3, మే 2018, గురువారం

అరేబియన్ నైట్స్ కథల పుస్తక సమీక్ష

శ్రీ శీతంరాజు గారు సంకలనం చేసిన అరేబియన్ నైట్స్ కథలు చాలా ఆసక్తి కరంగా ఉన్నాయి. ముచ్చట గొలిపే జానపద కథలు ఇవి. పర్శియన్ సుల్తానుల విలాసాల గురించి నడిచే కథలు ఇవి. వింతలు,అభూత కల్పనలు ఎంతో ఊహాత్మకంగా మనల్ని మరో లోకానికి తీసుకువెళ్తాయి, చిన్నపిల్లలైతే చెవి కోసుకుంటారు.
   విచిత్రమైన మూడు బహుమతులు కథలో ఎగిరే తివాచి, దూరదర్శిని, ఆపిల్ మహు విచిత్రంగా వింత గొలిపేలా ఉన్నాయి. మనసులో ఎక్కడికి తీసుకెళ్ళమన్నా అక్కడికి ఎగురుతూ తీసుకెళ్తుంది తివాచీ. ఎక్కడి సన్నివేశాలనైనా చూపిస్తుంది దూరదర్శిని. ఎలాంటి రోగాన్నైనా మటుమాయం చేస్తుంది ఆపిల్. ఇవి భేతాళ విక్రమార్క కథలో లాగా ఉన్నాయి.
 రాకుమారుడు అహమ్మద్ ఓ దేవకన్యను వివాహ మాడి ఓ గుహలో సకల భోగభాగ్యాలతో తులతూగుతూ నివసిస్తూ ఉంటాడు. ఆ దేవకన్యకు ఎన్నో మహిమలు మంత్రాలు వస్తాయి రకరకాల వింత వస్తువులను చిటికెలో సృష్టిస్తుంది. ఆమె తమ్ముడు పొట్టిగా, పెద్దగడ్డంతో వికృతంగా ఉండడం ఎంతో బరువున్న ఇనుప కడ్డీలు మోయడం.. వంటివి ఎంతో వింత గొల్పుతూ ఊహా ప్రపంచంలో తేలియాడేలా చేస్తుంది చదువరులను.
 ఈ కథలు పిల్లలకు చెప్తే వారు మన ప్రియ శిష్యులైపోవడం కాయం. మనవళ్ళు, మనవరాళ్ళు మన తో కాలక్షేపం చేయడానికి ఉవ్విళ్ళూరడం తథ్యం. పిల్లలు,పెద్దలు అందరు చదవదగ్గ మంచి పుస్తకం. 50 పేజీల ఈ పుస్తకం 10 కథలతో తులతూగుతూ ఉంది. చదవండి చదివించండి.

          >రామమూర్తి దండె MA,MA,B.Ed,(M.Phil),UGC-NET

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu