15, ఏప్రిల్ 2018, ఆదివారం

జీవితంలో ప్రతీ క్షణం ఆస్వాదించండి

       జీవితంలో ప్రతీ క్షణం ఆస్వాదించండి


తెలుగు నవలా రంగంలో నూతన ఒరవడి తీసుకొచ్చిన రచనలు రావి శాస్త్రి గారి అల్పజీవి, బుచ్చిబాబు గారి చివరికి మిగిలేది, నవీన్ గారి అంపశయ్య, వినుకొండ నాగరాజు ఊబిలో దున్న ముఖ్యమైనవి అని చెప్పవచ్చు. వీరు ఇందులో మనోవిశ్లేషణ పద్ధతిని ఉపయోగించారు. ఇది ఆంగ్ల మనోవిజ్ఞాన శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆలోచనల నుండి వెలువడినవని చెప్పవచ్చు. తెలుగులో ఇలాంటి పద్ధతిలో నవలలెన్నో వచ్చినా, సినిమాలు మాత్రం అసలు రాలేదనే చెప్పుకోవచ్చు. ఇదే పద్ధతిలో మొదట వచ్చిన సినిమా "నీది నాది ఒకే కథ". దీన్ని వేణు ఊడుగుల అనే దర్శకుడు తెరకెక్కించాడు.
  సినిమా పూర్తిగా సాగర్ అనే కథానాయకుడి చుట్టే తిరుగుతుంది. సాగర్ పడే అంతరంగిక మధనం అనే కథా వస్తువును తీసుకుని సినిమా అంతా ప్రేక్షకులకు ఆహ్లాదం కలిగించేలా చిత్రించడం మెచ్చుకోదగిన విషయమే...
    సాగర్ లాగా ఎందరో చదువులో వెనకబడిన పిల్లలు మన చుట్టు ఎందరో కనిపిస్తూ ఉంటారు.. వాళ్ళ తల్లిదండ్రులు నిత్యం వారిని పాఠశాలకు పంపేందుకు నానా యాతనా పడడం సైతం మనమందరం చూసే విషయమే. అలాంటి పిల్లవాడికి ఇంకేదో అంతర్గత నైపుణ్యం ఉండే ఉంటుంది కాని అది వెలికి తీయడంలో ఇటు తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయులు విఫలమవుతున్నారు. అది కేవలం వారి లోపమని చెప్పడం భావ్యం కాదు అది తప్పకుండా విద్యావ్యవస్థ లోపం మాత్రమే. విద్యాప్రణాళిక  ఎంతో లోపాయకారిగా ఉంది మన రాష్ట్రాలలో.. ప్రతి విద్యార్థి అవసరం ఉన్నా లేకున్నా అన్ని సబ్జెక్టులు చదవాల్సిందే.. మూడు భాషలు ముప్పుతిప్పలు పడి బట్టీయం పట్టాల్సిందే...
  ఈ విద్యా వ్యవస్థ లోపం వల్లే చదువులో విద్యార్థులు వెనక బడుతున్నారు. వారి యొక్క సహజసిద్ధ మైన శక్తి సామర్థ్యాన్ని సైతం వారు మరిచిపోతున్నారు.
  ఈ సందర్భంగా ఒక కథను ఉదహరించుకోవాలి. అనగనగా ఒక అడవి  అందులో జంతువులన్ని కలిసి ఒక బడిని ప్రారంభించాయి. అందులో అందరికి సమ న్యాయం కలిగేలా విద్యలు నిర్ణయించారు అవి ఎగరడం,చెట్లెక్కడం,బొరియలు తవ్వడం,ఈదడం. ఆ బడిలో జంతువులన్నీ తమ పిల్లలను చేర్పించాయి.
   కుందేలు బొరియలు తవ్వడంలో మొదటి స్థానం పొంది మిగితా వాటిలో చివరి స్థానంతో సరిపెట్టుకుంది.
  పక్షి ఎగరడంలో మొదటి స్థానంలో ఉండి మిగితా వాటిలో వెనకబడింది.
  ఉడుత చెట్లెక్కడంలో ప్రథమ స్థానంలో ఉండి మిగితా వాటిలో చివరి స్థానం పొందింది.
  చేప ఈదడంలో పూర్తి మార్కులు సాధించింది కాని నీటి నుండి బయటకి రాలేక  మిగితా వాటిలో పాల్గొననేలేదు.
  కుక్క మొరగడంలో తరగతులు లేవని బడికి రావడం మానేసింది.
  ఇలా  కొద్దికాలం గడిచేకొద్దీ అవి రాని విద్యలపై దృష్టి పెట్టి వాటికి వచ్చిన విద్యలో కూడా మార్కులు తగ్గనారంభించాయి. బడి ప్రారంభించిన పెద్దలు మాత్రం అందరికి సమ్మిళిత విద్య లభిస్తుందని ఎంతో సంతోషించాయి.

   పై విధంగా ఉంది మన విద్యా వ్యవస్థ తీరు. తద్వారా యువకులలో చదువు రాక పోతే ఇక జీవితమే వ్యర్థం అనే విధంగా మారిపోయి ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. అందరు బాగా చదివి, అంతా కలెక్టర్లు, పోలీస్ ఆఫీసర్ లు, టీచర్ లు, ప్రొఫెసర్ లు అయిపోతే మరి మిగితా వృత్తుల వారు, మిగితా పనులు చేసేవారు ఎలా తయారవుతారు. ప్రపంచం ఎలా ముందుకు సాగుతుంది.
యువకులంతా రకరకాల వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదివి, వివిధ వ్యక్తులు ఇచ్చే ఉపన్యాసాలు విని వారు చెప్పినట్టుగా మారిపోవాలని ప్రయత్నిస్తూ తమ వ్యక్తిత్వాన్ని పూర్తిగా చంపుకుంటున్నారు. అలా ఉండలేక, మారలేక, నిత్యం నటించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. నువ్వన్నీ చేయగలవు, నీలో ఎంతో శక్తి ఉంది, నువ్వు ఇది అవుతావు,అది అవుతావు అంటూ ఊదరగొడ్తూ లేని కోరికలు  పుట్టిస్తూ తీవ్ర మానసిక ఒత్తిడిని కలుగజేస్తున్నారు. ఒకవేళ అనుకున్నది కాకపోయినా ఏదో ఒకటి సాధిస్తే పర్వాలేదు కాని ఏది సాధించక కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైతే.. వెనకకు తిరిగి చూసుకుంటే యవ్వనం అంతా ఎన్నో చిన్న చిన్న ఆనందాలను కోల్పోయి  జీవితంలో విలువైన సమయం వృధా అయినట్టు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది.
అప్పుడు చేసేది ఏమి లేక చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ బతుకు బండిని నడపాల్సిందే...
కాబట్టి ముందు నుండే జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆనందంగా గడపడమే మంచిది....
ఇదే విషయాన్ని ఈ సినిమా కళ్ళకు కట్టినట్టు మనకు చూపించింది.

                --రామమూర్తి దండె

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu