1.త్యాగనిరతి
-నన్నయ
నేపథ్యం: పూర్వకాలంలో శిబి చక్రవర్తి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. అప్పుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు శిబి చక్రవర్తి గుణగణాలను పరీక్షించాలనుకొన్నారు. అగ్ని పావురంగా, ఇంద్రుడు డేగ రూపం ధరించారు. డేగంటే భయంతో పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరింది.
ఉద్దేశం:త్యాగగుణం ఆవశ్యకతను తెలియజేయడం.
ప్రక్రియ:ఇతిహాసం:- ఇతిహాసం అంటే ‘ఇది ఇట్లా జరిగింది’ అని అర్థం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇతిహాసాలు గ్రంథస్థం కాక ముందు వాగ్రూపంలో ఉండేవి. రామాయణ, మహాభారతాలు ఇతిహాసాలు.
ఈ పాఠ్యభాగం శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్యపర్వంలో తృతీయ ఆశ్వాసం నుండి గ్రహించబడింది.
కవి పరిచయం: 11వ శతాబ్దానికి చెందిన నన్నయ గారు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజరాజనరేంద్రుని ఆస్థాన కవి. వ్యాసుడు సంస్కృతంలో రాసిన మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆది, సభా పర్వాలు పూర్తిగా అరణ్య పర్వం అర్థభాగం తెలుగులోకి అనువదించాడు. ఆంధ్రశబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. వీరి కవిత్వంలో అక్షర రమ్యత, ప్రసన్నకథా కలితార్థయుక్తి, నానారుచిరార్థసూక్తి నిధిత్వం అనే లక్షణాలుంటాయి. వీరికి వాగనుశాసనుడు అనే బిరుదు ఉంది.
కంఠస్థ పద్యాలు:
1.ధర్మజ్ఞులైన పురుషులు
ధర్మువునకు బాధసేయు ధర్మువునైనన్
ధర్మముగా మది దలపరు
ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్
భావం: ధర్మం తెలిసిన వారు ధర్మానికి కీడు చేసే ఎటువంటి ధర్మాన్నైనా ధర్మమని మనస్సులో తలచుకోరు. ధర్మం అనేది అన్నింటికీ మేలును కలిగించేదిగానే ఉండాలి.
2.ప్రాణ భయమున వచ్చి యిప్పక్షి నన్ను
నాశ్రయించె నాశ్రితునెట్టి యధముడయిన
విడువడనినను నేనెట్లు విడుతు దీని?
నాశ్రిత త్యాగమిది ధర్మువగునె? చెపుమ
భావం: ప్రాణభయంతో వచ్చి ఈ పావురం నన్ను ఆశ్రయించింది. ఎంతటి నీచుడైనా రక్షించుమని వచ్చిన ఆశ్రితుడిని విడిచి పెట్టడు. మరి నేనెట్లా విడిచి పెడ్తాను? ఆశ్రితులను విడిచి పెట్టడం ధర్మం ఎట్లా అవుతుందో నీవే చెప్పు.
3.అనిన ‘ననుగ్రహించితి మహా విహగోత్తమ యంచు సంతసం
బున శిబి తత్ క్షణంబ యసి పుత్త్రిక నాత్మ శరీర కర్తనం
బనఘుడు సేసి చేసి తన యంగమునం గల మాంసమెల్ల బె
ట్టినను గపోతభాగమ కడిందిగ డిందుచు నుండె నత్తులన్
భావం: అనగా సంతోషించిన శిబి చక్రవర్తి ‘పక్షులన్నింటిలో గొప్పదానివైన నీవు నాపై దయ చూపావు’ అని చెప్పి వెంటనే చిన్న కత్తితో తన శరీరంలొని మాంసాన్ని కోసి తక్కెడలో వేస్తూ పావురం బరువుతో తూకం వేశాడు. తన దేహంలోని మొత్తం మాంసం వేసినప్పటికీ పావురం బరువుతో తూకం వేశాడు. తన దేహంలోని మొత్తం మాంసం వేసినప్పటికీ పావురం ఉన్నవైపే తక్కెడ మొగ్గుతున్నది.
స్వీయ రచన:(ఐదు వాక్యాల ప్రశ్నలు)
ఇతరులు ఆహారం తినేటప్పుడు ఎందుకు విఘ్నం కలిగించకూడదో రాయండి.
జ: విఘ్నం అంటే ఆటంకం. ఈ లోకంలోని ప్రాణులన్నీ ఆహారం తినే జీవిస్తాయి. ఆహారం తినకుండా ఏ ప్రాణీ జీవించలేదు. ‘కోటి విద్యలు కూటి కొరకే’ అని మన పెద్దలంటారు. అటువంటి ఆహారాన్ని సంపాదించుకొని తినే సమయంలో ఆటంకం కలిగించకూడదు. ఆటంకం కలిగించడం వల్ల ఆహారాన్ని తృప్తిగా తినలేరు. అన్నం తినకపోతే ప్రాణాలు నిలువవు. జీవించడానికి ముఖ్య సాధనం ఆహారం. అటువంటి ఆహారాన్ని తినేటప్పుడు ఆటంకాలు కలిగిస్తే పాపం చుట్టుకుంటుంది, నరకం ప్రాప్తిస్తుంది. అందువల్ల ఆహారం తినేటప్పుడు విఘ్నం కలిగించకూడదు.
‘అందరూ ధర్మాన్ని ఆచరించాలి’ అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి.
జ: చతుర్విధ పురుషార్థాలలో మొదటిది ధర్మం. ‘ధర్మో రక్షతి రక్షితః'- అనగా ధర్మాన్ని మీరు రక్షిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది అని అర్థం. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే విజయం లభిస్తుంది. శిబి చక్రవర్తి ధర్మం ప్రకారం నడుచుకున్నాడు కాబట్టే చివరకు విజయాన్ని పొందాడు. అలాగే కౌరవ, పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం పాండవుల పక్షాన ఉంది కాబట్టి పాండవులు గెలిపొందారు. రామాయణంలో రాముడు విజయం సాధించడం కూడా ఇటువంటిదే. కాబట్టి అందరూ ధర్మాన్ని ఆచరించడం వల్ల మాత్రమే విజయం సాధించగలరు. వెంటనే ఫలితం లభించకపోవచ్చు కాని ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది. అందరూ ధర్మాన్ని పాటించినప్పుడే సమాజమంతా సుఖశాంతులతో జీవిస్తుంది.
ఇతరుల కొరకు మనం ఎట్లాంటి త్యాగాలను చేయవచ్చో రాయండి.
జ: మనిషి జన్మ అరుదుగా లభిస్తుంది. కావున దానిని మనం సార్థకం చేసుకోవాలి. ఇతరుల కోసం త్యాగాలు చేయాలి. త్యాగం చేయడం వల్ల ఆత్మ సంతృప్తి కలుగుతుంది, స్వర్గ లోకాలు లభిస్తాయి. ‘సొంత లాభం కొంత మానుకో, పొరుగు వారికి తోడుపడు’ అన్న గురజాడ మాటలు గుర్తుతెచ్చుకొని స్వార్థాన్ని వీడాలి. నిస్వార్థంగా కూడు, గూడు, గుడ్డ లేని వారికి మన వంతుగా సహాయ సహకారాలు అందించాలి. భూకంపాలు, సునామీలు, వరదలు వచ్చినప్పుడు ధన సహాయం, శ్రమ దానం, రక్తదానం, అవయవ దానం వంటివి చేయవచ్చు. ఇందుకోసం విలాసవంతమైన జీవితాన్ని, మన సమయాన్ని త్యాగం చేయవలసి ఉంటుంది.ఈ విధంగా ఎన్నో రకాలుగా ఇతరుల కోసం మనం త్యాగాలు చేయవచ్చు.
‘త్యాగనిరతి’ అనే శీర్షిక ఈ పాఠానికి ఏ విధంగా తగినదో రాయండి.
జ: త్యాగనిరతి అంటే త్యాగం చేసే గుణం అని అర్థం. ఈ పాఠంలో శిబి చక్రవర్తికి ఉన్న త్యాగగుణం గురించి తెలియజేయడం జరిగింది. ఒక పావురం కోసం తన మాంసాన్నే కోసి ఇచ్చాడు. ఈ విధంగా అటు పావురం ప్రాణాన్ని కాపాడాడు. డేగ మరియు దాని కుటుంబం ఆకలితో మరణించకుండా కాపాడాడు.
శిబి చక్రవర్తికి అన్ని జీవులూ సమానమే, అందుకే సకల జీవులను తనవోలె ఆదరించాలని ఒక శతక కవి చెప్పిన విషయం తూచా తప్పకుండా పాటించాడు. ఒక పక్షికి హాని కలిగించే కంటే తన ప్రాణం పోయినా మంచిదే అనుకున్నడు. కాబట్టి ఈ పాఠానికి త్యాగనిరతి అన్న శీర్షిక అన్ని విధాలుగా తగినది.
పది వాక్యాల ప్రశ్న:
త్యాగం చేయడంలో ఉన్న గొప్పతనాన్ని, అనుభూతిని వివరించండి.
జ: మానవ జీవితం లభించడం ఎంతో అదృష్టం. ఈ అదృష్టం అందరికీ లభించదు. కాబట్టి మానవులంతా ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. అందుకోసం త్యాగ గుణం కలిగి ఉండాలి. త్యాగానికి మించిన సుగుణం మరొక్కటి లేదు. ఇస్తే తీసుకుంటూ తిరిగిచ్చే గుణం లేని వాడు నీచుడు. కేవలం ఇచ్చే గుణమే ఉండి ఏమీ ఆశించని వాడు నిజమైన త్యాగి.
త్యాగి అందరినీ సమానంగా చూస్తాడు. తాను ఇతరులు అనే భేదాలు త్యాగికి ఉండవు. సమాజం నాకేమిచ్చిందని కాకుండా సమాజానికి నేనేమిచ్చానని ప్రతీక్షణం ఆలోచిస్తాడు. త్యాగం అనేది స్వార్థాన్ని దూరం చేస్తుంది. ఎవరైతే నిస్వార్థంగా సేవ చేస్తారో వారే లోకంలో గొప్పవారిగా కీర్తి గడిస్తారు. ఇలాంటి వారు ఎవరి నుండి ఏమీ ఆశించరు కాబట్టి ఆనందంగా జీవిస్తారు.
దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఎందరో మహనీయులు ధన, ప్రాణాలను త్యాగం చేసారు. వీరంతా నిస్వార్థంగా దేశం కోసం పోరాడారు. వీరి త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్చగా జీవిస్తున్నాము. తెలంగాణ సాధన కోసం ఎందరో విద్యార్థులు ప్రాణాలు అర్పించారు. మరెందరో నిస్వార్థంగా పోరాటం చేసారు. తద్వారా తెలంగాణా రాష్ట్రం సాకారం అయింది. మదర్ థెరెసా త్యాగానికి ప్రతిరూపం. ఈమె అనాథల కోసం తన జీవితాన్నే త్యాగం చేసారు. భగత్ సింగ్, నేతాజీ, తిలక్, గాంధీ వంటి వారు దేశం కోసం తమ ధనాన్ని, సుఖాన్ని, జీవితాన్ని త్యాగం చేసారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచపోయారు. కాబట్టి త్యాగం చేయడం వల్ల ఎంతో గొప్ప సంతృప్తి, మానసిక ఆనందం, ఎన్నో రెట్ల కీర్తి లభిస్తుందని చెప్పవచ్చు.
పదజాలం:
అర్థాలు
కపోతములు = పావురములుధర్మువు = ధర్మం, పుణ్యంహితము = మేలు, మంచిపరిత్యాగం = సమర్పించుట, విడుచుటవర్ధిల్లు = వృద్ధిపొందు, పెరుగుబుభుక్షితుడు = ఆకలితో ఉన్నవాడు
నానార్థాలు
వర్షం = సంవత్సరం, వానపాడి = న్యాయం, ధర్మంవనం = అడవి, నీరు
భాషాంశాలు:
1.
అ) 4
ఆ) 3
ఇ) 1
ఈ) 5
ఉ) 2
2.
అ) ఇంద్ర+అగ్నులు=సవర్ణదీర్ఘ సంధి
ఆ) త్యాగము+ఇది=ఉకార సంధి
ఇ) ఆహార+అర్థం=సవర్ణదీర్ఘ సంధి
ఈ) నేను+ఎట్లు=ఉకార సంధి
ఉ) శౌర్య+ఆది=సవర్ణదీర్ఘ సంధి
2.సముద్ర ప్రయాణం
ముద్దు రామకృష్ణయ్య
పాఠ్యభాగ నేపథ్యం
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో లండనుకు వెళ్లి చదువుకోవడం వ్యయప్రయాసలతో కూడుకొన్న పని.అయినప్పటికీ ఉన్నత విద్య కోసం, కరీంనగర్ జిల్లా మంథని గ్రామంవాసియైన ముద్దు రామకృష్ణయ్య సుదూర దేశమైన గ్రేట్ బ్రిటన్కు సముద్ర ప్రయాణం చేశాడు. ఆయన సముద్ర ప్రయాణ అనుభవాన్ని ఈ పాఠం నేపథ్యం.
పాఠ్యాంశ ఉద్దేశం
కార్యసాధకులు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృతనిశ్చయంతో, దృఢసంకల్పంతో పూర్తి చేసుకుని విజయాన్ని సాధించగలుగుతారని తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
యాత్రా చరిత్ర ప్రక్రియకు చెందినదీ పాఠం .యాత్రవల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రాచరిత్ర .దేశ ,విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ,ఆర్థిక,సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి. ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన `నా ప్రథమ విదేశీ యాత్ర' పుస్తకంలోనిది.
రచయిత పరిచయం
రచయిత పేరు: ముద్దు రామకృష్ణయ్య
కాలం:18-10-1907 నుండి 21-10-1985
జన్మస్థలం: కరీంనగర్ జిల్లాలోని మంథని గ్రామం
తల్లిదండ్రులు: ముద్దు అమ్మాయి, ముద్దు రాజన్న
రచనలు: సముద్ర ప్రయాణం
విశేషాంశాలు:1)1946 లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి యం. ఇడి.పట్టా పొందాడు.2) 1951 -58 మధ్యకాలంలో ఆసియా ,ఆస్ట్రేలియా ,యూరప్ ,అమెరికా ఖండాలలోని పలుదేశాలు పర్యటించి,అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాడు.3) మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. అవి నేటికీ ఆదర్శప్రాయాలైనాయి.4) సమయపాలనకు ఆయన పెట్టింది పేరు .5)నిరక్షరాస్యత నిర్మూలన కోసం ' ఈచ్ వన్ టీచ్ వన్ 'ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త.
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) దూరప్రయాణాలకు పోయేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
జ. దూరప్రయాణాలకు పోయేటప్పుడు ప్రయాణికులు కనీస జాగ్రత్తలను తీసుకోవాలి. దీనివల్ల ప్రయాణం సుఖవంతంగాను,ఆరోగ్య ప్రదంగాను,ఆనందమయంగాను ఉంటుంది.
1) ప్రయాణపు రోజులకు అవసరమైన బట్టలను,నిత్యవసర వస్తువులను దగ్గర ఉంచుకోవాలి.
2) దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ముందస్తుగా కొన్ని మందులను దగ్గర ఉంచుకోవాలి.
3) రాకపోకలకు సంబంధించిన రిజర్వేషన్ ముందుగానే చేయించుకోవాలి.
4) నిత్యావసరాల కోసం కొంత డబ్బును ,బ్యాంకు కార్డులను దగ్గర ఉంచుకోవాలి.
5) విలువైన బంగారు ఆభరణాలను ధరించకూడదు.
2) రచయిత ఉన్నత విద్య కోసం పట్టుదలతో ఇంగ్లాండు వెళ్ళాడు కదా దీని ద్వారా మీరేం గ్రహించారు?
జ. రచయిత ఉన్నత విద్యను చదువడం కోసం పట్టుదలతో ఇంగ్లాండ్ కు వెళ్ళాడు. మానవునికి పట్టుదల ఉంటే జీవితంలో ఏదైన సాధ్యమవుతుందని గ్రహించాను. జీవితంలో చదువు చాలా గొప్పది. దానిని ప్రతి మానవుడు కష్టపడి సాధించాలి. పేదరికం చదువుకు ఆటంకం కాదని,పట్టుదల ఉంటే ఏ అవరోధం ఏమీ చేయలేదని గ్రహించాను. చదువనేది ప్రయత్నం చేసేవారికి సిద్ధిస్తుందని రచయిత అనుభవం ద్వారా తెలుసుకున్నాను.
3) 'ఉన్నత లక్ష్యం, పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు 'వివరించండి.
జ. మానవ జీవితం చాలా దుర్లభమైనది .దాన్ని మానవుడు సార్థకం చేసుకోవాలి .జీవితంలో ఏదైనా సాధించాలన్నా,ఏదైనా ఒక పని చేయాలన్నా అందుకు తగిన లక్ష్యం,దానికి మించిన పట్టుదల ఉండాలి. కేవలం లక్ష్యం ఉన్నంత మాత్రాన అన్ని పనులను చేయలేము. అన్నింటిని సాధించలేము . లక్ష్యానికి తగిన సాధన,నిరంతర పరిశ్రమ తోడైనప్పుడు ఆశించిన గమ్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. పట్టుదల అనేది వ్యక్తిలో అంతర్గతంగా ఉంటుంది.దానిని గుర్తించి సాధన చేయాలి. లక్ష్యసాధనలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి .ఈ కారణాలవల్ల జీవితంలో ఉన్నత లక్ష్యం,పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు అనే నిజాన్ని గ్రహించాలి.
4) ఒక కొత్త ప్రదేశాన్ని దర్శించినప్పుడు అక్కడ తెలియని విషయాలను తెలుసుకోవడానికి మీరేం చేస్తారు?
జ. ఒక కొత్త ప్రదేశాన్ని సందర్శించాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.దీనివల్ల దర్శింపదలచిన ప్రాంతంలోని విశేషాలను సులభంగా తెలుసుకొనగలుగుతాము.దర్శించిన ప్రాంతంలో ఒక గైడును ఏర్పాటు చేసుకుంటాను.ప్రత్యేక వాహనాన్ని కూడా దగ్గర ఉంచుకుంటాను.గైడు సహాయంతో అక్కడి విశేషాలను,వింతలను,స్థలము యొక్క గొప్పదనాన్ని తెలుసుకుంటాను. లేదా మనకు తెలిసిన బంధువులను,మిత్రులను ముందుగా సంప్రదించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ ప్రాంతానికి చెందిన పుస్తకాలను చదివి మరికొన్ని విశేషాలు తెలుసుకుంటాను.
2 కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) అనుకున్నది సాధించడంలో కలిగే తృప్తి అనంతమైంది. ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం ఆధారంగా వివరించండి.
జ. కరీంనగర్ జిల్లా మంథని గ్రామస్థుడైన ముద్దు రామకృష్ణయ్యగారు పట్టుదలకు మారుపేరుగా నిలిచాడు.ఉన్నత లక్ష్యసాధన కోసం ఎన్నో అడ్డంకులను,ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. వాటిని తన ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకున్నాడు. అందరికీ మార్గదర్శకుడిగా నిలిచాడు.
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో రామకృష్ణయ్య లండనుకు వెళ్లి ఉన్నతవిద్యను చదువుకోవాలనుకున్నాడు. కష్టాలు ఎదురవుతాయని ముందుగానే గ్రహించాడు. తాను పేదరికంతో ఉన్నా దానిని లెక్క పెట్టలేదు.బొంబాయి లో పడవ ఎక్కాడు.పడవలోని వాతావరణం మొదట్లో ఇబ్బందిగా ఉంది. అయినా దాన్ని ధైర్యంగా అధిగమించాడు. సాధారణమైన పంచె, పైజామా, షేర్వాణీతోనే ప్రయాణం చేశాడు. ప్రయాణికుల్లో చాలా మంది ఆంగ్లేయులు ఉన్నారు. వారి భాష రాదు,తన భావాలను వ్యక్తం చేయలేడు.
లండన్లో ఎక్కువ డబ్బు ఉన్నవాళ్లకు మాత్రమే చదువుకునే అవకాశం ఉంటుందని, లేకపోతే తిరిగి పంపిస్తారని తెలుసుకున్నాడు. దైవాన్ని ప్రార్థించాడు. తాను అనుకున్న విధంగా లండనులో ఉన్నతవిద్య పూర్తి చేయాలి. దేశం కోసం ఏదో ఒకటి చేయాలి.ఇదే రామకృష్ణగారి లక్ష్యం.నౌకలో ప్రయాణిస్తున్న సురేష్ బాబు సహకారం లభించింది. ధైర్యంగా ముందుకు వెళ్లాడు.నౌక దిగగానే భగవంతుని దయవల్ల రామకృష్ణయ్యకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో రామకృష్ణయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన లక్ష్యాన్ని చేరుకొని అనుకున్న దాన్ని సాధించాడు.
పదజాల వినియోగం
అ) ద్రవ్యం=డబ్బు
ఆ) వాగ్దానం=మాటయిచ్చు
కింది జాతీయాలను సొంతవాక్యాలలో రాయండి.
అందెవేసిన చేయి=సమర్థత, నైపుణ్యం
సీస పద్యాలు రాయడంలో శ్రీనాథుడిది అందెవేసిన చేయి.
1) పట్టరాని సంతోషం=ఆనందం
పదోతరగతి వార్షిక పరీక్షలు రద్దవడంతో విద్యార్థులకు పట్టరాని సంతోషం కలిగింది.
2) దేవునిపై భారం వేయు=సంకల్పానికి తగిన ఫలితం రావడం కోసం దీక్ష
వృద్ధులందరూ కరోనాను తమవద్దకు రానివొద్దని దేవునిపై భారం వేస్తున్నారు.
3) గుండె జల్లుమను=ఉలిక్కిపడడం,భయానికి లోనుకావడం
పామును తొక్కితే గుండె జల్లుమంటుంది.
4) చెమటలు పట్టు=ఒత్తిడి ఎక్కువైనప్పుడు
పోలీసు వాళ్ళను చూస్తే దొంగలకు చెమటలు పడతాయి.
భాషను గురించి తెలుసుకుందాం
1) కింది వాక్యాలలో గీత గీసిన పదాలు ఏ సమాసాలో గుర్తించి, వాటి పేర్లు రాయండి.
1. ఆదిశేషునికి వేయితలలు
వేయి సంఖ్య గల తలలు - ద్విగు సమాసం
2) కృష్ణార్జునులు సిద్ధమైనారు
కృష్ణుడును, అర్జునుడును- ద్వంద్వ సమాసం
3) రవి ,రాము అన్నదమ్ములు
అన్నయును, తమ్ముడును - ద్వంద్వ సమాసం
4) వారానికి ఏడు రోజులు
ఏడు సంఖ్య గల రోజులు -ద్విగు సమాసం
5) నూరేండ్లు జీవించు
నూరు సంఖ్య గల ఏండ్లు -ద్విగు సమాసం
2. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి
1) విద్యాభ్యాసం =విద్య + అభ్యాసం-సవర్ణదీర్ఘ సంధి
2 మొదలయింది=మొదలు+అయింది -ఉత్వసంధి
3 విద్యార్థులు =విద్య +అర్థులు -సవర్ణదీర్ఘ సంధి
4 ఏదైనా =ఏది + ఐన -ఇత్వసంధి
5 వారందరు =వారు +అందరు - ఉత్వసంధి
ఉపవాచకం: 1. చిత్రగ్రీవం
చిత్రగ్రీవం తల్లిదండ్రుల గురించి రాయండి.
జ:- చిత్రగ్రీవం తండ్రి పక్షి ఓ గిరికీల మొనగాడు. ఎంతో వేగం, చురుకుదనం, సాహసం కలిగినది. తల్లి పక్షి ఓ వార్తల పావురం. ఆ రోజుల్లో అది అతి సుందరమైన కులీన వంశానికి చెందిన పావురం. తల్లి పక్షి ఎంతో తెలివితేటలు గలది. ఈ రెండూ అతి విశిష్టమైన పావురాలు.
చిత్రగ్రీవం పుట్టుక, బాల్యం గురించి మీ సొంత మాటల్లో రాయండి.
జ:- ఓ వార్తల పావురం, ఓ గిరికీల మొనగాడు జతకట్టి గుడ్లు పెట్టినాయి. అవి రెండూ పొదిగి, ఓ పిల్లపక్షిని ప్రపంచంలోకి ఆహ్వానించాయి. దాని పేరు చిత్రగ్రీవం 'చిత్ర' అంటే రంగులతో నిండిన, 'గ్రీవం' అంటే కంఠం. అంటే చిత్రవిచిత్రనైన రంగులతో కూడిన మెడ కలిగినది అని అర్థం.
పక్షి ప్రపంచంలో రెండు దృశ్యాలు అతి మనోహరమైనవి. గుడ్డు బద్దలుగొట్టి తల్లి పక్షిని ఈ ప్రపంచపు వెలుగులోకి తీసుకురావడం అందులో మొదటిది. అలా వచ్చిన పిల్ల పక్షి నోటికి ఆహారం అందిస్తూ తల్లి పక్షి పెంపకం కొనసాగించడం రెండోది. ఈ విధంగా తల్లిదండ్రుల శ్రమ, శ్రద్ధ పుణ్యమా అని చిత్రగ్రీవం మహా ఏపుగా ఎదిగింది. పుట్టిన ఐదో వారానికల్లా గూటి నుంచి బైటకు గెంతి మంచి నీళ్ళు తాగే స్థాయికి చేరుకున్నది. ఆహారం సంపాదించుకునే ప్రయత్నాలు చేసింది. మరో రెండు వారాలు గడిచేసరికి ఎగరడం నేర్చుకుంది.
పావురాల ప్రత్యేకత గురించి మీరేమి తెలుసుకున్నారో రాయండి.
జ:- ప్రాచీన కాలం నుండి పావురాలు మానవ నివాసాలలోనే గూడు కట్టుకొని జీవిస్తున్నాయి. పావురాలను మచ్చిక చేయడం అన్న కళ వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో కొనసాగుతోంది. ఆ కళ పుణ్యమా అని పక్షి ప్రేమికులను అలరించే పిగిలిపిట్ట, బంతి పావురం అన్న రెండు విశిష్టమైన పావురాల జాతులను భారతదేశం ప్రపంచానికి అందించింది. ఎన్నో శతాబ్దాల నుండి రాజులు, రాణులు మొదలుకొని సామాన్యుల వరకు పావురాలకు తమ ఇళ్ళలో స్థానం కల్పించారు.
పావురాలకు అద్భుతమైన దిశాపరిజ్ఞానం ఉంది. రోజంతా ఎక్కడెక్కడ తిరిగినా, ఏ గగన సీమలో విహరించినా చివరికి తన యజమాని ఇంటి మీదికి వచ్చి చేరుకుంటాయి. పావురాలలో వార్తలు మోసేవి, గిరికీలు కొట్టేవి, పిగిలిపిట్టలు, బంతి పావురాలు అని వివిధ రకాలున్నాయి. ఒక కలకత్తా నగరంలోనే ఇరవై లక్షల పావురాలున్నాయి.
పావురాల కనురెప్పలకు అనుబంధంగా మరో పల్చని పొర ఉంటుంది. ఇది గాలి దుమారాల్లో గాని, సూర్యుడి దిశలో ఏ ఇబ్బంది లేకుండా ఎగరగలిగేందుకు తోడ్పడుతుంది. ఈ పావురాలు తమ పిల్లలకు పాల వంటి ద్రవాన్ని నోటి ద్వారా అందిస్తాయి. ఈ పావురాలు ఒక్కసారి జత కట్టాయంటే చనిపోయేంతవరకూ కలిసే జీవిస్తాయి.
3. బండారి బసవన్న
-పాల్కురికి సోమనాథుడు
నేపథ్యం: బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న దండనాయకుడుగా ఉన్నాడు. ఇతడు గొప్ప శివభక్తుడు. ఒకరోజు ఒక జంగమయ్య బసవన్న దగ్గరకు వచ్చి "నాకు ఈ క్షణంలో ఇంత ధనం కావాలి లేకపోతే మీ సపర్యలు స్వీకరించను" అన్నాడు. అప్పుడు బసవన్న కోశాగారంలోని పేటికల్లో ఉన్న మాడలను జంగమయ్యకు సమర్పించాడు. అది చూసిన ఇతర మంత్రులు బిజ్జలుడి దగ్గరకు పోయి బసవన్న రాజద్రోహం చేశాడని చెప్పారు. ఇక్కడ ఈ పాఠ్యభాగం మొదలవుతుంది.
ఉద్దేశం: బసవన్న ఔదార్య బుద్ధి, భక్తితత్త్వం తెలియజేయటం ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠం 'ద్విపద' ప్రక్రియకు చెందినది. ఇది దేశికవితా ప్రక్రియ. ఇది రెండేసి పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగే రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అంటారు.
ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసిన 'బసవ పురాణం' లోని తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
కవి పరిచయం: పాల్కురికి సోమనాథుడు 12 శతాబ్దానికి చెందిన కవి. వీరు జనగామ జిల్లా పాలకుర్తిలో జన్మించారు. దేశి ఛందం ద్విపదలో స్వతంత్ర కావ్యం రాసిన తొలికవి. బసవపురాణం, అనుభవసారము, బసవోదాహరణము, వృషాధిపశతకము, చతుర్వేదసారము, చెన్నమల్లు సీసములు, పండితారాధ్య చరిత్రము మొదలైనవి వీరి రచనలు. రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం మొదలైన సాహితీ ప్రక్రియలకు సోమన ఆద్యుడు. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీభాషా పదాలను యథేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. తెలుగులో మణి ప్రవాళ శైలిని వాడిన తొలి కవి.
స్వీయ రచన
I. క్రింది ప్రశ్నలకు జవాబులు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
1. బండారి బసవన్న స్వభావం రాయండి?
జ. బిజ్జలుడు కొలువులో బండారి బసవన్న దండ నాయకుడిగా ఉన్నాడు. ఇతడు గొప్ప శివభక్తుడు. ఈయన పరమ నిష్టాగరిష్టుడు. పరమ శివుని ఆరాధనతో మోక్షసాధనకు కృషి చేశాడు. రాజ్యంలో ఎల్లప్పుడూ మంచి పనులు చేసేవాడు. దేవునియందు అనూహ్యమైన భక్తి కలవాడు,సచ్చీలుడు. బండారి బసవన్న ఎవరి నుండి ఏమి ఆశించేవాడు కాదు. ఇతరుల ధనము నందు ఆశ లేనివాడు. భగవంతుడు ఇచ్చిన ధనాన్ని భగవంతునికి ఇవ్వడానికి ఏమాత్రం సంకోచించ లేదు. మంచి ఉద్దేశంతో చేసే పనులు మనిషినీ ఎల్లప్పుడూ మంచివానిగా చేస్తాయి. ఆ కోవకు చెందిన వాడే బండారి బసవన్న. బండారి బసవన్న ఔదార్య బుద్ధి, భక్తితత్వం కలవాడు.
2. బండారి బసవన్న రాజుతో నిర్భయంగా మాట్లాడాడు కదా! అలా ఎప్పుడు నిర్భయంగా మాట్లాడగలుగుతారు?
జ. మనిషి తాను చేసే పని వల్ల ఎవరికీ హాని, నష్టం కలగనప్పుడే ఆ పనిలో వచ్చే ఆటంకాలను అధిగమిస్తారు. ఆత్మవిశ్వాసంతో తాను చేసే పని తప్పు కాదని భావించినప్పుడు ఎవరితో అయినా నిర్భయంగా మాట్లాడగలుగుతాడు. నిజాయితీగా నడుచుకునే వ్యక్తికి గౌరవం పెరుగుతుంది. అటువంటి వారు సత్కార్యాలు నిర్వహించినప్పుడు నిర్భయంగా వ్యవహరిస్తారు. ఎన్నుకున్న లక్ష్యం ఉన్నతమైనది, గొప్పది అయినప్పుడు నిర్భయంగా మాట్లాడగలుగుతున్నారు. మనం మాట్లాడే దానిలో న్యాయం ఉన్నప్పుడు మనం తప్పులు చేయకపోయినా అనవసరంగా మన మీద నిందలు వేసి నప్పుడు నిర్భయంగా చెబుతాము. అన్యాయంగా శిక్ష పడినప్పుడు ఆ శిక్ష పడకుండా ఉండడానికి నిజాన్ని నిర్భయంగా చెబుతాము.
3. 'భక్తుడు పర ధనాన్ని ఆశించడు' ఎందుకు?
జ. భక్తుడు మోక్ష సాధనకు నిరంతరం తపిస్తూ ఉంటాడు. భక్తుడు కోరుకుంటే భగవంతుని అనుగ్రహ కటాక్షం లభిస్తుంది. భక్తి అనే శక్తి ముందు ఈ సిరి సంపదలు ఎంత మాత్రం ఎక్కువ కాదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా భగవంతుని కటాక్షం కొరకు చిత్తశుద్ధితో అంకిత భావంతో ప్రార్థిస్తాడు. భక్తుడు ఎల్లప్పుడు భగవదనుగ్రహాం కోసం శ్రమిస్తాడు. పర ధనం కోసం ప్రాకులాడడు. పరుల సొమ్ము పాము వంటిది అనే మాటను మరవకుండా ప్రవర్తిస్తాడు. భక్తుడు కోరుకుంటే భగవంతుడే అన్నీ ఇస్తాడు. ఇతరుల సొమ్ము కోసం ఆశ పడకూడదని భక్తుడు భావిస్తాడు. భగవంతునిపై భక్తి ఉన్నవానికి ధనం మీద ఎటువంటి ఆశ ఉండదు. భక్తియే ప్రధానంగా ఉంటుంది. అందుచే భక్తుడు పర ధనాన్ని ఆశించడు.
4. “క్షీరాబ్ది లోపల క్రీడించు హంస గొరునే పడియల నీరు ద్రావంగ” అని బసవన్న అనడంలో గల ఉద్దేశం ఏమిటి?
జ. పాలసముద్రంలో క్రీడించు హంస మడుగులలో నీరు తాగదు కదా అదే విధంగా శివ భక్తుల దగ్గర భక్తి అనే కల్ప వృక్షం కోరుకున్న కోరికలని తీర్చే విధంగా ఉండగా ధనాన్ని వారు ఆశించరు కదా! భగవంతుడి ధనాన్నే ఆ స్వామికి ఇచ్చాను. మీ ధనం కోసం నేను చేయి చాచలేదు అని తెలియ చేయడం కోసం బసవన్న “క్షీరాబ్ది లోపల క్రీడించు హంస గోరునే పడియల నీరు ద్రావంగ” అని ఉంటాడు.
II. ఈ క్రింది ప్రశ్నలకు 10 వాక్యాల్లో జవాబులు రాయండి
1. బసవన్న గురించి తెలుసుకున్నారు కదా భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో రాయండి?
జ. 1. భక్తుడికి భక్తి ప్రధానంగా ఉండాలి.
2. ఎప్పుడు ఇతరుల ధనాన్ని ఆశించకూడదు.
3. భక్తుడికి, భక్తియే కామధేనువు, కల్పవృక్షం గా ఉండాలి.
4. భగవంతుడిని మీదనే మనసును నిమగ్నం చేయాలి.
5. భక్తియే తన యొక్క తత్వంగా ఉండాలి.
6. ఎటువంటి కోరికలు గాని ధనాశ గానీ ఉండకూడదు.
7. సాధ్యమైనంతవరకు ఇతరులకు సాయపడాలి.
8. మానవ సేవయే మాధవ సేవ గా భావించాలి.
9. ఇతరులకు ఎటువంటి హాని తలపెట్ట కూడదు.
10. ఇతరుల వలన ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని భగవంతుడే సర్వం అని భావించాలి.
భాషాంశాలు
1.గీత గీసిన పదానికి తగిన అర్థాన్ని రాయండి
క్షీరాబ్దిని మధించినప్పుడు అమృతం పుట్టింది.
జ . క్షీరాబ్ది = పాలసముద్రం
కొండ గుహలలో నివసించే మృగ పతి అడవికి రాజు.
జ . మృగపతి = సింహం
పుడమీశులు ప్రజలను చక్కగా పరిపాలించారు రాజులు
జ . పుడమీశులు = రాజులు
2. ప్రకృతి – వికృతులు
1. ఆశ్చర్యము - అచ్చెరువు
2. భక్తుడు - బత్తుడు
3. దిశ - దెస
4. పృద్వి - పుడమి
3. భాష గురించి తెలుసుకుందాము
ఈ క్రింది పట్టికను పూరించండి
4. అసామాన్యులు
పాఠం ఉద్దేశం
అన్ని వృత్తుల సమిష్టి సహకారంతో సమాజం కొనసాగుతుంది. వృత్తులు సమాజసేవలో తమవంతు పాత్రను పోషిస్తాయి. దేశాభివృద్ధికి మూలస్తంభాలుగా నిలిచినవి వృత్తులే!అయినా వాటికి ఆదరణ కరువైంది. వివిధ వృత్తులవారిపట్ల గౌరవాన్ని,శ్రమ విలువను పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం వ్యాసప్రక్రియకు చెందినది. వృత్తులు వ్యక్తి గౌరవానికి, సమాజాభివృద్ధికి ఎట్లా తోడ్పడుతాయో వివరిస్తూ,శ్రమ సౌందర్యాన్ని తెలియజేసే వ్యాసమిది.
III. స్వీయరచన
1. క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
1. ఆదివాసులు మనందరికీ మార్గదర్శకులు - అని ఎట్లా చెప్పగలరు? రాయండి.
జ. ఆహారం లేకుండా ఏ ప్రాణీ బ్రతకదు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఆహార విషయాలనుగూర్చి మొదట తెలిపినవారు ఆదివాసులు. వారు అడవులే అమ్మ ఒడిగా, కొండకోనలే తోడునీడగా జీవిస్తారు. వారు రాత్రింబవళ్ళు ప్రకృతితోనే కలిసి జీవిస్తారు.ఆ ప్రకృతిని బాగా పరిశీలిస్తారు. మనం ఏమి తినాలో, ఏం తినకూడదో చెప్పారు. ఈ విధంగా వారు చెప్పడానికి ఎన్నో ప్రయోగాలు చేశారు. వాటిని రుచి చూస్తారు. ప్రయోగాల సందర్భంలో ఒక్కోసారి ప్రాణాలను కూడా పోగొట్టుకుంటారు. జంతువుల మాంసం తినడానికి ముందు ఆయా జంతువులను నిశితంగా పరిశీలిస్తారు. ఆయా జంతువుల ఆహారపు అలవాట్ల పైన దృష్టి పెడతారు.వారి పరిశీలన, శ్రమ,త్యాగం ఎంతో గొప్పది. కోయలు, గోండులు, చెంచులు మొదలైన గిరిజనులకున్న ప్రకృతి విజ్ఞానం అసాధారణమైనది. చెట్లను గురించి వాళ్లకు తెలిసినంతగా మరెవ్వరికీ అంతగా తెలియదంటే అతిశయోక్తి కాదు. వాళ్లు కూడా శాస్త్రవేత్తలే. రోగాలు వచ్చినప్పుడు చెట్ల మందులతోనే ఆరోగ్యాన్ని తిరిగి పొందుతారు. ఈ విషయంలో గిరిజనుల దూరదృష్టి ద్వారా తరువాత తరాల వారికి చక్కటి మార్గం చూపారు. అందువల్ల ఆదివాసులు మన అందరికీ మార్గదర్శకులు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
2. కుమ్మరి గొప్పతనం గురించి మీరు ఏమనుకుంటున్నారో రాయండి.
జ. ఎండాకాలం వచ్చిందంటే కూజాలకు,కుండలకు మహా గిరాకి. జీవితంలో భాగమైనవి ప్రమిదలు. ఇవన్నీ చకచకా ఎలా వచ్చేస్తున్నాయి? కుమ్మరి చక్రం నుండి బంకమట్టి నుంచే. బంకమట్టి ఊరికే తయారవుతుందా? మెత్తటి మట్టి, బూడిద లేదా రంపపు పొట్టు, సన్న ఇసుకను కలిపి దీన్ని తయారు చేస్తారు. చెమటోడ్చి సిద్ధం చేసిన ఈ బంకమట్టిని బండి చక్రం లాంటి సారి మీద పెడతారు చక్రం మాత్రం ఊరికే తయారయిందా కమ్మరి, వడ్రంగి వాళ్ళ నైపుణ్యం కలగలిసి ఏర్పడింది అందులో ఎంతో ఇంజనీరింగ్ నైపుణ్యం తొంగి చూస్తుంది.
చక్రం తిప్పుతూ, చక్రం మీద పెట్టిన బంకమట్టిని చేతివేళ్ళ కొనలతో చాకచక్యంగా నొక్కుతారు. అత్యంత ఆశ్చర్యంగా అనుకున్న రూపాలు అమాంతంగా వచ్చేస్తుంటాయి. ఆ చేతుల్లో ఇంద్రజాల విద్య ఉందా అనిపించక మానదు. తయారైన మట్టిపాత్రలను ఆరబెడతారు. తరువాత “కుమ్మర ఆవము” లో పెట్టి బురదమట్టితో కప్పేస్తారు. దీనివల్ల కొలిమిని మండిస్తే అన్ని పాత్రలకు ఆ వేడి అందుతుంది. పాత్రలన్నీ బాగా కాలి గట్టిగా తయారవుతాయి.
3. రైతులు మన అన్నదాతలు సమర్థిస్తూ రాయండి.
జ. ఒక్కరోజు ఆహారం లేకుంటే తల్లడిల్ల్లుతాం. పిడికెడు మెతుకుల కోసం పడరాని పాట్లు పడే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎవరి పని చేసినా కడుపు నింపుకోవడానికే. మనం తినే అన్నం,కూరగాయలు, పండ్లు సులువుగా వచ్చి పడేవి కావు. చెమటోడ్చి పని చేసిన రైతుల కృషి ఫలాలివి. ఎండనక, వాననక, రేయింబవళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని రైతు శ్రమిస్తే మనం హాయిగా తినగలుగుతున్నాం. భారతదేశపు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు “జై జవాన్ జై కిసాన్” నినాదం ఇచ్చారు. సమాజానికి రైతు చేసే సేవ ఎంతో గొప్పది.
ఈ దేశానికి రైతు వెన్నుముక లాంటి వాడు. అతడు అలిగితే మనకు అన్నం దొరకదు. నడుమొంచి కష్టపడి పంటలు పండిస్తారు. రైతు తాను మాత్రం పస్తులుంటాడు. సమాజానికి మాత్రం తిండి పెడతాడు. రాత్రి పగలు కష్టపడి పనిచేస్తే సోమరితనం వద్దని చాటి చెప్తాడు.ఎండలో తిరుగుతాడు, వానలో తడుస్తూ, చలిలో వణుకుతాడు అయినా అతని ధైర్యం మాత్రం సడలదు. జాతి సేవలు పునీతం అవుతాడు.
4. దేహానికి అవయవాలు ఎంత ముఖ్యమో సమాజానికి అన్ని వృత్తులవాళ్ళు అంతే అవసరం - దీన్ని సమర్థిస్తూ, మీ సొంతమాటల్లో రాయండి.
జ. ప్రతి ఒక్క వృత్తిలోను ఎంతో కొంత శ్రమ, నైపుణ్యం తొంగి చూస్తాయి. ప్రతి వృత్తి పవిత్రమైనదే. దేన్ని చిన్న చూపు చూడ వలసిన పనిలేదు. ఎవరి ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉన్నా మంగళవాద్యాలు, కుండలు, ఆభరణాలు, వస్త్రాలు మొదలైనవన్నీ కావాలి అంటే ఇన్ని వృత్తులవారు సహకరిస్తేనే ఏ కార్యాలయినా జరుగుతాయి. ఇలా అందరూ పరస్పరం సహకరించుకుంటేనే సమాజం నడుస్తుంది. అంతే కానీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటే సమాజ అభివృద్ధి కుంటుపడుతుంది. ఇందులో ఎక్కువ తక్కువ తేడాలు మన మనస్సుల్లో ఉండకూడదు. శరీరంలో కళ్ళు, చెవి, ముక్కు, కాళ్ళు, చేతులు వీటిలో ఏవి గొప్ప అంటే అన్నీ కలిసి ఉంటేనే శరీరం. అలాగే అందరూ కలిసి ఉంటేనే సమాజం. అందువల్ల మనమంతా అన్ని వృత్తులను అన్ని వృత్తుల వారిని ఆదరించాలి. అప్పుడే మన ప్రాచీన సంప్రదాయ కలలు చిరస్థాయిగా నిలుస్తాయి.
2. క్రింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
1. “శ్రమ పునాదిపైనే అభివృద్ధి అనే భవనం నిర్మించబడుతుంది” అని ఎట్లా చెప్పగలరు? కారణాలు వివరిస్తూ రాయండి.
జ. పునాది గట్టిగా ఉంటేనే భవనము ఎంతకాలమైనా నిలబడుతుంది. అలాగే శ్రమిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. నిరంతర శ్రమ మానవుడిని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. ప్రేమించకుండా దేనిని పొందిన అది నిలబడదు. స్వయంకృషితో సాధించిన దానిని ఆనందంగా అనుభవించవచ్చు. ఎంతో శ్రమించి స్వాతంత్రాన్ని పొందాము గనుకనే నేడు ఇంత ఆనందంగా దానిని అనుభవిస్తున్నాము. యాచనతోనూ దానము చేయబడినదానితోనో అనుభవించినది శాశ్వతంగా నిలబడదు. శ్రమతోనే ప్రయోజకులము కాగలము. పరిజ్ఞానం పెంచుకోగలము. కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయని అంటారు. అందుకే శ్రమైక జీవనమే శ్రేయోదాయకం. పశువుల అయిన తమ ఆహారాన్ని తామే సంపాదించుకుంటాయి. మానవుడు మాత్రమే పరాయి ధనానికి ఆశపడతాడు. పశుపక్ష్యాదుల నుండి మానవుడు నేర్చుకోవలసినది ఎంతైనా ఉంది. సీమ ద్వారానే ప్రగతి సాధ్యమౌతుంది. ఎందుకని మానవుడు నిరంతర శ్రమ జీవి కావాలి. పెద్దలు సంపాదించిన దానితో తృప్తి పడక స్వీయ సముపార్జన చేసి ధనాన్ని విజ్ఞానాన్ని పెంచుకోవాలి. తన కాళ్లమీద తాను నిలబడుతూ పది మందికి ఆదర్శం కావాలి. నిరంతరం శ్రమ అనే పునాది మీద నిలబెట్టిన అభివృద్ధి అనే భవనం శాశ్వతంగా ఉంటుంది.
IV. సృజనాత్మకత /ప్రశంస
1. మీ గ్రామంలోని వృత్తిపనుల వారిని గురించిన ఒకరి వివరాలను సేకరించడానికి ప్రశ్నావళిని తయారు చేయండి.
జ.
నమస్కారం! మీ పేరేమిటి?
మీరు ఏం పని చేస్తారు?
మీరు చేస్తున్న ఈ వృత్తి కుల వృత్తియా?
మీరు ఏ ఏ పనిముట్లను ఉపయోగిస్తారు?
ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారాన్ని ఆశిస్తున్నారు?
మీరు తయారు చేస్తున్న ఈ వస్తువుల కు మద్దతు ధర లభిస్తున్నదా?
ఈ వృత్తిలో మీరు ఎదుర్కొంటున్న ఆటుపోట్లు ఏమిటి?
చివరగా వృత్తి ద్వారా మీరు సాధించిన అభివృద్ధిని గురించి చెప్పండి?
V పదజాల వినియోగం
I.కింది పదాలకు సొంత వాక్యాలు రాయండి.
చేదోడు వాదోడు
నిరుపేదలకు కష్టసమయాల్లో ధనవంతులు చేదోడువాదోడుగా ఉంటారు.
చాకచక్యం
ఉద్యోగులు విధి నిర్వహణలో చాకచక్యం ప్రదర్శిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది.
II. ప్రకృతి – వికృతులు
భక్తి బత్తి
గౌరవం గౌరవం
ఆహారం ఓగిరం
విద్య విద్దే
రాత్రి రాతిరి
III. కింది వాటికి పర్యాయపదాలు రాయండి.
చెట్టు - తరువు, వృక్షం, మహీరుహం
పాదము -చరణము,అడుగు,అంఘ్రి
వ్యవసాయం - సేద్యము, కృషి, సాగు
VI భాషను గురించి తెలుసుకుందాం
కింది పట్టికలోని వాక్యాలలో క్రియాభేదాలను గుర్తించి రాయండి.
అసమాపక క్రియ సమాపక క్రియ
వెళ్లి కొన్నది
చదివి చెప్పాడు
గీసి వేసింది
ఎక్కి వెళ్ళింది
వచ్చి వెళ్ళాడు
తిని తాగారు
కింది వాక్యాలను కలిపి రాయండి.
అ)విమల వంట చేసి పాటలు వింటుంది.
ఆ) అమ్మ నిద్రలేచి ముఖం కడుక్కున్నది.
ఇ) రవి ఊరికి వెళ్లి మామిడిపండ్లు తెచ్చాడు.
కింది వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా రాయండి.
అ) రజిత అన్నం తిని బడికి వెళ్ళింది.
ఆ) వాళ్లు రైలు దిగి ఆటో ఎక్కారు.
ఇ) రాజన్న లడ్డూలు తెచ్చి అందరికీ పంచాడు.
కింది వాక్యాలు చదువండి కలిపి రాయండి .
అ) వర్షాలు కురవడంతో పంటలు బాగా పండాయి.
ఆ) అతనికి కనిపించిన చదువలేడు.
కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
అ) వారు గొప్పవారు, తెలివైనవారు.
ఆ) సుధా మాట్లాడదు, చేసి చూపిస్తుంది.
ఇ) మేము రాము, చెప్పలేము
"శ్రమయేవ జయతే "
ఉపవాచకం: 2. షోయబుల్లాఖాన్
చెర్విరాల బాగయ్య గారు బుర్రకథ ప్రారంభంలో ఎవరెవరిని ప్రార్థించాడు? ఎందుకు?
జ:- సాధారణంగా బుర్రకథ ప్రారంభంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనో లేక విఘ్నేశ్వరుడినో, గ్రామదేవతనో ప్రార్థిస్తారు. కాని ఇక్కడ బుర్రకథ పోరాట యోధుడైన షోయబుల్లాఖాన్ గురించి. అందుకే వీరులనుగన్న భారతమాతను, జాతిపిత మహాత్మాగాంధీని, జవహర్‌లాల్ నెహ్రూను, సుభాష్ చంద్రబోస్ ను, సర్దార్ వల్లబాయ్ పటేల్ ను ప్రార్థించాడు.
షోయబుల్లా ఖాన్ గురించి మీ సొంత మాటల్లో రాయండి.
జ:- భాగ్యనగరంలోని మానుకోట తాలూకా, శుభ్రవాడు గ్రామంలో హబీబుల్లాఖాను పుణ్య దంపతులకు షోయబుల్లాఖాన్ జన్మించాడు. నిజాం ప్రభుత్వంలో రజాకార్లు చేసే ఆకృత్యాల గురించి తాజ్వీ అనే ఉర్దూ పత్రికలో రాస్తుండేవాడు. మహమ్మదీయుడై ఉండి సాటి మహమ్మదీయులకు విరుద్ధంగా నడుచుకోవడం మూలంగా ఆ పత్రిక ఆపివేయబడింది.
ఆ తరువాత షోయాబుల్లా ఖాన్ ఇమ్రోజ్ అనే దినపత్రికను ప్రారంభించెను. ఇతను గొప్ప జాతీయతావాది, గాంధీ సిద్ధాంతాలు అనుసరించేవాడు. ధైర్యంగా నిజాంకు విరుద్ధంగా, ప్రజలకు అనుకూలంగా తన భావాలను పత్రిక ద్వారా వెల్లడించేవాడు. ఆ కారణంగా 1948, ఆగష్టు 22న అర్థరాత్రి 12:30 గంటలకు రజాకార్లు వేటకుక్కల వలె వెంటాడి తుపాకులతో కాల్చి చంపేసారు.
షోయబుల్లాఖాన్ కు బెదిరింపు ఉత్తరాలెవరు రాశారు? ఎందుకు?
జ:- షోయబుల్లా ఖాన్ తన ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిజాం పాలన గురించి, రజాకార్ల ఆకృత్యాల గురించి రాస్తుండేవాడు. ఒక మహమ్మదీయుడై ఉండి మహమ్మదీయ పాలనను విమర్శించడం జీర్ణించుకోలేక పోయారు తోటి మహమ్మదీయులు.
కొందరు కిరాతకులు తన ప్రవర్తనను మార్చుకొమ్మని బెదిరింపు జాబులు రాశారు. మార్చుకోకపోతే ప్రాణాలు దక్కవని ఎన్నో తీర్ల బెదిరించారు. షోయాబుల్లా ఖాన్ గాంధీ సిద్ధాంతాలు ఆచరించేవాడు. ఒకనాడు ఊరు, పేరు లేని ఉత్తరం వచ్చింది. అందులో 'నీవు గాంధీ కొడుకువా' జాగ్రత్త డొక్క చీల్చి వేస్తాం. అని రాసి ఉంది. ఇలాంటి ఎన్ని ఉత్తరాలొచ్చిన్నా బయపడలేదు, వెనకడుగు వేయలేదు షోయాబుల్లా ఖాన్. మరునాడే రజాకార్ల ఆకృత్యానికి బలయ్యాడు.
5. శతక సుధ
-శతక కవులు
స్వీయ రచన
1. క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
1. త్రుచ్ఛ సౌఖ్య సంపాదనకై అబద్ధములు బల్కకు వాదములాడబోకు అని భాస్కర కవి ఎందుకు చెప్పి ఉంటాడు?
జ. త్రుచ్చ సౌఖ్య సంపాదన కై అబద్ధం బల్కకు వాదములడబోకు అని కవి ఎందుకు అన్నాడు అంటే అబద్ధం ఆరిపోయే దీపం వంటిది. మనం మాట్లాడిన అబద్ధం ఎప్పటికైనా బయటపడుతుంది. అప్పుడు సమాజంలో మన గౌరవానికి భంగం వాటిల్లుతుంది. అనవసరంగా వాదనలు ఆడితే శత్రుత్వం పెరిగి ఒక్కొక్కసారి ప్రమాదాలకు దారి తీయవచ్చు. అబద్ధాలాడి సంపాదించిన సంపాదన శాశ్వతంగా నిలువదు. దానివల్ల తాత్కాలిక ఆనందం లభించవచ్చు గాని ఒక్కొక్కసారి అబద్ధం అనర్థాలకు దారి తీస్తుంది. పార్టీ వల్ల మనకు ఏమి ప్రయోజనం కలగకపోగా ఇతరులకు హాని కలుగుతుంది. ఇలా కాక అబద్ధాలు ఆడకుండా వాదములు ఆడకుండా ఉండే సూత్రాలు మనకు వేదాలని అవి వివేకులకు సంపదలు గా బాసిల్లు తాయనీ భాస్కర కవి చెప్పారు.
2. వివేక వంతుని కి ఉండవలసిన లక్షణాలు ఏవి?
జ. సమాజంలో మానవులు ఆలోచించి, విజ్ఞతతో, వివేకంతో మెలగాలి. అటువంటి వివేకవంతుడు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఏపని చేసినా ఇతరులకు మేలు కలిగే విధంగా ఆలోచించాలి. అవివేకంతోనో, కోపంతోనో పనులు చేస్తే అవి వారికి ఇతరులకి కీడు చేస్తాయి. వివేకం కలవారు ఎదుటి వారిని అంచనా వేయగలిగిన నైపుణ్యం కలిగి ఉండాలి. వివేకవంతుడు వేదాలని సూత్రాలుగా భావిస్తాడు. పేదవారికి అన్నదానం,వస్త్రదానం చేయాలి. నిజమైన సుఖాల కోసం అబద్ధాలు ఆడక పోవడం అనవసరం గా ఎవరితో వాదనకు దిగకపోవడం హద్దుమీరి ప్రవర్తించక పోవడం అందరితో స్నేహంగా మెలగడం ఈ సూత్రాలనే వేదాలు గా భావించడం ఇవన్నీ వివేక వంతునికి ఉండవలసిన లక్షణాలు.
3. పెంపున తల్లివై అనే పద్యం లోని ఆంతర్యాన్ని మీరు ఏమి గ్రహించారు?
జ. సమాజంలో తల్లిదండ్రుల రుణాన్ని పిల్లలే తీర్చుకోవాలి. పిల్లలు తల్లిదండ్రుల ద్వారా సమాజం గురించి నేర్చుకుంటారు. వారు చిన్నతనం నుండి తమ తల్లిదండ్రుల పర్యవేక్షణ లో మంచి లక్షణాలు అలవర్చుకుంటారు. పెంపకంలో తల్లిని మించిన వారు మరొకరు ఉండరు. మనిషిని మంచి మార్గంలో పెంచే తల్లి, చెడు మార్గంలో నడవకుండా చూసే తండ్రి, శరీర రోగాలు తొలగించే వైద్యుడు, స్థిరస్థాయిగా నిలిచే మోక్షం, దయతో మేలైన సంపదలను ఇవ్వడానికి దయాసముద్రుడైన రాముడే దిక్కు అని గ్రహించాను.
4. కోరికలకు బానిసై ఉక్కిరిబిక్కిరి కావడం కంటే విశిష్ట మార్గాన్ని వెతుక్కోవడం మంచిది దీనిపై మీ అభిప్రాయాన్ని రాయండి?
జ. మానవుడు సంఘజీవి. సంఘంలో అందరితో కలిసి జీవించాలి.పరస్పర సహకారం పొందాలి. కలిసి జీవించినప్పుడు ప్రేమానురాగాలు పెరుగుతాయి. అన్ని పనులలో పాలుపంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్వార్థం పెరుగుతుంది.సిరి సంపదలపై వ్యామోహం పెరుగుతోంది. కోరికలు పుట్టుకొస్తాయి. వాటిని సంతృప్తి పరిచే లోపే మరో కోరిక పుడుతుంది. ఇలా మానవుడు కోరికలకు బానిసై పోతున్నాడు. తన చుట్టూ ఉన్న వారితో కుటుంబ సభ్యులతో వివిధ అనుబంధాలను సృష్టించుకుంటూ సుడిగుండాలలో పడి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. కానీ మంచి వారి దారి లో నడిచే ఆలోచన చేయడం లేదు. స్వార్ధ రహితంగా ఆలోచించడంలేదు. ఇలా కాకుండా భగవంతుని యందు ధ్యానం, ధ్యాస కలిగి ఉం డి విశిష్ట మార్గాన్ని ఎంచుకోవడం వల్ల మోక్షం సంపాదించవచ్చు.
2. క్రింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబు రాయండి.
1. శతక కవులు ఈ విధమైన పద్యాలను ఎందుకు రాసి ఉంటారో కారణాలు రాయండి.
జ. శతక కవులు ఈ విధమైన పద్యాలను రాయడానికి గల కారణాలు:-
సమాజంలో మానవులు వివిధ రకాలు వారి పరిసరాల ప్రభావాన్ని బట్టి వారి నడవడికలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పుల్లో మంచి-చెడు అనేవి ఉంటాయి. సహాజం గా చెడుకు ఆకర్షణ ఎక్కువ కాబట్టి ప్రజలు తొందరగా ఆకర్షితులవుతారు.
ఆ చెడును ఆచరించి వివేకాన్ని కోల్పోయి విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి చుట్టు పక్కల ఉన్న వారికి సమాజానికి హాని జరుగుతుంది. కావున ఆకర్షితులు కాకుండా ప్రజలను సన్మార్గంలో నడిపించే ఆరోగ్యకరమైన పరహిత మైన సమాజాన్ని నెలకొల్పడానికి శతక కవులు వారి ప్రయత్నంగా ఈ విధమైన నీతి పద్యాలు రాసి మనకు అందించారు. శతక పద్యాలు చెప్పే నీతులు నాటికీ నేటికీ ఆదర్శప్రాయమైనవి. వాటిని విని చదివి మనం అందరికీ మంచి చేయాలనే ఆలోచనను ధ ర్మార్థ కామామొక్షలను సాధించాలనే పట్టుదల పెంచుకోవాలి. లోకానికి ఉపకారం కలిగించే కార్యాలు చేయాలి. నీతికి సంబంధించిన నైతిక విలువలు కాపాడాలి. ధర్మాలను పాటించాలి. అనుభవంతో ఇచ్చే సలహాలను సూచనలను తీసుకోవాలని ఈ విధంగా పద్యాలను చదివి అర్థం చేసుకోవడం వల్ల సత్ప్రవర్తన కలిగి ఉండి లోకంలో ఉన్నత స్థితి ని పొందవచ్చు.
పదజాలం
1. క్రింది వాక్యాలలోని సమానార్ధక పదాలను గుర్తించి గీత గీయండి.
ఇతరుల దోషాలు ఏం చేసేవారు తమ తప్పులు తాము తెలుసుకోలేరు.
తేనెపట్టు నుండి తేనెను సేకరిస్తాయి ఆ మధువు తియ్యగా ఉంటుంది.
2. ఈ క్రింది వాక్యాలలో లోని గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
సహృదయత గలవారికి సమాజంలో గౌరవం లభిస్తుంది.
సహృదయత = మంచి మనసు
పూలతో పాటు దండలోని దారం కూడా పరిమళిస్తుంది.
పరిమళం = సువాసన
సజ్జనులతో మైత్రి ఎప్పటికీ సంతోషాన్నిస్తుంది.
మైత్రి =స్నేహం
3. క్రింది ఇవ్వబడిన ప్రకృతులకు వికృతులు వికృతులకు ప్రకృతులు రాయండి
III. భాషను గురించి తెలుసుకుందాం
1.క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి
దశేంద్రియాలు = దశ +ఇంద్రియ = గుణ సంధి
లక్షాధికారి = లక్ష +అధికారి = సవర్ణదీర్ఘ సంధి
పట్టెడన్నం = పట్టెడు +అన్నము = ఉత్వ సంధి
రాతికంటూ = రాతికి+ అంటూ = ఇత్వ సంధి
చాలకున్న = చాలక +ఉన్న = అత్వ సంధి
2. క్రింది విగ్రహ వాక్యాలకు సమాన పదాలు రాసి సమాసం పేరు రాయండి.
ఆకలి దప్పికలు = ఆకలియు,దప్పికయు = ద్వంద్వ సమాసం
అన్నవస్త్రాలు = అన్నమును,వస్త్రమును = ద్వంద్వసమాసం
దశేంద్రియాలు = దశఅనుసంఖ్యగలఇంద్రియాలు = ద్విగుసమాసం
నాలుగు వేదాలు = నాలుగైనవేదాలు = ద్విగుసమాసం
L-6.తెలుగు జానపద గేయాలు
పాఠం ఉద్దేశం
తెలుగువారి ఆచార,సంప్రదాయాలను,తాత్వికతను,చరిత్రను తెలిపే తెలుగు జానపదగేయాల గొప్పతనం,వాటి వైవిధ్యం తెలియజేయుటే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. ఈ పాఠ్యాంశం ఆచార్య బిరుదురాజు రామరాజు రాసిన వ్యాసం.
కవి పరిచయం
కవి పేరు:-ఆచార్య బిరుదురాజు రామరాజు
పాఠ్యభాగం పేరు:- తెలుగు జానపద గేయాలు
జననం:-16-4-1925
మరణం:-8-2-2010
జన్మస్థలం:-దేవునూరు గ్రామం,వరంగల్ జిల్లా.
వృత్తి: కవి,పరిశోధకుడు,అనువాద రచయిత,సంపాదకుడిగా ప్రసిద్ధుడు.ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులుగా,డీన్ గా పనిచేశాడు.
ఇతర రచనలు :-తెలుగు జానపద గేయ సాహిత్యం ఈయన పరిశోధన గ్రంథం.చరిత్రకెక్కని చరితార్థులు,ఆంధ్రయోగులు, మరుగున పడిన మాణిక్యాలు,ఉర్దూ తెలుగు నిఘంటువు, తెలుగు జానపదరామాయణం, తెలంగాణ పల్లెపాటలు,తెలంగాణ పిల్లల పాటలు మొదలైనవి ఈయన ఇతర రచనలు.
III.స్వీయరచన
I.ఈ క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
1. జానపద గేయాలను ఎందుకు భద్రపరచాలి ?
జ . తెలుగు జానపద గేయాలు కూడా విలక్షణమైన సాహిత్య ,సంస్కృతిక విలువలు సంతరించుకున్నాయి . జానపదుల నోటినుండి అప్రయత్నంగా వెలివడిన గేయాలలో చక్కని శిల్పం దాగిఉంది . జానపద గేయాలను శ్రామికులు ఎంతో చక్కగా పాడుకుంటారు. ఈ గేయ సంపదను భద్రపరిచి విశ్లేషించి, పరిశీలించడం ఎంతైనా అవసరం. ఈ గేయ సంపదను భద్రపరిచడం వలన వాటిని ముందు తరాల వారికి అందించవచ్చు. భవిష్యత్ కాలం వారికి ఈ జానపద గేయాలు అందించవచ్చు. భవిష్యత్లోఈ జానపద గేయాల ద్వారా మన దేశ సాహిత్య, సంస్కృతిక ,సంప్రదాయాలను తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఇటువంటిజానపద గేయాలను తప్పకుండా భద్రపరిచాలి .
2. జానపద గేయాల్లోరామాయణ సంబంధమైన గేయాలు ఎక్కువగా ఉండటానికి కారణాలు ఏమిటి ?
జ. జానపద గేయాలకు పురాణేతిహాసాలనుండి కధావస్తువును స్వీకరిస్తారు. రామాయణలలో అనువాదాలలో,మూలం లో లేని ఎన్నో గాధలు కానవస్తాయి. పౌరాణిక గాధలపైన గ్రామీణులు గొప్ప భక్తి ప్రేమాభిమానాలు చూపుతారు. పురాణాలలోని అమూల్యమైన ప్రదేశాలను విద్యావంతులు చదివి అర్థం చేసుకుంటారు. పామరులు జానపద గేయాల ద్వారా గ్రహిస్తారు. శిష్ట సాహిత్యంలో మాదిరిగానే ఇతరగాథల కంటే రామాయణ సంబంధమైన గాథలే జానపద గేయాలలో అధికంగా ఉంటాయి. ఎందుకంటే రామరాజ్యం వంటి రాజ్యం, రాముడు వంటి కొడుకు, సీత వంటి భార్య, లక్ష్మణ, భరత, శత్రుఘ్నడు వంటి తమ్ముళ్లు లేరని అని చెప్తుంటారు. మన హిందువులకు ఆదర్శం రామ రాజ్యం. రాముడే దేవుడు మరి ఆ రాముడి కథ అయినా రామాయణం జానపద గేయాలలో ఎక్కువగా ఉంటుంది.
3. గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది -దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జ. గృహ జీవనంలో స్త్రీకి, పురుషుని కంటే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. “ఇల్లాలే ఇంటికి దీపం” అని అంటారు పెద్దలు. పెళ్లయి అత్తవారింట అడుగు పెట్టింది మొదలు స్త్రీ అనేక బాధ్యతలను నిర్వహిస్తుంది. భార్యగా తన భర్త అవసరాలతో పాటు, మెట్టినింట్లో అందరి అవసరాలను కనిపెట్టుకుని బాధ్యతగా ఆయా పనులు నిర్వహిస్తుంది. గౌరవాన్ని పెంచటానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. సంపాదించడానికి బయటకు వెళ్లి అలసిపోయి వచ్చిన భర్తకు భార్య ఆలంబనగా నిలుస్తుంది. అత్తమామలను, ఆడబిడ్డలను, మరుదులను ఆప్యాయంగా ఆదరిస్తుంది. పిల్లల సంరక్షణలో గాని, గృహ నిర్వహణలో గాని తనదైన పాత్రను పోషిస్తుంది. సంతానాన్ని కని, ఆ వంశాన్ని గౌరవాన్ని నిలబెడుతుంది. గృహ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే దానికి స్త్రీయే మూలస్తంభం వంటిది అని నా అభిప్రాయం.
4. శ్రామిక గేయాల ప్రాముఖ్యత ఏమిటి?
జ. కవిత్వం కేవలం ఉల్లాసం కల్పించుకోవడం కోసమే కాక, కష్టాన్ని తెలియకుండా చేసేవిగా కూడా ఉపయోగపడుతుంది. స్త్రీ, పురుషులు కాయకష్టం చేసేటప్పుడు అలసట చెందకుండా ఉండేందుకు అప్రయత్నంగా వారు నోటితో ఏవో ఒక కూనిరాగాలు తీస్తారు. ఈ కూనిరాగాలే జానపద గేయాలుగా పరిణమించాయి. వ్యవసాయ కార్మికులు నాట్లు వేస్తూ, కుప్ప నూరుస్తూ, బరువును మోస్తూ, ఆ కష్టాన్ని మర్చిపోవడానికి జానపద గేయాలు పాడుకుంటూ ఉంటారు. ఈ పాటలు పాడుతూ పని చేయడం వల్ల శారీరక శ్రమను కూడా మర్చిపోయి ఆహ్లాదాన్ని పొందుతారు. కార్మిక గీతాలకు వస్తువు ఏదైనా ఉండవచ్చు. వృత్తికి సంబంధించిన పాటలు పాడుకుంటారు. ఈ శ్రామిక గేయాన్ని వారి పని పాటలకు అనుగుణంగా ఉంటాయి. శ్రామికుల శరీరభాగాల కదలికలు, ఉచ్ఛ్వాస ,నిశ్వాసలు ఈ జానపద గీతాలకు తాళాన్ని, లయను సమకూరుస్తాయి.
II. ఈ క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
1. స్త్రీల పాటల్లో తెలుగువారి సాంఘిక,సాంస్కృతిక జీవనం పూర్తిగా కనిపిస్తుంది- ఎట్లాగో వివరించండి?
జ. స్త్రీ జీవితంలో వివాహం అతి ముఖ్యమైన ఘట్టం.ఆడపిల్ల పెళ్లి చేసే ముందు పుట్టింట్లో తల్లి తన బిడ్డకు అత్తింట్లో ఎలా ఉండాలో ఆటల ద్వారా తెలుపుతుంది పెళ్లికి సంబంధించిన వివిధ ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు లాంఛనాలు పరిహాసాలు వర్ణిస్తూ బోలెడు జానపద గేయాలు ఉద్భవించాయి. ఇక పెళ్లి పాటలు కట్నాల తో ప్రారంభమై అప్పగింతల తో ముగుస్తాయి. కి పాటలు ఎన్ని కిలో తెలుగువారి సాంస్కృతిక జీవనం పూర్తిగా ఆవిష్కృతమవుతుంది. పండుగల సందర్భంలో ఆ పండుగ విశిష్టతను తెలిపే పాటలను స్త్రీలు పాడుతుంటారు. సంసారం విషయాలకు సంబంధించిన పాటలకు స్త్రీలే ఆలంబన వీటిని స్త్రీల పాటలు అనవచ్చు. వీటిలో వాస్తవికత ఎక్కువ శిశుజననం పురస్కరించుకుని అనేక రకాల పాటలు పాడతారు లాలి పాటలు జోల పాటలు పాడి నిద్రపు చ్చుతారు. తన కుమారుడిని వీరునిగా చేయడానికి వీరత్వం కలిగిన పాటలు పాడతారు.దీని ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలు బహిర్గతమవుతాయి తద్వారా సాంస్కృతిక జీవనం పునరుద్ధరించ బడుతోంది.
2. జానపద గేయాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి దీన్ని వివరిస్తూ రాయండి.
జ.జానపద గేయాలు శక్తిని చైతన్య స్ఫూర్తిని తెలుగు ప్రజల జీవన స్రవంతి నుంచే పడ్డాయి అందువల్ల మతపరమైన ఉద్యమాలు మహాపురుష గాధలు ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు సౌందర్య విషయాలు విషాద వృత్తాంతాలు ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు ప్రజల జీవితం యావత్తు జానపద గేయాల మధుర మంజుల శృతిలో ప్రతిధ్వనిస్తుంది. రాజుల చరిత్రలు వీరగాథలు పౌరాణిక గాథలు దేవతామూర్తుల పండుగలకు సంబంధించిన విశేషాలు జానపద గేయాలు సజీవంగా ఉంచుతాయి. ఈ జానపద గేయాలు మనం చూడని చరిత్రను చూపిస్తాయి. మనం విననీ ఈ కథలను వినిపిస్తాయి. మనం చేయాల్సిన పనులను బోధిస్తాయి ఒక్కముక్కలో చెప్పాలంటే ప్రాచీన కాలానికి భవిష్యత్ తరానికి పనిచేస్తాయి. ఈ జానపద గేయాలు మన సంస్కృతికి ప్రతిబింబాలై పనిచేస్తాయి.
V.సృజనాత్మకత / ప్రశంస
1. వారం రోజుల పాటు వివిధ జానపద కళారూపాల ప్రదర్శన జరుగుతుంది.ఏ కళారూపం ఏ రోజు,ఏ సమయంలో ప్రదర్శించబడుతుందో,ఎక్కడ ప్రదర్శించబడుతుందో మొదలైన వివరాలతో ఒక ఆహ్వాన పత్రికను తయారు చేయండి.
జ. జానపద కళావారోత్సవాలు
ఆహ్వాన పత్రిక
సోదర సోదరీమణులారా! తెలంగాణ సాంస్కృతిక వారధి వారు ది.03-10-2021 నుండి10-10-2021. వరకు నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో జానపద కళారూపాల ప్రదర్శన జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు జరుగుతుంది.
ప్రదర్శన వివరాలు:
ది. 3-10-2021: రోజున ముఖ్యమంత్రి చే ప్రారంభోత్సవం ముందుగా తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బోనాల ప్రదర్శన.
ది. 4-10-2021 : ఒగ్గుడోలు తప్పే దరువు వలసపోయిన పాలమూరు నాటక ప్రదర్శన.
ది. 5-10-2021: జడకోలాటం చిందు బాగోతం పీర్ల అసైదుల ప్రదర్శన.
ది. 6-10-2021: గుస్సాడి నృత్యం యక్షగాన ప్రదర్శన భద్రం కొడకా నాటక ప్రదర్శన.
ది. 7-10-2021: బుర్రకథ కోలాటం అంతడుపుల నాగరాజు బృందంచే పల్లె తెల్లారింది నిత్య ప్రదర్శన.
ది. 8-10-2021: గొల్ల బీరప్ప ఒగ్గు కథ తోలుబొమ్మలాట షేక్ మహ్మద్ బృందంచే గజల్స్ షాయిరి.
ది. 9-10-2021: తెలంగాణ సంస్కృతి వారధి అధ్యక్షులు రసమయి బాలకిషన్ గారిచే ఉపన్యాసం జానపద గేయాలపన. గోరేటి వెంకన్న జానపద గేయాలు ప్రదర్శన.
వరంగల్ శ్రీనివాస్ బృందంచే పేరడీ నృత్య ప్రదర్శన.
పై కార్యక్రమాలన్నీ ఆయా తేదీలలో ప్రదర్శించబడతాయి కావున ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి.
V.పదజాల వినియోగం
కింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరో రెండు పదాలను రాయండి.
1. కవితా సౌరభం వెదజల్లుతుంది.
సౌరభం :సువాసన, పరిమళం.
2. గృహ జీవనానికి స్త్రీలే ఆలంబనం.
ఆలంబనం : ఆధారం, ఊతం,ఆశ్రయం
3.భక్తి మార్గం మోక్ష సాధనం.
మోక్షం: ముక్తి, కైవల్యం.
4. కాయకష్టం చేసే వారు కొందరు తినేది అందరూ.
కాయకష్టం : శ్రమ,ఇక్కట్లు
2కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి.
1. పురోగతి: విద్యార్థులు చదువుల్లో పురోగతి సాధించాలి.
2. రూపురేఖలు: తెలంగాణ స్వయం పాలనతో కొత్త రూపురేఖలను దాల్చుకుంటున్నది.
3. కూనిరాగాలు: శ్రామికుల కూనిరాగాలు జానపద గేయాలుగా రూపొందాయి.
VI.భాషను గురించి తెలుసుకుందాం.
1.క్రింది వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
1. మామయ్య ఇంటికి వచ్చాడు.మామయ్య కాఫీ తాగాడు.
జ. మావయ్య ఇంటికి వచ్చి కాఫీ తాగాడు.
2. కొమ్మ విరిగిపోయింది. కొమ్మ కింద పడింది.
జ. కొమ్మ విరిగి కింద పడింది.
3. శత్రువులు భయపడ్డారు. శత్రువులు పారిపోయారు.
జ. శత్రువులు భయపడి పారిపోయారు.
2. కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
1. శివ అన్నం తిన్నాడు. శివ పండ్లు తిన్నాడు.
జ. శివ అన్నం మరియు పండ్లు తిన్నాడు.
2. ఆమె పూలు తెచ్చింది. ఆమె కొబ్బరికాయ తెచ్చింది.
జ. ఆమె పూలు మరియు కొబ్బరికాయ తెచ్చింది.
3. నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. వర్షం పడలేదు.
జ. నల్లని మబ్బులు కమ్ముకున్నాయి కానీ వర్షం పడలేదు.
తత్పురుష సమాసము
విభక్తి ప్రత్యయాలతో కూడిన సమాసాలను తత్పురుష సమాసాలు అంటారు.
విభక్తులు బాగా నేర్చుకోవలెను.
4. కింది పదాలు చదువండి.వాటికి విగ్రహ వాక్యాలు రాయండి.అవి ఏ తత్పురుష సమాసాలో రాయండి.
1) గదను ధరించినవాడు - ద్వితీయా తత్పురుష సమాసం
2) అగ్ని వలన భయము -పంచమీ తత్పురుష
3) గుణము చేత హీనుడు -తృతీయా తత్పురుష
4) ధనము నందు ఆశ -సప్తమీ తత్పురుష
5) దైవము నందు భక్తి-సప్తమీ తత్పురుష
6) జ్ఞానం కానిది - నఇ తత్పురుష
ఉపవాచకం: 3. చిందు ఎల్లమ్మ
చిందు భాగోతం గురించి రాయండి.
జ:- చిందు భాగోతం అన్నా యక్షగానం అన్నా రెండూ ఒకటే. ఇది ఒక జానపద కళ. యక్షగానం పుస్తకాల నుండి కొన్ని అంశాలు తీసుకొని, దాన్ని భాగోతానికి అనువుగా మార్చుకుంటారు. రాగానికి అనుకూలంగా పదాలను మార్చుకుంటారు. ఈ భాగోతం ఆడేందుకు పుంగి ఊదుతారు. తబలా, పేటి, తాళం, గజ్జెలు కూడా ఉపయోగిస్తారు. ఎండిపోయిన ఆనిగెంకాయ తో దీన్ని తయారు చేస్తారు.
భాగోతం ఉదయం మొదలుపెట్టి సాయంకాలం దీపాలు పెట్టే వేళ వరకు ఆడుతారు. భాగోతాన్ని అంబ కీర్తనతో మిదలు పెడుతారు. అంబ కీర్తన అంటే ప్రార్థనా గీతం. ఆ తరువాత వాయిద్యాల యుక్తంగా ఆదితాళం, భూపాలం, కాంభోజ, మోహన వంటి రాగాల్లో పాటలు, పద్యాలు పాడుతారు. భాగోతం ఆడే ప్రతి ఒక్కరికీ వాయిద్యాలు వాయించడం వచ్చి ఉండాలి. ఎందుకంటే ఒకరు పాడుతుంటే మరొకరు వంతుల వారీగా వాయిద్యాలు కూడా వాయించాల్సి ఉంటుంది. భాగోతంలో బుడ్డర్ ఖాన్ వేషం చూసేవారిని కడుపుబ్బా నవ్విస్తది.
చిందు వారికి భాగోతమే వృత్తి. ఎవ్వరేమిచ్చినా తీసుకుంటారు, లేదంటే కూలీ పనులు చేసుకొని బ్రతుకుతారు. వృత్తినే దైవంగా చూస్తారు. ఏమీ ఆశించకుండా ఆనందాన్ని పంచుతారు.
చిందు ఎల్లమ్మ గురించి రాయండి.
జ:- చిందు ఎల్లమ్మ భాగోతాలు అడే కళాకారిణి. స్త్రీ, పురుష వేషాలలోనూ ప్రేక్షకులను అలరించింది. చిందు ఎల్లమ్మ నిజామాబాద్ జిల్లా, చిన్నాపురం గ్రామంలో జన్మించింది. ఎక్క అయ్యవారు అనే బడి పంతులు వద్ద పెంకాసులు ఏరుకొచ్చుకొని, దాని మీద బొగ్గుతో రాస్తూ చదువు నేర్చుకుంది. వారు పెద్ద బాలశిక్ష పుస్తకం నుండి అనేక విషయాలు నేర్పించే వారు.
చిందు ఎల్లమ్మ కుటుంబం అంతా తాతల కాలం నుండి భాగోతాలు ఆడడమే వృత్తిగా జీవిస్తున్నారు. ఎల్లమ్మకు నాలుగే ఏటనే ముఖానికి రంగు పూసి బాలకృష్ణుడి వేషం వేయించారు. అప్పటి నుంచి రంభ, బబృవాహనలో చిత్రాంగద, సుందరాకాండలో సీత, సతీ సావిత్రి వంటి వేషాలు వేసింది. రాజు, వాలి, ధర్మాంగుడు, కుశలుడు, హనుమంతుడు వంటి పురుష వేషాలు కూడా లభించింది. అంతే కాకుండా సారంగధర, చెంచులక్ష్మి, సతీ సావిత్రి, ప్రహ్లాద, మైరావణ, మాంధాత చరిత్ర, రామాంజనేయ, సతీ అనసూయ, సతీ తులసీ, బాలనాగమ్మ వంటి ఇరవై ఐదు భాగవతాల్లో పురుష వేషం ధరించేది.
తన నటనతో ఎన్నో ప్రశంసలు అందుకొన్న చిందు ఎల్లమ్మ 2005 సంవత్సరంలో నవంబరు 9న నిజామాబాదు జిల్లా, అమ్దాపూర్ లో మరణించింది.
7.మంజీరా
-డా. వేముగంటి నరసింహాచార్యులు
ఉద్దేశం: పాడి పంటలకు, సిరి సంపదలకు మూలం అయినటువంటి నదులు ప్రజల జీవనానికి, పర్యావరణానికి ఏ విధంగా మేలు చేకూర్చుతున్నాయో తెలియజేయడం. ప్రక్రియ: ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేది. ఇది మాత్రా గణాలతో కూడి ఉంటుంది. ఈ పాఠం మంజీర నాదాలు అనే గేయ కావ్యం నుండి తీసుకోబడింది.
కవి పరిచయం: డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు 1930లో సిద్ధిపేటలో రామక్క, రంగాచార్యులు అనే దంపతులకు జన్మించారు. వీరు సాహితీ వికాస మండలి అనే సంస్థను, మెదక్ జిల్లా రచయితల సంఘాన్ని స్థాపించి సాహిత్య వికాసానికి కృషి చేశాడు. తిక్కన, రామదాసు అనే పద్య కావ్యాలు, మంజీర నాదాలు అనే గేయ కావ్యం, వివేక విజయం అనే కావ్యఖండికతో పాటు నలభై పుస్తకాలు రాశాడు. కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్కవి వీరి బిరుదులు. తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది. వీరి రచనలు చక్కని ధారతో, సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. తెలంగాణ భాష ఇంపు, సొంపు పరవశింపజేస్తాయి. వీరు 2005లో మరణించారు.
I. స్వీయ రచన
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
1. నది పొలానికి బలం చేకూరుస్తుంది అని కవి ఎందుకు అన్నాడు?
జ. నది పొలానికి బలం చేకూరుతుందని కవి ఎందుకు అన్నాడు అంటే అది ప్రవహించేటప్పుడు కొండలలో, కోనలలో వివిధ రకాలైన అడవులను స్ప్రశించుకుంటూ ప్రవహిస్తుంది. వివిధ రకాల నూనెలను తాకినప్పుడు నేల పులకించి సారవంతమైన మట్టి నదీ ప్రవాహంతో కలిసి పోతుంది. అడవుల గుండా ప్రవహించి అడవిలో రాలిన ఆకులు, పువ్వులు, కాయలు, మగ్గి, కుళ్ళి భూమికి ఇచ్చే ఎరువుగా తయారవుతాయి. ఈ ఎరువును నది తనతో పాటు తీసుకు వస్తుంది. ఆ ప్రవాహపు మీరు ఏ పొలానికి చేరుతుందో ఆ పొలానికి బలం చేకూరుతుందని అన్నాడు.
2. భాగ్యనగరానికి మంజీరా నదికి ఉన్న సంబంధం గురించి వివరించండి?
జ. భాగ్యనగరంగా విలసిల్లుతున్న హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తోంది మంజీరా నది. ఈ మంజీరా నది పల్లెల్లో రైతులను అమ్మలా ఆదరించి వ్యవసాయానికి నీరు అందిస్తుంది. మరి హైదరాబాద్ పట్టణంలో వ్యవసాయం చేయరు. కాబట్టి ఇక్కడి ప్రజలకు తాగటానికి గృహ అవసరాలకు తోబుట్టువులా నీరు అందిస్తుంది. ఎచ్చటేచ్చట నుంచో వచ్చి హైదరాబాద్లో నివసించే వారు ఈ మంజీరా నదికి బానిస అవుతానడం అతిశయోక్తి కాదు. ఎందుచేతనంటే శుద్ధమైన తీపి రుచి కలిగిన ఈ నీరును ఇష్టపడని వారు ఎవరుంటారు. అందుకే భాగ్యనగరం ప్రజలకి మంచి నదికీ మధ్య ఉన్న అనుబంధం విడదీయరానిది.
3. నదులను మనం ఎట్లా కాపాడుకోవాలి?
జ. నదులు ప్రజలకు జీవనాధారమైనవి. నదులు లేకుంటే నాగరికత లేదు. నదులు ప్రవహించి ఉన్నంత వరకూ నరులకు కరువు రాదు. మనుష్యులకు జీవనాధారమైన నదులు నేడు కాలుష్య కోరల్లో చిక్కుకుని కుదించుకుని పోతున్నాయి. జీవధారను అందించే నదులు ప్రాణాధారమైన నదులు ఆదరణ కరువై ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. అలాంటి నదులను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత. నదీ పరివాహక ప్రాంతాలను పరిరక్షించుకోవాలి. కర్మాగారాల వ్యర్థాలను సముద్రంలోకి వదలకూడదు. ప్రజల అవసరాల కోసం నదులను ఆక్రమించి కట్టడాలను నిర్మించరాదు. నదులను వ్యర్థాలతో ప్లాస్టిక్ సంచులతో నిలుపరాదు. నదిని సంరక్షించే చర్యలను ప్రభుత్వం అమలు అయ్యేలా చూడాలి. నదుల్లో ఇసుకను అక్రమంగా తొలగించ రాదు. దీనిని నియంత్రించడానికి కఠిన చర్యలు చేపట్టాలి. ఇలా చేసినట్లయితే నదులు ప్రాణాధాయకాలుగా విరజిమ్ముతాయి.
4. నదులు నాగరికతకు ఆలవాలం ఎందుకు?
జ.నదులు నాగరికతకు ఆలవాలం ఎందుకంటే నది ప్రక్కనే నాగరికత విస్తరిస్తుంది. సింధూ నది పరివాహక ప్రాంతాలలో సింధు నాగరికత విలసిల్లినట్లు గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఆర్య నాగరికత వెలసినట్లు చరిత్ర తెలియజేస్తుంది. నదులను పురస్కరించుకుని అనేక నగరాలు వెలిశాయి. కావున నదులు నాగరికతకు ఆనవాళ్లుగా చెప్పవచ్చు.
ఉదా:- కృష్ణా నది పక్కనే విజయవాడ నగరం,
గోదావరి ప్రక్కన రాజమండ్రి నగరం,
గంగా నది పక్కన వారణాసి నగరం,
మొదలైన నగరాలు వెలిశాయి. వాటితో పాటు ఒక కొత్త నాగరికత వెలసింది.
II. క్రింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
1. నగరాల్లో కూడా నీళ్లు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. కారణాలు ఏమిటో వివరించండి?
జ. నదుల వల్ల మానవాళికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకున్నాము. అటువంటి నదులలో నేడు నీళ్లు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. పర్యావరణ పరిస్థితులు కారణంగా నదులలోని నీరు ఆవిరై పోతుంది. అంతేకాకుండా వర్షాలు సరిగా పడకపోవడం వల్ల కూడా నదుల్లో నీరు చేరడం లేదు. కొన్ని నదులపై సరైన ఆనకట్టలు నిర్మించక పోవడం చేత కూడా ఆ నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. నదులు లేకుంటే ప్రజలు జీవించలేరు. అటువంటి నదుల్లో వ్యర్థ పదార్థాలు రసాయనిక పదార్థాలు కలపకూడదు. నేటి కాలంలో మనుషులకు జీవనాధారమైన నదులు కాలుష్యం బారిన పడి నీళ్ళ కలుషితమవుతున్నాయి. జనాభా పెరుగుదల కారణంగా నదులుకుదించుకొని పోతున్నాయి. వివిధ రకాల కట్టడాల వల్ల నదులు కనుమరుగయ్యే స్థితి ఏర్పడుతుంది.
భాషాంశాలు - పదజాలం
I. క్రింది పదాలకు సమానార్ధక పదాలు రాయండి.
రైతు =కర్షకుడు
చల్లదనం =చలువ
నేల =పుడమి
స్నేహం= సోపతి
పంపి= పంపి
ప్రకాశించు =విలసిల్లు
II. ఈ క్రింది ప్రకృతులకు వికృతులు రాయండి
1. హృదయం - ఎడద
2. రాశులతో - రాసులతో
III. ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
1. కాకతీయుల కాలం సాహిత్య సంపద తో విలసిల్లింది.
విలసిల్లింది= ప్రకాశించింది
2. కృష్ణ కుచేలుల కూర్మి గొప్పది.
కూర్మి = స్నేహం
3. పుడమి అనేక సంపదలకు నిలయం.
పుడమి= భూమి, నేల
IV. భాషను గురించి తెలుసుకుందాం
1. కింది ఖాళీలను పూరించండి
అలంకారాలు
ఇల్లు,మనిషి,పెళ్లి మండపం, ఫంక్షన్ హాల్, వాహానము ఏదైనా సరే అందంగా కనిపించాలంటే వివిధ రకాలుగా అలంకరణ చేస్తాం. అప్పుడే ఆ వస్తువు అందంగా కనిపిస్తుంది. అట్లాగే పద్యాలలో, కవితలలో కూడా వినసొంపుగా ఉండడానికి అలంకారం ఉంటుంది.
ఇది మన బడి
అక్షరాల గుడి
సరస్వతి దేవి ఒడి
మనకు నేర్పి ను నడవడి
పోదాం పద వడి వడి
పై కవితలు ‘డి’ అనే అక్షరం అనేకసార్లు రావడం వల్ల కవిత అందంగా వినసొంపుగా ఉన్నది. ఆ అందం శబ్దం వల్ల వచ్చింది కాబట్టి శబ్దాలంకారం అర్థం వల్ల అందం కలిగితే అర్థాలంకారాలు అవుతుంది. ఇప్పుడు ఒక శబ్దాలంకారం గురించి తెలుసుకుందాం.
1.గడగడ వణుకుచు తడబడి జారిపడేను.
2. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్త లో పాలు తెచ్చింది.
పై 2 వాక్యం లో ఎక్కువ సార్లు వచ్చింది హల్లు ఏది?
డ,త్త అనే అక్షరాలు అనేక సార్లు వచ్చాయి.
ఇట్లా ఓకే హల్లు అనేకసార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు.
L 8 చిన్నప్పుడే
వట్టికోట ఆళ్వారుస్వామి
పాఠం ఉద్దేశం
అప్పటి నిజాం రాష్ట్రంలో తెలుగు భాషా సంస్కృతులు ఉపేక్షకు గురికావడాన్ని నిరసిస్తూ నిజాం రాష్ట్రంలో ఆంధ్రోద్యమం విస్తరించింది.ఆ సందర్భంగా సభలద్వారా,పత్రికలద్వారా రచనల ద్వారా ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధించారో తెలపడం ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. ఇది జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది. సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది.ఈ వచన ప్రక్రియనే కథానిక అంటారు. కథనం,సంభాషణలు, శిల్పం కథానికలోని ప్రధానాంశాలు. సంక్షిప్తతా లక్షణమే కథానిక ప్రత్యేకత.
1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైన ఆళ్వారుస్వామి కథానికనే ప్రస్తుత పాఠ్యాంశం.
రచయిత పరిచయం
పాఠం పేరు:-చిన్నప్పుడే
రచయిత పేరు:-వట్టికోట ఆళ్వారుస్వామి
పాఠ్యభాగం దేని నుండి గ్రహింపబడినది:-1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైన కథానిక ఇది.
రచయిత జననం:-1-11-1915
జన్మస్థలం:-నల్గొండ జిల్లాలోని చెరువు మాదారంలో జన్మించారు.
మరణం:-5-2-1961
జైలు జీవితం:-నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలు పాలయ్యారు.
ప్రతిభ:-దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలు ముద్రించారు.తెలంగాణ,గుమస్తా లనే పత్రికను నడిపించారు. ఆళ్వారుస్వామి సుప్రసిద్ధ నవలా రచయితగా,గొప్ప సాహితీవేత్తగా తొలితరం కథా రచయితగా కీర్తి పొందారు
ఇతర విశేషాలు:-
ఈయన రచించిన ప్రజలమనిషి, గంగు నవలలు బాగా ప్రజాదరణ పొందాయి.వీరు రచించిన అనేక కథల ద్వారా హైదరాబాద్ సంస్థాన ప్రజలలో స్ఫూర్తిని సాంస్కృతిక చైతన్యాన్ని రగిల్చారు.
III . స్వీయ రచన
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
1. వెంకట్రావు స్వభావాన్ని తెల్పండి?
జ. వెంకట్రావు ఆంధ్రమహాసభ కార్యకర్త. ప్రజల నాడి తెలిసినవాడు. సామాజిక సేవ పట్ల ఆదరం కలవాడు. ప్రజల ఇబ్బందులను తనివిగా భావించి వాటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాడు. ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకునే వాడు. ప్రజలలో చైతన్యం కలిగించాలని అనుకునేవాడు. దీక్షతో గ్రామీణ విషయాలను తెలుసుకొని వారి ప్రాణాలను రక్షించాడు. వెంకట్రావుకి పిల్లలంటే చాలా ఇష్టం వారి భవిష్యత్తు బాగుండాలంటే మనం స్వార్ధ రహితంగా, ధైర్యంగా, పట్టుదలతో పనిచేయాలని ఉన్నత ఆశయం కలవాడు.
2. వెంకట్రావు వంటి యువకుల వల్ల కలిగే ప్రయోజనాలేవి?
జ. వెంకట్రావు వంటి యువకుల వల్ల సమాజంలో చైతన్యం కలుగుతుంది. వాళ్ళు తమ వెంట కొందరు నాయకులను కూడా తీసుకుని వచ్చి గ్రామ ప్రజలకు, పిల్లలకు హితబోధగవిస్తారు. గౌరవముగా బ్రతకడం నేర్పిస్తారు. గ్రామీయుల సమస్యలను తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. వారి కష్టాలను స్వయంగా వచ్చి చూసి అర్థం చేసుకోగలుగుతారు. ప్రజలలో అసమానతలు తొలగించి వసుదైక కుటుంబాన్ని ఏర్పరుస్తారు.సామాజికంగా, ఆర్థికంగాను, చైతన్యాన్ని కలిగిస్తారు. అన్యాయాలను, అక్రమాలను ఎదిరించి ధైర్యంగా నిలబడగలిగే ఆత్మస్థైర్యం ప్రజల్లో కలుగుతుంది.
3. వెంకట్రావుతో నేటి యువతను పరిశీలించి,పోల్చండి?
జ. వెంకట్రావు గ్రామాలలో చైతన్యం కోసం పరితపిస్తుండగా, నేటి యువత నగరాలలో నివాసం ఉండడానికి మొగ్గు చూపు తున్నారు. వెంకట్రావు తన స్వార్థం మాని పరహితం కోసం పాటుపడుతుండగా నేటి యువత స్వార్థంతో తమ అభివృద్ధి కాంక్షిస్తూ మన దేశం గురించి ఆలోచించకుండా పరాయి దేశాలకు వెళ్ళిపోతున్నారు. వెంకట్రావు తాను మాత్రమే కాకుండా ఇతర నాయకులను కూడా గ్రామానికి తీసుకొనివచ్చి ప్రజల స్థితిగతులను ప్రత్యక్షంగా చూపుతుండగా నేటి యువత గ్రామాలు పూర్తిగా విస్మరిస్తున్నారు. పిల్లలను ఆదరించి వారి కష్టాలను ఆధారంతో వెంకట్రావు వింటే, నేటి యువతకు ఆసక్తి గాని,ఆలోచన గాని ఉండడం లేదు. వెంకట్రావుని చూసి నేటి యువత ఎంతో నేర్చుకోవాలి. నేటి యువత కు సమాజం సంగతి పట్టటలేదు. అటు విద్యకో, ఇటు ఆటపాటలకో అంకితమై పోతున్నారు. పెద్ద, చిన్న తారతమ్యం లేకుండా ప్రవర్తిస్తున్నారు. సామాజిక స్పృహ లోపించింది. వ్యక్తిగత స్వార్థం పెరిగిపోయింది. పెద్దల మాటను గౌరవించే వారు లేరు.వారితో పోలిస్తే వెంకట్రావు ఎప్పుడు సమాజన్ని గురించి ఆలోచిస్తాడు. సమాజానికి మేలు చేయడం కోసం వాళ్ళలో ఒకడుగా బ్రతుకుతున్నాడు.
4. మనం ఈరోజు స్వార్ధ రహితంగా, ధైర్యంగా,పట్టుదలతో పనిచేస్తే,మన సంతానం అంతా హాయిగా బ్రతుకుతారు. అని ఒక నాయకుడు ఎందుకు అని ఉంటాడు?
జ. రజాకార్ల పాలన నిరంకుశంగా ఉండేది. వారి పాలనలో సామాన్య ప్రజలు అణచివేయబడ్డరు. కాబట్టి గ్రామంలో ఉన్న పెత్తం దారులను ఎదుర్కోవాలంటే ఎంతో ధైర్యం అవసరం. గ్రామాలలో చైతన్యం కలిగించడానికి పట్టుదలగా పని చేయాలి. గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ స్వార్ధ రహితంగా ముందుకు సాగాలి. ఇలా చేస్తే రాబోయే తరాలు ఆ నిరంకుశత్వం నుండి పెత్తందార్ల చేతుల నుండి బయటపడి స్వేచ్ఛగా,హాయిగా బ్రతుకుతారు. అందుకని ఓ నాయకుడు మనం ఈరోజు స్వార్ధ రహితంగా , ధైర్యంగా, పట్టుదలతో పని చేస్తే మన సంతానం అంత హాయిగా బ్రతుకుతారు అని అన్నాడు. గ్రామంలో ఉన్న పెత్తందార్లు, స్వార్ధపరులు ప్రతీ వస్తువును అన్యాయంగా హరించే వాళ్ళు. గ్రామీణ ప్రజలు వారి వలన కష్టాల పాలయ్యారు. నాయకులు వచ్చి గ్రామీణులకు హితబోధ చేశారు. ఇప్పుడు మనం నిస్వార్థంగా నువ్వు ధైర్యంగా దీక్షతోను పని చేయాలని ఒక నాయకుడు పిల్లలకు బోధించాడు. అలా చేస్తే రాబోయే తరాలు సుఖిస్తాయని ఆయన ఉద్దేశం.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
1.చిన్నప్పుడే కథ ద్వారా ఆనాటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకున్నారు కదా!నాటి పరిస్థితులు నేటి సమాజంలో కూడా ఉన్నాయా ?కారణాలు ఏమిటి?
జ. చిన్నప్పుడే అనే కథ ఆధారంగా ఆనాటి ప్రజల జీవన పరిస్థితులు చాలా దుర్భరంగా ఉండేవని తెలుస్తోంది. ఆ కాలంలో గ్రామాల్లో పట్వారీలు, గ్రామ అధికారులు గ్రామంలో అధికారాన్ని చెలాయించేవారు. లంచాలు ప్రజల పొలాలను హస్తగతం చేసుకోవడం, వారిని నిర్ధాక్షిణ్యంగా తిట్టడం, దారుణంగా కొట్టడం జరిగింది. ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేవారు. కానీ ఈనాడు ఆనాటి పరిస్థితులు లేవనే చెప్పాలి. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని అవి:
ప్రజల్లో అక్షరాస్యత పట్ల అవగాహన పెరగడం.
రాజకీయ చైతన్యం పోరాట పటిమ ఎక్కువవడం.
సామాజిక సమస్యలపై సామాజిక కార్యకర్తలు ప్రజలను చైతన్య పరచడం.
జమీందారీ వ్యవస్థ లేకపోవడం. పెత్తందార్ల అరాచకత్వం పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం.
మహిళలు కూడా అన్ని రంగాలలోనూ స్ఫూర్తిదాయకమైన ప్రతిభను కనపరచడం.
ప్రభుత్వం పేద,బడుగు వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం.
III. సృజనాత్మకత
1. ఈ పాఠాన్ని ఆధారంగా చేసుకొని, మీ అనుభవాలతో ఒక చిన్న కథ రాయండి.
జ. మా ఊరికి ఒక రోజు బాలల హక్కుల నాయకులు వచ్చారు. వాళ్ళు రచ్చబండ మీద కూర్చున్నారు. మేమంతా పాఠశాలకు వెళ్ళే సమయం. అప్పుడే మా ఊరి రంగన్న తన కుమారుడు శ్రీను ను వెంటబెట్టుకుని పొలానికి వెళ్ళడం వాళ్ళ కంట పడింది. బాలల హక్కుల నాయకుడు కృష్ణ అనే ఆయన వాళ్ళని దగ్గరకు పిలిచాడు.
నీ పేరేమిటి అయ్యా? అని ప్రశ్నించాడు.
రంగన్నంటారండి!
పాఠశాలకు సమయం అవుతున్నది కదా ఈ పిల్లవాణ్ణి ఎక్కడికి తీసుకు వెళుతున్నారు?
వీడు నా కుమారుడు అండి పొలం పనులకు వెంటబెట్టుకుని తీసుకు వెళుతున్నాను. అది నేరం కదా! చిన్న పిల్లలను పనులకు పంపకూడదు. చదువుకునే వయసులో ఉన్న బాలబాలికలను పాఠశాలకు తప్పనిసరిగా పంపాలి అని కృష్ణ రంగన్నకు చెప్పి శ్రీను ను దగ్గరికి తీసుకున్నాడు.
ఏం బాబు నిన్ను స్కూల్లో చేరుస్తాను చదువు కుంటావా? ఓ! బాగా చదువుకుంటాను. అన్నాడు శీను సంతోషంగా. ఆరోజు నుండి శ్రీను కూడా మా వెంట పాఠశాలకు వస్తున్నాడు.
2. వెంకట్రావువలె గ్రామం బాగుకోసం పాటు పడుతున్న వాళ్ళు నేడు కూడా ఉంటారు.అటువంటి వారి సేవలను ప్రశంసిస్తూ ఒక అభినందన పత్రం రాయండి.
అభినందన పత్రం రాయడానికి సూచనలు:
ఎవరికి అభినందనలు తెలిపాలనుకుంటున్నామో వారు బహుమతి అందుకుంటున్నందుకు మనకు ఆనందంగా ఉందని తెలపాలి.
అతని /ఆమె లోని మంచి గుణాలు రెండు లేదా మూడు ప్రస్తావించాలి.
అతని /ఆమెకు ఎందుకు బహుమతి వచ్చిందో రాయాలి.
చివరిగా అతని /ఆమె అందరికీ ఆదర్శప్రాయం అని రాయాలి.
అభినందన పత్రం
సమాజ హితం కోసం ఎందరో మహనీయులు నిరంతరం కృషి చేస్తున్నారు. కొందరు గ్రామంలో పుట్టి. పెరిగి పెద్ద,పెద్ద చదువులు చదువుకొని, అమెరికాలో ఉద్యోగం చేస్తూ తిరిగి గ్రామాల వికాసం కోసం కృషి చేసేవారు ఉన్నారు. అలాంటి వారు గ్రామాలకు వచ్చి సుమారు 25 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు దాంతో గ్రామంలో రోడ్ల మరమ్మతులు జరిగాయి. వీధి దీపాలను ఏర్పాటు చేశారు. రక్షిత మంచినీటి సదుపాయం కల్పించారు. వీధుల్లో చక్కని మొక్కలను నాటించారు. ఇటువంటి వారి సేవలను గురించి ఎంత చెప్పినా తక్కువే సమ సమాజ నిర్మాణంలో వారి పాత్రను మరువలేము. వీరే సమాజానికి మార్గ దర్శకులు.
V.పదజాలం వినియోగం
1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
1. దండం = నమస్కారం
2. అవ్యాజ = కపటంలేని
3. రకం = శిస్తు
4. మిరం = కారం
5. ఎరుక = తెలుసు
2. కింది పదాలకు అదే అర్థము వచ్చే మరి రెండు పదాలను రాయండి.
1. దండం = నమస్కారం,అంజలి
2. విలువ = వెల,అమూల్యం, ఖరీదు
3. కుప్పలుగా =రాశులుగా, ప్రోగులుగా
4. అధ్వాన్నంగా = దుర్భరంగా, హీనంగా
5. గభాలున = వెంటనే, గ్రక్కున
6. వెండి = రజతం,రౌప్య,కలధౌతం
3. ప్రకృతి – వికృతి
1. ముఖం - మొగం
2. సంతోషం – సంతసం
3. సుఖం - సుకం
4. గౌరవం - గారవం
భాషాంశాలు
సమాస పదం
విగ్రహ వాక్యం
సమాసముపేరు
రాజ్యకాంక్ష
రాజ్యము నందు ఆకాంక్ష
సప్తమీ తత్పురుష సమాసము
విజయగర్వం
విజయం వలన గర్వం
పంచమీ తత్పురుష సమాసము
అష్టదిక్కులు
అష్ట సంఖ్య గల దిక్కులు
ద్విగు సమాసము
బలరామకృష్ణులు
బలరాముడును, కృష్ణుడును
ద్వంద్వ సమాసము
ప్రజల భాష
ప్రజల యొక్క భాష
షష్టి తత్పురుష సమాసము
అక్రమము
క్రమము కానిది
నైన్ తత్పురుష సమాసము
క్రింది పదాలను కలిపి రాయండి. సంధి పేరు రాయండి.
1. అప్పుడప్పుడు= అప్పుడు+అప్పుడు= ఆమ్రేడిత సంధి
2. ఏమేమి = ఏమి+ ఏమి =ఆమ్రేడిత సంధి
3. ఊరురు =ఊరు+ఊరు = ఆమ్రేడిత సంధి
4. ఇంటింటా= ఇంట+ఇంట = ఆమ్రేడిత సంధి
5. ఓరోరి = ఓరి+ ఓరి = ఆమ్రేడిత సంధి
6. బట్టబయలు= బయలు+బయలు = ద్విరుక్తటకార సంధి
7. అంతత= అంత+అంత = ద్విరుక్తటకార సంధి
8. తుట్టతుద= తుద+ తుద = ద్విరుక్తటకారసంధి
8. ఎన్నెన్ని = ఎన్ని + ఎన్ని = ద్విరుక్తటకార సంధి
ఉపవాచకం
4వ పాఠం -ఇల్లు ఆనందాల హరివిల్లు
ప్రశ్నలు- జవాబులు
1) కలిసి ఉంటే కలదు సుఖం దీన్ని వివరించండి.
జ.ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందం చిన్న కుటుంబాల్లో ఉండదు.చిన్న కుటుంబంలో సభ్యులు సుఖ సంతోషాలను పంచుకోవడానికి మనుషులను వెతుక్కోవాల్సి వస్తుంది. అమ్మ, నాన్న, పిల్లలతోపాటు తాతయ్య,నానమ్మ,అమ్మమ్మలతో కలిసి ఉండటం వల్ల అనుబంధాలు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ద్వారా పిల్లలకు సమాజ స్థితిగతులు,ఆచార వ్యవహారాలు అలవడుతాయి. కలిసిమెలిసి ఉన్నప్పుడే కుటుంబమైన,సమాజమైనా పరస్పర సహకారాలను అందించుకోగలదు. దేశాభివృద్ధి సాధించగలదు. మన తరం పెరిగి కుటుంబ సభ్యుల సంఘీభావంతో వసుధైక కుటుంబ భావననుతర్వాతి తరానికి అందించవచ్చు.
2. వ్యష్టి కుటుంబం అంటే ఏమిటి? ఇది ఎందుకు ఏర్పడుతున్నాయి?
జ.వ్యష్టి కుటుంబం అంటే భార్యభర్తలు,పిల్లలు మాత్రమే ఉన్న చిన్న కుటుంబం. ఆర్థిక స్వేచ్ఛ,సమానత్వం, వ్యక్తిస్వాతంత్రం అనే మూడింటి పైనే వ్యష్టి కుటుంబం ఆధారపడి ఉంటుంది.వ్యష్టి కుటుంబంలో వ్యక్తిగత గౌరవం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు, నిర్ణయించుకునే అధికారం లభిస్తాయి.
ఉమ్మడి కుటుంబంలో వ్యక్తి స్వేచ్ఛకు,ఆర్థిక స్వాతంత్ర్యానికీ, సమానత్వానికీ ప్రాధాన్యం లేకపోవడం వల్లా,స్వార్థం పెరిగిపోవడం వల్లా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మార్పులు వచ్చాయి. చిన్న కుటుంబం అనే భావం బలపడింది.అందువల్లనే వ్యష్టి కుటుంబాలు ఏర్పడుతున్నాయి.
3 దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక అనడానికి కారణాలు రాయండి.
జ. సమాజానికి కుటుంబం వెన్నెముక. మంచి కుటుంబం,మంచి సమాజం వల్ల ,మంచి దేశం ఏర్పడుతుంది.మంచి కుటుంబాలతో దేశం నుండితే, ఆ దేశం సిరి సంపదలతో నిండుతుంది.మన చక్కని కుటుంబ వ్యవస్థ,మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో నిలబెట్టింది. దేశమంటే చక్కని కుటుంబాల సమాహారమే. కుటుంబాలు అన్ని చక్కగా సిరి సంపదలతో ఉంటే,దేశం బాగా ఉన్నట్లే,కుటుంబ వ్యవస్థ వల్లే, దేశీయజీవన సంస్కృతులు నిలుస్తున్నాయి.కాబట్టి దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక.
9.అమరులు
-ఆచార్య కె. రుక్నుద్దీన్
నేపథ్యం: ప్రత్యేక తెలంగాణాను కాంక్షిస్తూ 1969 లో పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమం చేశారు ఇందులో 360 మందికి పైగా ప్రాణ త్యాగం చేశారు. ఈ అమరులకు ప్రజలు, కవులు, కళాకారులు తమదైన రీతిలో నివాళులు అర్పించారు. ఆచార్య రుక్నుద్దీన్ తన కవిత ద్వారా నివాళులు అర్పించాడు.
ఉద్దేశం: తెలంగాణ ఉద్యమంలో నేటి నుండి నాటి వరకు అమరులైన వారి త్యాగాలను స్మరించుకోవడం.
ప్రక్రియ: ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. పల్లవి చరణాలతో కూడి పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. మాత్రాగణాలు ఉంటాయి.
ఈ పాఠం విప్లవ ఢంకా అనే కవితా సంకలనం నుండి గ్రహించబడింది.
కవి పరిచయం: ఆచార్య కె. రుక్నుద్దీన్ నాగర్ కర్నూల్ జిల్లా రాచూరు గ్రామంలో 1947 లో జన్మించారు. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పని చేశారు. విప్లవ ఢంకా, ప్రయాణం, శెలిమె, సూక్తి సుధ, కిన్నెర మెట్లు, మోదుగ పూలు, విశ్వదర్శనం వీరి రచనలు. 'జానపద సాహిత్యంలో అలంకార విధానం' అనే పరిశోధన గ్రంథం రాశారు. ఎన్నో పురస్కారాలు అందుకున్న వీరు 2013 లో మరణించారు.
స్వీయరచన:
ఐదు వాక్యాల ప్రశ్నలు:
అమరవీరులను కవి 'తెలంగాణ గర్భమ్మున గలిగిన శ్రీ రుద్రులారా!' అని ఎందుకు సంబోధించాడు?
జ:- దేశం కోసం, దేశ ప్రజల కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నవారు అమరవీరులు. తెలంగాణ ఎన్నో ఏళ్ళుగా పరాయి వాళ్ళ పాలనలో మగ్గి పోయింది. ప్రజలంతా అణచివేతకు గురయ్యారు. కాబట్టి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతీ పౌరుడు ధైర్య సాహసాలు కలిగి పట్టుదలతో తెలంగాణకై పోరాడారు. వారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. అమరరులై చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు. అందుకే కవి 'తెలంగాణ గర్భమ్మున గలిగిన శ్రీ రుద్రులారా' అని సంబోధించాడు.
అమరవీరుల పట్ల మనమెట్లాంటి గౌరవం చూపాలి?
జ:-తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కవులు, కళాకారులు, ఉద్యోగులు, ప్రజలందరూ కలిసి ఏకతాటిపై నిలిచి పోరాటం చేశారు. ప్రత్యేక తెలంగాణా ఏర్పడితే బంగారు తెలంగాణా ఏర్పడుతుందని వారు కలలు కన్నారు. ఈ పోరాటంలో ఎందరో అమరులయ్యారు. వారి త్యాగాలు చరిత్రలో చిర స్థాయిగా నిలుస్తాయి. అమరులు కన్న కలలను నిజం చెయ్యాలి. తెలంగాణా ప్రజలంతా ఐకమత్యంతో ఉంటూ ఒకరికొకరు తమ సహాయ సహకారాలు అందించుకోవాలి. అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటున్నది కాబట్టి బంగారు తెలంగాణా ఏర్పాటులో మన వంతు సహాయ సహకారాలు అందించడమే వారికి మనమిచ్చే అరుదైన గౌరవం.
అధికారాంధుల ప్రవర్తన ఎట్లా ఉంటుంది?
జ:- అధికారి ఒక మంచి నాయకుడు అయి ఉండాలి. నాయకుడు అంటే నిస్వార్థంగా ప్రజలకు సేవకుడిగా ఉండేవాడు. కాని ప్రస్తుత నాయకులు అధికారం వచ్చేవరకే నాయకుడిగా నటిస్తున్నారు. ఆ తరువాత అహంకారంతో కళ్లు మూసుకుపోయినట్లు ప్రవర్తిస్తున్నారు. కేవలం తన స్వార్థం కోసం, తన కుటుంబం కోసం ఆ అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ అధికారాంధులు పక్షపాత ధోరణి అవలంబిస్తూ తన ప్రాంతం వారికో, తన కులం వారికో, తన వర్గం వారికో మేలు చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తారు. అవినీతి చేస్తూ ప్రజల ధనం దుర్వియోగం చేస్తారు. ఇలాంటి వారి వల్ల ప్రాంతీయ అసమానతలు, పేదరికం, నిరుద్యోగం వంటివి పెరగడం, మత కల్లోలాలు జరగడం సంభవిస్తాయి.
కవి ప్రతిజ్ఞలోని విషయాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు.
జ:- తెలంగాణా రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ప్రజలు తమ ప్రాణాలు సైతం లెక్క చేయలేదు. వారి త్యాగాల వల్లే రాష్ట్రం ఏర్పడింది. కవి ఈ అమరుల త్యాగాల గురించి తన గేయంలో తెలిపాడు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణా సాధించాలి. వారి ఆత్మలు శాంతించే విధంగా తెలంగాణాను అభివృద్ధి చేసుకోవాలి. అధికారాంధుల పాలిట యమపాశమై వారి రక్తంతో తెలంగాణా తల్లికి అభిషేకం చేయాలి. ఈ విధంగా చేసినట్లైతే అమరుల త్యాగాలకు సార్థకత చేకూరుతుంది అని కవి ప్రతిజ్ఞను బట్టి నేను అర్థం చేసుకున్నాను.
పది వాక్యాల ప్రశ్న:
కవి నాడు చేసిన ప్రతిజ్ఞ నేడు సాకారమైంది కదా! దీనికి పాటుబడిన వారిని గురించి వివరించండి.
జ:- భారతదేశ చరిత్రలో తెలంగాణ ఉద్యమం మహోన్నతమైనది. ఈ ఉద్యమం ఈనాటిది కాదు ఎంతో కాలం నుండి సాగుతున్నటువంటిది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో త్యాగాలు చేయడం జరిగింది. తెలంగాణ పోరాటం దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచింది.
తెలంగాణాలో తొలుత నిజాం రాజు అరాచకాలపై ఉద్యమాలెన్నో కొనసాగాయి. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో తెలంగాణను దేశంలో కలపాలనే గొప్ప పోరాటం జరిగింది. ఆ తర్వాత సాయుధ పోరాటంలో ఎందరో రైతులు అమరులయ్యారు. ఈ పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం అణచివేయ డానికి ప్రయత్నించింది. మలిదశ పోరాటంలో ఉద్యోగులు విద్యార్థులు నాయకులు వ్యాపారులు సామాన్య ప్రజలు చిన్న పిల్లలతో సహా అందరూ పోరాటంలో పాల్గొన్నారు. సకలజనుల సమ్మె పేరుతో ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఎందరో అమరులయ్యారు.
శ్రీకాంతాచారి వంటి వారి ఆత్మబలిదానం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు సైతం పెన్ డౌన్, గన్ డౌన్ నినాదాలతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రజలంతా రోడ్లపై ర్యాలీలు, వంటావార్పులు, మిలియన్ మార్చ్ వంటి అనేక పద్ధతుల ద్వారా శాంతియుతంగా పోరాడారు. ఈ విధంగా తెలంగాణ పౌరులంతా ఏకతాటిపై నిలిచి ఉద్యమం చేయడం మూలంగానే ఈ ప్రత్యేక తెలంగాణ సాకారమైంది.
పదజాలం:
పర్యాయ పదాలు:
సమూహం= గుంపు, బృందం
అసువులు= ప్రాణాలు, ఉసురులు
స్వేచ్ఛ= స్వాతంత్ర్యం, స్వతంత్రత
సఖులు= స్నేహితులు, మిత్రులు
నానార్థాలు:
వర్షం= సంవత్సరం, వాన
అమృతం= పాలు, నీరు
ప్రకృతి-వికృతులు:
భాగ్యం-బాగ్గెం
ఆకాశం-ఆకసం
శ్రీ-సిరి
ప్రతిజ్ఞ-ప్రతిన
వ్యాకరణం:
I.కింది పదాలు విడదీసి, సంధి పేరు రాయండి.
ఉద్రేకాస్త్రం = ఉద్రేక+అస్త్రం=సవర్ణ దీర్ఘ సంధి
మొట్టమొదలు= మొదలు+మొదలు=ఆమ్రేడిత సంధి
లావైన=లావు+ఐన=ఉకార సంధి
అనంతాకాశం=అనంత+ఆకాశం=సవర్ణదీర్ఘ సంధి
ఒక్కొక్క=ఒక్క+ఒక్క=ఆమ్రేడిత సంధి
ఉపమాలంకారం:
ఉదాహరణలు:
1.ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది.
2.ఏకలవ్యుడు అర్జునుడి వలె గురి తప్పని విలుకాడు.
3.తోటలో పిల్లలు సీతాకోకచిలుకల్లాగ అటూ ఇటూ తిరుగుతున్నారు.
మొదటి ఉదాహరణలో చెప్పాలనుకొనేది ఆమె ముఖం గురించి కాని కవి చంద్రబింబాన్ని పోలికగా/ఉదాహరణగా తీసుకొని అందంగా వర్ణించి తెలియజేశాడు.
ఇక్కడ చెప్పాలనుకొనే విషయం 1.ఉపమేయం.
పోలికగా తీసుకొన్నది 2.ఉపమానం
ఉపమేయం, ఉపమానాలలో ఉన్న ఒకే లాంటి గుణం 3.సమానధర్మం(అందంగా ఉండడం)
ఉపమేయ ఉపమానాలను కలిపే పదం 4.ఉపమావాచకం(వలె/లాగా)
సూత్రం: ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం
10 వ పాఠం
సింగరేణి
పాఠం ఉద్దేశం
ఏ దేశం తన సహజ సంపదను సమర్థంగా వినియోగించుకోగలుగుతుందో ఆ దేశం అభివృద్ధిదిశలో పయనిస్తుంది.మన దేశం సకలసంపదలకు నిలయం.ఇక్కడి నేలల్లో అపారమైన ఖనిజ సంపద దాగి ఉన్నది. ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బొగ్గుగనులు దేశంలోనే ప్రసిద్ధిపొందాయి. దేశ ప్రగతికి ప్రామాణికంగా ఉన్న సింగరేణి గనుల గురించి తెలియజేయటమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం .
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. సింగరేణి బొగ్గు గనులు,బొగ్గు ఉత్పత్తి గురించి సమాచారాన్ని తెలిపే వ్యాసం.
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) సహజ సంపదలను వినియోగించుకునే విజ్ఞానం పైన మానవ నాగరికత నిర్మించబడుతుందని ఎట్లా చెప్పగలవు?
జ. ఒక దేశం తనకున్న సహజవనరులను ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది.పారిశ్రామిక ఉత్పత్తుల్లో అత్యంత శక్తినివ్వగల మహత్తు నేల బొగ్గుకు ఉన్నది. ప్రకృతి ప్రసాదించిన సహజ సంపదను వినియోగించుకునే విజ్ఞానం పైననే మానవ నాగరికత నిర్మించబడుతున్నది అని చెప్పడానికి నేలబొగ్గును అనేక విధాలుగా వినియోగించుకుని నవ నాగరికతను సంతరించుకున్న భారతదేశమే ఉదాహరణ.
ఆ) బుక్కెడు బువ్వకోసం బతుకు పోరాటానికి సిద్ధ మైనారు.దీనిని మీరెట్లా అర్థం చేసుకున్నారో తెల్పండి.
తెలంగాణ పల్లెల నుండి వెనుకబడిన వర్గాలు,రైతు కూలీలకు చెందిన కుటుంబాలు బొగ్గు గనుల ప్రాంతాలకు వలస వచ్చారు.బొగ్గు గనుల్లో నుండి నేల బొగ్గును తీయడం అత్యంత క్లిష్టమైన, శ్రమతో కూడిన ప్రమాదభరితమైన ప్రక్రియ.రేయనక,పగలనక భూమి పొరల్లో పనిచేస్తున్న కార్మికులది శక్తికి మించిన శ్రమ.ప్రాణాలను పణంగా పెట్టి రక్తమాంసాలు రంగరించి బొగ్గు కుప్పల్లో పనిచేస్తుంటారు.గనుల్లో గాలి, వెలుతురు లేక గని కార్మికులు అనారోగ్యానికి గురవుతారు. కేవలం ఇదంతా పొట్టకూటికోసం చేసే పని. ప్రమాదపు అంచుల్లో మృత్యువుతో పోరాడుతూ వారు చేసే బొగ్గు తీసే పని బుక్కెడు బువ్వ కోసం చేస్తున్న బతుకు పోరాటమే.
ఇ) పగలు రేయి తేడా లేకుండా గడియారం ముండ్లవలే పని చేయడం అంటే ఏమిటి? కార్మికుల పనితో అన్వయించి రాయండి.
జ. బొగ్గు గనుల్లో పని రాత్రింబవళ్ళు కొనసాగుతూనే ఉంటుంది.గడియారం ముల్లు ఆగకుండా ఎలా తిరుగుతుందో బొగ్గు కార్మికులు భూమి పొరల్లో పని చేస్తూనే ఉంటారు.కోడికూతకు ముందే నిద్రలేచి పోయేవాళ్ళు కొందరు,పగలు 3:00 గంటలకు పోయెవాళ్ళు కొందరు. నడిరాత్రికి పోయేవాళ్ళు కొందరు.ఈ విధంగా మూడు షిఫ్టుల్లో గనుల్లో పని చేస్తారు.ఎండా,వాన,చలితో సంబంధం లేకుండా ప్రాణాలు పణంగా పెట్టి కార్మికులు చేసే పని గడియారం ముళ్ళతో పోల్చవచ్చు.
ఈ) డాక్టర్ కింగ్ పరిశోధనల వల్ల కల్గిన మేలు ఏమిటి?
జ. 1841లో ఖమ్మం జిల్లాలోని ఇల్లందు గ్రామస్థులు భూమిని తవ్వుతుండగా భూగర్భ బొగ్గు ఉన్నట్లు తెలిసింది.భారత ప్రభుత్వ భూగర్భ పరిశోధన శాఖ పరిశోధనలు మొదలు పెట్టింది. వాటి ఆధారంగా 1871లో డాక్టర్ కింగ్ అనే భూగర్భ ఖనిజ పరిశోధకుడుఇల్లందు గ్రామ పరిసరాల్లో శ్రేష్టమైన బొగ్గు భూమి లోపలి ఆరు పొరల్లో నిక్షిప్తమై ఉన్నదని వెల్లడించాడు. 1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ సంస్థవారు ఇల్లందులో మొదటి భూగర్భగనిని ప్రారంభించారు. ఈ బొగ్గును రవాణా చేయడానికి డోర్నకల్ నుండి ఖాజీపేట వరకు బ్రాంచ్ రైల్వే లైను వేసి దానికి సింగరేణి కాలరీస్
అని పేరు పెట్టారు.
2 కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) సింగరేణి కార్మికులతో ప్రత్యక్ష సంబంధం మనకు లేకపోవచ్చు.కానీ పరోక్ష సంబంధం ఉన్నది. ఎట్లాగో వివరించండి.
జ. సింగరేణి కార్మికులతో ప్రత్యక్ష సంబంధం మనకు లేకపోయినా వారు ఉత్పత్తి చేస్తున్న నేలబొగ్గు ద్వారా వెలువడే విద్యుత్తును అనేక రకాలుగా మనం ఉపయోగించుకుంటున్నాము.ఇదే బొగ్గు అనేక పరిశ్రమలకు ఇంధనంగా ఉపయోగపడుతుంది.రోడ్లు వేయడానికి ఉపయోగించే డాంబరు (తారు),ప్లాస్టిక్,సువాసన తైలాలు, బట్టల అద్దకానికి ఉపయోగించే రంగులు, పంట పొలాలకు ఉపయోగించే రసాయనిక ఎరువులు ఇవన్నీ నేలబొగ్గు నుండి తయారైనవే.అన్నిటికంటే ముఖ్యమైనది ఈ బొగ్గుతో నడుస్తున్న పవర్ హౌసులు,సిమెంటు కర్మాగారాలు,ఇనుము, ఉక్కు కర్మాగారాలు ఎంతో మందికి ఉద్యోగాలను కల్పించి ఎందరికో జీవనాధారం అవుతున్నాయి.ఈ విధంగా సింగరేణి కార్మికులకు,మనకు పరోక్ష సంబంధం ఉందని చెప్పవచ్చును.
IV సృజనాత్మకత/ ప్రశంస
1) సింగరేణి కార్మికులు గనిలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుపుతూ ఒక పోస్టరు తయారుచేయండి.
జ. జయహో కార్మిక! జాగ్రత్తలు పాటించండి! హాయిగా జీవించండి!
కార్మిక సోదరులారా! మీరు దేశానికి సేవలు చేస్తున్నారు. మీరు నల్లసూర్యులవంటివారు. మీ సేవలు జాతికి అవసరం.మీ అందరి ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి.గనుల్లోకి వెళ్లేముందు కొన్ని జాగ్రత్తలను తీసుకోండి.మీ కుటుంబాలకు అండగా ఉండండి.కొన్ని జాగ్రత్తలు:
1అనుకూలమైన,నాణ్యమైన బూట్లను ధరించాలి.2 నెత్తి మీద లైటుతో ఉన్న టోపీని పెట్టుకోవాలి.3 ఊపిరితిత్తుల పరీక్షలను చేయించుకోవాలి. ముందు జాగ్రత్తగా మందులు వాడాలి.4 కళ్ళకు అనువైన కళ్ళజోళ్ళు వాడాలి .5ఒంటరిగా గనుల్లోకి వెళ్ళవద్దు. ప్రాణంమీదకు తెచ్చుకోవద్దు.6 నెలకు ఒకసారి వైద్య పరీక్షలను చేయించుకోవాలి.7వ్యక్తిగత బీమా సౌకర్యాన్ని పొందాలి.8 నీరు ఊరుతున్న గనులవద్దకు తక్షణమే వెళ్లకుండా జాగ్రత్త వహించాలి.
ఇట్లు
సింగరేణి కార్మిక సేవాసమితి.
V పదజాల వినియోగం
1. కింద ఇచ్చిన జాతీయాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి.
అ) చెమటోడ్చు =శ్రమపడు
శ్రామికులు రోజంతా చెమటోడ్చి సంపాదించినది కనీస అవసరాలకే సరిపోదు.
ఆ) మూలస్తంభం= ఆధారం
ఖనిజ సంపదలు దేశాభివృద్ధికి మూలస్తంభాలు.
ఇ) బతుకుపోరు=బ్రతకడం కోసం చేసే పని
పల్లెల నుండి ఎందరో బతుకుపోరు చేస్తూ వలసలు పోతున్నారు.
ఈ) మసిబారు=కనిపించకుండా పోవడం
చేతివృత్తుల ప్రాధాన్యత తగ్గి వారి బ్రతుకులు మసి బారుతున్నాయి.
ఉ) తలమానికం=ముఖ్యమైనది
భారతదేశంలో సింగరేణి తలమానికం వంటిది.
2 పర్యాయపదాలు
తనువు =శరీరం, మేను, దేహం
భూమి =పుడమి, ధరణి, వసుధ
రేయి =రాత్రి, నిశీధి,యామిని
సువాసన =సౌరభం, సుగంధం ,పరిమళం
3 ప్రకృతి వికృతులు
అ) అచ్చెరువు (వికృతి) ఆశ్చర్యం ( ప్రకృతి)
ఆ) పట్టణం (ప్రకృతి) పట్నం (వికృతి)
ఇ) జంత్రము (వికృతి) యంత్రము( ప్రకృతి)
ఈ) ప్రాణం( ప్రకృతి) పానం (వికృతి)
VI భాషను గురించి తెలుసుకుందాం
1) కింది విడదీసిన పదాలను కలిపి రాయండి. సంధి పేరు రాయండి.
అ) కావాలంటే -ఇత్వ సంధి
ఆ) మూలాధారం -సవర్ణదీర్ఘ సంధి
ఇ) ప్రాంతమంతా -ఉత్వ సంధి
ఈ) ఎప్పుడెప్పుడు -ఉత్వ సంధి
ఉ) మహోద్యమం -గుణ సంధి
2) కింది విగ్రహ వాక్యాలకు సమాసపదం రాయండి.సమాసం పేరు రాయండి.
అ) మానవ నాగరికత - షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) అసాధ్యం - నైన్ తత్పురుష సమాసం
ఇ) రక్తమాంసాలు - ద్వoద్వ సమాసం
ఈ) నేలబొగ్గు - షష్ఠీ తత్పురుష సమాసం
ఉ) మూడు పూటలు - ద్విగు సమాసం
ఉపవాచకం
5 వ పాఠం -జానపద కళలు
ప్రశ్నలు- జవాబులు
1. జానపద కళలు అంటే ఏమిటి? కొన్నింటి పేర్లు తెలపండి.
జానపదం అంటే గ్రామం. జానపద కళలు అంటే పల్లె ప్రజల పాటలు, గేయాలు, సాహిత్యం, కళారూపాలను కలిపి జానపద కళలు అంటారు.ఒగ్గుకథ, బుర్రకథ, యక్షగానం,సిందుబాగోతాలు, చిడుతల రామాయణం,కోలాటం, భజన, తుపాకి రాముడు,పిట్టలదొర మొదలైనవి జానపద కళలకు ఉదాహరణలు .
భాగవతం,రామాయణం, గ్రామ దేవతల కథలు, వీరుల కథలు మొదలైనవి. జానపద కళల ద్వారా ప్రచారంలోకి వచ్చినాయి. నిరక్షరాస్యులైన పల్లె ప్రజలకు వినోదంతో పాటు నీతిసుత్రాల ఆలోచనను ఈ కళలు అందిస్తాయి.
2 యక్షగానం గురించి వివరించండి.
తెలుగు జానపద సాహిత్య ప్రక్రియల్లో యక్షగానం ఒకటి.వీటిని ఆడే వారిని యక్షగాన కళాకారులు అంటారు. కొన్ని చోట్ల వీటిని భాగోతాలని, నాటకాలని కూడా అంటారు .పాటలు, పద్యాలు,దరువు,ఆదితాళం మొదలగు ప్రక్రియలతో ఇది సాగుతుంది.ఎక్కువగా వీటిని రాత్రిపూట ప్రదర్శించేవారు. గ్రామంలోని కొందరు యువకులు మ్యాల్లం గట్టి యక్షగానాన్ని నేర్చుకుని ప్రదర్శించేవారు. ప్రజా కళలు ఎప్పుడూ ప్రజల వినోదానికి మాత్రమే ఉపయోగించేవారు కానీ సంపాదన కోసం కాదు. నృత్య,నాటక, సంగీత గాత్రాల కలబోత ఇది.ఆయాపాత్రల్లో నటులు నటించి నవరసాలు ఒలకబోస్తుంటే ప్రజలు పరవశంగా స్పందించేవారు. యక్షగానాలు కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చిన ఒక ప్రక్రియ. నాటకాలు యక్షగానాలు అయినా దైవ ప్రార్థనతో మొదలుపెట్టేవారు.
3 పగటి వేషగాడిని గురించి రాయండి.
జానపద కళాకారులలో పగటివేషగాళ్ళకు ప్రాధాన్యత ఉంది. వీళ్ళ వేషం, భాష నవ్వు పుట్టించే విధంగా ఉంటాయి.ఇతని మాటలు వింటే పగలపడి నవ్వుతారు.ఇతని మాటలు సరిగ్గా తుపాకి రాముడికి సరిపోతాయి.చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడుతూ పైకి ఎన్నో డాంబికాలు చెబుతున్నప్పటికీ తన వెనుక నున్న లేమిని గుర్తించిందని అందరిని నవ్విస్తూ ఇంటింటికి తిరిగి యాచిస్తుంటారు.
4 గొల్ల సుద్దుల గురించి రాయండి.
గొల్లలు చెప్పి సిద్ధులు గొల్ల సుద్దులు.సుద్దులు అంటే మాటలు. ఇందులో ప్రధాన కథకుడు కాక అటు ఇటు ఇద్దరు ఉంటారు. కథకుడు పాడే పాటను అతనికి ఇరువైపులా ఉన్న ఇద్దరు చెవిని చేతితో కప్పి సాగదీసి వంత పాడతారు. ఈ ప్రదర్శనలో వీరణాలు అనబడే పెద్ద డోలు కొమ్ములను ఉపయోగిస్తారు. గొల్లసుద్దుల ప్రదర్శనలో కథకుడు జనం మధ్య నుండి వేదిక మీదకి వస్తాడు. మిగిలిన ఇద్దరు చెరొక మూల నుండి గొర్రెలను అదిలిస్తున్నట్లు వేదిక పైకి వస్తారు.వీరి వేషధారణ మోకాళ్లదాక మడిచిన పెద్ద అంచు ఉన్న పంచె,నెత్తికి రుమాలు,చెవులకు దిద్దులు, ముంజేతికి కడియాలు,వెండి మొలతాడు, భుజం మీద గొంగళి,కాళ్ళకు గజ్జలు,చేతికర్రతో గమ్మత్తుగా ఉంటారు. రకరకాల యాసభాషలతో మొదటి నుండి చివరి వరకు నవ్వుల జల్లుల వలె ఉంటుంది.
11.కాపు బిడ్డ
-గంగుల శాయిరెడ్డి
ఉద్దేశం: ఏ ప్రాణికైనా బతకడానికి ఆహారం కావాలి. ఆ ఆహారం వ్యవసాయం నుండి లభిస్తుంది. వ్యవసాయం చేసే వారు రైతులు. వారిని కష్టాలు నిత్యం వెంటాడుతుంటాయి. ఆ కష్టాలను తెలియజేయడం ద్వారా శ్రామికుల పట్ల గౌరవం పెంపొందించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.
ప్రక్రియ: ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. వర్ణనలతో కూడినది కావ్యం.
ఈ పాఠం కాపుబిడ్డ కావ్యంలోని, కర్షక ప్రశంస అనే భాగం నుండి తీసుకోబడింది.
కవి పరిచయం:
గంగుల శాయిరెడ్డి జనగామ జిల్లాలోని జీడికల్లు గ్రామంలో 1890 లో జన్మించాడు. కాపుబిడ్డ, తెలుగు పలుకు, వర్షయోగం, మద్యపాన నిరోధం ముద్రిత రచనలు. గణిత రహస్యం, ఆరోగ్య రహస్యం అముద్రిత రచనలు. వీరి శైలి సరళంగా, సులభంగా ఉంటుంది. సహజకవి పోతనను ఆదర్శంగా తీసుకుని అటు హలంతో ఇటు కలంతో సమానంగా కృషి చేసిన శాయిరెడ్డి గారు 1975వ సంవత్సరంలో స్వర్గస్తులైనారు.
స్వీయరచన:
ఐదు వాక్యాల ప్రశ్నలు:
"ఇంద్ర పదవి కన్నా రైతు జన్మ గొప్పది" ఎందుకు?
జ: ఏ ప్రాణి జీవించాలన్న ఆహారం కావాల్సిందే.
అలాంటి ఆహారాన్ని పండించి మనకు అందించేవాడు రైతు. రైతు లేకపోతే ఈ లోకమే లేదు. ఇంద్రుడు కేవలం స్వర్గలోకానికి రాజు. దేవతలను పరిపాలిస్తూ రాజ భోగాలను అనుభవిస్తూ ఉంటాడు. రైతు భూమిపైనున్న సర్వ ప్రాణులకు ఆహారాన్ని అందించి ఆనందిస్తాడు. తన కష్టాలనే ఇంద్ర భోగాలుగా భావిస్తాడు. స్వార్థం అంటే తెలియకుండా తను కష్టపడుతూ ఇతరులకు సుఖాన్ని పంచుతాడు. కాబట్టి ఇంద్ర పదవి కన్నా రైతు జన్మ గొప్పది.
2.' జై జవాన్ జై కిసాన్' అంటారు కదా! రైతుకు సైనికునికి గల పోలికలు ఏమిటి?
జ:- రైతు మరియు సైనికుడు ఇద్దరూ కూడా దేశ క్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతూ ఉంటారు. రైతు రాత్రి పగలు తేడా లేకుండా నిద్రాహారాలు మాని దేశానికి ఆహారాన్ని పండిస్తున్నాడు. ఆహారం లేనిదే ఏ ప్రాణీ జీవించలేదు. ప్రజలందరికీ ఆకలి బాధ లేకుండా చేయగలిగిన వాడు ఒక రైతు మాత్రమే. సైనికుడు రాత్రి పగలు దేశాన్ని రక్షిస్తూ ఉంటాడు. దేశం కోసం తన ప్రాణాలు సైతం అర్పిస్తాడు. తన కుటుంబం గురించి ఆలోచించకుండా దేశ ప్రజల రక్షణ కోసమే కష్టపడుతూ ఉంటాడు. కాబట్టి రైతు సైనికుడు ఇద్దరూ కూడా దేశ ప్రజల కోసమే జీవిస్తున్నారని చెప్పవచ్చు.
3. రైతులకు ఐదు సమస్యలను చెప్పండి.
జ:- రైతులకు ఉన్నటువంటి సమస్యలు:-
1.పంటలు పండించడానికి సరియగు వర్షాలు కొన్ని సార్లు రావు మరికొన్ని సార్లు ఎక్కువ వర్షాలు పడి పంటలు నాశనం అవుతాయి.
2. మంచి విత్తనాలు ఎరువులు పురుగుల మందులు లభించకపోవచ్చు.
3. పెట్టిన పెట్టుబడికి సరి అయిన లాభం రాదు. పంట రుణాలు సైతం చెల్లించలేక పోతారు.
4. పండించిన ధాన్యం నిలువ ఉంచుకోవడానికి గిడ్డంగి సౌకర్యాలు లేవు.
5. పండిన పంట అమ్మడానికి సరైన మార్కెట్లు అందుబాటులో లేవు. ఉన్నా గిట్టుబాటు ధరలు లభించడం లేదు.
4.రైతు ప్రకృతితో మమేకమై ఉంటాడు దీనిని సమర్థించండి.
జ:- రైతుకు ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది. రైతు రాత్రి పగలు తేడా లేకుండా పొలంలో, అడవిలో చెట్ల మధ్య ఎండలో, వానలో తిరుగుతూ ఉంటాడు. అలసట వస్తే గులకరాళ్ళ పైనే నిద్రిస్తాడు. దారిలో ముల్లు గుచ్చుకున్నా, బురద ఉన్నా, రాళ్లు ఉన్నా నడుస్తూనే ఉంటాడు. ఎండకు, వానకు చెట్ల కిందే సేద తీరుతాడు. ఎన్నో కీటకాలు, పాములు, తేళ్లు మరియు క్రూర జంతువుల మధ్య ఒక మహర్షి లా తిరుగుతూ ఉంటాడు. ప్రకృతిలో లభించే ఆహారమే భుజిస్తాడు. ఈ విధంగా రైతు ప్రకృతితో మమేకమై జీవిస్తాడు అని చెప్పవచ్చు.
పది వాక్యాల ప్రశ్న:
1." రైతు సంతోషంగా ఉంటే సమాజం బాగుంటుంది" సమర్థిస్తూ రాయండి.
జ:- భారతదేశంలో ఎక్కువ జనాభా గ్రామాలలోనే నివసిస్తారు. ఆ గ్రామాలలో నివసించే ప్రజలంతా ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. ఈ వ్యవసాయం ఆధారంగానే భారతదేశానికి తిండి లభిస్తుంది. అందుకే 'రైతే దేశానికి వెన్నెముక' అంటారు. వ్యవసాయం వల్లే మనకు ఆహారం లభిస్తుంది. అందుకే 'రైతు ఏడ్చిన దేశం బాగుపడదు' అంటారు. ఎప్పుడైతే రైతు కష్టాలు లేకుండా, శ్రమకు తగిన ఫలితం లభించినప్పుడు, కుటుంబమంతా ఆనందంగా జీవించగలిగినప్పుడు మరిన్ని పంటలు పండిస్తాడు. లేదంటే వ్యవసాయానికి ముగింపు పలుకుతాడు. రైతు పంటలు పండిస్తే గ్రామాలలో చేతివృత్తుల వారికి పని దొరుకుతుంది. ఆ పంటల వల్ల కొన్ని పరిశ్రమలు, మార్కెట్లు, దుకాణాలు బాగా నడుస్తాయి. భూమి మీద ఉండే ఎన్నో ప్రాణులకు వ్యవసాయం వల్ల కడుపు నిండుతుంది. ఎక్కువ మంది వ్యవసాయం చేయడం వల్ల నిత్యావసరాల ధరలు అదుపులోకి వస్తాయి. పేద వారికి సైతం ఆహారం దొరుకుతుంది. నగరాలకు వలసలు తగ్గిపోతాయి. నిరుద్యోగం తగ్గుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ సైతం మెరుగుపడుతుంది. ఈవిధంగా ఒక్కొక్క రైతు సంతోషంగా ఉంటే సమాజం మొత్తం బాగుంటుంది.
పదజాలం:
సొంత వాక్యాలు:
హలం:- రైతు హలంతో పొలం దున్ని, బంగారు పంటలు పండిస్తాడు.
సైరికులు:- దేశానికి సైరికులే వెన్నెముక వంటివారు.
ప్రకృతి-వికృతులు:
రాత్రి-రాతిరి
బ్రహ్మ-బొమ్మ
శుచి-చిచ్చు
గర్వము-గరువము
పశువు-పసరం
చంద్రుడు-చందురుడు
పర్యాయ పదాలు:.
ముని=తాపసి
రాళ్ళు=శిలలు
మాపువేళ=సాయంకాలం
వ్యాకరణం:
I.కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
తాపసేంద్ర=తాపస+ఇంద్ర=గుణ సంధి
పరమాన్నము=పరమ+అన్నము=సవర్ణదీర్ఘ సంధి
కేలెత్తి=కేలు+ఎత్తి=ఉకార సంధి
గాఢాంధకారము=గాఢ+అంధకారము=సవర్ణదీర్ఘ సంధి
కొంపంత=కొంప+అంత=అకార సంధి
II.అలంకారాన్ని గుర్తించండ.
రైతు ముని వలె తెల్లవారుజామున లేస్తాడు.
జ:- ఉపమాలంకారం
రైతు- ఉపమేయం
ముని- ఉపమానం
వలె -ఉపమావాచకం
తెల్లవారు జామున లేవడం అనేది సమాన ధర్మం
వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లు ఉందా! అన్నట్లు ఉంది.
జ:- ఉత్ప్రేక్షాలంకారం
ఉత్ప్రేక్ష అంటే ఊహ ఇక్కడ చెట్టు కొమ్మను గొడుగుతో ఊహించి చెబుతున్నాడు కాబట్టి ఉత్ప్రేక్షాలంకారం.
అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు.
జ:- వృత్యానుప్రాస అలంకారం
ద్విత్వ క అనే అక్షరం పలుమార్లు రావడం జరిగింది కాబట్టి ఇది వృత్యానుప్రాసాలంకారం అని చెప్పవచ్చు.
ఛందస్సు:
ఉత్పలమాల, చంపకమాల లక్షణాలు పాఠ్యపుస్తకం చూసి నేర్చుకోండి.
క్రింది పద్య పాదాలు కు గణవిభజన చేసి ఏ పద్య పాదాలో గుర్తించండి.
న జ భ జ జ జ ర - చంపకమాల
III IUI UII IUI IUI IUI UIU
తనకు ఫలంబు లేదని యెదంద లపోయు డుకీర్తి గోరునా
భ ర న భ భ ర వ - ఉత్పలమాల
UII UIU III UII UII UIU IU
ఆకలి దప్పులన్ వనట నందిన వారికి పట్టెడ న్నమో
కార్యసాధకుడు కార్యసాధకుడు
12 వ పాఠం
మాట్లాడే నాగలి
మూలం : పొన్ కున్నం
అనువాదం: వేణుగోపాల రావు
పాఠం ఉద్దేశం
ప్రాణులకు -ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంవేదనలుంటాయని, మనం చూపే ప్రేమ,ఆప్యాయతలకు అవి స్పందిస్తాయని చెప్తూఅని చెప్తూ ,తద్వారా జీవకారుణ్య దృష్టిని పెంపొందింపచేయటం ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోకి మార్చు రాసినట్లయితే దాన్ని అనువాదం (Translation)అంటారు.తెలుగు సాహిత్యంలో దీనిని అనువాద ప్రక్రియగా పేర్కొనడం జరుగుతున్నది. సాహిత్య అకాడమీ వారు ముద్రించిన భారతీయ సాహిత్యం-సమకాలీన కథానికలు అనే గ్రంథంలోని మలయాళ భాషలోని అనువాదకథ ప్రస్తుత పాఠ్యాంశం. మలయాళ భాషలో పోన్ కున్నమ్ రాసిన కథను తెలుగులోకి ఎన్.వేణుగోపాలరావు అనువాదం చేశారు.
రచయిత పరిచయం
పాఠ్యభాగం పేరు :-మాట్లాడే నాగలి
రచయిత పేరు :- పోన్ కున్నం వర్కెయ్
కాలం :-1910-2004
రచనలు :-24 కథానిక సంపుటాలు,16 నాటికలు,2 కవిత సంపుటాలు ఒక వ్యాస సంకలనం, ఆత్మకథ మొదలైనవి.
ఇతర విశేషాలు :-మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతితో ఉన్న అనుబంధం ఈయన రచనల్లో ప్రధానాంశాలు.అంతేగాక గొప్ప మానవతావాది.
III స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) ఓసెఫ్ స్థానంలో మీరుంటే ఏం చేస్తారు?
జ. ఓసెఫ్ స్థానంలో ఎవరున్నా ఓసెఫ్ వలనే ప్రవర్తిస్తారు.పెంపుడు జంతువుల పట్ల, పశువుల పట్ల దయతో మెలగాలి.వ్యవసాయపు ఎద్దులను లేదా పాడిపశువులను అవి బలంగా శక్తితో ఉన్నప్పుడు స్వార్థానికి ఉపయోగించుకొని అవి అనారోగ్యం పాలైనప్పుడు,ముసలివైనప్పుడు నిర్లక్ష్యంగా వదలివేయకూడదు.వాటిని మన స్నేహితుల్లాగా, కుటుంబసభ్యుల్లాగా ఆదరించాలి.మనకు సేవలందించిన జంతువులు మన పట్ల అనుబంధాన్ని తెంచుకుని ఉంటాయి. వాటిని గమనించి అనుబంధాన్ని నిలుపుకోవలసిన బాధ్యత మనది.అంతేగాని ముసలి పశువులను వీధుల్లోకి వదిలేయడం, కసాయివాళ్లకు అమ్మడం చేయకూడదు.
ఆ): పశువులపట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు వింటే ఓసెఫ్కు చిర్రెత్తేది ఎందుకని?
జ. పశువుల్ని రక్షించాలి, పశువుల్ని రక్షించాలి అని ప్రతి వాడు ఉపన్యాసాలు ఇస్తాడు. కానీ వాటిని ఏ విధంగా రక్షించాలో ఎవడు ఆలోచించడు.వాటి తిండిని గురించి ఆలోచించడు.ఏ ఊర్లో కూడా ప్రభుత్వం ఒక వరి పొలానైనా పశువుల కోసం వదలలేదు. మరి అవి ఎలా పశువుల చేత మట్టిగడ్డలు తినిపించి రక్షిస్తారా?అంటూ ఓసెఫ్ ఆవేదన చెందాడు.అందుకే పశువుల పట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు వింటే ఓసెఫ్కు చిర్రెత్తేది.
ఇ) క్రయపత్రం అంటే ఏమిటి? ఏ సందర్భాల్లో దీనిని ఉపయోగిస్తారు?
క్రయపత్రం అంటే అమ్మకం,కొనుగోలు సమయంలోని ఒప్పందపత్రం. ఏదైనా ఒక స్థలంగాని, ఇల్లుగాని,పొలంగాని,పశువు మొదలైనవాటినిగాని అమ్మే సమయంలో లేదా కొనే సమయంలో రాసుకొనే పత్రమే క్రయపత్రం.క్రయం అంటే వెల ఇచ్చి కొనడం .విక్రయం అంటే అమ్మడం .ఇరువురి మధ్య ఏవిధమైన తగాదా లేకుండా ఉండటానికి ఈ పత్రాన్ని ఉపయోగిస్తారు.
ఈ) కన్నన్ తో తిరిగివచ్చిన తండ్రిని చూసి కత్రి ' నాన్నా! అంది.అట్లా అనడంలో ఆమె ఉద్దేశం ఏమై ఉంటుంది.
జ. కన్నన్తో తిరిగివచ్చిన తండ్రిని చూసి కత్రి తనకు కొత్త బట్టలు తెచ్చాడని ఆనందపడింది.కాని ఓసేఫ్ కొత్తబట్టలు కొనడానికి తీసుకువెళ్లిన డబ్బుతో కసాయివాని వద్ద చంపడానికి సిద్ధంగా ఉన్న తన కన్నన్ అనే ఎద్దును కొని తీసుకువచ్చాడు.ఇంక అతని వద్దడబ్బులు లేక కొత్తబట్టలు కొనలేదు. వట్టి చేతులతోనే తిరిగివచ్చాడు.అది చూసిన కత్రి దుఃఖంతో నాన్నా అంది.కొత్తబట్టలు కొని తెమ్మని పంపిస్తే పశువును కొనుక్కొచ్చావా? ఎంత పని చేశావు? అని అనడమే ఆమె ఉద్దేశం.
2 కింది ప్రశ్నకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
మూగజీవాలమీద ఎందుకు ప్రేమ చూపించాలి?
జ. ప్రాణికోటిలో ఒక్క మానవుడికే మాట్లాడే శక్తి ఉంది.అతడు ఆ శక్తి ద్వారా తన భావాలను కోరికలను ఇతరులకు తెలియజేయగలడు.ఇతరుల భావాలను గ్రహించగలడు.తన వసతికి, జీవనోపాధికి తగిన ఏర్పాట్లు చేసుకోగలడు ,తన సుఖసంతోషాల కోసం సమాజాన్ని అనుకూలంగా మలచుకోగలడు.
మూగజీవాలు తమ అవసరాలకోసం ఇతరులపై ఆధారపడి ఉంటాయి. వాటికి మాట్లాడే శక్తి లేదు కాబట్టి తమ కోరికలను వెల్లడించలేవు. నిజజీవితంలో ఎన్నో కష్టనష్టాలకు లోనవుతుంటాయి.అవి ఆత్మరక్షణ కోసం పడరాని పాట్లు పడుతూ ఉంటాయి. అందువల్ల మనం మూగజీవాలమీద ప్రేమ చూపించాలి.
IV సృజనాత్మకత/ ప్రశంస
1 మూగ జీవులకు నోరొస్తే………. ఊహాత్మకంగా ఒక కథ రాయండి.
జ. అనగనగా అదొక పల్లెటూరు.ఆ ఊర్లో ఒక రైతు ఉన్నాడు.ఆయన వద్ద ఆవులు, గేదెలు,ఎద్దులు చాలా ఉన్నాయి.పశుసంపద అధికంగా ఉండటంచేత ఆయన సుఖంగా జీవిస్తున్నాడు.కానీ అవి మూగజీవాలు కాబట్టి ఆ రైతు గడ్డివేసినప్పుడే తినడం,నీరు అందించినప్పుడే త్రాగడం చేస్తున్నాయి. వాటిని బంధించడం చేత అవి స్వేచ్ఛ లేకుండా జీవిస్తున్నాయి.
అదే మూగజీవాలకు నిరోస్తే తమ అవసరాలను తెలియజేసి వాటిని తీర్చమని కొరతాయి. సమయానికి తమకు ఆహారం పెట్టమని అడుగుతాయి. తమకు కూడా స్వేచ్ఛను ప్రసాదించమని వేడుకుంటాయి. మా ప్రాణాలు కూడా మీ ప్రాణాలవంటివే కాబట్టి మాకు ఏవిధమైన కష్టం కలగకుండా చూడమంటాయి.
V పదజాల వినియోగం
1 గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి
పసికడుతుంది=కనిపెడుతుంది
ఠీవి =దర్జాగా
అసహనం =ఓర్పు లేకపోవడం
అరిష్టం =కీడు
2 పర్యాయపదాలు
అ) హృదయం ,ఎద ,ఎడద
ఆ) ఆకలి, క్షుద్బాధ,బుభుక్ష
ఇ) సంబరం,సంతోషం, ఆనందం
3 నానార్థాలు
అ) దిక్కు : దిశ, శరణు
ఆ) ఉత్తరం : ఒకదిశ ,లేఖ
4 ప్రకృతి వికృతి
1) మేఘం ( ఏ) అ) అచ్చెరువు
2) హృదయం (ఊ) ఆ)ప్రేముడి
3) పశువు (ఎ) ఇ)రాతిరి
4) ఆశ్చర్యం (అ) ఈ)మొగము
5) సంతోషం (ఐ) ఉ)అబ్బురం
6) దీపం (ఒ) ఊ)ఎద
7) ప్రేమ (ఆ) ఎ)పసరం
8) సహాయం (ఓ) ఏ)మొగులు
9) ముఖము (ఈ) ఐ)సంతసం
10) అద్భుతం (ఉ) ఒ)దివ్వె
11) రాత్రి (ఇ) ఓ) సాయం
VI భాషను గురించి తెలుసుకుందాం
కింది సంధులను విడదీసి,సంధి పేర్లను రాయండి
ప్రేమ+ అనురాగాలు -సవర్ణదీర్ఘ సంధి
ఆనంద+ఉత్సాహాలు - గుణ సంధి
ఇంక+ ఎవరు -అత్వసంధి
ఎక్కడ+ అయినా - అత్వ సంధి
ఏమి+ ఉన్నది -ఇత్వ సంధి
చేతులు + ఎట్లా -ఉత్వ సంధి
పైకి + ఎత్తి - ఇత్వ సంధి
మరి+ ఎక్కడ - ఇత్వ సంధి
సారము+ అంతా -ఉత్వ సంధి
ఆలస్యము+ అయింది. -ఉత్వ సంధి
దుర్భరము+అయినా -ఉత్వ సంధి
రామ+ ఈశ్వరం -గుణ సంధి
2 కింది సమాసాలకు విగ్రహ వాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
1) కీళ్ల యొక్క నొప్పులు-షష్టి తత్పురుష సమాసం
2) తల్లియును, కూతురును-ద్వంద్వ సమాసం
3) దయతో కూడిన హృదయం-తృతీయ తత్పురుష
4 భూమి యొక్క శిస్తు-షష్టి తత్పురుష సమాసం
5) రాత్రియును, పగలును-ద్వంద్వ సమాసము
6) పది సంఖ్యగల సంవత్సరాలు-ద్విగు సమాసం
7 నాలుగు సంఖ్యగల దిక్కులు-ద్విగు సమాసం
ఉపవాచకం
6 వ పాఠం పి.వి. నరసింహారావు
ప్రశ్నలు -
పి.వి. నరసింహారావు గురించి రాయండి.
జ. భారత రాజకీయాల్లో అపర చాణక్యుడు వంటివాడు పీ.వీ.నరసింహారావు.వారి పూర్తి పేరు పాములపర్తి వేంకట నరసింహారావు. కవి,అనువాదకుడు, పాత్రికేయుడు,కథకుడు, నవలా రచయిత, 14 భాషలు మాట్లాడగలిగిన బహుభాషావేత్త.తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహామేధావి.
నిజాం వ్యతిరేక పోరాటంలో రాటుతేలిన నాయకుడు.రాజకీయ రంగంలో శాసనసభ్యునిగా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా,ముఖ్యమంత్రిగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా,కేంద్ర విదేశాంగశాఖ మంత్రిగా,మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రిగా మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడిపిన దేశ ప్రధానమంత్రిగా చరిత్రలో చిరకాలం నిలిచేవాడు పి.వి. నరసింహారావు.
2 పి.వి. నరసింహారావు బాల్యం, విద్యాభ్యాసం గురించి రాయండి.
జ. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామం పి.వి.నరసింహారావు స్వగ్రామం.పుట్టింది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 వ తేదీన సీతారామారావు, రుక్మాబాయమ్మలకు జన్మించాడు.వంగరకు చెందిన పాములపర్తి రంగారావు,రత్నాబాయిలు వీరి దత్త తల్లిదండ్రులు.1924 లో బాసరలో జ్ఞాన సరస్వతి సన్నిధిలో వీరి అక్షరాభ్యాసం జరిగింది. వంగర ప్రభుత్వ పాఠశాలలో ఓనమాలు దిద్దారు. 1928 నుండి 1930 వరకు హుజురాబాద్ పాఠశాలలో3,4 తరగతులు చదివారు.1936 లో హన్మకొండలో డిస్టింక్షన్ మార్కులతో మెట్రిక్ పాసయ్యారు.1938లో నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు రాష్ట్రంలో ఎక్కడా చదవకుండా నిర్భంధం విధించారు. మహారాష్ట్రలోని పుణెలో బి.ఎస్సి., నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్ .ఎల్.బి. పట్టా పొందారు.
3 పి.వి. నరసింహారావుగారు పాత్రికేయ వృత్తిని ఎట్లా నిర్వహించారు?
జ. భారతదేశంలో సాహితీ పరిమళాలు వెదజల్లిన అతి కొద్దిమంది రాజకీయవేత్తలలో నరసింహారావు అగ్ర తాంబూలానికి అర్హుడు. 1948లో కాకతీయ పత్రికను స్థాపించి తొలితరం పత్రికా రచయితలలో ఒకడయ్యారు.కాకతీయ పత్రికలో జయ అనే మారుపేరుతో అనేక రచనలు చేశాడు.తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో గొల్లరామవ్వ కథను విజయ అనే కలం పేరుతో కాకతీయ పత్రికలో రాశాడు.విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు నవలను హిందీలోకి సహస్రఫన్ పేరుతో అనువదించాడు. ఈ రచనకు నరసింహారావు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.పన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ పుస్తకాన్ని అబలజీవితం అనే పేరుతో అనువదించాడు.పి.వి.రాజకీయ సాహిత్య అనుభవాలను రంగరించి ఆంగ్లంలో వ్రాసిన' ది ఇన్సైడర్' అనే నవలకు విశేష ప్రాచుర్యం లభించింది. తాత్వికుడు, ప్రజాహితైషి చేసిన నిర్విరామ విఫలయత్నాల విషాద గాథే ది ఇన్సైడర్ .ఈ గ్రంథం 1998లో వెలువడింది ఈ గ్రంథం 'లోపలి మనిషి 'పేరుతో తెలుగులోకి కూడా అనువదించబడింది .తన చిన్ననాటి ఆత్మీయ మిత్రులు కాళోజీ నారాయణరావు, రామేశ్వరరావులతోపి.వి. చేసిన సాహితీ చర్చలు వారి సాహితీ తృష్టకు నిదర్శనాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి