పుస్తక సమీక్ష
ఒక వ్యక్తి ఆస్తికుడే అయినా గుడికి వెళ్ళి విగ్రహారాధన చేయడం ఇష్టం ఉండదు, అలా గుడికి వెళ్ళే వారిని అవహేళన చేస్తూ ఉంటాడు. ఒక రోజు అటుగా వెళ్తున్న ఒక స్వామీజీ కంట పడింది ఆ దృశ్యం.. వెంటనే స్వామీజీ అతనితో "బాబు నేను రెండు ప్రశ్నలు వేస్తాను సమాధానం చెప్తావా?" అన్నాడు.
" ఆ అడగండి స్వామి"
"మన చుట్టూ గాలి ఉందా!!?"
"ఉంది"
"మరి విసనగర్రతో ఎందుకు నాయనా.. విసురుకోవడం!!!"
"???"
మరో ప్రశ్న.....
"నీడ ఎక్కడైనా ఉంటుంది కదా!!?"
"అవును ఉంటుంది"
"మరి ఎండలో చెట్టు కిందికే ఎందుకు నాయనా పరుగులు పెడతాం??"
"????"
దేవుడు అంతటా ఉన్నా.. గుడిలో దేవుడి ప్రతిమను చూడగానే మనలో అతీత శక్తి ప్రవేశించినట్లు అవుతుంది. మనసంతా దైవత్వంతో నిండి పోతుంది... ఆ గుడిలో ఉన్న భక్తి పారవశ్యం మనకు మరెక్కడా లభించదు.
ఇది చాలా చిన్న కథ. కానీ ఎంతో ఉత్కంఠ కలిగించే మలుపు ఉన్న కథ.
ఇలాంటి కథలు 81 ఉన్న అద్భుతమైన పుస్తకం "ఆధ్యాత్మిక చిన్న కథలు". వీటిని రాసింది " మల్లాది వెంకట కృష్ణమూర్తి" గారు. ఈ పుస్తకమంతా చదువుతున్నప్పుడు ""అమ్మో మనం ఏం చేస్తున్నా ఆ దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు.. మనం ఏ పాపమన్నా చేస్తే తప్పక శిక్షిస్తాడు. మన చుట్టుపక్కల ఎవరన్నా లంచాలు తీసుకుంటున్నా, మోసాలు చేస్తున్నా, పాపం మూట కట్టుకుంటున్నా వాళ్లకు రాబోయే కాలం గురించి తెలియట్లేదు.... వారి వృద్ధాప్యం ఎంత భయంకరంగా ఉండబోతుందో..!! అనే ఊహలే.. అమ్మో తప్పులు చేయొద్దు. ఉన్న దాంట్లో కొంత దానధర్మాలకు ఉపయోగించాలి.. ఎప్పుడూ మంచే మాట్లాడాలి... "'అని పదే పదే మనసు నన్ను హెచ్చరిస్తూనే ఉంది. ఇంత గొప్ప కథలు నేను ఇప్పటి వరకు చదవలేదు..
అద్భుతమైన ప్రారంభం అంతకంటే అత్యద్భుతమైన ముగింపు ఈ కథల సొంతం. కథ ముగియగానే మన మనసు ఆనందంతో గంతులేస్తుంది. చురక తగిలినట్టు ఉత్సాహం ఉరకలేస్తుంది.
ఓ చిన్న కథ ఇక్కడ ఉదహరించుకోవాలి.. ఒక దొంగ ఊర్లోకి ఒక స్వామీజి వచ్చాడని, అతని దగ్గరున్న ఒక పెట్టెలో వజ్రాలు పొదిగిన విగ్రహాలున్నాయని విన్నాడు. వెంటనే అతనున్న చోటు తెలుసుకొని వెళ్ళి, కత్తి పెట్టి బెదిరించి ఆ పెట్టెనివ్వమని బెదిరించాడు. ఆ స్వామీజి ప్రశాంత చిత్తంతో నవ్వితూ ... అలాగే ఇస్తా నాయనా కాని నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తే!
దొంగ: అలాగే అడగండి చెప్తా...
స్వామీజి: నీకు విదేశం వెళ్ళి కోటి రూపాయలు సంపాదించే అవకాశం వచ్చింది కాని ఒక సంవత్సరమే గడువు కాని ఒక్క రూపాయి కూడా నీ దేశం తెచ్చుకునే అవకాశం లేదు... అప్పుడు నువ్వు సంపాదిస్తావా లేక ఖాళీగా తిరుగుతావా???
దొంగ: దమ్మిడీ కూడా తెచ్చుకోలేనప్పుడు సంపాదించడం ఎందుకు స్వామీ! ఏ మూర్ఖుడూ అలా చేయడు.
స్వామీజి: మరి నువ్వు మూర్ఖుడు కాదని ఎందుకనుకుంటున్నావు???
దొంగ: నేనెందుకు మూర్ఖున్ని?
స్వామీజి: మరి ఆ పరాయి దేశమే ఈ భూమి ఇక్కడ ఎంత సంపాదించినా నీ వెంట రాదు కదా నాయనా...
ఇంతదానికే దొంగతనాలు, మోసాలు చేసి సంపాదించడం దేనికి నాయనా?!!
స్వామీజి: సరే ఇదిగో.. నగల పెట్టె తీసుకో....
దొంగ: స్వామీ నన్ను క్షమించు....
ఇలా చిన్న చిన్న కథల ద్వారా జీవిత సత్యాన్ని బోధిస్తాడు రచయిత.
ఒక యోగి, ఆద్యాత్మికవేత్త చెప్పే జీవిత పరమార్థాన్ని ఇలాంటి ఆకట్టుకునే చిన్న కథలలో నిక్షిప్తం చేయడం మామూలు విషయం కాదు దానికి ఎంతో నేర్పు, ఓర్పు కావాలి. ఎంతో సమయం వెచ్చించి మనసును మధించాలి. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడపాలి.. ఇంత శ్రమిస్తేనే గాని ఇలాంటి కథలు రాయడం అసాధ్యం.
పుస్తకం పేరు: ఆధ్యాత్మిక చిన్న కథలు
రచయిత: మల్లాది వెంకట కృష్ణమూర్తి
పేజీలు: 127
కథలు: 81
వెల: 60 రూ,,
పబ్లిషర్స్: లిపి పబ్లికేషన్స్, హైదరాబాద్.
>రామమూర్తి దండె MA,MA,B.Ed,UGC-NET,(M.Phil).
జాల సింగారం, రాజపేట, యాదాద్రి జిల్లా.
చరవాణి: 9393660069.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి