బడిపంతులు అయ్యాను భగవంతుడా!
బతుకీడ్చుతున్నాను భగవంతుడా!
దారి చూపే దివ్వెనయ్యానయా!
బతుకంతా చీకటై పోయిందయా!
||బడి||
చుక్క పొద్దున లేచి వంటా-వార్పు చేసి
చద్ది చంకన పెట్టి బడిలోకి అడిగెట్టి
ఏడు కొట్టకముందే భగవంతుడా!
బడి గంట కొట్టేరు భగవంతుడా!
||బడి||
స్పెషల్ క్లాసులు చెప్పి క్లాసు టీచరునయ్యి
ఫీజు కట్టని వాళ్ళ ఇళ్ళిళ్ళు తిరిగాను
బడి మారవద్దంటూ బతిమాలుకున్నాను
బతుకు తెరువు కొఱకు వెతలెన్నో పడ్డాను
గాడిద చాకిరీ చేస్తే భగవంతుడా!
బూడిద మిగిలిందయ్యా భగవంతుడా!
||బడి||
పాఠమెట్ల చెప్పిన పదులెన్ని తెచ్చిన
పదివేల జీవితమే జీవితము సాగదే
మే నెల వస్తుందంటే నేనెలా బతకాలంటూ
గుండెల్లో దడ మొదలౌను ఎండను ఎదురించేను
వీధులన్నొ గాలించిన విద్యార్థులె చేరరాయే
విధిలేక బడిపంతులయ్యానయ్యా!
బతుకంతా బాధలే మిగిలాయయా!
||బడి||
బడిపంతులు అంటేనే బహు గొప్ప నాడు
సర్కారు కొలువైతే అది నిజమే నేడు
పాఠాలు చెప్పాలి మాటాడనివ్వాలి
కోతి చేష్టలు చూస్తూ కోపగించిన వద్దు
మర్యాద తప్పినా మందలించనువద్దు
గద్దించితే తప్పు చేయెత్తితే.. అమ్మో..పెద్ద తప్పు
అవహేళన ఎదురైనా అవమానం దిగమింగి
సహన శీలిగా మారి బహు ప్రేమ పంచాలి
||బడి||
-దండె రామ్మూర్తి
జాల సింగారం,యాదాద్రి జిల్లా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి