర్థము మొదలైన శాస్త్రాలు గట్టిగానే చదువుకున్నాను. అంతేకాదు. ఇంకా నేను చదివినవి చాలా ఉన్నాయి. కానీ నిజమైన చదువు అంటే పరమాత్మ జ్ఞానమేనయ్యా! అటువంటి అనంతంగా ఉన్న చదువులలోని మర్మమంతా నేను చదువుకున్నాను.
7-167 తనుహృద్భాషల
సందర్భం:
చదువులలో మర్మం ఏమిటో ప్రహ్లాదుడు గురువులకు గురువై బోధిస్తున్నాడు. ముందుగా భక్తికి సంబంధించిన తొమ్మిది పద్ధతులను కమ్మగా వివరిస్తున్నాడు.
మ. తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్, చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరి న్నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమా
ప్రతిపదార్థం:
దైత్యోత్తమా! = రాక్షసులలో ఉత్తముడా!; తనుహృద్భాషల = శరీరము, మనస్సు, మాటల ; సఖ్యమున్ = మిత్రత్వం; శ్రవణమున్ = వినుటలు; దాసత్వమున్ = దాసునిగా నుండుట; వందన = నమస్కరించు టలు; అర్చనముల్ = పూజించుటలు; సేవయున్ = పరిచర్యలు చేయుట; ఆత్మలో = మనసునందు; ఎఱుకయున్ = సదసద్వివే కము; సంకీర్తనల్ = కీర్తనలు పాడుట; చింత నంబను = ధ్యానము అనెడి; ఈ = ఈ; తొమ్మిది = తొమ్మిది {నవవిధభక్తులు – 1. సఖ్యము 2. శ్రవణము 3. దాసత్వము 4. వంద నము 5. అర్చనము 6. సేవ 7. ఆత్మలోన నెఱుక 8. సంకీర్తనము 9. చింతనము}; భక్తి మార్గముల = భక్తి విధానములతో; సర్వాత్మున్ = నారాయణుని; హరిన్ = నారాయ ణుని; నమ్మి = నమ్మి; సజ్జనుడై = సాధుస్వభావియై; ఉండుట = ఉండుట; భద్రమంచు = శ్రేయమని; సత్యంబు = నిజముగా; తలతున్ = తలచెదను.
తాత్పర్యం:
మహారాజా! నీవు దైత్యులలో ఉత్తముడవు. కాబట్టి ఎవరో జ్ఞాన సంపన్నుడు ఉపదేశింపకపోతే నీకు తెలియదు కనుక చెప్తున్నాను. భక్తికి సంబంధించి తొమ్మిది మార్గాలు ఉన్నాయి. పట్టుదలతో తొమ్మిదింటినీ సాధించాలి, లేదా శక్తి ననుసరించి కొన్నింటినైనా పట్టుకోవాలి. మానవులకు భగవంతుడు దేహాన్ని, మనస్సును, మాటను అనుగ్రహించాడు. ఆ మూడింటినీ ఒక్కత్రాటిపైకి తెచ్చుకొని భగవంతునితో చెలిమి చేయడం అనేది మొదటి పద్ధతి. సంస్కృతంలో సఖ్యం అంటే ఒకే ప్రాణమన్నంతటి చెలిమి. భగవంతుని గూర్చి వింటూ ఉండడం రెండవ త్రోవ. భగవంతునికి దాసుడై పోవడం మూడవ దారి. భగవంతునికి నమస్కారం చేస్తూ ఉండడం నాలుగవది. పూజలు చేయడం అయిదవ మార్గం. స్వామికి ఏదో ఒక రూపంలో సేవ చేయడం ఆరవది. ఆత్మలో భగవంతుని జ్ఞానాన్ని నిండుగా తెలిసికొని నిలుపుకొనడం ఏడవ మార్గం. భగవంతుని తత్వం తెలిపే పాటలు పాడుకుంటూ కాలం గడపడం ఎనిమిదవది. నిరంతరంగా భావిస్తూ ఉండడం తొమ్మిదవది. ఈ తొమ్మిది మార్గాలతో శ్రీహరి సర్వాత్ముడు అని నమ్మి మానవుడు సజ్జనుడై ఉండటమే భద్రమైనది అని నేను భావిస్తూ ఉంటాను. ఇది సత్యం.
7-168 అంధేందూదయముల్
సందర్భం:
ప్రహ్లాదుడు అత్యద్భుతమైన మనోవికాసం పొంది, అదిలేని తండ్రికీ, తండ్రివంటి వారికీ విష్ణుభక్తిలేని వారి దౌర్భాగ్యాన్ని ఇలా వివరిస్తున్నాడు.
శా. అంధేందూదయముల్ మహాబధిరశంఖా రావముల్ మూకస
ద్గ్రంధాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతఘ్నావళీ
బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ స
ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థ సంసారముల్ 7.168
ప్రతిపదార్థం:
అంధ = గుడ్డివాని పాలిటి; ఇందు = చంద్రుని; ఉదయముల్ = ఉదయించుటలు; మహా = మిక్కిలి; బధిర = చెవిటివాని చెంత; శంఖ = శంఖము యొక్క; ఆరావ ముల్ = శబ్దములు; మూక = మూగవానిచేత; సత్ = మంచి; గ్రంథ = గ్రంథములను; ఆఖ్యాపనముల్ = చెప్పించుటలు; నపుంసక = మగతనము లేని వాని; వధూకాంక్షల్ = మగువల పొందు కోరుటలు; కృతఘ్నావళీ = మేలు మరచెడి సమూహముతోటి; బంధు త్వంబులు = చుట్టరికములు; భస్మ = బూడిదలో పోసిన; హవ్యములు = హోమములు; లుబ్ద = లోభి యొక్క; ద్రవ్యముల్ = సంపదలు; క్రోడ = పందికి; సద్గంధంబుల్ = సువా సనలు; హరి = నారాయణుని; భక్తి = భక్తిని; వర్జితుల = వదలిన వారి; రిక్త = శూన్య ములైన; వ్యర్థ = ప్రయోజన హీనము లైన; సంసారముల్ = జీవనములు.
తాత్పర్యం:
శ్రీహరియందు భక్తిలేనివారి బ్రతుకులు వట్టి పనికిమాలినవి. అవి ఎటువంటివంటే గ్రుడ్డివాని ఎదుట చంద్రుడు ఉదయించడం, అరచి గీపెట్టినా వినపడని చెవిటివానికి శంఖనాదం చేయడం, మూగవానిని గొప్ప వేదాంత గ్రంథాలను బోధించమనడం, పేడివానికి ఆడువారిపై కోరిక పుట్టడం, చేసిన మేలు సుఖంగా మరచిపోయి ద్రోహం చేయటానికి వెనుకాడని వారితో చుట్టరికాలు చేయడం, బూడిదలో హోమద్రవ్యాలను క్రుమ్మరించటం, పిసినిగొట్టులకు సంపదలు దొరకడం, పందులకు మంచి గంధాలను అందించటం వంటివి.
7-169 కమలాక్షు నర్చించు
సందర్భం:
భగవంతుడు మానవులకు కాళ్ళూ చేతులూ మొదలైన అంగాలు ఇచ్చినది వానిని శ్రీహరిని సేవించు కోవటానికి మాత్రమే. ఆ పని చేయకపోతే అవి వట్టి పనికిమాలినవి అని ప్రహ్లాదుడు తండ్రికి విస్పష్టంగా వక్కాణిస్తున్నాడు.
సీ. కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణునాకర్ణించు వీనులు వీనులు
మధువైరి తవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి
తే. దేవదేవుని జింతించు దినము దినము
చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు
తండ్రి! హరి జేరుమనియెడి తండ్రి తండ్రి
ప్రతిపదార్థం:
కమలాక్షున్ = కమలములవంటి కన్నులు కల నారాయణుని; అర్చించు = పూజించెడి; కరములు = చేతులే; కరములు = నిజమైన చేతులు; శ్రీనాథున్ = లక్ష్మీదేవి భర్త అయిన నారాయణుని; వర్ణించు = స్తోత్రము చేసెడి; జిహ్వ = నాలుకే; జిహ్వ = నిజ మైన నాలుక; సురరక్షకునిన్ = దేవతలను రక్షించెడి నారాయణుని; చూచు = చూచెడి; చూడ్కులు = చూపులే; చూడ్కులు = నిజమైన చూపులు; శేషశాయికి = ఆదిశేషువుపై పవ్వళించు నారాయణునికి; మ్రొక్కు = నమస్కరించెడి; శిరము = తలయే; శిరము = నిజమైన తల; విష్ణున్ = సర్వమునందు వ్యాపించు నారాయణుని; ఆకర్ణించు = వినెడి; వీనులు = చెవులే; వీనులు = నిజమైన చెవులు; మధువైరిన్ = మధువనే రాక్షసుని శత్రువైన నారాయణునియందు; తవిలిన = లగ్నమైన; మనము = చిత్తమే; మనము = నిజమైన చిత్తము; భగవంతున్ = భగవంతుడైన నారాయణుని; వలగొను = ప్రదక్షిణలు చేసెడి; పదములు = అడుగులే; పదములు = నిజమైన అడుగులు; పురుషోత్తముని = పురుషోత్తముడైన నారాయణుని; మీది = మీద గల; బుద్ధి = తలపే; బుద్ధి = నిజమైన తలపు; దేవదేవుని = దేవదేవుడైన నారాయణుని; చింతించు = ధ్యానించు; దినము = రోజే; దినము = నిజమైన రోజు; చక్రహస్తుని = చక్రధారియైన నారాయణుని; ప్రకటిం చెడి = తెలియచెప్పెడి; చదువు = చదువే; చదువు = నిజమైన చదువు; కుంభినీధవున్ = భూదేవి నాథుడైన నారాయణునిగురించి; చెప్పెడి = చెప్పునట్టి; గురుడు = గురువే; గురుడు = నిజమైన గురువు; తండ్రి = తండ్రీ; హరిన్ = నారాయణుని; చేరుము = చేరుము; అనియెడి = అనెడి; తండ్రి = తండ్రియే; తండ్రి = నిజమైన తండ్రి.
తాత్పర్యం:
తండ్రీ! కమలాలవంటి కన్నులున్న ఆ స్వామిని పూజించే చేతులే నిజమైన చేతులు. లక్ష్మీపతి అయిన నారాయణుని గుణగణాలను కొనియాడే నాలుకయే నాలుక. దేవతలను కూడా కాపాడే ప్రభువును చూచే చూపులే చూపులు. ఆదిశేషుని పాన్పుగా చేసికొన్న వైకుంఠనాథునికి మ్రొక్కే తలయే తల. విష్ణువును గూర్చి వినే శీలం కల చెవులే చెవులు. మధువును మట్టుపెట్టిన మాధవుని అంటిపెట్టుకొని ఉండే మనస్సే మనస్సు. భగవంతునకు ప్రదక్షిణం చేసే పాదాలే పాదాలు. పురుషోత్తమునిపై నిశ్చలంగా నెలకొని ఉన్న బుద్ధియే బుద్ధి. ఆయన దేవులందరకు దేవుడు. అట్టివానిని భావించే దినమే దినము. చక్రం చేతబట్టి దుష్టసంహారం చేసే స్వామిని తెలియజెప్పే చదువే నిజమైన చదువు. ఈ సర్వభూమికీ అధినాయకుడైన మహాప్రభువును బోధించే గురువే గురువు. శ్రద్ధగా వినవయ్యా! హరిని చేరుకో నాయనా అని ఉపదేశంచేసే తండ్రియే తండ్రి.
7-170 కంజాక్షునకు
సందర్భం:
భగవంతుని కోసం వినియోగింపనిదేదీ పనికిమాలినదే అవుతుంది. కనుక రాక్షసరాజా! బుద్ధిశక్తులను వినియోగించి దీనిని గట్టిగా తెలుసుకో అంటున్నాడు ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపునితో
సీ. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మభస్త్రిగాక
వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమ ధ్వనితోడి ఢక్కగాక
హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక
కమలేశు జూడని కన్నులు కన్నులే తను కుడ్య జాల రంధ్రములుగాక
తే. చక్రిచింతలేని జన్మంబు జన్మమే
తరళ సలిల బుద్బుదంబుగాక
విష్ణుభక్తిలేని విబుధుండు విబుధుడే
పాదయుగముతోడి పశువుగాక!
ప్రతిపదార్థం:
కంజాక్షునకు = పద్మములవంటి కన్నులుగల నారాయణునికి; కాని = ఉపయో గించని; కాయంబు = దేహము; కాయమే = దేహమా?; పవన = గాలిచే; గుంభిత = పూరించినట్టి; చర్మభస్త్రికాక = తోలుతిత్తియే; వైకుంఠున్ = వైకుంఠవాసుడైన నారాయణుని; పొగడని = కీర్తించని; వక్త్రంబున్ = నోరు; వక్త్రమే = నోరా? ఢమఢమ = ఢమ ఢమయనెడి; ధ్వనితోడి = శబ్దములతో కూడిన; ఢక్కకాక = ఢక్క అనే వాద్యమే; హరి = నారాయణుని; పూజనము = పూజలను చేయుట; లేని = లేని; హస్తంబు = చేయి; హస్తమే = చేయా?; తరుశాఖ = చెట్టుకొమ్మతో; నిర్మిత = చేయబడిన; దర్వికాక = తెడ్డే; కమలేశున్ = లక్ష్మీదేవి భర్త అయిన నారాయణుని; చూడని = చూడనట్టి; కన్నులు = కళ్లు; కన్నులే = కళ్ళా; తనుకుడ్య = దేహమనెడి గోడయందలి; జాల రంధ్రములే! = కిటికీలుకదా!; చక్రి = నారాయణుని {చక్రి – చక్రాయుధము గల వాడు, విష్ణువు}; చింత = తలపు, ధ్యానము; లేని = లేనట్టి; జన్మంబు = పుట్టుక కూడ; జన్మమే = పుట్టుక యేనా; తరళ = కదలుచున్న; సలిల = నీటి; బుద్భుదంబుకాక = బుడగకదా!; విష్ణుభక్తి = విష్ణుభక్తి; లేని = లేనట్టి; విబుధుండు = విద్వాంసుడు; విబుధుండే = విద్వాంసుడా; పాద = కాళ్ళు; యుగము = రెంటి; తోడి = తోటి; పశువు = పశువే కదా!
తాత్పర్యం:
రాక్షసచక్రవర్తీ! మన దేహం మాధవుని సేవకు మాత్రమే వినియోగింపబడాలి. లేకపోతే అది కాయమే కాదు. గాలితో నింపిన తోలుతిత్తి అయిపోతుంది. మన నోరు వైకుంఠస్వామిని స్తుతిస్తూ ఉండాలి. లేకపోతే అది నోరేకాదు, ఢమఢమా అంటూ చప్పుడు చేసే ఢక్క అయిపోతుంది. మన చేయి శ్రీహరి పాదసేవనం చేయాలి. అప్పుడే అది హస్తం అవుతుంది. కాకపోతే చెట్టుకొమ్మతో చేసిన తెడ్డుకూ దానికీ తేడా ఉండదు. లక్ష్మీపతి అయిన శ్రీమన్నారాయణుని చూచే శీలంగల కన్నులే నిజమైన కన్నులు. ఆ పని చేయకపోతే శరీరమనే గోడలో పెట్టిన గవాక్షాలయిపోతాయి. చక్రపాణిని ధ్యానించే జన్మమే జన్మం. అది లేకపోతే క్షణంలో పగిలిపోయే నీటిబుడగ. విష్ణుభక్తిలేని పండితుడు పండితుడే కాడు, రెండు కాళ్ళున్న పశువు.
7-171 సంసార జీమూత
సందర్భం:
మానవుడు మాధవుడు కావాలి. మానవాధముడై దానవుడు కారాదు. దానికి కొన్ని మంచి పనులు చేయాలి. ప్రహ్లాదకుమారుడు తండ్రికి ఆ మంచి పనులను ప్రయోజనాత్మకంగా వివరిస్తున్నాడు.
సీ. సంసార జీమూత సంఘంబు విచ్చునే
చక్రిదాస్యప్రభంజనము లేక
తాపత్ర యాభీల దావాగ్ను లాఱునే
విష్ణుసేవామృత వృష్టిలేక
సర్వంకషాఘౌఘ జలరాశులింకునే
హరిమనీషా బడబాగ్ని లేక
ఘనవిపద్గాఢాంధకారంబు లణగునే
పద్మాక్షు నుతిరవిప్రభలు లేక
తే. నిరుపమా పునరావృత్తి నిష్కళంక
ముక్తినిధి గానవచ్చునే ముఖ్యమైన
శార్ఙ్గకోదండ చింతనాంజనములేక
తామరస గర్భునకునైన దానవేంద్ర!
ప్రతిపదార్థం:
దానవేంద్ర = రాక్షసరాజా!; సంసార = సంసారమనెడి; జీమూత = మబ్బుల; సంఘంబు = సమూహము; చక్రి = నారాయణుని; దాస్య = కైంకర్యమనెడి; ప్రభంజన ము లేక = పెనుగాలిలేక; విచ్చునే = విడిపోవునా; తాపత్రయ = ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములనెడి మూడు తాపములనే; ఆభీల = భయంకరమైన; దావాగ్నులు = కార్చిచ్చులు; విష్ణు = నారాయణుని; సేవామృతవృష్టి = సేవయనెడి అమృతపు వర్షములేక; ఆఱునే = ఆరిపోవునా; సర్వంకష = ఎల్లెడలను నిండిన; అఘ = పాపముల; ఓఘ = సముదాయము లనెడి; జలరాసులు = సముద్రములు; ఇంకునే = ఇంకిపోవునా; హరి = నారాయణుని; మనీషా = ప్రజ్ఞ యనెడి; బడబాగ్ని = బడబాగ్ని; లేక = లేక; ఘన = గొప్ప; విపత్ = ఆపద లనెడి; గాఢ = చిమ్మ; అంధకారంబుల్ = చీకటులు; అణగునే = నశించునా; పద్మాక్షున్ = పద్మముల వంటి కన్నులు కల నారాయణుని; నుతి = స్తోత్రమనెడి; రవిప్రభలు = సూర్యకాంతులు; లేక = లేక; నిరుపమా పునరావృత్తి = సాటిలేని తిరిగిరాని విధమైన; నిష్కళంక = నిర్మలమైన; ముక్తినిధిన్ = మోక్షపదవిని; ముఖ్యమైన = అసాధారణమైన; శార్ఙ్గకోదండ = శార్ణ్గ్గము, కోదండము గల నారాయణుని; చింతనాంజనము = ధ్యానమనెడి కాటుక; లేక = లేక; తామరస గర్భునకైన = బ్రహ్మదేవునికైనా; కానవచ్చునే = పొందుట సాధ్యమా?
తాత్పర్యం:
రాక్షసరాజా! సంసారం ఒక కారుమబ్బుల సముదాయం. అది విచ్చిపోవాలంటే శ్రీమహావిష్ణువునకు దాస్యం చేయాలి. అది ఆ మబ్బుల పాలిట పెనుగాలి. ప్రతివ్యక్తీ మూడు విధాలైన తాపాలతో- మంటలతో ఉడికిపోతూ ఉంటాడు - ఆధ్యాత్మికం, ఆధిభౌతికం, ఆధిదైవికం అని ఆ తాపాలపేర్లు. అవి దట్టంగా పెరిగిన కారడవులలో పుట్టిన దావాగ్ని వంటివి. అవి ఆరిపోవాలంటే విష్ణుసేవ అనే అమృతవర్షం కురవాలి. పాపాల ప్రోవులున్నాయే అవి అన్నింటికీ రాపిడిపెట్టే జలరాశులవంటివి. అవి ఇంకి పోవాలంటే విష్ణువునందు నెలకొన్న బుద్ధి అనే బడబాగ్ని కావాలి. చెప్పనలవికాని ఆపదలనే కాఱుచీకట్లు అణగిపోవాలంటే పద్మాలవంటి కన్నులున్న మాధవుడనే భాస్కరుని ప్రభలు ఉండాలి. మానవుడు అతిముఖ్యంగా తప్పనిసరిగా సాధించి తీరవలసిన గొప్పనిధి ఒక్కటే ఒక్కటి ఉన్నది. దానిని ముక్తి అంటారు. దానికి సాటి అయినది మరొకటిలేదు. అది సిద్ధిస్తే కలిగే గొప్ప లాభం మరల పుట్టటం గిట్టటం అనే తిరుగుళ్ళు ఉండకపోవటం. ఆ నిధిని కనుగొనాలంటే ఒక గొప్పశక్తి గల కాటుకను పెట్టుకోవాలి. ఆ కాటుక ఏమిటో తెలుసా! శార్ఙ్గం అనే వింటిని ధరించి సర్వలోకాలను రక్షిస్తున్న శ్రీహరిని నిరంతరం భావన చేయడమే. ఇది నీకూ నాకూ మాత్రమే కాదు, లోకాలన్నింటినీ సృష్టి చేస్తున్న బ్రహ్మదేవునకు కూడా అదే దిక్కు.
7-182 కాననివాని
సందర్భం:
ప్రహ్లాదుని ఉపన్యాసం వింటున్న హిరణ్యకశిపునకు ఒళ్ళుమండి పోతున్నది. గురువులు చెప్పని యీతెలివి నీకెలా వచ్చిందిరా? అని గొంతు చించుకుంటూ కోపంతో ఊగిపోతూ అడిగాడు. దానికి ప్రహ్లాదుడు ఇలా బదులు పలుకుతున్నాడు.
ఉ. కాననివాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువున్
గానని భంగి కర్మములు గైకొని కొందఱు కర్మబద్ధులై
కానరు విష్ణుఁ గొంద ఱటఁ గందురకించన వైష్ణవాంఘ్రిసం
స్థానరజోభిషిక్తులగు సంహృతకర్ములు దానవేశ్వరా!
ప్రతిపదార్థం:
దానవేశ్వరా = దైత్యేశ్వరా!; కాననివానిన్ = చూడలేని వానిని; ఊతగొని = సాయంగా తీసుకొని; కానని వాడు = గుడ్డివాడు; విశిష్ట = శ్రేష్ఠమైన; వస్తువున్ = వస్తువును; కానని = చూడలేని; భంగి = వలె; కర్మములున్ = కర్మలను; కైకొని = చేపట్టి; కొందఱు = కొంతమంది; కర్మ = కర్మలకు; బద్దులై = కట్టుబడినవారై; విష్ణున్ = నారాయణుని; కానరు = చూడజాలరు; కొందఱు = కొంతమంది; అకించన = కేవలమైన; వైష్ణవ = నారాయణుని; అంఘ్రి = పాదములందు; సంస్థాన = తగిలిన; రజః = ధూళిచేత; అభిషిక్తులగు = అభిషేకింపబడినవారై; సంహృత = విడిచి పెట్టిన; కర్ములు = కర్మములు గలవారు; అటన్ = అక్కడ; కందురు = పొందెదరు.
తాత్పర్యం:
దానవులకు ప్రభువవైన ఓతండ్రీ! కళ్ళులేని వాడొకడు ఏదో మేలైన వస్తువును చూడాలని మరొక గ్రుడ్డివాని చెయ్యి పట్టుకొన్నాడు. వానికి ఆ వస్తువు కానవస్తుందా? అలాగే కొందరు యజ్ఞం మొదలైన కర్మములను పట్టుకొంటారు. అవి వారికి తెగద్రెంచుకోవటానికి వీలులేని సంకెళ్ళయిపోతాయి. దానివలన విష్ణువును చూడలేని దౌర్భాగ్యం వారిని పట్టుకుంటుంది. కానీ వివేకం పండించుకొన్న జ్ఞానులు ఉందో లేదో అన్నంత స్వల్పంగా ఉన్న శ్రీమహావిష్ణువు పాదాల మీది దుమ్ముకణంతో తలమున్కలుగా స్నానమాడి కర్మబంధాలను త్రెంపివేసుకొని శ్రీమహావిష్ణువుదర్శన మహాభాగ్యం పొందుతారు.
7-264 బలయుతులకు
సందర్భం:
ప్రహ్లాదుని విష్ణువిజ్ఞానం హిరణ్యకశిపునకు గుండెలో గ్రుచ్చుకొన్న శల్యం అయిపోయింది. దాని వేదనతో ఓరీ, ఈ సృష్టిలో నేనే బలవంతుణ్ణి. ఒంటరిగా పోరి మహాబలులైన దేవతలనందరినీ గెలిచాను. అటువంటి నాతో ప్రతివీరుడవై నాకు మారుమాటలు పలుకుతున్నావు. ఇది ఎవని బలం వలన కలిగిందిరా? అన్నాడు. దానికి ప్రహ్లాదుడు ఇలా బదులు చెబుతున్నాడు.
కం. బలయుతులకు దుర్బలులకు
బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకున్
బలమెవ్వడు, ప్రాణులకును
బలమెవ్వం డట్టి విభుడు బలమసురేంద్రా!
ప్రతిపదార్థం:
అసురేంద్రా = రాక్షసరాజా!; బలయుతులకు = బలము గల వారికి; దుర్బలులకు = బలము లేనివారికి; బలము = అండ; ఎవ్వడు = ఎవరు; నీకు = నీకు; నాకు = నాకు; బ్రహ్మాదులకున్ = బ్రహ్మాదిదేవతలకు; బలము = ప్రాపు, శరణు; ఎవ్వడు = ఎవరో; ప్రాణులకున్ = జీవులకు; బలము = అండ; ఎవ్వండు = ఎవరో; అట్టి = అటువంటి; విభుడు = ప్రభువు; బలము = అండ.
తాత్పర్యం:
రాక్షసరాజా! నేను చాలా బలంగల వాడనని నీవు గొప్పలు చెప్పుకుంటున్నావు. కానీ వివేకంతో పరీక్షించితే సర్వలోకాలను వ్యాపించి ఉన్న ప్రభువు శ్రీమహావిష్ణువే అందరికీ, అన్నింటికీ బలం. బలం ఉన్నవాళ్ళకూ, లేనివాళ్ళకూ, నీకూ, నాకూ, బ్రహ్మ మొదలైన దేవుళ్ళకూ, ప్రాణంకల వారందరికీ బలం ఆయనే. గుర్తించినవాడు నావంటి భక్తుడు. గుర్తింపనివాడు నీవంటి రాక్షసేంద్రుడు.
7-274 కలడంభోధి
సందర్భం:
నీవు చెప్పే ఆ విష్ణువు ఎక్కడ ఉంటాడురా? ఏవిధంగా తిరుగుతూ ఉంటాడు? ఏ దారినుండి వస్తాడు? నేను చాలా మారులు వెదికాను. వాడీ విశ్వంలో ఎక్కడా లేడు- అన్నాడు హిరణ్యకశిపుడు. అతడలా అంటున్నకొద్దీ ప్రహ్లాదునికి పట్టశక్యం కాని ఆనందం పొంగులెత్తి వస్తున్నది. ఎందుకంటే తనకా విష్ణువు సర్వమయుడై కనిపిస్తున్నాడు. ఆ ఆనందపారవశ్యంతో గంతులు వేస్తూ ఇలా చెబుతున్నాడు.
మ. కలడంభోధి గలండుగాలి గలడాకాశంబునన్ గుంభినిన్.
కలడగ్నిన్ దిశలన్ బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
కలడోంకారమునం ద్రిమూర్తుల త్రిలింగవ్యక్తులం దంతటన్
కలడీశుండు కలండు తండ్రి వెదకంగానేల యీ యాయెడన్.
ప్రతిపదార్థం:
తండ్రి = తండ్రీ; ఈశుండు = భగవంతుడు; అంభోధిన్ = సముద్రముల లోను; కలడు = ఉన్నాడు; గాలిన్ = గాలి లోను; కలండు = ఉన్నాడు; ఆకాశంబునన్ = ఆకాశములోను; కుంభినిన్ = భూమియందును; కలడు = ఉన్నాడు; అగ్నిన్ = నిప్పు లోను; దిశలన్ = దిక్కులన్నిటియందును; పగళ్ళన్ = దినములందును; నిశలన్ = రాత్రులయందును; ఖద్యోత = సూర్యునియందు; చంద్ర = చంద్రుని; ఆత్మలన్ = ఆత్మలందు; కలడు = ఉన్నాడు; ఓంకారమునన్ = ఓంకారమునందును; త్రిమూర్తులన్ = త్రిమూర్తులందును; త్రిలింగవ్యక్తులందు అంతటన్ = స్త్రీ పురుష నపుంసక జాతులందు అంతటను; కలడు = ఉన్నాడు; కలండు = ఉన్నాడు; వెదుకంగానేల = వెదకట మెందుకు; ఈయాయెడన్ = ఇక్కడా అక్కడా; కలడు = ఉన్నాడు.
తాత్పర్యం:
తండ్రీ! ఆ శ్రీమహావిష్ణువు సముద్రంలో, గాలిలో, గగనంలో, నేలమీద, అగ్నిలో ఇలా అన్ని దిక్కులలోను ఉన్నాడు. పగళ్ళలో, రాత్రులలో, సూర్యునిలో, చంద్రునిలో, జీవాత్మలలో, ఓంకారంలో, సృష్టి, స్థితి, లయములను చేసే బ్రహ్మవిష్ణుమహేశ్వరులలో, స్త్రీలలో, పురుషులలో, ఆరెంటికీ చెందని వ్యక్తులలోనూ ఉన్నాడయ్యా! ఇక్కడా అక్కడా అని వెదకటం ఎందుకు?
7-275 ఇందుగల
సందర్భం:
మాకు విష్ణువును వెదకనవసరం లేదు. రాక్షసప్రవృత్తి కలవానికి విష్ణువు వెదకి చూడవలసినవాడే! ఓ రాక్షసరాజా! దీనిని మెలకువతో గమనించు అంటున్నాడు ప్రహ్లాద కుమారుడు.
కం. ఇందుగల డందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
అందందే కలడు దానవాగ్రణి వింటే.
ప్రతిపదార్థం:
దానవాగ్రణి = రాక్షసరాజా; చక్రి = విష్ణువు; ఇందు = దీనిలో; కలడు = ఉన్నాడు; అందు = దానిలో, అక్కడ; లేడు = లేడు; అని = అని; సందేహము = అనుమానము; వలదు = వద్దు; సర్వ = అన్నిటియందు; ఉపగతుండు = ఉండువాడు; ఎందెందు = ఎక్కడెక్కడ; వెదకి = వెదకి; చూచినన్ = చూసినచో; అందందే = అక్కడక్కడే; కలడు = ఉన్నాడు; వింటే = వింటున్నావా?
తాత్పర్యం:
తండ్రీ, నీవు రాక్షసస్వభావం చిటారు కొమ్మమీద ఉన్నవాడవు కాబట్టి చక్రి ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నావు. ఆ చక్రం చేతబట్టి నీవంటి వారి శిరస్సు ఖండించటం కోసమే ఆ శ్రీమహావిష్ణువు అవకాశంకోసం చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అనే సందేహమే వలదు. ఆయన సర్వంలో, సర్వులకూ చాలా దగ్గరగా అందుబాటులోనే ఉన్నాడు. కాకపోతే నీవంటి వాడు వెదకి చూడాలి. ఎక్కడ ఎక్కడ వెదికి చూస్తే అక్కడ అక్కడనే ఉన్నాడు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి సుమా!
7-277 హరి సర్వాకృతులం
సందర్భం:
తండ్రీకొడుకుల తగవులాట చాలా రసవత్తరంగా జరుగుతున్నది. వారిద్దరి మధ్యా శ్రీహరి చిద్విలాసంతో ఊగిపోతున్నాడు. దుష్టుణ్ణి శిక్షించటానికీ, భక్తుణ్ణి పరిరక్షించటానికీ ఆ సర్వజగన్నాయకుడు ఏమి చేస్తున్నాడో మహాభక్తశిఖామణియైన పోతనామాత్యులవారు రమణీయ పద్యం ద్వారా మనకందిస్తున్నారు.
మ. హరి సర్వాకృతులం గలండనుచు ప్రహ్లాదుండు భాషింప స
త్వరుడై యెందును లేడులేడని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ
నరసింహాకృతి నుండె నచ్యుతుడు నానాజంగమ స్థావరో
త్కరగర్భంబుల నన్నిదేశముల నుద్దండప్రభావంబునన్
ప్రతిపదార్థం:
హరి = నారాయణుడు; సర్వాకృతులన్ = ఎల్లరూపము లందును; కలండు = ఉన్నాడు; అనుచు = అంటూ; ప్రహ్లాదుడు = ప్రహ్లాదుడు; భాషింపన్ = పలుకగా; సత్వరుడై = తొందర గలవాడై; ఎందును = ఎక్కడను; లేడు లేడు = లేనే లేడు; అని = అని; సుతున్ = పుత్రుని; దైత్యుండు = రాక్షసుడు; తర్జింప = బెదిరించగా; శ్రీ = శోభనమైన; నరసింహాకృతిన్ = నరసింహరూపముతో; అచ్యుతుడు = నారాయణుడు; నానా = పలురకముల; జంగమస్థావరోత్కర = చరాచరసమూహముల; గర్భంబులన్ = అంతర్భాగములలోను; అన్నిదేశములన్ = సమస్తమైన చోటులందును; ఉద్దండ = గొప్ప; ప్రభావంబునన్ = మహిమతో; ఉండెన్ = ఉండెను.
తాత్పర్యం:
ప్రహ్లాదుడు తండ్రితో శ్రీహరి అన్ని విధాలైన ఆకారాలతో అన్ని ఆకారాలలోను ఉన్నాడు అని నొక్కి వక్కాణిస్తున్నాడు. హిరణ్యకశిపుడు ఆ మాటలు వినీవినకుండానే గట్టిగా ఎక్కడా లేడు ఎక్కడా లేడు అని గొంతుచించుకొని అరుస్తున్నాడు. అంతటితో ఆగలేదు. కొడుకును మాటలతో చేష్టలతో బెదిరిస్తున్నాడు. ఆ సంఘర్షణ అలా సాగుతూఉండగా ఎక్కడా ఏవిధమైన జారుపాటులేని నిత్యసత్యశివసుందరాత్మకుడైన అచ్యుతుడు నరాకృతినీ, సింహాకృతినీ కలగలుపుకొని అన్ని విధాలైన కదిలేవీ, కదలనివీ అయిన భూతాలన్నింటిలో, అన్ని దేశాలలో రక్కసుని ఉక్కడగించటానికి అవసరమైన సన్నాహంతో ఉన్నాడు.
7-286 నరమూర్తిగాదు
సందర్భం:
భక్తసంరక్షణకై శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని శిక్షించటం కోసం సభాస్తంభంనుండి మహాభయంకరంగా నరసింహస్వామియై ఆవిర్భవించాడు. హిరణ్యకశిపుడు వచ్చినది వింతమృగం కాదని నిశ్చయించుకుని మనస్సులో ఇలా అనుకుంటున్నాడు.
కం. నరమూర్తిగాదు కేవల
హరిమూర్తియుఁ గాదు మానవాకారముఁ గే
సరియాకారము నున్నది
హరి మాయారచిత మగు యథార్థము సూడన్
ప్రతిపదార్ధము:
నర = మానవ; మూర్తి = స్వరూపము; కాదు = కాదు; కేవల = వట్టి; హరి = సింహపు; మూర్తియున్ = స్వరూపము; కాదు = కాదు; మానవ = మనిషి; ఆకారము = స్వరూపము; కేసరి = సింహపు; ఆకారము = స్వరూపము కూడా; ఉన్నది = కలిగి ఉన్నది; హరి = విష్ణుని; మాయా = మాయచేత; రచితము = నిర్మింపబడినది; అగు = ఐన; యథార్థము = సత్య మైనది; చూడన్ = తరచి చూసినచో.
తాత్పర్యం:
ఇదేమిటి?! మానవాకారం అందామా? కాదే! సింహరూపం అందామా?! అదీకాదే! మానవాకారమూ, జూలు విదలిస్తున్న సింహం ఆకారమూ - రెండూ కలగాపులగంగా ఉన్నది. ఇది హరి కల్పించిన మాయ అయి ఉంటుంది. అదే సత్యం!
7-349 అమరుల్ సిద్ధులు
సందర్భం:
నరసింహస్వామి హిరణ్యకశిపుని డొక్కచించి, ప్రేగులు చిందరవందరగా లాగివేసి సంహరించాడు. ఆ భయంకర క్రోధమూర్తిని చూచి బ్రహ్మాది దేవతలూ, బ్రహ్మర్షులూ అనేక విధాలుగా స్వామిని స్తుతించారు. అయినా స్వామి చల్లబడలేదు. శ్రీమహాలక్ష్మిని కూడా ప్రార్ధించారు. అయినా అంతగా ప్రయోజనం కనబడలేదు. చివరకు బ్రహ్మదేముడు పరమ భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుడు మాత్రమే స్వామిని శాంతింపగలడని తలచి, అతనిని వేడుకున్నాడు. స్వామి శాంతించాడు. అప్పుడు ప్రహ్లాదుడు భగవంతునితో ఇలా అంటున్నాడు -
మ. అమరుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సతాత్పర్య చి
త్తముల న్నిన్ను బహుప్రకారముల నిత్యంబున్ విచారించి పా
రము ముట్ట న్నుతిసేయ నోపరఁట; నే రక్షస్తనూజుండ గ
ర్వ మదోద్రిక్తుఁడ బాలుఁడన్ జడమతిన్ వర్ణింప శక్తుండనే?
ప్రతిపదార్ధము
అమరుల్ = దేవతలు; సిద్దులు = సిద్ధులు; సంయమి = ముని {సంయములు - సంయమము (హింసాదుల వలన విరమించుట) కలవారు, మునులు}; ఈశ్వరులు = శ్రేష్ఠులు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదుల్ = మొదలగు వారు; సతాత్పర్య = ఏకాగ్రత గల; చిత్తములన్ = మనసులతో; నిన్నున్ = నిన్ను; బహు = పలు; ప్రకారములన్ = విధములచే; నిత్యంబున్ = ఎల్లప్పుడు; విచారించి = విచారించినను; పారము ముట్టన్ = తుద వరకు; నుతిన్ = స్తుతించుట; చేయన్ = చేయుటకు; ఓపరట = సరిపోరట; నేన్ = నేను; రక్షస్ = రాక్షసుని; తనూజుండన్ = పుత్రుడను {తనూజుండు - తనువున పుట్టిన వాడు, కొడుకు}; గర్వ = గర్వము; మద = మదముల; ఉద్రిక్తుడన్ = విజృంభణములు గల వాడను; బాలుడన్ = చిన్న పిల్లవాడను; జడ మతిన్ = మూర్ఖుడను; వర్ణింపన్ = కీర్తించుటకు; శక్తుండనే = సమర్థుండనా ఏమి (కాను).
తాత్పర్యం:
శ్రీమన్నారాయణా! నరసింహస్వామీ! దేవతలూ, సిద్ధులూ, యోగీశ్వరులూ, బ్రహ్మ మొదలైనవారు నీయందే నిలుపుకొన్న చిత్తం కలవారై ఎన్నెన్నో విధాలుగా నిరంతరమూ విచారించి ఆవలితీరం వరకూ నిన్ను నుతిచేయలేకపోతున్నారట. ఇక నేనా నీగుణాలను కొనియాడేది! అసలే రక్కసిరేని కడుపున పుట్టినవాడను, పసివాడను, పొగరుతెగ బలిసినవాడను, జడమైన మతిగలవాడను. ఇటువంటి వానికి నిన్ను స్తోత్రం చేయడం ఎలా తెలుస్తుంది మహానుభావా!
7-386 జలజాత ప్రభవాదులున్
సందర్భం:
ప్రహ్లాదుడు భక్త శిఖామణి. శ్రీహరి అతనిని ఏవిధంగా కాపాడినాడో నారదుడు పరమ రమణీయంగా రాజసూయయాగం సందర్భంలో ధర్మరాజునకు వివరించి చెప్పాడు. నారద మహర్షి చిట్టచివరకు ధర్మరాజుతో ఇలా అన్నాడు -
మ. జలజాతప్రభవాదులున్ మనములోఁ జర్చించి భాషావళిన్
బలుకన్ లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ యింటిలోఁ
జెలి యై మేనమఱంది యై సచివుఁ డై చిత్తప్రియుం డై మహా
ఫలసంధాయకుఁ డై చరించుట మహాభాగ్యంబు రాజోత్తమా!
ప్రతిపదార్ధము:
జలజాతప్రభవ = బ్రహ్మదేవుడు {జల జాత ప్రభవుడు - జలజాత (పద్మమున) ప్రభవుడు (ఉద్భవించిన వాడు), బ్రహ్మ}; ఆదులున్ = మొదలగు వారు కూడ; మనము = మనసుల; లోన్ = లోపల; చర్చించి = తరచి చూసుకొని; భాషావళిన్ = వాక్కుల చేత; పలుకన్ = పలుకుటకు; లేని = వశము కాని; జనార్దన = విష్ణుమూర్తి {జనార్ధనుడు – సముద్ర మధ్యమున నున్న జనులను రాక్షసులను పీడించినవాడు, విష్ణువు}; ఆహ్వయ = పేరు గల; పరబ్రహ్మంబు = పరమాత్మ; నీ = నీ యొక్క; ఇంటి = నివాసము; లోన్ = అందు; చెలి = మిత్రుడు; ఐ = అయ్యి; మేనమఱంది = మేనత్త కొడుకు; ఐ = అయ్యి; సచివుడు = మంత్రాంగము చెప్పు వాడు; ఐ = అయ్యి; చిత్త = మనసునకు; ప్రియుండు = ఇష్టుడు; ఐ = అయ్యి; మహా = గొప్ప; ఫల = ఫలితములను; సంధాయకుండు = కూర్చు వాడు; ఐ = అయ్యి; చరించుట = మెలగుట; మహాది = గొప్ప; భాగ్యంబు = అదృష్టము; రాజోత్తమ = రాజులలో ఉత్తముడ.
తాత్పర్యం:
మహారాజా! ధర్మరాజా! నీది మహా భాగ్యమయ్యా! నాలుగుమోముల దేవర అయిన బ్రహ్మదేవుడు మొదలైన దేవతా సార్వభౌములు కూడా ఎన్నో విధాలుగా మనస్సులలో ఎంతగానో చర్చించి కూడా, భాషల ద్వారా ఆ శ్రీమహావిష్ణువు గురించి నాలుగు మాటలు కూడా చెప్పలేరు. ఎందుకంటే ఆయన జనార్దనుడనే పేరుగల పరబ్రహ్మము. వేదాలంటున్నాయి ఆ తత్త్వం మనస్సుకూ, మాటలకూ అందేది కాదని. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడు ఇప్పుడు కన్నయ్య అయి నీకు చెలికాడు, మేనమఱది, మంత్రి, మనోహరుడూ, ఇలా ఎన్నెన్నో ఎవరూ అందించలేని మహాఫలాలను నీకు అందిస్తూ నీ ఇంటిలోనే ఆనంద పరిపూర్ణుడై తిరుగుతున్నాడయ్యా! ఈ భాగ్యం ఎవరికైనా దక్కుతుందా!?
---------------------------------------------------------
అష్టమ స్కంధము
8-19 నీరాట వనాటములకు
సందర్భం:
అత్యద్భుతమైన గజేంద్ర మోక్షణకథ ప్రపంచ వాఙ్మయంలోనే తలమానికం వంటిది. ఎనిమిదవ స్కంధం భాగవతంలో ఈ కథతోనే మొదలవుతున్నది. పరీక్షిన్మహారాజు శుకమహర్షిని ఇలా అడుగుతున్నాడు.
కం. నీరాట వనాటములకు, పోరాటం బెట్లు గలిగె, పురుషోత్తము చే
నారాట మెట్లు మానెను, ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్
తాత్పర్యం:
స్వామీ! ఒకటి నీటిలో తిరుగాడే జంతువు. మరొకటేమో అడవులలో సంచరించే ఏనుగు. పట్టుకొన్నది మొసలి. పట్టుపడినది భద్రగజం. అబ్బో! ఎంత దేహం! ఎంతబలం! అటువంటి ఆ రెండు మహాజంతువులకూ పోరాటం ఎలా కలిగింది? ఎందుకు కలిగింది? పోనీ కలిగిందే అనుకుందాం. సృష్టిలో ఎన్నో ప్రాణులు కొట్టుకొని చస్తూ ఉంటాయి కదా! కానీ మీరు ఘోరమైన అడవిలో ఆ భద్రగజం ఆరాటాన్ని పురుషోత్తముడు పోగొట్టాడంటున్నారు! అది ఎలా జరిగింది? అంతా ఆశ్చర్యంగా ఉన్నది. నాకు వినాలని వేడుక పుట్టింది, వినిపించండి, స్వామీ!
ప్రతిపదార్ధం:
నీరాట = మొసలి {నీరాటము – నీటిలో చరించునది, మొసలి}; వనాటముల = ఏనుగుల {వనాటము –అడవిలో చరించునది, ఏనుగు}; కున్ = కు; పోరాటంబు = కలహము; ఎట్లు = ఏ విధముగ; కలిగెన్ = కలిగినది; పురుషోత్తముని = విష్ణుమూర్తి; చేన్ = చేత; ఆరాటమున్ = సంకటమును; ఎట్లు = ఏ విధముగ; మానెను = తీరినది; ఘోర = భయంకర మైన; అటవి = అడవి; లోని = అందలి; భద్ర కుంజరమున్ = గజరాజున {గజభేదములు - 1భద్రము 2మందము 3మృగము}; కున్ = కు.
8-42 అట గాంచెం
సందర్భం:
శ్రీశుకులవారు పరీక్షిన్మహారాజునకు గజేంద్ర మోక్షణ కథను వివరిస్తున్నారు. రాజా! త్రికూటం అనే గొప్ప పర్వతం ఉంది. దానినుండి ఒక పెద్ద ఏనుగుల మంద దప్పిక తీర్చుకోవటానికీ, జలవిహారం చేయటానికీ బయలుదేరింది. ఆ మందలరేడు అయిన ఒక గొప్ప గజరాజునకు ఒక పెద్ద జలాశయం కంటపడింది. అది -
మ. అట గాంచెం గరిణీవిభుండు నవ పుల్లాంభోజ కల్హారమున్
నట దిందిందిర వారమున్ గమఠ మీన గ్రాహ దుర్వారమున్
వట హింతాల రసాల సాల సుమనో వల్లీ కుటీ తీరమున్
చటులోద్ధూత మరాళ చక్ర బక సంచారంబు కాసారమున్
తాత్పర్యం:
ఆ జలాశయం అప్పుడప్పుడే విచ్చుకుంటున్న తామరపూవులతో, కలువపూవులతో కళకళలాడుతున్నది. వానిమీద మదించిన తుమ్మెదలు నాట్యాలు చేస్తున్నాయి. దానినిండా పెద్దపెద్ద తాబేళ్ళూ, చాలా పెద్ద చేపలూ, ఇంకా పెద్దమొసళ్ళూ విహరిస్తున్నాయి. వానితో అది ఎవ్వరికీ ప్రవేశింపనలవి కాకుండా ఉంది. దాని ఒడ్డుల మీద రావిచెట్లూ, ఒక జాతి తాటిచెట్లూ, మామిడిచెట్లూ, మద్దిచెట్లూ, పూలతీగలతో అల్లుకొన్న పొదరిళ్ళూ చూడముచ్చటగా ఉన్నాయి. అటూ ఇటూ గొప్ప ఉత్సాహంతో ఎగురుగున్న హంసలూ, చక్రవాకాలూ, కొంగలూ మొదలైన పక్షులు కన్నులకు విందు చేస్తున్నాయి. అటువంటి పెద్ద జలాశయాన్ని ఆ గజరాజు చూచాడు.
ప్రతిపదార్ధం:
అటన్ = అక్కడ; కాంచెన్ = చూచెను; కరణీ = గజ; విభుండు = రాజు; నవ = తాజా; పుల్ల = విచ్చుకొన్న; అంభోజ = కమలములు; కల్హారమున్ = కలువలు; నటత్ = ఆడుతున్న; ఇందిందిర = తుమ్మెదల; వారమున్ = సమూహము కలిగినది; కమఠ = తాబేళ్ళు; మీన = చేపలు; గ్రాహ = మొసళ్ళుతోను; దుర్వారమున్ = నివారింపరానిది; వట = మఱ్ఱి; హింతాల = తాడి; రసాల = తియ్య మామిడి; సాల = మద్ది; సుమనో = పువ్వుల; వల్లీ = లతా; కుటీ = కుంజములు గల; తీరమున్ = గట్లు కలిగిన; చటుల = మిక్కిలి వేగముగా; ఉద్ధూత = ఎగిరెడి; మరాళ = హంసలు; చక్ర = చక్రవాకములు; బక = కొంగల; సంచారంబున్ = విహరించుటలు కలిగినది; కాసారమున్ = మడుగును.
8-45 తొండంబుల
సందర్భం:
ఏనుగులన్నీ జలక్రీడలు మొదలుపెట్టాయి. నీటిలోనికి ప్రవేశించాయి. ముందుగా కడుపునిండా నీరు త్రాగాయి. ఆ త్రాగటం ఎలా ఉన్నదంటే,
మ. తొండంబుల పూరింపుచు, గండంబుల జల్లుకొనుచు గళగళ రవముల్
మెండుకొన వలుదకడుపులు, నిండన్ వేదండకోటి నీరుం ద్రావెన్.
తాత్పర్యం:
తొండాలతో నీటిని నింపుకున్నాయి. ఒకదాని చెక్కిలిమీద మరొకటిగా చిమ్మనగ్రోవితో చిమ్మినట్లు జల్లుకొన్నాయి. అప్పటి ఆ ధ్వనులు చెవులకు ఇంపుగా వినవస్తున్నాయి. కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నాయి కదా! వాని గళగళధ్వనులు మిన్నుముట్టుతున్నాయి. కావలసినంత నీరు ఉన్నది. తక్కువేమి మనకు అన్నట్లుగా కడుపులు నిండేవిధంగా ఆ ఏనుగుల మందలు నీరు త్రాగాయి.
ప్రతిపదార్ధం:
తొండంబులన్ = తొండముల లోనికి; పూరించుచున్ = నీళ్ళు పీల్చి నింపుతూ; గండంబులన్ = గండ ఫలకముల పై; చల్లుకొనుచు = చల్లుకుంటు; గళ గళ = గడ గడ మనెడి; రవముల్ = శబ్దములు; మెండుకొనన్ = అతిశయించు తుండగ; వలుద = విశాల మైన; కడుపులు = పొట్టలు; నిండన్ = నిండగ; వేదండ = ఏనుగుల; కోటి = సమూహము; నీటిన్ = నీటిని; త్రావెన్ = తాగినవి.
8-47 ఇభలోకేంద్రుడు
సందర్భం:
ఏనుగుల నాయకుడు కడుపునిండా నీరు త్రాగి తరువాత తన నీటి ఆటలను మొదలుపెట్టాడు. ఆ సహజ సుందర సన్నివేశాన్ని పోతనామాత్యుల వారు మన కన్నులకు కట్టిస్తున్నారు.
మ. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీ రెక్కించి పూరించి చం
డభమార్గంబున కెత్తి నిక్కి వడి నుడ్డాడించి పై జిమ్ము నా
రభటి న్నీరములోన పెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్
నభమం దాడెడు మీన కర్కటములన్ బట్టెన్ సురల్ మ్రాన్పడన్.
తాత్పర్యం:
ఏనుగుల మందలకు నాయకుడైన ఆ గజరాజు తొండాల రంధ్రాలలోనికి నీరు ఎక్కించాడు. సందు లేకుండా నింపాడు. తొండాన్ని ఆకాశంవైపునకు బాగా ఎత్తిపట్టాడు. ఊపుకోసం నిక్కినిలుచున్నాడు. లోపలి నీటిని బాగా పుక్కిలిపట్టాడు. ఒక్కపెట్టున పైకి చిమ్మాడు. ఆ దెబ్బకు ఆ జలాశయంలోని మొసళ్ళు, పెద్దచేపలూ, మిగిలిన జలజంతువులూ గగనంలోనికి దూసుకుంటూ పోయాయి. ఆకాశంలో ఉన్న మీనము, కర్కాటకమూ అనే గ్రహాలను పట్టుకున్నాయి. దేవతలు అది చూచి చేష్టలుదక్కి నిలుచుండిపోయారు.
ప్రతిపదార్ధం:
ఇభ లోకేంద్రుడు = గజేంద్రుడు {ఇభ లోకేంద్రుడు - ఇభ (ఏనుగుల) లోక (సమూహమునకు) ఇంద్రుడు (పతి), గజేంద్రుడు}; హస్త = తొండముల; రంధ్రములన్ = కన్నముల లోనికి; నీరు = నీటిని; ఎక్కించి = పీల్చు కొని; పూరించి = నింపుకొని; చండభ మార్గంబున్ = ఆకాశము కేసి {చండభ మార్గము - సూర్యుని మార్గము, ఆకాశము వైపు}; కిన్ = కి; ఎత్తి = ఎత్తి; నిక్కి = సాచి; వడిన్ = వేగముగ; ఉడ్డాడించి = పుక్కిలించి; పింజింపన్ = చిమ్మగా; ఆరభటిన్ = పెద్ద శబ్దముతో; నీరము = నీటి; లోనన్ = లో నుండి; పెల్లు = పెల్లు మని, తీవ్రముగ; ఎగసి = ఎగిరి; నక్ర = పీతలు; గ్రాహ = మొసళ్ళు; పాఠీనముల్ = చేపలు; నభము = ఆకాశము; అందు = అందు; ఆడెడు = తిరిగెడు; మీన = మీనరాశి; కర్కటములన్ = కర్కాటకరాశులను; పట్టెన్ = పట్టుకొన్నవి; సురల్ = దేవతలు; మ్రాన్పడన్ = నిశ్ఛేష్టులు కాగా.
8-49 కరిణీ కరోజ్ఝిత
సందర్భం:
ఆ గజేంద్రుని ఆటల ఆర్భాటాలు ఇంకా ఈ విధంగా చూడముచ్చటగా ఉన్నాయి.
సీ. కరిణీ కరోజ్ఝిత కంకణ చ్ఛట దోగి సెలయేటి నీలాద్రి చెలువు దెగడు
హస్తినీ హస్తవిన్యస్త పద్మంబుల వేయుగన్నులవాని వెఱపు సూపు
కలభ సముత్కీర్ణ కల్హార రజమున కనకాచలేంద్రంబు ఘనత దాల్చు
కుంజరీ పరిచిత కుముద కాండంబుల ఫణిరాజమండన ప్రభ వహించు
ఆ. మదకరేణుముక్త మౌక్తిక శక్తుల మిఱుగు మొగిలుతోడ మేలమాడు
నెదురులేని గరిమ నిభరాజమల్లంబు వనజగేహకేళి వ్రాలునపుడు.
తాత్పర్యం:
ఆ ఏనుగులరేనికి ఎదురేలేదు. ఆడినది ఆటగా ఆ పెద్ద చెఱువులో విహరిస్తున్నది. దాని ఆడ ఏనుగులన్నీ తొండాలతో తుంపురులను దానిమీదకు చిమ్ముతున్నాయి. అప్పుడది సెలయేటిలోని నల్లని కొండలాగా అలరారుతున్నది. అలాగే ఆ పెంటి ఏనుగులు చెరువులోని పద్మాలను కుప్పలుతెప్పలుగా దానిమీద వేస్తున్నాయి. అవన్నీ దానిమీద నిలిచి వేయికన్నుల యింద్రుణ్ణి తలపింపజేస్తున్నాయి. గున్నయేనుగులు కలువపూవుల పొడిని దానిమీద చల్లుతున్నాయి. అప్పుడది బంగారు కొండలాగా వెలిగిపోతున్నది. ఆడఏనుగులు తామరతూడులను లాగి దాని మీదకు విసరుతున్నాయి. ఆవిధంగా పాములు అలంకారాలుగా భాసిల్లే పరమశివునిలాగా చూపట్టుతున్నది. మదించిన ఏనుగు భామలు పైని చల్లిన ముత్యాలుగల ముత్యపు చిప్పలతో మెఱుగుతీగలతో విరాజిల్లుతున్న మేఘంలాగా శోభిల్లుతున్నది.
ప్రతిపదార్ధం:
కరణీ = ఆడ యేనుగుల; కర = తొండముల చేత; ఉత్+జిత = చిమ్మబడిన; కం = నీటి; కణ = బిందువుల; ఛటన్ = ధార లందు; తోగి = తడసి పోయి; సెలయేటి = సెలయేళ్ళ తో కూడిన; నీలాద్రి = నీలగిరి; చెలువున్ = వలె; తెగడున్ = పరిహసించును; హస్తినీ = ఆడు ఏనుగుల; హస్త = తొండముల చేత; విన్యస్త = ఉంచబడిన; పద్మంబులన్ = పద్మములతో; వేయిగన్నుల వాని = ఇంద్రుని {వేయి కన్నుల వాడు – వెయ్యి కన్నులు గల వాడు, సహస్రాక్షుడు, ఇంద్రుడు}; వెఱవు = అతిశయమును; చూపున్ = చూపించును; కలభ = గున్న యేనుగులచే; సమ = అధికముగ; ఉత్కీర్ణ = జల్లబడిన; కల్హార రజమునన్ = పద్మముల పుప్పొడితో; కనకా చలేంద్రంబు = మేరు పర్వతము యొక్క {కనకా చలేంద్రము - కనక (బంగారు) ఆచల (కొండలలో) ఇంద్రము (గొప్పది), మేరు పర్వతము}; ఘనతన్ = గొప్ప దనమును; తాల్చున్ = ధరించును; కుంజరీ = ఆడ యేనుగులచే; పరిచిత = సమర్పించబడిన; కుముద = కలువల; కాండంబులన్ = తూళ్ళతో; ఫణి రాజ మండన = పరమ శివుని {ఫణి రాజ మండనుడు - ఫణి (సర్పములలో) రాజ (శ్రేష్ఠములచే) మండన (అలంకరింపబడిన వాడు), శివుడు}; ప్రభన్ = ప్రకాశమును; వహించున్ = ధరించును.
మద = మదించిన; కరేణు = ఆడ యేనుగుల చే; ముక్త = వేయబడిన; మౌక్తిక = ముత్యపు; శుక్తులన్ = చిప్పలతో; మెఱుగు = మెరుపుల; మొగిలు = మబ్బుల; తోడన్ = తోటి; మేల మాడున్ = సరసము లాడును; ఎదురు లేని = తిరుగు లేని; గరిమన్ = గొప్ప దనముతో; ఇభ = ఏనుగుల; రాజ = పతులలో; ఇంద్రము = గొప్పది; వనజ గేహ = మడుగు నందు {వనజ గేహము - వనజము (పద్మములకు) గేహము (ఇల్లు), సరోవరము}; కేళిన్ = క్రీడించుటకు; వ్రాలున్ = దిగెడి; అపుడు = సమయములో.
8-51 భుగభుగాయిత
సందర్భం:
ఏనుగుల చిలిపి ఆటలకు ఆ కొలను అతలాకుతలం అయిపోతున్నది. అది గమనించింది అందులో ఉన్న ఒక మకరం. అది ఈ ఏనుగుల రాజు కంటే ఏమీ తక్కువ తిన్నది కాదు. పట్టనలవికాని పట్టుదలతో ఆ ఏనుగును ఒడిసిపట్టుకొన్నది.
సీ. భుగభుగాయిత భూరి బుద్బుద చ్ఛటలతో, కదలుచు దివికి భంగంబు లెగయ
భువన భయంకర ఫూత్కార రవమున ఘోర నక్రగ్రాహకోటి బెగడ
వాలవిక్షేప దుర్వార ఝంఝానిల వశమున ఘుమఘుమావర్త మడర
కల్లోల జాల సంఘట్టనంబుల తటీ తరులు మూలములతో ధరణి గూల
తే. సరసిలో నుండి పొడగని సంభ్రమించి
యుదరి కుప్పించి లంఘించి హుంకరించి
భాను కబళించి పట్టు స్వర్భానుపగిది
నొక్కమకరేంద్రు డిభరాజు నొడిసిపట్టె.
తాత్పర్యం:
ఏనుగులరేడు ఒడను తెలియకుండా ఆడుకుంటున్నది. కొలనులో ఉన్న ఒక పెద్దమొసలి దానిని గమనించింది. ఆ మొసలికి స్థానబలం ఉన్నదికదా! అది తనముందు ఆ ఏనుగు ఆటలను సాగనిస్తుందా? విజృంభించింది. భుగభుగ అని పొంగుకొనివస్తున్న బుడగలతో అలలు ఆకాశాన్నంటుతున్నాయి. జనాల గుండెలు అదరిపోయే విధంగా అది చేస్తున్న ఫూత్కారనాదంతో మహాభయంకరమైన మొసళ్ళ గుంపులు కూడా అడలిపోతున్నాయి. తోకను ఈడ్చిఈడ్చి కొడుతున్నది. దానివలన పెల్లురేగిన పెద్దగాలిచేత ఘుమఘుమలాడే సుడి గిరగిరా తిరుగుతున్నది. అలలు ఒకదానికొకటి కొట్టుకొనగా ఒడ్డులనున్న మహావృక్షాలు పెల్లగిల్లిపోతున్నాయి. ఆ మొసలి ఒక్కపెట్టున పట్టు చిక్కించుకొని కుప్పించి హుంకరించి ఏనుగును ఒడిసిపట్టుకొన్నది. అది సూర్యగ్రహాన్ని పట్టుకొన్న రాహుగ్రహంలాగా ఉన్నది.
ప్రతిపదార్ధం:
భుగభుగాయిత = భుగభుగ మనెడి శబ్దముతో; భూరి = అతి పెద్ద; బుద్భుద = నీటి బుడగల; ఛటల్ = సమూహముల; తోన్ = తోటి; కదలుచు = కదులుతు; దివి = ఆకాశమున; కిన్ = కు; భంగంబుల్ = కెరటములు; ఎగయన్ = ఎగురగా; భువన = లోకములకు; భయంకర = భీతి కలిగించెడి; ఫూత్కార = ఫూ యనెడి; రవమునన్ = శబ్దముతో; ఘోర = భయంకరమైన; నక్ర = పీతల, ఎండ్రకాయల; గ్రాహ = మొసళ్ళ; కోటి = సమూహము; బెగడన్ = భయపడగా; వాల = తోకను; విక్షేప = జాడించుట చేత; దుర్వార = నివారింప రాని; ఝంఝానిల = ప్రచండమైన గాలి; వశమునన్ = వలన; ఘమఘమ = ఘమఘమ ధ్వనుల తో; ఆవర్తము = సుడి గుండాలు; అడరన్ = అతిశయించగా; కల్లోల = అలల; జాల = సమూహముల; సంఘట్టనంబులన్ = తాకిడికి; తటీ = ఒడ్డున గల; తరులు = చెట్లు; మూలంబులు తో= వేళ్ళ తోసహా; ఐ = అయ్యి; ధరణిన్ = నేల పై; కూలన్ = కూలిపోగా.
సరసి = మడుగు; లోన్ = లోపల; నుండి = నుండి; పొడగని = జాడ కనిపెట్టి; సంభ్రమించి = వేగిర పడి; ఉదరి = కోపముతో చలించి; కుప్పించి = గెంతి; లంఘించి = దుమికి; హుంకరించి = హు మ్మని అరచి; భానున్ = సూర్యుని; కబళించి = మింగి; పట్టు = పట్టుకొనెడి; స్వర్భాను = రాహువు {స్వర్భానువు - స్వర్గమున ప్రకాశించు వాడు, రాహువు}; పగిదిన్ = వలె; ఒక్క = ఒకానొక; మకర = మొసలి; ఇంద్రుడు = ప్రభువు; ఇభ = గజ; రాజున్ = రాజును; ఒడిసి పట్టె = ఒడుపుగా పట్టుకొనెను.
8-54 కరి దిగుచు
సందర్భం:
పట్టుకొన్న మొసలి, పట్టుచిక్కిన ఏనుగూ పంతం విడనాడకుండా గుంజుకొంటున్నాయి. ఆ రెంటి గుంజులాటను కవి కమనీయంగా వర్ణిస్తున్నాడు.
కం. కరి దిగుచు మకరి సరసికి, కరి దరికిని మకరి దిగుచు కరకరి బెరయన్
కరికి మకరి మకరికి గరి, భర మన ని ట్లతలకుతల భటులదరిపడన్.
తాత్పర్యం:
మొసలి ఏనుగును కొలనులోనికి గుంజుకొనిపోతున్నది. భగభగమంటున్న పగ అనే నిప్పుతో ఏనుగు మొసలిని నేలమీదకు లాగుతున్నది. ఈ గుంజులాటను నేలపై, నింగిపైనున్న వీరాగ్రేసరులందరూ వింతగ చూస్తున్నారు. కరికి మకరి బరువైపోతున్నది. కాదుకాదు మకరికే కరి బరువైపోతున్నది అనుకొంటూ ఒక నిర్ణయానికి రాలేక ఊగులాడిపోతున్నారు.
ప్రతిపదార్ధం:
కరిన్ = ఏనుగును; తిగుచున్ = లాగును; మకరి = మొసలి; సరసి = మడుగు లోని; కిన్ = కి; కరి = ఏనుగు; దరి = ఒడ్డున; కిని = కి; మకరిన్ = మొసలిని; తిగుచున్ = లాగును; కరకరిన్ = శౌర్యము; పెరయన్ = అతిశయించగా; కరి = ఏనుగున; కిన్ = కు; మకరి = మొసలి; మకరి = మొసలి; కిన్ = కి; కరి = ఏనుగు; భరము = భార మైనది; అనన్ = అన్నట్లు; ఇట్లు = ఇలా; అతల = అతల లోకపు; కుతల = కుతల లోకపు; భటుల్ = వీరులు; అరుదు పడన్ = ఆశ్చర్యపడగా.
8-57 ఆటోవమ్మున
సందర్భం:
ఏనుగుల ఏలిక మొసలిపట్టునుండి విడిపించుకోవటానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నది. పడరాని పాట్లన్నీ పడుతున్నది. దాని విజృంభణను మన కన్నులకు కట్టిస్తున్నాడు కవీంద్రులు.
శా. ఆటోవమ్మున జిమ్ము ఱొమ్మగల వజ్రాభీల దంతమ్ములన్
దాటించున్ మెడ జుట్టి పట్టి హరి దోర్దండాభశుండాహతిన్
నీటన్ మాటికి మాటికిం దిగువగా నీరాటము న్నీటి పో
రాటం దోటమిపాటు జూపుట కరణ్యాటంబు వాచాట మై.
తాత్పర్యం:
ఏనుగుల ఏలిక వజ్రాలవంటి అతి కఠినమైన దంతాలతో ఆ మొసలిని రొమ్ము పగిలే విధంగా కొడుతున్నది. శ్రీమహావిష్ణువు భుజదండం వంటి తొండంతో మొసలి మెడను బిగించిపట్టుకొంటున్నది. ఆ మొసలి మాటిమాటికీ శక్తినంతా ఉపయోగించి నీటిలోపలికి గుంజివేస్తున్నది. స్థానబలం ఉండటంవలన మొసలికి ఓడిపోతానేమో అని ఏనుగు పెనుఘీంకారాలతో దిక్కులను ముక్కలు చేస్తున్నది.
ప్రతిపదార్ధం:
ఆటోపంబునన్ = వేగిరిపాటు తో; చిమ్మున్ = ఎగుర గొట్టును; ఱొమ్ము = వక్షస్థలము; అగలన్ = పగిలి పోవునట్లు; వజ్ర = పిడుగు వలె; ఆభీల = భయంకరమైన; దంతంబులన్ = దంతములతో; తాటించున్ = కొట్టును; మెడన్ = కంఠమును; చుట్టి పట్టి = చుట్టూ పట్టుకొని; హరి = ఇంద్రుని; దోర్దండ = భుజ దండము; అభ = వంటి; శుండా = తొండము యొక్క; హతిన్ = దెబ్బ చేత; నీటన్ = నీటి లోనికి; మాటికి మాటికిన్ = మరల మరల; తిగువగా = లాగుతుండగ; నీరాటమున్ = మొసలిని {నీరాటము – నీటి యందు చరించునది, మొసలి}; నీటి = నీటి లో చేయు; పోరాటన్ = యుద్ధములో; ఓటమి పాటు = ఓడి పోవుటను; చూపుట = చూపించుట; కున్ = కు; అరణ్యాటంబున్ = ఏనుగు {అరణ్యాటము – అరణ్యములో తిరుగునది, ఏనుగు}; వాచాటము = అరుచుచున్నది; ఐ = అయ్యి.
8-59 మకరితోడఁ
సందర్భం:
ఏనుగుల రాజు, మొసళ్ళరేడు పరమ ఘోరంగా పోరాడుతున్నాయి. గజేంద్రుని పతిగా భావించే ఆడ ఏనుగులు లక్షల సంఖ్యలో అక్కడ దీనంగా చూస్తూ నిలబడ్డాయి. ఆ సందర్భంలో కవి దాంపత్య ధర్మానికి సంబంధించిన ఒక మహా విషయాన్ని పశువుల మీద సమన్వయించి లోకానికి ఒక నీతిని తెలియచేస్తున్నారు.
ఆ. మకరితోడఁ బోరు మాతంగవిభుని నొ
క్కరుని డించిపోవఁ గాళ్ళు రాక
కోరి చూచుచుండెఁ గుంజరీయూథంబు
మగలు దగులుగారె మగువలకును.
తాత్పర్యం:
ఏనుగుల మందలకు ఏలిక అయిన గజరాజు ఇప్పుడు మొసలిరేనితో పరమఘోరంగా పోరాడుతున్నాడు. సాధారణంగా మానవజాతిలో అటువంటి సందర్భాలలో సంబంధం కల వ్యక్తులు తమకేమి ఆపద మూడుతుందో అని తమ దారిన తాము పోతూ ఉంటారు. ఆ గజేంద్రుని భర్తగా సంభావించిన లక్షలకొలదిగా ఉన్న ఆడ ఏనుగులకు మాత్రం తమ దారి తాము చూచుకోవటానికి కాళ్ళు రాలేదు. ఏమైతే అదే అవుతుంది అని ఏడుస్తూ అలాగే చూస్తూ ఉన్నాయి. ఆడవారికి పతులతో ఉండే తగులం అటువంటిది.
ప్రతిపదార్ధం:
మకరి = మొసలి; తోడన్ = తోటి; పోరు = పోరాడుచున్న; మాతంగ విభుని = గజేంద్రుని; ఒక్కరునిన్ = ఒక్కడిని; డించి = విడిచి పెట్టి; పోవన్ = వెళ్ళిపోవుటకు; కాళ్ళు రాక = బుద్ది పుట్టక; కోరి = కావాలని; చూచు చుండెన్ = ఊరక చూచుచున్నవి; కుంజరీ = ఆడ యేనుగుల; యూథంబు = సమూహము; మగలు = భర్తలు; తగులు = బంధనములు; కారె = కారా ఏమి, కదా; మగువలకును = భార్యలకు.
8-65 పాదద్వంద్వము
సందర్భం:
మొసలి విజృంభణకు ఏనుగు తల్లడిల్లిపోతున్నది. మకరానికి అంతకంతకూ ఉత్సాహం ఉవ్వెత్తున పొంగిపొరలుతున్నది. నీటిలో మునిగితేలటంలో ఆరితేరిన ఆ మొసలి పరాక్రమాన్ని పోతనామాత్యుల వారు ఇలా వర్ణిస్తున్నారు.
శా. పాదద్వంద్వము నేల మోపి పవనున్ బంధించి పంచేంద్రియో
న్మాదంబుం బరిమార్చి బుద్ధిలతకున్ మాఱాకు హత్తించి ని
ప్ఖేద బ్రహ్మపదావలంబన గతిం గ్రీడించు యోగీంద్రు మ
ర్యాద న్నక్రము విక్రమించె కరి పాదాక్రాంత నిర్వక్ర మై.
తాత్పర్యం:
రెండుకాళ్ళనూ గట్టిగా నేలకు తన్నిపట్టి, ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలను గొప్పసాధనతో నిలిపి ఉంచాడు. చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనే అయుదు ఇంద్రియాల పిచ్చితిరుగుళ్ళను మచ్చిక చేసుకొని తన వశంలో పెట్టుకున్నాడు. బుద్ధి అనే లతకు మాఱాకు తొడిగాడు. అణువంత దుఃఖం కూడాలేని బ్రహ్మపదాన్ని చేరుకొనే దారిలో విహరించే పరమయోగి ఇలా ఉంటాడు. ఇక్కడ మొసలి ఆ యోగీంద్రుని తీరుతెన్నులను మనకు స్ఫురింపజేస్తూ ఏనుగు పాదం పట్టులో ఏమాత్రమూ సడలింపు లేనిదై పరాక్రమిస్తున్నది.
ప్రతిపదార్ధం:
పాద = కాళ్ళు; ద్వంద్వమున్ = రెంటిని; నేలన్ = నేల పైన; మోపి = ఆన్చి; పవనున్ = గాలిని; బంధించి = బిగ పట్టి; పంచేంద్రియ = పంచేంద్రియముల {పంచేంద్రియములు - 1కళ్ళు 2ముక్కు 3నాలుక 4చెవులు 5చర్మము}; ఉన్మాదంబున్ = స్వేచ్ఛా విహారమును; పరి మార్చి = అణచి వేసి; బుద్ధి = బుద్ధి యనెడి; లత = తీవె; కున్ = కు; మాఱాకు = తీగ చిగురించుట ఆధారము; హత్తించి = కలిగించి; నిష్ఖేద = విచారము లేని; బ్రహ్మ = బ్రహ్మ యొక్క; పదా = స్థానమును; అవలంబన = అవలంభించు; గతిన్ = విధముగా; క్రీడించు = విహరించు; యోగి = యోగి; ఇంద్రున్ = శ్రేష్ఠుని; మర్యాదన్ = విధముగా; నక్రము = మొసలి; విక్రమించెన్ = పరాక్రమించినది; కరి = ఏనుగు యొక్క; పాద = పాదములను; ఆక్రాంతిన్ = ఆక్రమించు కొనుటలో; నిర్వక్రము = అడ్డు లేనిది; ఐ = అయ్యి.
8-71 ఏ రూపంబున
సందర్భం:
గజరాజు మహాశక్తితో ఆ జలగ్రహంతో పెక్కు ఏండ్లు పోరాడినది. దేహశక్తి సన్నగిల్లిపోతున్నది. తన పగవాని బలం పెరిగిపోతున్నది. దీనిని గెలవటం అసాధ్యం అనుకొన్నది. అప్పుడు దానికి పూర్వపుణ్యం వలన దివ్యజ్ఞానం పెల్లుబికి వచ్చింది. అప్పుడు ఆ గజరాజు ఇలా అనుకుంటున్నది.
శా. ఏ రూపంబున దీని గెల్తు, నిటమీ దే వేల్పు చింతింతు, నె
వ్వారిం జీరుదు, నెవ్వ రడ్డ మిక, ని వ్వారిప్రచారో త్తమున్
వారింపం దగువార లెవ్వ, రఖిల వ్యాపారపారాయణుల్
లేరే, మ్రొక్కెద దిక్కుమాలిన మొ ఱాలింపం ప్రపుణ్యాత్మకుల్.
తాత్పర్యం:
ఈ మొసలిని ఏ రూపంతో నేను గెలుస్తాను? ఇకపైన ఏ దేవతను తలచుకుంటాను? ఎవ్వరిని ఆశ్రయిస్తాను? ఎవరితో మొరపెట్టుకుంటాను? నాకూ ఈ మొసలికీ అడ్డుపడి నన్ను రక్షించేవారెవ్వరు లేరా? దీనిని నిలువరించేవారెవ్వరూ లేరా? ఎటువంటి అలవికాని పనినైనా అలవోకగా చేసి ఆశ్రయించినవారి ఆర్తిని పోగొట్టే దీక్షగల మహాపుణ్యాత్ములు, దిక్కుమాలినవారి మొరలను చెవినిపెట్టే మహాత్ములు లేరా? ఉంటే వారికి మ్రొక్కుతాను.
ప్రతిపదార్ధం:
ఏ = ఏ; రూపంబునన్ = రీతిగా; దీనిన్ = దీనిని; గెల్తున్ = జయించెదను; ఇట మీద = ఇక పైన; ఏ = ఏ; వేల్పున్ = దేవుడిని; చింతింతున్ = ప్రార్థించెదను; ఎవ్వారిన్ = ఎవరిని; చీరుదున్ = పిలిచెదను; ఎవ్వరు = ఎవరు; అడ్డము = శరణము; ఇక = ఇంక; ఈ = ఈ; వారి ప్రచారోత్తమున్ = మొసలిని {వారి ప్రచారోత్తము - వారి (నీటి) యందు ప్రచార (తిరిగెడి) ఉత్తము, మొసలి}; వారింపన్ = అడ్డగించుటకు; తగు = తగినట్టి; వారలు = వారు; ఎవ్వరు = ఎవరు; అఖిల = సమస్త మైన; వ్యాపార = కార్యముల లోను; పారయణుల్ = నేర్పరులు; లేరే = లేరా; మ్రొక్కెదన్ = కొలిచెదను; దిక్కుమాలిన = నిరాశ్రయుడ నై; మొఱ = మొర పెట్టగా; ఆలింపన్ = వినుటకు; ప్ర = విశేష మైన; పుణ్యాత్మకుల్ = పుణ్యవంత మైన ఆత్మ గల వారు.
8-72 నానానేకప
సందర్భం:
ఏనుగునకు తన వెనుకటి వైభవం గుర్తుకువచ్చింది. కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉండే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకొని ఇక్కడికి రావటం తన బుద్ధిలేనితనం అనుకుంటున్నది.
శా. నానానేకప యూధముల్ వనములోనం బెద్దకాలంబు స
న్మానింపన్ దశలక్షకోటి కరిణీనాథుండ నై యుండి మ
ద్దానాంభః పరిపుష్ట చందన లతాంత చ్ఛాయలం దుండలే
కీ నీరాశ నిటేల వచ్చితి, భయం బెట్లోకదే, ఈశ్వరా!
తాత్పర్యం:
నేను ఎంత గొప్పవాడను! మహారణ్యంలో పెక్కుఏనుగుల గుంపులు నన్ను మన్ననతో సేవిస్తూ ఉంటాయి. నా సుఖ భోగాలకు ఇష్టపడి నన్ను ఆనందింపజేస్తున్న ఆడఏనుగులు పదిలక్షల కోట్ల సంఖ్యలో ఉన్నాయి. నా ఒడలి నుండి వెలువడే మదజలంతో ఏపుగా పెరిగిన, తీగలల్లుకొన్న మంచిగంధపు చెట్ల నీడలలో నేను విలాసంగా, వినోదంగా తిరుగుతూ ఉండవచ్చు. కానీ కర్మ ప్రాబల్యం వల్ల అక్కడ ఉండలేక దప్పిక తీర్చుకోవటానికి ఇక్కడకు ఎందుకు వచ్చిపడ్డాను? ఈశ్వరా! గుండెలో గుబులు కలుగుతున్నదయ్యా.
ప్రతిపదార్ధం:
నానా = అనేక మైన; అనేకప = ఏనుగుల; యూథముల్ = సమూహములు; వనము = అడవి; లోనన్ = అందు; పెద్ద = చాలా; కాలంబు = కాలము; సన్మానింపన్ = గౌరవించు చుండగ; దశలక్షకోటి = పదిలక్షలకోట్ల; కరిణీ = ఆడ యేనుగులకు; నాథుండను = పతిని; ఐ = అయ్యి; ఉండి = ఉండి; మత్ = నా యొక్క; దానా = మద; అంభస్ = జలము చే; పరి పుష్ట = చక్కగా పెరిగిన; చందన = గంధపు; లతాంత = తీవ లందలి; ఛాయలన్ = నీడల; అందున్ = లో; ఉండన్ = ఉండ; లేక = లేక పోయి; ఈ = ఈ; నీర = నీటి పైని; ఆశన్ = ఆశ తో; ఇటు = ఈ వైపునకు; ఏల = ఎందుకు; వచ్చితిన్ = వచ్చితిని; భయంబు = భయ మేస్తోంది; ఎట్లో = ఏలాగో; కదే = కదా; ఈశ్వరా = భగవంతుడా.
8-73 ఎవ్వనిచే జనించు
సందర్భం:
గజేంద్రునకు గుండె నిలువటంలేదు. అయినా పూర్వ పుణ్యఫలం వలన దివ్యజ్ఞాన సంపద అమృతపు బుగ్గలాగా పొంగుకొనివస్తున్నది. పరమాత్మ చైతన్యం అంతరాంతరాలలో పరవళ్ళు త్రొక్కుతున్నది. దానివలన వెలువడే పలుకులు ఉపనిషత్తులను తలపింపజేస్తున్నాయి.
ఉ. ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీనమై
యెవ్వనియందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం
బెవ్వ డనాది మధ్య లయు డెవ్వడు సర్వము తాన యైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
తాత్పర్యం:
ఈ జగత్తు అంతా ఏ పరమాత్మవలన పుట్టినదో, ఎవనిలోపల భద్రంగా వేరుచేయటానికి వీలుకాకుండా ఉంటుందో, చివరకు ఎవనిలో లయమైపోతుందో, ప్రభువులకు కూడా ప్రభువై పాలించే మహాత్ముడు ఎవడో, సర్వమునకు మొట్టమొదటి కారణం ఎవడో, మొదలు, నడుమ, చివర అనే దశలు ఎవనికి ఉండవో, సర్వమూ తానే అయిన వాడెవడో అట్టి ఈశ్వరుని, అవసరాన్నిబట్టి తనంతతాను అవతరించి దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మస్థాపన చేసే ఆ పరమాత్మను నాకు రక్షకుడై రావలసినదని ప్రార్థిస్తూ ఉంటాను.
ప్రతిపదార్ధం:
ఎవ్వని = ఎవని; చేన్ = వలన; జనించు = పుట్టునో; జగము = విశ్వము; ఎవ్వని = ఎవని; లోపలన్ = అందు; ఉండున్ = ఉండునో; లీనము = కలిసి పోయినది; ఐ = అయ్యి; ఎవ్వని = ఎవని; అందున్ = లోనికి; డిందున్ = లయము ఐపొందునో; పరమేశ్వరుడు = అత్యున్నతమైన ప్రభువు; ఎవ్వడు = ఎవడో; మూల = ప్రధాన; కారణంబు = కారణ భూతుడు; ఎవ్వడు = ఎవడో; అనాది మధ్య లయుడు = ఆది మధ్యాంతములు లేని వాడు; ఎవ్వడు = ఎవడో; సర్వమున్ = అన్నియును; తాన = తనే; ఐన = అయిన; వాడు = వాడు; ఎవ్వడు = ఎవడో; వానిన్ = వానిని; ఆత్మ = నా యొక్క; భవున్ = ప్రభువును; ఈశ్వరున్ = భగవంతుని; నేన్ = నేను; శరణంబు = శరణము; వేడెదన్ = కోరెదను.
8-74 ఒకపరి జగములు
సందర్భం:
గజేంద్రుని హృదయంలో ఉపనిషత్తుల దివ్యజ్ఞానం కదలాడుతున్నది. అతని సుకృతం పండి మొసలిపట్టు అతనికి ఆర్తిని కలిగించింది. దానితో అద్భుత వేదాంత రహస్యాలు అతని నోటినుండి వెలువడుతున్నాయి.
కం. ఒకపరి జగములు వెలినిడి, యొకపరి లోపలికి గొనుచు నుభయము దా నై
సకలార్థ సాక్షి యగు న, య్యకలంకుని నాత్మమూలు నర్థి దలంతున్
తాత్పర్యం:
పరమాత్మ ఈ జగములనన్నింటినీ ఒకమారు వెలుపలికి తెస్తూ ఉంటాడు. మరొకమారు అల్లిన గూటిని సాలెపురుగులాగా, లోపలికి తీసుకుంటూ ఉంటాడు. ఆవిధంగా వెలుపలికి వచ్చిన ప్రపంచమూ తానూ ఒకటే అయిపోతాడు. ఈ ఆటకు తన బాధ్యత ఏమీలేకుండా కేవలం సాక్షిగా అంటుసొంటులు లేనివాడై అలరారుతూ ఉంటాడు. జీవులందరికీ ఆదికారణం అయిన ఆ పరమాత్మను స్మరిస్తూ ఉంటాను.
ప్రతిపదార్ధం:
ఒక పరి = ఒకసారి; జగములు = లోకములను; వెలినిడి = బయట పెట్టి, సృష్టించి; ఒక పరి = ఒకసారి; లోపలికిన్ = తన లోపలికి; కొనుచున్ = లయము చేసికొనుచు; ఉభయంబున్ = ఆ రెండు లోకములును; తాను = తనే; ఐ = అయ్యి; సకల = సమస్తమైన; అర్థ = విషయములకు; సాక్షి = అతీతముగ చూచువాడు; అగున్ = అయినట్టి; ఆ = ఆ; అకలంకున్ = దోషములు లేని వానికి; ఆత్మమూలున్ = పరమాత్మను; అర్థిన్ = కోరి; తలంతున్ = ధ్యానము చేసెదను;
8-75 లోకంబులు
సందర్భం:
అది ఒక గొప్ప వెలుగు. అయితే దానిని గుర్తించటం చాలా కష్టం. కానీ గుర్తించి తీరాలి. ఎందుకంటే దానికంటె గొప్పది వేరొకటి లేదు అంటున్నది గజేంద్రం.
కం. లోకంబులు లోకేశులు, లోకస్థులు తెగిన తుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వడు, నేకాకృతి వెలుగు నతని నే సేవింతున్
తాత్పర్యం:
ఈ విశ్వంలో ఉన్న ప్రతి లోకానికి కొంత కాలపరిమితికి లోబడి ఒక పాలకుడు ఉంటాడు. అటువంటి లోకేశులు ఎందరు వచ్చి వెళ్ళిపోయారో! ఇంకా ఎందరు రానున్నారో? ఇక ఆ లోకాలలో ఏర్పడి, కొంతకాలం ఉండి, మళ్ళీ అంతరించిపోతున్న జీవకోట్లు ఎన్ని కోట్లకోట్ల సంఖ్యలో ఉన్నాయో! ఆ లోకాలూ, ఆ లోకపాలకులూ, ఆ లోకంలోనివారూ పరమత్మలాగా శాశ్వతంగా ఉండరు. లయమై పోతారు. ఆ పని అయిన తరువాత ఏమీ ఉండదు. దానినే ‘అలోకం’ అంటారు. ఆ లోకం పెద్దవెలుగు. అలోకం పెనుచీకటి. దానికి ఆవలివైపున ఒక మహావ్యక్తి, ఒక మహాశక్తి, చెక్కుచెదరని ఆకారంతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనే పరమాత్మ. అలా ఉన్న పరమాత్ముణ్ణి నేను సేవించుకుంటాను.
ప్రతిపదార్ధం:
లోకంబులున్ = లోకములు; లోకేశులున్ = లోకాలను పాలించే వారు; లోకస్థులు = లోకములలో నుండు వారు; తెగిన = నశించిన తరువాత; తుదిన్ = కడపట; అలోకంబున్ = కనబడనిది, గుడ్డిది; అగు = అయిన; పెంజీకటి = గాఢాంధకారము; కిన్ = నకు; అవ్వలన్ = ఆవతల; ఎవ్వండు = ఎవడు; ఏక = అఖండ మైన; ఆకృతిన్ = రూపముతో; వెలుగున్ = ప్రకాశించునో; అతనిన్ = అతనిని; నేన్ = నేను; సేవింతున్ = కొలచెదను.
8-76 నర్తకునిభంగి
సందర్భం:
ప్రపంచంలో ఎంతోమంది వ్యక్తులూ, ఎన్నెన్నో పదార్థాలూ మనకు కానవస్తున్నాయి. తత్త్వదృష్టితో గమనిస్తే ఆ వ్యక్తులందరూ, ఆ పదార్ధాలు అన్నీ ఆ పరమాత్మయే. నా ఆర్తిని అంతంచేసి నన్ను కాపాడే ఆ స్వామిని నేను కొనియాడతాను.
కం. నర్తకునిభంగి పెక్కగు, మూర్తులతో నెవ్వ డాడు మునులున్ దివిజుల్
కీర్తింప నేర రెవ్వని, వర్తన మొరు లెఱుగ రట్టి వాని నుతింతున్
తాత్పర్యం:
ఆ పరమాత్మ ఎన్నివేషాలయినా వేసి రక్తి కట్టింపగల మహానర్తకుడు. ఏ క్షణాన ఏ రూపంతో, ఏవిధంగా ఆడుకుంటాడో, తపస్సంపన్నులయిన మునులూ, పుణ్యాలపంట పండించుకొని దేవలోకంలో సుఖంగా తిరుగుతున్న దేవతలూ కూడా తెలుసుకోలేరు. అతని తీరుతెన్నులు ఈ విధంగా ఉంటాయి అని ఎవరూ కొనియాడలేరు. అట్టి పరమత్ముని నాకు తెలియవచ్చిన విధంగా స్తోత్రం చేస్తాను.
ప్రతిపదార్ధం:
నర్తకుని = నటుని; భంగిన్ = వలె; పెక్కు = అనేక మైనవి; అగు = అయిన; మూర్తుల్ = రూపముల; తోన్ = తోటి; ఎవ్వడు = ఎవరైతే; ఆడున్ = నడిపిస్తుంటాడో; మునులు = ఋషులు; దివిజులున్ = దేవతలు; కీర్తింపన్ = స్తుతించుటకు; నేరరు = సరిపోరో; ఎవ్వనిన్ = ఎవని; వర్తనమున్ = ప్రవర్తనలను; ఒఱులు = ఇతరులు; ఎఱుగరు = తెలియరో; అట్టి = అటువంటి; వానిన్ = వానిని; నుతింతున్ = సంస్తుతించెదను.
8-86 కల డందురు
సందర్భం:
ఆర్తిలో నిలువెల్లా మునిగినవానికి అన్నీ అనుమానాలే. ‘ఉన్నాడు’ అనుకొన్నవాడు నిజంగా ఉన్నాడా? లేడా? అని సందేహం కలిగింది గజేంద్రునికి. దానినే అతడు ఇలా చెప్పుకుంటున్నాడు.
కం. కల డందురు దీనులయెడ, గల డందురు పరమయోగి గణములపాలం,
గల డందు రన్ని దిశలను, కలడు కలండనెడి వాడు కలడో లేడో
తాత్పర్యం:
ఆ పరమాత్మ దిక్కులేని దీనులపట్ల ఉంటాడు అని తత్త్వం తెలిసినవారు విస్పష్టంగా ప్రకటిస్తున్నారు. అలాగే పరమమైన యోగసాధన చేసి ఫలసిద్ధి పొందిన యోగుల సముదాయాల సంరక్షణకోసం ‘ఉన్నాడు’ అంటారు. అన్ని దిక్కులందూ ప్రతి అణువులోనూ ‘ఉన్నాడు’ అంటారు. కానీ అలా ఉన్నాడు, ఉన్నాడు అనే భావనలో తిరుగాడే ఆ స్వామి నిజంగా ఉన్నాడో, లేడో!
ప్రతిపదార్ధం:
కలడు = ఉన్నాడు; అందురు = అనెదరు; దీనుల = ఆర్తుల; యెడన్ = వెంట; కలడు = ఉంటాడు; అందురు = అనెదరు; పరమ = అత్యుత్తమ మైన; యోగి = యోగుల; గణముల = సమూహముల; పాలన్ = అందు; కలడు = ఉన్నాడు; అందురు = అనెదరు; అన్ని = సర్వ; దిశలను = దిక్కు లందును; కలడు = ఉన్నాడు; కలండు = ఉన్నాడు; అనెడి = అనె టటువంటి; వాడు = వాడు; కలడో = ఉన్నాడో; లేడో = లేడో.
8-87 కలుగడే నాపాలి
సందర్భం:
గజేంద్రునకు మెల్లమెల్లగా తన సంరక్షునియందు నమ్మకం కలుగుతున్నది. కానీ ఆ పరమాత్మ తనను ఆదుకోవటానికి ఎందుకు రావటం లేదు అని ఆరాటం పెరిగిపోతున్నది. అప్పుడు ఆ గజరాజు ఇలా అనుకుంటున్నాడు.
సీ. కలుగడే నాపాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక గలుగువాడు
నా కడ్డపడ రాడె నలి నసాధువులచే బడిన సాధుల కడ్డపడెడు వాడు
చూడడే నా పాటు చూపుల జూడక చూచువారల కృప జూచువాడు
లీలతో నా మొ ఱాలింపడే మొఱగుల మొఱ లెఱుంగుచు దన్ను మొఱగువాడు
తే. అఖిలరూపులు తనరూపమైనవాడు
ఆది మధ్యాంతములు లేక యడరువాడు
భక్తజనముల దీనుల పాలివాడు
వినడె, చూడడె, తలపడె, వేగరాడె!
తాత్పర్యం:
ఆ పరమాత్మ నాపట్ల ఉన్నాడా అని సందేహిస్తున్నాను. నిజానికి ఆయనకు ఉండటమూ, లేకుండటమూ లేదు. మరి వచ్చి నన్ను రక్షింపడెందుకు? ఇతరులను పీడించటమే శీలం అయిన వారి పాలబడిన సజ్జనులకు అడ్డంగా నిలిచి రక్షించేస్వామి నాకు అడ్డపడరాడేమిటి? లోపలిదృష్టితో చూడగలిగిన యోగులను, భక్తులను కృపతో చూచే దయాశీలి నాపాటు చూడడేమి? మోసగాళ్ళ ఆర్తనాదాలు వినికూడా గుట్టుగా ఉండి మంచివారిని మాత్రమే కాపాడే ఆ దేవుడు నా మొఱలు ఆలకించడేమి? సృష్టిలో ఉన్న అన్ని రూపాలూ తన రూపాలే అయినవాడు, ఆదిమధ్యాంతములు లేక వెలుగొందేవాడు, భక్తజనములయెడలా, దీనులయెడలా అండగా నిలిచేవాడు అయిన ఆ పరమాత్మ వినడేమి? కనడేమి? నన్నుగూర్చి పట్టించుకోవడేమి? వడివడిగా రాడేమి?
ప్రతిపదార్ధం:
కలుగడే = సహాయముగా రాడేమి; నా = నా; పాలిన్ = విషయములో; కలిమి = ఉండుటను; సందేహింపన్ = అనుమానించను; కలిమి = సంపద కలుగుట; లేములు = పేదరికములు; లేకన్ = చూడక; కలుగు = సహాయ పడెడి; వాడు = వాడు; నాకున్ = నా యాపదకు; అడ్డపడన్ = సహాయ పడుటకు; రాడె = రాడా యేమి; నలిన్ = అధికముగ; అసాధువుల్ = దుర్జనుల; చేన్ = చేతిలో; పడిన = చిక్కి నట్టి; సాధుల్ = సజ్జనుల; కున్ = కు; అడ్డపడెడి = సహాయ పడెడి; వాడు = వాడు; చూడడే = చూడడా యేమి; నా = నా యొక్క; పాటున్ = దురవస్థను; చూపులన్ = ఇతర చూపులు; చూడక = చూడకనే; చూచు వారలన్ = తననే చూచు వారిని; కృపన్ = దయతో; చూచు వాడు = చూచెడి వాడు; లీలన్ = లీల; తోన్ = తోటి; నా = నా యొక్క; మొఱన్ = ఆర్తనాదమును; ఆలింపడే = వినడా యేమి; మొఱగుల = దీనుల; మొఱలు = ఆర్తనాదములను; ఎఱుంగుచున్ = తెలియుచు; తన్ను = తనను తానే; మొఱగు = మరచు; వాడు = వాడు.
అఖిల = సర్వ; రూపముల్ = రూపములు; తన = తన యొక్క; రూపము = స్వరూపము; ఐన = అయిన; వాడు = వాడు; ఆది = మొదలు; మధ్య = మధ్య; అంతములున్ = తుదలు; లేక = లేకుండగ; అడరు = అతిశయించెడి; వాడు = వాడు; భక్త జనములన్ = భక్తు లైన వానిని; దీనులన్ = దీనుల; పాలి = అండగా నుండెడి; వాడు = వాడు; వినడె = వినడా యేమి; చూడడె = చూడడా యేమి; తలపడె = రక్షింప తలచడా యేమి; వేగన్ = శ్రీఘ్రమే; రాడె = రాడా యేమి.
8-90 లా వొక్కింతయు లేదు
సందర్భం:
గజేంద్రుడు పరిపరివిధాలైన భావాలకు లోనవుతున్నాడు. చిట్టచివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు. దానిమీద స్థిరంగా నిలిచి తన బాధ వింటున్న ఆ శ్రీమహావిష్ణువుతో ఇలా అంటున్నాడు -
శా. లా వొక్కింతయు లేదు, ధైర్యము విలోలం బయ్యె, బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను, మూర్ఛ వచ్చె, తనువున్ డస్సెన్, శ్రమం బయ్యెడిన్,
నీవే తప్ప నితః పరం బెఱుగ, మన్నింపందగున్ దీనునిన్,
రావే యీశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!
తాత్పర్యం:
ఈశ్వరా! ఇంక నాలో సత్తువ కొంచెం కూడా లేదు. ధైర్యం చెల్లాచెదరైపోయింది. ప్రాణాలు ఏ క్షణానైనా జారిపోయేవిధంగా తమతమ తావులనుండి వెలుపలికి వచ్చాయి. మూర్ఛ వస్తున్నది. శరీరం బడలిపోయింది. అలసట నిలువెల్లా ఆక్రమించింది. నన్ను కాపాడేవాడవు నీవు కాక మరొకరు లేరు. ఇటుగాని అటుగాని ఏదీ నాకు తెలియరాకున్నది, స్వామీ! దీనుణ్ణి. నన్ను మన్నించిరావయ్యా! రా! నీవు భక్తులు కోరిన వరాలిచ్చేవాడవు గదా! నన్ను కాపాడు. భద్రాత్మకా! నన్ను సంరక్షించు, స్వామీ!
ప్రతిపదార్ధం:
లావు = శక్తి; ఒక్కింతయున్ = కొంచము కూడ; లేదు = లేదు; ధైర్యము = ధైర్యము; విలోలంబు = తగ్గి; అయ్యెన్ = పోయింది; ప్రాణంబులున్ = ప్రాణములు; ఠావుల్ = స్థానముల నుండి; తప్పెన్ = చలించి పోతున్నాయి; మూర్ఛ = మగత; వచ్ఛెన్ = వచ్చేస్తోంది; తనువున్ = శరీరము; డస్సెన్ = అలసి పోయింది; శ్రమంబున్ = కష్టముగా; అయ్యెడిన్ = ఉన్నది; నీవే = నీవు మాత్రము; తప్పన్ = తప్పించి; ఇతః పరంబు = మరింకొకరుని; ఎఱుంగన్ = తెలియను; మన్నింపన్ = ఆదుకొన; తగున్ = తగిన వాడను; దీనునిన్ = దీనావస్థ నున్న వాడను; రావే = రమ్ము; ఈశ్వర = భగవంతుడ; కావవే = కరుణించుము; వరద = వరముల నిచ్చెడి వాడ; సంరక్షింపు = కాపాడుము; భద్రాత్మక = శుభమే తా నైన వాడ.
8-92 ఓ కమలాప్త
సందర్భం:
గజేంద్రుడు ఎలుగెత్తి ఆక్రోశిస్తున్నాడు. స్వామి మహా గుణాలను సంభావిస్తూ పిలుస్తున్నాడు. తననే రక్షకునిగా సంభావిస్తున్న సంగతిని ఆయనకు నివేదించుకుంటున్నాడు.
ఉ. ఓ కమలాప్త! ఓ వరద! ఓ ప్రతిపక్ష విపక్ష దూర! కు
య్యో! కవియోగివంద్య! సుగుణోత్తమ! ఓ శరణాగతమరా
నోకహ! ఓ మునీశ్వర మనోహర! ఓ విపుల ప్రభావ! రా
వే! కరుణింపవే! తలపవే! శరణార్థిని నన్ను గావవే!
తాత్పర్యం:
స్వామీ! కమలాపతీ! అందరికీ కోరిన వరాలిచ్చే కరుణాశాలివి. పగవారిని కూడా పగవారుగా భావింపని దయామయా! గొప్ప మేధాబలంగల యోగులు కూడా నిన్ను నిరంతరం ఆరాధిస్తూ ఉంటారు. నీ గుణాలన్నీ సద్గుణాలే. వానివలన నీవు పురుషోత్తముడవయ్యావు కదయ్యా! శరణు కోరి వచ్చిన వారికి నీవు కల్పవృక్షానివి. మునిశ్రేష్ఠుల మనస్సులను హరించేవాడవు. నీ ప్రభావానికి ఎటువంటి ఎల్లలూ లేవు. రా తండ్రీ! నన్ను కరుణించు. ఒక్కసారి నన్ను ‘వీడు నావాడు’ అనుకో. రక్షణ కోరి నిన్నాశ్రయించిన నన్ను కాపాడు, స్వామీ!
ప్రతిపదార్ధం:
ఓ = ఓ; కమ లాప్త = నారాయణ {కమ లాప్తుడు - కమల (లక్ష్మీదేవికి) ఆప్తు డైన వాడు, విష్ణువు}; ఓ = ఓ; వరద = నారాయణ {వరదుడు - వరములను ఇచ్చు వాడు, విష్ణువు}; ఓ = ఓ; ప్రతిపక్ష విపక్ష దూర = నారాయణ {ప్రతిపక్ష విపక్ష దూరుడు - ప్రతిపక్ష (శత్రు పక్షము) యందును విపక్ష (వైరము) విదూరుడు (లేని వాడు), విష్ణువు}; కుయ్యో = అమ్మో; కవి యోగి వంద్య = నారాయణ {కవి యోగి వంద్యుడు – కవుల చేతను యోగుల చేతను వంద్యుడు (కీర్తింప బడు వాడు), విష్ణువు}; సుగుణోత్తమ = నారాయణ {సుగుణోత్తముడు – సుగుణములు గల ఉత్తముడు, విష్ణువు}; ఓ = ఓ; శరణాగ తామ రానోకహ = నారాయణ {శరణాగ తామ రానోకహ - శరణాగత (శరణు వేడిన వారికి) అమర (దేవ, కల్ప) అనోకహ (వృక్షము వంటి వాడు), విష్ణువు}; ఓ = ఓ; మునీశ్వర మనోహర = నారాయణ {మునీశ్వర మనోహరుడు - మునీశ్వరుల మనసులను హర (దొంగిలించిన వాడు), విష్ణువు}; ఓ = ఓ; విమల ప్రభావ = నారాయణ {విమల ప్రభావుడు - విమల (స్వచ్ఛ మైన) ప్రభావుడు (మహిమ గల వాడు), విష్ణువు}; రావే = రమ్ము; కరుణింపవే = దయ చూపుము; తలపవే = భావించుము; శరణార్థిని = శరణు కోరెడి వాడను; నన్నున్ = నన్ను; కావవే = కాపాడుము.
8-94 విశ్వమయత లేమి
సందర్భం:
గజేంద్రుడు ఆర్తభక్తుడు, సుకృతి. తన గోడు తన స్వామికి అరమరికలు లేకుండా విన్నవించుకుంటున్నాడు. అతని మొర అచ్యుతునికి వినిపించింది. అచ్యుతుడు మాత్రమే పట్టించుకున్నాడు.
ఆ. విశ్వమయత లేమి వినియు నూరక యుండి
రంబుజాసనాదు లడ్డపడక
విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు
భక్తియుతున కడ్డపడ దలంచి
తాత్పర్యం:
పరమాత్మ అయిన విష్ణువు ఒక్కడే విశ్వమయుడు. అంటే విశ్వమంతా తానే అయి ఉన్నవాడు. అటువంటిస్థితి బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలైనవారికి లేదు. అందువలన ఆ గజేంద్రుని ఆర్తనాదం విని కూడా వారు అతనికి అడ్డపడక ఊరక ఉండిపోయారు. విశ్వమయుడైన విష్ణువు మాత్రం ఎక్కడ కావాలంటే అక్కడ, ఏరూపం కావాలంటే ఆ రూపంతో ఏర్పడగలవాడు కనుక, ఎల్లవేళలా జయమే పొందగలవాడు కనుక తనయందు అచంచలమైన భక్తిగల ఆ గజేంద్రుణ్ణి కాపాడదలచుకున్నాడు.
ప్రతిపదార్ధం:
విశ్వ = జగత్తు యంతయును; మయత = నిండి యుండుట; లేమిన్ = లేకపోవుట చేత; వినియున్ = వి న్నప్పటికిని; ఊరక = స్పందించ కుండగ; ఉండిరి = ఉన్నారు; అంబు జాసన = బ్రహ్మదేవుడు; ఆదులు = మున్నగు వారు; అడ్డ పడక = సాయ పడకుండ; విశ్వ మయుడు = నారాయణుడు {విశ్వ మయుడు – జగ త్తంతను నిండి యున్న వాడు, హరి}; విభుడు = నారాయణుడు {విభుడు – వైభవము గల వాడు, హరి}; విష్ణుండు = నారాయణుడు {విష్ణువు – విశ్వమున వ్యాపించిన వాడు, హరి}; జిష్ణుండు = నారాయణుడు {జిష్ణుడు – జయించు శీలము గల వాడు, హరి}; భక్తి యుతున్ = భక్తి గల వాని; కిన్ = కి; అడ్డ పడ = సాయ పడవలె నని; తలచి = భావించి.
8-95 అల వైకుంఠపురంబులో
సందర్భం:
ఇప్పుడు మీరు ఆస్వాదించబోయే ఆణిముత్యంలాంటి ఈ పద్యం శ్రీమహాభాగవతంలోని "గజేంద్రమోక్షం" లోనిది. గజరాజు మొసలి కోరలలో చిక్కుకుని తన శక్తియుక్తులన్నీ వినియోగించి దానిని విదళించి, విసిరికొట్టి విడిపించుకోవటానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాడు. ధైర్యం చెదరిపోయి, ప్రాణాలు గూళ్ళనుండి జారిపోతున్న సమయంలో అతనికి పరమాత్మ గుర్తుకు వచ్చారు. పూర్వజన్మ సంస్కార బలంతో స్వామిని తనివితీరా స్తుతించాడు. "శరణార్ధినయ్యా, నన్ను కాపాడు" అని ఒంట్లోని శక్తినంతా కూడదీసుకుని ఆర్తనాదం చేశాడు. అప్పుడు -
మ. అల వైకుంఠపురంబులో నగరిలో నామూలసౌధంబు దా
పల మందార వనాంత రామృతసరఃప్రాం తేందుకాంతోప లో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వలనాగేంద్రము "పాహి పాహి" యనఁ గు య్యాలించి సంరంభి యై.
తాత్పర్యం:
స్వామి ఎక్కడో వైకుంఠపురంలో ఉన్నారు. అందులోనూ అందరికీ అందుబాటులో ఉండని అంతఃపురంలో ఉన్నారు. అక్కడ కూడా ఆయన ఉండే భవనం చాలా లోపలగా ఉంటుంది. దానికి ఎడమవైపుగా ఒక మందారాల పూలతోట, ఆ తోట లోపల ఒక అమృతపు కొలను, దానికి ఆనుకుని చంద్రకాంత మణుల అరుగు, దానినిండా నల్లకలువలు పరచుకుని ఉన్నాయి. అదిగో, అక్కడ దానిమీద తన ప్రాణప్రియ రమాదేవితో వినోదంగా ఆ స్వామి కాలక్షేపం చేస్తున్నారు. అయినా ఆపదలలో చిక్కుకుని దిక్కులేక అలమటిస్తున్న భక్తులయందు ప్రసన్న భావంతోనే ఉంటారు కదా! అలవికాని దుఃఖంతో, అదుపు తప్పిన అవయవాలలో తల్లడిల్లి పోతున్న గజరాజు ‘కాపాడు తండ్రీ కాపాడు’ అన్నంతలోనే ఆ 'కుయ్యి' ఆలకించి ఇక దేనినీ పట్టించుకోని తొందరతనంతో బయలుదేరారు శ్రీమహావిష్ణువు.
ప్రతిపదార్ధం:
అల = అక్కడ; వైకుంఠ = వైకుంఠ మనెడి; పురంబు = పురము; లోన్ = అందు; నగరి = రాజభవన సముదాయము; లోన్ = అందు; ఆ = ఆ; మూల = ప్రధాన; సౌధంబు = మేడ {సౌధము - సుధ (సున్నముతో) చేయబడినది, మేడ}; దాపల = దగ్గర; మందార = మందార పూల; వన = తోట; అంతర = లోపల; అమృత = అమృత జలపు; సరస్ = సరోవరము; ప్రాంత = సమీపమున గల; ఇందుకాంత = చంద్రకాంత; ఉపల = పైన; ఉత్పల = కలువల; పర్యంక = పాన్పు పై నున్న; రమా = లక్ష్మీదేవితో; వినోది = వినోదించుచున్న వాడు; అగున్ = అయిన; ఆపన్న = కష్టాలలో ఉన్న వారిని; ప్రసన్నుండు = అనుగ్రహించు వాడు; విహ్వల = విహ్వలము చెందినట్టి {విహ్వలము – భయాదుల చేత అవయవముల స్వాధీనము తప్పుట}; నాగేంద్రము = గజేంద్రుడు; పాహి పాహి = కాపాడు కాపాడు; అనన్ = అనుచు; కుయ్యాలించి = మొర విని; సంరంభి = వేగిర పడుతున్న వాడు; ఐ = అయ్యి.
8-96 సిరికిం జెప్పడు
సందర్భం:
స్వామి సద్భక్తుణ్ణి సంరక్షించటానికి బయలుదేరాడు. ఆపదలో చిక్కుకొన్న అర్భకుణ్ణి కాపాడి అక్కున చేర్చుకోవటానికి ఆరాటపడే అమ్మలా బయలుదేరాడు. అక్కడ దేనితో ఏమి పనిపడుతుందో అనే ఆలోచన కూడా ఆయనకు కలుగలేదు.
మ. సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం జేదోయి సంధింప డే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణి కాం
తర ధమ్మిల్ల ము జక్క నొత్తడు; వివాద ప్రోత్థిత శ్రీ కుచో
పరి చేలాంచల మైన వీడడు గజ ప్రాణావనోత్సాహి యై.
తాత్పర్యం:
తన ప్రియకాంత శ్రీదేవికి చెప్పలేదు. అక్కడ అవసరమవుతాయేమో అని రెండు చేతులలో శంఖాన్నీ, చక్రాన్నీ కూర్చుకోలేదు. ఎవ్వనితో ఏమి పనిపడుతుందో అనుకొని సేవకుల నెవ్వరినీ రండయ్యా! నాతో రండి అని పిలువలేదు. ఎంతదూరమో ఎలా పోవాలో అని తన వాహనమైన గరుత్మంతుణ్ణి సిద్ధం చేసుకోలేదు. చెవి కమ్మలమీద చీకాకు కలిగిస్తూ చెదరిపడుతున్న కేశపాశాన్ని ముడివేసుకోలేదు. ఆర్తుని పొలికేక వినకముందు అమ్మవారితో ఆడుకుంటూ వినోదపు కలహంలో చేత చిక్కించుకొన్న ఆమె వక్షస్థలం మీది వస్త్రం అంచును కూడా వదలిపెట్టలేదు. గజరాజు ప్రాణాలు కాపాడాలి అనే ఉత్సాహం ఒక్కటే సర్వమూ అయిన ఆ స్వామి పరుగులు తీస్తున్నాడు.
ప్రతిపదార్ధం:
సిరి = లక్ష్మీదేవి; కిన్ = కైనను; చెప్పడు = చెప్పుట లేదు; శంఖ = శంఖము; చక్ర = సుదర్శన చక్రము; యుగమున్ = జంటను; చేదోయి = చేతులు రెంటి యందు; సంధింపడు = ధరించుట లేదు; ఏ = ఏ; పరివారంబునున్ = సేవకులను; చీరడు = పిలువడు; అభ్రగపతిన్ = గరుత్మంతుని {అభ్రగపతి - అభ్రగము (గగనచరు లైన పక్షులకు) పతి (ప్రభువు), గరుడుడు}; పన్నింపడు = సిద్ధపరుప నియమించడు; ఆకర్ణిక = చెవి దుద్దుల; అంతర = వరకు జారినట్టి; ధమిల్లమున్ = జుట్టు ముడిని; చక్క నొత్తడు = చక్కదిద్ధు కొనుట లేదు; వివాద = ప్రణయ కలహము నందు; ప్రోద్దత = పట్టు కొన్న; శ్రీ = లక్ష్మీదేవి యొక్క; కుచ = వక్షము; ఉపరి = మీది; చేలాంచలము = చీర కొంగు; ఐనన్ = అయినను; వీడడు = వదలిపెట్టుట లేదు; గజ = గజేంద్రుని; ప్రాణ = ప్రాణములను; ఆవన = కాపాడెడి; ఉత్సాహి = ఉత్సాహము కల వాడు; ఐ = అయ్యి.
8-98 తనవెంటన్ సిరి
సందర్భం:
ఆర్తుని రక్షణయే ధ్యేయంగా పరుగులు తీస్తున్న స్వామి చెప్పకపోతే ఏమి? కావలసిన కార్యమంతా చక్కగా జరిగిపోతుంది. స్వామి చిత్తం ఎరిగిన అందరూ, అన్నీ ఆయనవెంట అప్రయత్నంగా అంగలు వేసుకుంటూ బయలుదేరటాన్ని పోతనామాత్యుల వారు అతి రమణీయంగా మనకు తెలియజేస్తున్నారు.
మ. తనవెంటన్ సిరి, లచ్చివెంట నవరోధ వ్రాతమున్, దాని వె
న్కను పక్షీంద్రుడు, వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్ర నికాయంబును, నారదుండు, ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.
తాత్పర్యం:
స్వామి అలా బయలుదేరాడో లేదో ఎప్పుడూ విడచి ఉండని లక్షీదేవి వెంటబడింది. ఆమె వెనుక అంతఃపురంలోని అంగనామణులందరూ బయలుదేరారు. వారిని చూచి పక్షిరాజు గరుత్మంతుడు దూకుకుంటూ వస్తున్నాడు. అతనిననుసరించి శాఙ్గమనే విల్లూ, కౌమోదకి అనే గదా, పాంచజన్యమనే శంఖమూ, సుదర్శనమనే చక్రమూ మొదలైనవన్నీ వరుసలో నిలిచి ఉరకలు వేస్తున్నాయి. నిరంతరమూ నారాయణ స్మరణతో ఆనందం పొంగులెత్తే అంతరంగం గల నారదుడు వచ్చి చేరాడు. సేనాపతి విష్వక్సేనులవారు చేరుకున్నారు. ఇంక చెప్పేదేముంది? వీరందరినీ చూచి వైకుంఠంలో ఉన్న పసిపిల్లలు మొదలుకొని గోవులను కాచుకొనే గోపాలుర వరకూ అందరూ గజేంద్రుడున్న తావునకు తరలివచ్చారు.
ప్రతిపదార్ధం:
తన = అతని; వెంటన్ = వెనుక; సిరి = లక్ష్మీదేవి; లచ్చి = లక్ష్మీదేని; వెంటన్ = వెనుక; అవరోధ = అంతఃపుర స్త్రీ; వ్రాతమున్ = సమూహమును; దాని = వాని; వెన్కనున్ = వెనుక; పక్షీంద్రుడు = గరుత్మంతుడు {పక్షీంద్రుడు - పక్షులకు ఇంద్రుడు (ప్రభువు), గరుడుడు}; వాని = అతని; పొంతను = పక్కనే; ధనుస్ = విల్లు {విష్ణుమూర్తి - ఆయుధములు 1 ధనుస్సు శార్ఙ్గము 2 గద కౌమోదకి 3 శంఖము పాంచజన్యము 4 చక్రము సుదర్శనము 5 కత్తి నందకము}; కౌమోదకీ = కౌమోదకి యనెడి గద; శంఖ = శంఖము; చక్ర = చక్రముల; నికాయంబునున్ = సమూహము; నారదుండు = నారదుడు; ధ్వజినీ కాంతుండు = విష్వక్సేనుడు {ధ్వజినీకాంతుండు - (విష్ణుమూర్తి యొక్క) ధ్వజినీ (సేనా) కాంతుడు (నాయకుడు), విష్వక్సేనుడు}; తాన్ = వారు; వచ్చిరి = వచ్చిరి; ఒయ్యన = శ్రీఘ్రముగ; వైకుంఠ = వైకుంఠ మనెడి; పురంబునన్ = పట్టణము నందు; కలుగు = ఉండెడి; వారు = వారు; ఆబాలగోపాలమున్ = సర్వులును.
8-100 తన వేంచేయు
సందర్భం:
బయలుదేరింది కానీ అమ్మవారి అంతరంగంలో అనేకమైన ఆలోచనలు. ఎక్కడికి, ఏ పనిమీద, ఎంత దూరం పోవాలి అనే భావపరంపర ఆమెను నిలువనీయటం లేదు.
మ. తన వేంచేయు పదంబు పేర్కొన, డనాథ స్త్రీ జనాలాపముల్
వినెనో, మ్రుచ్చులు మ్రుచ్చిలించిరొ ఖలుల్ వేదప్రపంచంబులన్,
దనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో, భక్తులం
గని చక్రాయుధు డేడి చూపు డని ధిక్కారించిరో దుర్జనుల్.
తాత్పర్యం:
నా స్వామి తాను ఎక్కడికి పోతున్నాడో చెప్పలేదు. దిక్కులేని అబలల ఆర్తనాదాలు చెవిని పడ్డాయేమో! నిలువెల్లా విషమే అయిన నీచులు దొంగలై వేదరాశులను దొంగిలించారేమో! రక్కసిమూకలు దేవతల రాజగృహాలమీద దండెత్తినవేమో! పాడుబుద్ధిగల వివేకహీనులు భక్తులను చూచి, చక్రం చేతబట్టి ఏదో అద్భుతాలు చేస్తాడంటున్నారే ఆ చక్రాయుధుడు ఎక్కడ ఉన్నాడో చూపండిరా అని ధిక్కరించి పలుకుతున్నారేమో!
ప్రతిపదార్ధం:
తన = తను; వేం చేయు = వెళ్ళు తున్న; పదంబున్ = చోటును; పేర్కొనడు = చెప్పుట లేదు; అనాథ = దిక్కు లేని; స్త్రీ = మహిళ లైన; జన = వారి; ఆలాపముల్ = మొరలను; వినెనో = విన్నాడేమో; మ్రుచ్చులు = దొంగలు; మ్రుచ్చలించిరో = దొంగతనముచేసి రేమో; ఖలుల్ = నీచులు; వేద = వేదములు; ప్రపంచంబులన్ = సమస్తమును; దనుజ = రాక్షస; అనీకము = మూకలు; దేవతా నగరి = అమరావతి {దేవతా నగరి - దేవతల రాజధాని, అమరావతి}; పైన్ = మీదికి; దండెత్తెనో = యుద్దమునకు వెళ్ళా రేమో; భక్తులన్ = భక్తులను; కని = చూసి; చక్రాయుధుడు = విష్ణుమూర్తి {చక్రాయుధుడు - చక్రము ఆయుధముగా గల వాడు, విష్ణువు}; ఏడీ = ఎక్కడ ఉన్నాడు; చూపుడు = చూపించండి; అని = అని; ధిక్కరించిరో = దబాయించి రేమో; దుర్జనులు = దుష్టులు.
8-103 అడిగెద నని
సందర్భం:
శ్రీమహాలక్ష్మికి చిత్తం చెదరిపోతున్నది. స్వామి సంరంభం ఏమిటో తెలుసుకోవాలి. ఒకవేళ తనతో అయ్యే పనిఏదైనా ఉంటే చేయటానికి నడుముకట్టాలి కదా! అందుకని తెలుసుకోవటానికి ఆరాటపడుతున్నది. ఆ ఆరాటాన్ని అద్భుతమైన అక్షరాల చిత్రంతో మనకందిస్తున్నారు పోతనామాత్యుల వారు.
క. అడిగెద నని కడువడి జను,
నడిగిన దను మగుడ నుడుగ డని నడ యుడుగున్
వెడ వెడ చిడిముడి తడబడ,
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్.
తాత్పర్యం:
ఆయననే అడిగివేస్తాను అని ఆయన కంటే కొంచెం వడినిపెంచి ముందుకు పోతున్నది. ఇంతలోనే ఈ మహానుభావుడు తనవైపు తిరిగి సావధానంగా చెబుతాడో లేదో అని మళ్ళీ వెనక్కి తిరుగుతున్నది. మనస్సంతా గందరగోళంగా ఉన్నది. అడుగులు తడబడుతున్నాయి. అడుగువేయాలి అని అనుకోవటమే కానీ అడుగు ముందుకు పడటంలేదు. కాళ్ళల్లో కదలిక లేని స్థితి ఏర్పడుతున్నది.
ప్రతిపదార్ధం:
అడిగెదన్ = అడిగేస్తాను; అని = అని; కడు = మిక్కిలి; వడిన్ = వేగముగ; చనున్ = వెళ్ళును; అడిగినన్ = అడిగి నప్పటికిని; తను = అతను; మగుడ = మారు పలుకులు; నుడుగడు = పలుకడు; అని = అని; నడన్ = నడచుట; ఉడుగును = విరమించును; వెడ వెడ = తొట్రుపడుతూ; సిడిముడిని = చీకాకుతో; తడబడన్ = తడబడుతూ; అడుగు = అడుగులు; ఇడున్ = వేయును; అడుగున్ = అడుగులు; ఇడదు = వేయదు; జడిమన్ = జడత్వముతో; అడుగున్ = అడుగులను; ఇడు = వేసెడి; ఎడలన్ = సమయములలో.
8-104 నిటలాలకము
సందర్భం:
లోకమాత లక్షీదేవి స్వామి వెన్నంటిపోతూ అష్టకష్టాలు పడుతున్నది.
సీ. నిటలాలకము లంటి నివుర జుం జు మ్మని ముఖసరోజము నిండ ముసరు తేంట్లు
అళుల జోపగ చిల్క లల్ల నల్లన జేరి ఓష్ఠబింబ ద్యుతు లొడియ నుఱుకు
శుకముల దోల జక్షుర్మీనములకు మందాకినీ పాఠీనలోక మెగుచు
మీనపంక్తులు దాట మెయిదీగెతో రాయ శంపాలతలు మింట సరణి గట్టు
ఆ. శంపలను జయింప చక్రవాకంబులు కుచయుగంబు దాకి క్రొవ్వు చూపు
మెలత మొగిలుపిఱిది మెఱుగు దీగెయుబోలె జలదవర్ణువెనుక జరుగునపుడు
తాత్పర్యం:
భక్త రక్షణ కోసం విష్ణుదేవుని వెన్నంటి పరువులు తీస్తున్న అమ్మవారి పరిస్థితి ఎలా ఉందంటే – నుదుటి మీద ముంగురులు క్రమ్ముకొంటున్నాయి. వానినంటుకొని మోముదామరమీద జుంజుం అంటూ మధురనాదం చేస్తూ తుమ్మెదలు ముసరుకొంటున్నాయి. వానిని పూనికతో తోలే ప్రయత్నంలో ఉండగా రామచిలుకలు మెల్లమెల్లగా చేరి క్రిందిపెదవి కాంతులను ఒడిసిపట్టుకుంటున్నాయి. చిలుకలను తరిమిన వెంటనే కన్నులనే ఒంపుసొంపుల చేపలను మిన్నేటిలోని పెద్దచేపలు తరుముకొని వస్తున్నాయి. ఆ చేపల వరుసలను దాటుకోగా మేను అనే తీగతో మెఱుపుతీగలు మింటిలో రాసుకుంటున్నాయి. మెఱుపుతీగలను ప్రక్కకు తొలగింపగా చక్రవాకాలు పాలిండ్లపై వ్రాలి క్రొవ్వుచూపుతున్నాయి. మబ్బువెనుక మసలే మెఱుపు తీగలాగా నీలమేఘశ్యాముని వెంటనంటిన లక్ష్మీదేవి స్థితి ఇలా ఉన్నది.
ప్రతిపదార్ధం:
నిటల = నుదుట; అలకులు = ముంగురులు; అంటి = అంటుకొని; నివురన్ = చక్కదిద్ద బోతే; జుం జుమ్ము = జుంజుం; అని = అనెడి ఝంకారములతో; ముఖ = ముఖము యనెడి; సరోజము = పద్మము; నిండ = అంతటను; ముసురున్ = కప్పును; తేంట్లు = తుమ్మెదలు; అళులన్ = తుమ్మెదలను; జోపగన్ = తోలగా; చిల్కలు = చిలుకలు; అల్ల నల్లన = మెల్లగా; చేరి = సమీపించి; ఓష్ఠ = పెదవి యనెడి; బింబ = దొండ పండు; ద్యుతులు = కాంతులను; ఒడియన్ = ఒడిసి పట్టుకొన; ఉఱుకున్ = దూకును; శుకములన్ = చిలుకలను; తోలన్ = తోలగా; చక్షుర్ = కన్నులు యనెడి; మీనముల్ = చేపల; కున్ = కు; మందాకినీ = ఆకాశగంగ లోని; పాఠీన = చేపల; లోకమున్ = సమూహము; ఎగచు = విజృంభించును; మీన = చేపల; పంక్తులన్ = సమూహములను; దాటన్ = దాటగా; మొయి = దేహము యనెడి; తీగ = తీవ; తోన్ = తోటి; రాయన్ = రాసుకు పోవుటకు; శంపా = మెఱుపు; లతలున్ = తీగలు; మింటన్ = ఆకాశములో; సరణి = వరుసలు; కట్టున్ = కట్టును;
శంపలను = మెఱుపులను; జయింపన్ = జయించుటకు; చక్రవాకంబులున్ = చక్రవాక పక్షులు; కుచ = స్తనముల; యుగంబున్ = జంటను; తాకి = ఎదుర్కొని; క్రొవ్వు = బలమును; చూపున్ = చూపు తున్నవి; మెలత = స్త్రీ; మొగిలు = మేఘము; పిఱిది = వెనుక నుండు; మెఱుగు = మెరుపు; తీగెయున్ = తీగను; పోలెన్ = వలె; జలద వర్ణున్ = మేఘము వంటి రంగు వాని; వెనుకన్ = వెంట; చనెడు = వెళ్ళెడి; అపుడు = సమయము నందు.
8-105 వినువీథిం
సందర్భం:
శ్రీమహావిష్ణువు ఆకాశవీధిలో పయనిస్తూ ఏనుగును రక్షించటానికి వస్తున్నాడు. ఆ దర్శనం కవివరేణ్యుని హృదయంలో కమనీయ రసభావాలను ఉప్పొంగజేస్తున్నది. ఆ పొంగును పాఠకుని హృదయంలో పరవళ్ళు త్రొక్కించటానికి పోతనామాత్యుల వారు ఇలా వర్ణిస్తున్నారు.
మ. వినువీథిం జనుదేర గాంచి రమరుల్ విష్ణున్, సురారాతి జీ
వనసంపత్తి నిరాకరిష్ణు, గరుణా వర్ధిష్ణు, యోగీంద్ర హృ
ద్వన వర్తిష్ణు, సహిష్ణు, భక్తజన బృందప్రాభవాలంకరి
ష్ణు, నవోఢోల్లసదిందిరా పరిచరిష్ణున్, జిష్ణు, రోచిష్ణునిన్.
తాత్పర్యం:
గగనమార్గంలో వస్తూ ఉండగా దేవతలు పారవశ్యంతో పరమాత్మను దర్శించుకున్నారు. ఆ మహాత్మునిలో దేవతల పగవారైన రక్కసుల బ్రతుకుపంట బండలపాలు కావటం కానవస్తున్నది. భక్తులయెడల దయను ఆ స్వామి మరింతగా పెంపొందిస్తున్నాడు. యోగంలో మిన్నులుముట్టినవారి హృదయాలనే వనాలలో విహరిస్తున్నాడు. భక్తులకోసం ఎంతలేసి కష్టాలనైనా సహించేశీలం అతనిది. భక్తజనుల గుంపుల సంపదలే ఆయన అలంకారాలుగా చేసుకుంటాడు. ఎల్లవేళలా క్రొత్తపెండ్లికూతురే అయిన ఇందిర పరిచర్యలను ప్రేమతో, లాలనతో అందుకుంటూ ఉంటాడు. జయమందుకోవటమే ఆయన శీలం. అతని దేహపు వెలుగులు ప్రపంచాన్నంతటినీ ప్రకాశింపజేస్తూ ఉంటాయి.
ప్రతిపదార్ధం:
వినువీథిన్ = ఆకాశ మార్గము నందు; చనుదేరన్ = వెళ్ళు తుండగా; కాంచిరి = దర్శించిరి; అమరుల్ = దేవతలు; విష్ణున్ = హరిని {విష్ణువు - విశ్వమున వ్యాపించి యుండు వాడు, నారాయణుడు}; సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణున్ = హరిని {సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణుడు - సుర (దేవతల) ఆరాతి (శత్రువుల యొక్క) జీవన సంపత్తి (బ్రతుకు దెరువు)ను నిరాకరిష్ణుడు (నిరాకరించెడి వాడు), విష్ణువు}; కరుణా వర్ధిష్ణున్ = హరిని {కరుణా వర్ధిష్ణుడు - కారుణ్యము వృద్ధి యగు స్వభావము గల వాడు, విష్ణువు}; యోగీంద్ర హృద్వన వర్తిష్ణున్ = హరిని {యోగీంద్ర హృ ద్వన వర్తిష్ణుడు - యోగీంద్రుల హృదయము లనెడి వన (తోటలలో) వర్తిష్ణుడు (మెలగెడు వాడు), విష్ణువు}; సహిష్ణున్ = హరిని {సహిష్ణుడు - సహన స్వభావము గల వాడు, విష్ణువు}; భక్తజన బృంద ప్రాభ వాలంకరిష్ణున్ = హరిని {భక్త జన బృంద ప్రాభ వాలంకరిష్ణుడు – భక్త జనుల బృంద (సమూహములను) ప్రాభవ (గొప్పదనము) తో అలంకరిష్ణుడు (అలంకరించెడి వాడు), విష్ణువు}; నవోఢోల్లస దిందిరా పరిచరిష్ణున్ = హరిని {నవో ఢోల్లస దిందిరా పరిచరిష్ణుడు - నవోఢ (కొత్తపెళ్ళికూతురు) వలె ఉల్లసత్ (ఉల్లాసము గల) ఇందిరా (లక్ష్మీదేవికి) పరిచరిష్ణుడు (సమీపమున మెలగెడు వాడు), విష్ణువు}; జిష్ణున్ = హరిని {జిష్ణువు - జయించు స్వభావము గల వాడు, విష్ణువు}; రోచిష్ణునిన్ = హరిని {రోచిష్ణుడు - ప్రకాశించెడి స్వభావము గల వాడు, విష్ణువు}.
8-107 చనుదెంచెన్
సందర్భం:
భక్తరక్షణ కళాసంరంభంతో భూమికి దిగివస్తున్న శ్రీహరిని గూర్చి పారవశ్యంతో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ స్వామికి మ్రొక్కులు చెల్లించుకుంటున్నారు దేవతలు.
మ. చనుదెంచెన్ ఘను డల్ల వాడె హరి, పజ్జం గంటిరే లక్ష్మి, శం
ఖనినాదం బదె, చక్ర మల్లదె, భుజంగధ్వంసియున్ వాడె, క్ర
న్నన నేతెంచె నటంచు వేల్పులు నమో నారాయణా యేతి ని
స్వనులై మ్రొక్కిరి మింట హ స్తిదురవస్థావక్రికిం చక్రికిన్.
తాత్పర్యం:
‘చూచారా! అదిగో మహానుభావుడు హరి విచ్చేశాడు. అదిగో ఆ ప్రక్కనే లోకమాత లక్ష్మీదేవి నిలిచి ఉన్నది. శంఖంనాదం అదిగో. అదిగదిగో చక్రం. అతడే కదయ్యా సర్పాలను సర్వనాశనం చేసే గరుత్మంతుడు. ‘వడివడిగా వచ్చాడు’ అని ఆనందంతో దర్శించుకుంటూ ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని జపిస్తూ ఏనుగు దురవస్థను రూపుమాపటానికి వస్తున్న చక్రధరునికి మ్రొక్కుతున్నారు దేవతలు. వారి గుంపులతో, ఘోషలతో గగనమంతా నిండిపోయింది.
ప్రతిపదార్ధం:
చనుదెంచెన్ = వచ్చినాడు; ఘనుడు = గొప్పవాడు; అల్ల = అక్కడి; వాడె = అతడే; హరి = విష్ణువు; పజ్జన్ = పక్కనే; కంటిరే = చూసితిరా; లక్ష్మిన్ = లక్ష్మీదేవిని; శంఖ నినాదంబు = పాంచజన్య శంఖ ధ్వని; అదె = అక్కడ నున్నదే; చక్రము = సుదర్శన చక్రము; అల్లదె = అక్క డున్నదే; భుజంగ ధ్వంసియున్ = గరుత్మంతుడు; వాడె = అతడే; క్రన్ననన్ = వరుసగా; ఏతెంచెన్ = వచ్చిరి; అట = అని; అంచున్ = అనుచు; వేల్పులు = దేవతలు; నమో = నమస్కారము; నారాయణ = నారయణునికి; ఇతి = ఇది యనెడి; నిస్వనులు = పలికెడి వారు; ఐ = అయ్యి; మ్రొక్కిరి = నమస్కరించిరి; మింటన్ = ఆకాశమునందు; హస్తి దురవస్థా వక్రికిన్ = హరికి {హస్తి దురవస్థా వక్రి - హస్తి (ఏనుగు యొక్క) దురవస్థ (ఆపదను) వక్రి (మరలించెడి వాడు), విష్ణువు}; చక్రికిన్ = హరికి {చక్రి - చక్రము ఆయుధముగా గల వాడు, విష్ణువు}.
8-122 అవనీనాథ
సందర్భం:
స్వామి మకరేంద్రుణ్ణి మట్టుపెట్టాడు. గజేంద్రుణ్ణి గట్టెక్కించాడు. అందరికీ ఆనందాన్ని అందించాడు. కాగా తరువాతి కథలో ఆ ఏనుగు వెనుకటి జన్మలో ఎవరో తెలియజేస్తున్నారు శుకమహర్షుల వారు.
మ. అవనీనాథ! గజేంద్రు డా మకరితో నాలంబు గావించె, మున్
ద్రవిళాధీశు డతండు పుణ్యతము డింద్రద్యుమ్న నాముండు, వై
ష్ణవముఖ్యుండు, గృహీత మౌననియతిన్ సర్వాత్ము నారాయణున్
సవిశేషంబుగ బూజ చేసెను మహాశైలాగ్ర భాగంబునన్
తాత్పర్యం:
పరీక్షిన్మహారాజా! మొసలితో చాలాకాలం పోరాడిన ఆ గజేంద్రుడు వెనుకటి జన్మలో ద్రవిడ దేశానికి రాజు. గొప్ప పుణ్యం మూటకట్టుకున్న మనీషి. ఆయన పేరు ఇంద్రద్యుమ్నుడు. విష్ణుభక్తులలో పేరుప్రఖ్యాతులు సంపాదించినవాడు. మౌనవ్రతాన్ని అవలంబించి సర్వాత్ముడైన శ్రీమన్నారాయణుని శ్రద్ధాభక్తులతో గొప్ప కొండకొమ్ము మీద కూర్చుండి ఆరాధించాడు.
ప్రతిపదార్ధం:
అవనీనాథ = రాజా; గజేంద్రుడు = గజేంద్రుడు; ఆ = ఆ; మకరి = మొసలి; తోన్ = తోటి; ఆలంబున్ = యుద్దమును; కావించె = చేసెనో; మున్ = పూర్వము; ద్రవిళ = ద్రవిడ దేశపు; అధీశుడు = ప్రభువు; అతండు = అతడు; పుణ్య తముడు = అత్యధిక మైన పుణ్యుడు; ఇంద్రద్యుమ్న = ఇంద్రద్యుమ్నుడు యనెడి; నాముండు = పేరు గల వాడు; వైష్ణవ = విష్ణు భక్తులలో; ముఖ్యుండు = ముఖ్యమైన వాడు; గృహీత = స్వీకరించిన; మౌన = మౌన వ్రత; నియతిన్ = నియమముతో; సర్వాత్మున్ = హరిని {సర్వాత్ముడు - సర్వము తన రూపమే యైన వాడు, విష్ణువు}; నారాయణున్ = హరిని {నారాయణుడు – సారూప్య ముక్తికి స్థాన మైన వాడు, విష్ణువు}; సవిశేషంబుగన్ = విశిష్టతలతో కూడినట్లుగ; పూజ = పూజలు; చేసెను = చేసెను; మహా = గొప్ప; శైల = పర్వతము; అగ్ర = పై; భాగంబునన్ = ప్రదేశము నందు.
8-123 ఒకనా డా నృపు
సందర్భం:
ఆ ఇంద్రద్యుమ్నుడు మహాభక్తుడే కాదు, మహోదాత్తవ్యక్తి కూడా! కానీ ధ్యాననిష్ఠలో ఉండగా ఒక అపచారం జరిగిపోయింది. దానివలన ఏనుగై పుట్టాడు. ఆ వివరం చెబుతున్నాను విను అంటున్నారు శుకయోగీంద్రులు.
మ. ఒకనా డా నృపు డచ్యుతున్ మనములో నూహింపుచున్ మౌని యై
యకలంకస్థితి నున్నచో గలశజుం డ చ్చోటికిన్ వచ్చి లే
వక పూజింపక యున్న రాజు గని నవ్యక్రోధు డై మూఢ! లు
బ్ధ! కరీంద్రోత్తమ యోని బుట్టు మని శాపం బిచ్చె భూవల్లభా!
తాత్పర్యం:
మహారాజా! ఒకనాడు ఆ ఇంద్రద్యుమ్నుడు మనస్సులో అచ్యుతుని నిలుపుకొన్నాడు. మనస్సు చెదరకుండా నిగ్రహించుకున్నాడు. శ్రీమహావిష్ణువునే భావిస్తున్నాడు. చుట్టుప్రక్కల ఏమి జరుగుతున్నదో తెలుసుకునే స్థితిలో కూడా లేడు. మాటలాడటం మానివేశాడు. అతని ధ్యానంలో రవంత కళంకం కూడా లేదు. అదిగో ఆ స్థితిలో అక్కడకు అగస్త్యమహాముని ఏతెంచాడు. ఆయన అన్ని విధాలా పూజింపదగిన తపస్సంపన్నుడు. ఇంద్రద్యుమ్నుడు ధ్యానంలో ఉన్న కారణంగా లేవలేదు. పూజింపలేదు. అటువంటి రాజును చూచిన మునివర్యునకు పట్టనలవికాని కోపం చెలరేగింది. మూఢా! లుబ్ధా! ఏనుగు కడుపులో పుట్టు అని శపించాడు.
ప్రతిపదార్ధం:
ఒక = ఒక; నాడున్ = దినమున; ఆ = ఆ; నృపుడు = రాజు {నృపుడు - నృ (నరులను) పతి, రాజు}; అచ్యుతున్ = నారాయణుని {అచ్యుతుడు - తన పదవినుండి భ్రంశము పొందని వాడు, విష్ణువు}; మనసు = మనస్సు; లోన్ = అందు; ఊహించుచున్ = భావించు కొనుచు; మౌని = మౌనము ధరించిన వాడు; ఐ = అయ్యి; అకలంక = ఏకాగ్రచిత్తము గల; స్థితిన్ = స్థితిలో; ఉన్నచోన్ = ఉన్నసమయమునందు; కలశజుండు = అగస్త్యముని {కలశజుడు – కలశము నందు జుడు (పుట్టినవాడు), అగస్త్యుడు}; ఆ = ఆ; చోటి = ప్రదేశమున; కిన్ = కు; వచ్చి = వచ్చి; లేవక = లేవ కుండగ; పూజింపకన్ = గౌరవించ కుండగ; ఉన్న = ఉన్నట్టి; రాజున్ = రాజుని; కని = చూసి; నవ్య = వెంటనే పుట్టిన; క్రోధుడు = కోపము గల వాడు; ఐ = అయ్యి; మూఢ = మూర్ఖుడా; లుబ్ద = లోభి, అనాగరికుడ; కరీంద్రము = మదగజములలో; ఉత్తమ = పెద్దదాని; యోనిన్ = గర్భమున; పుట్టుము = జన్మించుము; అని = అని; శాపంబున్ = శాపమును; ఇచ్చెన్ = ఇచ్చెను; భూవల్లభా = రాజా {భూవల్లభుడు - భూ (భూమికి) వల్లభుడు (పతి), రాజు}.
8-135 నరనాథ
సందర్భం:
‘గజేంద్రమోక్షం’ అనేది భాగవతంలో ఒక విలక్షణమైన కథ. జీవుడు సంసారం అనే మొసలి కోరలలో చిక్కుకొని భగవంతుని అనుగ్రహంతో విడుదల పొందడం ఇందులో ప్రతీకాత్మకంగా తెలియజెప్పారు. కాబట్టి దీనిని జాగ్రత్తగా గమనించి నరుడు సంసారంనుండి విముక్తిని పొందాలి. దానిని స్ఫురింపజేస్తూ ఫలశ్రుతిని ఇలా వివరిస్తున్నారు.
సీ. నరనాథ! నీకును నాచేత వివరింప బడిన యీ కృష్ణానుభావ మైన
గజరాజ మోక్షణ కథ వినువారికి యశము లిచ్చును గల్మషాపహంబు
దుస్స్వప్న నాశంబు దుఃఖసంహారంబు బ్రొద్దుల మేల్కాంచి పూతవృత్తి
నిత్యంబు పఠియించు నిర్మలా త్మకు లైన విప్రులకును బహువిభవ మమరు
ఆ. సంపదలు గల్గు; పీడలు శాంతిబొందు; సుఖము సిద్ధించు; వర్ధిల్లుశోభనములు;
మోక్షమఱచేతిదైయుండు ముదము చేరు; ననుచు విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చె
తాత్పర్యం:
రాజా! పరీక్షిత్తూ! నేను నీకు వివరించిన ఈ గజేంద్రమోక్షణ కథ శ్రీమహావిష్ణుని మహిమను చక్కగా వివరిస్తుంది. ఈ కథ వినేవారికి కీర్తిని కలిగిస్తుంది. పాపాలను పోగొడుతుంది. పాడుకలలను నశింపజేస్తుంది. పాడుకలలంటే పాడుబ్రతుకులే. దుఃఖాన్ని తొలగించివేస్తుంది. సూర్యోదయం కాకముందే నిద్రనుండి మేల్కొని పవిత్రమైన నడవడితో ప్రతిదినమూ ఈ కథను పఠించే నిర్మలమైన అంతరంగం గల విద్యావంతులకు అనేక విధాలైన సంపదలు కలుగుతాయి. పీడలు శాంతిస్తాయి. మంగళములు వృద్ధి పొందుతాయి. మోక్షం అరచేతిలో ఉన్న వస్తువులాగా ఉంటుంది. ఆనందం కలుగుతుంది అని సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే చెప్పాడు.
ప్రతిపదార్ధం:
నరనాథ = రాజా {నర నాథుడు - నరులకు పతి, రాజు}; నీ = నీ; కునున్ = కు; నా = నా; చేతన్ = వలన; వివరింపబడిన = వివరముగా తెలుపబడిన; ఈ = ఈ; కృష్ణా = శ్రీకృష్ణుని యొక్క; అనుభావమున్ = ప్రభావము తెలుపునది; ఐన = అయిన; గజరాజ = గజేంద్రుని; మోక్షణ = మోక్షము యనెడి; కథ = కథను; విను = వినెడి; వారి = వారి; కిన్ = కి; యశములున్ = కీర్తులను; ఇచ్చునున్ = ఇచ్చును; కల్మష = పాపములను; అపహంబున్ = పరిహరించునది; దుస్వప్న = చెడ్డ కలలను; నాశంబున్ = తొలగించునది; దుఃఖ = దుఃఖమును; సంహారంబున్ = నాశనము చేయునది; ప్రొద్దుల = ఉదయమే; మేల్కాంచి = నిద్ర లేచి; పూత = పవిత్ర మైన; వృత్తిన్ = విధముగ; నిత్యంబున్ = ప్రతి దినము; పఠియించు = చదివెడి; నిర్మల = నిర్మలమైన; ఆత్మకులు = మనసులు గలవారు; ఐన = అయిన; విప్రుల్ = బ్రాహ్మణుల; కునున్ = కు; బహు = అనేకమైన; విభవము = వైభవములు; అమరున్ = సమకూర్చును. సంపదలున్ = సంపదలు కూడ; కల్గున్ = కలుగును; పీడలు = ఆపదలు; శాంతిన్ = సమసి పోవుట; పొందున్ = కలుగును; సుఖమున్ = సౌఖ్యములును; సిద్ధించున్ = కలుగును; వర్ధిల్లున్ = వృద్ధి చెందును; శోభనములు = శుభములు; మోక్షమున్ = ముక్తి కూడ; అఱచేతిది = మిక్కిలి సులువైనది; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; ముదము = సంతోషము; చేరున్ = సమకూరును; అనుచున్ = అని; విష్ణుండు = హరి; ప్రీతుండు = సంతుష్టుండు; ఐ = అయ్యి; ఆనతిచ్చెన్ = సెలవిచ్చెను.
8-437 బలి నంభోరుహనేత్రు
సందర్భం:
భాగవత మహాకావ్యంలో వామన చరిత్ర ఒక ఆనందలహరి. ఆ కథకు అంకురార్పణ వంటిది పరీక్షిత్తు అడుగుతున్న ఈ ప్రశ్న.
మ. బలి నంభోరుహనేత్రు డేమి కొఱకై పాదత్రయిన్ వేడె; ని
శ్చలుడుం బూర్ణుడు లబ్ధకాముడు రమాసంపన్నుడై తా పర
స్థలికిన్ దీనునిమాడ్కినేల చనియెన్; ద ప్పేమియున్ లేక ని
ష్కలుషున్ బంధన మేల చేసెను; వినం గౌతూహలం బయ్యెడిన్.
తాత్పర్యం:
స్వామీ! శుకయోగీంద్రా! బలిచక్రవర్తిని పద్మాలవంటి విశాల సుందరాలైన కన్నులున్న హరి మూడడుగుల నేలను దేనికోసం అడిగాడు? ఆయన జీవులకులాగా చంచలమైన చిత్తం కలవాడు కాదు. ఏ లోపమూ లేనివాడు. అన్ని కోరికలూ నిండుగా తీరినవాడు. అంటే ఏమీ అక్కరలేనివాడు. అట్టి పురుషోత్తముడు దీనునిలాగా పరుల తావునకు వెళ్ళాడు. అంతేకాదు ఏ తప్పూలేని మహాత్ముడు, పుణ్యాత్ముడు అయిన బలిని బంధించాడు. ఇది వింతయిన విషయం. దీనిని వివరంగా తెలుసుకోవాలని గుండెనిండా కోరిక ఉన్నదయ్యా! నాకోరిక తీర్చు మహానుభావా!
ప్రతిపదార్ధం:
బలిని = బలిని; అంభోరుహ నేత్రుడు = విష్ణువు; ఏమిటి = ఎందుల; కిన్ = కు; పాద = అడుగుల; త్రయిన = మూటిని; వేడెన్ = కోరెను; నిశ్చలుడున్ = నిర్వికారుడు; పూర్ణుడున్ = పూర్ణ పురుషుడు; లబ్ద కాముడు = పరిపూర్ణ కాముడు; రమా సంపన్నుడున్ = లక్ష్మీదేవి యనేడి సంపద గల వాడు; ఐ = అయిన; తాన్ = అతను; పర = ఇతరుల; స్థలి = చోటున; కిన్ = కు; దీనుని = దీనుడి; మాడ్కిన్ = వలె; ఏలన్ = ఎందులకు; చనియెన్ = వెళ్ళెను; తప్పు = తప్పు; ఏమియున్ = ఏమాత్రము; లేక = లేకుండగ; నిష్కలుషున్ = పాప హీనుని; బంధనము = బంధించుట; ఏలన్ = ఎందుకని; చేసెను = చేసెను; వినన్ = వినుటకు; కౌతూహలము = కుతూహలము; అయ్యెడిన్ = కలుచున్నది.
8-514 నన్ను గన్నతండ్రి
సందర్భం:
శ్రీమహావిష్ణువు అవతార ప్రయోజనం సాధించటం కోసం తల్లిదండ్రులనుగా అదితికశ్యపులను ఎన్నుకున్నాడు. తన నిజస్వరూపాన్ని మగురుపరచి కపట వటువు వేషం తాల్చి అమ్మ ముందర ఆటలాడుకుంటున్నాడు. తల్లి అదితి అతనిని చూచి ఆనందపారవశ్యంతో ఇలా అంటున్నది.
ఆ. నన్ను గన్నతండ్రి! నాపాలి దైవమ!
నా తపః ఫలంబ! నా కుమార!
నాదు చిన్నివడుగ! నా కులదీపిక!
రాగదయ్యా! భాగ్యరాశి వగుచు.
తాత్పర్యం:
నా చిన్నికుమారా! నీవు నన్ను కన్న తండ్రివి. నాపాలి దైవానివి. నేను చేసుకొన్న తపస్సుల పంటవు. నా చిన్ని వడుగ! నా కులానికి చిన్ని దీపం అయినవాడా! నా భాగ్యాలరాశివై రా నాయనా!
నిలువెల్లా వాత్సల్యం అనే అమృతంతో నిండిన ఏ తల్లి అయినా కన్నకొడుకును ఇలాగే పిలుస్తూ ఉంటుంది. కానీ లోకుల విషయంలో అవన్నీ కల్పనలు. ఇక్కడ మాత్రం పరమ సత్యాలు. ఎందుకంటే ఇక్కడి పసికూన పరమాత్మ కదా! కనుక అందరికిలాగానే అమ్మకు కూడా తండ్రి, దైవం, తపస్సుల ఫలమే. కులమంటే లోకాల సముదాయం. దానికి వెలుగును ప్రసాదించే దీపమే.
ప్రతిపదార్ధం:
నన్నున్ = నన్ను; కన్నతండ్రి = కన్నతండ్రి; నా = నా; పాలి = పాలిటి; దైవమా = దేవుడా; నా = నా యొక్క; తపః = తపస్సు యొక్క; ఫలంబ = ఫలితముగ కలిగిన వాడ; నా = నా యొక్క; కుమార = పుత్రుడ; నాదు = నా యొక్క; చిన్ని = చిన్న; వడుగ = బాలుడ; నా = నా యొక్క; కుల = వంశమును; దీపిక = ప్రకాశింప జేయు వాడ; రాగదు = రమ్ము; అయ్య = తండ్రి; భాగ్యరాశివి = పెన్నిధివి; అగుచున్ = అగుచు.
8-526 హరిహరి
సందర్భం:
మహావిష్ణువు సర్వసంపదలకు నిలయమైన మహాలక్ష్మికి భర్త. కానీ ఇప్పుడు చిల్లిగవ్వ కూడా లేని భిక్షుకుడై ఇంద్రునికోసం రాక్షసేంద్రుని దగ్గరకు బిచ్చమెత్తడానికి వెళ్ళాడు. దానిని శుకయోగీంద్రులు ఇలా సమర్థిస్తున్నారు.
కం. హరిహరి సిరియురమునగల,
హరి హరిహయు కొఱకు దనుజునడుగన్ జనియెన్
బరహిత రతమతియుతు లగు,
దొరలకు నడుగుటలు నొడలి తొడవులు పుడమిన్
తాత్పర్యం:
హరిహరీ! లక్ష్మీదేవిని వక్షఃస్థలంమీద నిలుపుకొన్న శ్రీహరి హరిహయుడైన ఇంద్రునికోసం ఒక రాక్షసుని దగ్గరకు బిచ్చమెత్తడానికి వెళ్ళాడు. ఇది ఎంత వింత! కాదులే! ఇతరులకు మేలు చేయటమే ఎల్లప్పుడు కోరిక అయిన దొరలకు ఇలా బిచ్చమెత్తటాలు దేహానికి అలంకారాలు అవుతాయి. దానిని ఒక లీలగా సంభావించి సంతోషించండి. భగవంతుడు ఏమి చేసినా అందులో ఆయన గొప్పతనమే తెలియవస్తుంది.
ప్రతిపదార్ధం:
హరిహరి = అయ్యయ్యో; సిరి = లక్ష్మీదేవి; ఉరమునన్ = వక్షస్థలమున; కల = కలిగిన; హరి = విష్ణుమూర్తి; హరిహయు = ఇంద్రుని; కొఱకున్ = కోసము; దనుజున్ = రాక్షసుని; అడుగన్ = అడుగుటకు; చనియెన్ = బయలు దేరెను; పర = ఇతరులకు; హిత = మేలు చేయుట యందు; రత = ప్రీతి కల; మతి = బుద్ధి; యుతుల = కల వారు; అగు = అయిన; దొరల్ = దొడ్డ బుద్ధి గల వారల; కున్ = కు; అడుగుటయున్ = యాచించుట కూడ; ఒడలి = దేహ; తోడవు = అలంకారము; అగున్ = అయి ఉండును; పుడమిన్ = లోకమునందు.
8-545 స్వస్తి జగత్త్రయీ
సందర్భం:
బలిచక్రవర్తి ఒక గొప్పయజ్ఞం చేస్తున్నాడు. హరి వామనుడై అవతరించి ఆ యజ్ఞశాలకు చేరుకున్నాడు. అతని బుడిబుడి నడకలు చూచేవారిని ఆనందసాగరంలో ముంచెత్తుతున్నాయి. చక్రవర్తిని చూచి పవిత్రము, అక్షతలు గల కుడిచేతిని ఎత్తి ఇలా ఆశీర్వదిస్తున్నాడు.
ఉ. స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు, హాసమాత్ర వి
ధ్వస్త నిలింపభర్తకు, నుదారపద వ్యవహర్తకున్, మునీం
ద్రస్తుత మంగళాధ్వర విధానవిహర్తకు, నిర్జరీ గళ
న్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు, దానవలోకభర్తకున్.
తాత్పర్యం:
మూడులోకాలకూ ఏలిక అయినవానికి, నవ్వినంత మాత్రాన దేవేంద్రుడంతవానిని కూడా రూపుమాపగల శక్తి నిండుగా ఉన్నవానికి, ఉదారుడు అనే పదంతో వ్యవహరింపదగినవానికి, మునివర్యుల స్తుతులతో కూడిన శుభప్రదమైన యజ్ఞవిధులలో ఎల్లవేళలా విహరించేవానికి, దేవకాంతల మెడలలోని మంగళసూత్రాలను తొలగించి వేసే పరాక్రమశాలికీ, రాక్షసలోకానికి పాలకుడైన వానికీ బలి మహాప్రభువునకు స్వస్తి.
ప్రతిపదార్ధం:
స్వస్తి = శుభ మగు గాక; జగత్రయీ = ముల్లోకములలోని; భువన = ప్రపంచములను; శాసన = పరిపాలించెడి; కర్త = అధికారి; కున్ = కి; హాస మాత్ర = అవలీలగా {హాస మాత్రము – నవ్వు ఒక్క దానితో, అవలీలగా}; విద్వస్త = వెలవెల పోగొట్ట బడిన; నిలింప భర్త = దేవేంద్రుడు కల వాని; కున్ = కి; ఉదార = ఉన్నత మైన; పద = పదవులలో; వ్యవహర్త = మెలగెడు వాని; కున్ = కి; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠులచే; స్తుత = కీర్తింప బడిన; మంగళ = శుభకర మైన; అధ్వర = యజ్ఞముల; విధాన = కార్య క్రమములలో; విహర్త = మెలగునాని; కున్ = కి; నిర్జర = దేవతల; గళ = మెడలో; న్యస్త = ఉన్నట్టి; సువర్ణ = బంగారు; సూత్ర = మంగళ సూత్రముల; పరిహర్త = తొలగించెడి వాని; కున్ = కి; దానవ = రాక్షసులు; లోక = అందరికి; భర్త = రాజు; కున్ = కి.
8-549 వడుగా
సందర్భం:
బలిచక్రవర్తి గొప్పదానశీలుడు. ఇప్పుడు తన దగ్గరకు వచ్చిన వాడు ముద్దులు మూటగడుతున్న మోహన బ్రహ్మచారి. అతడు తన గొప్పతనాన్ని గొప్ప మాటలతో పేర్కొని స్వస్తి వాచనం చేశాడు. దానికి ఆనందపడి ఇలా అంటున్నాడు.
మ. వడుగా! ఎవ్వరివాడ వెవ్వడవు? సంవాసస్థలంబెయ్యది
య్యెడకున్ నీవరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మమున్;
కడుధన్యాత్ముడనైతి నీమఖము యోగ్యంబయ్యె; నాకోరికల్
గడతేఱెన్; సుహుతంబులయ్యె శిఖులుం; కల్యాణ మిక్కాలమున్
తాత్పర్యం:
ఓ బ్రహ్మచారీ! నీ తల్లిదండ్రులెవ్వరు? నీవు ఎవడవు? నీవు ఉండే ఊరేది? ఇప్పుడు నీవు ఇక్కడకు రావటంవలన నా వంశమూ, నా పుట్టువూ పొందవలసిన ప్రయోజనాన్ని పొందాయి. నాయనా! నేను చాలా ధన్యాత్ముడనయ్యాను. నాయీ యజ్ఞం యోగ్యమై ఒప్పారుతున్నది. నా కోరికలన్నీ తీరినవి. నా అగ్నిహోత్రాలు విశిష్టమైన హోమద్రవ్యాలతో, ఏ జారుపాటూలేని మంత్రతంత్రాలతో వెలుగొందుతున్నాయి. నేను కోరుకొనే శుభాలను అనుగ్రహించే మంచికాలం ఇది.
ప్రతిపదార్ధం:
వడుగా = బ్రహ్మచారి; ఎవ్వరి వాడవు = ఎవరి పిల్ల వాడవు; ఎవరవు = ఎవరివి నీవు; సంవాస = ఉండెడి; స్థలంబు = చోటు; ఎయ్యది = ఏది; ఇయ్యెడకున్ = ఇక్కడకు; నీవు = నీవు; అరుదెంచుటన్ = వచ్చుట చేత; సఫలము = సార్థకము; అయ్యెన్ = అయినది; వంశమున్ = (నా) వంశము; జన్మమున్ = పుట్టుక; కడు = మిక్కలి; ధన్యాత్ముడను = పుణ్యాత్ముడను; ఐతిన్ = అయ్యాను; ఈ = ఈ యొక్క; మఖమున్ = యాగము; యోగ్యంబు = పవిత్ర మైనది; అయ్యెన్ = అయినది; నా = నా యొక్క; కోరికల్ = మనోవాంఛితములు; కడతేరెన్ = తీరిపోయినవి; సుహుతంబులు = చక్కగా కాలు తున్నవి; అయ్యెన్ = అయినవి; శిఖులున్ = అగ్నులు; కల్యాణము = మిక్కలి శుభ దాయకము; ఈ = ఈ; కాలమున్ = సమయము.
8-550 వరచేలంబులొ
సందర్భం:
తన ధన్యతను మేలైన ఉదాత్త వాక్యాలలో ప్రకటించి ఆ బ్రహ్మచారి తననుండి ఏదైనా దక్షిణగా గ్రహించి మరింత ధన్యుణ్ణి చేయాలనే కోరికతో బలిచక్రవర్తి ఇలా అంటున్నాడు.
మ. వరచేలంబులొ, మాడలో, ఫలములో, వన్యం బులో, గోవులో,
హరులో, రత్మములో, రథంబులొ, విమృష్టాన్నంబులో, కన్యలో,
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీఖండమొ, కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా!
తాత్పర్యం:
బ్రాహ్మణవరేణ్యా! నీవు కోరినది సమర్పించుకొని నేను యాగఫలం పొందుతాను. అడుగు. మేలుజాతి వస్త్రాలు కావాలా? బంగారు నాణేలు ఇత్తునా? రుచికరములైన పండ్లు ఇవ్వమంటావా? అడవులలో లభించే పుట్టతేనె వంటివి కోరుకుంటావా? ఆవులను అడుగుతావా? గుఱ్ఱాలా? రత్నాలా? రథాలా? పంచభక్ష్యపరమాన్నాలతో కూడిన భోజనాలా? కన్యలా? ఏనుగులా? బంగారమా? గొప్ప భవనాలా? అగ్రహారాలా? భూములా? లేక నేను పరిపాలించే రాజ్యంలో భాగమా? ఇంకా నేను పేర్కొనని ఏది అయినా అడుగు. నేను ఆనందంతో ఇస్తాను.
ప్రతిపదార్ధం:
వర = మంచి; చేలంబులో = బట్టలుకాని; మాడలో = సువర్ణ నాణెములుకాని {మాడ - అరవరహా, ఒక సువర్ణనాణెము}; ఫలములో = పళ్ళుకాని; వన్యంబులో = వనములుకాని; గోవులో = ఆవులుకాని; హరులో = గుఱ్ఱములుకాని; రత్నములో = మణులుకాని; రథంబులో = రథములుకాని; విమృష్టాన్నంబులో = మంచిఆహారములుకాని; కన్యలో = స్త్రీలుకాని; కరులు = ఏనుగులుకాని; కాంచనమో = బంగారముకాని; నికేతనములో = ఇళ్శుకాని; గ్రామంబులో = ఊళ్ళుకాని; భూములో = పొలములుకాని; ధరణీఖండమో = భూభాగముకాని; కాక = కాకపోతే; ఏమి = ఏది; అడిగెదో = అడిగెదవు; ధాత్రీసుర = బ్రాహ్మణ; ఇంద్ర = శ్రేష్ఠులలో; ఉత్తమా = ఉత్తముడా.
8-552 ఇది నాకు నెలవని
సందర్భం:
బలిచక్రవర్తి మాటలన్నీ విన్నాడు మాయ బ్రహ్మచారి. పైకి దిక్కుమాలినవాడనే భావన కలిగే విధంగానూ, లోపల దేవదేవుడైన పరమాత్మ అనే అర్థం స్ఫురించే విధంగానూ ఇలా తన తత్త్వాన్ని తెలియజేస్తున్నాడు.
సీ. ఇది నాకు నెలవని యేరీతి బలుకుదు ఒకచోటనక ఎందునుండనేర్తు
ఎవ్వనివాడ నంచేమని పలకుదు నా యంతవాడనై నడవనేర్తు
ఈ నడవడి యని యెట్లు వక్కాణింతు పూని ముప్పోకల పోవనేర్తు
అదినేర్తు నిదినేర్తు నని యేల చెప్పంగ నేరుపు లన్నియు నేన నేర్తు
ఆ. ఒరులు గారు నాకు నొరులకు నేనౌదు;
నొంటివాడ; చుట్టమొకడు లేడు
సిరియు తొల్లి గలదు; చెప్పెద నాటెంకి;
సుజనులందు తఱచు చొచ్చియుందు.
తాత్పర్యం:
ఓ చక్రవర్తీ! ఇది నేనుండే చోటు అని ఎలా చెప్పగలనయ్యా! ఒకచోటు అని కాకుండా అన్నిచోట్లా ఉండగలుగుతాను. ఎవ్వరివాడవు అని అడిగావు కదా! దానికి బదులుపలకటం సాధ్యంకాదు. ఎందుకంటే నేను సర్వతంత్ర స్వతంత్రుడను. నీ నడవడి ఎటువంటిది అంటే ఏమి చెప్పను? నా సంకల్పంతో నేను మూడు పోకలు పోతూ ఉంటాను. అవి నేలమీదా, నింగిలోనూ, నీటిపైనా కావచ్చు. ఏ విద్యలు నేర్చుకున్నావు అంటావనుకో అన్ని విద్యలూ నాలో అద్భుతంగా అలరారుతున్నాయి. నాకెవరూ ఏమీకారు. కానీ నేనందరికీ అన్నీ అవుతాను. నేను ఏకాకిని. చుట్టం ఒక్కడు కూడా లేడు. సంపద వెనక ఉండేదిలే! అడిగావు కనుక నా నెలవు చెబుతాను. సాధారణంగా మంచివారిలో కలసిమెలసి ఉంటాను.
ప్రతిపదార్ధం:
ఇది = దీనిని; నా = నా; కున్ = కు; నెలవు = నివాసము; అని = అని; ఏ = ఏ; రీతిన్ = విధముగా; పలుకుదు = చెప్పెగలను; ఒక = ప్రత్యేకముగ ఒక; చోటు = ప్రదేశము; అనకన్ = అనకుండ; ఎందున్ = ఎక్కడైనను; ఉండనేర్తున్ = ఉండగలను; ఎవ్వని = ఎవరికిచెందిన; వాడన్ = వాడిని; అంచున్ = అనుచు; ఏమి = ఏమి; అని = అని; నుడువుదున్ = చెప్పెగలను; నా = నా; అంతవాడను = అంతవాడినినేనే; ఐ = అయ్యి; నడవనేర్తు = స్వేచ్చగావర్తించెదను; ఈ = ఇలాంటి; నడవడి = వర్తన కలవాడను; అని = అని; ఎట్లు = ఎలా; వక్కాణింతున్ = చెప్పగలను; పూని = ధృతితో; ముప్పోకలన్ = మూడు పోకడలు, పెక్కు త్రోవలను {ముప్పోకలు - మూడుపోకడలు, 1 సత్త్వగుణము 2 రజగుణము 3 తమోగుణములుకల మూడువిధములు, 1 శ్రవణ 2 అధ్యయన 3 ఉపన్యాస అనెడి మూడు విద్యలు, 1 ముందుకు 2 వెనుకుక 3 పక్కలకు అనెడి మూడు గమనములు}; పోవనేర్తు = వెళ్ళగలను; అది = అది; నేర్తున్ = తెలుసును; ఇది = ఇది; నేర్తున్ = తెలుసును; అని = అని; ఏల = ఎందుకు; చెప్పంగన్ = చెప్పడము; నేరుపులు = విద్యలు; అన్నియున్ = అన్ని; నేన = నేను; నేర్తున్ = తెలుసుకున్నాను; ఒరులు = ఇతరులు; కారు = ఏమీకారు.
నా = నా; కున్ = కు; ఒరుల = ఇతరుల; కున్ = కు; నేన్ = నేను; ఔదు = ఉపయోగపడెదను; ఒంటి = ఒంటరి, అనితరమైన; వాడన్ = వాడిని; చుట్టము = బంధువు; ఒకడు = ఒక్కడుకూడ; లేడు = లేడు; సిరియున్ = లక్ష్మీదేవి, సంపద; తొల్లి = ఇంతకుముందు; కలదు = ఉన్నది; చెప్పెదన్ = తెలియచెప్పెదను; నా = నా యొక్క; టెంకి = నివాసము; సుజనులు = మంచివారి, పుణ్యాత్ముల; అందున్ = లో, ఎడల; తఱచు = ఎక్కువగా, ఎక్కువమార్లు; చొచ్చి = కూడి, చొరవకలిగి; ఉందున్ = ఉంటాను.
8-566 ఒంటివాడ
సందర్భం:
నీవు ఏది కావాలంటే అది ఇస్తాను అంటున్నాడు బలిచక్రవర్తి. వచ్చినవాడు ఏ కోరికలూ లేని పూర్ణకాముడని తెలియదు. ఆయనకు తగినట్లుగానే బదులు పలుకుతున్నాడు పరమాత్ముడైన వామనమూర్తి.
ఆ. ఒంటివాడ; నాకు నొకటి రెం డడుగుల
మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల
కోర్కెదీర బ్రహ్మకూకటి ముట్టెద
దానకుతుకసాంద్ర! దానవేంద్ర!
తాత్పర్యం:
దానాలు చేయాలనే ఉబలాటం గుండెనిండా ఉన్న ఓ రాక్షసరాజా! నేను ఒంటరివాడను. ఒకటి, రెండడుగుల నేల చాలు నాకు. ఇవ్వు. సొమ్ములూ, కొమ్మలూ నాకు అక్కరలేదు. ఆ మూడడుగుల కోరిక తీరిందనుకో. దానితో బ్రహ్మదేవుని జుట్టు ముడిని ముట్టినంతగా సంబరపడిపోతాను.
భగవంతుడు ఒక్కడే. భగవంతుళ్ళు లేరు. ఆయన అనంతుడు. ఇప్పుడు బలిచక్రవర్తిని ఉద్ధరించటానికి మూడడుగుల నేల కావాలి. బ్రహ్మకూకటిని త్రివిక్రమమూర్తియై ఎలాగూ తాకుతాడు అని పరమాత్మ లక్షణాన్ని సూచనగా తెలియజేస్తున్నాడు.
ప్రతిపదార్ధం:
ఒంటివాడన్ = ఒక్కడను; నా = నా; కున్ = కు; ఒకటి రెండు = మూడు (3); అడుగుల = అడుగుల; మేర = కొలత కల భూమి; ఇమ్ము = ఇమ్ము; సొమ్ము = సంపదలు; మేర = ఎల్లను; ఒల్ల = అంగీకరించను; కోర్కిన్ = కోరిక; తీరన్ = తీరినచో; బ్రహ్మ కూకటి ముట్టెదన్ = మిక్కిలి సంతోషించెదను {బ్రహ్మ కూకటి ముట్టెదను - బ్రహ్మయొక్క జుట్టును అందు కొనెదను, మహానంద పడెదను}; దాన = దానము చేసెడి; కుతుక = కుతూహలము; సాంద్ర = అధికముగా కలవాడ; దానవేంద్ర = రాక్షసరాజా.
8-569 వసుధాఖండము
సందర్భం:
బలిచక్రవర్తికి వామనుని పలుకులు వింతగా తోచాయి. ఇలా అన్నాడు - ఓ మహానుభావా! నీవన్న మాటలన్నీ నిజాలే. కానీ ఇంతకొంచెమా అడగటం!? దాత పెంపునైనా తలపవద్దా, ఇదిగో చూడు.
మ. వసుధాఖండము వేడితో, గజములన్ వాంఛించితో, వాజులన్
వెస నూహించితొ, కోరితో యువతులన్, వీక్షించి కాంక్షించితో
పసిబాలుండవు, నేర వీ వడుగ, నీ భాగ్యంబు లీపాటిగా
నసురేంద్రుండు పదత్రయం బడుగ నీ యల్పంబు నీనేర్చునే.
తాత్పర్యం:
ఓ బ్రహ్మచారీ! నేనేలే భూభాగంలో కొంతభాగమైనా కోరరాదా? ఏనుగులనూ, గుఱ్ఱాలనూ అడుగవచ్చు కదా! అందచందాలతో మంచి వయస్సులో ఉన్న కాంతలను ఇమ్మంటే ఇవ్వనా? పాపం పసివాడవు. ఏమి కోరుకోవాలో నీకు తెలియదు. నీ భాగ్యాలు ఈ మాత్రానివి అయినంత మాత్రాన మూడడుగుల నేలను ఇవ్వటానికి రాక్షస చక్రవర్తికి మనస్సు ఒప్పుతుందా?
ప్రతిపదార్ధం:
వసుధాఖండము = భూభాగమును; వేడితో = అడుగుట కాని; గజములన్ = ఏనుగులను; వాంఛించితో = కోరుట కాని; వాజులన్ = గుర్రములను; వెసన్ = మిక్కిలి; ఊహించితో = అనుకొనుట కాని; కోరితో = కావాలనుట కాని; యువతులన్ = జవరాండ్రను; వీక్షించి = చూసి; కాంక్షించితో = కోరుట కాని; పసి = బాగా చిన్న; బాలుండవు = పిల్ల వాడవు; నేరవు = తెలియని వాడవు; అడుగ = అడుగుట; నీ = నీ యొక్క; భాగ్యంబుల్ = అదృష్టములు; ఈపాటి = ఈ మాత్రమే; కాక = అయినప్పటికిని; అసురేంద్రుండు = రాక్షస చక్రవర్తి; పదత్రయంబు = మూడడుగులే; అడుగన్ = అడిగె నని; ఈ = ఇంత; అల్పంబున్ = కొంచమును; ఈన్ = ఇచ్చుట; నేర్చునే = చేయ కలడా.
8-571 గొడుగో జన్నిదమో
సందర్భం:
బలిచక్రవర్తి తన దాన సామర్థ్యానికి తగినట్లు ఇవ్వగలవానికి సంబంధించిన పట్టికను ఏకరువుపెట్టాడు. కానీ పొట్టి వడుగు సుకుమారంగా తనకు ఏది కావాలో ఆ పట్టికను మాత్రమే ఆయన విప్పుతున్నాడు.
మ. గొడుగో జన్నిదమో కమండలువొ నాకున్ ముంజియో దండమో,
వడుగేనెక్కడ? భూములెక్కడ? కరుల్ వామాక్షులశ్వంబు లె
క్కడ? నిత్యోచితకర్మమెక్కడ? మదాకాంక్షామితంబైన మూ
డడుగుల్ మేరయు త్రోవ కిచ్చుటయ బ్రహ్మాండంబు నాపాలికిన్.
తాత్పర్యం:
మహారాజా! నేను కోరదగినవి చాలా చిన్నవస్తువులు అయినటువంటి గొడుగో, జన్నిదమో, కమండలమో, దర్భల మొలత్రాడో, మోదుగ దండమో వంటివి మాత్రమే. బ్రహ్మచారినైన నాకు భూములతో, ఏనుగులతో, సుందరాంగులతో, గుఱ్ఱాలతో పని ఏమున్నదయ్యా! నేను ప్రతిదినము శ్రద్ధతో చేసుకొనే సంధ్యావందనం మొదలైన పనులకు నీవు చెప్పినవి ఏవీ ఉపయోగపడవుకదా! కాబట్టి నా కోరికకు లోబడి ఉన్న మూడడుగుల నేలను కాదనకుండా ఇవ్వటమే నాపాలిట బ్రహ్మాండం ఇచ్చినట్లు.
ప్రతిపదార్ధం:
గొడుగొ = గొడుగు కాని; జన్నిదమో = జంధ్యము కాని; కమండులువో = కమండలము కాని; నా = నా; కున్ = కు; ముంజియో = మొలత్రాడు కాని; దండమో = యోగదండము కాని; వడుగున్ = బ్రహ్మచారిని; ఏన్ = నేను; ఎక్కడ = ఎక్కడ; భూములు = భూభాగములు; ఎక్కడ = ఎక్కడ; కరుల్ = ఏనుగులు; వామాక్షులు = జవరాండ్రు; అశ్వంబులున్ = గుర్రములు; ఎక్కడ = ఎక్కడ; నిత్యోచిత కర్మము = నిత్య కృత్యములు; ఎక్కడ = ఎక్కడ; మత్ = నా చేత; కాంక్షితంబు = కోరబడినది; ఐన = అయిన; మూడు = మూడు (3); అడుగుల్ = అడుగుల; మేరయ = పాటిది; త్రోవకన్ = కాదనక; ఇచ్చుట = దానము చేయుట; అది = అదే; బ్రహ్మాండంబు = బ్రహ్మాండము; నా = నా; పాలికిన్ = పాలిటికి, మట్టుకు.
8-574 ఆశాపాశము
సందర్భం:
ఇంకా వామనుడు ఇలా అంటున్నాడు - ఇవ్వగలిగినవాడు ఇస్తున్నకొద్దీ పుచ్చుకొనే వానికి ఆశ పెరుగుతూనే ఉంటుంది. ఆ మాయరోగానికి మందు ఉన్నదా అనిపిస్తుంది.
శా. ఆశాపాశము దా గడు న్నిడుపు; లే దంతంబు రాజేంద్ర!; వా
రాశిప్రావృత మేదినీవలయ సామ్రాజ్యంబు చేకూడియుం
గాసిం బొందిరి గాక వైన్య గయ భూకాంతాదులు న్నర్థకా
మాశన్ బాయగనేర్చిరే మును; నిజాశాంతంబులం జూచిరే.
తాత్పర్యం:
రాజా! ఆశ అనేది ఒక మహాపాశం. అది చాలాచాలా పొడవైనది. దానికి అంతంలేదు. సముద్రాలు చుట్టుకొన్న భూవలయ సామ్రాజ్యం చేతికి చిక్కినా పృథువు, గయుడు మొదలైన రాజులు ఆశను చంపుకోలేక తామే నాశనమయ్యారు కానీ అర్థకామాలమీది ఆశను వదలగలిగారా? ఆశకు అంతం చూడగలిగారా?
ప్రతిపదార్ధం:
ఆశా = ఆశ యనెడి; పాశంబు = తాడు; తాన్ = అది; కడున్ = మిక్కిలి; నిడుపు = పొడ వైనది; లేదు = లేదు; అంతంబు = అంతు; రాజేంద్రా = చక్రవర్తి; వారాశి = సముద్రముచే {వారాశి – నీటికి కుప్ప, కడలి}; ప్రావృత = చుట్టబడిన; మేదినీ = భూ; వలయ = మండల; సామ్రాజ్యంబున్ = సామ్రాజ్యములు; చేకుడియున్ = సమకూరి నప్పటికి; కాసిన్ = శ్రమను; పొందిరి = పడిరి; కాక = కావచ్చు కాని; వైన్య = పృథుడు; గయ = గయుడు యనెడి; భూకాంతులున్ = చక్రవర్తులు కూడ; అర్థ = సంపదల పైన; కామ = కామముల పైన; ఆశన్ = ఆశను; పాయగన్ = వదలుట; నేర్చిరే = చేయ గలిగిరా, లేదు; మును = ఇంతకుముందు; నిజ = తమ; ఆశ = ఆశలకు; అంతంబున్ = అంతును; చూచిరే = కనుగొనగలిగిరా, లేదు.
8-577 దనుజేంద్ర
సందర్భం:
బాలుడు తన ప్రలోభాలకు ఏ మాత్రం తల ఒగ్గే తీరులో లేడు. మహాదానం ఇవ్వలేకపోతున్నాననే దిగులు బలిచక్రవర్తికి మనస్సులో ఉన్నా అడిగినది ఇచ్చి తృప్తి పడదామనుకొని దానమివ్వటానికి పూనుకున్నాడు. అప్పుడు గురువర్యులు శుక్రాచార్యులవారు ఇలా అంటున్నారు -
సీ. దనుజేంద్ర! యీతడు ధరణీసురుడు గాడు; దేవకార్యంబు సాధించుకొఱకు
హరి విష్ణు డవ్యయుం డదితిగర్భంబున గశ్యపసూను డై గలిగె; నకట
యెఱుగ వీతనికోర్కె; నిచ్చెద నంటివి; దైత్యసంతతి కుపద్రవము వచ్చు;
నీ లక్ష్మి తేజంబు నెలవు నైశ్వర్యంబు వంచించి యిచ్చును వాసవునకు;
ఆ. మొనసి జగములెల్ల మూడుపాదంబుల నఖిలకాయు డగుచు నాక్రమించు
సర్వధనము విష్ణుసంతర్పణము చేసి బడుగుపగిది యెట్లు బ్రదికె దీవు
తాత్పర్యం:
రాక్షస చక్రవర్తీ! ఈ వచ్చినవాడు బ్రాహ్మణ బాలకుడు కాడు. దేవతలపని చక్కబెట్టటానికి వచ్చిన శ్రీమహావిష్ణువు. అవ్యయుడు. ఎట్టి మార్పులూ ఎగుడు దిగుళ్ళూ లేనివాడైనా తన పూనికతో అదితి కడుపులో కశ్యప ప్రజాపతి కుమారుడై అవతరించిన మహాత్ముడు. అతని మహిమ తెలియక కోరిక తీరుస్తానంటున్నావు. నీ నిర్ణయంవలన మన రాక్షస కులమంతా నాశనం అయిపోతుంది. నీ సంపదను, నీ తేజస్సును, నీ స్థానాన్నీ, నీ ప్రభుత్వ మహిమను కపటమార్గంలో కొల్లగొట్టి యింద్రునికి ధారపోస్తాడు. మూడు అడుగులతో లోకాలనన్నింటిని హద్దూపద్దూలేని దేహంతో ఆక్రమిస్తాడు. నీకున్న ధనం మొత్తంగా విష్ణువునకు సంతర్పణ చేసి పరమ దరిద్రుడవై ఎలా బ్రతుకుతావయ్యా?
ప్రతిపదార్ధం:
దనుజేంద్ర = రాక్షస చక్రవర్తి; ఈతడు = ఇతగాడు; ధరణీసురుడు = బ్రాహ్మణుడు; కాడు = కాడు; దేవ = దేవతల; కార్యంబు = పని; సాధించు = సాధించుట; కొఱకు = కోసము; హరి = నారాయణుడు; విష్ణుడు = నారాయణుడు; అవ్యయుండు = నారాయణుడు; అదితి = అదితి యొక్క; గర్భంబునన్ = కడుపులో; కశ్యప = కశ్యపుని యొక్క; సూనుడు = పుత్రుడు; ఐ = అయ్యి; కలిగెన్ = పుట్టెను; అకట = అయ్యో; ఎఱుగవు = నీకు తెలియదు; ఈతని = ఇతని యొక్క; కోర్కిన్ = కోరికను; ఇచ్చెదన్ = ఇస్తాను; అంటివి = అన్నావు; దైత్య = రాక్షస; సంతతి = కులమున; కున్ = కు; ఉపద్రవము = పెను ముప్పు; వచ్చున్ = వచ్చును; నీ = నీ యొక్క; లక్ష్మిన్ = సంపదలను; తేజంబున్ = తేజస్సును; నెలవున్ = స్థానమును; ఐశ్వర్యంబున్ = ఐశ్వర్యమును; వంచించి = దొంగిలించి; ఇచ్చున్ = ఇచ్చును; తాన్ = అతడు; వాసవున్ = ఇంద్రుని; కు = కి.
మొనసి = వ్యూహము పన్ని; జగములు = లోకములు; ఎల్లన్ = అన్నిటిని; మూడు = మూడు (3); పాదంబులన్ = అడుగుల తోటి; అఖిల కాయుడు = విశ్వ రూపుడు; అగుచున్ = అగుచు; ఆక్రమించున్ = అలము కొనును; సర్వ = సమస్త మైన; ధనమున్ = సంపదలను; విష్ణు = నారాయణునికి; సంతర్పణము = అప్పజెప్పుట; చేసి = చేసి; బడుగు = బీద వాని; పగిదిన్ = వలె; ఎట్లు = ఎలా; బ్రతికెదవు = జీవించ గలవు; ఈవు = నీవు.
8-584 వారిజాక్షులందు
సందర్భం:
శుక్రాచార్యుల వారు ఇంకా ఇలా అంటున్నారు - ఇస్తాను అని మాట ఇచ్చాను. ఇప్పుడు ఇవ్వను అనటం బొంకు అవదూ! పలికి బొంకేవాడు పాపాత్ముడంటున్నాయి ధర్మశాస్త్రాలు. ఆ పాపం మూట ఎలాకట్టుకోను అంటావేమో, విను -
ఆ. వారిజాక్షులందు, వై వాహికములందు,
ప్రాణ విత్త మాన భంగమందు,
చకిత గోకులాగ్రజన్మ రక్షణమందు
బొంకవచ్చు; నఘము పొంద దధిప!
తాత్పర్యం:
రాజేంద్రా! స్త్రీల విషయంలోనూ, వివాహ వ్యవహారాలలోను, ప్రాణభంగం, విత్తభంగం, మానభంగం సంభవించినప్పుడూ, భయపడిన ఆలమందలను, బ్రాహ్మణులను రక్షించవలసిన సందర్భాలలోను బొంకవచ్చు. దానివలన పాపం కలుగదు అని రాక్షస గురువైన శుక్రాచార్యులవారు, రాక్షసరాజైన బలిచక్రవర్తికి బోధించారు.
ప్రతిపదార్ధం:
వారిజాక్షుల = ఆడవారివిషయము {వారి జాక్షులు - వారిజ (పద్మముల)వంటి అక్షులు (కన్నులు కల వారు), స్త్రీలు}; అందున్ = లోను; వైవాహికములు = పెండ్లికి సంబంధించిన వాని; అందున్ = లోను; ప్రాణ = ప్రాణములు; విత్త = ధనములు; మాన = గౌరవము; భంగము = పోయెడి సందర్భముల; అందున్ = లోను; చకిత = భీతిల్లిన; గో = గోవుల; కుల = సమూహములను; అగ్రజన్మ = బ్రాహ్మణులను; రక్షణము = కాపాడుట; అందున్ = లోను; బొంక వచ్చు = అబద్ద మాడ వచ్చును; అఘము = పాపము; పొందదు = అంటదు; అధిప = రాజా.
8-589 కారే రాజులు
సందర్భం:
శుక్రాచార్యులవారు శిష్యవాత్సల్యంతో బలిచక్రవర్తిని కాపాడాలని హితం చెప్పినా బలికి మాత్రం లౌకికమైన హితంమీద చూపులేదు. అతడు కోరుకొనేది పారమార్థిక హితం. గురువుమీది గౌరవానికి భంగంలేకుండా తన అభిప్రాయాన్ని గట్టిగా తెలియజేస్తున్నాడు.
శా. కారే రాజులు, రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిం బొందరే
వా రేరీ? సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై
పే రై నం గలదే శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాము లై
యీరే కోర్కులు; వారలన్ మఱచిరే యి క్కాలమున్ భార్గవా!
తాత్పర్యం:
పరమపవిత్రమైన భృగువంశంలో పుట్టిన పూజ్య గురుదేవా! మనకు ముందు ఎందరు రాజులు కాలేదు. ఎన్ని రాజ్యాలు లేవు? మేము సార్వభౌములము అని పొగరు సోపానాల చివరిదాకా వారు పోలేదా? వారేరీ? కీర్తిసంపద తప్ప వారు సంపాదించిన ధనాన్ని మూటగట్టుకొని పోగలిగారా? భూమిమీద పేరైనా నిలుపుకోగలిగారా? ఆర్తిని అందలం ఎక్కించే ఐశ్వర్యాన్ని అణుమాత్రమైనా అభిలషించని శిబి మొదలైన మహాత్ములు, ఏమికోరినా, ఎంతకోరినా ఎంతో ఇష్టంతో ఇచ్చారు. చిరంజీవులై వెలుగొందుతున్నారు. ఎన్నియుగాలు గడచినా వారిని మానవులు మఱచిపోయారా?
ప్రతిపదార్ధం:
కారే = కలుగరా; రాజులు = రాజులు; రాజ్యముల్ = రాజ్యములు; కలుగవే = పొంద లేదా ఏమి; గర్వ = అహంకారముతో; ఉన్నతిన్ = విర్రవీగుటను; పొందరే = చెంద లేదా ఏమి; వారు = వా ళ్ళందరు; ఏరి = ఎక్కడ ఉన్నారు; సిరిని = సంపదలను; మూట గట్టుకొని = కూడ గొట్టుకొని; పోవం జాలిరే = తీసుకెళ్ళ గలిగిరా, లేదు; భూమిపై = నేల పైన; పే రైనన్ = కనీసము పే రైన; కలదే = ఉన్నదా, లేదు; శిబి = శిబి చక్రవర్తి; ప్రముఖులున్ = మొదలగు వారు; ప్రీతిన్ = కోరి; యశః = కీర్తి; కాములు = కోరు వారు; ఐ = అయ్యి; ఈరే = ఇవ్వలేదా; కోర్కులు = దానములను; వారలన్ = వారిని; మఱచిరే = మరచిపోయారా, లేదు; ఈ = ఇప్పటి; కాలమున్ = కాలము నందును; భార్గవా = శుక్రాచార్యుడా {భార్గవుడు - భృగువు పుత్రుడు, శుక్రుడు}.
8-591ఆదిన్ శ్రీసతి
సందర్భం:
ఇంకా బలిచక్రవర్తి ఇలా అంటున్నాడు - మహానుభావా! అడుగుతున్నవాడు అచ్యుతుడు. అన్ని లోకాలకూ ఆవలిభాగంలో అనంతంగా అలరారే ఆస్వామి పొట్టివాడై కోరి నా దగ్గరికి వచ్చి మరీ అడుగుతున్నాడు. నావంటివాడు ఇవ్వకపోవటం ధర్మం కాదే! అయినా నా భాగ్యం ఎంత గొప్పదో గమనించండి.
శా. ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, అంసోత్తరీయంబుపై
పాదాబ్జంబులపై, గపోలతటిపై, పాలిండ్లపై నూత్న మ
ర్యాదం జెందు కరంబు క్రిం దగుట, మీదై నాకరంబుంట మే
ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే.
తాత్పర్యం:
ఆ శ్రీమహావిష్ణువు చేయి మొట్టమొదట మహాలక్ష్మీదేవి కొప్పుమీద వివాహ సమయంలో జీలకర్రా బెల్లం పెట్టినప్పుడు నిలిచి ఉన్నది. తరువాత ఆమె సువర్ణమయ దేహాన్నంతటినీ సుకుమారంగా స్పృశించింది. కొన్ని సందర్భాలలో భుజంమీది ఉత్తరీయం అంచులను సవరించింది. మఱికొన్ని వేళలలో పద్మాలవంటి పాదాలను పరామర్శించింది. చెక్కిళ్ళపై చిందులాడింది. పాలిండ్ల మీద పారవశ్యంతో ప్రేమవెల్లువతో కదలాడింది. ఆ మర్యాదలన్నీ ఎప్పటికప్పుడు క్రొత్తక్రొత్త అనుభూతులను స్వామికి కలిగించినట్టివే. అటువంటి భాగ్యసంపదగల ఆస్వామి చేయి క్రిందుగా ఉండటమూ, నాచేయి పైన ఉండటమూనా! ఆహా! ఎంత మహాభాగ్యమయ్యా! ఈ రాజ్యమూ గీజ్యమూ ఏ క్షణంలో ఉంటుందో, ఏ క్షణంలో ఊడుతుందో తెలియదు. దేనిని నమ్ముకొని మనం ఏదో బాముకుందామనుకుంటున్నామో ఆ ఈ దేహం కూడ అనుక్షణం అపాయంతో అలమటించేదే కదయ్యా! ఈ దౌర్భాగ్యంకోసం అంతటి మహాభాగ్యాన్ని చేజార్చుకొనే అవివేకి ఎవడైనా ఉంటాడా?
ప్రతిపదార్ధం:
ఆదిన్ = ముందుగా; శ్రీసతి = లక్ష్మీదేవి; కొప్పు = జుట్టుముడి; పైనన్ = మీద; తనువు = వంటి; పైన్ = మీద; అంసోత్తరీయంబు = పైట; పైన్ = మీద; పాద = పాదములు యనెడి; అబ్జంబుల = పద్మముల; పైన్ = మీద; కపోలతటి = చెక్కిళ్ళ; పైన్ = మీద; పాలిండ్ల = స్తనముల; పైన్ = మీద; నూత్న = సర కొత్త; మర్యాదన్ = గౌరవమును; చెందు = పొందెడి; కరంబు = చేయి; క్రింద = కింద ఉన్నది; అగుట = అగుట; మీద = పైన ఉన్నది; ఐ = అయ్యి; నా = నా యొక్క; కరంబున్ = చేయి; ఉంటన్ = ఉండుట; మేల్ = గొప్ప; కాదే = కాదా ఏమిటి; రాజ్యమున్ = రాజ్యము; గీజ్యమున్ = గీజ్యము; సతతమే = శాశ్వతమా, కాదు; కాయంబు = దేహము; నాపాయమే = చెడిపోనిదా, కాదు.
8-595 ఎన్నడుం పరు
సందర్భం:
ఇంకా బలిచక్రవర్తి శుక్రాచార్యులవారితో ఇలా అంటున్నాడు- గురుదేవా! మరొక్క మనవి చేసుకుంటాను. బిచ్చమెత్తటానికి ఎందరో వచ్చిపోతూ ఉంటారు. కానీ ఈ గుజ్జు వడుగును చూడు అతడడిగినది యివ్వక పంపివేయటం నాకు సాధ్యమయ్యే పనికాదు – ఎందుకంటే -
మ.కో. ఎన్నడుం పరు వేడబోడట; యేకలం బట; కన్నవా
రన్నదమ్ములు నై న లేరట; యన్నివిద్యల మూలగో
ష్ఠి న్నెఱింగిన ప్రోడగు జ్జట చేతు లొగ్గి వసింప నీ
చిన్ని పాపని ద్రోసిపుచ్చగ చిత్త మొల్లదు సత్తమా!
తాత్పర్యం:
ఏ సమయంలోనూ ఇతరులను వేడుకోవటానికి పోయినవాడు కాడట! తోడూనీడా ఎవరూ లేనివాడట! కన్నతల్లిదండ్రులు గానీ తోడబుట్టువులు గానీ ఎవ్వరూ లేరట! పరమాత్మను తెలిపే సర్వవిద్యల మూలరహస్యాలను నిండుగా తెలిసిన ప్రౌఢబాలుడట! భిక్షాందేహి అని చేతులు జోడించి ఎదురుగా నిలిచిఉన్నాడు. ఇట్టి చిన్నిపాపని త్రోసివేయటానికి మనస్సు అంగీకరించటం లేదు, గురుదేవా!
ప్రతిపదార్ధం:
ఎన్నడున్ = ఎప్పుడు; పరున్ = ఇతరులను; వేడన్ = అడుగుటకు; పోడు = వెళ్ళడు; అటన్ = అట; ఏకలంబు = ఒంటరి, అసహాయుడు; అట = అట; కన్న వారు = తల్లిదండ్రులు; అన్నదమ్ములు = సోదరులు; ఐనన్ = అయినను; లేరు = లేరు; అటన్ = అట; అన్ని = సర్వ; విద్యలన్ = విద్యల యొక్క; మూలగోష్ఠి = ముఖ్య సారాంశమును; ఎఱింగిన = తెలిసిన; ప్రోడగుజ్జు = బహు నేర్పరి; అటన్ = అట; చేతులు = చేతులు; ఒగ్గి = చాచి; వసింపన్ = ఉండగా; ఈ = ఈ; చిన్ని పాపనిన్ = పసి వానిని; త్రోసిపుచ్చగన్ = గెంటివేయుటకు; చిత్తము = మనసు; ఒల్లదు = ఒప్పుట లేదు; సత్తమా = సమర్థుడా.
8-620 ఇంతిం తై
సందర్భం:
బలిచక్రవర్తి గురుదేవుని ఒప్పించి మూడడుగుల నేలను ధారాపూర్వకంగా దానం ఇచ్చివేశాడు. వచ్చిన పనిని చక్కబెట్టటానికి వామనదేవుడు పెరిగిపోతున్నాడు. ఆ పెంపును పోతనగారి అక్షర చిత్రంలో దర్శించి ఆనందిద్దాం -
శా. ఇంతిం తై వటుడింతయై మఱియు దా నింతై నభోవీథిపై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధి యై.
తాత్పర్యం:
మొదట ఇంతగా ఉన్న ఆ బ్రహ్మచారి మరింతగా పెరిగాడు. ఇంకా పెంపొందాడు. నేలబారు జీవులు తలలు బాగాపైకి ఎత్తుకొని చూడవలసినంతగా ఆకాశమార్గంలోనికి చొచ్చుకొనిపోతున్నాడు. మేఘమండలం దాటిపోయాడు. కాంతిగోళాలైన నక్షత్రాలపైకి పెరిగిపోయాడు. చంద్రమండలాన్ని కూడా దాటుకొని పైకిపోతున్నాడు. ధ్రువనక్షత్రం పైభాగం తాకుతున్నాడు, భూమినుండి నాలుగవది అయిన మహర్లోకాన్ని కూడా క్రిందుగా ఉంచుకొని పెరుగుతున్నాడు. అన్నింటికంటె చిట్టచివరిదైన సత్యలోకాన్ని కూడా క్రిందుచేస్తూ పైకిపోతున్నాడు. బ్రహ్మాండం ఆవలి అంచులను దాటుకొని విక్రమిస్తున్నాడు.
ప్రతిపదార్ధం:
ఇంతింత = కొంచము మరికొంచము; ఐ = అయ్యి; వటుడు = బ్రహ్మచారి; ఇంత = మరి కొంచము; ఐ = అయ్యి; మఱియున్ = ఇంకను; తాను = అతను; ఇంత = ఇంకొచము; ఐ = అయ్యి; నభోవీథి = ఆకాశము; పైన్ = మీద; అంత = అంత; ఐ = అయ్యి; తోయద = మేఘ; మండల = మండలమునకు; అగ్రమున్ = పైకొస; కున్ = కు; అల్లంత = ఆవతలంత; ఐ = అయ్యి; ప్రభారాశి = వెలుగుల రాశి, పాలపుంత; పైన్ = కంటె ఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; చంద్రుని = చంద్రుని; కిన్ = కి; అంత = అంత; ఐ = అయ్యి; ధ్రువుని = ధ్రువుడి కంటె; పైన్ = ఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; మహర్వాటిన్ = మహర్లోకము కంటె; పైన్ = ఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; సత్యపద = బ్రహ్మలోకము కంటె; ఉన్నతుండు = ఎక్కువ ఎత్తు కలవాడు; అగుచున్ = అగుచు; బ్రహ్మాండ = బ్రహ్మాండము; అంత = చివరవరకు; సంవర్ధి = నిండా పెరిగిన వాడు; ఐ = అయ్యి.
8-621 రవిబింబం
సందర్భం:
బలిచక్రవర్తి దానధారను మంత్రపూర్వకంగా వదలిన వెంటనే వామనస్వామి త్రివిక్రముడయ్యాడు. ఆ పెరుగుదల క్రమంలో సూర్యబింబం గతి ఏ విధంగా ఉన్నదో తెలియజేస్తున్నాడు తెలుగుల పుణ్యపేటి పోతన మహాకవి.
మ. రవిబింబం బుపమింప పాత్ర మగు ఛత్రం బై, శిరోరత్న మై,
శ్రవణాలంకృత మై, గళాభరణ మై, సౌవర్ణ కేయూర మై,
ఛవిమత్కంకణ మై, కటిస్థలి నుదంచ ద్వస్త్ర మై, నూపుర
ప్రవరం బై, పదపీఠ మై, వటుడు దా బ్రహ్మాండము న్నిండుచోన్.
తాత్పర్యం:
క్రింద వామనుడు. పైన ఎక్కడో ఆకాశం అంచులలో సూర్యబింబం. అది మొదట ఆ మహాస్వామికి పట్టిన గొడుగులాగా ఉన్నది. పెరగటంలోని రెండవదశలో ఆ భానుబింబమే స్వామికి తలమానికంలాగా కనుపట్టింది. మూడవ దశలో చెవికి పెట్టుకొన్న వజ్రాల ఆభరణం అయింది. తరువాత మెడలో ధరించిన హారంలోని నాయకమణియై అలరారినది. అటుపై భుజానికి అలంకరించుకొన్న బంగారు కేయూరమై ప్రకాశించింది. ఆ వెనుక కాంతులతో వెలిగిపోతున్న ముంజేతి కంకణమై నిలిచింది. అటుపిమ్మట నడుము దగ్గర వింతవింత కాంతులతో విరాజిల్లుతున్న పీతాంబరమై అలరారింది. మరికొంతసేపటికి మడమభాగంలో అలంకరించుకొన్న అందె అయి అందాలు చిందించింది. చివరకు ఆయన విలాసంగా పాదాలుపెట్టుకొనే పీఠం అయిపోయింది. ఈ విధంగా శ్రీమహావిష్ణువు ఏ కొలతలకూ అందనితనాన్ని మన అనుభవంలోనికి తెస్తున్నది ఈ పద్యం.
ప్రతిపదార్ధం:
రవిబింబంబున్ = సూర్య బింబము; ఉపమింపన్ = సరి పోల్చుటకు; పాత్రము = తగినది; అగు = అయిన; ఛత్రంబు = గొడుగు; ఐ = వలె నయ్యి; శిరో రత్నము = శిరసు పైని ఆభరణము; ఐ = వలె నయ్యి; శ్రవణ = చెవుల; అలంకృతి = అలంకారము; ఐ = వలె నయ్యి; గళ = కంఠము నందలి; ఆభరణము = ఆభరణము; ఐ = వలె నయ్యి; సౌవర్ణ = బంగారపు; కేయూరము = భుజకీర్తి; ఐ = వలె నయ్యి; ఛవిమత్ = మెరిసెడి; కంకణము = చేతి కంకణము; ఐ = వలె నయ్యి; కటిస్థలిన్ = నడుమున; ఉదంచత్ = వేయబడిన; వస్త్రము = బట్ట; ఐ = వలె నయ్యి; నూపుర = కాలి అందెల; ప్రవరంబు = పేరు; ఐ = వలె నయ్యి; పద పీఠంబు = పాద పీఠము; ఐ = వలె అయ్యెను వటుడు = బ్రహ్మచారి; తాన్ = అతను; బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును; నిండుచోన్ = అంత వ్యాపించు నప్పుడు.
-------------------------------------------------------------------
నవమ స్కంధము
9-106 భువిఁదూఱన్
సందర్భం:
శ్రీహరికి పరమభక్తుడు అంబరీషుడు. విష్ణుప్రీతికై ఏకాదశినాడు ఉపవసించి ద్వాదశి గడియలు దాటకముందే నిష్ఠతో అతిథులకు అన్నంపెట్టి తాను తింటాడు. ఇది అతని వ్రతం. దుర్వాసమహర్షి అతనికి ఒక పరీక్ష పెట్టాడు. చిన్న తప్పునకు, నిజానికి తప్పు కాదు. తాను తప్పనుకొని మహాకోపంతో అంబరీషునిపై కృత్యను ప్రయోగించాడు. శ్రీహరి కరుణించి వెఱ్ఱితపసికి బుద్ధి చెప్పమని చక్రానికి చెప్పి పంపించాడు. అది దుర్వాసుని వెంటపడింది.
మ. భువిఁ దూఱన్ భువిఁ దూఱు; నబ్దిఁ జొర నబ్దిం జొచ్చు; నుద్వేగి యై
దివిఁ బ్రాకన్ దివిఁ బ్రాకు; దిక్కులకుఁ బో దిగ్వీథులం బోవుఁ; జి
క్కి వెసన్ గ్రుంగినఁ గ్రుంగు; నిల్వ నిలుచున్; గ్రేడింపఁ గ్రేడించు; నొ
క్కవడిన్ దాపసు వెంటనంటి హరిచక్రం బన్యదుర్వక్ర మై.
ప్రతిపదార్థం:
భువిన్ = భూమిలో; దూఱన్ = దూరితే; భువిన్ = భూమిలోకి; దూఱున్ = దూరును; అబ్దిన్ = సముద్రములో; చొరన్ = దూరితే; అబ్దిన్ = సముద్రమున; చొచ్చున్ = దూఱును; ఉద్వేగి = కలతచెందినవాడు; ఐ = అయ్యి; దివిన్ = ఆకాశమునకు; ప్రాకన్ = ఎగబ్రాకితే; దివిన్ = ఆకాశమునకు; ప్రాకున్ = ఎగబ్రాకును; దిక్కుల్ = దిశలవైపున; కున్ = కు; పోన్ = పోతే; దిక్ = దిక్కుల; వీథులన్ = దార్లన్నిటికి; పోవున్ = వెళ్ళును; చిక్కి = (ప్రయత్నము) మానివేసి; వెసన్ = విసిగి; క్రుంగినన్ = కుంగిపోతె; కుంగున్ = కుంగును; నిల్వన్ = నిలబడితే; నిలుచున్ = ఆగును; క్రేడింపన్ = పక్కకివెళితే; క్రేడించున్ = పక్కకివెళ్ళును; ఒక్కవడిన్ = ఏకాగ్రముగ; తాపసున్ = ముని; వెంటనంటి = వెనుదగిలి; హరిచక్రంబు = విష్ణుచక్రము; అన్య = ఇతరులచే; దుర్వక్రము = మరలింపరానిది; ఐ = అయ్యి.
తాత్పర్యం:
దుర్వాసుడు ప్రాణాలను దక్కించుకోవటానికి భూమిలోనికి దూరాడు. అతని వెంటనే చక్రమూ దూరింది. సముద్రం లోనికి చొరబడ్డాడు. అది కూడా సముద్రంలోనికి దూరింది. గుండెలదరిపోతుండగా గగనంలోనికి గెంతులు వేశాడు. చక్రం కూడా ఆకాశంలో చిత్రవిచిత్రంగా తిరుగుతూ వెంటబడింది. దిక్కులకు పరువులెత్తాడు. ఏ దిక్కునకు పోతే ఆ దిక్కునందే అతనిని తరిమి తరిమి కొడుతున్నది. దొరికిపోయాడనుకొన్నంతలో కొంచెం ముడుచుకొని తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. అది కూడా అలాగే కుంచించుకొని పట్టుకోబోయినది. పరువులెత్తలేక నిలబడిపోయాడు. చక్రం కూడా నిలిచిపోయింది. ఒడుపుగా తప్పించుకోబోయాడు. చక్రం కూడా ఒడుపుగానే పట్టుకోబోయింది. ఈ విధంగా సుదర్శనచక్రం ఒక్కపెట్టున భక్తునికి బాధ కలిగించిన తాపసుని వెంటబడింది. దాని సత్తాను అడ్డుకొనే శక్తి మరెవ్వరికీ లేదు.
9-117 చలమునబుద్ధిమంతు
సందర్భం:
దుర్వాసుడు అంబరీషునికి అపకారం చేయబోయి శ్రీసుదర్శనచక్రం కలిగించే ఆపదను కొనితెచ్చుకొన్నాడు. బ్రహ్మాదులను రక్షించవలసినదిగా ప్రార్థిస్తూ కాళ్ళావేళ్ళాపడ్డాడు. వారు శ్రీమహావిష్ణువు తప్ప ఇతరులెవరూ రక్షించేవారు లేరని స్పష్టంగా చెప్పారు. గత్యంతరంలేక గజేంద్రవరదుని కాళ్ళమీద పడ్డాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు ఇలా అన్నాడు.
చ. చలమున బుద్ధిమంతు లగు సాధులు నా హృదయంబు లీల దొం
గిలి కొనిపోవుచుండుదు రకిల్బిష భక్తిలతాచయంబులం
న్నిలువఁగఁ బట్టి కట్టుదురు నేరుపుతో మదకుంభి కైవడిన్;
వలలకుఁ జిక్కి భక్తజన వత్సలతన్ జనుచుందుఁ దాపసా!
ప్రతిపదార్థం:
చలమునన్ = చలాకీగా; బుద్ధిమంతులు = జ్ఞానముగలవారు; అగు = అయిన; సాధులు = మంచివారు; నా = నాయొక్క; హృదయంబున్ = మనసును; లీలన్ = సుళువుగా; దొంగిలికొనిపోవుచన్ = ఎత్తుకుపోతూ; ఉండుదురు = ఉంటారు; అకిల్బిష = నిర్మలమైన; భక్తి = భక్తి యనెడి; లత = తీగల; చయంబులన్ = సమూహములచే; నిలువగన్ = ఆగిపోవునట్లు; పట్టి = పట్టుపట్టి; కట్టుదురున్ = కట్టివేయుదురు; నేరుపు = నేర్పు; తోన్ = తోటి; మద = మదించిన; కుంభి = ఏనుగు {కుంభి - కుంభములుగలది, ఏనుగు}; కైవడిన్ = వలె; వలలన్ = వలలందు; చిక్కి = తగులుకొని; భక్త = భక్తులఎడ; వత్సలతన్ = వాత్సల్యము; కున్ = వలన; చనక = తప్పించుకుపోకుండ; ఉందున్ = ఉండెదను; అధిపా = గొప్పవాడా.
తాత్పర్యం:
ఓయీ! తపోధనా! బుద్ధిపుష్కలంగా ఉన్న సాధుజనులు పట్టుదలతో నా హృదయాన్ని దొంగిలించుకొని పోతారు. ఏ మాలిన్యమూ లేని భక్తి అనే లతలతో వారి దగ్గరనే ఉండిపోయే విధంగా మంచినేర్పుతో మదించిన మహా గజాన్ని లాగా కట్టిపడవేస్తారు. నేను ఏమి చేయగలను? ఆ భక్తజనులమీది వాత్సల్యంతో వారు పన్నిన వలలలో చిక్కి వారు త్రిప్పినట్లు తిరుగుతూ ఉంటాను.
9-118 నాకుమేలుఁగోరు
సందర్భం:
శ్రీహరి దుర్వాసునితో శ్రీమహావిష్ణుభక్తులకూ, తనకూ ఉన్న సంబంధాన్ని గూర్చి యిలా వివరిస్తున్నాడు.
ఆ. నాకు మేలు గోరు నాభక్తుఁ డగువాఁడు
భక్తజనుల కేన పరమ గతియు;
భక్తుఁ డెందు జనినఁ బఱతెంతు వెను వెంట
గోవు వెంటఁ దగులు కోడె భంగి.
ప్రతిపదార్థం:
నా = నా; కున్ = కు; మేలు = మంచి; కోరున్ = కోరుకొనును; నా = నా యెక్క; భక్తుడు = భక్తుడు; అగువాడు = ఐనవాడు; భక్త = భక్తులు; జనులు = అందరకు; ఏన = నేను; పరమ = అత్యుత్తమమైన; గతియున్ = దిక్కు; భక్తుడు = భక్తుడు; ఎందున్ = ఎక్కడకు; చనినన్ = వెళ్ళినను; పఱతెంతు = వెళ్ళెదను; వెనువెంట = కూడకూడ; గోవు = ఆవు; వెంటన్ = కూడా; తగులు = పడెడు; కోడె = మగ దూడ; భంగి = వలె.
తాత్పర్యం:
మహర్షీ! భక్తితత్త్వాన్ని వివరిస్తున్నాను విను. నా యందు నిర్మలమైన భక్తి ఉన్నవాడు నాకు మేలు కోరుతాడు. అంటే భక్తులను కంటికి రెప్పలాగ కాపాడతాను అనే తృప్తి నాకు కలిగించటమే నాకు మేలు. అలాగే భక్తుల విషయంలో నేనే పరమగతి అయినవాడను. నేను వారిని పరిరక్షించగలిగినట్లు ఈ సృష్టిలో మరొకవ్యక్తిగాని శక్తిగాని రక్షించలేదు. కాబట్టి నా భక్తుడు ఎక్కడకు పోతే అక్కడకు నేను వెంటబడి పరుగులెత్తుతూ పోతూ ఉంటాను. పాడి ఆవువెంట వదలకుండా పోతూ ఉండే దూడను చూచి ఉంటావు కదా! నేను భక్తుని వెంటపోవటం అలానే ఉంటుంది.
9-120 తనువుమనువు
సందర్భం:
భక్తులు చాలా మహిమ కలవారయ్యా! వారికి లోకసంబంధమైన బంధాలు ఏమీ ఉండవు. వారికి ఒక్క నాయందు మాత్రమే సంబంధం ఉంటుంది. అట్టివారి విషయంలో నేను ఎలా ఉంటానో గమనించు – అంటున్నాడు శ్రీహరి దుర్వాసునితో... ...
ఆ. తనువు మనువు విడిచి, తనయులఁ చుట్టాల
నాలి విడిచి, సంపదాలి విడిచి,
నన్నె కాని యన్య మెన్నఁడు నెఱుఁగని
వారి విడువ నెట్టివారి నైన.
ప్రతిపదార్థం:
తనువున్ = దేహమును; మనువున్ = జీవితాన్ని; విడిచి = వదలి; తనయులన్ = పిల్లలను; చుట్టాలన్ = బంధువులను; ఆలిన్ = భార్యను; విడిచి = వదలివేసి; సంపద = సంపదలు; అలి = అన్నిటిని; విడిచి = వదిలేసి; నన్న = నన్నుమాత్రము; తప్పించి = తప్పించి; అన్యము = ఇతరము; ఎన్నడున్ = ఎప్పుడు; ఎఱుగని = తెలియని; వారిన్ = వారిని; విడువన్ = వదలిపెట్టను; ఎట్టి = ఎలాంటి; వారిన్ = వారు; ఐనన్ = అయినప్పటికిని.
తాత్పర్యం:
భక్తులకు దేహంతో ముడి ఉండదు. కన్నకొడుకులను, కట్టుకొన్న భార్యనీ, చుట్టాలనూ, సంపదలను అన్నింటినీ విడిచి వేస్తారు. నన్ను తప్ప మరి దేనినీ వారు కోరరు. అటువంటివారు ఎట్టివారైనాసరే నేను విడిచిపెట్టను.
9-122 సాధులహృదయము
సందర్భం:
అంబరీషోపాఖ్యానంతో దుర్వాసునకు శ్రీమహావిష్ణువు భక్తుని లక్షణాన్నీ, భగవంతుని లక్షణాన్నీ ఇలా వివరిస్తున్నాడు.
క. సాధుల హృదయము నాయది;
సాధుల హృదయంబు నేను; జగముల నెల్లన్
సాధుల నేనే యెఱుఁగుదు
సాధు లెఱుంగుదురు నాదు చరితము విప్రా!
ప్రతిపదార్థం:
సాధుల = మంచివారి; హృదయము = హృదయము; నాయది = నాది; సాధుల = మంచివారి; హృదయంబున్ = హృదయమే; నేను = నేను; జగములన్ = లోకములు; ఎల్లన్ = అన్నిటిలోను; సాధులన్ = మంచివారిని; నేన = నేనే; ఎఱుంగుదున్ = ఎరుగుదును; సాధులు = మంచివారు; ఎఱుంగుదురు = తెలిసికొందురు; నాదు = నాయొక్క; చరితమున్ = చరిత్రను; విప్రా = బ్రాహ్మణుడా.
తాత్పర్యం:
గొప్ప విద్యాతత్త్వం ఎరిగిన మహర్షీ! పరమపవిత్రమైన జీవితం గడపేవారిని సాధువులంటారు. ఒక్క రహస్యం చెప్పనా! అట్టివారి హృదయం నాదేనయ్యా! కాదు కాదు సాధువుల హృదయమే నేను. ఈ ప్రపంచంలో ఉన్న సాధువులనందరినీ నేను మాత్రమే తెలుసుకోగలను. నా చరిత్రము సాధువులు మాత్రమే తెలుసుకోగలరు. మరికొంత విప్పిచెప్పనా? నేనే భక్తుడు, భక్తుడే నేను. నా భక్తులకు ద్రోహం చేయటమంటే నాకు ద్రోహం చేయటమే అని గుర్తించాలి.
9-131 చీఁకటిఁవాపుచున్
సందర్భం:
విష్ణుదేవుని మాటలు వీనులారా విన్నాడు దుర్వాసుడు. మరొక గతి లేక భక్తశిఖామణి అయిన అంబరీషుని పాదాల మీద పడ్డాడు. అంబరీషుడు అది చూచి తట్టుకోలేకపోయాడు. శ్రీహరిచక్రాన్ని అత్యద్భుతంగా స్తుతించాడు. అందులోని ఒక అమూల్యరత్నమే ఈ పద్యం.
ఉ. చీఁకటిఁ వాపుచున్ వెలుఁగు సేయుచు సజ్జనకోటి నెల్ల స
శ్రీకులఁ జేయు నీరుచులు చెల్వుగ ధర్మసమేత లై నినున్
వాకున నిట్టి దట్టి దని వర్ణనసేయ విధాత నేరఁ డ
స్తోకము నీదు రూపు గలదుం దుది లేదు పరాత్పరాద్య మై.
ప్రతిపదార్థం:
చీకటిన్ = చీకటిని; పాపుచున్ = పారద్రోలుచు; వెలుగున్ = కాంతిని; చేయుచున్ = పుట్టిస్తూ; సజ్జన = మంచివారి; కోటిన్ = సమూహములు; ఎల్లన్ = అన్నిటిని; సశ్రీకనున్ = సుసంపన్నము; చేయున్ = చేయును; నీ = నీయొక్క; రుచులు = కాంతులు; చెల్వుగ = చక్కగా; ధర్మసమేతలు = ధర్మముగలవారు; ఐ = అయ్యి; నినున్ = నిన్ను; వాకున = నోటితో; ఇట్టిదట్టిది = వివరముగ; అని = పలికి; వర్ణనచేయన్ = కీర్తించుటకు; విధాత = బ్రహ్మదేవుడు; నేరడు = సరిపోడు; అస్తోకము = మహోన్నతము; నీదు = నీయొక్క; రూపున్ = స్వరూపము; కలదు = ఉన్నది; అందున్ = దానిలో; తుది = అంతము; లేదు = లేదు; పరాత్పర = విష్ణుమూర్తితో; ఆద్యము = మొదలైనది; ఐ = అయ్యి.
తాత్పర్యం:
ఓ సుదర్శన చక్రరాజమా! నీవు అజ్ఞానమనే చీకటిని పటాపంచలు చేస్తావు. జ్ఞానమనే వెలుగు సజ్జనుల హృదయాలలో నిండుగా నిలుపుతావు. అట్టి నీవయిన కాంతులు ధర్మంతో నిండినట్టివి. అవి ఉత్తమపురుషుల సముదాయాలను సంపదల వెల్లువలు కలవానిగా చేస్తాయి. అట్టి నిన్ను మాటలతో కొనియాడటం బ్రహ్మదేవునకు కూడా సాధ్యం కాదు. నీ రూపం చాలా గొప్పది. దానికి అంతమంటూ లేదు. అది పరములకు అన్నింటికి పరమమైనది. నీ వలననే సనాతనమైనది.
9-134 ఏనమస్కరింతు
సందర్భం:
అంబరీషుడు సుదర్శనచక్రస్వామిని స్తుతిస్తూనే ఉన్నాడు. అసలు విషయానికి వచ్చి ఆపదలో పీకలవరకు మునిగి ఉన్న మహర్షిని కాపాడు అని ప్రార్థించి చివరకు ఇలా అంటున్నాడు.
ఆ. ఏ నమస్కరింతు నింద్రశాత్రవ ధూమ
కేతువునకు ధర్మసేతువునకు
విమల రూపమునకు విశ్వగోపమునకుఁ
జక్రమునకు గుప్త శక్రమునకు.
ప్రతిపదార్థం:
ఏన్ = నేను; నమస్కరింతున్ = నమస్కరించుచున్నాను; ఇంద్ర = ఇంద్రును; శాత్రవ = శత్రువులను; ధూమకేతువున్ = దహించివేయుదాని {ధూమకేతువు - ధూమము (పొగ)ను కేతువు (గుర్తుగాగలది), అగ్ని, తోకచుక్క}; కున్ = కి; ధర్మ = ధర్మమును; సేతువున్ = కాపాడునది(సేతువువలె); కున్ = కి; విమల = స్వచ్ఛమైన; రూపమున్ = స్వరూపమున; కున్ = కి; విశ్వ = భువనములకు; దీపమున్ = వెలుగునిచ్చెడిదాని; కున్ = కి; చక్రమున్ = విష్ణుచక్రమున; కున్ = కు; గుప్త = కాపాడబడిన; శక్రమున్ = ఇంద్రుడుకలదాని {శక్రుడు - దుష్టులను శిక్షించుటందు శక్తిగల వాడు, ఇంద్రుడు}; కున్ = కి.
తాత్పర్యం:
స్వామీ! చక్రరాజమా! నీవు ఇంద్రుని పగవారికి బ్రతుకులేకుండా చేసే తోకచుక్కవు. ధర్మమునకు జారుపాటు లేకుండా కాపాడే అడ్డుకట్టవు. నీది విమలమైన రూపం. విశ్వాన్నంతటినీ కంటికి రెప్పలా కాపాడే గొప్పశక్తి నీది. సాక్షాత్తు మూడు లోకాలను ఏలే దేవేంద్రుణ్ణి కూడా రక్షించగల శక్తిసంపద కలవాడవు. అటువంటి సుదర్శనస్వామీ! నీకు నేను నిరంతరమూ నమస్కారం చేస్తాను.
9-141 ఒకమాటెవ్వని
సందర్భం:
అంబరీషుని అనుగ్రహంవలన సుదర్శనచక్రస్వామి అగ్నిజ్వాలలకు ఆహుతి అయిపోకుండా బయటపడ్డ దుర్వాసమహర్షి అతని భక్తిసంపదను నోరారా కొనియాడుతూ ఇలా అన్నాడు.
మ. ఒక మా టెవ్వని పేరు కర్ణములలో నొయ్యార మై సోకిఁనన్
సకలాఘంబులు పల్లటిల్లి తొలఁగున్ సంభ్రాంతితో నట్టి స
త్సుకరున్ మంగళతీర్థపాదు హరి విష్ణున్ దేవదేవేశు దా
రకలంకస్థితిఁ గొల్చు భక్తులకు లే దడ్డంబు రాజాగ్రణీ!
ప్రతిపదార్థం:
ఒక = ఒక్క; మాటు = సారి; ఎవ్వని = ఎవనియొక్క; పేరు = నామము; కర్ణముల = చెవుల; లోనన్ = అందు; ఒయ్యారము = విలాసముగా; ఐ = అయ్యి; సోకినన్ = స్పర్శించినను; సకల = సమస్తమైన; అఘంబులున్ = పాపములు; పల్లటిల్లి = పటాపంచలై, చలించి; తొలగున్ = పోవును; సంభ్రాంతి = భయభ్రాంతుల; తోన్ = తోటి; అట్టి = అటువంటి; సత్సుకరున్ = నారాయణుని {సత్సుకరుడు - సత్ (మంచి) సుకరుడు (మేలు) కరుడు (కలిగించువాడు), విష్ణువు}; మంగళతీర్థపాదున్ = నారాయణుని {మంగళతీర్థపాదుడు - శుభకరమైన తీర్థము పాదములవద్ద కలవాడు, విష్ణువు}; హరిన్ = నారాయణుని; విష్ణున్ = నారాయణుని; దేవదేవేశునిన్ = నారాయణును; అకలంక = నిష్కళంకమైన; స్థితిన్ = విధముగా; కొల్చు = సేవించెడి; భక్తులు = భక్తుల; కున్ = కు; లేదు = లేదు; అడ్డంబు = సాధ్యముగానిది; రాజ = రాజులలో; అగ్రణీ = గొప్పవాడ.
తాత్పర్యం:
శ్రీమహావిష్ణువు నామం అలవోకగానైనా చెవిలో పడితే అన్ని పాపాలూ గుండె గుబులుతో కంగారుపడుతూ పారిపోతాయి. రాజవరేణ్యా! ఆయన భక్తులకు మేలుచేయటమే వ్రతం అయినవాడు. శుభాలను కలిగించే పవిత్ర నదీజలంవంటి పాదాలు కలవాడు. దేవతలకు ప్రభువులైన ఇంద్రుడు మొదలగువారికి కూడా ప్రభువు. అన్నింటినీ తనదిగా చేసుకొనేవాడు. ఇందుగలడందు లేడని సందేహించనవసరం లేకుండా అంతటా వ్యాపించి ఉండేవాడు. అట్టి పరమాత్ముని నిర్మలములైన మూడు కరణాలతో సేవించే భక్తులకు ఎక్కడా ఏ అడ్డూ ఉండదయ్యా!
9-231 హరుమెప్పించి
సందర్భం:
మహాభాగవతంలో పరమాద్భుతమైన భాగవతుల కథలు ఎన్నో ఉన్నాయి. అందులో భగీరథ చక్రవర్తి ఆకాశగంగను అవనికి తెచ్చిన కథ మరింత అద్భుతమైనది. శుకమహర్షి పరీక్షిత్తునకు ఆ గాథను చెప్పి చివరకు ఇలా అన్నాడు.
మ. హరు మెప్పించి మహా తపో నియతుఁ డై యాకాశగంగానదిన్
ధరకుం దెచ్చి నితాంత కీర్తిలతికా స్తంభంబుగా నవ్య సు
స్థిరలీలం బితృకృత్య మంతయు నొనర్చెన్ వారితానేక దు
స్తర వంశవ్యధుఁ డా భగీరథుఁడు నిత్యశ్రీకరుం డల్పుఁడే?
ప్రతిపదార్థం:
హరు = పరమశివుని; మెప్పించి = మెప్పుపొంది; మహా = గొప్ప; తపస్ = తపస్సునందలి; నియతుడు = నిష్ఠకలవాడు; ఐ = అయ్యి; ఆకాశగంగానదిని = ఆకాశగంగను; ధర = భూమి; కున్ = కి; తెచ్చి = తీసుకొచ్చి; నితాంత = అఖండమైన; కీర్తి = యశస్సు అనెడి; లతికా = లతకు; స్తంభంబుగాన్ = ఆధారభూతస్తంభములాగ; నవ్య = అభినవ; సుస్థిర = మంచినిలకడైన; లీలన్ = విధముగ; పితృకార్యము = తాతలసేవించుటను; అంతయున్ = పూర్తిగా; ఒనర్చెన్ = నెరవేర్చెను; వారిత = తోలగింపబడిన; అనేక = పలు; దుస్తర = దాటరాని; వంశ = వంశమునకువాటిల్లిన; వ్యధుడు = బాధ కలవాడు; ఆ = గొప్ప; భగీరథుడు = భగీరథుడు; నిత్య = శాశ్వతమైన; శ్రీకరుండు = మంగళప్రదుడు; అల్పుడే = తక్కువవాడా, కాదు.
తాత్పర్యం:
ఆ మహానుభావుడు ఆషామాషీ దేవతలను కాకుండా సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి తన తపస్సుతో మెప్పించాడు. ఆ తపస్సు మానవమాత్రునకు సాధారణంగా సాధ్యంకాని నియమాలతో కూడినట్టిది. ఆ తపఃఫలితంగా ఆకాశగంగానదిని అవనికి తీసికొని వచ్చాడు. అది అతని కీర్తిలతకు ఆధారంగా నిలిచిన మహాస్తంభమై అలరారుతున్నది. ఆ పుణ్యనది పవిత్రజలాలతో పితృకార్యం అంతటినీ శ్రద్ధతో నిర్వహించాడు. తన వంశంలోని పూర్వుల దాటనలవికాని వ్యథలన్నింటినీ తొలగించివేశాడు. ఆ వంశంవారికి నిత్యమైన సౌభాగ్యసంపదలను సమకూర్చాడు. అట్టి భగీరథుడు సామాన్యుడా?
9-254 ఇలమీఁదం
సందర్భం:
భాగవతులలో ఒక ప్రత్యేకత కలవాడు ఖట్వాంగ మహారాజు. సూర్యవంశంలో ఒక జాతిరత్నం. ఒకమారతడు దేవతల కోసం రాక్షసులతో యుద్ధం చేసి వారిని చంపాడు. దేవతలను తన ఆయువు ఎంత అని అడిగాడు. నీ ఆయువు ఎక్కువ లేదు. ఏదైనా వరం వేగంగా కోరుకో అన్నారు. అతడేమీ కోరకుండా ఇంటికి వెళ్ళి వైరాగ్యం పొంది యిలా అనుకొన్నాడు.
మ. ఇలమీఁదం బ్రదు కేల? వేల్పుల వరం బేలా? ధనం బేల? చం
చల గంధర్వపురీ విడంబనము లై శ్వర్యంబు లేలా? జగం
బులఁ బుట్టించు తలంపునం బ్రకృతితోఁ బొత్తై తుదిం బాసి ని
ర్మల మై వాఙ్మనసామితం బగు పరబ్రహ్మంబు నేఁ జెందెదన్.
ప్రతిపదార్థం:
ఇల = భూలోకము; మీదన్ = పైన; బ్రతుకు = జీవించుట; ఏలన్ = ఎందుకు; వేల్పుల = దేవతల; వరంబు = వరములు; ఏలన్ = ఎందుకు; ధనంబున్ = సంపదలు; ఏలన్ = ఎందుకు; చంచల = చంచలములైన; గంధర్వపురీ = గాలిమేడల, మేఘాలలోనగరాలు పోలిన; విడంబనములు = మోసములు; ఐశ్వర్యంబులు = సంపదలు; ఏలా = ఎందుకు; జగంబులన్ = భువనములను; పుట్టించు = పుట్టించెడి; తలంపునన్ = భావములతో; ప్రకృతి = ప్రకృతి; తోన్ = తోటి; పొత్తు = కలయికలుకలవాడను; ఐ = అయ్యి; తుదిన్ = చివరకు; పాసి = వదిలివేసి; నిర్మలము = పరిశుద్దము; ఐ = అయ్యి; వాక్ = నోటితోను; మానస = మనస్సుతోను; ఆమితంబు = అందనిది; అగు = ఐన; పరబ్రహ్మంబున్ = పరబ్రహ్మమును; నేన్ = నేను; చెందెదన్ = పొందెదను.
తాత్పర్యం:
ఎందుకండీ ఈ భూమి మీద బ్రతుకు? దేవతల వరాలెందుకు? ధనాలెందుకు? ఆకాశంలో మేఘాల కదలికతో ఏర్పడి క్షణంలో మాయమయ్యే గంధర్వనగరాలవంటి ఐశ్వర్యాలెందుకు? ఇవన్నీ క్షణభంగురాలు. కనుక వీనితో నాకు పనిలేదు. ఆ పరమాత్మ ఈ జగత్తులనన్నీ పుట్టించే భావనతో ప్రకృతి అయిన మాయతో సంబంధం పెట్టుకొంటాడు. తన యిష్టం మేరకు మళ్ళీ పొత్తును వదలివేస్తాడు. అతనిలో ఏ దోషమూ ఉండదు. అతనిని వాక్కులతో గానీ మనస్సుతో గానీ పట్టుకోలేము. అతనిలో ఐక్యం అయితే అతనివలె శాశ్వతస్థితిని పొందుతాను - అని భావించి కేవలం రెండు క్షణాలలోనే కైవల్యమనే మహాఫలం పొందాడు.
9-258 అమరేంద్రాశకుఁ
సందర్భం:
ఖట్వాంగుని వంశంలోనివాడే దశరథుడు. ఆ సూర్యవంశాన్ని స్థూలంగా పరిచయం చేస్తున్నది భాగవతం. దశరథునకు శ్రీరామచంద్రుడు పుత్రుడుగా అవతరించిన ఆనందకర సన్నివేశాన్ని పోతనగారు మనకు అమృతంలాగా అందిస్తున్నారు.
మ. అమరేంద్రాశకుఁ బూర్ణచంద్రుఁ డుదితుం డై నట్లు నారాయణాం
శమునం బుట్టె మదాంధ రావణ శిరస్సంఘాత సంఛేదన
క్రమణోద్దాముఁడు రాముఁ డా గరితకున్ గౌసల్యకుం సన్నుతా
సమ నైర్మల్య కతుల్య కంచిత జనుస్సంసార సాఫల్యకున్.
ప్రతిపదార్థం:
అమరేంద్రాశ = తూర్పుదిక్కున {అమరేంద్రాశ - అమరేంద్రుని (ఇంద్రుని) ఆశ (దిక్కు), తూర్పు}; కున్ = కు; పూర్ణచంద్రుడు = నిండుచంద్రుడు; ఉదితము = ఉదయించినవాడు; ఐన = అయిన; అట్లు = విధముగ; నారాయణ = విష్ణుమూర్తి; అంశమునన్ = అంశతో; పుట్టె = జన్మించెను; మద = గర్వము అనెడి; అంధ = గుడ్డితనము కల; రావణ = రావణుని; శిరస్ = తలలు; సంఘాత = సమూహమునను; ఛేదన = ఖండించెడి; క్రమణ = విధమునందు; ఉద్దాముడు = ఆరితేరినవాడు; రాముడు = శ్రీరాముడు; గరిత = పతివ్రత; కున్ = కు; కౌసల్య = కౌసల్యాదేవి; కున్ = కి; సన్నుత = స్తుతింపబడెడి; అసమత = సాటిలేని; నైర్మల్య = పరిశుద్ధురాలు; కిన్ = కు; అంచిత = పూజనీయమైన; జనుస్ = సంతానముగల; సంసార = సంసారముయందు; సాఫల్య = సాఫల్యమునపొందినామె; కున్ = కి.
తాత్పర్యం:
తూర్పుదిక్కు అనే కాంతకు పూర్ణచంద్రుడు ఉదయించిన విధంగా కౌసల్యా మహాదేవి శ్రీరామచంద్రుడు అవతరించాడు. ఆమె అందరూ కొనియాడదగిన సాటిలేని నిర్మలత్వం రూపు దాల్చినదా అన్నట్టిది. ఆమెకు ఆమెయే సాటి. ఎన్నో పుట్టుకలతో అనంతంగా సాగుతూపోయే సంసారంలో సాఫల్యం పొందినట్టిది. ఆ పుట్టిన మహాత్ముడో! నారాయణుని కళ అయినవాడు. పొగరుతో కన్నులు మూసికొనిపోయిన రావణాసురుని తలల వరుసను తరిగి వేయటంలో గొప్పపాటవం కలిగిన శ్రీరామచంద్రుడు.
9-262 భూతలనాథుఁడు
సందర్భం:
రమణీయమైన రామాయణ గాథను రసవత్తరంగా అభివర్ణిస్తున్నాడు భాగవత ప్రవక్త భారత వంశకర్త అయిన పరీక్షిత్తునకు. జగత్తులన్నింటికీ కల్యాణాలను కలిగించే సీతారాముల దాంపత్యాన్ని సూచనామాత్రంగా చెబుతున్నాడు.
కం. భూతలనాథుఁడు రాముఁడు
ప్రీతుం డై పెండ్లియాడెఁ బృథుగుణమణి సం
ఘాతన్ భాగ్యోపేతన్
సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్.
సందర్భం:
భూతలనాథుడు = లోకనాయకుడు; రాముడు = రాముడు; ప్రీతుండు = ఇష్ఠపడినవాడు; ఐ = అయ్యి; పెండ్లియాడెన్ = వివాహముచేసుకొనెను; పృథు = గొప్ప; గుణ = సుగుణములనెడి; మణి = మణుల; సంఘాతన్ = కలిగినామెను; భాగ్య = అదృష్టములు; ఉపేతన్ = కూడుకొన్నామెను; సీతన్ = సీతాదేవిని; ముఖ = మోముయొక్క; కాంతిన్ = ప్రకాశముచేత; విజిత = జయింపబడిన; ఖద్యోతన్ = చంద్రుడుగలామెను {ఖద్యోతుడు - ఆకాశమున వెలుగు కలవాడు, చంద్రుడు}.
ప్రతిపదార్థం:
యోగులందరూ ఎవనిని భావించి ఆనందసముద్రంలో మునిగితేలుతూ ఉంటారో అటువంటి శ్రీరామచంద్రుడు ఏదో లాంఛనం కోసం కాకుండా ప్రీతితో సీతాదేవిని పెండ్లియాడాడు. నిజానికి భార్యాభర్తలు కాబోయేవారికి అనురాగం నిండుగా ఉండాలి. అలా ఉండటానికి లోకసామాన్యంగా కొన్ని కారణాలు ఉంటాయి. వానిని తెలియజేస్తున్నారు పోతనమహాకవి. ఆ సీతమ్మ తల్లి చాలా గొప్ప గుణాలనే మణులరాశి. ధర్మం తప్పని భోగపదార్థాలన్నీ ఆమెకు అందుబాటులో ఉన్నాయి. మోము వెలుగులు చందమామను వెక్కిరిస్తున్నాయి. అటువంటి జానకిని శ్రీరామచంద్రుడు ప్రీతితో పెండ్లియాడాడు.
9-267 పుణ్యుఁడు
సందర్భం:
శ్రీరామచంద్రులవారికి సీతాదేవితో కల్యాణం అయిన తరువాత పరిస్థితుల ప్రాబల్యంవలన పట్టాభిషేకం భంగమైపోయింది. దశరథుడు తన మూడవ భార్యకు ఇచ్చిన వరాలను బట్టి రాముడు వనాలకు పోవలసివచ్చింది.
ఉ. పుణ్యుఁడు రామచంద్రుఁ డట వోయి ముదంబునఁ గాంచె దండకా
రణ్యముఁ దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హిబర్హ లా
వణ్యము గౌతమీ విమల వాః కణ పర్యటనప్రభూత సా
ద్గుణ్యము నుల్లసత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్.
ప్రతిపదార్థం:
పుణ్యుడు = పుణ్యాత్ముడు; రామచంద్రుడు = రాముడనెడి చల్లనివాడు; పోయి = వెళ్ళి; ముదంబునన్ = సంతోషముతో; కాంచెన్ = దర్శించెను; దండకారణ్యమున్ = దండకారణ్యమును; తాపస = ఋషులలో; ఉత్తమ = శ్రేష్ఠులకు; శరణ్యమున్ = అండనిచ్చెడిది; ఉద్ధతన్ = జతకట్టిన; బర్హి = ఆడనెమలి; బర్హ = మగనెమలుతో; లావణ్యమును = మనోజ్ఞమైనది; గొతమీ = గోదావరీ; విమల = స్వచ్ఛమైన; వాఃకణ = నీటిబిందుల; పర్యటన = వ్యాప్తులచేత; ప్రభూత = అతిశయించి; సాద్గుణ్యమున్ = సద్గుణసంపత్తిగలది; ఉల్లసత్ = గొప్ప; తరు = చెట్లు; నికుంజ = పొదలచే; వరేణ్యమున్ = ఉత్తమమైనదానిని; అగ్రగణ్యమున్ = గొప్పగ ఎంచదగినదానిని.
తాత్పర్యం:
పుణ్యమూర్తి శ్రీరామచంద్రుడు అలా అడవులలోనికి ప్రవేశించాడు. అందులో ఒక ప్రత్యేక ప్రదేశం దండకారణ్యం. అది చాలా గొప్ప తపస్సు చేసిన మునీశ్వరులకు నివాసస్థలం. అక్కడ చక్కగా పెంపొందిన నెమళ్ళు పురులు విప్పుకొని నృత్యం చేస్తున్నాయి. గోదావరి నదిలోని స్వచ్ఛమైన నీటితుంపురుల కదలికలతో ఏర్పడిన గొప్పచల్లదనం నిలువెల్లా నింపుకొన్నట్టిది ఆ వనం. పెద్దపెద్ద చెట్లూ, నేలమీది పొదలూ ఆనందపారవశ్యంతో ఊగులాడిపోతున్నాయి. ఈ అన్నింటితో కలసి ఆ అరణ్యం అరణ్యాలన్నింటికీ అగ్రగణ్యం అయి ప్రకాశిస్తున్నది.
9-272 లీలన్
సందర్భం:
శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతో తండ్రిమాటమీద అరణ్యవాసం చేస్తున్నాడు. మాయలమారి రాక్షసుడు రావణుడు మోసంచేసి సీతాదేవిని అపహరించుకొని వెళ్ళాడు. పుట్టెడు దుఃఖంతో పుట్టలూ, గుట్టలూ దాటుకొంటూ తిరుగుతున్నారు రామలక్ష్మణులు. వారికి హనుమంతుడు సుగ్రీవునితో చెలిమి కలిగించాడు.
క. లీలన్ రామవిభుం డొక
కోలన్ గూలంగ నేసె గురు నయశాలిన్
శీలిన్ సేవితశూలిన్
మాలిన్ వాలిం దశాస్యమానోన్మూల్మిన్.
ప్రతిపదార్థం:
లీలన్ = క్రీడగా; రామవిభుండు = శ్రీరామ ప్రభువు; ఒక = ఒకే ఒక; కోలన్ = బాణముతో; కూలంగన్ = పడిపోవు నట్లు; ఏసెన్ = కొట్టెను; గురు = గొప్ప; నయశాలిన్ = నీతిమంతుని; శీలిన్ = మంచి శీలము కల వానిని; సేవిత = పూజింపడిన; శూలిన్ = పరమశివుడు కల వానిని; మాలిన్ = మాల ధరించిన వానిని {మాలిన్ – ఇంద్రు డొసగిన మాల కంఠమున ధరించిన వాడు, వాలి};
వాలిన్ = వాలిని; దశాస్య = రావణుని; మాన = గర్వమును; ఉన్మూలిన్ = హరించినవానిని.
తాత్పర్యం:
శ్రీరామచంద్రుడు సుగ్రీవుని అన్న వాలిని, అతడు చేసిన ధర్మద్రోహానికి శిక్షగా, ఒక్కబాణంతో లీలగా కూలనేశాడు. ఆ వాలి తక్కువవాడేమీ కాదు. గొప్పనీతిశాలి. శూలం చేతబట్టిన శివమహాదేవుణ్ణి సేవించే గొప్పశీలం కలవాడు. అతని మెడలో ఒక మహిమగల పూలమాల ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండేది. దేవతలకు కూడా దిగులు పుట్టించే బలపరాక్రమాలు గల పది తలల రావణుని మానాన్ని పెల్లగించి పారవేసిన మహాబలుడు ఆ వాలి.
9-273 ఇలమీఁద
సందర్భం:
సుగ్రీవునితో చెలిమి చేసుకొని అతనికి ఘోరమైన అపకారం చేసిన వాలిని చంపివైచి శ్రీరామచంద్రుడు తన ప్రాణమే అయిన జానకి జాడలు తెలుసుకొని రావటానికి సరియైన వ్యక్తి ఎవరా అని పరికిస్తున్నాడు. అతని ఎట్టఎదుటనే చేతులు కట్టుకొని భక్తి పారవశ్యంతో నిలిచి ఉన్నాడు హనుమ.
క. ఇలమీఁద సీత వెదకఁగ
నలఘుఁడు రాఘవుఁడు వనిచె హనుమంతు నతి
చ్ఛలవంతున్, మతిమంతున్
బలవంతున్, శౌర్యవంతుఁ, బ్రాభవవంతున్.
ప్రతిపదార్థం:
ఇల = భూమి; మీదన్ = మీద; సీత = సీతజాడ; వెదకగన్ = వెతుకుటకై; అలఘుడు = గొప్పవాడు; రాఘవుడు = శ్రీరాముడు {రాఘవుడు - రఘువంశమున పుట్టినవాడు, రాముడు}; పనిచెన్ = నియోగించెను; హనుమంతున్ = హనుమంతుని; అతి = మిక్కలి; ఛలవంతున్ = చురుకైనవానిని, మహామాయావిని; మతిమంతున్ = బుద్దిమంతుని; బలవంతున్ = బలముగలవానిని; శౌర్యవంతున్ = వీరత్వముగలవానిని; ప్రాభవవంతున్ = మహిమాన్వితుని.
తాత్పర్యం:
ఆయన పేరు హనుమంతుడు. వజ్రపుదెబ్బకు ఉబ్బి అందంగా అలరారుతున్న చెక్కిలి కలవాడు. గొప్ప మాటకారితనం నిండుగా ఉన్నవాడు. ఎవ్వరూ ఊహింపజాలని బుద్ధిబలం కలవాడు. ఇంక దేహబలం సంగతి సరేసరి. ఆ విషయంలో అతనికి అతడే సాటియనదగినవాడు. పరాక్రమం, పగవానిమీద ఒక్కపెట్టున దూకి చీల్చి చెండాడగల శౌర్యం అతని సొమ్ము. అన్నింటినీ, అందరినీ తన అదుపులో ఉంచుకోగల నిర్వహణ సామర్థ్యం కూడ అనంతంగా అమరినవాడు. అట్టి హనుమంతుణ్ణి మహాత్ముడైన శ్రీరాముడు సీతను వెదకటానికి పంపించాడు.
9-302 బలువింటన్
సందర్భం:
హనుమంతుడు జానకమ్మ జాడలు గుర్తించి రావణుని గుట్టుమట్టులన్నీ తెలిసికొని లంకను తోకచిచ్చుతో తగులబెట్టి శ్రీరామచంద్రుని దగ్గరకు తిరిగివచ్చాడు. రామలక్ష్మణులు కపిసేనతో సముద్రాన్ని దాటుకొని లంకకు చేరుకొన్నారు. రామరావణ మహాసంగ్రామం లోకభయంకరంగా జరిగింది. చిట్టచివరకు శ్రీరామచంద్రుడు -
మ. బలువింటన్ గుణటంకృతంబు నిగుడన్ బ్రహ్మాండ భీమంబుగా
బ్రళయోగ్రానల సన్నిభం బగు మహాబాణంబు సంధించి రా
జలలాముం డగు రాముఁ డేసె ఖర భాషాశ్రావణున్ దేవతా
బల విద్రావణు వైరిదారజన గర్భస్రావణున్ రావణున్.
ప్రతిపదార్థం:
బలు = బలమైన; వింటన్ = ధనుస్సునందు; గుణ = నారి; టంకృతమున్ = మీటినశబ్దములు, ధనుష్టంకారములు; నిగుడన్ = చెలరేగగా; బ్రహ్మాండ = అతిమిక్కలి; భీమంబుగా = భీకరముగా; ప్రళయ = ప్రళయకాలపు; ఉగ్ర = భయంకరమైన; అనల = అగ్ని; సన్నిభంబు = వంటిది; అగు = అయిన; మహా = గొప్ప; బాణంబున్ = బాణమును; సంధించి = ఎక్కుపెట్టి; రాజ = రాజులలో; లలాముండు = శ్రేష్ఠుడు; అగు = ఐన; రాముడు = శ్రీరాముడు; ఏసెన్ = ప్రయోగించెను; ఖర = పరుషమైన; భాషా = మాటలను; శ్రావణున్ = వినిపించువానిని; దేవతా = దేవతల; బల = సైన్యమును; విద్రావణున్ = పారదోలువానిని; వైరి = శత్రురాజుల; దారజన = భార్యల; గర్భస్రావణున్ = గర్భస్రావకారణుని; రావణున్ = రావణుని.
తాత్పర్యం:
తన విల్లు చాలా గొప్పది. దాని అల్లెత్రాటినుండి రాముడు చేస్తున్న అతిఘోరమైన టంకారాలు బ్రహ్మాండమంతటికీ హడలు పుట్టిస్తున్నాయి. అటువంటి వింటికి ఒక మహాబాణం సంధించాడు. అది ప్రళయకాలంలోని ఉగ్రమైన అగ్నియా అన్నట్లు మంటలు క్రక్కుతున్నది. రాజులందరిలో తలపూవువంటి దాశరథి ఆ బాణాన్ని రావణుని మీదికి మహావేగంతో వదలాడు. ఆ రావణుడు కారుకూతలతో దేవతలను కూడా అతలాకుతలం చేసేవాడు. గుంపులుగుంపులుగా తనమీదికి దూకుతూవచ్చే దేవతలను తరిమితరిమికొట్టే సాహసం కలవాడు. అతని ధాటికి పగవారి భార్యలు గర్భస్రావాలతో పరుగులు తీస్తూ ఉండేవారు. అటువంటి రావణునిమీద ఇటువంటి గొప్పబాణాన్ని ప్రయోగించాడు శ్రీరామచంద్రుడు.
9-318 కవగూడి
సందర్భం:
శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి పుత్రమిత్రపరివారసమేతంగా పరిమార్చాడు. అగ్నిపరీక్షతో పవిత్ర అయిన జానకిని సగౌరవంగా సమీపానికి చేర్చుకొన్నాడు. దారిలో భక్తశిఖామణి అయిన భరతుణ్ణి ఆనందపరచి అయోధ్యకు మహావైభవంతో పరివారంతో బయలుదేరాడు శ్రీరామచంద్రుడు.
సీ. కవగూడి యిరుదెసఁ గపిరాజు రాక్షస; రాజు నొక్కెడఁ జామరములు వీవ
హనుమంతుఁ డతి ధవళాతపత్రముఁ వట్ట; బాదుకల్ భరతుండు భక్తిఁ దేర
శత్రుఘ్ను డమ్ములుఁ చాపంబుఁ గొనిరాఁగ; సౌమిత్రి భృత్యుఁ డై చనవుసూప
జలపాత్ర చేఁబట్టి జనకజ గూడిరాఁ; గాంచనఖడ్గ మంగదుఁడు మోవఁ
ఆ. బసిఁడి కేడె మర్థి భల్లూకపతి మోచి
కొలువఁ బుష్పకంబు వెలయ నెక్కి
గ్రహము లెల్లఁ గొలువఁ గడునొప్పు సంపూర్ణ
చంద్రుపగిది రామచంద్రుఁ డొప్పె.
ప్రతిపదార్థం:
కవగూడి = జంటగాకలిసి; ఇరు = రెండు (2); దెసన్ = పక్కలను; కపిరాజు = సుగ్రీవుడు; రాక్షసరాజున్ = విభీషణుడు; ఒక్కటన్ = కూడి; చామరంబులు = చామరములు {చామరము - చమరీమృగముకుచ్చుతో చేయబడి గాలి విసురుటకు ఉపయోగపడెడి సాధనము, తెల్లగా ఉండును కనుక వింజామరము}; వీవన్ = వీచుచుండగ; హనుమంతుడు = హనుమంతుడు; అతి = మిక్కిలి; ధవళ = తెల్లని; అతపత్రమున్ = గొడుగు; పట్ట = పట్టుచుండగ; పాదుకల్ = కాలిజోళ్ళు; భరతుండు = భరతుడు; భక్తిన్ = భక్తితో; తేర = తీసుకురాగ; శత్రుఘ్నుడు = శత్రుఘ్నుడు; అమ్ములు = బాణములు; చాపంబు = విల్లు; కొనిరాగ = తీసుకురాగా; సౌమిత్రి = లక్ష్మణుడు {సౌమిత్రి - సుమిత్రకొడుకు, లక్ష్మణుడు}; భృత్యుడు = సేవకుడు; ఐ = అయ్యి; చనువు = దగ్గరతనము; చూపన్ = చూపించుతుండగ; జల = నీటి; పాత్రన్ = కలశమును; చేబట్టి = చేతిలోపట్టుకోని; జనకజ = జానకీదేవి; కూడిరాన్ = కూడా వస్తుండగ; కాంచన = బంగారపు; ఖడ్గము = కత్తిని; అంగదుడ = అంగదుడు; మోవన్ = మోయుచుండగా; పసిడి = బంగారపు; కేడెమున్ = డాలును; అర్థిన్ = కోరి; భల్లూకపతి = జాంబవంతుడు; మోచి = మోయుచు; కొలువన్ = సేవించుచుండగ; పుష్పకంబున్ = పుష్పకవిమానమును; వెలయన్ = ప్రకాశించుచు; ఎక్కి = అధిరోహించి; గ్రహములు = గ్రహములు; ఎల్లన్ = సమస్తము; కొలువన్ = సేవించుచుండగ; కడున్ = మిక్కిలి; ఒప్పు = చక్కగానుండెడి; సంపూర్ఱ = నిండు; చంద్రున్ = చంద్రుని; పగిదిన్ = వలె; రామచంద్రుడు = శ్రీరాముడు; ఒప్పెన్ = చక్కగానుండెను.
తాత్పర్యం:
ఒకవంక వానరులు, మరొకవంక రాక్షసులు, ఇంకొకవంక తపస్సంపన్నులైన మహర్షులు. అదిగో అల్లదిగో దివ్యమైన పుష్పకవిమానం. దానిలో మహోన్నతపీఠంమీద సీతారాములను కూర్చోపెట్టారు. వానరరాజు సుగ్రీవుడూ, దానవరాజు విభీషణుడూ కొంచెం వెనుకవైపుగా జంటగా నిలుచుండి వింజామరలు వీస్తున్నారు. పరమభక్తాగ్రేసర చక్రవర్తి పవమానసుతుడు తెల్లనికాంతులతో విరాజిల్లే వెలిగొడుగును స్వామికి పట్టి నిలుచున్నాడు. నిలువెల్లా భక్తియే అనదగిన భరతుడు స్వామి పాదుకలను పాదాలదగ్గరకు చేరుస్తున్నాడు. చిన్నితమ్ముడు శత్రుఘ్నుడు వింటినీ, అమ్ములనూ భద్రంగా పట్టుకున్నాడు. సుమిత్ర పెద్దబిడ్డ లక్ష్మణుడు ఎప్పుడు ఏ సేవ స్వామికి అవసరమౌతుందో అని ఏ మాత్రమూ ఏమఱుపాటులేకుండా కాచుకొని ఉన్నాడు. లోకమాత సీతమ్మ పూర్ణజలకుంభం పదిలంగా పట్టుకొని స్వామికి చేరువలో కూర్చున్నది. అంగదుడు బంగారు ఖడ్గాన్ని మోస్తున్నాడు. మండలాకారంతో ఉన్న పసిడిగద్దెను జాంబవంతుడు పట్టుకున్నాడు. ఇలా వీరందరూ ఒక్కొక్కసేవ చేస్తూ ఉండగా పుష్పకం ఎక్కిన శ్రీరామచంద్రుడు గ్రహాలన్నీ చుట్టూ నిలిచి కొలుస్తున్న నిండు జాబిల్లి లాగా ప్రకాశిస్తున్నాడు.
9-320 వీథులు
సందర్భం:
లోకకల్యాణం కోసం రాక్షస సంహారం చేసిన శ్రీరామచంద్రుడు సీతామహాసాధ్వితో తిరిగి వస్తున్నాడని తెలిసికొన్న అయోధ్యా పురవాసులందరూ ఆనందంతో పొంగిపోతూ స్వాగత సన్నాహాలు చేశారు.
సీ. వీథులు నున్నఁ గావించి తోయంబులు; సల్లి రంభా స్తంభ చయము నిలిపి
పట్టుచీరలు సుట్టి బహుతోరణంబులుఁ; గలువడంబులు మేలుకట్లుఁ గట్టి
వేదిక లలికించి వివిధ రత్నంబుల; మ్రుగ్గులు పలుచందములుగఁ బెట్టి
కలయ గోడల రామకథ లెల్ల వ్రాయించి; ప్రాసాదముల దేవభవనములను
తే. గోపురంబుల బంగారు కుండ లెత్తి
యెల్ల వాకిండ్ల గానుక లేర్పరించి
జనులు కై సేసి తూర్యఘోషములతోడ
నెదురు నడతెంచి రా రాఘవేంద్రు కడకు.
ప్రతిపదార్థం:
వీథులున్ = దారులు; చక్కన్ = చక్కగా; కావించి = చేసి; తోయంబులున్ = నీళ్ళు; చల్లి = కళ్ళాపిజల్లి; రంభా = అరటి; స్తంభ = స్తంభముల; చయమున్ = సమూహములను; నిలిపి = నిలబెట్టి; పట్టుజీరలున్ = పట్టుబట్టలు; చుట్టి = కట్టి; బహు = అనేకమైన; తోరణంబులు = తోరణములు; కలువడంబులు = కలువపూలదండలు; మేలుకట్టులున్ = చాందినీలు; కట్టి = కట్టి; వేదికల్ = అరుగులు; అలికించి = అలికించి {అలికి - అలకుట చేసి - మట్టిగచ్చు లను మరల మట్టి పేడలతో (గోడలకు సున్నము వేసినట్లు) మెత్తుట}; వివిధ = రకరకముల; రత్నంబుల = రత్నాల; మ్రుగ్గులున్ = ముగ్గులను; పలు = అనేక; చందంబులుగన్ = విధములైనవి; పెట్టి = వేసి; కలయ = అంతట; గోడల = గోడలపైన; రామ = రాముని; కథలు = కథలు; ఎల్లన్ = సర్వము; వ్రాయించి = వ్రాయించి; ప్రాసాదములన్ = భవనములయొక్క; దేవభవనములను = దేవాలయములయొక్క.
తాత్పర్యం:
నగరంలోని బాటలన్నింటిని ఎగుడుదిగుళ్ళు లేకుండా నున్నగా చేసుకొన్నారు. చక్కగా, దుమ్ము లేవకుండా నీళ్ళు చల్లారు. బాటలపొడవునా అరటిస్తంభాలు నిలిపారు. పట్టుచీరలు వానికి చుట్టారు. అందమైన తోరణాలను వీధులలో కమనీయంగా కట్టారు. ఇళ్ళముందరి అరుగులను అలికి పెక్కురత్నాల పొడులతో పెక్కురకాల మ్రుగ్గులు పెట్టారు. ఇండ్లగోడలమీద రామకథలను వ్రాయించారు. ఎత్తైన మేడలమీదా, దేవాలయాలమీదా, గోపురాలమీదా బంగారు కుండలెత్తించారు. వీథులలో శ్రీరామచంద్రులవారికి సమర్పించుకోవటానికి కానుకలు సిద్ధంచేసుకొని ఉంచారు. తాము కూడా చక్కగా చూడముచ్చటగా అలంకరించుకొన్నారు. నాలుగు విధాలైన వాద్యాల కమ్మనినాదాలు వినవస్తూ ఉండగా శ్రీరామచంద్రులవారిని తోడ్కొని రావటానికి ఎదురుగా బయలుదేరారు.
9-324 ఇతఁడే రామనరేంద్రుఁ డీ
సందర్భం:
శ్రీరామచంద్రులవారిని చూచిన వెంటనే అయోధ్యాపుర కాంతలందరికీ హృదయంలో ఒక ఆనందపు పొంగు వెల్లివిరిసింది. ఆ మహాత్ముని మహిమలను ఒకరికొకరు చెప్పుకొంటూ తక్కినవారిని గుర్తుపడుతూ ఇలా అనుకొంటున్నారు.
మ. ఇతఁడే రామనరేంద్రుఁ డీ యబలకా యింద్రారి ఖండించె న
ల్లతఁడే లక్ష్మణుఁ డాతఁడే కపివరుం డా పొంతవాఁడే మరు
త్సుతుఁ డా చెంగట నా విభీషణుఁ డటంచుం జేతులం జూపుచున్
సతు లెల్లం బరికించి చూచిరి పురీ సౌధాగ్ర భాగంబులన్.
ప్రతిపదార్థం:
ఇతడే = ఇతనే; రామ = రాముడు అనెడి; నరేంద్రుడు = రాజు; ఈ = ఈ; అబల = స్త్రీ; కిన్ = కి; ఆ = ఆ; ఇంద్రారిన్ = రావణుని; ఖండించెన్ = సంహరించెను; అల్ల = అదిగో; అతడె = అతనె; లక్ష్మణుడు = లక్ష్మణుడు; ఆతడే = అతనే; కపివరుండు = సుగ్రీవుడు; ఆ = ఆ; పొంతవాడే = పక్కవాడే; మరుత్సుతుడు = ఆంజనేయుడు {మరుత్సుతుడు - వాయుపుత్రుడు, హనుమంతుడు}; ఆ = ఆ; చెంగటన్ = పక్కన; ఆ = ఆ; విభీషణుడు = విభీషణుడు; అట = అని; అంచున్ = అనుచు; చేతులన్ = చేతులను; చాపి = చాపి; సతులు = స్త్రీలు; ఎల్లన్ = అందరు; పరికించి = పరిశీలనగా; చూచిరి = చూసిరి; పురీ = పట్టణములోని; సౌధ = మేడల; అగ్రభాగంబులన్ = డాబాలపైనుంచి.
తాత్పర్యం:
ఏమిటీ! ఈయనా శ్రీ రామచంద్ర మహారాజు! ఈ అమ్మవారి కోసమా ఇంద్రశత్రువైన రావణాసురుణ్ణి ముక్కలుముక్కలుగా నరికి ప్రోవులు పెట్టాడు. అడుగడుగో లక్ష్మణస్వామి. అతడే కదయ్యా కోతులరేడు సుగ్రీవుడు! ఆ ప్రక్కన ఉన్నాడే ఆయనయే వాయుపుత్రుడు హనుమన్న. అతనికి కొంచెం పక్కగా ఉన్నవాడే లంకారాజ్యానికి కొత్త ఏలిక విభీషణుడు అంటూ చేతులతో చూపిస్తూ ఆ మహానగరం భవనాలపై భాగాలలో నిలిచి కాంతలందరూ తదేకంగా శ్రీరామచంద్ర పరివారాన్ని చూచి, చూపించి మురిసిపోతున్నారు.
9-332 కలఁగు టెల్లను
సందర్భం:
శ్రీరామచంద్రుడు అయోధ్యలో ప్రవేశించి అమ్మలకు, అయ్యవారలకు, పూజ్యులకు నమస్కరించి వారి కోరిక మేరకు పట్టాభిషేకం చేసుకొన్నాడు. జగములన్నీ ప్రమోదం పొందే విధంగా పాలన చేస్తున్నాడు. ఆ మహాత్ముని పాలనలో విశ్వం ఎలా ఉన్నదో అభివర్ణిస్తున్నారు పోతనామాత్యులవారు.
సీ. కలఁగు టెల్లను మానెఁ గంధు లేడింటికి; జలనంబు మానె భూచక్రమునకు;
జాగరూకత మానె జలజలోచనునకు; దీనభావము మానె దిక్పతులకు;
మాసి యుండుట మానె మార్తాండ విధులకుఁ; గావిరి మానె దిక్తటములకును;
నుడిగిపోవుట మానె నుర్వీరుహంబుల; కణఁగుట మానె ద్రేతాగ్నులకును;
ఆ. గడిఁది వ్రేఁగు మానెఁ గరి గిరి కిటి నాగ
కమఠములకుఁ బ్రజల కలఁక మానె;
రామచంద్రవిభుఁడు రాజేంద్రరత్నంబు
ధరణి భరణరేఖఁ దాల్చు నపుడు.
ప్రతిపదార్థం:
కలగుట = సంక్షోభములు; ఎల్లను = సర్వమును; మానెన్ = లేకుండపోయినవి; జలధులు = సముద్రములు {సప్తసముద్రములు - 1లవణ 2ఇక్షు 3సురా 4ఘృత 5దధి 6క్షీర 7జల సముద్రములు}; ఏడింటికి = ఏడింటికి (7); చలనంబు = కంపించుటలు; మానెన్ = లేకుండపోయినవి; భూచక్రమున్ = భూమండలమున; కున్ = కు; జాగరూకత = జాగ్రత్తపడుట; మానెన్ = అవసరములేకపోయెను; జలజలోచనున్ = విష్ణుమూర్తి; కున్ = కి; దీనభావము = దైన్యము; మానెన్ = లేకుండపోయినది; దిక్పతుల్ = దిక్పాలకుల; కున్ = కు; మాసి = వెలవెలపోయి; ఉండుట = ఉండుట; మానెన్ = పోయినది; మార్తాండ = సూర్యునికి; విధులకున్ = చంద్రునికి; కావిరి = నలుపురంగు; మానెన్ = పోయినది; దిక్ = దిక్కులు; గగనముల్ = ఆకాశముల; కున్ = కు; ఉడిగిపోవుట = ఎడిపోవుట; మానెన్ = పోయినది; ఉర్వీరుహంబుల = చెట్ల {ఉర్వీరుహము - ఉర్వి (భూమి)యందు పుట్టునది, చెట్టు}; కున్ = కు; అడగుట = అణగిపోవుట; మనెన్ = పోయినది; త్రేతాగ్నుల్ = త్రేతాగ్నుల {త్రేతాగ్నులు - 1గార్హపత్యము 2దక్షిణాగ్ని 3ఆహవనీయము అనెడి మూడగ్నులు}; కునున్ = కు; కడిది = ఎక్కువ; వ్రేగు = భారము.
తాత్పర్యం:
శ్రీరామచంద్ర అనే మహారాజు భూభారాన్ని వహించటంతోనే ఏడుసముద్రాలూ సంక్షోభం లేనివయ్యాయి. భూమికి కంపం లేకుండాపోయింది. ఎప్పుడు ఏ దుష్టుడు ఏ ప్రళయం తెచ్చిపెడతాడో అని మేలుకొనియే ఉండే శ్రీమహావిష్ణువు శాంతచిత్తుడై ఒక కునుకు తీయటానికి సిద్ధపడుతున్నాడు. ఇంతవరకు రావణుని భయంవలన బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్న దిక్పతులు దీనతలేనివారయ్యారు. సూర్యుడు చంద్రుడు మాసిపోవటంలేదు. దిక్కుల అంచులను కావిరికమ్ముకొనటంలేదు. పెద్దపెద్ద చెట్లు క్రుంగిపోవటం లేదు. ఆవహనీయము, దక్షిణము, గార్హపత్యము అనే మూడు అగ్నులు అణగిపోకుండా ఉన్నాయి. భూమిని నిరంతరం మోసే ఎనిమిది దిగ్గజాలు, ఏడు కులపర్వతాలు, ఆదివరాహము, ఆదిశేషుడు, ఆదికూర్మము బరువు దించుకొని ఊరటపొందాయి.
9-337 సిగ్గుపడుట
సందర్భం:
భారతీయ దాంపత్యంలో చాల ప్రముఖమైన అంశం ఇల్లాలు ఇంటి ఆయనను సర్వ సమర్పణ భావనతో గౌరవించటం. స్త్రీ లోకానికి అన్ని విషయాలలో ఆదర్శప్రాయ అయిన సీతాదేవి రాముని హృదయాన్ని ఆకట్టుకొన్న తీరును చక్కగా అభివర్ణిస్తున్నారు.
ఆ. సిగ్గుపడుట గల్గి సింగారమును గల్గి
భక్తి గల్గి చాల భయముఁ గల్గి
నయముఁ బ్రియముఁ గల్గి నరనాథు చిత్తంబు
సీత దనకు వశము చేసికొనియె.
ప్రతిపదార్థం:
సిగ్గుపడుట = సిగ్గుపడుట; కల్గి = ఉండి; సింగారమును = శృంగారము; కల్గి = ఉండి; భక్తి = శ్రద్ద; కల్గి = ఉండి; చాల = మిక్కలి; భయమున్ = భయము; కల్గి = ఉండి; నయము = మృదుత్వము; ప్రియమున్ = ప్రీతి; కల్గి = ఉండి; నరనాథున్ = రాజుయొక్క; చిత్తంబున్ = మనసును; సీత = సీతాదేవి; తన = తన; కున్ = కు; వశము = అనుకూలముగ; చేసికొనియె = చేసుకొనెను.
తాత్పర్యం:
అనుభవజ్ఞులు లజ్జ ఉంటే కులటా, లేకుంటే కులకాంతా చెడిపోతారు అంటారు. సిగ్గుపడటం ఒక ఉదాత్తమైన ప్రవర్తనకు చిహ్నం. సీతాదేవి ఆ గుణంతో రాముని హృదయాన్ని ఆకట్టుకొన్నది. అలాగే సహజ సౌందర్యాన్ని పెంపొందించే అలంకారాలను ధరిస్తూ ఉండేది. తన భర్తయందు అచంచలమైన భక్తి ఆమెకు అనుక్షణమూ ఉండేది. అటువంటి ఉత్తమగుణాలు ఏ చాపల్యం వలనైనా జారిపోతాయేమో అనే భయం ఉండేది. ఈ గుణాలతో సీతాదేవి తన భర్త చిత్తాన్ని తన వశం చేసుకున్నది.
9-358 ఆది దేవుఁ డైన
సందర్భం:
శ్రీరామచంద్రుడు సాక్షాత్తు పరమాత్మ. ఆయన అనేక మహాకార్యాలు అలవోకగా చేశాడు. పదునొకండు వేల యేండ్లు భూమిని పాలించి తన మొదటి తావునకు వెళ్ళిపోయాడు. ఆయనను మనం ఏవిధంగా అర్థం చేసుకోవాలో కవి తెలుపుతున్నారు.
ఆ. ఆది దేవుఁ డైన యా రామచంద్రుని
కబ్ది గట్టు టెంత? యసురకోటి
జంపు టెంత? కపుల సాహాయ్య మది యెంత?
సురల కొఱకుఁ గ్రీడ చూపెఁ గాక.
ప్రతిపదార్థం:
ఆదిదేవుడు = మూలాధారదేవుడు; ఐన = అయినట్టి; ఆ = ఆ; రామచంద్రుని = రామచంద్రుని; కిన్ = కి; అబ్ది = సముద్రమునకు; కట్టుట = సేతువుకట్టుట; ఎంత = ఎంతపాటిపని; అసుర = రాక్షస; కోటి = సమూహమును; చంపుట = సంహరించుట; ఎంత = అది ఎంతపని; కపుల = వానరుల; సాహాయ్యము = తోడు; అది = అది; ఎంత = ఎంతటిది; సురల = దేవతల; కొఱకున్ = కోసము; క్రీడ = లీలలు; చూపెన్ = చూపించెను; కాక = తప్పించి.
తాత్పర్యం:
శ్రీరామచంద్రుడు ఆదిదేవుడు. ఎంత అసాధ్యమైన మహాకార్యాలైనా ఆయనకు ఆటలే. ఇది మనం గమనించాలి. సాగరానికి వారధి కట్టటం మనకు అసాధ్యమేమో కానీ ఆయనకు అదెంత పని? దేవతలను దిక్పాలకులను గడగడలాడించిన పేరుప్రఖ్యాతులు గల రాక్షసులను చంపివేయటం ఆ మహాత్మునకు ఒక బరువా? కోతిసేనల సాయం పొందటం చెప్పుకోదగిన సంగతా? ఇదంతా దేవతలకోసం ఆయన ఆడిన నాటకం. అంతే.
9-359 వశుఁడుగ మ్రొక్కెదన్
సందర్భం:
నిజానికి భాగవతం చెప్పవలసిన రామకథ అయిపోయింది. కానీ కవికి పరితృప్తి కలుగలేదు. మఱికొన్ని మాటలలో శ్రీరామచంద్రుని గుణగణాలను స్మరిస్తూ తానానిందించి మనలను ఆనందసముద్రంలో ముంచివేస్తున్నారు పోతనామాత్యులవారు.
చ. వశుఁడుగ మ్రొక్కెదన్ లవణవార్ధి విజృంభణతా నివర్తికిన్
దశ దిగధీశ మౌళిమణి దర్పణమండిత దివ్యకీర్తికిన్
దశశత భానుమూర్తికి సుధారుచి భాషికి సాధు పోషికిన్
దశరథరాజు పట్టికిని దైత్యపతిం బొరిగొన్న జెట్టికిన్.
ప్రతిపదార్థం:
వశుడుగన్ = వినమ్రుడనుగా; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; లవణవార్ధి = ఉప్పుసముద్రముయొక్క; విజృంభణా = అహంకారమును; నివర్తి = అణచినవాని; కిన్ = కి; దశ = పది {దశదిశలు - దిక్కులు 4 (తూర్పు దక్షణము పడమర ఉత్తరము) మూలలు 4 (ఆగ్నేయము నైరుతి వాయవ్యము ఈశాన్యము) పైన 1 మరియు కింద 1 మొత్తం 10}; దిక్ = దిక్కుల; అధీశ = ప్రభువుల; మౌళి = కిరీటములందలి; మణి = మణులు అనెడి; దర్పణ = దర్పణములలో; మండిత = ప్రకాశించుతున్న; దివ్య = గొప్ప; కీర్తి = యశస్సుగలవాని; కిన్ = కి; దశశత = వెయ్యి (1000); బాను = సూర్యులతో సమానమైన; మూర్తి = ప్రకాశముగల స్వరూపి; కిన్ = కి; సుధా = అమృతమువలె; రుచి = తియ్యగా; భాషి = మాట్లాడెడివాని; కిన్ = కి; సాధు = సాధుపురుషులను; పోషి = పోషించువాని; కిన్ = కి; దశరథ = దశరథుడు అనెడి; రాజు = రాజుయొక్క; పట్టి = కుమారుని; కిని = కి; దైత్యపతిన్ = రావణాసురుని {దైత్యపతి - రాక్షసరాజు, రావణాసురుడు}; పొరిగొన్న = సంహరించిన; జెట్టి = వీరుని; కిన్ = కి.
తాత్పర్యం:
ఆ మహితాత్ముడు మహాసముద్రం ఎగిరిపాటులను అణగగొట్టినవాడు. పదిమంది దిక్పాలకుల కిరీటాల మణులనే అద్దాలకు అందచందాలను కూర్చిన దివ్యమైన కీర్తి కలవాడు. వేయిమంది భాస్కరుల వెలుగులకు వెలుగు నిచ్చేవాడు. అమృతం రుచిని మరపించే పలుకులు గలవాడు. సాధువులను ఆదరించి ఆదుకొనే దయామూర్తి. దశరథమహారాజు ముద్దులపట్టి. అతిక్రూరచిత్తం గల రావణుడనే రాక్షసరాజు ప్రాణాలు తీసిన మహామల్లుడు. అట్టి శ్రీరామచంద్రునకు నేను నన్ను సమర్పణ చేసికొని మ్రొక్కుతాను.
9-360 నల్లనివాఁడు
సందర్భం:
పోతనామాత్యులవారికి తనివితీరలేదు. శ్రీరామదర్శనం నుండి బయటపడలేకపోతున్నారు. శ్రీరామచంద్రుని నుండి తనకూ, తనద్వారా మనకూ ఏమి కావాలో కోరుకొంటున్నారు.
ఉ. నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులన్
విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ
జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం
జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁ డీవుత మా కభీష్టముల్.
ప్రతిపదార్థం:
నల్లనివాడు = నల్లగా ఉండువాడు; పద్మ = పద్మములవంటి; నయనంబులవాడు = కన్నులుగలవాడు; మహా = గొప్ప; ఆశుగంబులున్ = బాణములు; విల్లునున్ = బాణాసనమును; తాల్చువాడు = ధరించెడివాడు; కడు = మిక్కిలి; విప్పు = విశాలమైన; వక్షమువాడు = రొమ్ముగలవాడు; మేలున్ = శుభములు; పైన్ = మీద; జల్లెడువాడు = కురిపించువాడు; నిక్కిన = ఎగు; భుజంబులవాడు = భుజములుకలవాడు; యశంబున్ = కీర్తిని; దిక్కులన్ = దిక్కులకడవరకు; జల్లెడువాడు = వ్యాపించినవాడు; ఐన = అయినట్టి; రఘుసత్తముడు = రఘువంశపు తిలకుడు; ఇచ్చుత = తీర్చుగాక; మా = మా; కున్ = కు; అభీష్టముల్ = కోరికలు.
తాత్పర్యం:
ఆయన నల్లనివాడు. ఆకాశంలాగా అంబుధిలాగా అనంతమైనవాడు. పద్మములవంటి విశాలములైన కనులతో మనలను చల్లగా చూస్తూ ఉంటాడు. ఎక్కడా, ఎప్పుడూ వ్యర్థంకాని మహాబాణాలూ, విల్లూ ధరించి ఉంటాడు. అతివిశాలమైన వక్షఃస్థలంతో విరాజిల్లుతూ భక్తులారా! మీరెందరైనా, ఎక్కడివారైనా రండి ఇక్కడ మీకు చోటు ఉన్నది అని ప్రకటించేవాడు. అందరికీ శుభాన్ని, మేఘం వర్షంలాగా, కురిపించేవాడు. ఎగుభుజములవాడు. తనకీర్తిని అన్నిదిక్కులలో చల్లిన మహానుభావుడు. అటువంటి రఘువంశ తిలకుడైన శ్రీరాముడు మా కోరిన కోర్కెలను తీర్చుగాక!
9-361 రామచంద్రుఁ గూడి
సందర్భం:
శ్రీరామచంద్రుడు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే. దుష్టశిక్షణకోసం మానవుడుగా భూమిలో అవతరించాడు. ఆ మహాత్మునితో కలసిమెలసి ఉండగలగటం ఒక మహాపుణ్యం. దాని ఫలాన్ని ఈపద్యంలో వర్ణిస్తున్నారు.
ఆ. రామచంద్రుఁ గూడి రాకలఁ పోకలఁ
గదిసి తిరుగువారుఁ గన్నవారు
నంటికొన్నవారు నా కోసలప్రజ
లరిగి రాదియోగు లరుగు గతికి.
ప్రతిపదార్థం:
రామచంద్రున్ = శ్రీరాముని; కూడి = కలిసి; రాకలపోకలన్ = మెలయుటయందు; కదిసి = చేరి; తిరుగు = నడచెడి; వారున్ = వారు; కన్న = చూచిన; వారున్ = వారు; అంటికొన్న = తాకిన; వారున్ = వారు; ఆ = ఆ; కోసల = కోసలదేశపు; ప్రజలున్ = ప్రజలు; అరిగిరి = వెళ్ళిరి; ఆదియోగులు = ఆదియోగులు; అరుగు = వెళ్ళెడి; గతి = సద్గతి; కి = కి.
తాత్పర్యం:
ఆయన శ్రీరామచంద్రుడు. చంద్రుడంటే అందరికీ ఆహ్లాదం కలిగించేవాడు. అయోధ్యలో ఎందరో పుణ్యవంతులు అతనికి చెలికాండ్రై కలసిమెలసి ఉన్నారు. విశ్వామిత్రుడు మొదలైన మహర్షులు అతనిని ఆశ్రయించి కొన్ని ఘనకార్యాలు చేయించుకొన్నారు. అరణ్యవాసంలో జానపదులు ఎందరో ఆయనను దర్శించుకొన్నారు. సుగ్రీవుడు మొదలైన వానరాదులు, విభీషణుడు మొదలైన రాక్షసులు అతని చెలిమితో పవిత్రులైనవారే. మరల అయోధ్యకు తిరిగి వచ్చిన తరువాత కోసలదేశం ప్రజలు ఆయన చెలిమి కలిమిని అనుభవించినవారే. అలా ఆయనతోపాటు రాకపోకలలో కలిసి – అంటిపెట్టుకొని – తిరిగినవారూ, కనుగొన్నవారూ, ఆయనను తాకి పుణ్యం పొందినవారూ అయిన కోసల ప్రజలు ఆదియుగంనాటి యోగులు పొందిన పుణ్యలోకాలను చేరుకున్నారు.
9-362 మంతనములు
సందర్భం:
శ్రీరామచంద్రునికి సంబంధించిన భావనలు చాలా గొప్పవి అని ఈ పద్యంలో ఇలా నిరూపిస్తున్నారు.
క. మంతనములు సద్గతులకుఁ
పొంతనములు ఘనము లైన పుణ్యముల కిదా
నీంతన పూర్వమహాఘ ని
కృంతనములు రామనామ కృతిచింతనముల్.
ప్రతిపదార్థం:
మంతనములున్ = ఏకాంతమార్గములు; సద్గతుల్ = మోక్షముల; కున్ = కు; పొంతనములు = పొందిపజేయునవి {పొంతనము - మైత్రి కలిగించునది, గ్రహమైత్రి}; ఘనములు = గొప్పవి; ఐన = అయినట్టి; పుణ్యముల్ = పుణ్యఫలముల; కిన్ = కి; తాన్ = తను; ఇంతన = ఇప్పుడు; పూర్వ = పూర్వముచేసిన; మహా = గొప్ప; అఘ = పాపములను; నికృంతనములు = త్రెంచునవి; రామ = శ్రీరాముని; నామ = పేరుతో; కృత = చేసెడి; చింతనముల్ = సంస్మరణలు.
తాత్పర్యం:
రామునిపేరును తలపోయటం, ఆయన చేసిన మహాకార్యములను మనస్సులో సంభావించటం అనే రెండూ ఉత్తమ లోకాలను చేరుకోవటానికి దారిచూపే ఆలోచనలు. గొప్ప గొప్ప పుణ్యాలను చక్కగా సమకూర్చే మంచియోగాలు. అవి ఈ కాలమునకు, వెనుకటి జన్మములకు సంబంధించిన మహాపాతకాలను నామరూపాలు లేకుండా చీల్చిపారవేసే శక్తిసంపద కలవి. అట్టి మహాఫలాలను ప్రసాదించే రామనామాన్ని తనివితీరా జపించండి. ఆయన ఆ అవతారంలో చేసిన ఘనకార్యాలను సంభావించండి - అంటున్నది శ్రీమహాభాగవతం.
9-462 క్షమ గలిగిన
సందర్భం:
దశావతారాలలో ఒకటి పరశురామావతారం. ఆయన మహర్షి జమదగ్ని కొడుకులలో ఒకడు. కార్తవీర్యార్జునుడు అనే మహాచక్రవర్తి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి పెద్దపరివారంతో వచ్చాడు. మహర్షి అందరికీ ఆతిథ్యం ఇచ్చి గొప్పవిందుభోజనం పెట్టాడు. అది అతని హోమధేనువు మహిమ. రాజుననే పొగరుతో అర్జునుడు బలవంతంగా దానిని తీసికొనిపోయాడు. పరశురాముడు ఇది తెలిసికొని పట్టరాని కోపంతో మాహిష్మతీపురానికి వెళ్ళి రాజునూ, ఆరితేరిన సైనికులనూ అతిక్రూరంగా చంపి దూడతోపాటు ఆవును తెచ్చి తండ్రికి సమర్పించాడు. తాను ప్రళయరుద్రుడై చేసిన సంహారకాండను కూడా వివరించాడు. శాంతమూర్తి అయిన జమదగ్ని నొచ్చుకొన్నాడు. కొడుకును ఇలా మందలిస్తున్నాడు.
క. క్షమ గలిగిన సిరి గలుగును
క్షమ గలిగిన వాణి గలుగు సౌఖ్యము లెల్లన్
క్షమ గలుగఁ దోన కలుగును
క్షమ గలిగిన మెచ్చు శౌరి సదయుఁడు దండ్రీ!
ప్రతిపదార్థం:
క్షమ = ఓరిమి; కలిగిన = ఉన్నచో; సిరి = సంపదలు; కలుగును = కలుగుతాయి; క్షమ = తాలిమి; కలిగిన = ఉన్నచో; వాణి = విద్య; కలుగున్ = అబ్బును; సౌర = సూర్యుడంతటి; ప్రభయున్ = ప్రకాశము; క్షమ = తాలిమి; కలుగన్ = ఉన్నచో; తోనన్ = దానితోపాడు; కలుగును = కలుగును; క్షమ = తాలిమి; కలిగిన = ఉన్నచో; మెచ్చు = సంతోషించును; శౌరి = విష్ణువు {శౌరి - శూరుని యొక్క మనుమడు, విష్ణువు}; సదయుండు = దయామయుడు; తండ్రి = నాయనా.
తాత్పర్యం:
నాన్నా! సహనం చాలా గొప్పదయ్యా! అది ఉంటే అన్నీ ఉన్నట్లే. సహించటం తెలిసినవారికి సంపదలు కొల్లలుగా కలుగుతాయి. ఓర్పు కలవానికి మంచిమాటలు సిద్ధిస్తాయి. సౌఖ్యాలన్నీ సహనశీలుణ్ణి వెనువెంటనే చేరుకొంటాయి. బాబూ! దయామయుడైన శ్రీమహావిష్ణువు ఓరిమిని పండించుకొన్నవానిని మెచ్చుకొంటాడయ్యా!
9-507 రాజ్యంబు
సందర్భం:
వెనుకటి కాలంలో నహుష చక్రవర్తి ఒకడు ఉండేవాడు. అతడు ఇంద్రపదవిని పొందగలిగిన పుణ్యశాలి. అతనికి యతి మొదలైన ఆరుగురు పుత్రులు కలిగారు. నహుషుడు పెద్దకొడుకు యతికి రాజ్యం ఇచ్చాడు. కానీ ఆ మహానుభావుడు వైరాగ్యాన్ని పండించుకొన్నవాడు కనుక ఇలా అనుకొన్నాడు.
క. రాజ్యంబు పాపమూలము
రాజ్యముతో నొడ లెఱుంగ రాదు సుమతియున్
రాజ్యమునఁ బూజ్యు నెఱుఁగడు
రాజ్యము గీజ్యంబు ముక్తిరతులకు నేలా?
ప్రతిపదార్థం:
రాజ్యంబున్ = రాజ్యము; పాప = పాపం సంభవించుటకు; మూలము = మూల కారణము; రాజ్యము = రాజ్యము; తోన్ = తోటి; ఒడ లెఱుంగ రాదు = మదము పెరుగును {ఒడ లెఱుగ రాదు - గర్వము వలన ఒళ్ళు తెలియదు}; సుమతియున్ = మంచి బుద్ధి కల వా డైనను; రాజ్యమునన్ = రాజ్యము వలన; పూజ్యున్ = పూజింప దగిన వానిని; ఎఱుగడు = తెలియ లేడు; రాజ్యమున్ = రాజ్యము; గీజ్యమున్ = గీజ్యము; ముక్తి = మోక్షము; రతుల = కోరువారి; కున్ = కి; ఏలా = ఎందుకు.
తాత్పర్యం:
రాజ్యం అనేది అన్ని పాపాలకూ మూలకారణం. ఒకమారు రాజ్యం దక్కింది అంటే వానికిక ఒళ్ళు తెలియదు. ఎంత మంచిబుద్ధి ఉన్నవాడయినా రాజ్యం పొందిన తరువాత గౌరవింపదగినవానిని తెలుసుకోలేడు. పూజ్యులను అవమానిస్తాడు. ఘోరమైన ఆపదలను కొనితెచ్చుకొంటాడు. కాబట్టి మోక్షసామ్రాజ్యం మీద ప్రీతి ఉన్నవారికి ఈ రాజ్యమూ గీజ్యమూ ఎందుకు? – అని రాజ్యాన్ని పూచికపుల్లలాగా వదలివేసి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు.
9-581 కామోపభోగ
సందర్భం:
నహుషుని రెండవకొడుకు యయాతి రాజయ్యాడు. శుక్రాచార్యుని బిడ్డ దేవయాని అతనికి భార్య అయింది. ఒకనాడు అతనికి ఆత్మజ్ఞానం కలిగింది. స్త్రీకారణంగా మోసపోయాననుకొన్నాడు. వైరాగ్యం హృదయంలో కదలాడుతూ ఉండగా కామవికారం ఎంత ఘోరమైనదో ఆమెకు తెలియజేస్తున్నాడు.
కం. కామోపభోగ సుఖములు
వేమాఱును బురుషుఁ డనుభవింపుచు నున్నం
గామంబు శాంతిఁ బొందదు
ధూమధ్వజుఁ డాజ్యవృష్టిఁ ద్రుంగుడు వడునే?
ప్రతిపదార్థం:
కామోపభోగ = విషయ భోగపు; సుఖములున్ = సుఖములను; వేమాఱు = అనేక సార్లు; పురుషుడు = మానవుడు; అనుభవింపు చున్నన్ = అనుభవిస్తూ ఉన్నా; కామంబు = తృష్ణ, కోరిక; శాంతి బొందదు = చల్లారదు; ధూమధ్వజుడు = అగ్నిదేవుడు; ఆజ్య = నేతి; వృష్టిన్ = ధారలతో; త్రుంగుడు = అణగారుట; పడునే = జరుగదు కా.
తాత్పర్యం:
దేవయానీ! మానవుడు కామసుఖాలను వేలకొలదిగా అనుభవిస్తూనే ఉంటాడు. కానీ కామం ఒక పెద్ద అగ్నివంటిది. పెద్దపెద్ద పాత్రల నిండా నేతిని తెచ్చి అగ్నిలో పోస్తున్నా అగ్ని ఇంక చాలు అంటుందా? అటువంటిదే ఈ కామాగ్ని. దాని అనుభవాలు పెరిగిపోతున్నకొద్దీ కామం మరింతగా విజృంభిస్తుందే కానీ అణగారదు.
9-725 ఎప్పుడుధర్మక్షయమగు
సందర్భం:
శుకమహర్షి పరీక్షిన్మహారాజునకు భగవంతుని అవతారాలనూ, భాగవతుల చరిత్రనూ భాగవతరూపంలో చెబుతున్నాడు. యాదవవంశ చరిత్రను చెబుతూ శ్రీకృష్ణవాసుదేవుని అవతారకారణాన్ని ఇలా వివరిస్తున్నాడు.
కం. ఎప్పుడు ధర్మక్షయ మగు
నెప్పుడు పాపంబు పొడము నీ లోకములో
నప్పుడు విశ్వేశుఁడు హరి
దప్పక విభఁ డయ్యుఁ దన్నుఁ దా సృజియించున్.
ప్రతిపదార్థం:
ఎప్పుడు = ఎప్పు డైతే; ధర్మ = ధర్మము; క్షయము = క్షీణించినది; అగున్ = అగునో; ఎప్పుడు = ఎప్పు డైతే; పాపంబున్ = పాపములు; పొడమున్ = అతిశయించునో; ఈ = ఈ; లోకము = లోకము; లోన్ = అందు; అప్పుడున్ = ఆ కాలము నందు; విశ్వేశుడు = విష్ణుమూర్తి {వి శ్వేశుడు - విశ్వమునకు ఈశుడ (ప్రభువు), హరి}; హరి = విష్ణుమూర్తి; తప్పక = తప్పకుండగ; విభుడు = భగవంతుడు (విభుడు = సర్వవైభవోపేతుడు); అయ్యున్ = అయిన ప్పటికిని; తన్ను = తనను; తాను = తనే; సృజియించున్ = సృష్టించును.
తాత్పర్యం:
పరీక్షిన్మహారాజా! ఈ సృష్టి అంతా ఒక విచిత్రమైన తిరుగుళ్ళవంటిది. ఒక్కొక్క కాలంలో ధర్మం క్షీణించిపోతుంది. పాపం పండిపోతుంది. అది లోకం అంతటికీ చేటుకాలం. విశ్వానికంతటికీ ప్రభువైన విష్ణువు దీనిని గమనించి అధర్మమైన పాపాన్ని అంతం చేసి ధర్మాన్ని మళ్ళీ సుస్థితికి తేవటం కర్తవ్యంగా పెట్టుకొని తన్ను తాను సృజించుకొంటాడు. అతడే దేవకి ఎనిమిదవ గర్భంగా అవతరించిన శ్రీకృష్ణవాసుదేవుడు.
9-730 మంగళహరికీర్తి
సందర్భం:
శ్రీకృష్ణవాసుదేవుని అవతార పరిసమాప్తిని సూచనామాత్రంగా వినిపిస్తున్నాడు శుకయోగీంద్రుడు పరీక్షిన్మహారాజునకు. అట్టి శ్రీహరి అమృతచరిత్రను విన్నవారికి కలిగే పుణ్యఫలం ఎట్టిదో తెలుపుతున్నాడు.
కం. మంగళ హరికీర్తి మహా
గంగామృత మించుకైనఁ గర్ణాంజలులన్
సంగతము సేసి ద్రావఁ దొ
లంగును గర్మంబు లావిలం బగుచు నృపా!
ప్రతిపదార్థం:
మంగళ = శుభకర మైన; హరి = నారాయణుని; కీర్తి = కీర్తి; మహా = గొప్ప; గంగా = గంగా; అమృత = అమృత మయ జలములు; ఇంచుక = కొంచము; ఐనన్ = అయినప్పటికి; కర్ణ = చెవులు అనెడి; అంజలులన్ = దోసిళ్లతో; సంగతమున్ = చేదుకొనుట; చేసి = చేసికొని; త్రావన్ = తాగినచో; తొలంగును = తొలగి పోవును; కర్మంబులు = కర్మలు; ఆవిలంబులు = నశించినవి; అగుచున్ = అగుచు; నృపా = రాజా.
తాత్పర్యం:
పరీక్షిన్మహారాజా! కృష్ణుడై అవతరించి దుష్టులను శిక్షించి, శిష్టులను కాపాడి ధర్మస్థాపన చేసిన శ్రీహరి కీర్తి సకలశుభాలనూ సమకూర్చుతుందయ్యా! ఆ కీర్తి మహాగంగ. అదియొక అమృతవాహిని. దానిని ఏ కొంచెమైనా చెవిదొప్పలతో హృదయంలోనికి చేర్చుకొంటే కర్మములన్నీ కాలిపోతాయి. అంటే పుట్టటం చావటం అనే చక్రంలో తిరుగుతూ ఉండే ఘోరమైన ఆపద తొలగిపోతుంది.
9-732 నగుమొగమున్
శుకయోగీంద్రులు శ్రీకృష్ణవాసుదేవుని మనోహరరూపాన్ని తన జ్ఞాననేత్రం ముందు కదలాడాలని కోరుకొంటున్నారు. మనకు కూడా అట్టి భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు.
చ. నగుమొగమున్ సుమధ్యమును నల్లనిదేహము లచ్చి కాటప
ట్టగు నురమున్ మహాభుజము లంచిత కుండలకర్ణముల్ మదే
భగతియు నీలవేణియుఁ గృపారస దృష్టియుఁ గల్గు వెన్నుఁ డి
మ్ముగఁ బొడసూపుఁ గాత గను మూసిన యప్పుడు విచ్చు నప్పుడున్.
ప్రతిపదార్థం:
నగు మొగమున్ = నగుమోము; సు = చక్కటి; మధ్యమును = నడుము; నల్లని = నల్లటి; దేహము = శరీరము; లచ్చి = లక్ష్మీదేవి; కిన్ = కి; ఆటపట్టు = నివాసము; అగు = ఐన; ఉరమున్ = వక్షస్థలము; మహా = గొప్ప; భుజముల్ = భుజములు; అంచిత = అలంకరింప బడిన; కుండల = చెవి కుండలములు గల; కర్ణముల్ = చెవులు; మత్ = మదించిన; ఇభ = ఏనుగు వంటి; గతియున్ = నడకలు; నీల = నల్లని; వేణియున్ = శిరోజములు; కృపారస = దయారసము ఒలికెడి; దృష్టియున్ = చూపులు; కల్గు = ఉన్నట్టి; వెన్నుడు = విష్ణువు; ఇమ్ముగన్ = కనుల నిండుగా; పొడ సూపు గాత = కనిపించి గాక; కను = కళ్ళు; మూసిన = మూసెడి; అప్పుడున్ = సమయము నందు; విచ్చున్ = తెరచు; అప్పుడున్ = సమయము నందు.
తాత్పర్యం:
ఆ మహాత్ముడు నిరంతరమూ నవ్వుమొగంతోనే కానవస్తాడు. అంటే అచ్చమైన ఆనందం ఆయన స్వరూపమన్నమాట. సన్నని నడుమును గమనిస్తే అందులోనే పదునాలుగులోకాలు భద్రంగా ఉన్న స్ఫూర్తి కలుగుతుంది. ఆయన అనంతుడు అని తెలుపటానికై ఆకాశంవంటి నీలమైన దేహకాంతితో అలరారుతున్నాడు. ఆ విశాలమైన వక్షఃస్థలం శ్రీమహాలక్ష్మికి ఆటపట్టు. ఎంత అలవికాని పనినైనా అలవోకగా చేస్తాయి అనిపించే పొడవైన గొప్ప హస్తాలతో వెలుగొందుతున్నాడు ఆ స్వామి. కర్ణముల కుండలాలు కమనీయంగా కాంతులను విరజిమ్ముతూ కదలాడుతూ ఉన్నాయి. అడుగుతీసి అడుగువేస్తుంటే ఒక మదించిన గజరాజు ఆ మహాత్ముని నుండియే నడకను అభ్యసించిందా అనిపిస్తుంది. తలమీది కేశపాశం నల్లని వన్నెతో నిగనిగలాడిపోతున్నది. కన్నులలో అపారమైన కృపారసం తొణికిసలాడుతూ ఉంటుంది. అటువంటి గొప్ప లక్షణాలు గల కన్నయ్య కన్నులు మూసినా తెరచినా నాకు కనపడుతూ ఉండాలి.
దశమ స్కంధం
10-1 శ్రీకంఠచాప ఖండన
సందర్భం:
భాగవతంలోని దశమస్కంధం నేరుగా శ్రీకృష్ణవాసుదేవుని పరమాత్మతత్త్వాన్ని ప్రపంచించే వాఙ్మయ విరాట్ స్వరూపం. పోతన మహాకవి ఆ స్కంధాన్ని ప్రారంభిస్తూ శ్రీరామచంద్ర ప్రభువులవారి గుణవిశేషాలను ఆత్మానందంకోసం వక్కాణిస్తున్నారు.
కం. శ్రీకంఠచాప ఖండన!
పాకారి ప్రముఖ వినుత భండన! విలసత్
కాకుత్స్థవంశమండన!
రాకేందు యశోవిశాల! రామనృపాలా!
ప్రతిపదార్థం:
శ్రీకంఠచాపఖండన = శ్రీరామ కఱకంఠుడైన శివుని విల్లును విరిచినవాడు, పాకారిప్రముఖవినుతభండన = పాకాసురుని శత్రువైన ఇంద్రాదులచేత పొగడబడిన యుద్ధము చేసినవాడు, విలసత్కాకుత్స్థవంశమండన = ప్రసిద్ధికెక్కిన కకుత్స్థ మహరాజ వంశమునకు అలంకారమైనవాడు; రాకేందుయశోవిశాల = నిండుపున్నమిచంద్రుని వంటి కీర్తి విరివిగా కలవాడు; రామ = రాముడు అనే {నిండుపున్నమిచంద్రుని పదహారు కళలు- 1. అమృత 2. మానద 3. పూష 4. తుష్టి 5. పుష్టి 6. రతి 7. ధృతి 8. శశిని 9. చంద్రిక 10. కాంతి 11. జ్యోత్స్న 12. శ్రీ 13. ప్రీతి 14. అంగద 15. పూర్ణ 16. పూర్ణామృతాలు} నృపాల = రాజా!
తాత్పర్యం:
స్వామీ శ్రీరామచంద్రప్రభూ! నీవు శ్రీకంఠుని వింటిని ముక్కలు చేసిన మహాత్ముడవు. దేవేంద్రుడు మొదలైనవారు కూడా నీ యుద్ధాన్ని నిండు గౌరవంతో కొనియాడుతారు. కకుత్స్థుడు అనే మహాపురుషుని కుదురునందు వెలుగులు నింపడానికి నీవు అందులో అవతరించిన ఆదిదేవుడవు. నీ విశాలమైన కీర్తి పూర్ణచంద్రునిలా సర్వలోకాలను ఆహ్లాద పరుస్తున్నది.
10-183 ఏమినోము ఫలమొ
సందర్భం:
శ్రీ వాసుదేవ పరమాత్మ తన మాయతో నందగోకులంలో సుందరశిశువై యశోద ఒడిలోనికి చేరుకున్నాడు. అందరూ ఆ నందనందనుడు యశోద కడుపున పుట్టినట్లే సంభావించారు. వ్రేపల్లెలోని గోపసుందరులందరూ ఇలా అనుకుంటున్నారు.
ఆ. ఏమినోము ఫలమొ యింత ప్రొ ద్దొక వార్త
వింటి మబలలార! వీను లలర
మన యశోద చిన్ని మగవానిఁ గనె నట
చూచి వత్త మమ్మ! సుదతులార!
ప్రతిపదార్థం:
ఏమి = ఎట్టి; నోము = వ్రతములునోచిన; ఫలమొ = ఫలితముగానో; ఇంత ప్రొద్దు = ఇప్పటికి; ఒక = ఒకానొక; వార్తన్ = శుభవర్తమానమును; వింటిమి = విన్నాము; అబలలార = ఇంతులార; వీనులు = చెవులు; అలరన్ = ఆనందించగా; మన = మన యొక్క; యశోద = యశోద; చిన్ని = చంటి; మగవాని = మగపిల్లవాడిని; కనెనట = ప్రసవించినదట, చూచి = చూసి; వత్తమమ్మ = వచ్చెదమమ్మ; సుదతులార = సుందరీమణులారా!
తాత్పర్యం:
ఒయ్యోయి అబలలారా! సుదతులారా! ఈనాడు మనం వెనుకటి పుట్టువులలో చేసుకొన్న పుణ్యమెటువంటిదో కానీ ఒక వార్త వీనులవిందుగా వినబడింది. మన యశోద లేదూ, అదే నందుని ఇల్లాలమ్మా, ఒక చిన్ని మగవానిని కన్నదట. వెళ్ళి చూచి వద్దామా!
10-256 బాలుం డెక్కడ
సందర్భం:
పరంధాముడు బాలకృష్ణుడై లీలలెన్నో ప్రదర్శించాడు. అవి లోకంలో మరెక్కడా మరెవ్వరియందూ సంభవించేవి కావు. పసితనంలోనే బండిరూపంలో ఉన్న బండరక్కసుని కాలితో తన్ని నేలగూల్చివేశాడు. అది విని గోపకులు, గోపికలు ముక్కున వేలు వేసుకొని ఇలా అనుకొంటున్నారు.
శా. బాలుం డెక్కడ? బండి యెక్కడ? నభోభాగంబుపైఁ జేడ్పడన్
గాలం దన్నుట యెక్క? డాటపడుచుల్ గల్లాడి? రీ జడ్డు ప
ల్కే లోకంబున నైనఁ జెప్పఁబడునే? యే చందమో కాక యం
చాలాపింపుచుఁ వ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యలై రంతటన్.
ప్రతిపదార్థం:
బాలుండు = పిల్లవాడు; ఎక్కడ = ఎక్కడ; బండి = బండి; ఎక్కడ = ఎక్కడ; నభోభాగంబు = ఆకాశము; పైన్ = మీదికి; చేడ్పడన్ = వికలమగునట్లుగా; కాలం = కాలితో; తన్నుట = తన్నడము; ఎక్కడన్ = ఎక్కడ; ఆటపడుచుల్ = తోటిపిల్లలు; కల్లలు = అబద్ధములు; ఆడిరి = పలికిరి; ఈ = ఇలాంటి; జడ్డు = తెలివిమాలిన; పల్కు = మాటలు; ఏ = ఏ; లోకంబునన్ = లోకములో; ఐనన్ = అయినప్పటికి; చెప్పబడునే = పలుకుతారా; ఏ = ఎలాంటి; చందమో = హేతువో; కాక = కాని; అంచున్ = అనుచు; ఆలపించుచున్ = మాటలాడుకొనుచు; అంతటన్ = అని వ్రేలువ్రేతలు = గోపగోపికలు; ప్రభూత = పుట్టిన; ఆశ్చర్యలు = ఆశ్చర్యములుగలవారు; ఐరి = అయినారు.
తాత్పర్యం:
పిల్లవాడెక్కడ? బండి యెక్కడ? మింటిలో విరిగి ముక్కలయ్యే విధంగా కాలితో తన్నటం ఎక్కడ? తోడి చెలికాండ్రు అబద్ధాలాడుతున్నారు. ఇటువంటి తెలివితక్కువమాట ఏ లోకంలో నైనా ఎవరైనా పలుకుతారా? ఇదేమి తీరో! అని పలువిధాలుగా పలుకుతూ గోపగోపికలు చాలా ఆశ్చర్యపడ్డారు.
10-258 అలసితివి గదన్న
సందర్భం:
బండిని పగులదన్ని పసిపాపడైన కృష్ణుడు నంగనాచిలా ఏమీ ఎరుగనట్లు ఏడవడం మొదలుపెట్టాడు. తల్లిహృదయం తల్లడిల్లిపోయింది. ఆమె పరుగుపరుగున వచ్చి కన్నయ్యతో ఇలా అంటున్నది.
ఆ. అలసితివి గదన్న! యాకొంటివి గదన్న!
మంచి యన్న! యేడ్పు మాను మన్న!
చన్నుఁ గుడువు మన్న! సంతసపడు మన్న!
యనుచుఁ జన్నుఁ గుడిపె నర్భకునకు.
ప్రతిపదార్థం:
అన్న = నాయనా; అలసితివి = అలసిపోయావు; కద = కదా; ఆకొంటివి = ఆకలివేసినది; కద = కదా; అన్న = నాయనా; మంచియన్న = మంచివాడివి కదా; ఏడ్పున్ = రోదనమును; మానుమన్న = మానివేయి నాన్నా; చన్ను = చనుబాలు; కుడువుము = తాగుము; అన్న = నాయనా; సంతసపడుమన్న = సంతోషింపుము; అనుచున్ = అంటూ; అర్భకునకున్ = పిల్లవానికి; చన్నున్ = చనుబాలు; కుడిపెన్ = తాగించింది.
తాత్పర్యం:
కన్నా! అలసిపోయావా తండ్రీ! ఆకలివేస్తున్నదా నాన్నా! మంచివాడవుగదూ! ఏడ్పుమాను నాయనా! ఇదిగో పాలు త్రాగు! సంతోషం పొందు చిన్నా! అంటూ ఆ పసివానికి పడతి యశోద పాలిచ్చింది.
10-296 తనువున నంటిన
సందర్భం:
కొన్ని ఘనకార్యాలు చక్కబెట్టడానికి స్వామి వాసుదేవుడు అవసరమైనప్పుడల్లా అవనికి దిగివస్తూ ఉంటాడు. వినోదంగా ఒక తోడును కూడా తెచ్చుకుంటాడు. ఆ స్వామియే నందగోపబాలుడు కన్నయ్య. తోడై వచ్చిన మహాత్ముడు ఆదిశేషుని అంశమైన బలరాముడు. పసితనపు పరువంలోని గోపబాలుని పరికించి చూచేవారికి పరమశివుని దర్శనం కూడా అవుతున్నది.
సీ. తనువున నంటిన ధరణీపరాగంబు; పూసిన నెఱి భూతిపూఁత గాఁగ;
ముందఱ వెలుగొందు ముక్తాలలామంబు; తొగలసంగడికాని తునుక గాఁగ;
ఫాలభాగంబుపైఁ బరఁగు కావిరిబొట్టు; కాముని గెల్చిన కన్ను గాఁగఁ;
కంఠమాలికలలోని ఘన నీలరత్నంబు; కమనీయ మగు మెడకప్పు గాఁగ;
ఆ. హారవల్లు లురగ హారవల్లులు గాఁగ;
బాలులీలఁ బ్రౌఢబాలకుండు
శివుని పగిది నొప్పె శివునికిఁ దనకును
వేఱులేమిఁ దెలుప వెలయునట్లు.
ప్రతిపదార్థం:
తనువున = ఒంటికి; అంటిన = అంటుకొన్న; ధరణీపరాగంబు = మట్టిమర కలు; పూసిన = రాసుకొన్న; నెఱి = నిండైన; భూతి = విబూది; పూత = పూత; కాగ = అగుచుండగా; ముందర = తలపై; వెలుగొందు = ప్రకాశించెడి; ముక్తాలలామంబు = ముత్యాలచేరు; తొగలసంగడికాని = కలువల స్నేహితుడైన చంద్రుని; తునుక = రేఖ; కాగ = అగుచుండగా; ఫాలభాగంబుపై = నుదుటిమీద; పరగు = దిద్దిన; కావిరిబొట్టు = నల్లని చాదు (బొట్టు); కాముని = మన్మథుని; గెల్చిన = జయించిన; కన్ను = కన్ను (మూడవకన్ను); కాగ = అగుచుండగా; కంఠమాలిక = మెడలోనిహారము; లోని = అందలి; ఘన = బాగాపెద్ద; నీలరత్నంబు = ఇంద్రనీలమణి; కమనీయమగు = అందమైన; మెడకప్పు = కంఠమునందలి నల్లదనం; కాగ = అగుచుండగా; హారవల్లులు = ముత్యాలహారపుపేటలు; ఉరగ = సర్పములనెడి; హారవల్లులు = దండలపేర్లు; కాగ = అగుచుండగా; బాల = పసితనపు; లీలన్ = విలాసములతో; ప్రౌఢ = అన్నీతెలిసిన; బాల కుండు = పిల్లవాడు; శివుని = పరమశివుని; పగిదిన్ = వలె; ఒప్పెన్ = కనబడు చుండెను; శివునికిం = పరమశివునికి; తనకును = తనకు; వేఱు = భేదము; లేమిన్ = లేకపోవుటను; వెలయునట్లుగా = విలసిల్లినవిధమును, తెలుపన్ = తెలియజేయుటకు.
తాత్పర్యం:
కన్నయ్య తన అన్నయ్యతో పాటు ఆడుకుంటున్నాడు. ఒడలంతా దుమ్ము దుమ్మైపోయింది. అది పరమశివుడు పూసుకొన్న విభూతిలాగ వెలిగిపోతున్నది. తలమీద తెలికాంతులు వెదజల్లుతున్న ముత్యాలహారం చంద్రశేఖరుని తలమీది జాబిల్లిని తలపింపచేస్తున్నది. అమ్మ నొసటిమీద ఎఱ్ఱని తిలకం చక్కగా పెట్టింది. అది కాముణ్ణి కాల్చివేసిన మూడవ కన్నులాగా ప్రకాశిస్తున్నది. యశోదమ్మ మెడచుట్టి వచ్చేట్టుగా ఒక చక్కనిహారం వేసింది. దానిమధ్య ఇంద్రనీలమణి మనోజ్ఞకాంతులతో ఒప్పారుతున్నది. అది శివమహాదేవుని మెడలోని నీలిమను తోపచేస్తున్నది. నిలువెల్లా హారాలే కదలాడుతూ ఉన్నాయి. అవి శివుని దేహంమీద తిరుగాడే పాములా అన్నట్లున్నాయి. ఇలా ఆ గోపబాలుడు, నిజానికి గొప్ప ప్రౌఢుడు, బాలలీలలతో ఫాలలోచనుని వలె భాసిల్లుతున్నాడు. బహుశః, మేమిద్దరము కాదయ్యా! ఆయనే నేను, నేనే ఆయన అని లోకాలకు తెలియజెప్పాలి అనే కోరిక కలిగి ఉంటుంది.
10-306 బాలురకుఁ
సందర్భం:
కన్నయ్య చిన్నప్పుడు చాలాచాలా చిలిపి పనులు చేశాడు. అవన్నీ తాను భగవంతుడనని ప్రకటించడం కోసమే కనుక వానిని మహాకవులూ, మహర్షులూ లీలలుగా భావించి ఆనందసాగరంలో ఈదులాడారు. ఒక గోపిక యశోదమ్మతో బాలుని లీలను ఇలా చెప్పుకుంటున్నది.
కం. బాలురకుఁ బాలు లే వని
బాలింతలు మొఱలు వెట్టఁ పకపక నగి నీ
బాలుం డాలము సేయుచు
నాలకుఁ గ్రేపులను విడిచె నంభోజాక్షీ!
ప్రతిపదార్థం:
అంభోజాక్షీ = సుందరీ!; బాలురకు = పిల్లలకు; పాలు = తాగుటకు పాలు; లేవని = లేవు అని; బాలింతలు = పసిబిడ్డల తల్లులు; మొఱలువెట్ట = మొత్తుకొనగా; పకపక నగి = పకపకమని నవ్వి; ఈ బాలుండు = ఈ పిల్లవాడు; ఆలము = అల్లరి; సేయుచున్ = చేస్తూ; ఆలకు = ఆవులకు; క్రేపులను = దూడలను; విడిచెన్ = వదలి పెట్టెను.
తాత్పర్యం:
చక్కగా విచ్చుకొన్న పద్మాలలాగా అలరారుతున్న కన్నులు గల ఓ యశోదమ్మా! ఒక పక్క మా పసిపిల్లలకు పాలులేవని బిడ్డలను గన్న అమ్మలు మొత్తుకుంటూ ఉంటే నీ పిల్లగాడు పకపకా నవ్వుతూ పట్టనలవిగాని అల్లరిచేస్తూ దూడలను ఆవులదగ్గరకు వదలి వేశాడమ్మా!
10-307 పడఁతీ! నీ బిడ్డడు
సందర్భం:
గోపికలు యశోదమ్మకు కృష్ణుని దుడుకు పనులు చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకోవటం వారికి అదొక తృప్తి. వినడం యశోదమ్మకు ఆనందం. మహాకవి పోతన మనకు కూడా అటువంటి తృప్తినీ ఆనందాన్నీ అందిస్తున్నారు.
కం. పడఁతీ! నీ బిడ్డడు మా
కడవలలో నున్న మంచి కాఁగిన పా లా
బుడుతలకుఁ బోసి చిక్కిన
కడవలఁ బో నడిచె నాజ్ఞ కలదో లేదో?
ప్రతిపదార్థం:
పడతీ = ఇంతీ; నీ బిడ్డడు = నీ పిల్లవాడు; మా కడవలలో = మా కుండలలో; ఉన్న = ఉన్నట్టి; మంచి = శుభ్రముగ; కాగిన = కాగినట్టి; పాలు = పాలను; బుడుతలకు = పిల్లలకు; పోసి = తాగించి; చిక్కిన = మిగిలిన; కడవలన్ = కుండలను; పోనడిచెన్ = పగులగొట్టెను; ఆజ్ఞ = అడ్డూ అదుపు; కలదో = ఉన్నదో; లేదో = లేదో?
తాత్పర్యం:
యశోదమ్మా! నీవు కూడా ఒక ఆడదానివే కదమ్మా! చూడు నీ పోరగాడు ఏమి చేశాడో? కడవలలో మేము చక్కగా మీగడ కట్టే విధంగా కాచి దాచుకొన్న పాలను మెల్లగా మా ఇళ్ళలో దూరి, దుడుకుతనంతో ఏ మాత్రమూ తీసిపోని చెలికాండ్రకు పీకల దాకా పోశాడమ్మా! కాస్తోకూస్తో మిగిలిన పాలకుండలను పగులగొట్టి పారిపోయాడమ్మా! వానిమీద నీకేమయినా అదుపూ ఆజ్ఞా ఉన్నాయటమ్మా!
10-308 మీ పాపఁడు
సందర్భం:
యశోదమ్మకు కన్నయ్యమీద కోపం రావాలి. అతనిని గట్టిగా శిక్షించాలి. అతడు బుంగమూతి పెట్టి కన్నులు నులుపుకుంటూ బుడిబుడి ఏడ్పులు ఏడుస్తూ ఉంటే ఆ అందమే అందం. అందుకోవాలని అంగనలు పితూరీలు చెపుతున్నారు.
కం. మీ పాపఁడు మా గృహముల
నా పోవఁగఁ బాలు ద్రావ నగపడ కున్నన్
గోపించి పిన్నపడుచుల
వాపోవఁగఁ జిమ్మికొనుచు వచ్చెం దల్లీ!
ప్రతిపదార్థం:
మీ పాపడు = మీ పిల్లవాడు; మా గృహములన్ = మా ఇండ్లలో; ఆపోవగన్ = సరిపడినంత; పాలు = పాలను; త్రావ = తాగుటకు వచ్చాడు; అగపడకున్నం = కనబడ క పోతే; కోపించి = కోపంతో; పిన్నపడపచుల = పసిబిడ్డలను; వాపోవగన్ = ఏడ్పిం చుచు; జిమ్ముకొనుచు = చెదరగొడుతూ; వచ్చెన్ = వచ్చెను.
తాత్పర్యం:
తల్లీ! యశోదమ్మా! ఏమి చెప్పమంటావు. మీ అబ్బాయిగారు మా యింట్లో తృప్తితీరా, కడుపునిండా పాలు త్రాగాలని దూరాడు. పాపం! వాడికి పాలెక్కడా కనపడలేదు. అప్పుడు ఆయనగారికి గొప్పగా కోపం వచ్చింది. ఇంట్లో ఉన్న మా పసిపిల్లలు కుయ్యో మొర్రో అని ఏడుస్తూ ఉండగా వారినందరిని చెదరగొట్టుకుంటూ బయటకు వచ్చాడమ్మా!
10-309 ఆడం జని
సందర్భం:
ఒక చక్కని లతలాగా ఊగిపోతున్న యశోదమ్మతల్లీ! మీవాడు వట్టి తంపులమారివాడమ్మా! అంటున్నది ఒక గోపిక. చూడు ఎంత ఆగడం చేశాడో నీ కొడుకు.
కం. ఆడం జని వీరల పెరుఁ,
గోడక నీ సుతుఁడు త్రావి యొక యించుక తాఁ
గోడలి మూఁతిం జరిమినఁ
గోడలు మ్రు చ్చనుచు నత్త కొట్టె లతాంగీ!
ప్రతిపదార్థం:
లతాంగీ = ఇంతీ!; ఆడన్ = అక్కడకు; చని = వెళ్ళి; వీరల పెరుగున్ = వీరి యింటిలోని పెరుగును; ఓడక = బెదురు లేకుండా; నీ సుతుండు = నీ పుత్రుడు; త్రావి = తాగి; ఒక యించుక = కొంచెము; తా కోడలి = వారి కొడుకు భార్య; మూతిం = నోటికి; చరిమినన్ = రాయగా; కోడలు = కోడలు; మ్రుచ్చు = దొంగ; అనుచును = అనుచు; కొట్టెన్ = కొట్టినది.
తాత్పర్యం:
యశోదమ్మా! మీ పిల్లవాడు మెల్లగా ఒక యింటిలో దూరాడు. జంకుగొంకులు ఏ మాత్రమూ లేకుండా ఆ యింటిలోని పెరుగు త్రాగివేశాడు. పాపం ఆ యింటి కోడలు పిల్ల గమనించింది. ఈ మహాపురుషుడు వెంటనే ఆ పెరుగును కొంచెం తీసికొని ఆ కోడలి మూతికి అంటించాడు. ఆమె బిత్తరపోయి చూస్తూ ఉండగా అత్తగారు కోడలిని చూడనే చూచింది. భడవా! దొంగతిండి తింటున్నావా? అని కోడలికి నాలుగు వడ్డించింది.
10-310 వారిల్లు సొచ్చి
సందర్భం:
ఒక గోపిక కన్నయ్య దుడుకుతనాన్ని యశోదమ్మకు ఇలా వివరించి చెబుతున్నది.
కం. వారిల్లు సొచ్చి కడవలఁ
దోరంబగు నెయ్యి త్రావి తుది నా కడవల్
వీ రింట నీ సుతుం డిడ
వారికి వీరికిని దొడ్డ వా దయ్యె సతీ!
ప్రతిపదార్థం:
సతీ = ఇల్లాలా; నీ సుతుండు = నీ పుత్రుడు; వారిల్లు = వారి నివాసమును; చొచ్చి = దూరి; కడవలన్ = కుండలలోని; తోరంబగు = గట్టిగాపేరుకొన్న; నెయ్యిన్ = నేతిని; త్రావి = తాగి; తుది = చివరకు; ఆ కడవల్ = ఆ కుండలను; వీరింటన్ = వీరి ఇంటిలో; ఇడ = పెట్టగా; వారికి = ఆ యింటివారికి, వీరికిని = ఈ ఇంటివారికి; దొడ్డ = పెద్ద; వాదయ్యె = జగడము అయినది.
తాత్పర్యం:
అమ్మా! మహాతల్లీ! మీ పాపడు ఎంత నంగనాచియో చూడు. వాళ్ళింట్లో దూరాడు. కడవలలో కమ్మగా క్రాగిన కమ్మని నేతిని అంతా పొట్టను పెట్టుకున్నాడు. ఆ కడవలనన్నింటినీ తెచ్చి వీరింట్లో పెట్టాడు. ఇంక చూడు! వాళ్ళూ వీళ్ళూ తిట్టుకొన్న తిట్లు అన్నీ ఇన్నీ కావమ్మా!
10-326 కలకంఠి
సందర్భం:
గొల్లభామలు ఇండ్ల తలుపులకు గట్టిగా తాళాలు వేసుకున్నారు. కృష్ణుడు ప్రవేశించటానికి పిసరంత సందు కూడా లేకుండా ఏర్పాట్లు భద్రంగా చేశారు. నిబ్బరంగా ఉండి గమనిస్తున్నారు. కృష్ణుడు ఇళ్ళలోనికి పోనేపోయాడు. వెక్కిరింతలూ వేళాకోళాలూ చేయనే చేశాడు. పాపం గొల్లభామలు యశోదకు ఇలా చెప్పుకుంటున్నారు.
సీ. కలకంఠి! మా వాడ గరితల మెల్ల నీ
పట్టి రాఁగల డని పాలు పెరుగు
లిండ్లలోపల నిడి యే మెల్లఁ దన త్రోవఁ
చూచుచో నెప్పుడు చొచ్చినాఁడొ?
తలుపులు ముద్రలు తాళంబులును పెట్టి
యున్న చందంబున నున్న వరయ;
నొక యింటిలోఁ నాడు నొక యింటిలోఁ బాడు
నొక యింటిలో నవ్వు నొకటఁ దిట్టు;
ఆ. నొకట వెక్కిరించు నొక్కొకచో మృగ
పక్షి ఘోషణములు పరఁగఁ జేయు
నిట్లు చేసి వెనుక నెక్కడఁ బోవునో
కాన రాఁడు రిత్త కడవ లుండు.
ప్రతిపదార్థం:
కలకంఠి = కోకిలవంటి స్వరము కల ఓ పడతీ; మా వాడన్ = మా పేటలోని; గరితలము = స్త్రీలము; నీ పట్టి = నీ పిల్లవాడు; రాగలడు = వస్తాడు; అని = భావించి; పాలు = పాలను; పెరుగున్ = పెరుగును; ఇండ్ల లోపలన్ = ఇళ్ళలో; ఇడి = పెట్టి; ఏము = మేము; ఎల్లన్ = అందరము; తన = అతని; త్రోవన్ = దారిని; చూచుచోన్ = చూస్తుండగా; ఎప్పుడున్ = ఎప్పుడు; చొచ్చినాడొ = దూరాడో; తలుపుల ముద్రల = తలుపుల గొళ్ళెముల; తాళంబులునున్ = తాళములు; పెట్టి = వేసినవి; ఉన్న చందంబు నన్ = ఉన్నవిధముగానే; ఉన్నవి = ఉన్నాయి; అరయ = తరచిచూసినను; ఒక = ఒకానొక; ఇంటిలోన్ = ఇంటిలో; పాడున్ = పాటలుపాడుతూ; ఒక = ఒకానొక; ఇంటి లోన్ = నివాసములో; ఆడున్ = నాట్యమాడుతూ; ఒక ఇంటిలోన్ = ఒకానొక గృహము లో; నవ్వున్ = నవ్వుతూ; ఒకటన్ = ఒకదానిలో; తిట్టున్ = తిడుతూ; ఒకటన్ = ఒక చోట. వెక్కిరించున్ = వెక్కిరించుచూ; ఒక్కొక్కచోన్ = కొన్నిచోట్ల; మృగ = జంతువుల; పక్షి = పక్షుల; ఘోషణములున్ = అరుపులను; పరగన్ = వింతగా; చేయున్ = చేయును; ఇట్లు = ఈ విధముగ; చేసి = చేసిన; వెనుకన్ = తరువాత; ఎక్కడన్ = ఎక్కడకు; పోవునో = వెళ్ళిపోవునో; కానరాడు = కనిపించడు; రిత్త = ఖాళీ; కడవలు = కుండలు; ఉండు = ఉండును.
తాత్పర్యం:
నీ కమ్మని కంఠం మా కంఠాలను నొక్కివేస్తుందమ్మా యశోదమ్మా! మా పేట లోని ఆడవాళ్ళందరమూ కలిసి గట్టిపూనికతో ఒక పథకం వేసుకున్నాం. నీ కొడుకు వస్తాడేమో అని పాలూ పెరుగూ ఇండ్ల లోపలి గదులలో భద్రంగా పెట్టి ఎలా వస్తాడో అని ఆయనగారు వచ్చేదారిని చూస్తూ ఉన్నాము. ఇళ్ళకు వేసిన తాళాలూ, తలుపుల ముద్రలూ వేసినవి వేసినట్లుగానే ఉన్నాయి. కానీ ఎప్పుడు దూరాడో, ఎలా దూరాడో ఇండ్ల లోపల ఉన్నాడు. ఒక ఇంటిలో ఆడుతున్నాడు. మరొక ఇంటిలో పాడుతున్నాడు. ఒక యింటిలో నవ్వుతున్నాడు. ఒక ఇంటిలో వెక్కిరిస్తూ ఉన్నాడు. ఇంకా వింతగా జంతువులా, పక్షులా కూతలు. ఎలాగైనా పట్టి కట్టిపడవేయాలని ప్రయత్నిస్తే కనపడనే కనపడడు. ఎక్కడకు పోతాడో ఏమో! ఇళ్ళలో మాత్రం ఖాళీ కడవలు కానవస్తాయి.
10-328 ఓ యమ్మ! నీ కుమారుఁడు
సందర్భం:
గోపికలు యశోదమ్మకు మొరపెట్టుకుంటున్నారు. శ్రీకృష్ణుని ఆగడాలను పేర్కొని ఎక్కడికైనా వెళ్ళిపోతామంటున్నారు.
కం. ఓ యమ్మ! నీ కుమారుఁడు
మా యిండ్లను బాలు పెరుగు మననీఁ డమ్మా!
పోయెద మెక్కడి కైనను
మా యన్నల సురభు లాన మంజులవాణీ!
ప్రతిపదార్థం:
ఓ యమ్మ = ఓ తల్లీ; మంజులవాణీ = కమ్మగా మాట్లాడే సుందరీ!; నీ కుమారుడు = నీ పుత్రుడు; మా ఇండ్లను = మా నివాసములలో; పాలున్ = పాలు; పెరుగున్ = పెరుగు; మననీడమ్మా = బతకనీయడు; ఎక్కడికైనను = మరి ఇంకొక చోటునకు; పోయెదము = పోతాము; మా అన్నల = మా తండ్రుల; సురభులు = గోవుల మీద; ఆన = ఒట్టు.
తాత్పర్యం:
ఓయమ్మా! మంజులవాణీ! నీ కుమారుడు మా యిండ్లలో పాలూపెరుగూ బ్రతకనివ్వడు తల్లీ! ఎక్కడికైనా వెళ్ళిపోతాము. ఇది ఏదో ఆషామాషీగా అంటున్నమాట కాదు తల్లీ! మా అన్నల ఆవులమీద ఒట్టువేసి అంటున్నమాట.
10-337 అమ్మా! మన్ను దినంగ
సందర్భం:
గోపవనితలు కృష్ణుని ఆగడాలను యశోదమ్మకు చెప్పుకొని తమదారిని తాము పోయారు. ఈ అయ్యవారు ఏమీ ఎరుగని నంగనాచిలా అమ్మవడిలో ఆడుకుంటూ కూర్చున్నాడు. ఒకనాడు బలరాముడు మొదలైన గోపబాలురందరూ యశోదకు కృష్ణుడు మన్ను తింటున్నాడని చెప్పారు. ఆయమ్మ మన్నెందుకు తింటున్నావని గదమాయించింది. అప్పుడు కన్నయ్య ఇలా అన్నాడు.
శా. అమ్మా! మన్ను దినంగ నే శిశువునో? యాకొంటినో? వెఱ్ఱినో?
నమ్మం జూడకు వీరి మాటలు మది; న్నన్నీవు కొట్టంగ వీ
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీ యాస్య గం
ధమ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే.
ప్రతిపదార్థం:
అమ్మా = తల్లీ; మన్నున్ = మట్టిని; తినంగ = తినుటకు; నేన్ = నేను; శిశువునో = చంటిపిల్లాడినా; ఆకొంటినో = ఆకలేసిఉన్నానా; వెఱ్ఱినో = వెర్రివాడినా; వీరి మాటలు = వీరి పలుకులను; మదిన్ = మనస్సులో; నమ్మంజూడకు = నమ్మబోకుము; నన్ను = నన్ను; నీవు = నీవు; కొట్టంగన్ = కొట్టడంకోసం; వీరు = వీరు; ఈ + మార్గమున్ = ఇలాంటివి; ఘటించి = కూర్చి, కల్పించి; చెప్పెదరు = చెప్పుచున్నారు; కాదేనిన్ = కాకపోయినచో; మదీయ = నా యొక్క; ఆస్య = నోటి; గంధమున్ = వాసనను; ఆఘ్రాణము సేసి = వాసనచూచి; = నా వచనముల్ = నా మాటలు; తప్పైనన్ అబద్దమైతే; దండింపవే = శిక్షించు.
తాత్పర్యం:
అమ్మా! మన్ను తినటానికి నేనేమైనా పసివాడనా? ఆకలి వేసినవాడనా? వెఱ్ఱి వాడనా? నీవు వీరి మాటలు మనస్సులో నమ్మవద్దు. నీవు నన్ను కొట్టాలని వీళ్ళీ మార్గం కల్పించి చెబుతున్నారు. కాదంటే నా నోటి వాసన చూచి నా మాటలు తప్పైతే నన్ను దండించమ్మా!
10-341 కలయో! వైష్ణవ మాయయో
సందర్భం:
నా నోటి వాసన చూచి మన్ను తిన్నానో లేదో తెలుసుకో అని నోరు పెద్దగా తెరచి ఆమెకు చూపాడు. యశోదకు ఆ చిన్నినోటిలో సముద్రాలతో, పర్వతాలతో, అడవులతో, భూగోళాలతో, అగ్ని, ఆదిత్యుడు, చంద్రుడు, దిక్పాలకులు మొదలైన వానితో కూడిన బ్రహ్మాండమంతా కానవచ్చింది. ఆ అద్భుత దర్శనానికి ఆమె విస్తుపోయి ఇలా అనుకుంటున్నది.
మ. కలయో! వైష్ణవ మాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో!
తలఁపన్నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర
స్థలమో! బాలకుఁ డెంత? యీతని ముఖస్థం బై యజాండంబు ప్ర
జ్వల మై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్.
ప్రతిపదార్థం:
కలయో = స్వప్నమా; వైష్ణవ మాయయో = విష్ణుమూర్తి మాయా; ఇతర సంకల్పార్థమో = మనస్సులోని కోరికలకు రూపకల్పనా, సత్యమో = వాస్తవమా; తలప న్నేరక = విచారించలేక; ఉన్నదాననొ = ఉన్నానేమో; యశోదాదేవిన్ = నేనసలు యశోదాదేవిని; కానో = కాదా; పరస్థలమో = ఇతరమైన ప్రదేశమా (ఇది); బాలకుడు = పిల్లవాడు; ఎంత = ఎంతటివాడు; ఈతని = అతని యొక్క; ముఖస్థంబై = ముఖము నం దున్నదై; అజాండంబు = విశ్వము; ప్రజ్వలమై = మిక్కలి ప్రకాశిస్తూ; ఉండుటకున్ = ఉండుటకు; ఏమి = ఏమి; హేతువో = కారణమో; చింతింపగన్ = విచారించగా మహా శ్చర్యంబు = గొప్పవింత.
తాత్పర్యం:
ఏమిటి ఇది కలయా? విష్ణువునకు సంబంధించిన మాయయా? లేక మనస్సులోని సంకల్పాలకు రూపకల్పనయా? లేక ఇదంతా సత్యమేనా? నా మనస్సు సరిగ్గా పని చేస్తున్నదా? అసలు నేను యశోదనేనా? ఇది మా యిల్లేనా? పరస్థలమా? వ్రేలెడంత లేని యీ బాలుడేమిటీ? ఇతని మోములో బ్రహ్మాండమంతా గొప్ప వెలుగులతో అలరారట మేమిటి? దీనికి కారణం ఏమిటో? ఇది భావించినకొద్దీ పరమాద్భుతంగా ఉన్న విషయం.
10-346 బాలుఁ డీతం డని
సందర్భం:
ఆ కృష్ణయ్య అమ్మను అతలాకుతలం చేసివేస్తున్నాడు. అలా చేస్తున్నకొద్దీ ఆమె హృదయం ఆనందధామమే అవుతున్నది. కానీ పైకి మాత్రం ఆ అల్లరికి అడ్డుకట్టవేయాలని ఆరాటంగానూ ఉన్నది. ఒకనాడు ఉట్టిమీద గట్టిగా పెట్టిన వెన్నను ఒక కోతికి అందిస్తూ దొరికిపోయాడు. ఒక బెత్తం పుచ్చుకొని కన్నయ్య వెంటబడింది యశోద. మనస్సులో ఇలా అనుకొంటున్నది.
సీ. బాలుఁ డీతం డని భావింతు నందునా; యే పెద్దలును నేర రీ క్రమంబు
వెఱ వెఱుంగుటకు నై వెఱపింతు నందునా; కలిగి లే కొక్కఁడు గాని లేఁడు
వెఱపుతో నాబుద్ధి వినిపింతు నందునా; తనుదాన యై బుద్ధిఁ దప్ప కుండు
నొం డెఱుంగక యింట నుండెడి నందునా; చొచ్చి చూడని దొకచోటు లేదు
ఆ. తన్ను నెవ్వ రైనఁ దలపోయఁ బాఱెడు
నోజ లేదు భీతి యొక టెఱుంగఁ
డెలమి నూరకుండఁ డెక్కసక్కెముల నాడుఁ
బట్టి శాస్తి జేయు భంగి యెట్లు?
ప్రతిపదార్థం:
బాలుడు = పిల్లవాడు; ఈతండు = ఇతను; అని = అని; భావింతునందునా = అనుకొందామంటే; ఏ పెద్దలును = ఎలాంటి పెద్దవారుకూడ; ఈ క్రమంబున్ = ఈ విధముగా; నేరరు = చేయలేరు; వెఱపున్ = భయము; ఎఱుంగుటకు నై = తెలియ చెప్పుటకు; వెఱపింతును = భయపెట్టెదను; అందునా = అనుకొందామంటే; కలిగిలేక = లేకలేక; ఒక్కడు = ఇతడొక్కడే; కాని = తప్పించి; లేడు = మరొకడులేడు; వెఱపుతో = భయపెట్టటంతో; నా బుద్ధి = మంచిబుద్ధిని; వినిపింతున్ = చెప్పెదను; అందునా = అనుకొందామంటే; తనున్ = తనంతట; తానయై = తానే; బుద్ధిన్ = మంచిబుద్ధిని; తప్పకుండున్ = తప్పక ఉండును; ఒండున్ = ఇతరవిషయములేవీ; ఎఱుంగక = తెలిసి కొనకుండ; ఇంటన్ = ఇంట్లోనే; ఉండెడిన్ = ఉండును; అందునా = అనుకొందామంటే; చొచ్చి = దూరి; చూడనిది = చూడనట్టిది; ఒక = ఒక్కటైనా; చోటు = స్థలము; లేదు = లేదు; తన్నున్ = అతనిని; ఎవ్వరైనన్ = ఎవరైనాసరే; తలపోయెన్ = తలచుకొనినచో; పాఱెడి = పరిగెట్టిపోయెడి; ఓజ = విధము; లేదు = లేదు; భీతి = భయము; ఒక టెఱుంగడు = అసలులేదు; ఎలమిన్ = చక్కగా; ఊరకుండడు = ఊరుకోడు; ఎక సక్కెములు = వంకరమాటలు; ఆడున్ = పలుకును; పట్టి = పట్టుకొని; శాస్తి = తగిన శిక్ష; చేయన్ = చేయవలసిన; భంగి = విధము; ఎట్లు = ఏమిటి.
తాత్పర్యం:
వీనిని పసివాడని అనుకొందామా అంటే యిటువంటి చేష్టలు పెద్దవాళ్ళు కూడా చేయలేరు. వినయాన్ని నేర్పటానికి కొంచెం భయపెడదామా అంటే లేకలేక కలిగిన బాలుడైనాడు. ఎప్పుడైనా ఏదైనా ఉపాయంతో నాలుగు మంచి మాటలతో బుద్ధి చెబుదామా అంటే నేను చెప్పబోయే వేళకు ఏ అల్లరీ ఆగమూ లేకుండా బుద్ధిమంతుడై కూర్చుంటాడు. మరొకదానిని పట్టించుకోకుండా ఇంట్లోనే కూర్చుంటాడా అంటే చూడని చోటు ఒక్కటికూడా ఉండదు. ఎవ్వరైనా తననుగూర్చి భావిస్తే పరుగెత్తుకొనిపోతూ ఉంటాడు. ఒక పద్ధతి లేదు. భయమన్నమాట లేదు. పోనీ మాటాడకుండా ఊరకుందామా అంటే వేళాకోళాలు వెక్కిరింతలతో ఉడికిస్తూ ఉంటాడు. అట్టి పిల్లవానిని పట్టి శాస్తి చేసే విధం ఏమిటో తెలియటం లేదు.
10-363 నీ పద్యావళు లాలకించు
సందర్భం:
బాలకృష్ణుణ్ణి అమ్మ రోటికి కట్టిపడవెయ్యగా దానితోపాటు పాకుకుంటూ రెండు మద్దిచెట్ల మధ్యనుండి పోగా అవి రెండూ ఫెళఫెళ నాదాలతో కూలిపోయాయి. వాని నుండి ఇద్దరు గంధర్వులు నలకూబర మణిగ్రీవులై బాలునకు మోకరిల్లి నిలిచి స్తుతి చేశారు.
శా. నీ పద్యావళు లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్
నీ పేరం బనిసేయు హస్తయుగమున్ నీ మూర్తిపైఁ జూపులున్
నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపైఁ జిత్తముల్
నీ పై బుద్దులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణా!
ప్రతిపదార్థం:
నీరేజపత్రేక్షణా = శ్రీకృష్ణా!; నీ = నీ యొక్క; పద్య = పద్యముల; ఆవళుల్ = సమూహములను; ఆలకించు = వినెడి; చెవులన్ = చెవులను; నిన్నున్ = నిన్ను; ఆడు = స్తుతించెడి; వాక్యంబులన్ = మాటలను; నీ పేరన్ = నీ సమర్పణగా; పనిచేయు = పనిచేసెడి; హస్త = చేతుల; యుగముల్ = జంటలు; నీ మూర్తిపై = నీ స్వరూపముమీది; చూపులను = దృష్టిని; నీ = నీ; పాదంబుల = పాదముల; పొంతన్ = దగ్గర; మ్రొక్కు = వాలి నమస్కరించెడి; శిరముల్ = తలలు; నీ = నీ; సేవపై = సేవచేయుటయందే; చిత్తముల్ = లగ్నమైన మనసులు; నీ పై = నీ మీది; బుద్ధులు = బుద్ధులు; మాకున్ = మాకు; కరుణన్ = దయతో; ఇమ్ము = ఇమ్ము.
తాత్పర్యం:
పద్మపత్రనేత్రా! పరంధామా! నీ పద్యాల వరుసలను ఆలకించే చెవులనూ, నిన్ను కొనియాడగలిగే వాక్కులనూ, నీ పేరుతో పనిచేసే చేతుల జంటనూ, నీ మూర్తిపై ప్రసరించే చూపులనూ, నీ పాదాల చెంత మ్రొక్కే శిరస్సునూ, నీ సేవ చేసుకొనే చిత్తాలనూ, నీ మీది బుద్ధులనూ మాకు దయతో ప్రసాదించు స్వామీ!
10-601 రా పూర్ణచంద్రిక
సందర్భం:
సర్వభూపాలకుడైన పరమాత్మ ఇప్పుడు గోపాలకుడైనాడు. అన్నతో పాటు పసితనం దాటుకుని బాల్యంలోనికి అడుగుపెట్టాడు. ఆటపాటలన్నీ ఆవులతో, గోపాలకులతోనే! అరణ్యప్రదేశాలలో ఆ గోవులను, గోపాలకులను అలరిస్తూ తిరగడమే ఆ అయ్యగారి పని. తాను కాచుకునే ఆవులకు అందమైన పేర్లు పెట్టుకున్నాడు. వానిని ప్రియమారా పిలుస్తూ ఉంటాడు.
సీ. రా పూర్ణచంద్రిక! రా గౌతమీగంగ! రమ్ము భగీరథరాజతనయ!
రా సుధాజలరాశి! రా మేఘబాలిక! రమ్ము చింతామణి! రమ్ము సురభి!
రా మనోహారిణి! రా సర్వమంగళ! రా భారతీదేవి! రా ధరిత్రి!
రా శ్రీమహాలక్ష్మి! రా మందమారుతి! రమ్ము మందాకిని! రా శుభాంగి!
ఆ. యనుచు మఱియుఁ మఱియుఁ నాఖ్యలు గల గోవు
లడవిలోన దూర మందు మేయ
ఘన గభీర భాషఁ గడు నొప్పఁ జీరు నా
భీరజనులు బొగడఁ బెంపు నెగడ.
ప్రతిపదార్థం:
రా = రమ్ము; పూర్ణచంద్రిక = పూర్ణచంద్రిక; రా = రమ్ము; గౌతమీగంగ = గౌతమీగంగ; రమ్ము = రమ్ము; భగీరథరాజతనయ = భగీరథరాజతనయ; రా = రమ్ము; సుధాజలరాశి = సుధాజలరాశి; రా = రమ్ము; మేఘమాలిక = మేఘమాలిక; రమ్ము = రమ్ము; చింతామణి = చింతామణి; రమ్ము = రమ్ము; సురభి = సురభి; రా = రమ్ము; మనోహారిణి = మనోహారిణి; రా = రమ్ము; సర్వమంగళ = సర్వమంగళ; రా = రమ్ము; భారతీదేవి = భారతీదేవి; రా = రమ్ము; ధరిత్రి = ధరిత్రి; రా = రమ్ము; శ్రీమహాలక్ష్మి = శ్రీ మహాలక్ష్మి; రా = రమ్ము; మందమారుతి = మందమారుతి; రమ్ము = రమ్ము; మందాకిని = మందాకిని; రా = రమ్ము; శుభాంగి = శుభాంగి; అనుచున్ = అని; మఱియును = ఇంకను; ఆఖ్యలుగల = పేర్లు ఉన్న; గోవులు = పశువులు; అడవిలోన = అడవియందు; దూరమందు = దూరంగా; మేయ = గడ్డితినుచున్న; ఘన = గొప్ప; గభీర = గంభీర మైన; భాషన్ = గొంతుతో; ఆభీరజనులు = యాదవులు పొగడన్ = కీర్తించుచుండగా; పెంపున్ = గొప్పదనముతో; నెగడన్ = అతిశయించగా; కడునొప్ప = మిక్కిలి; చక్కగా; చీరున్ = పిలచును.
తాత్పర్యం:
పూర్ణచంద్రికా! గౌతమీగంగా! భాగీరథీ! అమృత సాగరమా! రండమ్మా! మేఘబాలికా! చింతామణీ! సురభీ! మనోహారిణీ! సర్వమంగళా! భారతీదేవీ! భూదేవీ! శ్రీమహాలక్ష్మీ! రండమ్మా రండి! మందమారుతీ! మందాకినీ! శుభాంగీ! గబగబా గంతులు వేసుకుంటూ పరుగెత్తి రండి! అంటూ ఇంకా ఎన్నో పేర్లు గల ఆవులు అడవిలో దూరంగా మేస్తూ ఉండగా మేఘగర్జన వంటి కంఠనాదంతో పిలుస్తూ ఉంటాడు. ఆ పిలుపులకు ముచ్చటపడి గోపాలకులందరూ మెచ్చుకుంటూ ఉంటారు.
10-1268 నీ పాదకమల సేవయు
సందర్భం:
కంసుడు రామకృష్ణులను తన నగరానికి పిలిపించాడు. వారు జంకుగొంకులు లేకుండా మధురానగరంలో విహరిస్తున్నారు. రాచబాటలో వారికి సుదాముడనే మాలాకారుడు కనిపించాడు. మాలికలతో స్వామిని సత్కరించాడు. కృష్ణునికి అతనిపై రామానుగ్రహం కలిగింది. అతని యింటికి వెళ్ళాడు. కోరిన వరం ఇస్తాను కోరుకో అన్నాడు. అప్పుడు సుదాముడు ఇలా అన్నాడు.
కం. నీ పాదకమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయును
దాపసమందార! నాకు దయ సేయఁ గదే.
ప్రతిపదార్థం:
నీ పాద = నీ పాదములు అనెడి; కమల = పద్మముల యందు; సేవయున్ = భక్తి; నీ పాద = నీ పాదములను; అర్చకులతోడి = అర్చించే భక్తులతోటి; నెయ్యమును = స్నేహము; నితాంత = విస్తారమైన; అపార = అంతులేని; భూత = జీవుల యెడ; దయయును = దయకలిగి యుండుటను; తాపసమందార = కృష్ణ {తాపసమందారుడు - తపస్సు చేయువారికి కల్పవృక్షము వంటివాడు, విష్ణువు}; నాకున్ = నాకు; దయచేయగదే = అనుగ్రహింపుము.
తాత్పర్యం:
స్వామీ! నందనందనా! యశోద కుమారా! నాకు నిరంతరము నీ పాదపద్మాల సేవ కావాలి. నిన్ను భక్తితో అర్చించే పుణ్యాత్ములతో చెలిమి కావాలి. తాపసమందారా! ఎడతెగని, అంతులేని భూతదయ కావాలి. నా స్వామీ! నాయీ మూడు కోరికలనూ అనుగ్రహించు తండ్రీ!
10-1679 ఖగనాథుం డమరేంద్రు
సందర్భం:
బలరామ శ్రీకృష్ణులు పెండ్లి యీడునకు వచ్చారు. బ్రహ్మదేవుని ఆజ్ఞమేరకు రైవతుడు తన బిడ్డ రేవతిని బలరామునకు ధర్మపత్నిగా ఇచ్చాడు అని చెబుతూ శుకయోగీంద్రులు రుక్మిణి కల్యాణ ప్రస్తావనగా ఇలా చెబుతున్నారు.
మ. ఖగనాథుం డమరేంద్రు గెల్చి సుధ మున్ గైకొన్న చందంబునన్
జగతీనాథులఁ జైద్యపక్ష చరులన్ సాళ్వాదులం గెల్చి భ
ద్రగుఁ డై చక్రి వరించె భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా
భగవత్యంశ భవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్.
ప్రతిపదార్థం:
ఖగనాథుండు = గరుత్మంతుడు {ఖగనాథుడు - పక్షుల ప్రభువు, గరుత్మంతుడు}; అమరేంద్రున్ = దేవేంద్రుని; గెల్చి = జయించి; సుధ = అమృతమును; మున్ = పూర్వము; కైకొన్న = తీసుకొన్న; చందంబునన్ = విధముగా; జగతీనాథులన్ = రాజులను; చైద్య = శిశుపాలుని {చైద్యుడు - చేది దేశ ప్రభువు, శిశుపాలుడు}; పక్ష = పక్షము నందు; చరులన్ = వర్తించువారిని; సాళ్వాదులన్ = సాళ్వుడు మొదలగు వారిని; గెల్చి = జయించి; భద్రగుడై = శుభమునుపొందువాడై; చక్రి = కృష్ణుడు {చక్రి - చక్రాయుధము కలవాడు, కృష్ణుడు, విష్ణువు}; భీష్మకసుతన్ = భీష్మకుని కుమార్తెను; రాజీవగంధిన్ = పద్మములవంటి సువాసన కలాది, రమా = లక్ష్మీ; భగవతి = దేవి యొక్క {భగవతి - షడ్గుణములచే (1. మహత్వ 2. ధైర్య 3. కీర్తి 4. శ్రీ 5ఙ్ఞాన 6. వైరాగ్యములుచే) ఐశ్వర్యురాలు, దేవి}; అంశభవన్ = అంశతో పుట్టినది; మహాగుణమణిన్ = గొప్ప సుగుణములనెడి రత్నములు కలది, {సుగుణములు - శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానము ఆది గొప్ప మంచి గుణములు}; బాలామణిన్ = కన్యకలందు శ్రేష్ఠురాలైన; రుక్మిణిన్ = రుక్మిణిని; వరించెన్ = వివాహమాడెను.
తాత్పర్యం:
పరీక్షిన్మహారాజా! వెనుకటికి పక్షిరాజు గరుత్మంతుడు దేవేంద్రుణ్ణి గెలిచి అమృతభాండాన్ని తెచ్చిన విధంగా సుదర్శనమనే చక్రం ధరించిన శ్రీకృష్ణస్వామి శిశుపాలునిపక్షం వారైన సాళ్వుడు మొదలైన వారినందరినీ గెలిచి భద్రంగా రుక్మిణీదేవిని వరించాడు. ఆమె విదర్భరాజైన భీష్మకుడు కన్నబిడ్డ. పద్మాల సుగంధం ఆమెను అంటిపెట్టుకొని ఉంటుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి అంశతో భూమిలో అవతరించిన జగన్మాత. ఆమె మహోదాత్త గుణాలే ఆమెకు మణిభూషణాలు. ఆమె బాలికలలో మణి.
10-1701 ఏ నీ గుణములు
సందర్భం:
రుక్మిణీదేవి త్రికరణాలలో శ్రీకృష్ణస్వామినే నింపుకొన్నది. కానీ అన్న రుక్మి తనను శిశుపాలునికి ఇస్తానంటున్నాడు. తల్లిదండ్రులు ఎటూ చెప్పలేక కర్తవ్యం తోచక తల్లడిల్లిపోతున్నారు. ఈ స్థితిలో తనను సర్వవిధాలా ఉద్ధరింపగలవాడు వాసుదేవుడే అని నిర్ణయించుకుని ఒక ఉత్తమ విప్రుని ద్వారా తన సందేశాన్ని పురుషోత్తమునకు పంపింది. ఆ మహాత్ముడు అది శ్రీకృష్ణునకు వినిపిస్తున్నాడు.
సీ. ఏ నీ గుణములు గర్ణేంద్రియంబులు సోఁక; దేహతాపంబులు దీఱిపోవు
నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల; కఖిలార్థలాభంబు గలుగుచుండు
నే నీ చరణసేవ లే ప్రొద్దు చేసిన; భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు
నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితోఁ; దడవిన బంధసంతతులు వాయు
తే. నట్టి నీ యందు నా చిత్త మనవరతము
నచ్చి యున్నది నీ యాన నాన లేదు,
కరుణఁ జూడుము కంసారి! ఖలవిదారి!
శ్రీయుతాకార! మానినీచిత్తచోర!
ప్రతిపదార్థం:
కంసారి = శ్రీకృష్ణా! { కంసుని సంహరించినవాడు, కృష్ణుడు}; ఖలవిదారి = శ్రీకృష్ణా! {దుర్జనులను సంహరించువాడు, కృష్ణుడు}; శ్రీయుతాకార = శ్రీకృష్ణా! {సౌందర్యసంపదలతో కూడి యున్నవాడు, కృష్ణుడు}; మానినీచిత్తచోర = శ్రీకృష్ణా {మానినీచిత్తచోరుడు - స్త్రీల మనసులను అపహరించు వాడు, కృష్ణుడు}. ఏ = ఎట్టి; నీ గుణములున్ = నీ గొప్పగుణములు {భగవంతుని గుణములు – 1. సర్వజ్ఞత్వము 2. సర్వేశ్వరత్వము 3. సర్వభోక్తృత్వము 4. సర్వనియంతృత్వము 5. సర్వాంతర్యామిత్వము 6. సర్వసృష్టత్వము 7. సర్వపాలకత్వము 8. సర్వసంహారకత్వము మొద లగునవి}; కర్ణేంద్రియంబులు = చెవులను; సోకన్ = తాకినంతనే; దేహ = శారీరక; తాపంబులు = బాధలు, తాపత్రయములు {తాపత్రయము – 1. ఆధ్యాత్మికము 2. ఆధి దైవికము 3. ఆధిభౌతికము అనెడి మూడు ఇడుములు}; తీఱిపోవున్ = నశించిపోవునో; ఏ = ఎట్టి; నీ శుభాకారమున్ = నీ శోభనకరమైన స్వరూపమును; ఈక్షింపన్ = చూచినచో; కన్నులకున్ = కళ్ళకు; అఖిలలార్థ = సమస్తమైన ప్రయోజనములు; లాభంబు = లభిం చుట; కలుగుచుండున్ = కలుగుతాయో ఏ = ఎట్టి; నీ చరణ = నీ పాదములను; సేవన్ = సేవించుటచే; ఏప్రొద్దున్ = ఎల్లప్పుడు; చేసినన్ = చేసినచో; భువన = లోకమునందు; ఉన్నతత్వంబు = అధిక్యము; పొందగలుగు = లభించునో; ఏ = ఎట్టి; నీ లసత్ = నీ మంచి; నామమున్ = పేరులను; ఏప్రొద్దున్ = ఎల్లప్పుడు; భక్తి తోన్ = భక్తితో; తడవినన్ = తలచిన ఎడల; బంధ = సంసారబంధముల {సంసారబంధములు - అష్టబంధములు, 1. దయ 2. జుగుప్స 3. మోహము 4. భయము 6. సంశయము 7. కులము 8. శీలము}; సంతతులు = సమూహములన్ని; వాయున్ = తొలగునో; అట్టి = అటువంటి; నీ యందున్ = నీ ఎడల; నా చిత్తము = నా మనస్సు; అనవరతము = ఎల్లప్పుడు; నచ్చి = ఇష్టపడి; ఉన్నది = ఉన్నది; నీ = నీ మీద; ఆన = ఒట్టు; నాన = సిగ్గుపడుట; లేదు = లేదు; కరుణన్ = దయతో; చూడుము = చూడు;
తాత్పర్యం:
క్రూరాత్ముడైన కంసుని కడతేర్చిన ఓ స్వామీ! పరమనీచులను చీల్చి చెండాడే జగదేకవీరా! శ్రీయుతాకారా! చెలువల చిత్తాన్ని అపహరించే సుందరసుందరా! శ్రీకృష్ణా! నీ గుణాలు చెవులను తాకినంతనే దేహతాపాలన్నీ తీరిపోతాయి. నీ మంగళాకారాన్ని చూచినంతనే కన్నులకు చూడవలసిన లాభాలాన్నీ సిద్ధిస్తాయి. నీ పాదాలకు ఎప్పుడు సేవలు చేస్తే అప్పుడు ఆ వ్యక్తికి భువనాలన్నింటినీ దాటుకొనిపోయే పరమసిద్ధి కలుగుతుంది. నీ శుభనామాన్ని భక్తితో పాడుకుంటే సంసారబంధాలన్నీ తెగిపోతాయి. అటువంటి నీయందు నాచిత్తం నిరంతరంగా ఇష్టపడి ఉన్నది. దీనికి నీ ఆజ్ఞ పొందలేదు. నన్ను కరుణతో చూడు మహాత్మా!
10-1703 శ్రీయుతమూర్తి
సందర్భం:
రుక్మిణీదేవి సందేశంలోని మరొక విషయాన్ని ఆ బ్రాహ్మణోత్తముడు పురుషోత్తమునకు ఇలా విన్నవిస్తున్నాడు.
ఉ. శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహముపాలి సొమ్ము గో
మాయువు గోరు చందమున మత్తుఁడు చైద్యుఁడు నీ పదాంబుజ
ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద నంచు నున్నవాఁ
డా యధమాధముం డెఱుంగఁ డద్భుతమైన భవత్ప్రతాపమున్.
ప్రతిపదార్థం:
శ్రీయుతమూర్తి = లక్ష్మీదేవితో కూడియున్న స్వరూపుడా!; ఓ పురుషసింహమ పురుషులలో శ్రేష్ఠుడా!; సింహము = సింహమునకు; పాలి = చెందిన; సొమ్మున్ = పశువును; గోమాయువున్ = నక్క; కోరు = ఆశించెడి; చందమునన్ = విధముగ; మత్తుడు = మిక్కలిగర్వము కలవాడు; చైద్యుడు = శిశుపాలుడు {చైద్యుడు - చేది దేశపువాడు, శిశుపాలుడు}; నీ పదాంబుజ = నీ పాదములనెడి పద్మములందు; ధ్యాయిని = ధ్యానించుదానను; ఐన = అయిన; నన్నున్ = నన్ను; వడిన్ = వేగముగా, తీవ్రముగా; తాన్ = అతను; కొనిపోయెదను = తీసుకుపోయెదను; అంచున్ = అని; ఉన్నవాడు = ఉన్నాడు; ఆ = ఆ; అధమ = నీచులలో; అధముండు = నీచుడు; అద్భుతము = దివ్యము; ఐన = అయిన; భవత్ = నీ యొక్క; ప్రతాపమున్ = పరాక్రమమును; ఎఱుగడు = ఎరుగడు.
తాత్పర్యం:
శ్రీయుతమూర్తీ! నీవు పురుషులలో సర్వశ్రేష్ఠుడవు. అందువలననే నిన్ను పురుష సింహము అని నేను పిలుచుకుంటున్నాను. సింహపుపాలి సొమ్మును గుంటనక్క కోరినట్లుగా నీపాద పద్మాలను మాత్రమే ధ్యానం చేసే నన్ను కండకావరంతో కన్నులు కానని శిశుపాలుడు, వడివడిగా కొనిపోవాలని ఇక్కడ ఉన్నాడు. అధములలో మరింత అధముడైన ఆ నీచుడు అద్భుతమైన నీ ప్రతాపాన్ని తెలుసుకోలేక పోతున్నాడు.
10-1708 అంకిలి సెప్పలేదు
సందర్భం:
రుక్మిణి, శ్రీకృష్ణుడు తనను ప్రమాదాలనుండి ఎలా దాటించాలో, ప్రమోదంతో ఎలా ఉద్ధరించాలో స్వామికి బ్రాహ్మణోత్తముని ద్వారా ఇలా తెలియజేసుకుంటున్నది.
ఉ. అంకిలి సెప్పలేదు; చతురంగ బలంబులతోడ నెల్లి యో!
పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా
వంకకు వచ్చి రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్యమే
యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెదన్.
ప్రతిపదార్థం:
కృష్ణ = కృష్ణ; పురుషోత్తమ = పురుషులలో శ్రేష్ఠుడా; అంకిలి = అడ్డు; చెప్పన్ = చెప్పుటకు; లేదు = లేదు; చతురంగబలంబుల్ = చతురంగసైన్యము {చతురంగబలము – 1. రథములు 2. ఏనుగులు 3. గుర్రములు 4. పదాతిదళము అనెడి నాలుగు అంగములు కల సేన}; తోడన్ = తోటి; ఎల్లి = రేపు; ఓ = ఓయీ; పంకజనాభ = కృష్ణా {పంకజనాభుడు - పద్మము నాభియందు గలవాడు, విష్ణువు}; నీవు = నీవు; శిశుపాల = శిశుపాలుడు; జరాసుతులన్ = జరాసంధుడులను; జయించి = గెలిచి; నా వంక = నావైపు, సహాయ పడుటకు; వచ్చి = వచ్చి; రాక్షస వివాహమునన్ = రాక్షసవివాహపద్ధతిలో; భవదీయ = నీ యొక్క; శౌర్యమున్ = పరాక్రమమును; ఉంకువ = ఓలిగా {ఉంకువ - అల్లుడు కన్యకార్థముగా మామకిచ్చెడి ద్రవ్యము, శుల్కము}; చేసి = చేసి; చేకొనిపొమ్ము = తీసుకువెళ్ళుము; వచ్చెదన్ = నేను వస్తాను.
తాత్పర్యం:
స్వామీ! కృష్ణా! పంకజనాభా! పురుషోత్తమా! నా గుండెలోని అలజడి ఇట్టిది అట్టిది అని నేను చెప్పగలిగింది కాదు. కాబట్టి అడ్డుచెప్పకు. రేపే రథాలూ, గజాలూ, గుఱ్ఱాలూ, కాల్బంటులూ గల గొప్ప సేనావాహినితో బయలుదేరు. మొట్టమొదటగా శిశుపాలుణ్ణీ, వానికి అండగా నిలిచిన జరాసంధుణ్ణీ జయించు. తరువాత నా దగ్గరకు వచ్చి, నీ పరాక్రమమే కన్యకు ఇచ్చే సొమ్ముగా చేసి రాక్షస వివాహ పద్ధతితో నన్ను చెట్ట బట్టి తీసుకొనిపో. నేను వస్తాను.
10-1711 ప్రాణేశ! నీ మంజు భాషలు
సందర్భం:
రుక్మిణి విప్రవరుని ద్వారా తన దృఢనిశ్చయాన్ని శ్రీకృష్ణవాసుదేవునకు తెలుపుకొంటున్నది. తన అయిదు జ్ఞానేంద్రియాలు స్వామికి సమర్పణగా చేసికొన్న విషయాన్ని మరొకవిధంగా వెల్లడిస్తున్నది.
సీ. ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని; కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని; తనులతవలని సౌందర్య మేల?
భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని; చక్షురింద్రియముల సత్వ మేల?
దయిత! నీ యధరామృతం బానఁగా లేని; జిహ్వకు ఫలరససిద్ధి యేల?
ఆ. నీరజాతనయన! నీ వనమాలికా
గంధ మబ్బలేని ఘ్రాణ మేల?
ధన్యచరిత! నీకు దాస్యంబు చేయని
జన్మ మేల? యెన్ని జన్మములకు.
ప్రతిపదార్థం:
ప్రాణేశ = నా ప్రాణమునకు ప్రభువా; నీ = నీ యొక్క; మంజు = మృదువైన; భాషలున్ = మాటలు; వినలేని = వినజాలని; కర్ణరంధ్రంబుల = చెవులు అనెడి; కలిమి = ఉండి; ఏలన్ = ఎందుకు; పురుషరత్నమ = పురుషులలో శ్రేష్ఠుడా; నీవు = నీవు; భోగింపగా లేని = రమించలేనట్టి; తనులతవలని = దేహమనెడితీగ యందలి; సౌంద ర్యము = అందము; ఏలన్ = ఎందుకు; భువనమోహన = ఎల్లలోకములను మోహింప జేయువాడా; నిన్నున్ = నిన్ను; పొడగానగాలేని = చూడజాలని; చక్షురింద్రియముల = కళ్ళకున్; సత్వము = పటుత్వము; ఏలన్ = ఎందుకు; దయిత = ప్రియా; నీ = నీ యొక్క; అధరామృతంబున్ = పెదవులతీయదనమును; ఆనగాలేని = ఆస్వాదించ జాలని; జిహ్వకున్ = నాలుకకు; ఫలరస = పండ్లను రుచిచూచుట; సిద్ధి = లభించుట; ఏలన్ = ఎందుకు; నీరజాతనయన = పద్మాక్షుడా, కృష్ణా; నీ = నీ యొక్క; వనమాలికా = పూలచిగుళ్ళమాలయొక్క; గంధము = సువాసన; అబ్బదేని = లభింపజాలని; ఘ్రాణము = ముక్కు; ఏలన్ = ఎందుకు; ధన్యచరిత = కృతార్థమైన నడవడి కల వాడా; నీకు = నీకు; దాస్యంబు = సేవ; చేయని = చేయజాలని; జన్మము = జీవిం చుట; ఏలన్ = ఎందుకు; ఎన్ని = ఎన్ని; జన్మములకు = జన్మలెత్తినను {జన్మలెత్తు - పునర్జన్మలు పొందుట} (వ్యర్థమే).
తాత్పర్యం:
నీవు నా ప్రాణాలకు ప్రభువువు. నీ మధురమైన మాటలు వినలేకపోతే నాకు చెవులుండటమే ప్రయోజనం లేని విషయం. పురుషోత్తమా! నీకు భోగ్యం కాని నా తనులత అందచందాలు ఎందుకయ్యా! భువనమోహనా! నిన్ను చూడలేని కన్నులు ఉండి ఏమి ఊడి ఏమి? ప్రియా! నీ అధరామృతం ఆనలేని జిహ్వకు ఎంత ఫలరసం అందినా అది వ్యర్థమే. విప్పారిన పద్మాలవంటి కన్నులున్న స్వామీ! నీవు ధరించిన వనమాలిక పరిమళాన్ని అందుకోలేని నాసికకు సార్థకత ఉంటుందా? ధన్యచరితా! నీకు దాస్యం చేయని బ్రతుకు ఎందుకు? ఎన్ని జన్మలైనా వ్యర్థమే.
10-1717 వచ్చెద విదర్భభూమికిఁ
సందర్భం:
విప్రవరుని ద్వారా విదర్భరాజతనయ సందేశం వీనులారా విన్నాడు శ్రీ కృష్ణస్వామి. ఆ మహాత్ముని చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు. ఆనందంతో తనకు ఆమె యందు గల అనురాగాన్ని ముక్తసరిగా మూడు మాటలతో చెబుతూ తన నిర్ణయాన్ని ఇలా ప్రకటించాడు.
కం. వచ్చెద విదర్భభూమికిఁ;
జొచ్చెద భీష్మకుని పురము; సురుచిరలీలన్
దెచ్చెద బాలన్ వ్రేల్మిడి
వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చినఁ బోరన్.
ప్రతిపదార్థం:
విదర్భభూమికి = విదర్భ అనెడి దేశమునకు; వచ్చెదన్ = వస్తాను; భీష్మకుని పురము = కుండిననగరమునందు; చొచ్చెదన్ = చొరబడెదను; సురుచిర = మనోహర మైన; లీలన్ = విధముగ; తెచ్చెదన్ = తీసుకొచ్చెదను; బాలన్ = బాలికను; వ్రేల్మిడిన్ = చిటికలో; అడ్డంబున్ = అడ్డగించుటకు; రిపులు = శత్రువులు; వచ్చినన్ = వచ్చినచో; పోరన్ = యుద్ధమునందు; వ్రచ్చెదన్ = సంహరించెదను.
తాత్పర్యం:
బ్రాహ్మణప్రవరా! నేను విదర్బ దేశానికి వస్తాను. భీష్మకుని పురం ప్రవేశిస్తాను. చూడముచ్చట అయిన విలాసంతో ఆ బాలను తెచ్చుకుంటాను. పగవారు అడ్డం వస్తే వారినందరినీ క్షణకాలంలో చీల్చి చెండాడుతాను.
10-1727 ఘనుఁ డా భూసురు డేఁగెనో
సందర్భం:
రుక్మిణికి మదిమదిలో లేదు. ముహూర్తం దగ్గరపడుతున్నది. శిశుపాలుడు మొదలైన వారంతా వచ్చి కూర్చున్నారు. కృష్ణుడు వస్తాడో, రాడో! తనను గూర్చి ఏమనుకుంటున్నాడో అని ఆమె హృదయం అదవదలయిపోతున్నది. ఇలా అనుకుంటున్నది.
మ. ఘనుఁ డా భూసురు డేఁగెనో? నడుమ మార్గశ్రాంతుఁ డై చిక్కెనో?
విని కృష్ణుం డిది తప్పుగాఁ దలఁచెనో? విచ్చేసెనో? యీశ్వరుం
డనుకూలింపఁ దలంచునో తలపఁడో? యార్యామహాదేవియున్
నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో? నా భాగ్య మెట్లున్నదో?
ప్రతిపదార్థం:
ఘనుడు = గొప్పవాడు; ఆ భూసురుడు = ఆ విప్రుడు; ఏగెనో = వెళ్ళాడో లేదో; నడుమన్ = మధ్యలో; మార్గశ్రాంతుడై = ప్రయాణపు బడలికతో; చిక్కెనో = చిక్కుబడి పోయెనేమో; విని = విన్నవాడై; కృష్ణుండు = కృష్ణుడు; అది = దానిని; తప్పుగా = తప్పు అయినట్లు; తలచెనో = భావించెనేమో; విచ్చేసెనో = వచ్చెనేమో; ఈశ్వరుండు = భగవంతుడు; అనుకూలింపన్ = అనుకూలించవలెనని; తలంచునో = ఎంచునో; తలపడో = ఎంచకుండునో; ఆర్యామహాదేవియున్ = పార్వతీదేవి {ఆర్య - శ్రేష్ఠురాలు, పార్వతి}; ననున్ = నన్ను; రక్షింపన్ = కాపాడవలెనని; ఎఱుంగునో = గుర్తించినదో; ఎఱుగదో = గుర్తించలేదో; నా = నా యొక్క; భాగ్యము = అదృష్టము; ఎట్లున్నదో = ఎలా ఉందో.
తాత్పర్యం:
ఆ మహాత్ముడు బ్రాహ్మణుడు కృష్ణుని దగ్గరకు వెళ్ళాడో లేదో? మధ్యలో మార్గాయాసంతో ఎక్కడైనా చిక్కుపడ్డాడేమో? నా విన్నపం విని శ్రీకృష్ణుడు తప్పుగా తలపోయలేదు కదా? ఒకవేళ ఇక్కడకు వచ్చి ఉన్నాడేమో? పరమేశ్వరుడు నా విషయంలో అనుకూలంగా ఉండాలనుకున్నాడో లేదో? అమ్మలగన్నయమ్మ ఆ ఉమాపరమేశ్వరి నన్ను రక్షించటానికి పూనుకున్నదో లేదో? ఇంతకూ నా భాగ్యం ఎలా ఉన్నదో?
10-1730 చెప్పదు తల్లికిం
సందర్భం:
శ్రీకృష్ణుని రాక సూచనలు లేక రుక్మిణి మూడు కరణాలూ ముప్పుతిప్పలు పడుతున్నాయి. అనేక ఆలోచనల అలలు హృదయంలో చెలరేగుతున్నాయి. ఎవరికి చెప్పుకొని కొంతకు కొంతైనా ఆరాటాన్ని ఆపుకోవాలో అర్థం కావటం లేదు. ఆ స్థితిలో ఆమె అవస్థ ఎలా ఉన్నదో పోతన మహాకవి ఇలా వక్కాణిస్తున్నాడు.
ఉ. చెప్పదు తల్లికిం దలఁపు చిక్కు; దిశల్ దరహాస చంద్రికన్
గప్పదు; వక్త్రతామరస గంధ సమాగత భృంగసంఘమున్
రొప్పదు; నిద్రఁ గైకొన; దురోజ పరస్పరసక్త హారముల్
విప్పదు; కృష్ణమార్గగత వీక్షణపంక్తులు ద్రిప్ప దెప్పుడున్.
ప్రతిపదార్థం:
తలపుచిక్కు = మనసులోని విచారమును; తల్లికిన్ = తల్లికి; చెప్పదు = తెలుపదు; దిశల్ = దిక్కులందు; తలపు = భావన, చిక్కు = చిక్కిపోయినది; దరహాస = చిరునవ్వుల; చంద్రికల్ = వెన్నెలలను; కప్పదు = ఆవరింపజేయదు; వక్త్ర = ముఖము అనెడి; తామరస = పద్మము యొక్క; గంధ = సువాసనచే; సమాగత = చేరిన; భృంగ = తుమ్మెదల; సంఘమున్ = సమూహమును; రొప్పదు = అదిలించదు; నిద్రన్ = నిద్ర పోవుట; కైకొనదు = చేయదు; ఉరోజ = వక్షస్థలమునందు; పరస్పర = ఒకదానితో నొకటి; సక్త = చిక్కుకొన్న; హారముల్ = దండలను; విప్పదు = విడదీసుకొనదు; కృష్ణ = కృష్ణుని; మార్గ = వచ్చుదారి యందు; గత = లగ్నమైన; వీక్షణ = చూపుల; పంక్తులున్ = వరుసలను; ఎప్పుడున్ = క్షణకాలమైన; త్రిప్పదు = మరలింపదు;
తాత్పర్యం:
తన ఎదలోని ఆరాటాన్ని ఎవరైనా ఆత్మీయులకు చెప్పుకొంటే కొంత శాంతత ఏర్పడుతుంది. బిడ్డకు అమ్మకంటే ఆత్మీయ ఎవరు? అటువంటి కన్నతల్లికి కూడా తన ఆరాటాన్ని చెప్పుకోలేకుండా ఉన్నది రుక్మిణి. చిరునగవు అనే వెన్నెలతో దిక్కులను కూడా కప్పటం లేదు. మోము తామర పరిమళానికి పరవశించి మూగుతున్న తుమ్మెదలను తోలాలనే ఊహ కూడా ఆమెకు కలుగలేదు. నిద్ర అసలే లేదు. వక్షఃస్థలం మీది హారాలన్నీ అటూఇటూ పొరలటం వలన ఒకదానితో ఒకటి పెనవేసుకొని పోయాయి. వానిని చిక్కు కూడా తీయాలనిపించటం లేదు ఆమెకు. తన మనోహరుడు కృష్ణుడు వచ్చే దారినుండి చూపుల పంక్తులను కొంచెం కూడా త్రిప్పటంలేదు.
10-1740 తగు నీ చక్రి
సందర్భం:
రుక్మిణి తపస్సు ఫలించిందని తిరిగివచ్చిన విప్రప్రవరుడు తెలియజేశాడు. బలరామకృష్ణులకు భీష్మకుడు విడుదులేర్పాటు చేశాడు. క్షణంలో హరి రాక వార్త విదర్భపురం ప్రజల వీనులకు విందుచేసింది. శ్రీకృష్ణదేవుని సుందర వదనారవిందాన్ని వీక్షించి పౌరజనాలు ఇలా అనుకున్నారు.
మ. తగు నీ చక్రి విదర్భరాజ సుతకున్; దథ్యంబు వైదర్భియుం
దగు నీ చక్రికి; నింత మంచి దగునే? దాంపత్య మీ యిద్దఱిం
దగులం గట్టిన బ్రహ్మ నేర్పరి గదా; దర్పాహతారాతి యై
మగఁ డౌఁ గావుతఁ జక్రి యీ రమణికిన్ మా పుణ్య మూలంబునన్.
ప్రతిపదార్థం:
తగున్ = సరిపడును; ఈ చక్రి = ఈ కృష్ణుడు; విదర్భ = విదర్భదేశపు; రాజ సుతకున్ = రాకుమారికి; తథ్యంబు = నిజముగా; వైదర్భియున్ = రుక్మిణికూడ; ఈ చక్రికిన్ = ఈ కృష్ణునికి; తగున్ = సరిపోవును; ఇంత మంచిదగునే = చాలామంచిది అగును; దాంపత్యము = ఆలుమగలకూడిక; ఈ = ఈ; ఇద్దఱన్ = ఇద్దరిని; తగులం గట్టిన = కూర్చిన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; నేర్పరి = మంచి నేర్పు గలవాడు కదా; దర్పాహతా రాతియై = పరాక్రమము చేత ఓడింపబడిన శత్రువులు కలవాడై; చక్రి = కృష్ణుడు; ఈ రమణి = ఈ ఇంతికి; మా పుణ్యమూలంబునన్ = మా పుణ్యముల వలన; మగడు = భర్త; ఔగావుత = అగునుగాక.
తాత్పర్యం:
అదిగో చక్రం చేతిలో ధరించి విలాసంగా విచ్చేస్తున్న శ్రీకృష్ణుడు, మా ఏలిక కన్నబిడ్డకు ఇతడే తగిన భర్త. అంతేకాదు ఆ చక్రికి కూడా ఈమెయే అన్ని విధాలా యోగ్య అయిన ఇల్లాలు. ఇది ముమ్మాటికీ సత్యం. ఈ దాంపత్యం ఇంత గొప్పదై విరాజిల్లటం చాలా గొప్పసంగతి. ఈ యిద్దరినీ ఒకరికి ఒకరుగా ఏర్పాటుచేసిన బ్రహ్మ గొప్ప నేర్పుకాడు. మా పుణ్యాలు మూలకారణంగా, యీ చక్రి, పొగరుబోతులైన పగవారి నందరినీ పరిమార్చి మా రాజకుమారికి మగడు అగుగాక.
10-1744 నమ్మితి నా మనంబున
సందర్భం:
కృష్ణస్వామి వచ్చిన సంగతి తెలుసుకొన్న రుక్మిణి హృదయం తేటపడింది. కులాచారం ప్రకారం గౌరీపూజ నాచరించటానికి అమ్మవారి ఆలయంలోనికి ప్రవేశించింది. ముగ్గురమ్మల మూలపుటమ్మకు ముచ్చటగా రుక్మిణిచేత విప్రుల యిల్లాండ్రు పూజ చేయించారు. రుక్మిణి మనస్సులో ఇలా అనుకొంటున్నది.
ఉ. నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ సేయు మమ్మ! నిన్
నమ్మిన వారి కెన్నడును నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!
ప్రతిపదార్థం:
ఈశ్వరీ = పార్వతీదేవీ; నా మనంబునన్ = నా మనసునందు; సనాతనులైన = శాశ్వతులు; ఉమా = పార్వతీ {ఉమ - అనత్యీత్యమా అవసంరక్షణే (వ్యుత్పత్తి), రక్షించునామె, పార్వతి}; మహేశులన్ = పరమేశ్వరులను {మహేశుడు – మహాంశ్ఛాసా వీశ్వరశ్చ మహేశ్వరః (వ్యుత్పత్తి), దేవతలలో శ్రేష్ఠుడు, శివుడు}; నమ్మితిన్ = నమ్మినాను; మిమ్ము = మిమ్ములను; పురాణదంపతులన్ = పురాతనమైన దంపతుల; మేలు = చక్కగా; భజింతున్ = పూజించెదను; కదమ్మ = కదా తల్లీ; మేటి = గొప్ప; పెద్దమ్మ = పెద్దతల్లీ; దయా = దయకు; అంబురాశివి = సముద్రమువంటి ఆమెవు; కదమ్మ = కదా తల్లీ; హరిన్ = కృష్ణుని; పతిన్ = భర్తగా; చేయుము = కావింపుము; అమ్మ = తల్లీ; నిన్నున్ = నిన్ను; నమ్మిన = నమ్ముకొన్న; వారికి = వారలకు; ఎన్నటికిన్ = ఎప్పటికి; నాశము = చెరుపు; లేదు = లేదు; కదమ్మ = కదా తల్లీ.
తాత్పర్యం:
నేను నా మనస్సులో సనాతనులైన ఉమామహేశ్వరులను నమ్ముకొన్నాను. మీరు పురాణదంపతులు, కనుక పరమేశ్వరీ! నీవు మేటి పెద్దమ్మవు. సముద్రమంత దయ నీది. నాకు శ్రీహరిని పతిగా అనుగ్రహించు తల్లీ! నిన్ను నమ్మినవారికి ఎన్నటికీ నాశము లేదు గదమ్మా!
10-1750 కనియెన్ రుక్మిణి
సందర్భం:
శ్రీరుక్మిణీమహాదేవి స్వయంవర మండపంలోనికి ప్రవేశించింది. మెల్లగా అడుగులు వేస్తూ రాజుల సముదాయాన్ని దాటుకొంటూ ముందునకు సాగుతున్నది. తక్కిన రాజులెవ్వరూ ఆమె కంటికి ఆనటంలేదు. అల్లంతదూరాన తన ప్రాణేశ్వరుడు కన్నులలో కదలాడుతున్నాడు.
మ. కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖుం, గంఠీరవేం ద్రావల
గ్ను, నవాంభోజదళాక్షుఁ, జారుతర వక్షున్, మేఘసంకాశ దే
హు, నగారాతి గజేంద్రహస్త నిభ బాహుం, జక్రిన్, బీతాంబరున్,
ఘన భూషాన్వితుఁ, గంబుకంఠు, విజయోత్కంఠున్ జగన్మోహనున్.
ప్రతిపదార్థం:
రుక్మిణి = రుక్మిణీదేవి; చంద్రమండలముఖున్ = చంద్రబింబమువంటి ముఖ ము కలవానిని; కంఠీరవేంద్ర = సింహశ్రేష్ఠము వంటి; అవలగ్నున్ = నడుము కలవాని ని; నవాంభోజదళ = సరికొత్త తామరరేకులవంటి; అక్షున్ = కన్నులు కలవానిని; చారు తర = మిక్కిలి అందమైన; వక్షున్ = వక్షస్థలము కలవానిని; మేఘసంకాశ = మేఘము లను పోలిన; దేహున్ = దేహము కలవానిని; నగారాతిగజేంద్ర = ఐరావతము యొక్క {నగారాతిగజేంద్రము - నగ (పర్వతములకు) ఆరాతి (శత్రువు) ఐన ఇంద్రుని గజశ్రేష్ఠము, ఐరావతము}; హస్త = తొండము; నిభ = వంటి; బాహున్ = చేతులు కలవానిని; చక్రిన్ = చక్రాయుధుని, కృష్ణుని; పీతాంబరున్ = పసుపువన్నె వస్త్రముకలవానిని; ఘనభూషాన్వితున్ = గొప్ప ఆభరణములతో కూడినవానిని; కంబుకంఠున్ = శంఖము వంటి మెడ కలవానిని; విజయ = జయించుటయందు; ఉత్కంఠున్ = ఉత్కంఠ కల వానిని; జగన్మోహనున్ = లోకములను మోహింపజేయువానిని; కనియెన్ = చూసెను;
తాత్పర్యం:
ఆ స్వామి పూర్ణచంద్రునివంటి మోముతో అలరారుతున్నాడు. సింహం నడుమువంటి నడుముతో విరాజిల్లుతున్నాడు. అప్పుడప్పుడే వికసిస్తున్న పద్మాలవంటి కన్నులతో అందాలు విరజిమ్ముతున్నాడు. దేహమంతా నీలమేఘంలాగా శ్యామలవర్ణంతో ఒప్పారుతున్నది. దేవేంద్రుని ఏనుగు ఐరావతం తొండంవంటి బాహువులు చూపులను ఆకట్టుకుంటున్నాయి. చేతబట్టిన చక్రం కాంతిచక్రాలను కమనీయంగా వెలువరిస్తున్నది. పసిమి వన్నె పట్టుబట్ట వెలుగులు అలరిస్తున్నాయి. నిలువెల్లా విలువకట్టనలవి కాని అలంకారాలు కాంతి వలయాలకు ఆకరాలవుతున్నాయి. అదిగో కమనీయశంఖం వంటి కంఠం అందరినీ ఆకర్షిస్తున్నది. రుక్మిణిని గెలుచుకోవాలి అనే ఉత్కంఠ ముఖంలో స్పష్టంగా తెలియవస్తున్నది. జగత్తులన్నింటినీ మోహపారవశ్యంలో ముంచుతున్న నందనందన సుందరుడైన శ్రీకృష్ణుణ్ణి శ్రీ రుక్మిణి తిలకించింది.
10-1784 ధ్రువకీర్తిన్
సందర్భం:
బ్రహ్మండానికంతటికీ బ్రహ్మానందాన్ని సంధానించే రుక్మిణీ వాసుదేవుల దివ్య కల్యాణ వైభవాన్ని భావించటం పరమపుణ్యం. తెలుగుల పుణ్యపేటి పోతనామాత్యులవారు ఆ మహాభాగ్యాన్ని మనకు ప్రసాదిస్తున్నారు.
శా. ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వై
భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాం
ధవ సత్కారిణిఁ బుణ్యచారిణి మహాదారిద్య్ర సంహారిణిన్
సువిభూషాంబర ధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్.
ప్రతిపదార్థం:
హరి = కృష్ణుడు; ధ్రువ = శాశ్వతమైన; కీర్తిన్ = కీర్తితో; నిజ = తన యొక్క; చేతః = మనసును; హారిణిన్ = అపహరించినామెను; మాన = చిత్తౌన్నత్యము; వైభవ = ఐశ్వర్యము; గాంభీర్య = నిబ్బరములు కలిగి; విహారిణిన్ = విహరించెడి ఆమెను; నిఖిల = సర్వ; సంపత్ = సంపదలను; కారిణిన్ = కలిగించెడి ఆమెను; సాధు = మంచివారిని; బాంధవ = బంధువులను; సత్కారిణిన్ = సత్కరించునామెను; పుణ్య = మంచి; చారిణిన్ = నడవడిక కలామెను; మహా = గొప్ప; దారిద్ర్య = పేదరికములను; సంహారిణిన్ = నశింపజేయునామెను; సు = మంచి; విభూషాంబర = ఆభరణములను; ధారిణిన్ = ధరించునామెను; గుణవతీ = సుగుణవంతురాలలో; చూడామణిన్ = శ్రేష్ఠురాలును; రుక్మిణిన్ = రుక్మిణీదేవిని. పెండ్లి = వివాహము; ఆడెన్ = చేసుకొనెను;
తాత్పర్యం:
ఆయన హరి. సర్వప్రాణులనూ తనలోకి హరింపజేసుకొనే మహాత్ముడు. ఆమె రుక్మిణి. తన ఒడలంతా సువర్ణమయమే అయిన ఉత్తమ వనిత. ఆమె తన హృదయాన్ని కొల్లగొట్టింది. అభిమానము, వైభవము, గాంభీర్యమూ అనే మహాలక్షణాలతో విహరిస్తున్నది. అందరకూ, అన్నింటికీ సంపదలను సమకూర్చే సౌభాగ్యంతో విరాజిల్లుతున్నది. సజ్జనులను దగ్గరి చుట్టాలుగా భావించి సత్కరించే సౌజన్యంతో ఒప్పారే దివ్యలక్షణం కలది. పుణ్యకార్యములందు మాత్రమే ప్రవృత్తి కలిగినట్టిది. లేమి అనే దయ్యాన్ని రూపుమాపే శీలం కలది. జాజ్వల్యమానములైన ఆభరణాలతో, అత్యద్భుతంగా వెలుగులు చిమ్ముతున్న వస్త్రాలతో అలరారుతున్నది. గుణవతులైన వనితల తలమానికమై ప్రకాశిస్తున్నది. అటువంటి ధృవమైన కీర్తి గల రుక్మిణీదేవిని ఆ శ్రీహరి పెండ్లియాడినాడు.
దశమ స్కంధం ఉత్తరభాగం
10-172 లేమా! దనుజుల గెలువఁగ
సందర్భం:
శ్రీకృష్ణులవారు నరకాసురుణ్ణి సంహరించటానికి ప్రాగ్జ్యోతిషపురానికి చేరుకున్నారు. స్వామితోపాటు సత్రాజిత్తు తనయ సత్యభామ కూడా బయలుదేరింది. జగదేక జయశీలుడు మురాసురాదులను పరిమార్చాడు. సత్యభామా జగన్నాథులకు నరకుడు ఎదురై నిలిచాడు. హఠాత్తుగా అమ్మవారు వానితో పోరాటానికి సిద్ధమైంది. అది చూచి శ్రీహరి ఇలా అంటున్నాడు.
క. లేమా! దనుజుల గెలువఁగ
లేమా? నీ వేల కడఁగి లేచితి? విటు రా
లే మాను; మాన వేనిన్
లే మా విల్లందికొనుము లీలం గేలన్.
ప్రతిపదార్థం:
లేమా = చిన్నదానా {లేమ – లేత వయస్కురాలు, స్త్రీ}; దనుజులన్ = రాక్షసులను; గెలువగ లేమా = జయింప సమర్థులము కామా; నీవు = నీవు; ఏల = ఎందుకు; కణగి = యత్నించి; లేచితివి = నిలబడితివి; ఇటు = ఈ వైపునకు; రా = రమ్ము; లే = లెమ్ము; మాను = వదలి వేయుము; మానవేనిన్ = మానని పక్షమున; లే = లే; మా విల్లున్ = మా ధనుస్సు; లీలన్ = విలాసముగా; కేలన్ = చేతితో; అందికొనుము = పుచ్చుకొనుము.
తాత్పర్యం:
లేమా! ఈ రక్కసులను మేము గెలువలేమా! నీవెందుకు పూనుకొని విజృంభిస్తున్నావు. నా దగ్గరకు రా! లే! ఈ ప్రయత్నాన్ని మానుకో! మానుకోను అంటే ఇదిగో లేచి మా వింటిని లీలగా కేలితో అందుకో!
10-177 సౌవర్ణ కంకణ
సందర్భం:
సత్యభామ సర్వేశ్వరుని అనుమతినీ, వింటినీ రెంటినీ అందుకొన్నది. కృష్ణదేవునకు ఆమె సంరంభం ఆనందసాంద్రస్థితిని కలిగిస్తున్నది. పగవానికి మాత్రం పరమరౌద్రంగా భాసిస్తున్నది. ఇది ఒక విచిత్రమైన రస సమ్మేళనం. అప్పటి ఆ తల్లి విజృంభణను పోతన కవీంద్రులు ఇలా అభివర్ణిస్తున్నారు.
సీ. సౌవర్ణ కంకణ ఝణఝణ నినదంబు; శింజినీరవముతోఁ జెలిమి సేయఁ
దాటంక మణిగణ ధగధగ దీప్తులు; గండమండల రుచి గప్పికొనఁగ
ధవళతరాపాంగ ధళధళ రోచులు; బాణజాలప్రభాపటలి నడఁప
శరపాత ఘుమఘుమ శబ్దంబు పరిపంథి; సైనిక కలకల స్వనము లుడుప
తే. వీర శృంగార భయ రౌద్ర విస్మయములు
గలసి భామిని యయ్యెనో కాక యనఁగ
నిషువుఁ దొడుగుట విడుచుట యేయు టెల్ల
నెఱుఁగరాకుండ నని చేసె నిందువదన.
ప్రతిపదార్థం:
సౌవర్ణ = బంగారు; కంకణ = చేతి కడియములు; ఝణఝణ = ఝణ ఝణ అను; నినదంబు = శబ్దము; శింజనీ = అల్లె తాటి; రవముతో = చప్పుళ్ళతో; చెలిమి = స్నేహము; సేయ = చేయగా; తాటంక = చెవి దుద్దుల; మణి = రత్నముల; గణ = సమూహము యొక్క; ధగధగ = ధగ ధగమనెడి; దీప్తులు = కాంతులు; గండమండల = చెక్కిలి ప్రదేశమునందలి; రుచుల్ = మెరుపులు; కప్పికొనగ = కప్పివేయగా; ధవళతర = మిక్కిలి తెల్లనైన అపాంగ = కడకంటి; ధళధళ = తళతళ మనెడి; రోచులు = కాంతులు; బాణజాలప్రభాపటలి = అమ్ముల సమూహముల కాంతుల సమూహమును; అడప = అణచగా; శరపాత = బాణములు పడెడి; ఘమఘమ = ఘమ ఘమ అనెడి; శబ్దంబున్ = ధ్వని; పరిపంథి = శత్రుపక్షపు; సైనిక = సేనల యొక్క; కలకల = కల కల అనెడి; స్వనమున్ = ధ్వని; ఉడుపన్ = అణచగా. వీర = వీరము; శృంగార = శృంగారము; భయ = భయానకము; రౌద్ర = రౌద్రము; విస్మయములున్ = అద్భుత రసములు; కలిసి = కలిసిపోయి; భామిని = స్త్రీ రూపముగా; అయ్యెనో = అయినదో; కాక = ఏమో; అనగన్ = అన్నట్లుగా; ఇషువున్ = బాణమును; తొడుగుట = సంధించుట; విడుచుట = వదలుట; ఏయుట = సంహరించుట; ఎల్లన్ = అంతయు; ఎఱుగ రాకుండన్ = తెలియ రాకుండగా; ఇందువదన = అందగత్తె; {ఇందువదన - చంద్రుని వంటి మోము కల స్త్రీ, సత్యభామ}; అని = యుద్ధము చేసెన్ = చేసెను.
తాత్పర్యం:
సత్యభామ ముంజేతివలయాల ఝణఝణ నాదం అల్లెత్రాటి గంభీరనాదంతో చెలిమి చేస్తున్నది. కర్ణాభరణాలలోని మణుల ధగధగ కాంతులను చెక్కిలి కాంతులు కప్పివేస్తున్నాయి. మిక్కిలి తెల్లని కడకంటి ధళధళలాడే దీప్తులు బాణాల పంక్తుల ప్రభలను అణచివేస్తున్నాయి. దూసుకొనిపోతున్న బాణాల భూత్కారధ్వనులు పగవాని సైనికుల కలకల ధ్వనులను రూపుమాపుతున్నాయి. వీరము, శృంగారము, భయానకము, రౌద్రము, అద్భుతము అనే అయిదురసాలు ఒక్కటిగానై ఈ భామినిగా అయినాయా అన్నట్లు ఆ హరిసుందరి అలరారుతున్నది. బాణం వింటిలో ఎప్పుడు సంధించిందో, ఎప్పుడు విడిచిందో, ఎప్పుడు కొట్టిందో ఎవరూ గుర్తించలేకపోతున్నారు. ఆ విధంగా ఆ ఇందువదన యుద్ధక్రీడతో విహరించింది.
10-178 పరుఁ జూచున్
సందర్భం:
సత్యభామ చకచకా ఇటు తన ప్రాణనాయకుణ్ణీ, అటు నరకుణ్ణీ మార్చిమార్చి చూస్తూ ఘోరంగా పోరుతున్నది. లిప్తకూడా వ్యవధానంలేని ఆ చూపులలో, ఆ కదలికలలో రెండు విరుద్ధరసాలు వింతగా అనుభవానికి వస్తున్నాయి.
మ. పరుఁ జూచున్ వరుఁ జూచు నొంప నలరింపన్, రోషరాగోదయా
విరతభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరగన్; గన్నులఁ గెంపు సొంపుఁ బరఁగన్ జండాస్త్ర సందోహమున్
సరసాలోక సమూహమున్ నెఱపుచున్, జంద్రాస్య హేలాగతిన్.
ప్రతిపదార్థం:
చంద్రాస్య = ఇందువదన; {చంద్రాస్య - చంద్రుని వంటి మోము కల సత్యభామ}; పరున్ = శత్రువును; ఒంపన్ = నొప్పింపవలెనని; చూచున్ = యత్నించును; వరున్ = పెనిమిటిని; అలరింపన్ = సంతోషపెట్టవలెనని; చూచున్ = యత్నించును; రోష = కోపము; రాగ = అనురాగము యొక్క; ఉదయ = పుట్టుకచేత; అవిరత = అవిశ్రాంత మైన; భృకుటి = బొమముడితోను; మందహాసము లతో = చిరునవ్వులతో; వీరంబున్ = వీరరసము; శృంగారమున్ = శృంగారరసము; జరగన్ = వర్తించగా; కన్నులన్ = కళ్ళయందు; కెంపు = ఎర్రదనము; సొంపు = మనోజ్ఞత; పరగన్ = వ్యాపించగా; చండ = తీక్షణమైన, చురుకైన; అస్త్ర = అస్త్రముల {అస్త్రము – మంత్రముల చేత యంత్రముల చేత ప్రయోగింప బడెడి ఆయుధములు, శస్త్రములు – సామాన్య మైన ఆయుధములు (కత్తి, గద, బాణము మొ.)}; సందోహమున్ = సమూహము; సరస = రసవంతములైన; ఆలోక = చూపుల; సమూహమున్ = సమూహము; నెఱపుచున్ = ప్రసరించుచు; హేలా = విలాస మయమైన; గతిన్ = విధముగా.
తాత్పర్యం:
ఆ భామ తీవ్రక్రోధంతో పగవానిని చంపివేయాలని చూస్తున్నది. వెంటనే చూపును ఇటువైపు త్రిప్పి తన పతిదేవుణ్ణి అదే చూపుతో ఆనందింపచేస్తున్నది. అటువైపు రోషం పెల్లుబుకుతున్నది. ఇటువైపు అనురాగం అంబరాన్ని అంటుకొంటున్నది. అటువైపు కనుబొమలు ముడివడుతున్నాయి. ఇటువైపు మందహాసం చిందులు త్రొక్కుతున్నది. అటు వీరరసమూ, ఇటు శృంగారరసమూ ఏకకాలంలో ఒప్పారుతున్నాయి. అటువైపు, కన్నులలో కెంపు, ఇటువైపు సొంపు తాండవిస్తున్నాయి. నిండు చందురుని చల్లని కాంతులు కదలాడుతున్న మోముతో అలరారే ఆ అంగన విలాసంగా, పగవానిమీద భయంకరమైన అస్త్రాలనూ, పతిదేవుని మీద సరసమైన చూపులనూ కుప్పలుతెప్పలుగా కురిపిస్తున్నది.
10-183 రాకేందుబింబమై
సందర్భం:
శ్రీహరిని చెట్టపట్టిన శృంగార రసాధిదేవత సత్యభామ ఇప్పుడు క్రొత్తగా నరకుని నరికి పోగులు పెట్టటానికి వీరరసాధిదేవత అయ్యి పోరుతున్నది. ఇటు శృంగారలక్ష్మీ, అటు వీరలక్ష్మీ అయిన ఆయమ్మను అత్యద్భుతంగా మన మనఃపటం మీద అక్షరశిల్పం చేస్తున్నారు మహాకవి పోతనామాత్యులు.
సీ. రాకేందుబింబమై రవిబింబమై యొప్పు; నీరజాతేక్షణ నెమ్మొగంబు;
కందర్పకేతువై ఘన ధూమకేతువై; యలరుఁ బూఁబోఁణి చేలాంచలంబు;
భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై; మెఱయు నాకృష్ట మై మెలఁత చాప;
మమృత ప్రవాహమై యనల సందోహమై; తనరారు నింతి సందర్శనంబు;
తే. హర్ష దాయి యై మహారోష దాయి యై
పరఁగు ముద్దరాలి బాణవృష్టి;
హరికి నరికిఁ జూడ నందంద శృంగార
వీరరసము లోలి విస్తరిల్ల.
ప్రతిపదార్థం:
రాకేందు = పున్నమి చంద్రుని; బింబమై = బింబమై; రవిబింబమై = సూర్య బింబమై; ఒప్పు = చక్కగా ఉన్నది; నీరజాతేక్షణ = కమలము వంటి కన్నులి కల సత్యభామ నె మ్మొగంబు = అందమైన ముఖము; కందర్ప = మన్మథుని; కేతువై = కేతనమై; ఘన = గొప్ప; ధూమకేతువై = తోకచుక్కగా(అరిష్ట సూచకం); అలరున్ = ఒప్పును; పూబోణి = సుకుమారి {పూబోడి - పూవు వంటి సుకుమారి}; చేలాంచలంబు = చీర కొంగుగా, భావజు = మన్మథుని; పరిధియై = మండలమై, ప్రళయార్కు = ప్రళయ కాలపు = సూర్యుని; పరిధియై = మండలమై; మెఱయున్ = ప్రకాశించును; మెలత = వనిత, సత్యభామ; చాపము = విల్లు; ఆకృష్టమై = లాగబడినదై; అమృత = అమృతపు; ప్రవాహమై = వెల్లువై; అనల = అగ్నుల; సందోహమై = సమూహమై; తనరారున్ = ఒప్పును; ఇంతి = యువతి; సందర్శనంబు = దర్శనము; హర్షదాయియై = సంతోష మును ఇచ్చునదై; మహా = మిక్కిలి; రోషదాయియై = కోపమును చూపునదై; పరగున్ = ప్రసిద్ధమగును; ముద్దరాలి = అందగత్తె యొక్క; బాణవృష్టి = బాణముల వానగా; హరికి = కృష్ణునికి; అరికి = శత్రువునకు; చూడన్ = చూడగా; అందంద = అక్కడి కక్కడే; శృంగార = శృంగార రసము; వీర రసములు = వీర రసములు; ఓలిన్ = క్రమముగా; విస్తరిల్లన్ = వ్యాపిస్తున్నాయి.
తాత్పర్యం:
పద్మాలవంటి కన్నులతో విరాజిల్లుతున్న ఆ సత్యభామ నిండుమోము కృష్ణదేవునకు పూర్ణిమనాటి చంద్రబింబమై ఒప్పారుతున్నది. అటు నరకునకు భగభగమండే రవిబింబమై ఉడికిస్తున్నది. ఆమె చీరకొంగు కృష్ణునకు మన్మథుని పతాకయై భాసిస్తున్నది. నరకునకు అదే ఒక ప్రాణాంతకమైన తోకచుక్కగా తోస్తున్నది. చెవులదాకా లాగిన అల్లె త్రాటితో అలరారు ఆమె చేతిలోని విల్లు కృష్ణునకు మన్మథుని గుడి అయి ఆనందమందిరం అయింది. అదే నరకునకు ప్రళయకాలంనాటి భాస్కరునికి ఏర్పడిన మండలంగా కన్పట్టింది. ఆ వనితను తేరిపారజూడటం హరికి అమృతప్రవాహం అయింది. నరకునకు అగ్నికుంపటిలా అయిపోయింది. ఆ ముద్దరాలి బాణాల జడివాన హరికి హర్షాన్నీ, అరికి మహారోషాన్ని అందజేస్తున్నది. ఇలా శృంగారవీరరసాలు వింతగా ఒక క్రమంలో విస్తరిల్లుతున్నాయి.
10-187 కొమ్మా! దానవ నాథుని
సందర్భం:
సత్యభామ సరభసంగా సాహసంతో పోరాడి రక్కసి మూకలను దిమ్మతిరిగేట్టు కొట్టింది. వారందరూ తోక ముడిచారు. అది చూచి హరి ఆ హరిణలోచనతో సరసంగా ఇలా పలికాడు.
కం. కొమ్మా! దానవ నాథుని
కొమ్మాహవమునకుఁ దొలఁగె; గురువిజయముఁ గై
కొమ్మా! మెచ్చితి నిచ్చెదఁ
గొమ్మాభరణములు నీవు గోరిన వెల్లన్.
ప్రతిపదార్థం:
కొమ్మా = చిన్నదానా; దానవనాథుని = నరకాసురుని {దానవ నాథుడు - రాక్షస రాజు, నరకుడు}; కొమ్ము = పక్షము; ఆహవమునకున్ = యుద్ధక్షేత్రము నుండి; తొలగె = పారిపోయెను; గురు = గొప్ప; విజయమున్ = గెలుపును; కైకొమ్మా = చేపట్టుము; మెచ్చితిన్ = మెచ్చుకొంటిని; కొమ్మా = తీసుకొనుము; ఆభరణములున్ = భూషణములు; నీవు = నీవు; కోరినవి = కోరుకొన్నవి; ఎల్లన్ = అన్నిటిని; ఇచ్చెదన్ = ఇస్తాను.
తాత్పర్యం:
భామా! దానవుల నాథుడు అనాథుడయ్యాడు. ఆతని పరివారమంతా నీ ధాటికి నిలువలేక పలాయనం చిత్తగించారు. నీకు చాలా గొప్ప విజయం సిద్ధించింది. గ్రహించు. అంతే కాదు నేను కూడా మెచ్చాను. కోరిన అలంకారాలన్నింటినీ నీకు కానుకగా ఇస్తాను. తీసుకో.
10-212 వనజాక్షి
సందర్భం:
శ్రీకృష్ణవాసుదేవుడు నరకాసురుని సంహరించి అతని పురం ప్రవేశించి అక్కడ అతడు ఎక్కడెక్కడినుండి తెచ్చియో బంధించి ఉంచిన పదనారువేల రాచకన్నియలను చెరనుంచి విడిపించాడు. వారందరూ శ్రీకృష్ణునిపై మోహం పెంచుకున్నారు. వారిలో వారు ఇలా అనుకుంటున్నారు.
సీ. వనజాక్షి! నేఁ గన్క వైజయంతిక నైన; గదిసి వ్రేలుదు గదా కంఠమందు;
బింబోష్ఠి! నేఁ గన్క బీతాంబరము నైన; మెఱసి యుండుదు గదా మేనునిండఁ;
గన్నియ! నేఁ గన్క గౌస్తుభమణి నైన; నొప్పు చూపుదుఁ గదా యురమునందు;
బాలిక! నేఁ గన్కఁ బాంచజన్యము నైన; మొనసి చొక్కుదుఁ గదా మోవిఁ గ్రోలి;
ఆ. పద్మగంధి! నేను బర్హ దామమ నైనఁ
చిత్రరుచుల నుందు శిరమునందు
ననుచుఁ బెక్కుగతుల నాడిరి కన్యలు
గములు గట్టి గరుడగమనుఁ జూచి.
ప్రతిపదార్థం:
వనజాక్షి = పద్మాక్షీ {వన జాక్షి - వనజము (పద్మము) వంటి కన్నులు కలది} ; నేన్ = నేను; కన్కన్ = కనుక; వైజయంతికనైన = వైజయంతికమాలను అయినచో; కంఠ మందు = మెడలో; కదిసి = చేరి; వ్రేలుదున్ కదా = వ్రేలాడుచుందును కదా; బింబోష్ఠి = పడతి {బింబోష్ఠి - దొండపండు వంటి పెదవి కలది}; నేన్ = నేను; కన్కన్ = కనుక; పీతాంబరమనైన = పచ్చని పట్టువస్త్రమును అయినచో; మేనునిండ = దేహమంతటా; మెఱసి = ప్రకాశించి; ఉండుదుకదా = ఉండేదాన్ని కదా; కన్నియ = కన్య; నేన్ = నేను; కన్కన్ = కనుక; కౌస్తుభమణినైన = కౌస్తుభమణిని అయినచో {కౌస్తుభమణి - విష్ణుమూర్తి వక్ష స్థలమున ఉండెడి మణి}; ఉరమునందు = వక్షస్థలము మీద; ఒప్పు = మనోజ్ఞతను; చూపుదున్ = కనబరచే దానిని; కదా = కదా; బాలిక = చిన్నదాన; నేన్ = నేను; కన్కన్ = కనుక; పాంచజన్యమునైన = పాంచజన్యమను శంఖమును అయినచో; మోవిన్ = అధరామృతమును; క్రోలి = ఆస్వాదించి, తాగి; మొనసి = అతిశయించి; చొక్కుదుగదా = పరవశించెదను కదా; పద్మగంధి = ఇంతి {పద్మగంధి - పద్మముల వంటి దేహ పరిమళము కలది}; నేనున్ = నేను; బర్హ = నెమలి పింఛముల; దామమున్ = దండను; ఐనన్ = అయినచో; శిరమునందు = తల పైన; చిత్ర = పలువన్నెల; రుచులన్ = కాంతు లతో; ఉందున్ = ఉండెదను; అనుచున్ = అని; కన్యలు = యువతులు; గములు = గుంపులు; కట్టి = కట్టి; గరుడగమనున్ = కృష్ణుని {గరుడగమనుడు – గరుడ వాహన ముపై తిరుగువాడు, కృష్ణుడు}; చూచి = చూసి; పెక్కుగతులన్ = బహు విధములుగా; ఆడిరి = చెప్పుకొనిరి;
తాత్పర్యం:
ఆ నరకుని చెరనుండి విడుదలపొందిన పదునారువేల కన్నియలు నల్లనయ్య అందచందాలను చూచి పరవశించిపోయారు. ఇలా అనుకుంటున్నారు. వనజాక్షీ! నేనే వైజయంతీమాలనైతే ఆ స్వామి కంఠసీమలో మాలనై వ్రేలాడేదానను కదా! బింబోష్ఠీ! నేను పట్టుపుట్టాన్నైతే ఆ స్వామి మేనంతా ఆవరించి మెరసిపోయేదానను కదా! ఓ కన్నెపిల్లా! నేనే కనుక కౌస్తుభమణినై ఉంటే ఆ స్వామి ఉరఃస్థలంపై ఒప్పారి ఉండేదానను కదా! బాలికా! నేను పాంచజన్యాన్నయి ఉంటే ఆ దేవదేవుని మోవిని ఆస్వాదిస్తూ పారవశ్యం పొందేదానను కదా! పద్మగంధీ! నేను నెమలిపింఛమునై ఉంటే ఆ మహాత్ముని శిరస్సు మీద చిత్రకాంతులతో చెన్నారి ఉండే దానను - అని పెక్కువిధాలుగా గుంపులు గుంపులుగా కూడుకొని గరుడగమనుని చూచి ఆడుకున్నారు.
-------------------------------------------------
ఏకాదశ స్కంధం
11-12 ఘనుని శ్రీకృష్ణునిఁ
సందర్భం:
శుకయోగీంద్రుడు పరీక్షిన్మహారాజునకు యాదవులందరూ బ్రాహ్మణ శాపం వల్ల ఒకరినొకరు కొట్టుకుని చనిపోయారని చెప్పాడు. అంతటి మహానుభావులకు బ్రాహ్మణ శాపం ఎందుకు కలిగింది అని పరీక్షిత్తు అడుగగా దానిని వివరిస్తూ విశ్వామిత్రుడు మొదలైన మహర్షులు శ్రీకృష్ణుని దర్శించడానికి విచ్చేశారని శుకుడు చెప్పాడు. ఆ సందర్భంలో కృష్ణుని దివ్య విభూతిని ఇలా వర్ణిస్తున్నాడు.
సీ. ఘనుని శ్రీకృష్ణునిఁ గౌస్తుభాభరణునిఁ; గర్ణకుండల యుగ్మ ఘన కపోలుఁ
బుండరీకాక్షు నంభోధరశ్యామునిఁ; గలిత నానారత్న ఘన కిరీటు
నాజానుబాహు నిరర్గళాయుధహస్తు; శ్రీకర బీత కౌశేయవాసు
రుక్మిణీ నయనసరోజ దివాకరు; బ్రహ్మాది సుర సేవ్య పాదపద్ము
తే. దుష్ట నిగ్రహ శిష్ట సంతోషకరణుఁ
గోటిమన్మథ లావణ్య కోమలాంగు
నార్తజన రక్షణైక విఖ్యాతచరితుఁ
గనిరి కరుణాసముద్రుని ఘనులు మునులు.
తాత్పర్యము:
శ్రీకృష్ణుడు చాలా గొప్పవాడు. కౌస్తుభమనే మణితో విరాజిల్లుతున్నవాడు. గొప్ప తేజస్సులను వెదజల్లుతున్న కర్ణాభరణములతో అతని చెక్కిళ్ళు ప్రకాశిస్తున్నాయి. తెల్లని కాంతులతో విరాజిల్లుతున్న పద్మాలవంటి కన్నులు ఒప్పారుతున్నాయి. నీలిమేఘం వంటి వన్నెతో శోభిల్లుతున్నాడు. పెక్కు విధాలైన రత్నాలు పొదిగిన కిరీటం శిరస్సు మీద వెలుగులు నింపుతున్నది. మోకాళ్ళ వరకు వ్యాపించి ఉన్న బాహువులు అందంగా ఒప్పారుతున్నవి. చక్రము, గద, ఖడ్గము, మొదలైన ఆయుధాలను ధరించియున్నాడు. ఆ ఆయుధాలకు చొరరాని తావులు లేవు. శోభతో ఒప్పారుతున్న పట్టుపుట్టాన్ని కట్టుకుని ఉంటాడు. రుక్మిణీదేవి కన్నులనే కమలాలకు సూర్యుడైన వాడు. బ్రహ్మ మొదలైన దేవతలందరూ ఆయన పాదపద్మాలను అర్చించి ఆనందమొందుతూ ఉంటారు. కోటి మన్మథుల లావణ్యంతో విరాజిల్లే సుకుమారమైన దేహం కలవాడు. ఆర్తజనులను రక్షించుటయే పరమ ప్రయోజనమైన విఖ్యాత చరిత్రుడు. అట్టి కరుణాసముద్రుడైన శ్రీకృష్ణుని ఘనులైన మునులు దర్శించుకున్నారు.
ప్రతిపదార్ధం:
ఘనుని = గొప్పవానిని; శ్రీ = మహనీయ మైన; కృష్ణునిన్ = కృష్ణుడుని; కౌస్తుభ = కౌస్తుభ మణిని; ఆభరణునిన్ = ధరించిన వానిని; కర్ణకుండల = చెవి కమ్మల; యుగ్మ = జత(తోప్రకాశించెడి); ఘన = గొప్ప; కపోలున్ = చెంపలు గల వానిని; పుండరీకాక్షున్ = పద్మనయనుని; అంభోధర = మేఘము వలె; శ్యామునిన్ = నల్లని వానిని; కలిత = ధరించిన; నానా = అనేక; రత్న = మణులు పొదిగిన; ఘన = గొప్ప; కిరీటున్ = కిరీటము కలవానిని; ఆజానుబాహు = మంచి పొడగరిని {ఆజాను బాహువు - ఆజాను (మోకాళ్ళ వరకు కల) బాహువు (చేతులు కలవాడు), సుందరుడు}; నిరర్గళ = ఆడ్డు లేని; ఆయుధ = ఆయుధములను; హస్తున్ = ధరించిన వానిని; శ్రీకర = శుభకరమైన; పీత = పచ్చని; కౌశేయ = పట్టు బట్టలు; వాసున్ = కట్టుకొన్న వానిని; రుక్మిణీ = రుక్మిణీదేవి యొక్క; నయన = కన్నులను; సరోజ = పద్మములకు {సరోజము - సరస్సున పుట్టినది, పద్మము}; దివాకరున్ = సూర్యుని వంటి వానిని {దివాకరుడు - పగటికి కారణ మైన వాడు, సూర్యుడు}; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మున్నగు; సుర = దేవతలచే; సేవ్య = కొలవబడుతున్న; పాద = పాదములు అను; పద్మున్ = పద్మములు కల వాడు; దుష్ట = చెడ్డ వారికి; నిగ్రహ = శిక్షించుట; శిష్ట = మంచి వారికి; సంతోష = సంతోషము; కరణున్ = కలిగించు వానిని; కోటి = కోటి మంది; మన్మథ = మన్మథులతో తులతూగు; లావణ్యున్ = లావణ్యము కల వానిని; కోమల = మృదువైన; అంగు = శరీరము కలవానిని; ఆర్త = ఆర్తు లైన; జన = వారిని; రక్షణ = కాపాడుటలో; ఏక = ముఖ్య మైన; విఖ్యాత = ప్రసిద్ధ మైన; చరితున్ = ప్రవర్తన కల వానిని; కనిరి = చూసిరి; కరుణా = దయకు; సముద్రునిన్ = సముద్రము వంటి వానిని; ఘనులు = గొప్పవారు; మునులు = ఋషులు.
11-14 జనములు
సందర్భం:
శ్రీ కృష్ణ దర్శనానికి వచ్చిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, నారదుడు మొదలైన మహర్షులు పవిత్రమైన వాక్కులతో అతనిని ప్రశంసిస్తున్నారు.
కం. జనములు నిను సేవింపని
దినములు వ్యర్థంబు లగుచుఁ దిరుగుచునుండున్
దనువులు నిలుకడ గా వఁట
వనములలో నున్ననైన వనరుహనాభా!
తాత్పర్యము:
ఓయీ పద్మనాభా! నిన్ను సేవించుకోలేని దినాలు జనాలకు పనికిమాలినట్టివి. ఈ దేహాలు శాశ్వతంగా ఉండవు. అన్ని సంగములను వదిలిపెట్టి అరణ్యాలకు పోయినా తనువులు నిలకడగా ఉండవు కదా!
ప్రతిపదార్ధం:
జనములు = ప్రజలు; నిను = నిన్ను; సేవింపని = కొలువని; దినములు = రోజులు; వ్యర్థంబులు = వృథా యైనవి; అగుచున్ = ఔతు; తిరుగుచు నుండున్ = జరుగు తుంటాయి; తనువులు = దేహాలు; నిలుకడ = స్థిర మైనవి; కావు = లేదు; అట = అట; వనములు = అడవుల; లోన్ = అందు; ఉన్న నైనన్ = ఉన్న ప్పటికిని; వనరుహ నాభా = కృష్ణా {వనరుహ నాభుడు – పద్మ నాభుడు, విష్ణువు}.
11-15 తరణంబులు
సందర్భం:
మహర్షులు శ్రీకృష్ణవాసుదేవుని చరణాల మహిమను ఇలా వర్ణిస్తున్నారు.
కం. తరణంబులు భవజలధికి
హరణంబులు దురితలతల కాగమముల కా
భరణంబు లార్తజనులకు
శరణంబులు, నీదు దివ్య చరణంబులిలన్.
తాత్పర్యము:
స్వామీ! సంసారమనేది చాలా పెద్ద సముద్రము. దానిలో పడ్డ జీవుడు తనంత తాను ఒడ్డునకు చేరుకొనలేడు. నీ పాదపద్మాలు అట్టివానికి భద్రమైన నావలవుతాయి. పాపాలు భయంకరంగా అల్లుకున్న బలమైన తీగలు. నీ చరణాలు - వానిని ఛేదించడానికి సమర్థమైన సాధనాలు. వేదాలు పరమాత్మ జ్ఞానాన్ని ప్రసాదించే వాగ్వైభవము కల గ్రంధాలు. నీ పాదాలు వానికి ఆభరణాలు. దు:ఖంతో కుమిలిపోయే జనులకు దిక్కైనవి నీ దివ్యచరణాలు.
ప్రతిపదార్ధం:
తరణంబులు = దాటించెడి తెప్పలు; భవ = సంసార; జలధి = సముద్రమున; కిన్ = కు; హరణంబులు = హరించెడివి; దురిత = పాపాలు అనెడి; లతలు = తీవెల; కిన్ = కు; ఆగమములు = వేదాల; కిన్ = కు; ఆభరణంబులు = అలంకారములు; ఆర్త = ఆర్తు లైన; జనులు = వారి; కున్ = కు; శరణంబులు = రక్షించునవి; నీదు = నీ యొక్క; దివ్య = దివ్యమైన; చరణంబు = పాదములు; ఇలన్ =భూలోకంలో.
11-16 ఒక్క వేళను సూక్ష్మరూపము
సందర్భం:
జ్ఞానసంపన్నులైన మహర్షుల మహనీయ స్తుతులు ఇంకా ఇలా సాగుతున్నాయి.
మ. ఒక్క వేళను సూక్ష్మరూపము నొందు దీ వణుమాత్ర మై
యొక్క వేళను స్థూలరూపము నొందు దంతయు నీవ యై
పెక్కు రూపులుఁ దాల్తు నీ దగు పెంపు మాకు నుతింపఁగా
నక్కజం బగుచున్న దేమన? నంబుజాక్ష! రమాపతీ!
తాత్పర్యము:
విశ్వాన్నంతటినీ వీక్షించే విశాలమైన కన్నులతో అలరారు స్వామీ! రమాపతీ! నీవు ఒక్కొక్క సమయంలో అణుమాత్రమైన సూక్ష్మరూపంతో విరాజిల్లుతూ ఉంటావు. కొన్ని వేళలలో సర్వమూ నీవేయై స్థూలరూపంతో ప్రకాశిస్తూ ఉంటావు. నీ ఇష్టాన్ని అనుసరించి పెక్కురూపాలను పొందుతూ ఉంటావు. నీ మహిమను మేము స్తుతింపగలమా! మాకంతా ఆశ్చర్యముగా నున్నది.
ప్రతిపదార్ధం:
ఒక్క = ఒక్కొక; వేళను = మాటు; సూక్ష్మ = చాలాచిన్న; రూపమున్ = స్వరూపమును; ఒందుదు = పొందుతావు; అణు మాత్రము = అణు వంత వాడవు; ఐ = అయ్యి; ఒక్క = ఒక్కొక; వేళను = మాటు; స్థూల = మిక్కలి పెద్ద; రూపమున్ = స్వరూపమును; ఒందుదు = పొందుతావు; అంతయు = సమస్తము; నీవ = నీవు మాత్రమే; ఐ = అయ్యి; పెక్కు = అనేక మైన; రూపులు = స్వరూపాలు; తాల్తు = ధరించెదవు; నీది = నీ దై నట్టిది; అగు = ఐన; పెంపు = అతిశయము; మేము = మా; కున్ = కు; నుతింపగాన్ = స్తుతిస్తుండగా; అక్కజంబు = ఆశ్చర్యము; అగుచున్నది = కలిగి స్తున్నది; ఏమనన్ = ఏమి అనగలము; అంబు జాక్ష = కృష్ణా {అంబు జాక్షుడు - పద్మముల వంటి కన్నులు కల వాడు, కృష్ణుడు}; రమాపతీ = కృష్ణా {రమా పతి - రమ (లక్ష్మీదేవి యొక్క) పతి (భర్త), విష్ణువు}.
11-17 శ్రీనాయక
సందర్భం:
పరమాత్మ జ్ఞానాన్ని నిలువెల్లా నింపుకున్న వశిష్ఠాది మహర్షులు శ్రీకృష్ణ పరమాత్మను గురించి ఇలా స్తోత్రం చేస్తున్నారు.
కం. శ్రీనాయక! నీ నామము
నానా భవరోగ కర్మ నాశమునకు వి
న్నాణం బగు నౌషధ మిది
గానరు దుష్టాత్ము లకట! కంజదళాక్షా!
తాత్పర్యము:
పద్మదళాక్షా! శ్రీ నాయకా! నీ నామం పెక్కు విధాలైన సంసార రోగాలను కర్మలను నాశనం చేసే శ్రేష్టమైన ఔషధం. చెడిపోయిన బుద్ధిగల నికృష్ట మానవులు ఈ సంగతి తెలియలేరు. అయ్యో! ఎంత ఘోరం!
ప్రతిపదార్ధం:
శ్రీనాయక = కృష్ణా {శ్రీ నాయకుడు - శ్రీ (లక్ష్మీదేవికి, సంపదలకు) నాయకుడు, విష్ణువు}; నీ = నీ యొక్క; నామము = పేరు; నానా = అనేకమైన; భవ = జన్మలలోని; రోగ = జబ్బులను; దుఃఖ = దుఃఖములను; నాశమున్ = నశింపజేయుట; కున్ = కు; విన్నాణంబు = మిక్కలి నాణ్యమైనది; అగు = ఐన; ఔషధము = మందు; ఇది = ఇది; కానరు = తెలుసుకొన లేకున్నారు; దుష్టాత్ములు = దుష్టులు; అకట = అయ్యో; కంజ దళాక్షా = కృష్ణా {కంజ దళాక్షుడు - కంజ (పద్మముల) దళ (రేకుల వంటి) అక్ష (కన్నులు కలవాడు), కృష్ణుడు}.
11-32 అతి పాపకర్ము లైనను
సందర్భం:
నారద మహర్షి వసుదేవునకు విదేహ వృషభ సంవాదాన్ని తెలియజేస్తూ ఇలా అంటున్నాడు.
కం. అతి పాపకర్ము లైనను
సతతము నారాయణాఖ్య శబ్దము మదిలో
వితతంబుగఁ బఠియించిన
చతురులఁ గొనియాడఁ గమలసంభవు వశమే?
తాత్పర్యము:
మహానుభావా! వసుదేవా! ఎంత ఘోరాతిఘోరమైన పాపాలు చేసినవారైనా ఎల్లవేళలా నారాయణ నామాన్ని వదలకుండా స్మృతిలో నిలుపుకున్నట్లైతే అట్టి నామజపపరాయణులను కొనియాడడం బ్రహ్మదేవునకు కూడా సాధ్యం కాని పని.
ప్రతిపదార్ధం:
అతి = మిక్కలి; పాప = పాపపు; కర్ములు = పనులు చేయు వారు; ఐనను = అయినప్పటికి; సతతము = ఎల్లప్పుడు; నారాయణ = నారాయణ; ఆఖ్య = అనెడి; శబ్దమున్ = నామమును; మది = మనస్సు; లోన్ = అందు; వితతంబుగన్ = ఎడతెగకుండ; పఠియించిన = స్మరించెడి; చతురులన్ = తెలివి కల వారిని; కొనియాడన్ = స్తుతించుటకు; కమలసంభవు = బ్రహ్మదేవునికి; వశమే = శక్యమా, కాదు.
11-42 కరణత్రయంబు
సందర్భం:
ఒకమారు విదేహ మహారాజు దగ్గరకు మహా తపస్సుతో విరాజిల్లే మహర్షులు తొమ్మిదిమంది వచ్చారు. విదేహ రాజు వారి గొప్పతనాన్ని కొనియాడి కొన్ని ప్రశ్నలు అడిగాడు. వారు సమాధానం చెప్తూ ఇలా అన్నారు.
కం. కరణత్రయంబు చేతను
నరుఁ డే కర్మంబు సేయు నయ్యైవేళన్
హరి కర్పణ మని పలుకుట
పరువడి సుజ్ఞానమండ్రు పరమ మునీంద్రుల్.
తాత్పర్యము:
రాజా! మానవులకు మనసూ, మాట, కాయము అనే మూడు కరణాలు ఉన్నాయి. వీనితో నిరంతరము ఏవో పనులు చేస్తూనే ఉంటారు. అలా చేసే సమయాలలో చేసిన ప్రతి కార్యాన్ని శ్రీహరికే సమర్పణ చేస్తున్నాను అని పలకడం మంచి జ్ఞానం అని మహాముని శ్రేష్ఠులు చెబుతూ ఉంటారు.
ప్రతిపదార్ధం:
కరణత్రయంబు = మనోవాక్కాయకర్మల {కరణత్రయము - త్రికరణములు 1మనస్సు 2వాక్కు 3కాయము}; చేతను = చేత; నరుడు = మానవుడు; ఏ = ఏ దైనా సరే; కర్మంబున్ = పని; చేయున్ = చేసెడి; అయ్యై = ఆయా; వేళన్ = సమయము లందు; హరి = నారాయణుని; కున్ = కు; అర్పణము = సమర్పిస్తున్నా; అని = అని; పలుకుట = పలకుట; పరువడి = మిక్కలి; సుఙ్ఞానము = మంచి ఙ్ఞానము; అండ్రు = అంటారు; పరమ = మహా; ముని = ఋషులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు.
11-44 సంతతంబును
సందర్భం:
మహర్షులు విదేహ మహారాజుకు మూడు కరణాలతో పరమాత్మను సేవించుకునే మార్గాన్ని చక్కగా ఉపదేశిస్తున్నారు.
సీ. సంతతంబును గృష్ణ సంకీర్తనంబులు; వీనుల కింపుగ వినఁగవలయు
హర్షంబుతోడుతఁ హరినామ కథనంబు; బాటలఁ నాటలఁ బరఁగవలయు
నారాయణుని దివ్యనామాక్షరంబులు; హృద్వీథి సతతంబు నెన్నవలయుఁ
గంజాక్షు లీలలు గాంతారముల నైన; భక్తి యుక్తంబుగాఁ బాడవలయు
తే. వెఱ్ఱిమాడ్కిని లీలతో విశ్వమయుని
నొడువుచును లోకబాహ్యత నొందవలయు
నింతయును విష్ణుమయ మని యెఱుఁగవలయు
భేద మొనరింప వలవదు మేదినీశ!
తాత్పర్యము:
రాజా! శ్రీకృష్ణుని సంకీర్తనాన్ని నిరంతరము చెవులకు ఇంపుగా వింటూ ఉండాలి. పాటలలో, ఆటలలో, మహానందంతో శ్రీహరి నామములను చెప్పుకుంటూ కాలం గడపాలి. శ్రీమన్నారాయణుని దివ్యనామాక్షరాలను హృదయవీథిలో విడువకుండా భావిస్తూ ఉండాలి. భయంకరమైన అడవులలోనైనా శ్రీమహావిష్ణువు లీలలను భక్తినీ కుదురుకొలుపుకుని పాడుకుంటూ ఉండాలి. వెఱ్ఱివారిలాగా విశ్వమంతా నిండిన పరమాత్మను ప్రస్తుతిస్తూ లోకానికి దూరమైపోవాలి. సమస్తమూ విష్ణుమయమని తెలుసుకోవాలి. విష్ణువునకూ, విశ్వానికీ భేదం ఉంది అని అనుకోవడం కూడా పనికిరాదు.
ప్రతిపదార్ధం:
సంతతంబును = ఎల్లప్పుడు; కృష్ణ = శ్రీకృష్ణుని; సంకీర్తనంబు = స్తోత్రములు; వీనులు = చెవుల; కిన్ = కి; ఇంపుగా = విందుగా; వినగవలయు = వినాలి; హరి = నారాయణుని; నామ = నామములు; కథనంబు = గాథలను; హర్షంబు = సంతోషము; తోడుత = తోటి; పాటల నాటల = ఆట పాట లలో; పరగ వలయు = చేయ వలెను; నారాయణుని = హరి; దివ్య = దివ్య మైన; నా మాక్షరంబులు = పేర్లను; హృత్ = మానసిక; వీథిన్ = అంతరాలలో; సతతంబున్ = ఎల్లప్పుడు; ఎన్నవలయు = స్మరించాలి; కంజాక్షు = పద్మాక్షుని, హరి; లీలలు = విహారములను; కాంతారములన్ = అడవులలో; ఐనన్ = అయినను; భక్తి = భక్తితో; యుక్తంబుగా = కూడినవిగా; పాడవలయు = కీర్తించవలెను;
వెఱ్ఱి = వెర్రివాని; మాడ్కిని = వలె; లీల = లీల; తోన్ = తోటి; విశ్వమయుని = నారాయణుని; నొడువుచును = స్తుతించుతు; లోక బాహ్యతన్ = లోకాని కంటీ ముట్టని స్థితి; ఒందవలయు = పొందవలెను; ఇంతయును = ఇ దంతా; విష్ణు = విష్ణుమూర్తితో; మయము = నిండినది; అని = అని; ఎఱుగవలయున్ = తెలిసి కొనవలెను; భేదము = భేద బుద్ధి; ఒనరింప = చూపుట; వలవదు = వద్దే వద్దు; మేదినీశ = రాజా.
11-46 సర్వభూతమయుం డైన
సందర్భం:
మహర్షులు నిలువెల్లా జ్ఞానమే అయినవారు కనుక విదేహరాజుతో భాగవతుడు అయినవాని లక్షణాలను వివరిస్తున్నారు.
తే. సర్వభూతమయుం డైన సరసిజాక్షుఁ
డతఁడె తన యాత్మయం దుండు ననెడువాఁడు
శంఖ చక్ర ధరుం డంచుఁ జనెడువాఁడు
భక్తిభావాభిరతుఁడు వో భాగవతుఁడు.
తాత్పర్యము:
రాజా! పద్మాలవంటి చక్కని నేత్రములు గల శ్రీమన్నారాయణుడు సర్వభూతమయుడు. అంటే విశ్వమంతా విష్ణుమయమే! కాగా అతనిని లోపలా, వెలుపలా కూడా దర్శించుకోవాలి. తన హృదయం లోపలి పొరలలో శంఖము, చక్రము ధరించి సంచరిస్తున్నవాడు సర్వాత్ముడైన పరమాత్మయే అని భక్తి భావంతో ఆనందించే శీలం కలవానిని భాగవతుడు అంటారు.
ప్రతిపదార్ధం:
సర్వ = సమస్త మైన; భూత = జీవుల; మయుండు = అందు ఉండువాడు; ఐన = అయిన; సరసి జాక్షుడు = హరిని; అతడె = అతనే; తన = తమ యొక్క; ఆత్మ = ఆత్మ; అందున్ = లో; ఉండున్ = ఉంటాడు; అనెడు = అను విశ్వాసము కల; వాడు = వాడు; శంఖ = శంఖము; చక్ర = చక్రము; ధరుండు = ధరించి ఉండు వాడు; అంచున్ = అని; చనెడు వాడు = విశ్వాసము కలవాడు; భక్తి భావ = భక్తి భావనలో; అభిరతుడువో = ఆసక్తి కల వాడు; భాగవతుడు = భాగవతుడు.వర్ణ = చతుర్వర్ణముల; ఆశ్రమ = చతురాశ్రముల; ధర్మంబులు = ధర్మములు; నిర్ణయ = సూత్రములు; కర్మములన్ = కర్మలు అందు; చెడక = మునిగిపోకుండ; నిఖిల = సమస్తమైన; జగత్ = లోకాల; సంపూర్ణుడు = నిండిపోయినవాడు; హరి = విష్ణువు; అను నాతడె = అతనే; వర్ణింపగన్ = స్తుతించుటకు; భాగవతుడు = భాగవతుడు; వసుధాధీశ = రాజా.
11-47 వర్ణాశ్రమ ధర్మంబుల
సందర్భం:
భాగవతుని లక్షణాన్ని గురించి మహర్షులు విదేహ మహారాజునకు ఇలా వివరిస్తున్నారు.
కం. వర్ణాశ్రమ ధర్మంబుల
నిర్ణయ కర్మములఁ జెడక నిఖిల జగత్సం
పూర్ణుఁడు హరి యను నాతఁడె
వర్ణింపఁగ భాగవతుఁడు వసుధాధీశా!
తాత్పర్యము:
రాజా! మానవులు గుణ కర్మల విభాగాలని బట్టి నాలుగేసి విభాగాలుగా ఏర్పడుతున్నారు. వానిలో మొదటివానిని వర్ణాలని, రెండవవానిని ఆశ్రమాలని అంటారు. ప్రతీ వర్ణానికీ, ప్రతీ ఆశ్రమానికీ, కొన్ని ధర్మాలు, విడివిడిగా ఉంటాయి. వానికి అనుగుణంగా కొన్ని ప్రత్యేకమైన పనులు కూడా విద్యుక్తంగా ఉన్నాయి. ఎవరికి వారు ఆయా ధర్మాలను పాటిస్తూ ఉండాలి. ఆయా కర్మలను ఆచరిస్తూ ఉండాలి. వానిని చెడగొట్టరాదు. అలా వర్ణాశ్రమాల ధర్మాలను చక్కగా నిర్వహిస్తూ సమస్త జగాలూ నిండిన మహాత్ముడు హరి ఒక్కడే అని పలుకుతూ తదనుగుణంగా ప్రవర్తించేవాడు భాగవతుడు అవుతాడు.
ప్రతిపదార్ధం:
వర్ణ = చతుర్వర్ణముల; ఆశ్రమ = చతురాశ్రముల; ధర్మంబులు = ధర్మములు; నిర్ణయ = సూత్రములు; కర్మములన్ = కర్మలు అందు; చెడక = మునిగిపోకుండ; నిఖిల = సమస్తమైన; జగత్ = లోకాల; సంపూర్ణుడు = నిండిపోయినవాడు; హరి = విష్ణువు; అను నాతడె = అతనే; వర్ణింపగన్ = స్తుతించుటకు; భాగవతుడు = భాగవతుడు; వసుధాధీశ = రాజా.
11-51 పరమబ్రహ్మ మనంగాఁ
సందర్భం:
రాజా! నారాయణ తత్త్వాన్ని వివరిస్తాను, ఆలకించు అని విదేహ మహారాజుతో అంతరిక్షుడనే ఋషివరేణ్యుడు ఇలా అంటున్నాడు.
కం. పరమబ్రహ్మ మనంగాఁ
బరతత్త్వ మనంగఁ బరమపద మనఁగను నీ
శ్వరుఁ డనఁ గృష్ణుఁ డన జగ
ద్భరితుఁడు నారాయణుండు దా వెలుఁగొందున్.
తాత్పర్యము:
రాజా! మనం భగవంతుణ్ణి అనేక నామాలతో అర్చిస్తూ ఉంటాం. నామాలెన్నయినా తత్త్వం మాత్రం ఒక్కటే! దానిని దృష్టిలో ఉంచుకుంటే పరబ్రహ్మము అన్నా, పరతత్త్వము అన్నా, పరమపదము అన్నా, పరమేశ్వరుడు అన్నా, కృష్ణుడు అన్నా లోకాలన్నింటియందు నిండియున్న నారాయణుడే ప్రకాశిస్తూ ఉంటాడు.
ప్రతిపదార్ధం:
పరమబ్రహ్మము = పరబ్రహ్మము; అనంగా = అని; పరతత్వము = పరతత్వము; అనంగ = అని; పరమపదము = పరమపదము; అనగనున్ = అని; ఈశ్వరుడు = పరమేశ్వరుడు; అనన్ = అని; కృష్ణుడు = కృష్ణుడు; అనన్ = అని; జగద్భరితుడు = లోకాలను భరించు వాడు; నారాయణుండు = విష్ణుమూర్తి; తాన్ = అతను; వెలుగొందున్ = ప్రకాశించును.
11-55 హరిదాసుల మిత్రత్వము
సందర్భం:
విదేహ మహారాజునకు విజ్ఞాన బోధ చెయ్యడానికి వచ్చిన తొమ్మండుగురిలో ప్రబుద్ధుడు అనే మహర్షి ఉత్తమ భాగవతుల ధర్మాలన్నింటినీ వివరించి చెప్పి చివరకు ఇలా అంటున్నాడు.
కం. హరిదాసుల మిత్రత్వము
మురరిపు కథ లెన్నికొనుచు మోదముతోడన్
భరితాశ్రు పులకితుం డయి
పురుషుఁడు హరిమాయ గెల్చు భూపవరేణ్యా!
తాత్పర్యము:
ఉత్తమ నృపాలా! హరిమాయ చాలా గొప్పది. దానిని దాటడం అతి దుష్కరమైన విషయం. కానీ, దానికొక చక్కని దారి ఉన్నది. చెబుతాను విను. నిరంతరమూ హరిదాసులతో చెలిమి చేస్తూ ఉండాలి. శ్రీమహావిష్ణువు కథలను వింటూ ఆనంద పారవశ్యంతో కన్నీరు వదులుతూ దేహమంతా పులకలతో అలరారుతూ ఉండే మానవుడు ఆ హరిమాయను గెలవగలుగుతాడు.
ప్రతిపదార్ధం:
హరి = విష్ణు; దాసుల = భక్తులతో; మిత్రత్వమున్ = స్నేహము చేస్తు; మురరిపు = విష్ణు {ముర రిపుడు – ము రాసురుని శత్రువు, కృష్ణుడు}; కథలు = గాథలను; ఎన్నికొనుచు = తలచుకొనుచు; మోదము = సంతోషము; తోడన్ = తోటి; హరుష = హర్ష, ఆనంద; అశ్రు = భాష్పాలుతో; పులకితుండు = ఒళ్ళు పులకరించిన వాడు; ఐ = అయ్యి; పురుషుడు = మానవుడు; హరి = విష్ణు; మాయన్ = మాయను; గెల్చున్ = గెలుస్తాడు; భూప వరేణ్యా = మహారాజా {భూప వరేణ్యుడు - భూపు (రాజులలో) శ్రేష్ఠుడు, మహారాజు}.
11-61 తారల నెన్నఁగ వచ్చును
సందర్భం:
వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థులైన మహర్షులలో ఒకడైన ఆవిర్హోత్రుడు అనే మహర్షి పరమాత్మ గుణవైభవాన్ని విదేహ మహారాజునకు వివరిస్తూ ఇలా అంటున్నాడు.
కం. తారల నెన్నఁగ వచ్చును;
భూరేణుల లెక్కవెట్టఁ బోలును ధాత్రిన్;
నారాయణ గుణకథనము
లారయ వర్ణింపలేరు హర బ్రహ్మాదుల్.
తాత్పర్యము:
రాజా! ఆకాశంలో మిలమిలలాడుతూ అనంతంగా కన్పట్టే తారలనైనా లెక్కపెట్టవచ్చు. భూమికి సంబంధించిన రేణువులనైనా బుద్ధి కుశలతతో ఇన్నీ అని ఎన్నవచ్చు. కానీ శ్రీమన్నారాయణుని గుణాల లెక్కలు హరుడు గానీ, తామరస భవుడు కానీ ఇంకా అటువంటి దేవతలు గానీ ఎవ్వరూ లెక్కపెట్టలేరు. శ్రీమన్నారాయణుడు అనంత కళ్యాణ గుణసంపన్నుడు.
ప్రతిపదార్ధం:
తారలన్ = నక్షత్రములను; ఎన్నగన్ = లెక్కబెట్టుట; వచ్చును = వీలగును; భూ రేణులన్ = మట్టి రేణువులను; లెక్కపెట్టన్ = లెక్కించుట; పోలును = వీ లగును; ధాత్రిన్ = భూలోకము నందు; నారాయణ = హరి; గుణ = గుణముల; కథనములు = వృత్తాంతములు; ఆరయ = తరచి చూసిన; వర్ణింపలేరు = వివరించలేరు; హర = పరమశివుడు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదుల్ = మొదలగువారు
11-72 నవ వికచ
సందర్భం:
ద్రమిళుడు అనే పేరుగల మహాతత్త్వవేత్త విదేహ జనపాలునకు శ్రీమన్నారాయణుని స్తుతించడం పరమ దుష్కరమని తెలియచేస్తూ కమనీయ పదజాలంతో పరవశించి పాడుకోవడానికి అనువుగా ఒక పద్యరత్నాన్ని మనకు అందిస్తున్నాడు.
సీ. నవ వికచ సరసిరుహ నయనయుగ! నిజచరణ; గగనచర నది! నిఖిల నిగమ వినుత!
జలజసుత కుచకలశ లలిత మృగమద రుచిర;పరిమళిత నిజహృదయ! ధరణిభరణ!
ద్రుహిణముఖ సురనికర విహిత నుతికలితగుణ!; కటిఘటిత రుచిరచర కనకవసన!
భుజగరిపు వరగమన! రజితగిరిపతి వినుత!; సతత చపరత నియమసరణి చరిత!
తే. తిమి, కమఠ, కిటి, నృహరి ముదిత! బలి నిహి
త పద! పరశుధర! దశవదన విదళన!
మురదమన! కలికలుష సుము దపహరణ!
కరివరద! ముని, వర, సుర, గరుడ వినుత!
తాత్పర్యము:
అప్పుడప్పుడే వికసించిన తామర పూవులవంటి కంటి జంటగల స్వామీ! పాదాలనుండి జాలువారిన పరమ పుణ్యజలాల మందాకినితో సుందరమైన దేవా! సకల వేదాల వినుతులకూ ప్రాతమయిన పరమాత్మా! లోకమాత అయిన లక్ష్మీదేవి పాలిండ్లపై పెట్టుకున్న కస్తూరి వాసనలతో ఘుమఘుమలాడే వక్షస్థలంతో అలరారే జగత్పతి! భూదేవిని ఉర: స్థలంలో పెట్టుకుని పట్టుకున్న కరుణావరుణాలయా! లోకాలన్నింటినీ సృష్టించే బ్రహ్మ మొదలైన దేవతలందరి సన్నుతులకూ యోగ్యమైన గుణసంపదగల దేవదేవా! నడుమునందు తళుకు బెళుకులతో అలరారుతున్న పచ్చని పటుబట్టతో విరాజిల్లుతున్న విశ్వేశా! మహా సర్పాల దర్పాన్ని రూపుమాపే గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకుని ఆదరించిన దయాసాంద్రా! వెండి కొండపై విరాజిల్లే జ్ఞానమూర్తి శివయ్య స్తోత్రాలకు పాత్రమైన మహాప్రభూ! క్షణమైనా నీ జపాన్ని ఏమరని నియమంగల తాపసుల దారిలో విహరించే జగన్నాయకా! చేపగా, తాబేలుగా, వరాహముగా, నరసింహుడుగా, ఆనందంతో నీ అడుగు తామరను నెత్తికెత్తుకున్న బలిచక్రవర్తిని పరిరక్షించిన వామనుడుగా, గండ్రగొడ్డలితో దుష్టులను శిక్షించిన పరశురాముడిగా, పదితలల పాడు రక్కసుని విదిలించి కొట్టిన వీరశేఖరుడు రాముడుగా అవతరించిన మహాత్మా! మురాసురుని మట్టుపెట్టిన ముకుందా! కలికల్మషాల పొంగులను భంగ పరిచే పరమాత్మా! గజేంద్రునకు వరాలిచ్చిన మహాస్వామీ! మహర్షుల, దేవతల, గరుడుని స్తోత్రాలకు పాత్రమైన పురుషోత్తమా! నమస్తే! నమస్తే! నమస్తే!
ప్రతిపదార్ధం:
నవ = కొత్తగా, తాజా; వికచ = వికసించిన; సరసిరుహ = పద్మములవంటి; నయన = కన్నుల; యుగ = జంట కలవాడా; నిజ = తన యొక్క; చరణ = పాదముల; గగనచరనది = దేవగంగ {గగనచరనది – ఆకాశము నందు వర్తించు నది, గంగ}; జనిత = పుట్టించినవాడా; నిగమ = వేదములచే; వినుత = స్తుతింపబడిన వాడా; జలధి సుత = లక్ష్మీదేవి {జలధి సుత - అమృత మథన కాల మందు సముద్రమున పుట్టిన దేవి, లక్ష్మి}; కుచ = వక్షోజము లనెడి; కలశ = కలశము లందిలి; లలిత = మనోజ్ఞ మైన; మృగమద = కస్తూరిచే; రుచిర = చక్కటి; పరిమిళిత = సువాసను గల; నిజ = తన; హృదయ = హృదయము కల వాడా; ధరణి = భూమిని; భరణ = మోసిన వాడా; ద్రుహిణ = బ్రహ్మదేవుడు; ముఖ = మొదలగు; సుర = దేవతల; నికర = సమూహముల; విహిత = చేయబడిన; నుతి = స్తుతించుట; కలిత = కలిగిన; గుణ = గుణములు కలవాడా; కటి = నడుమునకు; ఘటిత = కట్టిన, ధరించిన; రుచిరతర = మిక్కలి ప్రకాశవంత మైన {రుచిరము - రుచిరతరము - రుచిరతమము}; కనక = బంగారు; వసన = చేలము కలవాడా; భుజగరిపు = గరుత్మంతుడు {భుజగ రిపుడు - సర్పములకు శత్రు వైన వాడు, గరుత్మంతుడు}; వర = ఉత్తమ మైన; గమన = వాహనముగా కల వాడా; రజతగిరిపతి = పరమ శివునిచే {రజత గిరి పతి - రజతగిరి (కైలాస పర్వతము) పై నుండు పతి (ప్రభువు), శివుడు}; వినుత = స్తుతింపబడు వాడా; సతత = నిరంతర; వృత = మననంరం చేసే; జప = జపము కలనియమసరణి = నియమ బద్ధ మైన; చరిత = వర్తన కల వాడా;
తిమి = మత్స్యావతారము; కమఠ = కూర్మావతారము; కిటి = వరాహావతారము; నృహరి = నరసింహావతారము లందు; ముదిత= సంతోషించిన వాడ; బలి నిహిత పద = వామనావతారము {బలి నిహితపద - బలిచక్రవర్తిని నిహిత (తొక్కిన) పద (పాదములు కల వాడు), వామనుడు}; పరశుధర = పరశురామావతారము {పరశు ధరుడు - పరశువు (గొడ్డలి)ని ధరించిన వాడు, పరశురాముడు}; దశవదనవిదళన = రామావతారము {దశవదన విదళనుడు - దశవదను (పది తలల వాడు, రావణాసురు)ని విదళన (సంహరించిన వాడు), రాముడు}; మురదమన = కృష్ణావతారము {ముర దమనుడు - మురాసురుని చంపిన వాడు, కృష్ణుడు}; కలి కలుష సుము దపహరణ = కల్క్యావతారము {కలి కలుష సుము దపహరణ - కలియుగమున కలుగు కలుష (పాపములను) సు (మిక్కిలి) ముద (సంతోషముతో) అపహరణ (తొలగించు వాడు), కల్కి}; కరి = గజేంద్రుని; వరద = వర మిచ్చిన వాడా; ముని = మునులచేత; నర = మానవులచేత; సుర = దేవతలచేత; గరుడ = గురుడులచేత; వినుత = స్తుతింపబడిన వాడా.
11-95 పరధన పరదార
సందర్భం:
భారతంలోని భగవద్గీత వంటిదే భాగవతంలోని ఉద్ధవగీత. ఇక్కడ ఉద్ధవుడు శిష్యుడు. కృష్ణుడే గురువు. ఆ ఉద్ధవుడు వాసుదేవుణ్ణి, ‘స్వామీ! మానవుడు మోహ లోభాలను వదలివేసి జనార్దనుని చేరుకునే మార్గం ఏమిటి’ అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెబుతున్నాడు.
సీ. పరధన పరదార పరదూషణాదులఁ; బరవస్తు చింతఁ దాఁ బరిహరించి
ముదిమిచే రోగము లుదయింప కట మున్న; తనువు చంచలతను దగులకుండ
బుద్ధి సంచలతచేఁ బొదలక యట మున్న; శ్లేష్మంబు గళమునఁ జేరకుండ
శక్తియుక్తులు మది సన్నగిల్లక మున్న; భక్తి భావనచేతఁ బ్రౌఢుఁ డగుచు
తే. దైత్యభంజను దివ్యపాదారవింద
భజన నిజ భక్తి భావనఁ బ్రాజ్ఞుఁ డగుచు
నవ్యయానందమును బొందు ననుదినంబు
నతఁడు కర్మవిముక్తుఁ డౌ ననఘచరిత!
తాత్పర్యము:
పుణ్యమైన నడవడిగల ఓ ఉద్ధవా! ఆలకించు. మానవుడు ఇతరుల ధనాలయందు, ఇతరుల స్త్రీలయందు, ఇతరుల దూషణల మీదా సాధారణంగా కలిగే ఆశలను అభ్యాసంతో తీసివేయాలి. ముసలితనంలో రోగాలు ఏర్పడతాయి. శరీరం స్థిరంగా ఉండదు. బుద్ధికి నిలకడ ఉండదు. కంఠంలో శ్లేష్మం కమ్ముకుని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దేహశక్తి, మనసు యుక్తీ సన్నగిల్లిపోతాయి. ఈ దురవస్థలు కలుగకముందే భావనలను ఉదాత్తంగా చేసుకుని శ్రీమహావిష్ణువు దివ్యపాదారవిందాల భజనతో గొప్ప తెలివిని పెంపొందించుకుని ప్రతీక్షణమూ పెరుగుట, తరుగుట, మార్పులను పొందుట అనే వికారాలు లేని ఆనందాన్ని అనుభవించే వ్యక్తి కర్మ బంధాలనుండి విడుదల పొందుతాడు.
ప్రతిపదార్ధం:
పర = ఇతరుల; ధన = ధనమును కోరుట; పర = ఇతరుల; దార = భార్యను కోరుట; పర = ఇతరులను; దూషణ = నిందించుట; ఆదులన్ = మున్ననవానిని; పర = ఇతరుల; వస్తు = వస్తువు లందు; చింతన్ = అపహరించ ఆలోచన; తాన్ = తను; పరిహరించి = వదలి వేసి; ముదిమి = ముసలితనము; చేన్ = చేత; రోగములు = జబ్బులు; ఉదయింపక = పుట్టక; అట మున్న = ముందే; తనువున్ = శరీరమున; చంచలతనున్ = వణుకుట; తగులకుండ = కలుగ ముందే; బుద్ధి = మనస్సు; సంచలతన్ = చెదరుట; చేన్ = చేత; పొదలక = పెరిగిపోవుటకు; అట = అంతకు; మున్న = ముందే; శ్లేష్మంబు = కఫము; గళమునన్ = గొంతులో; చేరకుండ = చేరక ముందే; శక్తి = బలము; యుక్తుల = సామర్థ్యము లందు; మది = బుద్ధి; సన్నగిలక = క్షీణించక; మున్న = ముందే; భక్తి = భక్తితో కూడిన; భావన = ఆలోచనల; చేతన్ = వలన; ప్రౌఢుడు = నైపుణ్యము కల వాడు; అగుచున్ = ఔతు;
దైత్యభంజనున్ = నారాయణుని {దైత్య భంజనుడు - రాక్షసులను సంహరించు వాడు, విష్ణువు}; దివ్య = దివ్య మైన; పాద = పాదములు అను; అరవింద = పద్మముల; భజన = పూజించుట; నిజ = తన; భక్తి = భక్తి భావన లందు; ప్రాఙ్ఞుడు = యు క్తాయుక్త విచక్షణుడు; అగుచున్ = ఔతు; అవ్యయ = తరగని; ఆనందమును = ఆనందమును; పొందును = పొందుతాడు; అనుదినంబున్ = ఎల్లప్పుడు; అతడు = అట్టి వాడు; కర్మవిముక్తుడు = మోక్షము పొందిన వాడు; ఔను = అగును; అనఘచరిత్ర = పాప రహిత వర్తనుడా.
11-102 దేహము నిత్యము
సందర్భం:
వాసుదేవుడు ఉద్ధవునికి జ్ఞానబోధ చేస్తూ పింగళ అనే వేశ్య ప్రవృత్తిని వివరించిన తరువాత ముక్తి పొందే విధానాన్ని ఇలా వివరిస్తున్నాడు.
కం. దేహము నిత్యము గా దని
మోహముఁ దెగఁ గోసి సిద్ధ మునివర్తనుఁ డై
గేహము వెలువడి నరుఁ డు
త్సాహమునుం జెందు ముక్తిసంపద ననఘా!
తాత్పర్యము:
పుణ్యాత్మా! ఉద్ధవా! వివేకంతో పరికించి చూస్తే ఒక చక్కని విషయం తెలిసి వస్తుంది. దేహం నిత్యం కాదు. ఏదో ఒకనాడు నశించిపోతుంది. దీనిని తెలుసుకోవాలి. పిమ్మట దానియందు పెరిగిపోతూ ఉండే మోహాన్ని తెగగోసివెయ్యాలి. తపస్సులతో సిద్ధిపొందిన మునుల ప్రవర్తనలను చక్కగా అలవర్చుకుని ఇంటినీ, సంసార బంధాలనూ వదలివేసి మానవుడు పరమ ప్రయోజనం పొందడానికి ఉత్సాహంతో ప్రయత్నిస్తాడు. ఫలితంగా ముక్తి సంపదను కైవసం చేసుకుంటాడు.
ప్రతిపదార్ధం:
దేహము = శరీరము; నిత్యము = శాశ్వత మైనది; కాదు = కాదు; అని = అని; మోహమున్ = మోహమును; తెగగోసి = కత్తిరించి పారేసి; సిద్ధ = సిద్ధులు; ముని = మునుల మార్గమును; వర్తనుడు = అనుసరించు వాడు; ఐ = అయ్యి; గేహమున్ = ఇల్లు; వెలువడి = విడిచిపెట్టి; నరుడు = మానవుడు; ఉత్సాహమును = ఉత్సాహముతో; చెందున్ = పొందును; ముక్తి = ముక్తి అనెడి; సంపదన్ = సంపదను; అనఘా = పాపరహితుడా.
11-121 నిన్నుఁజూడని
సందర్భం:
శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార కృత్యాలనన్నింటినీ చక్కగా నెరవేర్చుకుని తన నిత్య స్థావరమైన వైకుంఠానికి చేరుకున్నాడు. అతని రథసారధి దారుకుడు సర్వప్రాణుల ప్రాణమయుడైన భగవంతుని ప్రాణరహితమైన దేహాన్ని కనుగొని చేతులు జోడించి దు:ఖంతో ఇలా అంటున్నాడు.
తే. నిన్నుఁజూడని కన్నులు నిష్ఫలములు
నిన్ను నొడువని జిహ్వ దా నీరసంబు
నిన్నుఁ గానని దినములు నింద్యము లగుఁ
గన్నులను జూచి మమ్మును గారవింపు.
తాత్పర్యము:
స్వామీ! సర్వ జగన్నాథా! నిన్ను చూడని కన్నులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే! నిన్ను గూర్చి పలుకని నాలుక రసహీనమయినది. నిన్ను చూడని దినములు నిందకు యోగ్యమైనవి. ఒక్కమారు కన్నులు తెరిచి చూచి మమ్ములను అనుగ్రహించు స్వామీ.
ప్రతిపదార్ధం:
నిన్నున్ = నిన్ను; చూడని = చూడలేని; కన్నులు = కళ్ళు; నిష్ఫలములు = పనికి రానివి; నిన్నున్ = నిన్ను; నొడువని = స్తుతించ లేని; జిహ్మ = నాలుక; తాన్ = అది; నీరసంబు = రస హీన మైనది; నిన్నున్ = నిన్ను; కానని = చూడ లేని; దినములు = రోజులు; నింద్యములు = నిందింప దగినవి; అగున్ = అగును; కన్నులను = కళ్ళు ఎత్తి; చూచి = చూసి; మమ్మును = మమ్ములను; గారవింపు = దయ చూడుము.
----------------------------------------------
ద్వాదశ స్కంధం
12-5 చతురత నీ క్షితి
సందర్భం:
శుకయోగీంద్రులు పరీక్షిన్మహారాజునకు భవిష్యత్తులో భూమిని పాలించే రాజుల స్థితి గతులను రాబోయే కాలానికి సంబంధించిన విశేషాలను ఇలా వర్ణిస్తున్నారు.
కం. చతురత నీ క్షితి నేలియు
మతి మోహము విడువలేక మానవనాథుల్
సతతముఁ దమ కీ కాలం
బతిచంచల మగుట నెఱుఁగరయ్య! మహాత్మా!
తాత్పర్యము:
పరీక్షిన్మహారాజా! భూమిని పాలించే రాజులు ఎంతో నేర్పుతో పరిపాలించి కూడా మనస్సులో పాతుకుపోయిన మోహాన్ని విడిచి పెట్టలేక పడరాని పాట్లు పడుతూ ఉంటారు. కాలం అతి చంచలమైనది, అంటే ఏదో ఒకనాడు తాము చనిపోవాలి అనే విషయాన్ని పట్టించుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. పరమార్గం పరిధి లోనికి పోవాలి అనే భావనయే వారికి కలుగదు.
ప్రతిపదార్ధం:
చతురతన్ = ఎంతో నేర్పుతో; ఈ = ఈ; క్షితిన్ = భూమండలమును; ఏలియు = పాలించి నప్పటికిని; మతి = అంతరంగము లోని; మోహమును = మోహాన్ని; విడువ = వదల; లేక = లేక; మానవ నాథుల్ = రాజులు; సతతమున్ = ఎప్పటికిని; తమ = వారి; కిన్ = కి; ఈ = ఈ; కాలంబు = కాలము; అతి = మిక్కలి; చంచలంబు = చంచల మైనది; అగుటన్ = ఐ యుండుటను; ఎఱుగరు = తెలిసికొన లేరు; అయ్య = నాయనా; మహాత్మా = గొప్ప వాడా.
12-6 నరపతుల మహిమ నంతయు
సందర్భం :
బ్రతుకు శాశ్వతం కాదనే భావననే పట్టించుకోని అజ్ఞానుల మన:స్థితిని శుకుడు పరీక్షిత్తునకు ఇలా వర్ణిస్తున్నాడు.
కం. నరపతుల మహిమ నంతయు
నురగాధిపుఁ డైన నొడువ నోపఁడు; ధాత్రిం
జిరకాల మేలి యిందే
పరువడి నణఁగుదురు వారు భ్రాంతులు నగుచున్.
తాత్పర్యము:
రాజా! వారు నరపతులు అంటే నరుల నందరిని కన్నబిడ్డలలాగ పాలించే బాధ్యత గల వారు, కానీ వారి అజ్ఞానం ఎంతగా మిన్నులు ముట్టిందంటే దానిని గూర్చి రెండు వేల నాలుకలు గల ఆదిశేషుడు కూడా చెప్పలేడు. ఎంతో కాలం ఈ ధరణి ని ఏలుతారు, చివరకు ఈ ధరణియందే తనువు చాలిస్తారు, కానీ పొందవలసిన జ్ఞాన దీపాన్ని పొందలేని భ్రాంతచిత్తులు వారు.
ప్రతిపదార్ధం:
నరపతుల = ఆ రాజుల; మహిమన్ = గొప్పతనాన్ని; అంతయున్ = సమగ్రముగ; ఉరగాధిపుడు = వెయ్యి తలల ఆదిశేషుడు {ఉరగాధిపుడు - ఉరగముల (సర్పముల) కు అధిపతి, ఆదిశేషుడు}; ఐనన్ = అయినప్పటికిని; నొడువన్ = చెప్పుటకు; ఓపడు = సరిపడడు; ధాత్రిన్ = రాజ్యాన్ని; చిరకాలము = చాలా కాలము; ఏలి = పాలించి; ఇందే = ఇక్కడనే; పరు = అతి; వడిన్ = శీఘ్రముగా; అణగుదురు = నశించెదరు; వారు = వాళ్ళు; భ్రాంతులు = భ్రాంతి మగ్నులు; అగుచున్ = ఔతూ.
12-7 గజతురగాదిశ్రీలను
సందర్భం :
శుక మహర్షి పరీక్షిత్తునకు ఏది అనర్ధమో ఏది పరమ ప్రయోజనకరమో వివరించి చెబుతున్నాడు.
కం. గజతురగాదిశ్రీలను
నిజ మని నమ్మంగరాదు; నిత్యమును హరిన్
గజిబిజి లేక తలంచిన
సుజనులకును నతనియందుఁ జొరఁగావచ్చున్.
తాత్పర్యము:
రాజా ! మానవులు, ముఖ్యంగా మానవ పాలకులు తమకు గొప్ప గజ సంపద, గుర్రాల సంపద మొదలైనవి ఉన్నాయి అని గర్వపడుతూ ఉంటారు. కానీ, అవి ఏవి నిత్యములు కావు. చూస్తూ ఉండగానే నశించిపోతూ ఉంటాయి. అందువలన వానిని నమ్మి ఉండరాదు. మరి కర్తవ్యం ఏమిటి అంటే అనుక్షణము హరిని స్మరిస్తూ ఉండాలి. ఆ స్మరణ కూడా గజిబిజి లేకుండా ఉండాలి. ఆ విధంగా హృదయంలో ధ్యానించేవారు పరమాత్మను చేరుకుంటారు. వారే సుజనులు.
ప్రతిపదార్ధం:
గజ = ఏనుగలు; తురగ = గుర్రములు; ఆది = మున్నగు; శ్రీలను = సంపదలను; నిజము = శాశ్వతము; అని = అని; నమ్మంగన్ = నమ్ముట; రాదు = కూడదు; నిత్యమున్ = నిరంతరము; హరిన్ = విష్ణుమూర్తిని; గజిబిజి = గజిబిజి; లేక = లేకుండ; తలంచిన = స్మరించెడి; సుజనుల్ = మంచివారల; కున్ = కు; అతని = అతని; అందున్ = అందే; చొరగ వచ్చున్ = చేరుకొన వీలగును.
12-16 ధర్మము సత్యముఁ
సందర్భం :
శుక మహర్షి పరీక్షిన్మహారాజునకు పుణ్యాత్ముల లక్షణాలను వక్కాణిస్తున్నారు.
కం. ధర్మము సత్యముఁ గీర్తియు
నిర్మలతయు విష్ణుభక్తి నిరుపమ ఘన స
త్కర్మ మహింసావ్రతము
న్నర్మిలి గలవారె పుణ్యు లవనీనాథా!
తాత్పర్యము:
భూపాలా! ధర్మము, సత్యము, కీర్తి, నిర్మలమైన దయ, విష్ణు భక్తి, సత్ కర్మానుష్టానము, అహింసను వ్రతముగా పాలించుట అనే మహా గుణాలు పుష్కలంగా ఉన్న వారిని పుణ్యాత్ములు అంటారు.
ప్రతిపదార్ధం:
ధర్మము = ధర్మము; సత్యము = సత్యము; కీర్తియున్ = కీర్తియు; నిర్మల = స్వచ్చ మైన; దయ = దయ; విష్ణుభక్తి = విష్ణుభక్తి; నిరుపమ = సాటిలేని; ఘన = గొప్ప; సత్కర్మ = మంచి పనులు; అహింసా వ్రతమును = అంహింస దీక్ష; నర్మిలిన్ = అత్యధికముగ; కల వారె = ఉన్న వారే; పుణ్యులు = పుణ్యవంతులు; అవనీనాథ = రాజా.
12-17 ఈ జగం బేలు
సందర్భం:
శుక మహర్షి పరీక్షిన్మహారాజునకు మమతను త్రుంచివేసుకోవాలి అని దృష్టాంతపూర్వకంగా చెబుతున్నాడు.
తే. ఈ జగం బేలు తొల్లిటి రాజవరులు
కాలవశమున నాయువుల్ గోలుపోయి
నామమా త్రావశిష్టు లైనారు; కాన
సలుపవలవదు మమత నెచ్చట నృపాల!
తాత్పర్యం:
రాజా! ఈ భూమి ఎన్నో రాజ్యాలుగా ఏర్పడి ఉన్నది. మునుపటి రాజులు ఎందరో ఎన్నో విధాలుగా దీనిని పాలించారు. కానీ, వారందరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు వారి పేర్లు మాత్రమే కొన్ని మిగిలి ఉన్నాయి. దీనిని మెలకువతో గమనించుకుంటే తెలియవచ్చే విషయం ఏమిటంటే, ఎప్పుడూ, ఎక్కడా మమతను నిలుపుకోరాదు.
ప్రతిపదార్ధం:
ఈ = ఈ; జగంబున్ = లోకమును; ఏలు = పరిపాలించిన; తొల్లిటి = పూర్వపు; రాజ = రాజులలో; వరులు = శ్రేష్ఠులు; కాల = కాలమునకు; వశమునన్ = లొంగి; ఆయువుల్ = ప్రాణాలు; కోల్పోయి = నష్టపోయి; నామ = పేరుకి; మాత్ర = మాత్రమే; అవశిష్ఠులు = మిగిలిన వారు; ఐనారు = అయ్యి ఉన్నారు; కాన = కనుక; సలుప = జరుపుట; వలవదు = వద్దే వద్దు; మమతన్ = మమకారమును; ఎచటన్ = ఎక్కడ కూడ; నృపాల = రాజా.
12-19 ఉత్తమశ్లోకుఁ డన
సందర్భం :
శుక మహర్షి తారకమంత్రం వంటి ఉపదేశాన్ని పరీక్షిత్తునకు ఇలా తెలుపుతున్నాడు.
తే. ఉత్తమశ్లోకుఁ డన నెవ్వఁ డున్నవాడు;
సన్నుతుం డగు నెవ్వఁడు సకల దిశల;
నట్టి పరమేశ్వరునిఁ జిత్తమందు నిలిపి
తద్గుణంబులు వర్ణింపు ధరణినాథ!
తాత్పర్యము:
రాజా! శ్రీమహావిష్ణువును మహా జ్ఞానసంపన్నులు ఉత్తమశ్లోకుడు అని ప్రస్తుతించారు. ఉత్తమశ్లోకుడంటే మానవులందరికీ మేలు కలిగించే కీర్తి కలవాడు అని అర్థం. అతడు ఉన్నవాడు, అంటే నిత్య సత్య స్వరూపుడు. అన్ని దిక్కులలో వివేకసంపద కలవారు అతనిని సన్నుతిస్తారు. అటువంటి పరమేశ్వరుణ్ణి హృదయంలో నిలుపుకుని సత్యము, జ్ఞానము, ఆనందము మొదలైన అతని గుణాలను పలుకుతూ ఉండు.
ప్రతిపదార్ధం:
ఉత్తమ = ఉత్తములచే; శ్లోకుండు = కీర్తనీయుడు; అనన్ = అనగా; ఎవ్వడు = ఎవ రైతే; ఉన్నవాడు = ఉన్నాడో; సన్నుతుండు = స్తుతింప బడెడి వాడు; అగున్ = అయిన; ఎవ్వడు = ఎవరో; సకల = సర్వ; దిశలన్ = దిక్కు లందును; అట్టి = అటువంటి; పరమేశ్వరుని = భగవంతుని; చిత్తము = మనస్సు; అందున్ = లోపల; నిలిపి = నిల్పుకొని; తత్ = అతని; గుణంబులున్ = గుణములను; వర్ణింపు = కీర్తింపుము; ధరణీనాథ = రాజా.
12-25 ఏను మృతుండ నౌదు
సందర్భం :
శుక మహర్షి పరీక్షిత్తునకు ఉత్తమమైన వివేక ధనాన్ని వివరిస్తున్నాడు.
ఉ. ఏను మృతుండ నౌదు నని యింత భయంబు మనంబులోపలన్
మానుము; సంభవంబు గల మానవకోట్లకుఁ జావు నిత్య మౌఁ;
గాన హరిం దలంపు; మికఁ గల్గదు జన్మము నీకు ధాత్రిపై;
మానవనాథ! పొందెదవు మాధవలోక నివాససౌఖ్యముల్.
తాత్పర్యము:
మానవనాథా! నేను చనిపోతాను అనే భయాన్ని మనసులోంచి తీసివెయ్యి. కోట్లకొలదిగా మానవులు పుడుతున్నారు, వారందరికీ చావు తప్పనిసరిగా కలుగుతుంది. ఐతే చచ్చినవాడు మళ్ళీ పుట్టడం కూడా సంభవిస్తుంది. అదియే మహా భయంకరమైన సంసారం. అది ఆగిపోవాలి అంటే నీవు శ్రీహరిని స్మరిస్తూ ఉండు. నీకు ఇటుపైన భూమిలో పుట్టుక కలుగదు. మాధవ లోకంలో నివసించే అదృష్టము, అక్కడి సౌఖ్యాలు నీవు పొందుతావు.
ప్రతిపదార్ధం:
ఏను = నేను; మృతుండను = చనిపోయిన వాడను; ఔదున్ = అయి పోతాను; అని = అని; ఇంత = ఇంత అధిక మైన; భయంబున్ = భయమును; మనంబు = మనసు; లోపలన్ = లో; మానుము = విడిచి పెట్టుము; సంభవంబు = పుట్టుట; కల = కలిగిన; మానవ = మానవులు; కోట్లు = అందరి; కున్ = కి; చావు = చచ్చిపోవు టన్నది; నిత్యము = శాశ్వత మైన ధర్మము; ఔన్ = అయి ఉన్నది; కాన = కనుక; హరిన్ = విష్ణుమూర్తిని; తలంపుము = స్మరించుము; ఇక = ఈ పైన; కల్గదు = సంభవించదు; జన్మము = పుట్టుక; నీ = నీ; కున్ = కు; ధరిత్రి = భూలోకము; పైన్ = అందు; మానవనాథ = రాజా; పొందెదవు = పొందుతావు; మాధవలోక = వైకుంఠము నందు {మాధవ లోకము - విష్ణుమూర్తి యొక్క పదము, వైకుంఠము}; నివాస = నివసించెడి; సౌఖ్యముల్ = సుఖములను.
12-27 మృతియును జీవనంబు
సందర్భం :
శుక మహర్షి పరీక్షిన్మహారాజునకు సంసార దుఃఖ పరంపరను గూర్చి ఇలా వివరిస్తున్నాడు.
చం. మృతియును జీవనంబు నివి మేదినిలోపల జీవకోటికిన్
సతతము సంభవించు; సహజం బిది; చోర హుతాశన సర్ప సం
హతులను దప్పి యాఁకటను బంచత నొందెడు నట్టి జీవుఁడున్
వెతలను బూర్వకర్మభవ వేదన లొందుచుఁ గుందు నెప్పుడున్.
తాత్పర్యము:
రాజా! చావు బ్రతుకు అనేవి భూమిపై ఉన్న కోట్ల కొలది జీవులకు ఎప్పుడు కలుగుతూనే ఉంటాయి. ఇది సహజం! దొంగలో, అగ్నియో, పాముకాటులో, దప్పికయో, ఆకలియో చావుకి కారణాలు అవుతూ ఉంటాయి. ఆ విధంగా జీవుడు వెనకటి జన్మలలో చేసుకున్న కర్మఫలాలను అనుసరించి వేదనలను పొందుతూ ఉంటాడు. దు:ఖాలతో కుమిలిపోతూ ఉంటాడు.
ప్రతిపదార్ధం:
మృతియును = చావు; జీవనంబు = బతుకులు; ఇవి = ఇవి; మేదిని = భూలోకము {మేదిని – మధు కైటభుల మేధస్సు (మెదడు) చే తడపబడినది, భూమి}; లోపలన్ = అందు; జీవ = ప్రాణులు; కోటి = అన్నిటి; కిన్ = కి; సతతము = ఎల్లప్పడు; సంభవించున్ = కలుగుతు ఉండును; సహజంబు = సహజ మైన విషయము; ఇది = ఇది; చోర = దొంగల వలన; హుతాశ = అగ్ని వలన; సర్ప = పాముల; సంహతులను = కాటుల వలన; దప్పిన్ = దాహము వలన; ఆకటన్ = ఆకలివలన; పంచత నొందు = చనిపోవు; అట్టి = అట్టి; జీవుడున్ = మానవుడు; వెతలన్ = కష్టములను; పూర్వ = పూర్వ జన్మలో చేసిన; కర్మ = పాపముల వలన; భవ = పొందిన; వేదనలు = బాధలు; ఒందుచున్ = పొందుతు; కుందున్ = కుమిలిపోతుండును; ఎప్పుడున్ = ఎల్లప్పుడు.
12-35 జగము రక్షింప
సందర్భం :
భాగవతం ద్వాదశ స్కంధములో సూత మహర్షి శౌనకాది తాపసులకు మార్కండేయుని కథను స్మృతికి తెచ్చాడు. మార్కండేయుని తపోమహిమకు సంతసించి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ మహర్షి ఇలా అంటున్నాడు!
తే. జగము రక్షింప జీవులఁ జంప మనుపఁ
గర్త వయి సర్వమయుఁడ వై కానిపింతు
వెచట నీ మాయఁ దెలియంగ నెవ్వఁ డోపు?
విశ్వసన్నుత! విశ్వేశ! వేదరూప!
తాత్పర్యము:
దేవా! వేదరూపా! విశ్వేశా! విశ్వసన్నుతా! లోకాలన్నింటినీ రక్షించడానికి, జీవులని మరల తనలో లీనం చేసుకోవడానికి, పెంచి పోషించటానికి, కర్తవు నీవే. నీవు సర్వమయుడవు, అందరిలో అన్నింటిలో ఉన్నది నీవే. ఇటువంటి మహాత్ముడవైన నీ మాయను ఎవడు తెలియగలవాడు!
ప్రతిపదార్ధం:
జగము = లోకమున; రక్షింపన్ = కాపాడుటకు; జీవులన్ = ప్రాణులను; చంపన్ = చంపడానికి; మనుపన్ = పోషించుటకు; కర్తవు = కర్తవు; అయి = అయ్యి; సర్వ = సర్వము నందు; మయుడవు = నిండి యుండు వాడవు; ఐ = అయ్యి; కానిపింతువు = గోచరింతువు; ఎచటన్ = ఎక్క డైనా; నీ = నీ యొక్క; మాయన్ = మహిమను; తెలియంగన్ = తెలిసికొనుటకు; ఎవ్వడు = ఎవరు మాత్రము; ఓపున్ = చేయ గలడు; విశ్వసన్నుత = హరి {విశ్వ సన్నుతుడు - లోకములచే స్తుతింపబడు వాడు, విష్ణువు}; విశ్వేశ = హరి {విశ్వేశుడు - విశ్వమునకు ప్రభువు, విష్ణువు}; వేదరూప = హరి {వేద రూప - వేదములు తన రూప మైన వాడు, విష్ణువు}.
12-36 బలభిన్ముఖ్య
సందర్భం :
మార్కండేయుడు మహావిష్ణువుతో అతని మాయ ఎట్టివారికిని దాటనలవి కానిది, తెలియజాలరానిది అని వక్కాణిస్తున్నాడు.
మ. బలభిన్ముఖ్య దిశాధినాథ వరులున్ ఫాలాక్ష బ్రహ్మాదులున్
జలజాతాక్ష! పురంద రాది సురులుం జర్చించి నీ మాయలన్
దెలియన్ లేరఁట! నా వశంబె తెలియన్?దీనార్తి నిర్మూల! యు
జ్జ్వల పంకేరుహ పత్ర లోచన! గదా చక్రాంబు జాద్యంకితా!
తాత్పర్యము:
స్వామీ! నీవు దీనుల ఆర్తి ని నామరూపాలు లేకుండా పోగొడుతావు. గొప్ప కాంతులతో విలసిల్లే పద్మపురేకులవంటి కన్నులతో విరాజిల్లుతూ ఉంటావు. నీ చేతులలో గద, చక్రము, పద్మమూ మొదలైన మహా పదార్థాలు విలసిల్లుతూ ఉంటాయి. అట్టి ఓ స్వామీ! దేవేంద్రుడు మొదలైన ఎనిమిది దిక్కులను పరిపాలించే మహాత్ములు, మూడవ కన్నుతో విరాజిల్లే శివుడు, నాలుగు ముఖాలతో అలరారే బ్రహ్మ దేవుడు, ఇంకా ఈ వరుసలో అధికార స్థానాలలో ఉన్న అయ్యలు, ఎంతగా చర్చించినా నీ మాయలను తెలుసుకోలేరట, ఇంక నిన్ను తెలియడం నా వశమా!
ప్రతిపదార్ధం:
బలభిత్ = ఇంద్రుడు {బలభిత్తు - బలాసురుని ధ్వంసము చేసిన వాడు, ఇంద్రుడు}; ముఖ్య = మున్నగు; దిశాధినాథ = దిక్పాలక; వరులన్ = శ్రేష్ఠులను; ఫాలాక్ష = శివుడు {ఫాలాక్షుడు - ఫాలమున (నుదుట) అక్షుడు (కన్నుగలవాడు), శివుడు}; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులున్ = మున్నగు వారు; జలజాతాక్ష = శ్రీహరీ {జలజా తాక్షుడు – జలజాతము (పద్మము) వంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; పురందర = దేవేంద్రుడు {పురందరుడు - శత్రు పురములను వ్రక్కలించిన వాడు, దేవేంద్రుడు}; ఆది = మున్నగు; సురలున్ = దేవతలు కూడ; చర్చించి = తరచి చూసినను; నీ = నీ యొక్క; మాయలన్ = మహిమలను; తెలియన్ = తెలిసికొన; లేరు = లేరు; అట = అట; నా = నాకు; వశంబె = సాధ్యమగునా; తెలియన్ = తెలిసికొనుటకు; దీనార్తి నిర్మూల = శ్రీహరీ {దీనార్తి నిర్మూలనుడు - దీనుల ఆర్తిని నిర్మూలించు వాడు, విష్ణువు}; ఉజ్జ్వల తేజో విభవాతి సన్నుత = శ్రీహరీ {ఉజ్జ్వల తేజో విభవాతి సన్నుతుడు – ప్రకాశవంతమైన తేజస్సుతో మిక్కిలి స్తుతింపబడు వాడు, విష్ణువు}; గదా చక్రాంబు జా ద్యంకితా = శ్రీహరీ {గదా చక్రాంబు జా ద్యంకితుడు - గద చక్రము పద్మములు అలంకారముగా కలవాడు, విష్ణువు}.
12-46 పుష్కరం బందు
సందర్భం :
శుక మహర్షి పరీక్షిన్మహారాజునకు భానువారము నాడు పుణ్య ప్రదేశాలలో భాగవతం పఠిస్తే కలిగే మహాఫలాన్ని వివరిస్తున్నాడు.
తే. పుష్కరం బందు ద్వారకాపురము నందు
మథుర యందును రవిదిన మందు నెవఁడు
పఠన చేయును రమణతో భాగవతము
వాఁడు దరియించు సంసారవార్ధి నపుడ.
తాత్పర్యము:
రాజా! పుష్కరమనే తీర్ధంలో కానీ, ద్వారకా పట్టణం లో కానీ, మధురానగరంలో కానీ, ఆదివారం నాడు ప్రీతితో భాగవతాన్ని పఠించేవాడు సంసారం అనే సముద్రాన్ని వెనువెంటనే దాటుతాడు.
ప్రతిపదార్ధం:
పుష్కరంబు = పుష్కర తీర్థం; అందున్ = లో; ద్వారకాపురము = ద్వారకా పట్టణము; అందున్ = లో; మథుర = మథురా నగరం; అందును = లోను; రవిదినము = ఆదివారము; అందున్ = లోను; ఎవడు = ఎవ రైతే; పఠన = చదువుట; చేయున్ = చేస్తాడో; రమణ = ఆసక్తి పూర్వకంగా; భగవతమున్ = భాగవతమును; వాడు = అట్టి వాడు; తరియించున్ = దాటును; సంసార = సంసార మనెడు; వార్ధిన్ = సముద్రమును; అపుడ = తత్క్షణమే.
12-47 శ్రీరమణీరమణ
సందర్భం :
శుక మహర్షి ఈ విధంగా భాగవతం లోని పన్నెండు స్కంధాల స్వరూపాన్ని మనోహరంగా చెప్పాడు అని సూతుడు శౌనకాది మునులతో ఇలా అంటున్నాడు.
కం. శ్రీరమణీరమణ కథా
పారాయణ చిత్తునకును బతికిఁ బరీక్షి
ద్భూరమణున కెఱిగించెను
సారమతిన్ శుకుఁడు ద్వాదశస్కంధములన్.
తాత్పర్యము:
మహర్షులారా! వ్యాసమహర్షి పుత్రుడు, పుట్టుకతోనే వైరాగ్యపు చివరి అంచులకు చేరుకున్నవాడు ఐన శుక మహర్షి పన్నెండు స్కంధాలలో లక్ష్మీదేవీ మనోనాయకుడైన విష్ణుదేవుని కధా పారాయణము హృదయంలో నిరంతరము చేసే శీలం కల పరీక్షిన్మహారాజునకు సారమైన బుద్ధితో తెలియచెప్పాడు.
ప్రతిపదార్ధం:
శ్రీరమణీ రమణ = విష్ణుమూర్తి {శ్రీరమణీ రమణుడు - శ్రీరమణి (లక్ష్మీ దేవి) రమణుడు (భర్త), విష్ణువు}; కథా = కథలను; పారాయణ = అంతా తెలుసుకొను; చిత్తున్ = ఆసక్తి కల వాని; కును = కి; పతి = రాజు; కిన్ = కు; పరీక్షిత్ = పరీక్షిత్తు అను; భూరమణున్ = రాజున; కున్ = కు; ఎఱింగించెను = తెలియ జెప్పెను; సారమతిన్ = నిపుణత్వముతో; శుకుడు = శుకుడు; ద్వాదశ = పన్నెండు (12); స్కంధములన్ = స్కంధాలను {స్కంధము - సమూహము, శరీరము, సంస్కారము}.
12-49 సకలాగమార్థ
సందర్భం :
భాగవతం పదునెనిమిది పురాణాలలో నాయకమణి వంటిది. ఈ భాగవత పురాణాన్ని పఠించేవాడు విష్ణుసాయుజ్యం పొందుతాడు అని సూతుడు ఇంకా ఇలా అంటున్నాడు .
కం. సకలాగమార్థ పారగుఁ
డకలంక గుణాభిరాముఁ డంచిత బృందా
రక వంద్య పాదయుగుఁ డగు
శుకయోగికి వందనంబు సొరిది నొనర్తున్.
తాత్పర్యము:
శుకుడనే యోగీంద్రుడు సమస్తమైన వేదములను తుదిముట్టా అధ్యయనం చేసినవాడు, ఎట్టి మచ్చా లేని గుణములతో మనోహరమైన వాడు, పరమ పూజ్యులైన దేవతలకు కూడా నమస్కరింప దగిన పాదపద్మాలు గలవాడు. అట్టి మహానుభావునికి ఎల్లప్పుడూ నేను వందనం చేస్తూ ఉంటాను.
ప్రతిపదార్ధం:
సకల = సర్వ; ఆగమ = శాస్త్రముల; అర్థ = అర్థమును; పారగున్ = కడముట్ట తెలిసిన వాడు; అకలంక = కళంకము లేని; గుణా = గుణములచే; అభిరాముడు = ఆకర్షణీయ మైన వాడు; అంచిత = పూజనీయ మైన; బృందారక = దేవతల చేత; వంద్య = నమస్కరింపబడెడి; పాద = పాదముల; యుగుడు = జంట కల వాడు; అగు = ఐ నట్టి; శుక = శుకుడు అను; యోగి = యోగి; కిన్ = కి; వందనంబు = నమస్కారములు; సొరిదిన్ = వరస పెట్టి; ఒనర్తున్ = చేసెదను.
12-50 సకలగుణాతీతు
సందర్భం :
సూత మహర్షి ఇంకా ఇలా అంటున్నాడు - అనంత కళ్యాణగుణుడైన శ్రీకృష్ణ పరమాత్మను సర్వకాలాలలో, అన్ని అవస్థలలో కొనియాడుతూ ఉంటాను అని మనలనందరినీ ఆ పనికి ప్రచోదనం చేయటం కోసం ప్రకటిస్తున్నాడు.
సీ. సకలగుణాతీతు సర్వజ్ఞు సర్వేశు; నఖిలలోకాధారు, నాదిదేవుఁ
బరమదయారసో ద్భాసితుఁ ద్రిదశాభి; వందిత పాదాబ్జు వనధిశయను
నాశ్రితమందారు నాద్యంత శూన్యుని; వేదాంత వేద్యుని విశ్వమయునిఁ
గౌస్తుభ శ్రీవత్స కమనీయవక్షుని; శంఖ చక్ర గదాసి శార్ఙ్గధరుని
తే. శోభనాకారుఁ బీతాంబరాభిరాము
రత్నరాజిత మకుట విభ్రాజమానుఁ
బుండరీకాక్షు మహనీయ పుణ్యదేహుఁ
దలతు నుతియింతు దేవకీతనయు నెపుడు.
తాత్పర్యము:
శ్రీకృష్ణ వాసుదేవుడు జీవులను సంసార సముద్రంలో ముంచే సత్వము, రజస్సు, తమస్సు అనే గుణాలన్నింటికీ అతీతుడు. సర్వజ్ఞానాలూ కలవాడు. సర్వమునకు ప్రభువు. అఖిలలోకాలకు ఆధారమైనవాడు. ఆదిదేవుడు. పరమ దయ అనే రసంతో ఉజ్జ్వలంగా ప్రకాశించేవాడు. దేవతలందరికీ నమస్కరింప దగిన పాదపద్మాలతో అలరారే వాడు. పాలసముద్రంలో పవళించే స్వామి. ఆశ్రితులకు కల్పవృక్షం అయినవాడు. ఆది అంతములు లేని వాడు. వేదాంతములతో మాత్రమే తెలియదగినవాడు. సర్వము తాను ఐన వాడు. కౌస్తుభమనే అమూల్య మణిని, శ్రీవత్సమనే పుట్టుమచ్చను వక్షస్థలము నందు నిలుపుకొనేవాడు. శంఖము, చక్రము, గద, ఖడ్గము, శార్ఙ్గము అనే చాపము అను వానిని ధరించి ఉంటాడు. పరమ మనోజ్ఞమైన ఆకారము కలవాడు. పచ్చని పట్టువస్త్రంతో అందాలని చిందించే భగవంతుడు. తెల్లని పద్మముల కన్నులతో విరాజిల్లే వాడు. అవధులు లేని గొప్పతనం గల పుణ్య దేహం కలవాడు. అటువంటి దేవకీ తనయుడు అయిన వాసుదేవుణ్ణి నేను నిరంతరము స్మరిస్తాను.
ప్రతిపదార్ధం:
సకల = సర్వ; గుణా = గుణములకు; అతీతున్ = అతీత మైన వానిని; సర్వఙ్ఞున్ = సర్వము తెలిసిన వానిని; సర్వ = సర్వులను; ఈశున్ = నియమించు వానిని; అఖిల = సమస్త మైన; లోక = లోకములకు; ఆధారున్ = ఆధార మైన వానిని; ఆదిదేవున్ = ఆదిదేవుని; పరమ = గొప్ప; దయా = కరుణా; రస = రసముచేత; ఉద్భాసితున్ = మిక్కలి ప్రకాశించు వానిని; త్రిదశ = దేవతలచే; అభివందిత = వందనములు చేయబడెడి; పాద = పాదములు అనెడి; అబ్జున్ = పద్మములు కల వానిని; వనధి = సముద్రమున; శయను = శయనించు వానిని; ఆశ్రిత = ఆశ్రయించిన వారి పాలిటి; మందారున్ = కల్పవృక్షము వంటి వానిని; ఆది = ఆదీ; అంత = అంతము; శూన్యుని = లేని వానిని; వేదాంత = వేద సారములచేత; వేద్యుని = తెలియబడు వానిని; విశ్వ = విశ్వ మంతా; మయుని = నిండి యున్న వానిని; కౌస్తుభ = కౌస్తుభ మణి; శ్రీవత్స = శ్రీవత్స లక్షణము కలిగి; కమనీయ = మనోజ్ఞ మైన; వక్షుని = వక్షస్థలము కల వానిని; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గద = గద; అసి = ఖడ్గము; శార్ఙ్గ = శార్ఙ్గము అను ధనుస్సు; ధరుని = ధరించు వానిని; శోభన = మంగళకర మైన; ఆకారున్ = రూపము కల వానిని; పీత = పచ్చని; అంబర = వస్త్రముతో; అభిరామున్ = మనోహర మైన వానిని; రత్న = మణులతో; రాజిత = మెరుస్తున్న; మకుట = కిరీటముతో; విభ్రాజమానున్ = ప్రకాశించు చున్న వానిని; పుండరీకాక్షున్ = పద్మాక్షుని; మహనీయ = మహిమాన్విత మైన; పుణ్య = పుణ్యవంత మైన; దేహున్ = శరీరము కల వానిని; తలంతున్ = స్మరించెదను; నుతియింతున్ = స్తుతించెదను; దేవకీ తనయున్ = శ్రీకృష్ణుని; ఎపుడున్ = ఎల్లప్పుడు.
12-51 అని యీ రీతి
సందర్భం :
సూత మహర్షి శౌనకాది మహర్షులకు భాగవతాన్ని ఆద్యంతము కమనీయంగా చెప్పాడు. అటు తరువాత వారందరు ఆనందసాగరములో తేలియాడుతూ తమ తమ నివాసములకు వెళ్ళిన సంగతిని ఈ పద్యం తెలియజేస్తున్నది.
మ. అని యీ రీతి నుతించి భాగవత మాద్యంతంబు సూతుండు సె
ప్పిన సంతుష్ట మనస్కు లై విని మునుల్ ప్రేమంబునం బద్మనా
భునిఁ జిత్తంబున నిల్పి తద్గుణములన్ భూషించుచున్ ధన్యులై
చని రాత్మీయ నికేతనంబులకు నుత్సాహంబు వర్ధిల్లఁగన్.
తాత్పర్యము:
లోమహర్షణుని పుత్రుడు, సకల పురాణ విజ్ఞానం పుష్కలంగా తనలో నిలుపుకొన్నవాడు అయిన శూత మహర్షి ఈ విధంగా భాగవత మహాపురాణాన్ని మొదటినుండి చివరిదాకా పరమానందం కలిగేట్టుగా చెప్పాడు. మహర్షులు మరింత ఆనంద సాంద్ర స్థితిని పొంది సంతుష్టులైనారు. పరమానురాగంతో పద్మనాభుణ్ణి హృదయపద్మాలలో కుదురుకొల్పుకున్నారు. అతని గుణాలను నిరంతరము భావిస్తూ ధన్యులై, ఉత్సాహం ఊపివేస్తూ ఉండగా తమ తమ పర్ణశాలలకు చేరుకున్నారు.
ప్రతిపదార్ధం:
అని = అని; ఈ = ఈ; రీతిన్ = విధముగ; నుతించి = స్తుతించి; భాగవతమున్ = శ్రీమ ద్భాగవత పురాణము; ఆది = మొదలు నుంచి; అంతంబు = చివరి వరకు (సమస్తము); సూతుండు = సూతుడు; చెప్పిన = చెప్పగా; సంతుష్ట = తృప్తి చెందిన; మనస్కులు = మనస్సులు కల వారు; ఐ = అయ్యి; విని = విని; మునుల్ = మునులు; ప్రేమంబునన్ = ప్రేమతో; పద్మనాభునిన్ = శ్రీమహావిష్ణువును; చిత్తంబునన్ = అంతరంగము నందు; నిల్పి = నిలుపుకొని; తత్ = అతని; గుణములన్ = గుణములను; భూషించుచున్ = కొనియాడుతూ; ధన్యులు = కృతార్థులు; ఐ = అయ్యి; చనిరి = తరలిపోయిరి; ఆత్మీయ = వారి వారి; నికేతనంబుల = నివాసముల; కున్ = కు; ఉత్సాహంబు = ఉత్సాహము; వర్ధిల్లగన్ = ఉప్పొంగుతుండగా.
12-52 జనకసుతా
సందర్భం :
తెలుగుల పుణ్యపేటి మహాకవి బమ్మెర పోతన భాగవత కథా రసామృతాన్ని ఈ విధంగా అందరికీ పంచిపెట్టి, తన కృతిపతి ఐన శ్రీరామచంద్రుని స్మరణ చేసుకుంటూ గ్రంధాన్ని ముగిస్తున్నాడు.
కం. జనకసుతా హృచ్చోరా!
జనకవచోలబ్ధ విపిన శైలవిహారా!
జనకామిత మందారా!
జననాదిక నిత్యదుఃఖచయసంహారా!
తాత్పర్యము:
స్వామీ! శ్రీరామచంద్రా! నీవు పరమ వేదాంతి అయిన జనకుని బిడ్డ సీతాదేవి హృదయాన్ని దొంగలించినవాడవు. తండ్రి మాట మేరకు అడవులలో, కొండలలో అద్భుత కార్యాలు నిర్వహిస్తూ విహరించిన వాడవు. జనుల కోరికలకు కల్పవృక్షం అయిన వాడవు. పుట్టటం మొదలైన నిత్య దుఃఖాల రాశులన్నింటినీ రూపుమాపే వాడవు. ఇట్టి నీకు అంకితంగా నేను రచించిన భాగవతాన్ని నీ ద్వారా లోకానికి నివేదించుకుంటున్నాను స్వామీ!
ప్రతిపదార్ధం:
జనక సుతా హృచ్చోరా = శ్రీరామా {జనక సుతా హృచ్చోరుడు - జనకుని పుత్రిక (సీత) హృదయము దొంగిలించిన వాడు, రాముడు}; జనక వచః పాల నాత్త శైల విహారా = శ్రీరామా {జనక వచః పాల నాత్త శైల విహారుడు - తండ్రి మాటవల్ల లభించిన కొండంత కఠినమైన సంచారము కల వాడు, రాముడు}; జన కామిత మందారా = శ్రీరామా {జన కామిత మందార - ప్రజల కామితములు తీర్చు కల్పవృక్షము వంటి వాడు, రాముడు}; జననాదిక నిత్య దుఃఖ చయ సంహారా = శ్రీరామా {జననాదిక నిత్య దుఃఖ చయ సంహారుడు - పుట్టుక మొదలైన నిత్యము కలిగెడి దుఃఖ సమూహాలను తొలగించు వాడు, రాముడు}.
------------------------------------------------------------

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి