11, అక్టోబర్ 2022, మంగళవారం

7వ తరగతి-చదువు-అభ్యాసాలు Telangana 7th Class Telugu

 7వ తరగతి

తెలుగు

1. చదువు

1 ప్ర) చదువు నేర్వని వారిని కవి వేటితో పోల్చాడు?

జ) చదువు నేర్వని వారిని కవి సువాసనలు వెదజల్లలేని మోదుగుపువ్వుతో పోల్చాడు. చక్కని రూపం ఉన్నా మోదుగపువ్వు సువాసనలను వెదజల్లలేదు. అలాగే ఉత్తమమైన వంశంలో జన్మించినా, ఎంత అందం ఉన్నా చదువుకోకపోతే అతడు తన కుటుంబంలో వెలుగును నింపలేడు. అలాంటివాడు కుటుంబానికి తెగులువంటివాడు.

2.ప్ర) త్రివిక్రమునికి చదువుపట్ల గల భావాలు ఎలాంటివి?

జ) త్రివిక్రమునికి చదువుపట్ల గల భావాలు ఎంతో సమున్నతమైనవి. చుట్టాలకు, తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే చదువులను పిల్లలు చదవాలి. విద్యపూర్తిగా స్వాధీనమై ఉండాలి. విద్యను అన్నదమ్ములుగాని, స్నేహితులు గాని, రాజులుగాని పంచుకోలేరు. విదేశాలకు వెళ్ళినప్పుడు దొంగలు దోచుకోలేరు. విద్య మనిషికి భారం కాదు. ఎవరికి ఎంత ఇచ్చినా కోటి రెట్లు పెరుగుతుంది. అందువల్ల విద్యకు సమానమైన ధనం ఈలోకంలో లేదని త్రివిక్రముడు భావించాడు.

3 ప్ర) కమలాకరుని స్వభావం ఎటువంటిది?

జ) కమలాకరం అంటే జలాశయం, జలాశయం ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. కదలదు, మెదలదు. అట్లే కమలాకరుడు ఎప్పుడూ స్తబ్దంగా ఉంటాడు. చదువులేని కారణంతో మంచి,చెడుల ఆలోచన లేదు. సమాజంలో ఎలా ప్రవర్తించాలో అర్థంకాదు. ఎవరేమని నిందించినా అచేతనంగా ఉంటాడు. అందువల్ల కవి కమలాకరుడిని జలాశయంతో పోల్చాడు.

4 ప్ర) చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయో ఊహించి రాయండి

జ) మానవులకు చదువు ఉత్తమమైన సాధనం. మంచి,చెడులను గురించి ఆలోచించే శక్తి చదువు వల్ల కలుగుతుంది. చదువు రాకపోతే బుద్ధి మందగిస్తుంది. విశాలమైన ఆలోచనా విధానం నశిస్తుంది. సమాజంలో గౌరవం ఉండదు. తల్లిదండ్రులకు, వంశానికి కీడు కలుగుతుంది. ఏ ఉద్యోగం దొరకదు. ప్రతిదానికి ఇతరులపై ఆధారపడి జీవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చదువురాని వారి వల్ల దేశప్రగతి, ఆర్థిక ప్రగతి క్రమంగా కుంటుబడుతుంది. అందువల్ల అందరూ బాగా చదువుకోవాలి.

పెద్ద ప్రశ్న – జవాబు

1 ప్ర) చదువు పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.

జ) ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు. అతని మంత్రి భట్టి, సేనాధిపతి గోవిందచంద్రుడు. విక్రమార్కుని ఆస్థానంలో ‘త్రివిక్రముడు’ అనే పురోహితుడు ఉన్నాడు. అతని కుమారుని పేరు కమలాకరుడు. ఇతడు అవివేకి (అజ్ఞాని). జలాశయం వలె స్తబ్దంగా ఉంటాడు. ఇది త్రివిక్రమునికి బాధ కలిగించింది. ఒకరోజు త్రివిక్రముడు, కమలాకరుడిని ఈ విధంగా మందలించాడు. బంధువులకు, తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే చదువును పిల్లలు చదవాలి. చదువులేని పుత్రుడు ఆ వంశానికి తెగులు వంటివాడు. చదువురాని వాడు మోదుగుపువ్వు లాంటివాడు. ఎంతటి గొప్పవంశంలో జన్మించినా, ఎంత అందమున్నా చదువురాకపోతే కుటుంబంలో వెలుగును నింపలేడు.

విద్యాధనాన్ని రాజులుగాని, అన్నదమ్ములుగానీ పంచుకోలేరు. ఎంతమందికి ఇచ్చినా కోటిరెట్లు పెరుగుతుంది. పద్య,గద్య కావ్యాలు చదవాలి. సంగీత, నాట్యశాస్త్రాలు చదవాలి. మంచిమాటలు మాట్లాడుతూ, లోకజ్ఞానాన్ని పొందాలి. ఇవేవీ చేయనివాడు, ఏ చదువు నేర్వనివాడు తోక, కొమ్ములు లేని ఎద్దులాంటివాడని, పశువుతో సమానమని త్రివిక్రముడు కమలాకరుడిని మందలించాడు. తండ్రిమాటలు విని కమలాకరుడు బాధపడి, తాను బాగా చదువుకొని తిరిగి తండ్రి ముఖం చూస్తానని ప్రతిజ్ఞ చేసి, కాశ్మీర ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ చంద్రకేతుడు అనే గురువును సేవించి, కొంత కాలంలోనే వేదాలను, వేదాంగాలను, అనేక శాస్త్రాలను చదువుకున్నాడు. జ్ఞానాన్ని పొంది గురువు అనుమతితో దేశంలోని విశేషాలు చూడాలని బయలుదేరాడు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu