6, మే 2018, ఆదివారం

నా పేరు సూర్య సినిమా సమీక్ష

ఎదుటి వారి కోసం తన ఇష్టాల్ని చంపుకొని, ఎన్నో సంతోషాల్ని త్యాగం చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటే అతనో ఉత్తమ కొడుకు, ఉత్తమ భర్త, ఉత్తమ తండ్రి, ఉత్తమ పురుషుడు ఇంకా… సినిమా భాషలో చెప్పాలంటే ఉత్తమ కథానాయకుడు --
నువ్వు తలచుకుంటే ఏదైనా సాధించగలవు.. నీకు అసాధ్యమైందేదీ ఈ ప్రపంచంలోనే లేదు.. నువ్వు ఎవ్వరినైనా చిటికెలో మార్చేయగలవు…  అంతేనా నిన్ను నువ్వు కూడా మార్చుకోగలవు.
ఇలాంటి కథాకథనాలతో వచ్చిన సినిమాలు అనేకం మనం చూసాం ఆధరించాము. వాళ్ళలా మనం కూడా ఉండడానికి ప్రయత్నించాం.! అలా ఉంటేనే సమాజం లో బతకనిస్తారు లేదంటే వెలేస్తారు అన్న నిర్ణయానికి వచ్చాం. సమాజం ముసుగులో మనల్ని మనం తాకట్టుపెట్టుకున్నాం.. పెట్టుకుంటూనే ఉన్నాం.. ఇలా ముసుగు వేసుకొని గొర్రెళ్ళా ఎన్నాళ్ళు బతుకుతారు అని ప్రశ్నించటానికా?? అన్నట్లు వస్తున్నాయ్ ఈ మధ్య సినిమాలు. మొన్న గాక మొన్న వేణు ఊడుగుల గారు “నీది నాది ఒకే కథ” అనే సినిమాతో ఇదే విషయాన్ని మనకు చెప్పడానికి ప్రయత్నించాడు. ఇదే వరుసన మళ్లీ వక్కంతం వంశీ గారు అద్భుతంగా తెరక్కెక్కించిన చలనచిత్రం “నా పేరు సూర్య”.
ప్రస్తుతం ప్రతీ వ్యక్తి గొర్రెల మందలో ఒక గొర్రె వెంట ఇంకో గొర్రె ఎలాగైతే వెళ్తుందో అదే విధంగా తనూ ప్రవర్తిస్తున్నాడు. ఒకడు ఐఏఎస్ అయి గొప్ప పేరు తెచ్చుకుంటే “నేనూ ఐఏఎస్ అవుతా…!” ఒకడు చదువు సంధ్యా లేక వ్యాపారంలో రాణిస్తే “నేనూ వ్యాపారం చేస్తా..!!” వాళ్ళ ఊర్లో ఒకడు రాజకీయ నాయకుడు అయితే.. “నేనూ రాజకీయం చేస్తా” ఒకడు లంచాలకు మరిగి లక్షలు గడిస్తే వాడిలాగే ఇంకొకడు తయారు.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందాన ఉంది ప్రస్తుత సమాజ వైఖరి. మనకంటూ ఒక ఇష్టం లేదు మనకంటూ ఒక లక్ష్యం లేదు మనకంటూ మనసు లేదు మనకంటూ వ్యక్తిత్వం లేదు. అన్ని ఎవడికోసమో చంపుకుంటున్నా.. మార్చుకుంటున్నాం.. అవసరమైతే మళ్లీ మళ్లీ చంపుకుంటున్నాం… నిత్యం చస్తూ బతుకుతున్నాం. ఎన్నాళ్లిలా ఎవడో పుస్తకంలో ఇలా ఉండాలి అని రాస్తే అది చదివి అలా మారిపోవడానికి ప్రయత్నిస్తున్నాం.. 21 దినాలు ఒక ఇష్టం లేని పనిని మనసుకు దినం పెట్టి చేస్తే అది అలవాటుగా మారుతుందట… ఎవడి అలవాట్లో మన అలవాటుగా మారడానికి మన మనసుని ఎందుకు చంపుకోవాలి…. అది మాత్రం ఆలోచించం ఎందుకంటే మనకు ఎవడో నెలకు లక్ష సంపాదిస్తున్నాడంటే మనము కూడా సంపాదించాలి అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడాలి. కోపం వస్తే నవ్వాలి, బాధొస్తే భరించాలి, భయమేస్తే ధైర్యం నటించాలి నటిస్తూనే ఉండాలి అలా 21 రోజులు నటిస్తే అప్పుడు ఆ నటనే అలవాటయిపోతుంది. ఇలా మనల్ని మనం మోసం చేసుకుంటూ బతికినా చచ్చినట్టే… ఇదే విషయాన్ని తేటతెల్లం చేసింది “నా పేరు సూర్య” సినిమా..
ఈ సినిమా లో అల్లు అర్జున్ నటన చాలా బాగుంది.. మంచి సందేశాన్ని ఇవ్వటానికి ప్రయత్నించాడు వక్కంతం వంశీ గారు. తీవ్రవాదులు ఎక్కడినుండో రావట్లేదు మన చుట్టు పక్కనే కొందరి దుర్మార్గాల వల్లనే తయారు కాబడుతున్నారు అని అసలు వాస్తవాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. అన్యాయం జరిగినప్పుడు పిల్లి కూడా పులిలా గాండ్రిస్తుంది, ఎదురు తిరుగుతుంది. అన్యాయం చేసిన వాన్ని చీల్చి చెండాడుతుంది. అది సాధ్యం కానప్పుడు.. ఎలాగోలా పగతీర్చుకోవడానికి ఎలాంటి దారినైనా ఎన్నుకోవడానికి వెనకాడదు. దాని అంతిమ లక్ష్యం పగ తీర్చుకోవడం. కాబట్టి దేశద్రోహులు అనే వారుండరు పరిస్థితులే వారిని అ స్థితికి దిగజారేలా చేస్తాయి అని నిరూపించింది ఈ సినిమా.. మనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పర్చుకొని ఆ వ్యక్తిత్వాన్ని చంపుకోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి అని సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చారు వక్కంతం వంశీ గారు. కాని ఇంత చిన్న సందేశం ఇవ్వడం కోసం ఇంత సినిమా తీయడం అవసరమా అని ప్రేక్షకులకి అనిపించడం సహజం. ఇందులో కథానాయకురాలు అను ఇమాన్యుయెల్ పాత్ర ఎందుకు పెట్టారన్న ప్రశ్న ప్రతీ ప్రేక్షకుడికి ఉదయిస్తుంది ఇది పూర్తిగా ప్రాధాన్యం లేని పాత్ర. ఇంకా అర్జున్ పాత్ర విషయానికి వస్తే  అతనొక సైకాలజీ ప్రొఫెసర్. అతను సంతకం పెడ్తె బోర్డర్ లో జవాన్ గా పంపడమేమిటో ఎంత బుర్ర గోక్కున్నా అర్థం కాదు సగటు ప్రేక్షకుడికి. మొత్తానికి మన వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దనే చిన్న సూక్తి చెప్పడానికి దర్శకుడు నానా పాట్లు పడ్దాదన్నది వాస్తవం..

**రామమూర్తి దండె, MA,MA,B.Ed,UGC-NET,TS-SET,(M.Phil)**

##జాల సింగారం##

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu