11, ఫిబ్రవరి 2018, ఆదివారం

మన విద్యా వ్యవస్థ తీరుతెన్నులు

ప్రతి ఒకరు తెలుసుకోవలసిన విషయం   

 *తలకిందుల చదువును సరిచేసేదెవరు?*

ఆంధ్ర జ్యోతి:
*ఇప్పుడు ప్రభుత్వం ఏ ఎరువులు వాడాలో, ఏ పురుగుల మందు ఎంత మోతాదులో వెయ్యాలో రైతులకు చెప్పటానికి ప్రతి గ్రామంలోనూ నిపుణుల్ని నియమిస్తానంటున్నది. వాళ్ళకు ఏ ఆరు నెలలో శిక్షణ ఇచ్చి నియమిస్తారు. మరి ఈ నిపుణులకు ఆరు నెలల్లో ఇవ్వగలిగిన పరిజ్ఞానాన్ని ఆ రైతులే విద్యార్థులుగా ఉన్నప్పుడు పదేళ్ళ చదువులో ఎందుకు ఇవ్వలేకపోయారు? లోతైన క్లిష్టమైన థియరీ అంతా పాఠశాల ఇంటర్‌ స్థాయిల్లో పెట్టి, నిత్య జీవితంలో అన్వయించుకోగల విద్యను మాత్రం పైస్థాయి కోర్సుల్లో బోధించే తలకిందుల చదువు వల్ల ఏం ప్రయోజనం?*

*మెకాలే విద్యావిధానాన్ని నిర్మూలించాలని కనీసం అరవ య్యేళ్ళుగా నినదిస్తున్నాం. కాని ఎలా మార్చాలో, దాని స్థానంలో ఏం ప్రవేశపెట్టాలో ఎవరూ చెప్పటం లేదు. శాస్త్రీయ విద్యావిధానం అన్న నినాదాన్నీ దశాబ్దాలుగా వింటున్నాం. అది కూడా ఎవరికీ అర్థం కాలేదు. కానీ కౌమారంలోని పిల్లలు వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకొనే దయనీయమైన, వికృతమైన వ్యవస్థను మాత్రం తయారుచేశాం. ముక్కుపచ్చలారని పిల్లలు గుంపులుగా ప్రాణాలు తీసుకుని రాలిపోతుంటే ఏమిటిదన్న ధర్మాగ్రహం కూడా ప్రదర్శించలేని స్థితప్రజ్ఞతకు పౌరసమాజం చేరుకుంది.*

*ఈ విషయంపై ప్రొ.హరగోపాల్‌, ‘‘చదువు అంటే ఒక ఆనందమైన అనుభూతి కదా! జ్ఞానార్జన ఒక గొప్ప జీవితానుభవం కదా’’ అని రాశారు. నిజమే. కాని చదువు అంటే ఒక ఆనందమైన అనుభూతి అని భావించే ఒక్క విద్యార్థినైనా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా చూపించగలరా? బస్సుల్లో వెళ్ళే ఎల్‌కెజి, యుకెజి, ఒకటి రెండు తరగతుల పిల్లలు కూడా ఉదయం 7–-8 గంటల మధ్య బయలుదేరి సాయంత్రం 6–7 గంటలకు ఇంటికి చేరుతున్నారు. ఇంటి దగ్గర మళ్ళీ ఒకటి రెండు గంటలు హోంవర్క్‌!*

*పాఠశాల స్థాయి పిల్లల ఆనందాన్ని కబళించే ప్రధాన శత్రువు అధిక చదువు. ఒకటవ తరగతి విద్యార్థికి మూడు భాషలు నేర్పాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడే మన పాలకులకు విద్యావ్యవస్థపై ఎంత తక్కువ అవగాహన ఉన్నదో అర్థం అవుతుంది. ఒకటి రెండు తరగతుల విద్యార్థులకు మూడు భాషలు నేర్పడం ప్రపంచంలో ఇంకెక్కడా జరగదు. ప్రాథమిక విద్యార్థులకు మాతృభాష మాత్రమే నేర్పుతారు. ఇతర భాషలు నేర్చుకోవాలనుకొనేవారు డిగ్రీ స్థాయిలో వారికి ఇష్టమైన భాషలు నేర్చుకుంటారు.*

*ఒక భాషను నేర్చుకుంటున్నామంటే అందులో కనీసం మాట్లాడటం రాయడం రావాలి కదా! మరి ఇందులో ఎంతవరకు విజయం సాధించాం. ఒకటవ తరగతి నుంచి డిగ్రీ రెండవ సంవత్సరం వరకు ఇంగ్లీషును ఒక సబ్జెక్టుగా 14 సంవత్సరాలు చదివిస్తున్నాం, పరీక్షలు పెడుతున్నాం. అన్నేళ్ళ చదువు తరువాత ఆ భాషలో ఒక వాక్యం సొంతంగా రాయడం కాని, మాట్లాడటం కాని చెయ్యలేకపోతున్నారు. మరి ఈ పద్నాలుగేళ్ళ సమయం ఎందుకు వ్యర్థం చేసినట్లు? పరాయి భాష తమకు రాకపోయినా– విపరీతమైన క్షోభకు గురై పరీక్షలు రాసిందెందుకు? స్వాతంత్ర్యం వచ్చిన ఈ డెబ్బై ఏళ్ళలో కేవలం ఇంగ్లీషు పరీక్ష పాసు కాలేక చదువులు మానేసిన వాళ్ళు ఎన్ని లక్షలమంది? పాసైన వాళ్ళకైనా వచ్చిన ఇంగ్లీషు ఎంత? అసలు భాష నేర్చుకోవటంలోని ప్రాథమిక లక్ష్యమైన అభివ్యక్తీకరణ రానప్పుడు దాన్నెందుకు చదివిస్తున్నాం? తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియం పాఠశాలల వైపు ఆకర్షితులవటానికి ప్రధాన కారణం ఇంగ్లీషులో మాట్లాడగలగటమే కదా. ఆ పని తెలుగు మీడియంలో కూడా చెయ్యగలిగితే పిల్లలు ఒకటో తరగతి నుండే పరాయి భాషలో అర్థం అయ్యి అవకుండా బట్టీలు పట్టే క్షోభ ఉండేది కాదు. సంభాషించేలా భాష నేర్పటం మనకు రాదు. మనది పరీక్ష ఆధారిత విద్యా వ్యవస్థ. పరీక్షలలో ప్రశ్న, జవాబులు, వ్యాకరణ ప్రశ్నలు అడగగలరు. స్కూల్లో అవే నేర్పుతున్నారు. గ్రామరు నేర్పడం ద్వారా భాష నేర్పలేమని ఇన్నాళ్ళకీ తెలుసుకోలేకపోతున్నాం.*

*హిందీ పరిస్థితి కూడా ఇంతే. 2వ తరగతి నుంచి (ప్రవేటు స్కూళ్ళలో ఒకటి నుంచి) 10వ తరగతి వరకు తొమ్మిదేళ్ళు చదివిన తరువాత కూడా ఎవ్వరూ హిందీలో మాట్లాడలేకపోతున్నారు. పెద్దయిన తరువాత నాలుగైదు నెలల్లో నేర్చుకోగలిగిన భాషను చిన్న పిల్లలకు పదేళ్ళ పాటు బోధించి హింసించటమెందుకు? అసలు చిన్న పిల్లలకు మూడు భాషలు నేర్పడమేమిటి? వీటిలో రెండు భాషలు తగ్గినట్లయితే పిల్లలపై ఎంత బరువు తగ్గేదో ఆలోచించండి. దశాబ్దాల పాటు ప్రయోజనమేమీ కలగజేయని ఈ భాషా విధానాన్ని వెంటనే మార్చెయ్యాలి, హిందీని కనీసం 8వ తరగతి వరకైనా తీసెయ్యాలి. ఇంగ్లీషును ప్రాథమిక స్థాయి వరకూ సిలబస్‌ నుంచి, పరీక్షల చట్రం నుండి తప్పించి కేవలం సంభాషణా భాషగా ఉంచాలి.*

*ఇక మిగతా సబ్జెక్టులలో ఏమి బోధిస్తున్నామో చూస్తే మన చదువులు ఎలా తల్లకిందులుగా ఉన్నాయో తెలుస్తుంది. జీవశాస్త్రాన్ని (బయాలజీ) హైస్కూలు నుంచి ఇంటర్‌ వరకు తీసుకుంటే ఇందులో జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం ముఖ్యంగా ఉంటాయి. జంతురాజ్యంలో వెన్నెముక కల జీవులు(కార్డేటా), లేని జీవులు, ఏక కణజీవుల, బహు కణజీవులు, ఇతర లక్షణాల ఆధారంగా వాటి వర్గీకరణ, ప్రోటోజోవా, పొరిఫెరా, ఆర్ధ్రోపొడా, ఏకైనోడర్మేటా వంటి ఫైలాల నుండి సబ్‌ఫైలాలు, ఫ్యామిలీలు చివరికి స్పీషీస్‌ వరకు వందలాది నామాలు, వాటి సాధారణ లక్షణాలు, బాక్టీరియా, వైరస్‌, జెనెటిక్స్‌, జెనెటిక్‌ కోడులు, కణాలు, వాటి నిర్మాణం, కణ విభజన, వివిధ వ్యవస్థల నిర్మాణం, పనితీరు ఇలాంటి ఉన్నతస్థాయి జీవశాస్త్రం అంతా చదివేస్తారు. ఇందులో ఏ జీవి మనకు బయట కనిపించదు. ఎక్కువ భాగం మైక్రోస్కోపులో చూడవలసి ఉంటుంది. జీవులను కాని, అంతర్గత వ్యవస్థలను కానీ, కేవలం ఊహించుకొనవలసి రావటం వలన అవి పెద్దగా అర్థం కావు. మనకు నిత్యజీవితంలో ఉపయోగపడవు. కాబట్టి ఆసక్తి కలగదు. క్లిష్టమైన లాటిన్‌పేర్లు గుర్తుండవు.*

*ఇవన్నీ ఇంత విశదంగా చదివి, బట్టీ పట్టి ఇంటర్‌ చదివి వ్యవసాయం చెయ్యదలుచుకున్న విద్యార్థికి పశువులను ఎలా పెంచాలో తెలియదు. వాటికి వచ్చే జబ్బులు ఏమిటో, రాకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియదు. గేదెలకు ఏమి పెడితే ఎక్కువ పాలిస్తాయో, గొర్రెలను ఎలా కాపాడుకోవాలో, చేపల పెంపకం, పట్టు పురుగులు, ఏమీ తెలియదు. ఇవన్నీ వెటర్నరీ డాక్టరు కోర్సులో ఉంటాయి. మరి మనం పైన చెప్పుకున్న జంతుశాస్త్రమంతా దేని కొరకు చదివినట్లు?*

*లోతైన క్లిష్టమైన థియరీ అంతా పాఠశాల, ఇంటర్‌ స్థాయిలో పెట్టి, నిత్య జీవితంలో అన్వయించుకోగల (అప్లికేషన్‌) విద్యను మాత్రం పైకోర్సులో పెట్టారన్నమాట. నిజానికి అప్లికేషన్‌ కింది స్థాయిలో బోధించినట్లయితే–రోజూ చూసే జీవుల విషయం కాబట్టి విద్యార్థులు ఆసక్తితో చదువుతారు. 10వ తరగతిలో చదువు మానేసినా అప్పటి వరకూ చదివిన చదువు నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. ఆసక్తివున్నవారు పైచదువులకు వెళ్ళి లోతుగా చదువుకుంటారు. ఇక్కడ చదవవలసింది అక్కడ, అక్కడ చదవవలసింది ఇక్కడ! ఇదీ మన తలకిందుల చదువు.*

*వృక్ష శాస్త్రంలో కూడా ఇంతే. వృక్ష రాజ్యం వర్గీకరణ నుంచి– క్సైలమ్‌, ఫ్లోయమ్‌, ఫారన్‌ఖైమా, కొలెన్‌కైమా, స్లెరెన్‌కైమా, ఇలా రకరకాల టిస్యూలు, ఆకు అడ్డుకోత, వేరు నిలువుకోత వంటి మైక్రోస్కోపిక్‌ స్లైడులు స్టడీ చేస్తారు. ఫోటోసింథసిస్‌ (కిరణజన్య సంయోగ క్రియ) ద్వారా ఆహారం ఎలా తయారవుతుంది, క్రెబ్స్‌ సైకిల్‌ వంటి క్లిష్టమైన రియాక్షన్లు ద్వారా శక్తి ఎలా విడుదల అవుతుంది వగైరాలు చదువుకుంటారు. కాని వాళ్ళలో ఎవ్వరికీ వరి ఎన్ని రోజుల పంటో, నారుమడి చల్లి నాట్లు ఎందుకు వేస్తారో, వరికి వచ్చే రోగాలేమిటో, ఎలా అరికట్టాలో తెలీదు. ఇతర పంటలు, పండ్లు, పూల తోటల పెంపకం, అంట్లు కట్టటం వంటి నిజజీవితంలో ఎంతో ఉపయోగపడే విజ్ఞానం వారికి బోధపడదు. ఏవిధంగా ఉపయోగపడని కష్టతరమైన నాలెడ్జిని, ఎందుకు చదువుతున్నామో తెలియకుండా పళ్ళ బిగువున రుబ్బి పరీక్షల్లో రాసి, తరువాత దానితో ఏ ఉపయోగంలేక మర్చిపోతున్నారు.*

*ఈ నిత్య జీవితంలో పనికివచ్చే విషయాలన్నీ ప్రాథమిక స్థాయిలోగాక, ఎప్పుడో పైచదువులకువెళ్ళి అగ్రికల్చరల్‌ బిఎస్సీలో చదువుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏ ఎరువులు వాడాలో, ఏ పురుగుల మందు ఎంత మోతాదులో వెయ్యాలో రైతులకు తెలియజెప్పటానికి ప్రతి గ్రామంలోనో నిపుణులను నియమిస్తానంటున్నది. వాళ్ళకు ఏ ఆరు నెలలో శిక్షణ ఇచ్చి నియమిస్తారు. మరి ఈ నిపుణులకు ఆరు నెలల్లో ఇవ్వగలిగిన పరిజ్ఞానాన్ని ఆ రైతులే విద్యార్థులుగా ఉన్నప్పుడు పదేళ్ళ చదువులో ఎందుకు ఇవ్వలేకపోయారు?*

*పై విధమైన ఉదాహరణల్ని ఫిజిక్సు, కెమిస్ట్రీలలో కూడా ఎన్నో చూపించవచ్చు. విద్యుచ్ఛక్తిలో ఎలక్ట్రాన్‌ ప్రవాహం దగ్గర నుండి, పొటెన్షియల్‌ బేధం, ఓమ్స్‌లా, ఫారడేలా... ఇలా ఎన్నో థియరీలు చదువుతారు. ఇంట్లో ఫ్యూజు పోతే వెయ్యలేరు. పొలంలో మోటారు కాని, ఇంట్లో ఏ పరికరమైనా కానీ పాడైతే బాగుచెయ్యలేరు. కైనెటిక్‌ థియరీ ఆఫ్‌ గాసెస్‌ బాగా చదువుతారు కాని ఫ్రిజ్‌ ఎలా పనిచేస్తుందో చెప్పలేరు. కెమిస్ట్రీలో నూట పది మూలకాల పేర్లు, వాటి పరమాణు నిర్మాణం చదువుకుంటారు. నిజజీవితంలో ఏ రసాయనాన్ని గుర్తించలేరు. మెషిన్లు, ఆటోమొబైలు, ఎలక్ట్రానిక్స్‌, నీటి పారుదల, మెటలర్జీ ఇలా ఎన్నో రంగాలలో వాస్తవిక, అవసరాలతో సంబంధం లేకుండా చాల విజ్ఞానాన్ని విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలోనే బోధిస్తున్నాం. నిజజీవిత అవసరాలను మాత్రం ఇంజనీరింగు, పాలిటెక్నిక్‌ వంటి పైస్థాయిల్లో నేర్పుతున్నాము. లోతైన థియరీల్ని స్కూలు స్థాయిలోనూ, పిల్లల్లో జిజ్ఞాస మేల్కొలిపి నిత్యజీవితంలో పనికివచ్చే విషయాల్ని మాత్రం పైచదువుల్లోనూ నేర్పించటమే మన తలకిందుల చదువుల ప్రత్యేకత.*

*లెక్కల విషయం మరీ దారుణం. సాధారణంగా నిజజీవితంలో ఉపయోగపడేవి అంకగణితంలోని (ఎరిథ్‌మెటిక్‌) వడ్డీ లెక్కలు, సరాసరి, పని కాలము, దూరము వంటివి. 20 ఏళ్ళ క్రితం వరకూ అంక గణితం ప్రతి తరగతిలో సగం సిలబస్‌గా ఉండేది. కాని ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకే సంవత్సరంలో ఒక చాప్టర్‌లోకి కుదించారు. ఇక మిగతా సిలబస్‌లో వాస్తవ సంఖ్యలు, కారణాంకాలు, వర్గసమీకరణాలు, సమితులు, నిరూపక రేఖాగణితం, క్షేత్రమితి, త్రికోణమితి మొదలైనవి ఎన్నో. చదువయ్యాక నిత్య జీవితంలో వీటిని ఎప్పుడైనా ఉపయోగించిన మనిషి నాకింతవరకు కనిపించలేదు.*

*ఇవన్నీ పనికి రావని కాదు. ఇవి కేవలం ఎకడమిక్‌గాకాని, ఇంజనీరింగ్‌ వంటి కోర్సులలో కాని ఉపయోగపడుతున్నాయి. టెన్త్‌తోనో, ఇంటర్‌తోనో, డిగ్రీతోనో చదువు ఆపే విద్యార్థి వీటిని ఎక్కడ ఉపయోగించుకోవాలి? దేశంలోని పిల్లలందరూ కనీసం 10వ తరగతి వరకైనా చదువుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. నిర్భంధ సార్వత్రికవిద్య పేరుతో పిల్లలందరినీ స్కూళ్ళలో పెట్టి వారికి అర్థంకాని, లాభంలేని చదువును పది పదిహేనేళ్ళపాటు బలవంతంగా చదివించి వారి సమయాన్ని వృథా చేస్తున్నాం.*

*చదువుపై మన దృక్పథం మారాలి. సిలబస్‌లను సమూలంగా మార్చాలి. చదువంటే నిజంగా ఒక అందమైన ఆనందమైన అనుభూతిగా చెయ్యవచ్చు. ఈ సాహసం ఎవరు చేస్తారు? ఈ తలకిందుల చదువును ఎవరు తిరిగి సరిగా నిలబెడతారు?*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu