కృష్ణమ్మ
వెన్న వంటి మనసు మిన్నునంటే సొగసుచిన్ని కృష్ణుడి వన్నె... లున్న కృష్ణమ్మా..
IIవెన్న వంటిII
మహదేవ్ కొండల్లొ మహిమలెన్నో పొంది
రాళ్ళ సందుల బుట్టి రతనాల ధారగా
ఎల్ల కొండలు చుట్టి పిల్ల ఏరుల పారి
కొయినాను కలుపుకొని కోరినట్లు సాగి
వర్ణనలింగనము బూని వనములెల్లా దిరిగి
పంచగంగతొ గూడి పవిత్రంగనె మారి
దూధ్ గంగతొ గలిసి దూరమెంతో సాగి
మరాఠ తత్వాలను మదిన నింపుకొని
మరాఠీల మృదువైన మదిదోచుకున్న
IIవెన్న వంటిII
ఘటప్రభను పిలిచి, మాలప్రభను బిలిచి
ఆత్మలోనే నీవు ఐక్యమొనరించుకొని
భీమతో దోస్తీ గట్టి భీముడల్లే సాగి
కన్నడ నాటను నీవు కరుణనెంతో జూపి
బిర బిరా పరుగులతో బీరాలు పోయేవె
IIవెన్న వంటిII
పాలమూరు జిల్లా, తంగెడు పల్లె, తెలంగాణ
పౌరుషాల గడ్డల అడుగిడె బిడ్డ కృష్ణమ్మ
పాలేరు పరవశిస్తూ పడుచులా ఎదలొ ఒదిగి
మున్నేరు ముసిముసిగ ముడుచుకొని ముదముతో
కరిగి పొంగి పొరలి కలిసె కృష్ణమ్మ తనువులో
ముద్దులొలికే మూసి ముచ్చట్లు గండిపేటలొ నిలిచె
మురుగు నీటిని తాగి మలినమౌతూ సాగి
ఓదార్చమని వస్తె ఎద సంపుకొని ఉరికె
IIవెన్న వంటిII
ఈశ్వరుని పాదాలు కడుగుతూ సాగొచ్చె
దుందుభి ని అందుకొని బంధమై పయనిస్తు
కిన్నెర మోతల చాటు వన్నెలెన్నో నేర్చి
పోరుబాటలొ పరుగిడి వీరుల నెత్తురు గాంచి
కదన రుద్రమ తెగువ నడయాడుతూ నేర్చి
ఆంధ్రరాష్ట్రము చేరి అందకుండనె సాగి
నల్లమల కానలో ఎల్ల మృగముల తడిపి
తుంగభద్రతొ గలిసి బంగారు పంటలెన్నో ఇచ్చి
ఏరులన్నీ గలుపుకొని ఏకమౌతూ సాగె
IIవెన్న వంటిII
మెట్ట భూములనెల్ల ముద్దాడి మురిపించి
చెలమలను ఓదార్చి చెలిమి జేస్తూ నడిచి
కొండలను ఎగబాకి కొండ అంచులు జారి
ఇంతి ముంగురులోలె ఎంతెంతొ ఎగిసేవె
IIవెన్న వంటిII
హద్దు అన్నదె లేక అలసి సొలసి తిరిగి
హంస నడకలతోటి హంస దీవిని జేరి
కవల పాయగ చీలి దివి సీమనే మలిచి
తుర్రుమంటూ దుమికి తండ్రి అక్కున జేరె
IIవెన్న వంటిII
>దండె రాంమ్మూర్తి(09.09.2014) (78.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి