18.01.2015
పెళ్ళిళ్ళకని పోయిన పేరంటాలకు పోయిన
బతకలేక పోయిన బతుకుదెరువుకు పోయిన
అవ్వగారింటికి పోయిన అత్తగారింటికి పోయిన
పని మీద పోయిన పని లేక పోయిన
దూరమెక్కువున్న ధర తక్కువయ్యే
ధూమశకటమే పేదల దివ్య రథము
ఉరికురికి బస్సుపట్టి ఊగుకుంట ఒచ్చెటోళ్ళు
ఉస్కెపోస్తె రాలని బస్సుల ఊపిరాడకొచ్చెటోళ్ళు
రైలు కూత విన్పడగనె సామాన్లు ఎత్తుకొని తికమక తిరిగేస్తుంటరు
తట్టబుట్ట నెత్తినెట్టి పిల్లపాప సంకనేసి ఉరుకురికి
పట్టుబట్టి కిక్కిరిసిన బోగినెక్కి చిరుహాసము చిందిస్తరు
దూరమెక్కువున్న ధర తక్కువయ్యే
ధూమశకటమే పేదల దివ్య రథము
ఒంటి కాలి జపము చేస్తు సంటి పాప బరువు మోస్తు
స్టేషనొస్తె సూస్తుంటరు సక్కగ నిల్సుందమని
సందు సేసి సిన్న పిల్లల సంక దించి సర్దుకొని
సామానును సర్దేస్తరు సందు సూసి కూసుంటరు
స్టేషనొస్తె సూస్తుంటరు సీట్ల కూసుందమని
సీట్ల జాగ దొర్కబట్టి పాట్లు పడి ఇకిలిస్తరు
సిన్న కునుకు తీసి ఎన్నో ఊర్లు దాటి
దూరమెక్కువున్న ధర తక్కువయ్యే
రైలు బండి దిగి ఆలు మగలు పిల్ల జెల్ల గూడి
చేరుకుంటరు ఊరుకు కోరుకున్న చోటుకు..
దూరమెక్కువున్న ధర తక్కువయ్యే
ధూమశకటమే పేదల దివ్య రథము
>డి.ఆర్.మూర్తి(18.01.2015) .92)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి