29, ఏప్రిల్ 2018, ఆదివారం

రైలులో ప్రయాణం చేస్తూ, కిటికీ పక్క కూర్చొని చూసే సన్నివేశాలు మనసును గిలిగింతలు పెడతాయి. కిటికీ సందుల్లో ఎన్నో చిత్రాలు జ్ఞాపకాలుగా మారి మనసులోతుల్లోంచి అనుభావ క్రమం దొంతరదొంతరలుగా ప్రవహిస్తుంది. మనం చూస్తున్న మనుషులు చేసే చేష్టలు మనకు వింతగా, విచిత్రంగా తోస్తాయి ఏదో తెలియని అనుభూతి మన సొంతం అవుతుంది.. ఆ ప్రయాణానుభవం ఒక తీపి గురుతుగా మిగిలిపోతుంది.

 ఇలాగే ముళ్లపూడి వెంకటరమణ గారి "జనతా ఎక్స్ ప్రెస్" లో ప్రయాణం సైతం మనకు ఎన్నో జ్ఙాపకాలను పంచుతుంది. ఈ ప్రయాణంలో మనకు ఐదు స్టేషన్లు తారాస పడుతాయి.
 ముందుగా మన ప్రయాణం "ఆకలీ ఆనందరావు" వైపు....
  ఆకలి ఆనందరావును ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తూ, ముళ్ళోకాలు తిప్పుతుంది. ఆకలి తీర్చుకోవడానికి అప్పు సైతం పుట్టదు ఆనందరావుకి పాపం. కనీసం ఇతడు ఆపదలో ఇచ్చిన బాకీ సైతం తీర్చక మొకం చాటేస్తారు కొందరు దుర్బుద్ధులు. గుక్కెడు కాఫీ నీళ్ళు సైతం లభించక లభో దిభో మంటాడు.
అలాంటి దీనావస్థలో ఉన్న ఆనందరావు మనసు అప్పు, సినిమా కథ, పుస్తకం, అమ్మాయి, అందం, ఆస్తి, మేడలు, టీ , కాఫీ, భోజనం, ఆకలి ఇలా పిచ్చి పిచ్చి ఊహలతో ఓలలాడుతూ ఉంటుంది. ఇలా మూడు దినాలు ముద్దలేకుండా గడుస్తుంది .. నోరు పిడచ కట్టుకు పోతుంది, కాళ్ళు కదలనంటాయి, ఒళ్ళు ఓపికలేదంటుంది, మనసు కుర్రకుంకలా ఊహల్లో తేలిపోతుంది - ఊహలో కలువ కనుల సుందరి సీత ఖరీదైన కారులో వచ్చి తలుపు తీసి లోనికి ఆహ్వానించింది.. కారు ఎక్కి పక్కన కూర్చున్న ఆనందరావును ఇంకా దగ్గరకి తీసుకుంది అతిలోక సుందరి సీత... అంతే అతి ఆనందం భరించలేని ఆనందరావు ఆత్మ ఆకాశ మార్గం పట్టింది.....
చివరగా ఆనందరావు ఆత్మ నాయర్ కొట్టులో బన్ను, సింగిల్ టీ, చార్మినార్ సిగరెట్టు ఆర్డర్ ఇవ్వడం కొసమెరుపు.))))))))))

    ఈ జనతా ఎక్స్‌ప్రెస్ తరువాతి స్టేషన్ "ఈశ్వరేచ్ఛ".
గజేంద్ర మోక్షం కథలో సాక్షాత్తూ విష్ణు భగవానుడే మొసలి బారి నుండి గజేంద్రున్ని రక్షించేందుకు   దివి నుండి భువికి రావడం జరిగింది. ఇక్కడ కష్టాల్లో ఉన్న గజపతిని రక్షించేందుకు ఆ మహా విష్ణువు లక్ష్మీదేవి వారిస్తున్నా వినకుండా సన్నద్ధమవుతాడు.
     గురునాథరావుకి వాడి మావయ్య ఒక వాచీ ఇచ్చి బాగుచేయించడానికి పది రూపాయలు ఇస్తాడు అది కాస్తా వాడు పేకాటలో పోగొడతాడు... వాటిని సంపాదించేందుకై అప్పు చేస్తాడు దాన్ని తీర్చేందుకై ఏకంగా చేతి గడియారాన్నే తాకట్టు పెడ్తాడు....
ఆ డబ్బుతో ఉద్యోగం సంపాదించాలని తలచి గజపతి అనే మహానుభావుడికి ఆ డబ్బులు కాస్తా అర్పనం చేస్తాడు...
ఇక చూడాలి వాడి గోస అటు ఉద్యోగం రాక, అటు డబ్బులు లేక, చేతి గడియారం దొరకక మావయ్య వస్తే ఏం చెప్పాలో తెలియక జజపతిని మొసలి లాగ పట్టి పీడిస్తుంటాడు... కాని వాడు కాణీ విదిల్చడు...
 ఇలా సాగుతుండగా ఇంక గజపతిని నమ్ముకుంటే లాభం లేదని తలచి ఓ స్నేహితుడి మాట మీద అప్పు కోసం ఓ దూర గ్రామం బయలుదేరాడు.
అక్కడా నిరాశే మిగిలింది గురునాధరావుకి... కొద్ది ఆశ మల్లి తారస పడింది అనుకోని విధంగా... అదే గ్రామంలో గజపతి మళ్ళీ ప్రత్యక్షం అయ్యాడు... అంతే మళ్ళీ నీటిలో ఏనుగు దొరికిన మొసలిలా పట్టుకున్నాడు.
     ప్రయాణానికి ఏ వసతిలేని గ్రామం అది, ఎర్రటి ఎండాకాలం ఎండ.  ఎలాగోలా ఓ బండి కిరాయికి మాట్లాడుకొని తోలేవాడులేక గురునాధరావునే మచ్చిక చేసుకొనొ బయలుదేరాడు గజపతి.
మధ్యలో దాహంతో నానా యాతనా పడతారు.. ఎన్నో పేచీలు పెడ్తూ కర్ణుడికి శల్య సారధ్యం లా వారి ప్రయాణం సాగుతుంది... ఎన్నో హాస్య సంఘటనల తర్వాత తన డబ్బు చివరికి వసూలు చేసుకుంటాడు గురునాధరావు.

  తర్వాత స్టేషన్ "జనతా ఎక్స్‌ప్రెస్". మధ్య తరగతి కుటుంబాలు ఎలా ఉంటాయో వారి ఆశలు, ఊహలు ఏ విధంగా తేలిపోతుంటాయో తెలుసుకోవచ్చు.
వీర్రాజు ఇంట్లో ఎందరో మధ్యతరగతి కుంటుంబాలు అద్దెకి ఉంటాయి వారి మధ్య జరిగిన సంఘటనలే ఈ జనతా ఎక్స్‌ప్రెస్...
టూషన్లు చెప్పుకునే జానకికి వీర్రాజును జోడీగా ఇరుగుపొరుగు ఎలా చేస్తారనేదే ఈ కథానిక సారాంశం‌..
మధ్యలో వీర్రాజు పడే మధనం కథను రక్తి కట్టిస్తుంది..

మన ప్రయాణంలో మరొక మజిలీ "మహరాజు యువరాజు". మహరాజు మహరాజులా పోజు కొడుతూ తన దర్పాన్ని ప్రదర్శిస్తూ, లేని గొప్పలకు పోయి జేబుకు చిల్లు పెట్టుకుంటూ ఉంటాడు.
ఇక యువరాజు జేబులో రూపాయి ఉన్నా మనసులో ఎన్నో అందమైన ఊహలతో కాలం గడుపుతూ ఉంటాడు.
మహరాజు అన్ని దుకాణాలు తిరుగుతూ జేబులో చిల్లి గవ్వ లేకున్నా బేరాలాడుతూ బేరం కుదరక మరలి పోతున్నట్టు బీరాలు పోతూ మనసులో గర్వం నటిస్తూ ఉంటాడు.
యువరాజు అందమైన రాకుమారిని తలచి ఊహలకి రెక్కలు తొడిగి ఆకాశంలో విహరిస్తూ ఉంటాడు.

చివరికి మహరాజు, యువరాజు కూడా ఏమీ చేయలేక ఒక్క రూపాయి కాస్తా ఏ టీ కొట్టులోనో తగలపెట్టి చక్కా ఇంటికి చేరుతారు.

మనం ప్రయాణిస్తున్న జనతా ఎక్స్‌ప్రెస్ నాలుగు స్టేషన్లు దాటి చివరి దైన "కానుక" అను స్టేషన్ చేరడానికి సిద్ధంగా ఉంది.

యమునా నది ఒడ్డున గోపన్న పిల్లనగ్రోవి తయారు చేస్తుంటాడు కృష్ణాష్టమికి చిన్ని కన్నయ్యకు బహుమానం ఇవ్వడానికి...
రాత్రిపగలు, ఆకలినిద్ర, కష్టంసుఖం, బంధంబంధుత్వం అన్ని మరిచి గోపన్న ఏకాగ్రతగా శ్రద్ధగా చాకచక్యంగా ఎంతో నేర్పుతో చక్కగా తయారు చేస్తాడు .... ఒక్క సారి పరీక్షించి చూస్తే అది కాస్తా బొంగురు పోయిన శబ్దం ఎంతో కటువుగా వినిపిస్తుంది... దాంతో ఇది బాగా లేదని పక్కన పెట్టి మరలా ఇంకో మురళి చేయడంలో నిమగ్నమౌతాడు గోపన్న..
ఇలా చేస్తూ.. పరీక్షిస్తూ ఉండగా ఉండగా వేణువులు కాస్తా గుట్టలా పేరుకుపోతాయి..
తెల్లవారితే కృష్ణాష్టమి రాత్రంతా కష్టపడి ఒక మురళిని శ్రద్ధాసక్తులతో సిద్ధం చేసాడు గోపన్న. అలానే అలసి పోయి నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు గోపన్న కొడుకు చిన్న గోపన్న ఆ మురలిని ఎలుక కొరుకుతుందేమో అని పందిరి మీద పెడతాడు. అప్పటికే పందిరిమీద ఎన్నో వేణువులు గుట్టలా ఉన్నాయి.
మరునాడు నిద్రలేచిన గోపన్న పిల్లనగ్రోవి కనబడకపోవడంతో చిన్న గోపన్ననడగగా పందిరి పైన వేసానంటాడు... అయ్యో ఎంత పని చేసావు అంటూ అన్ని కిందికి తీసి ఒక్కో దాన్ని నాధం చేస్తూ పరీక్షించ సాగాడు.. రాత్రి అయింది చివరకు ఒకటి మాత్రమే మిగిలింది దాన్నే నమ్మకంగా చిన్న గోపన్నకిచ్చి  చిన్ని కృష్ణుడికి  జన్మదిన కానుకగా పంపుతాడు పెద్ద గోపన్న. కొద్ది సేపటికి గుట్టలా ఉన్న వేణువులు అన్నీ లేచి సుస్వర రాగాలతో ఆలపించ ప్రారంభించాయి.. మధురాతి మధురమైన సన్నని, తీయని ఆలాపనలతో... ఆశ్చర్యం అద్భుతం అనిర్వచనీయమైన అనుభూతుకి లోనయ్యాడు గోపన్న.. అంతలోనే వేణువులన్ని నిశ్శబ్దంగా ఉన్నచోటే పడిపోయాయి.. కొద్దిసేపట్లోనే చిన్న గోపన్న వచ్చి నాన్న చిన్ని కృష్ణయ్య మురళిని వాయించాడు కాని అస్సలు శబ్దమే రాలేదు అసలేమి‌ వినిపించలేదు అంతా నిశ్శబ్దం ఆవరించింది..
కాని ఆ మధుర స్వరం ఇక్కడ వినిపించింది అంతా కృష్ణలీల..... అంటూ అనిర్వచనీయ సంతోషం పొందాడు గోపన్న....

ఇలా జనతా ఎక్స్‌ప్రెస్‌ లో మన ప్రయాణం ఎంతో సంతోషకరంగా ముగిసింది... సెలవు..

ధన్యవాదాలు క్రీ.శే,, ముళ్ళపూడి వెంకటరమణ గారు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu